తెలుగు సాహిత్యంలో మళ్ళీ మునకలేయాలనుకుంటున్నారా?

చిన్నప్పటి నుండీ అమ్మో, నాన్నో, అన్నో, అక్కో, పిన్నో, మామయ్యో దగ్గరుండి తెలుగు సాహిత్య కోనేట్లో మునకలేయిస్తున్న అదృష్టవంతులకి ఈ వ్యాసంతో పెద్దగా పని ఉండబోదని ముందుగానే చెప్పేస్తున్నాను. నా మిత్రులొకరు అన్నట్టు, “తొలి ప్రణయం తెలుగైనా, పరిణమయ్యింది ఆంగ్లంతో” అనుకునేవారి కోసమే ఈ వ్యాసం. చాన్నాళ్ళు తెలుగుకి దూరమై, మళ్ళీ చదవటం మొదలు పెట్టాలనుకునేవారికి ఎక్కడ నుండి మొదలెట్టాలో కాస్త తికమక. రెండేళ్ళ క్రితం అలాంటి అయోమయ పరిస్థితి నుండే మొదలయిన నా తెలుగు సాహితీ పఠన సాహసం వల్ల నాకు తెల్సిన కొన్ని పుస్తకాల గురించి ఇక్కడ చెప్తున్నాను.  నాకు తోచినంతలో నాకు నచ్చిన పుస్తకాల చిట్టా ఇక్కడ ఇస్తున్నాను. ఎందుకు నచ్చాయో కూడా చెప్తాను, నా కారణాలు మీ అభిరుచులకు సరిపోతాయో లేదో చూసుకోవచ్చును.

ఆత్మకథలు / జీవిత చరిత్రలూ:

శ్రీశ్రీ: అనంతం

శ్రీశ్రీతో తొలి పరిచయం టాంక్‍బండ్ మీదున్న విగ్రహం ద్వారా, మూడేళ్ళ వయస్సు. శ్రీశ్రీ సినిమా పాటలతో పరిచయం ఆరేడేళ్ళ వయస్సులో. శ్రీశ్రీ “మహాప్రస్థానం” వైపు తొలి అడుగులు వేసింది పదమూడేళ్ళ వయస్సులో. శ్రీశ్రీ మీద వ్యాసం రాసుకొని రమ్మంటే, చలం యోగ్యతా పత్రంలో నుండే చాలా వరకూ ఎక్కించి, చేతులు కాల్చుకున్నాను. తెలుగు సాహిత్య చరిత్రని ఒక ఊపు ఊపి, మహాకవి అని వేన్నోళ్ళ పొగిడించుకోవడమే కాక, “ఈ శతాబ్ధం నాది” అని డిక్లేర్ చెయ్యగలిగిన ఈ వ్యక్తి తన ఆత్మచారిత్మాక నవలగా రాసిన పుస్తకం “అనంతం”! శ్రీశ్రీ అత్యంత సమీపంగా చూసే వీలు కలిగిస్తుందీ పుస్తకం. “ఇందులో ఎక్కువగా రాశారు, తక్కువ చేసి మాట్లాడారు” లాంటి విమర్శలు ఎక్కువగా విన్నాను. ఈ విమర్శలన్నీ తిప్పికొట్టే ఒక వాక్యం:

“”అనంతం” నేను ఆషామాషీగా కానీ, ఉబుసుపోక గానీ రాయలేదు. కళాకారుడుగా రాయలేదు. ఒక సైంటిస్టుగా నా జీవిత వాస్తవికతను సందర్శించే ఉద్దేశంతో రాస్తున్నాను. ఇందువల్ల నా అభిమానులు తమ మనస్సులలో కల్పించుకున్న ఇమేజ్ బద్దలయ్యిపోయే ప్రమాదం ఉంది. కాని నాది సత్యాన్ని పరిశీలించే ప్రయత్నం. నిజం ఎల్లప్పుడూ తియ్యగానే ఉండదు. చేదునిజాలను దాచడమూ, మధురమైన అబద్ధాలను సరఫరా చేయ్యడమూ లాభసాటి వ్యాపారం కావచ్చు. కాని నాకా వ్యాపారమూ వద్దు. ఆ లాభమూ వద్దు.”

ఈ నిజాయితీ కోసమైనా చదవాలీ పుస్తకం. ఇరవైయ్యో శతాబ్దం ప్రధమార్థంలో వచ్చిన ప్రపంచ సాహిత్య, సినీ రంగాలను తెల్సుకొనే వీలు ఉంటుంది.

బూదరాజు రాధాకృష్ణ గారు రాసిన శ్రీశ్రీ గారి జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. దాని వివరాలు ఇక్కడ!

