పానుగంటివారి కథలు- సాంస్కృతికాంశాల పెన్నిధులు

వ్యాసకర్త: డా. రాయదుర్గం విజయలక్ష్మి 
**********

పానుగంటి లక్ష్మీనరసింహారావుగారిని (1865-1940)తలచుకోగానే, ‘సాక్షి వ్యాసాలు’ పరిమళిస్తాయి. వారి నాటకాలు పలుకరిస్తాయి. వారు, కథలు కూడా రాశారని, వాటిని ‘కథావల్లరి’ , ‘కథాలహరి’ పేర రెండు సంపుటాలుగా ముద్రించారని, పానుగంటివారి మీద విశేష కృషిచేసిన, ముదిగొండ వీరభద్రశాస్త్రి గారు, ఆ కథలను పేర్కొన్నారని, పరిశోధక చరిత్ర వలన తెలుస్తున్నది. ఆ రెండు సంపుటులుగాని, ఆ కథలు గాని ప్రస్తుతం మనకిప్పుడు అలభ్యాలే! కథా నిలయం కోసం, కా.రా. మాస్టారు ఎంతో కృషి చేసి కూడా వాటిని సంపాదించలేక పోయారుట! అయితే, మోదుగుల రవికృష్ణగారు, 2020 లో ప్రచురించిన, “కథలు, స్వప్నకావ్యము, వ్యాసములు-పానుగంటి లక్ష్మీనరసింహారావు” అన్న గ్రంథం ద్వారా, పానుగంటి వారు రాసిన ఆ రెండు సంపుటులలో చేరని, పదకొండు కథలను చదివే భాగ్యం కలుగుతున్నది.

 ఈ కథలు, 1920 నుండి 1930 ల మధ్యకాలంలో, అలనాటి భారతి, ఆంధ్రపత్రికలలో ప్రచురణను పొందినవి. కథలో సంభాషణలను నాటకీయ శైలిలో నడిపినా, అవి కథను, ఆయాపాత్రలను కళ్ళముందు బొమ్మకట్టి చూపిస్తాయి. వారి సాక్షివ్యాసాలతో పోలిస్తే, ఈ కథలు, తెలుగు కథ పరిణామ దశలో తొలిదశకు చెందినవి గానే స్థూల దృష్టికి గోచరిస్తాయి. కాని వ్యావహారిక, గ్రాంథిక భాషా పోరాటాల మధ్య సరళ గ్రాంథిక భాషలో కనిపిస్తు న్న యీ కథలు అందిస్తున్న సాంస్కృతికాంశాలు మాత్రం, మన మనసులను పరిమళింపజేస్తాయి. మొదట ఈ పదకొండు కథలలోని, విశేషాంశాలను పరికించి, చివరగా సాంస్కృతిక వివరణలకు వెడదాం! 

 వందశతాబ్దాల క్రిందటి వివరాలను చెబుతున్న ఈ కథలు, ఆనాటి సమాజంలోని కొన్ని ముఖ్యాంశాలను …, దాంపత్యపు విలువలను (హిందూ గృహిణి); పెద్ద చదువులకోసం విదేశాలకు వెళ్ళిన వారు అక్కడి అమ్మాయి లనే వివాహం చేసికొనిరావడాన్ని (మేరీనారాయణీయము); వేశ్యల వలలోపడి, కుటుంబాలను ధ్వంసం చేసి కోవడం (శ్రీరామా); ప్లీడర్ల చేతిలో పడి, ఆస్తిపాస్తులను కోల్పోయి బికారులు కావడం (ప్లీడరు పట్టు); నిరతాన్నదానవ్రతంతో, చితికి పోయిన సంసారాలు (కానుగ చెట్టు)…. వంటి వివరాలను గ్రంథస్థం చేశాయి. స్త్రీ విద్యాప్రాముఖాన్ని గుర్తించిన పానుగంటివారు, రామాయణ మహాభారతాలను, పురాణాలను చదివి అర్థం చేసుకొని, కుటుంబ స్థితిగతులను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తగినంత చదువు స్త్రీలకు వస్తే చాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని గమనించగలం. వ్యక్తులలో మానవత్వం ముఖ్యమని, ఆ మానవత్వం, దొంగలను కూడా సన్మార్గంలో పెట్టగలదని వీరి కథలు (శివరామా!) నిరూపిస్తాయి. 

