మహాకవి శ్రీశ్రీ – బూదరాజు రాధాకృష్ణ

ఈ ఏడాది చదవటం మొదలెట్టి పూర్తి చేసిన మొదటి పుస్తకం బూదరాజు రాధాకృష్ణ(Budaraju Radhakrishna) రచించిన “మహాకవి శ్రీశ్రీ” (Mahakavi SriSri). శ్రీశ్రీగారి పుట్టినరోజు (జనవరి రెండువ తారీఖు) నాడు మొత్తం వారి రచనలతోనే గడిపానని గ్రహించలేదు చదివేటప్పుడు! ఈ పుస్తకం మొన్న బుక్ ఫేర్ లో కొన్నాను, అసలు వేరే ఏ రచయితయినా అయ్యుంటే, “నేను శ్రీశ్రీ అనంతం చదివా, ఇంకెందుకూ.. లైట్” అనుకుంటూ ముందుకెళ్ళిపోయేదాన్ని. కానీ బూదరాజు గారి గురించి చాలా వినుండడం వల్ల, శ్రీశ్రీతో పాటు బూదరాజు గారి గురించీ తెల్సుకునే అవకాశం లేకపోలేదు కదా అని తీసుకున్నాను. వంద పేజీలుండే ఈ రచన, అదీ నాకు ముందే తెల్సిన వ్యక్తి గురించి, ఎంత సేపులే చదవటం అనుకుంటూ మొదలెట్టాను. ఈ పుస్తకం పరిచయం తెల్సు కాబట్టి, సరిపడా చనువుంది.. పని ఇట్టే అయిపోతుందనుకున్నాను. దిగాకగానీ లోతు తెలీదన్నట్టు, ఈ పుస్తకం చదివితే గానీ ఇదేంటో అర్థం కాలేదు.

శ్రీశ్రీ జీవితం, రచనల పరిచయాన్ని ఎనిమిది ప్రకరణలు (అధ్యాయాలు) గా విభజించారు. అవి ఈ కింది విధంగా ఉన్నాయి.

౧) జీవిత రేఖా చిత్రం: శ్రీశ్రీ ఫలానా రోజున, ఫలానా వారికి ఫలానా ఇంట్లో పుట్టారు.. అంటూ ఉండే ఈ అధ్యాయాన్ని చూసి, నేనేదో “నాన్-డిటేల్” పాఠ్యాంశాన్ని చదువుతున్నా అనిపించింది. ఈ ప్రకరణ మొత్తం అలానే సాగుతుంది కూడా, శ్రీశ్రీ జీవితాన్ని వీలైనంత క్లుప్తంగా పరిచయం చేస్తారు. “చివరి రోజులు” అనే భాగం తప్పించి నేనిందులో కొత్తగా తెల్సుకున్నది ఏమీ లేదు. “నేటి భారతం”కి  రాసినదే శ్రీశ్రీ చివరి సినీ గేయమట!

౨) తొలి ప్రభావాలు: ఇందులో శ్రీశ్రీ చిన్నతనంలో అతనిపై గాఢ ముద్రను వేసిన సన్నిహితులు, బంధువులు, గురువులు, సాహిత్యం, అలవాట్లు- ఇలా అన్నింటి గురించీ ప్రస్తావన ఉంటుంది. శ్రీశ్రీ విద్యార్థి దశ నుండే కొందరి పరిచయాల వల్ల ప్రపంచ సాహిత్య పఠనం చేయడం, నచ్చినవి నచ్చినట్టు అనువదించటం చేశారు. ప్రపంచం సాహిత్యంలో ఎక్కడేం జరుగుతున్నా, దాన్ని చదివి స్పందించే ఈ అలవాటు నిజంగానే అబ్బురపరుస్తుంది.

౩) పూర్వరంగ, సమకాలిక పరిస్థితులు: శ్రీశ్రీని ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా అర్థం చేసుకునే ముందు, ఆయన జీవిత కాలంలో, అంతకు మునుపు ఆంధ్ర దేశంలో ఉన్న పరిస్థితులు, ముఖ్యంగా రాజకీయార్థిక, సాహిత్య లోకపు విశేషాలను ఈ ప్రకరణలో ప్రవేశపెట్టారు.  కందుకూరి విరేశలింగం, వేదం వేంకటరాయశాస్త్రి, గిడుగు రామ్మూర్తి, గురజాడ, కట్టమంచి రామలింగా రెడ్డి మొదలైన వారందరి సేవలూ తెల్సుకునే వీలుంటుంది. విశ్వనాథ, దేవులపల్లి, చలంతో వారి అనుభవాలే కాక, శ్రీశ్రీ అభిమానించిన కొందరు సమకాలీన హిందీ రచయితలను కూడా ప్రస్తావించారు.