ఆచార్య తిరుమల రామచంద్ర: హంపీ నుండి హరప్ప దాకా

తెలుగు భాషవేత్త. స్వాంతంత్ర్య సమరయోధులు!  వీరి జీవిత విశేషాలన్నీ “హంపీ నుండి హరప్ప దాకా” అనే పుస్తకం ద్వారా తెల్సుకోవచ్చును. ప్రతీ వ్యాసం ఒక సంస్కృత శ్లోకంతో మొదలయ్యి, మరో శ్లోకంతో ముగుస్తుంది. ఈ రెంటికీ అన్వయిస్తూ తన జీవితంలోని ఒక అనుభవాన్ని నెమరువేసుకుంటూ ఉంటారు. బొజ్జనిండా భోంచేసి, ఆరు బయట వెన్నెల్లో పడక కూర్చిలో నడుం వాల్చి చుట్టూ చేరిన పిల్లలకి తన కథలు చెప్పే తాతగారిలా అనిపిస్తారు నాకైతే! చెప్పాలనుకున్నది ఎంత క్లిష్టమైన విషయమైనా, సరళంగా అర్థమయ్యేట్టు చెప్తారు. అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు, పశ్చాత్తాపాలు అన్నీ కలబోసిన చిత్రమైన జీవిత చిత్రం.

వీరివి మరిన్ని రచనలున్నాయి. కాకపోతే అవేవీ ఇప్పుడు ప్రచురణలో లేవు. రవి గారు పరిచయం చేసిన పుస్తకాలివిగో!

ముళ్ళపూడి వెంకట రమణ: కోతి కొమ్మచ్చి

స్వాతి పత్రిక లో “కోతి కొమ్మచ్చి” శీర్షికన సీరీస్‍గా వచ్చిన ముళ్ళపూడి వెంకటరమణ గారి ఆత్మకథ ఇప్పుడు పుస్తక రూపంలో లభ్యమవుతుంది. నవ్వుల కోసం కాదు, జీవితం కాచి వడబోసిన కళాకారుడి కోసం. నా రివ్యూ ఇక్కడ.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి: అనుభవాలున్నూ- జ్ఞాపకాలున్నూ

వీరి ఆత్మకథ “అనుభవాలున్నూ- జ్ఞాపకాలున్నూ” ప్రింట్ లో లేదు. పాత లైబ్రరీల్లో, పుస్తకాలయాల్లో దొరకవచ్చును. తప్పక చదవాల్సిన జాబితాలో ఉండాల్సిన పుస్తకం.

తెన్నేటి సూరి: చంఘిజ్ ఖాన్

“చంఘిజ్ ఖాన్” – ఒక అద్భుత రచన! తెన్నేటి సూరి మనల్ని ఆ కాలంలో  ఆ మనుషుల మధ్యకు తీసుకెళ్ళి మొత్తం అంతా తిప్పించుకొని తీసుకొస్తారు. అంతే కాక, నియంతగా పేరుబడ్డ ఒక మనిషిని చాలా దగ్గరగా చూసే అవకాశం కలిపిస్తుంది. భాష గిరిజిన భాషలా ఉంటుంది కాబట్టి కాస్త శ్రమపడాలి. అయినా ఆద్యంతం ఆపకుండా చదివిస్తుంది. చరిత్ర పై ఆసక్తి గలవారికి పండగే!

************************

నవలలు:

త్రిపురనేని గోపిచంద్:

ఈయనా నాకు స్కూల్ పాఠాల ద్వారానే పరిచయం. “మాకూ ఉన్నాయి స్వగతాలు” అనే రచన నుండి మాకో పాఠం ఉండేది. “అసమర్థుని జీవయాత్ర” – పేరులో ఉన్నట్టే చుట్టూ ఉన్న పరిస్థితులను ఏవగించుకుంటూ, ఏదో కలల ప్రపంచం కోసం ఎదురుచూస్తూ తన అసమర్థత ద్వారా జీవితాన్ని కష్టతర చేసుకొన్న ఒక జీవి గాధ. నాకు నచ్చిన రచనల్లో ఇదీ ఒకటి!  “పరమేశ్వర శాస్త్రి వీలునామా” సగం చదివి పక్కకు పెట్టాను. ఇదొక్కప్పుడు దూరదర్శన్‍లో సీరియల్‍గా వచ్చేది అనుకుంటాను.

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి:

ఈయన నవలలు ఇంకా ఏమీ చదవలేదు. మొన్నీ మధ్యే ఈయన రాసిన “రామాయణం” – ఊరికే చూద్దాం- అనుకుంటూ మధ్యలో మొదలెట్టి, చివరి దాకా చదివేశాను. రామాయణం అంటే ఇంత అందంగా, హృద్యంగా, మానవీయంగా (సీతావియోగ శోకభరితుడైన రాముడుని తెలిపే ఘట్టాలు) అనుకోలేదు. “Beautifully written” అనిపించింది. తేనెలూరు తెలుగు అని వినుండడం కాదు, అదేంటో తెల్సుకోవాలంటే, ఆ రుచి ఆస్వాదించాలంటే శ్రీపాద ను చదవాల్సిందే!

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పేరుంటే చాలు, పుస్తకం కొనేసుకోవచ్చు! అక్కడక్కడా తెలుగులో సంక్లిష్టత వల్ల తడబడినా, ఆ పదవిన్యాసాలని తెల్సుకోగలిగితే ఆ మజాయే వేరు!

కొడవటిగంటి కుటుంబరావు: వీరిది తొలుత “చదువు” చదివాను. చిట్టి నవల! అప్పటి ఆర్థిక సామాజిక పరిస్థితులని బాగా వివరిస్తారు.

కేశవరెడ్డి రాసిన సిటీ బ్యూటిఫుల్! వీరిదే “అతడు అడవిని జయించాడు” అనే పుస్తకం కూడా బాగుంటుందని విన్నాను.

లోకేశ్వర్ రాసిన “సలాం హైద్రాబాద్“, హైద్రాబాద్ గురించి వచ్చిన అతి తక్కువ తెలుగు పుస్తకాల్లో ఒకటి.

అల్పజీవి రావి శాస్త్రి – దీనిపై పుస్తకం.నెట్ లో ఒక వ్యాసం.

చిలకమర్తి వారి గణపతి నవల కడుపుబ్బ నవ్విస్తుంది. (తెలుగు చదవటం అలవాటు తప్పిన వారిని ఈ పుస్తకం కాస్త ఇబ్బంది పెట్టొచ్చు.) మొక్కపాటి వారి బారిష్టరు పార్వతీశం గురించి తెల్సిందే!

*****************************

కథలు:

శ్రీశ్రీ అంటే కవిత్వం. మరా శ్రీశ్రీ కథలు రాస్తేనో?! “శ్రీశ్రీ కథలు” పేరిట వచ్చిన ఒక సంపుటి చదివితే ఆయన వచనంలో కవిత్వాన్ని రుచి చూడవచ్చు. ఎక్కువగా అధివాస్తవికతతో ఉన్న ఈ కథల్లో మళ్ళీ మళ్ళీ చదువుకోవాలనిపించేవి ఎన్నో! అలానే ఇందులో కొన్ని అనువాద కథలు కూడా ఉన్నాయి. హాస్యం, వ్యంగ్యం, ఆవేదనా, ఆలోచనా సమపాళ్ళల్లో కలిసిన కథలివి!

శ్రీపాద: తేట తెలుగు అనగానే, లేదా అసలు తెలుగు అనగానే గుర్తురావాల్సిన పేరు శ్రీపాద అని నా అభిప్రాయం. “ఏమి రాస్తారాయానా?!” అననుకోవడం తప్పించి, మరేం చెప్పలేం ఈయన గురించి రాయాలంటే! (కనీసం నా బోటి వాళ్ళు.) ఈయన కథల్లో అంశాలన్నీ ఈనాటి తరానికి కూడా అతికినట్టు సరిపోతాయి. రెబెలియస్ అననుగానీ, ఉన్న నియమాలను తనదైన తీరులో ఉల్లఘించి మంచి చేసే పాత్రలే ఎక్కువ.

ముళ్ళపూడి వెంకటరమణ: బుడుగుతో పరిచయం అయిన వీరిని బుడుగు వయస్సులోనే మర్చిపోయాను. “తెలుగులో హాస్య రచయితలెవరు?” అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ పేరు వినపడే వరకూ. ముళ్ళపూడి సాహితీ సర్వస్వంలో “కథా రమణీయం” (రెండు భాగాలు) కొనేశాను వెంటనే. “కానుక” అనే కథ చదివా.. కాదు, చదువుతూ..నే ఉన్నా! ఆయన కథనం, శైలి, వచనం అన్నీ నాకు “ఆహా.. ఓహో.”  నాకు అత్యంత ఇష్టమైన రచయితల్లో వీరొకరు. మీకు హాస్యమన్నా, కథలన్నా, సినిమాలన్నా ఇష్టమయితే ఈ సాహితీ సర్వస్వాన్ని మీ సొంతం చేసుకోవాల్సిందే!

శ్రీ రమణ: “మిథునం కథ ఇంకా చదవలేదా నువ్వు?!” అన్న ఆశ్చర్యార్థకం వినిపించిన తరువాత, ఈ రచయిత పుస్తకాల వేట మొదలెట్టాను. “మిథునం” కథ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఇదే పేరుతో వచ్చిన కథల సంపుటిలో మిగితా కథలూ ఆణిముత్యాలే! తెలుగు చదువుకోడానికి సులువుగా ఉంటుంది. సున్నితమైన హాస్యం, అంతకన్నా సున్నితమైన జీవిత చిత్రాలు.

మధురాంతకం రాజారాం: ఈ రచయిత గురించి కూడా స్నేహితులతో మాట మాటల్లో ప్రస్తావన వచ్చి, ఆ పై పుస్తకాల్లో వెతికి పట్టుకోవడమే! ఈయవన్నీ కథలే తెల్సును నాకు. కథలు భలే ఉంటాయిలే, హాయిగా గలగల సాగిపోయే నదిలా ఉంటాయి. మధ్య తరగతి తెలుగు కుటుంబాల జీవిత చిత్రాలే అయినా, ఈ కథల్లో చిత్రంగా ఒక ఆనంద వాహిని (ఒక optimism) అంతర్లీనంగా ఉంటాయి. తేట తెలుగు, కమ్మనైన కథలు! తప్పక చదవాల్సిన కథలు!

కొడవటిగంటి కుటుంబరావు: ఈ మధ్యకాలంలోనే కొ.కు కథల సంపుటులు తీసుకున్నాను. ఇవీ చాలా నచ్చాయి.