౪) శ్రీశ్రీ రచనలు: మొత్తం పుస్తకంలో నాకిష్టమైన ప్రకరణ. ఇందులో శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానాన్ని, ఇతర గేయ సంపుటలను, నాటికలనూ, వచన రచనలూ పరిచయం చేసిన తీరు అమోఘం. మహాప్రస్థానం గురించి చదువుతున్నప్పుడయితే, ఈ పుస్తకం పక్కకు పెట్టి ఆ కావ్యం తెరిచి ఒక సారి మళ్ళీ కవితలనీ మనసారా చదువుకున్నాను. “తన అభిరుచులనూ, అభిలాషలనూ, ఆదర్శాలను, బలహీనతలను సమాహార ద్వంద్వంగా లక్షించి ఈ విధంగా వర్ణించటం తెలుగు సాహిత్య చరిత్రలో అపూర్వం!” అని కవితా! ఓ కవితా గేయాన్ని ప్రస్తుతించారు.

౫) తనను గురించీ, ఇతురల గురించీ: శ్రీశ్రీ తన జీవితకాలంలో తనను గురించీ, తనకి ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలిసిన వారి గురించి అన్న / అన్నారని లోకుల్లో స్థిరపడిపోయినవన్నీ ఈ ప్రకరణలో ఉంటాయి. శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని అర్థంచేసుకోవాలని ప్రయత్నించడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా ఉద్దేశ్యం. “అనుకున్నది అనుకున్నట్టు అనేయడం” అనే లక్షణం వల్ల వచ్చే లాభనష్టాలు తెల్సొస్తాయి. “సకాలంలో రావటం శాస్త్రీయం, రాకపోవటం కృష్ణశాస్తీయం” లాంటి చెమ్మక్కులు తెలుస్తాయి.

౬) వ్యక్తిగా శ్రీశ్రీ: “కొవ్వొత్తిని రెండు వైపులా ముట్టించాను, అది శ్రీశ్రీలా వెలుగుతోంది” అనే పురిపండ గారి వ్యాఖ్యతో మొదలయ్యే ఈ ప్రకరణలో శ్రీశ్రీ వ్యక్తిత్వాన్ని పరికించారు. విరుద్ధ స్వభావాలు ఒకే మనిషిలో ఉండటం, అవి తెచ్చి పెట్టే కష్టనష్టాలు, విపరీతమైన ఖ్యాతినీ, మోజునూ సంపాదించుకున్నా కొన్ని వ్యసనాల వల్ల, ఆ వ్యసనాలను బాహాటంగా ఒప్పుకోవడం వల్ల ఎదుర్కొనవల్సిన విమర్శల గురించీ ఉంటుందిలో!  People who don’t try to impress others are the ones who leave indelible impressions అని శ్రీశ్రీని గురించి ఆలోచించేకొద్దీ నాకు అనిపిస్తుంది. జనాలలో ఏర్పడిన ఫ్రేమ కి కాక, తన పంథాన నడిచారు. అందుకే “శ్రీశ్రీ”గా మిగిలారు.

౭) సాహిత్యంలో స్థానం: తెలుగు సాహిత్యాన్ని నేను శాసిస్తాను అన్నారు.. శాసించారు! శ్రీశ్రీ రచనలూ – అది తర్వాతి తరంపై చూపిన ప్రభావాన్ని విశ్లేషిస్తుందీ ప్రకరణ.

౮) భూత భవిష్యత్తులు: “తన జీవితకాలంలోనే చరిత్రప్రసిద్ధుడైన శ్రీశ్రీ అనంతర కాలంలో కూడా అలానే జీవిస్తాడు” – ఇంత అద్భుతమైన పుస్తకానికి ఇంతకన్నా ముగింపు వాక్యాలు ఉండవేమో. శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో చెరగని ముద్ర వేశారు, వ్యక్తిగతంగా ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా!

ఎందుకు చదవాలీ పుస్తకం:


౧) “It’s your charater that is revealed more, when  you talk about others” అన్న దాన్ని నమ్ముతాను కనుక, ఈ పుస్తకంలో బూదరాజు గురించే ఎక్కువ తెల్సింది. ఇది చాలా వరకూ నిష్పాక్షక ధోరణిలో సాగినట్టే ఉంది. అనవసరపు పొగడ్తలు గానీ, అవసరమైనప్పుడు  మొహమాటాలకి పోవడం కానీ ఈ పుస్తకంలో జరగలేదు. “అనంతం” నుండి సేకరించిన సమాచారాన్ని ఉటంకటించిన చాలా సందర్భాల్లో “.. అని చెప్పుకొచ్చాడు”, “.. అని రాసుకున్నాడు” ఇలా రాశారు. వీరిద్దరికీ వ్యక్తిగత పరిచయం ఉన్నదని చివర్లో ఉంటుంది, చదువుతున్నంత సేపూ అది తెలుస్తూనే ఉంటుంది.  శ్రీశ్రీ లాంటి వ్యక్తి మీద రాయడం కత్తి మీద సాము. అది ఆయన చాలా బాగా చేశారు. వీరి తక్కిన పుస్తకాలన్నీ చదవాలని నిశ్చయించుకున్నాను.
౨) తెలుగు.. తెలుగు..తెలుగు! నాలాంటి వాళ్ళు (అస్సలెంత తెలుగుందో కూడా తెలీని అభాగ్యులు) ఒక “రీడింగ్ ఎక్సర్సైజ్”గా తీసుకుని చదివాల్సిన పుస్తకం. రోజూ మాట్లాడుకునే భాష అంటే సరిపెట్టుకోవచ్చు గానీ, కనీసం మన వార్తాపత్రికల్లో కూడా ఈ పదాలెందుకు వినిపించడంలేదో, ఉన్నా నాకు తెలీలేదో అర్థం కాలేదు. ఉదా: ధరావతు అంటే డిపోజిట్! డిపోజిట్ కూడా రాకుండా ఎన్నికల్లో ఓడిపోయాడనే విన్నాను చాలాసార్లు.
౩) శ్రీశ్రీ – తెలుగు జాతిని ఒక ఊపు ఊపిన మహాకవి. కవితలు చదివేసి, ఆనందించటమే కాక ఆ రచనల వెనుకున్న మనిషిని గురించి తెల్సుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే! చదివాక శ్రీశ్రీ ఇంకాస్త దగ్గరవాడవుతాడనటంలో సందేహం లేనే లేదు.