అమరావతి కథలు – కృష్ణమ్మ తీరాన జీవితాన్ని అందులోని అందాన్నీ ఆవిష్కరిస్తే, వంశీ రాసిన “మా పసలపూడి కథలు” గోదావరి తీర ప్రాంతపు కథలు కళ్ళకి కట్టినట్టు చూపిస్తాడు. ముణిమాణిక్యం “కాంతమ్మ కథలు” సంసారంలో నవ్వుల పువ్వులు తెలిసొచ్చేలా చేస్తుంది.   ప్రయాగ రామకృష్ణ గారి “భారతంలో చిన్ని కథలు” కూడా చదవదగ్గ పుస్తకం.

తిలక్ కథలు: తిలక్ అంటే అమృతం కురిసిన రాత్రే గుర్తొస్తుంది. వీరివి కథలు అనగానే, “అబ్బే.. ఆయన కవితలే బాగుంటాయి” అంటూ కథకుడి తిలక్ కీ, కవి తిలక్‍కీ పోటీ పెట్టేస్తారు జనం అని స్వానుభవం. నా మట్టుకు నాకు, తిలక్ తన కవిత్వాన్ని ఎలాంటి భావాలు వ్యక్తం చేశారో, తన కథల్లో అదే భావాన్ని మరింత స్పష్టంగా తెచ్చారు. మనిషి, అతడిలోని స్వార్థం, అతడు వేసుకునే ముసుగులు అన్నీ తిలక్ కవిత్వంలోనూ నేను చూడగలిగాను. అన్నీ కథలూ బాగుంటాయని చెప్పను కానీ, కొన్నైనా ఎప్పటికీ మర్చిపోలేని కథలుంటాయి. కవి తిలక్, కథకుడు తిలక్ కాక, తిలక్ తిలక్ గా నచ్చటం వల్ల కూడా నాకివి నచ్చుండవచ్చు. తిలక్ కవిత్వాన్ని ఆరాధించేవారు ఈ కథలు చదవాలనుకుంటే..  be prepared for a heart break.

అత్తగారి కథలు: భానుమతి రామకృష్ణ గారు రాసిన కథలివి. తెలుగుదనం, హాస్యం, వెటకారం పుష్కలంగా ఉంటాయీ కథల్లో! భానుమతి గారి బహుముఖ ప్రజ్ఞకు ఈ పుస్తకం ఒకానొక నిదర్శనం.

*************************
కవిత్వం – పద్యాలు:

కవిత్వం అంటే చాలు ఆమడ దూరం పరిగెట్టేసే నేను ధైర్యం చేసి సినారె కవితా సంపుటాలు “విశ్వంభర”, “మట్టీ మనిషీ ఆకాశం”, “రెక్కల సంతకం” చదివాను. “అమృతం కురిసిన రాత్రి నేనూ చదివా” అని చెప్పటానికేదో జంకు. కవిత్వం చదివాను అని చెప్పటానికి నాకెందుకో కాస్త భయం.. వాటిని తిరిగి అప్పజెప్పలేను, వివరంగా వివరించలేను. అయినా కవిత్వం చదివేటప్పటి “కిక్” వేరుంటుంది. మనకి చాలా దగ్గర అనిపించే అనుభవమో, అనుభూతినో కొన్ని అక్షరాల రూపేణ చదూకున్నప్పుడు, కలిగే ఆనందం “వావ్” ఉంటుంది. అది మన భావాన్ని వేరొకరు రాసి పెట్టినందుకు కలుగుతుందనుకుంటాను. దీన్నే “మూగవాని కేక”గా అభివర్ణించారు ఇస్మాయిల్ గారు “కవిత్వంలో నిశ్శబ్దం” అనే పుస్తకంలో. ఈమాటలో వీరి గురించి చదివాక, కొన్న పుస్తకం అది. కవిత్వం గురించి బోలెడన్ని కబుర్లు, విశేషాలు, విశ్లేషణలూ ఉంటాయిందులో. కవిత్వం గురించీ, కవుల గురించీ ఈ పుస్తకంలో బోలెడన్ని విషయాలు. తెలుగుదనానికి చిహ్నంగా మారిన “ఎంకి పాటలు” పుస్తకం దొరుకుతుంది. రచన: నండూరి సుబ్బారావు. ఆరుద్ర రాసిన కూనలమ్మ పదాలు. మచ్చుకు కొన్ని కూనలమ్మ పదాలు ఇక్కడ చదువుకోండి.

ఇస్మాయిల్ –  వెబ్ ప్రపంచానికి రాకపోతే, నాకు వీరు తెల్సే వారు కాదు. విశ్వమంతా ప్రేమమయం అనిపిస్తుంది. ఆ ప్ర్రేమించడం కూడా ఎంత సరళంగా, సునాయాసంగా ఉంటుందో.  ఈమాటలో వీరివి చాలానే చదువుకోవచ్చు కవితలు, హైకూలు. Must read for the celebration of life in its simplest terms.