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » తెలుగు సాహిత్యంలో మళ్ళీ మునకలేయాలనుకుంటున్నారా?

    […] బూదరాజు రాధాకృష్ణ గారు రాసిన శ్రీశ్రీ గారి జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. దాని వివరాలు ఇక్కడ! […]

  2. Purnima

    Independent: అది ధరావతు అని ఉంది పుస్తకంలో. సరి చేస్తాను. ఆలస్యంగా జవాబిస్తున్నందుకు మన్నించగలరు.

    Dreamer: హమ్మ్.. సెమీ-ఫిక్షన్ , ఆత్మకథలూ.. ఆలోచించాలి. మెదడుకు మేత వేసినందుకు థాంకులు!

    రాకేశ్వర రావు: మీ ఆశ్చర్యం చూస్తుంటే నా ఆశ్చర్యం గుర్తొస్తోంది! 😉 “శ్రీశ్రీ జనవరి రెండున పుట్టాడని నమ్మాడు..” లాంటి వాక్యాలేవో చదువినా, ఆ రోజే ఆయన పుట్టినరోజని నేనూ గ్రహించలేదు. పుస్తకం అయ్యాక, మన బ్లాగుల్లో రౌండ్లు వేస్తుంటే ఏవో రెండు మూడు టపాలు కనిపించాయి, శ్రీశ్రీ పుట్టిన రోజూ అంటూ. లేకపోతే నేనే తారీఖున ఏ పుస్తకం చదివానో గుర్తుపెట్టుకోలేను. అదన్న మాట!

    మీరిచ్చిన లంకె తెల్సు నాకు! ఇవ్వలేకపోయానంతే!

  3. రాకేశ్వర రావు

    శ్రీశ్రీ పుట్టిన రోజు జనవరి రెండు అనేసరికి ఆశ్చర్యపోయాను. నాకు మాత్రం ఏప్రిలులోనని గుర్తు.
    మీరు సమీక్షించిన పుస్తకం నా దగ్గర వుంది. అది మరొక సారి తిఱగేశాను. అందులో మీరు చెప్పిన జీవిత రేఖా చిత్రంలోనే వుందిలెండి. శ్రీశ్రీ తన పుట్టన తేది జనవరి రెండుగా భావించారని.

    రాకేశ్వర

    అన్నట్టు మీరు ఇలాంటి వ్యాసాలకు ఇలాంటి లంకెలు కూడా ఇవ్వచ్చు. అంటే మీకు తెలిసినంతవరకు.
    మహాకవి శ్రీశ్రీ జీవిత చరిత్ర

  4. Dreamer

    గాంధీ ఆటో-బయోగ్రఫీని కమల్ “హే రాం” లో సెమీ-ఫిక్షన్ అని వెక్కిరిస్తాడు. చాలావరకూ ఆటో-బయోగ్రఫీలు అంతే అనుకుంటాను. కానీ శ్రీశ్రీ అనంతం మాత్రం నాకలా అనిపించలేదు. ఒక రకమైన డిటాచ్‍మెంట్‍తో చెప్పినట్టనిపిస్తుంది. అక్కడక్కడా స్వోత్కర్ష లేకపోలేదనుకోండి (అనంతాన్ని ఒకేసారి రాయలేదనుకుంటా, Over a period of time, it has been published as a serial I think).

    బూదరాజు వారు తెలుగు గురించి రాసిన పుస్తకాలు తప్ప మిగతావి పెద్దగా చదవలేదు, I will add this to my to-do list.

  5. Independent

    I think it’s ధరావత్తు

  6. పూర్ణిమ

    Yes, but don’t miss “anantham”! Nothing like it!

  7. యోగి

    బాగుంది మీ పరిచయం.

    “నరకం స్వర్గం అన్నవి ఒక స్థితికే రెండు పేర్లు ఫోకస్ భేదం అంతే లోకస్ రెండిటి కొకటే” – ఇలాంటి మాటలు అనగలిగిన వ్యక్తిని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఎప్పటినుంచో ఉన్నది. Looks like this book can be a decent start!

Leave a Reply