తిలక్: “అమృతం కురిసిన రాత్రి” – ఆయన ఏ పూట రాసుకున్నారో కానీ, చదివిన ప్రతి సారీ అమృతం కురిపిస్తూనే ఉంటుంది. ఈ కవిత్వం కోసం మాటలు పోగేయడం అంటే అనంతాకాశంలో చుక్కల్ని వరసా సర్దడమే!

గుంటూరు శేషేంద్ర శర్మ: వీరివి ఈ మధ్యనే చదవటం మొదలుపెట్టాను. శ్రీశ్రీ తర్వాత కవిత్యం చదువుతుంటే ఆవేశం పొంగుకొచ్చే కవితలు ఇవే! వీరి వచనంలోనూ కవిత్వం మెండుగా ఉంటుంద. భాష రాకపోయినా నేర్చుకొని చదువుకోవాల్సిన రచనలు ఈయనవి.

చలం: టాగోర్ రాసిన గీతాంజలికి తెలుగు అనువాదం ఇది. ఇంగ్లీషులో గీతాంజలిని ఎన్ని సార్లు చదువుకొన్నా, ఈ తెలుగు అనువాదంలో అందమే వేరు.

బేతవోలు రామబ్రహ్మం గారు ఒక వారపత్రికలో “పద్యారామం” శీర్షికన సమకాలీన తెలుగు పద్య రచనలు అదే పేరుగల పుస్తకరూపేణ దొరుకుతుంది. తెలుగు పద్యాలపై ఆసక్తిగల వారు, పద్యాలపై పట్టున్నవారు చదువుకోవచ్చును. తెలుగు పద్యాలను దాదాపుగా మర్చిపోయిన నా బోటి వారు మాత్రం కాస్త శ్రమ పడాలి.

డా|| కోడూరు ప్రభాకర రెడ్డి గారు రచించిన “శ్రీనాథుని చాటువులు” తెలుగు పద్యాలకు పునఃపరిచయం కావడానికి ఓ మంచి అవకాశం. ఇందులో శ్రీనాథుని అనేకానేక చాటువులు, వాటి తాత్పర్యాలు (కఠిన పదాలకి సమనార్థాలు) ఉంటాయి.

వేమన వేదం – వేమన పద్యాలకు ఆరుద్ర అందించిన వ్యాఖ్యానం. పద్యాలకు కేవలం తాత్పర్యాలులా కాకుండా, పద్యానికి సంబంధించిన ప్రతీ చిన్ని విషయాన్ని వివరిస్తారు. అరుదైన పుస్తకం. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందో లేదో అనుమానమే!

***************************************

నాన్-ఫిక్షన్:

శ్రీశ్రీ మాటకారి! చమత్కాకారి! ఆయన అన్నవీ, అన్నారని అనుకుంటున్నవీ అన్నీ కలిపి ఒక పుస్తకంలా వేశారు. దాని పేరు: “వారం వారం”!

గోపిచంద్ రాసిన “పోస్టు చెయ్యని ఉత్తరాలు” చదివాను. దాని పై  రివ్యూ ఇక్కడ. శతజన్మదిన వార్షికోత్సవం సందర్భంగా వీరి సమగ్ర సాహిత్యాన్నీ పునర్ముద్రించినట్టున్నారు. మొన్న విశాలాంధ్రలో కనిపించాయి.

శ్రీరమణ: వీరు పత్రికల్లో పనిచేశారనుకుంటా, ఆయా పత్రికల్లో వచ్చిన వివిధ కాలమ్స్ అన్నీ “గుత్తొంకాయ కూర – మానవ సంబంధాలు”, “మొదటి పేజీ”, “రంగుల రాట్నం” అనే సంపుటాలుగా వచ్చాయి. సరళమైన, నిజాయితీ గల హాస్యం వీరిది. శైలి కూడా తేలిగ్గా ఉంటుంది. శ్రీ రమణ పేరడీలు చాలా ఫేమస్! నేను చదవడానికి ప్రయత్నించాను కానీ నాకర్థం కాలేదు. ఈ బుక్ లో ప్రఖ్యాత తెలుగు రచయితలను మిమిక్ చేస్తారు. అసలు మనిషి గురించి అవగాహన లేనప్పుడు, మిమిక్రీ వినడంలో మజా రాదు కదా!

మల్లాది రామకృష్ణ శాస్త్రి వ్యాసాల సంకలనం “చలవ మిరియాలు”. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి మీద వ్యాసం ఉందనేసరికి కొనేశాను, కానీ ఇందులో ఇతరత్రా చాలా వ్యాసాలున్నాయి. అసలు విషయం కన్నా ఈ పుస్తకాన్ని “తెలుగు” కోసం చదవాలి. గొల్లపూడి మారుతీరావు గారి వ్యాస సంపుటులు – జీవన్ కాలమ్ (నాలుగు భాగాలు).  డబ్భై ఎనభై దశకాల్లో వచ్చిన కాలమ్స్ ఇవి. అప్పటి భారత జీవనానికి అద్దం పడతాయి. బడ్జెట్ కోసం పడిగాపులు, గవాస్కర్ స్కోర్లు, ఇందరమ్మ సర్కారూ, మధ్య తరగతి జీతాలూ – జీవితాలు – అన్నీ మళ్ళీ ఒకసారి ఆ కాలంలో తిప్పుకొని తీసుకొచ్చేవిలా ఉంటాయి.

ఆకులో ఆకునై: వాడ్రేవు వీరలక్ష్మీ దేవి. పేరుకు తగ్గట్టే ఆకులో ఆకై పకృతి అందాలను ఆస్వాదించే రచయిత్రి కలం నుండి జాలువారిన మ్యూసింగ్స్. ఈ పుస్తక పరిచయం చేస్తూ కొన్ని వాక్యాలను ఇక్కడ పొందుపరిచారు. చూడండి. నాకు నచ్చిన రచనల్లో ఒకటి.

ఆరుద్ర రాసిన “రాముడికి సీత ఏమవుతుంది?” అన్న పుస్తకంలో ప్రపంచంలో ప్రాచుర్యం పొందిన అనేక రామాయణాల్లో సీతారాముల సంబంధాన్ని గురించి వివరిస్తారు. మనకు తెల్సిన రామాయణం కాకుండా వేరే రామాయణాల్లో కథకథనాలు చాలా ఆసక్తి కలిగించే విధంగా ఉంటాయి. రంగనాయకమ్మగారి “రామాయణ విషవృక్షం” కూడా ఆసక్తికర పుస్తకం.

********************************

నాటికలు:

గురజాడ వారి కన్యాశుల్కం గూర్చి వేరుగా చెప్పనక్కరలేదు.

శ్రీపాద (శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి- నాటికలు, రూపికలు), మల్లాది రామకృష్ణ శాస్త్రి నాటికలు కూడా బాగుంటాయి. కాకపోతే తెలుగు అలవాటు తప్పున్న వారు, కాస్త శ్రమకోర్చవలసి వస్తుంది.

**********************************
భాషా సంబధిత పుస్తకాలు:

  • ఆధునిక వ్యవహార కోశం – బూదరాజు రాధాకృష్ణ: వాడుకంలో మనం ఉపయోగించే అనాకానేకమైన ఆంగ్ల పదాలకి తెలుగులో సమానాంతర పదాలున్నాయి. నూట యాభై రూపాయల ఈ పుస్తకాన్ని కొని పెట్టుకుంటే చాలా అక్కరకు వస్తుంది.
  • వీరిదే తెలుగు జాతీయాల పుస్తకం కూడా, ఏ ఏ జాతీయాలు ఎందుకు ఎలా ఏర్పడ్డాయి, ఏ అర్థంలో ఎప్పుడు వాడుకోవాలనుంటాయి. సుమారు రెండొందల పేజీల్లో చాలా జాతీయాలను విశీదికరించారు.
  • వ్యావహారిక భాషావికాసం (వ్యాసాలు) కూడా వీరిదే. మాసిపోయి దుమ్ముపట్టేసిన ఈ పుస్తకంలో కొన్ని వ్యాసాలున్నాయి, చదివితే గానీ చెప్పలేను వాటి గురించి.
  • మాటలూ-మార్పులూలో మాటల అర్థాలేమిటి, అవెందుకు మార్పుచెందాయి అని వివరించారు.
  • “మరువరాని మాటలు” – తెలుగు సాహిత్యంలో collection of quotes. తెలుగు సాహిత్యంలో కథల రూపేణా, కవితల రూపేణా, నాటకాల్లో డైలాగుల రూపేణ ఉన్నవాటిని, కొన్ని సామెతలను విషయానుసారంగా పొందుపరిచారు.  A unique attempt, a must have book in one’s collection.

**********************************

సినిమాకి సంబంధించిన పుస్తకాలు:

  1. భానుమతి రామకృష్ణ గారి ఆత్మకథ, “నాలో నేను”.
  2. మన్ చాహే గీత్ (రచయిత: ఖదీర్ బాబు) – పాత హిందీ సినిమా నేపధ్య గాయనీ గాయకులు, సంగీత దర్శకుల పై వ్యాసాలు
  3. జంధ్యా మారుతం (రెండు భాగాలు) – ప్రముఖ సినీ దర్శకులు జంధ్యాల గారి చిత్రాలపై వ్యాఖ్యానం
  4. కొమ్మకో కొమ్మకో సన్నాయి – విఖ్యాత తెలుగు సినీ గేయ రచయిత  వేటూరి సుందరామ్మూర్తి తెలుగు సినిమా ప్రముఖల గూర్చి పంచుకున్న అనుభవాలు.
  5. మా మావయ్య ఘంటశాల – ఘంటశాల వారి సతీమణి అందించిన అనుభవ సారం.
  6. సినీ రమణీయం – ముళ్ళపూడి సాహితీ సర్వస్వంలో భాగం, సినిమా రివ్యూలు
  7. విజయా వారి మాయాబజారు: సినిమా నవల. దీనిపై నా వ్యాసం ఇక్కడ.

చలం నవలలు, మ్యూజింగ్స్, ప్రేమలేఖలు చదవ ప్రయత్నించి వల్ల కాక, వదిలేశాను. అలానే “అనుక్షణికం” అనే నవల కూడాను. కొన్ని ప్రసిద్ధిగాంచిన పుస్తకాలను నా అభిరుచికి తగనందుకో లేక పుస్తకాలు దొరక్కో లేక వీలు చిక్కకో చదవలేదు. వాటిని ఈ జాబితాలో చేర్చలేదు. మీరు “తప్పక చదవాలి” అనే అనుకునే పుస్తకాలను ఇక్కడ కమ్మెంట్ల రూపంలోనో, లేక వ్యాస రూపంలోనో తెలియజేయగలరు.

You Might Also Like

15 Comments

  1. Santosh

    Thanks! A very useful article. Survey paper laaga chala bagundhi 🙂

  2. peeveeyes

    మధురాంతకం రాజారాంగారు ప్రముఖంగా కథారచయితే ఐనా రెండు మూడు నవలలు కూడా రాశారు. ఆయన నవలల్లో తప్పకుండా చదివితీరవలసిన నవల త్రిశంకుడి స్వర్గం.

  3. సౌమ్య

    గత మూణ్ణాలుగు రోజుల్లో నాకు అర్థమైన విషయం ఏమిటంటే – For the uninitiated, the best place to start is thulika.net 🙂 I am reading Malathi gari collection “From my front porch”, and became interested in Telugu short story like never before. నన్నడిగితే, అక్కడ మొదలుపెట్టండంటాను. నేనాట్టే చదవను – కనక, ఇంతకంటే ఎక్కువ జాబితా చెప్పలేను….

  4. రామ

    ఇక చేద్దాం అంటూ కూర్చోవడం కాదు – ఎటో ఒక వైపు నుంచి నరుక్కు రావడానికి సమయం వచ్చేసింది :). నా లాంటి “uninitiated” ని గట్టిగా “కిక్” స్టార్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు.
    రవికిరణ్ గారు, మీ దాతృత్వానికి చాలా ముచ్చట వేసింది. అది వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తాను.

  5. afsar

    పుస్తక ప్రయాణాలు ముచ్చట గా వుంటాయి, గొప్ప జ్ఞాపకాలు కూడా. అందునా, పుస్తకాల పురుగు జంటలోంచి ఒకరు ఈ ప్రయాణం సంగతులు చెబుతూంటే, ఆసాంతం ఆసక్తిగా చదవకుండా వుండడం సాధ్యమా? పూర్ణిమా, ఈ ప్రయాణంలో మనం తారసపడిన చౌరాస్తాలు చాలా వున్నాయి. కాని, ఒక నిరాశ. ఇన్ని పుస్తకాల పలకరింతల్లో ఇద్దరే ఇద్దరు స్త్రీలా? యెంత అన్యాయం! ఓల్గా, జయప్రభ, రంగనాయకమ్మ, కల్యాణ సుందరి, లత, సౌరిస్, పి.సత్యవతి, మాలతి నిడదవోలు, ఘంటసాల నిర్మల, సి.సుజాత,ముదిగంటి సుజాతరెడ్డి, ఆర్. వసుంధరా దేవి…ఈ జాబితా ఇంకా చాలా వుంది. వీళ్ళందరినీ మీరు చదివి తీరాలని కాదు కాని, చదవకపోతే, మన సాహిత్య ప్రయాణాల్లో ఎప్పుడూ పురుషుల డబ్బాల్లోనే పనికట్టుకుని ప్రయాణం చేసినట్టు అవుతుంది. మీరు మరీ అంత పురుష పక్షపాతి కాదు అని నాకు నమ్మకం వుందనుకోండి.

    అన్నట్టూ, సౌమ్య శివరాజు సుబ్బలక్ష్మి గారి గురించి ఎలాగూ రాసారు కాబట్టి, మీకు వీలు అయితె, సుబ్బలక్ష్మి గారి దగ్గిర బుచ్చిబాబు గారి “నా అంతరంగ కథనం” వుందేమో కనుక్కోండి. అది ప్రతి సాహిత్యాభిమాని విధిగా చదవాల్సిన పుస్తకం. కాస్త ఊహ తెలిశాక, నేను వొకటికి పది సార్లు చదివిన పుస్తకం. ఇంగ్లీషు,హిందీ పుస్తక లోకంలో ఎటో కొట్టుకుపోతున్న టీనేజ్ లో నన్ను తెలుగు వైపు గొప్ప శక్తితో లాక్కు వెళ్ళిన పుస్తకం అది. ఎక్కడికెళ్ళినా ఆ పుస్తకం కోసం వెతుక్కుంటూ వుంటా. దొరకడమే లేదు.

  6. Pustakam (pustakam) 's status on Tuesday, 17-Nov-09 12:02:28 UTC - Identi.ca

    […] తెలుగు సాహిత్యంలో మళ్ళీ మునకలేయాలనుకుంటున్నారా? _ http://pustakam.net/?p=2338 […]

  7. హెచ్చార్కె

    ‘అనంతం’ గురించి మీరు వుటంకించిన శ్రీ శ్రీ మాట. శ్రీశ్రీ చెప్పుకున్నదానికి మించి ఇక ఎవరూ ఏమీ చెప్పలేరేమో. వుటంకింపును హైలైట్‍ చేయడం బాగుంది. అది రచయిత(ల)నుంచి ఆశించాల్సిన మినిమమ్ నిజాయితీ. తిరుమల రామచంద్ర గారి పుస్తకం సంపాదించి చదవాలనుకుంటూ మరిచి పోతున్నా. దాన్ని మీ లిస్టులో చేర్చి గుర్తు చేశారు. థాంక్యూ.

  8. latha

    editor@pustakam.net కు ఈమెయిలు పంపాను – రవికిరణ్ గారి ఈమెయిలు request చేస్తూ.

  9. రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    లత గారు,

    మీరు ఎక్కడ దొరుకుతాయి అని అడిగింది నామిని, ఖాదీర్ బాబు, వంశీ, ఇంకా చాలానే వున్నాయి నాదగ్గర కథలగురించయితే, మీరు నాకు మీ అడ్రస్ ఈమైల్ చేస్తే నేను మీకు నామిని కథల పుస్తకాలు మైల్ చేస్తాను, మీరు చదివిన తర్వాత మర్చిపోకుండా నాకు తిరిగి మైల్ చేసే ఒప్పందంమీద.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

    లత గారే కాదండీ మీకెవరికి కావాలన్నా సరే చదివి తిరిగి మైల్ చేసే పద్దతిమీద నేను మీకు మైల్ చెయ్యగలను, నామిని పుస్తకాలే కాదు నా దగ్గరున్న తెలుగు పుస్తకాలేవైనా. ఎవరికైనా ఆసక్థి వుంటే నా ఈమైల్ “పుస్తకం” వారి దగ్గరుంటుంది కదా వారినడిగి నాకు మైల్ ఇవ్వండి. సరిగ్గా సాగితే ఇంట్లో కూర్చొని దుమ్ము పడుతున్న పుస్తకాలకి కాస్త ఉపయోగం వుంటుంది.

  10. వరూధిని

    నా నాలుగు…….

    కథలు
    మిట్టూరోడి కథలు (నామిని కథలు)
    ప్రణయకావేరి కథలు
    ఇల్లేరమ్మ కథలు
    దర్గామిట్ట కతలు (ఖదీర్ బాబు)
    పోలేరమ్మబండ కతలు (ఖదీర్ బాబు)
    అచలపతి కథలు (ఎమ్బీయెస్ ప్రసాద్)
    సొదుం జయరాం కథలు
    చాసో కథలు

    నవలలు
    కాలాతీత వ్యక్తులు (పి.శ్రీదేవి)
    అంపశయ్య (నవీన్)
    స్వీట్ హోం (రంగనాయకమ్మ)
    రేగడి విత్తులు (చంద్రలత)
    చివరకు మిగిలేది (బుచ్చిబాబు)
    ఇల్లు (రావి శాస్త్రి)
    మాలపల్లి (ఉన్నవ లక్ష్మీనారాయణ)
    నారాయణరావు (అడివి బాపిరాజు)

  11. vijaya

    గురువుగారూ
    ఎప్పుడో 1979-1980 లలో చదివిన .ఎం.ఏపాఠాల్ని గుర్తుకు తెచ్చారు.మీరు ఇచ్చిన పట్టికలో నేను చదవనివి కొన్ని ఉన్నాయి.త్వరలో తప్పకచదువుతాను.

  12. venkat

    గురజాడ ని మర్చిపోయారు. అలాగే తెలంగాణా జీవిత పార్శ్వం చూడాలంటె దాశరధి రంగాచార్య “చిల్లర దేవుళ్ళు” చదవండి.

  13. latha

    US లో ఎక్కడ దొరుకుతాయి?

  14. రవికిరణ్ తిమ్మిరెడ్డి

    అయినా నాకు తెలియక గాని, చలాన్నీ, వడ్డెర చండీదాసు గార్ని చదవలేక వదిలేయటవేవిటండీ? ఇన్ని పుస్తకాలు చదివిన మీకు అవి మాత్రవే ఎందుకు వల్లపడలేదో? వాటికి మనం కప్పుకున్న మర్యాద ముసుగుల్ని చించివేయగల శక్థి వుంది. అది మిమ్మలని కలవరపరిచిందా?

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

  15. రవికిరణ్ తిమ్మిరెడ్డి

    కథల్లొ మీరు నామిని సుబ్రమణ్యం నాయుడు గారి కథలు ఎలా మిస్సయ్యారు. చార్లీ చాప్లిన్ సినిమా ఏవిధంగా అయితే మనల్ని ఏడిపించి, అదే సమయంలో నవ్వించగలదో, నామిని గారి కథలు కూడా అల్లనే చెయ్యగలవు. నావరకు నాకు ఇప్పటివరకు వచ్చిన కథాసాహిత్యంలో, నాపరిధి వరకు అన్నిటి కంటే అత్యుత్తమ కథలు నామిని గారి కథలు. మీరు చదివి మర్చిపోయుంటే చెప్పేదేవీ లేదు. చదవకపోయుంటే మీరొక అత్యద్భుతవైన సాహిత్యాన్ని మిస్సవుతున్నారనమాట.

    రవికిరణ్ తిమ్మిరెడ్డి.

Leave a Reply