ముఖ్యంగా చెప్పుకోవలసిన మరొక అంశం, తెలంగాణా మాండలికాన్ని తొలిగా ఉపయోగించిన (రామరాజు), మొట్టమొదటి కథకులు, తెలంగాణా పద పట్టికను(vide: 294పదాలు, వాటికి సమానార్థకాలతో, ‘విమర్సా దర్శవిమర్సాదర్శము’.అన్న వారి గ్రంథము) తొలుతగాయిచ్చినవారు కూడా పానుగంటి వారే కావడం (పుట: 43-సంపా.,), అన్నవిశేషాంశం! ‘గుట్లకెల్ల, వెంకులాడుకొనుట, దొడ్డుగా, కాసండి, తుర్రబడాయించుట, లొల్లి, చిన్ని, మన్నింపులు, అలాయబలాయ అనే తెలంగాణా మాండలిక పదాలు ఈ కథల్లో కనిపిస్తున్నాయి. 

1920 ల ప్రాంతంలో రాయబడిన కథలైనా, కథకు ప్రాణమైన ‘కొసమెరుపు’ వీరి కథలను ప్రాణవంతంగా మలిచింది. భార్య, ఇంటి దాసి మాట్లాడుకునే మాటలను అపార్థం చేసికొని, భార్యను శంకించిన భర్త, సంతానం గురించి శకునం అడుగుతున్న భార్యను చూచి పశ్చాత్తాపపడటం (చిన్న కథ), తనను అనుమానించి, విడాకులు అడిగిన భార్య, తనవలెనున్న తమ్ముని చూసి చిన్నబోవడం (మేరీనారాయణీయం), దొంగతనానికై వెళ్ళి, చివరకా ఇంటి యజమాని ఇస్తానన్న ఐదువేల రూపాయలను కూడా వద్దని, మనసుమారి తిరిగి వచ్చి న శివయ్య (శివరామా!), సత్రంలో చెవిటివాని వలె నటించి, అందరినీ నానా ఇబ్బందిపెట్టిన, బాటసారి (హాస్య కథ), పందెం కోసం అలా చేశాడనడం…. వంటివన్నీ కొసమెరుపులతో మనల్ని ఆనందింపజేస్తాయి. ఈ కథ లలో ఎక్కువ కథలను విషాదాంతాలు గానే మలిచారు పానుగంటివారు. ఆంగ్లసాహిత్య ప్రభావం, ముఖ్యంగా షేక్స్ఫియర్ నాటకాల ప్రభావం, పానుగంటి వారిమీద ఉన్నదన్న విమర్శకాభిప్రాయాన్ని, ఈ అంశం బలపరు స్తున్నది. వీరిదృష్టిలో, బమ్మెర పోతన, కడపజిల్లాలోని, ‘ఒంటిమిట్ట’కు చెందినవాడు(కానుగుచెట్టు). అన్నది మరో ప్రధానమైన చారిత్రకాంశం. 

వీరి కథల్లో ఆణిముత్యాలవంటి అంశాలు, అవకాశం వచ్చినపుడల్లా వీరు తెలియజేసిన సాంస్కృతికాంశాలు. ‘వరాహకట్ట’(బంగారు నగలలోచేరిన మురికిని తీసేందుకు ఉపయోగించే సన్నని, మెత్తని కుచ్చు ఉండే బ్రష్., ఒంటె వెంట్రుకలతో ఈ కుచ్చును చేస్తారంటారుగాని పంది వెంట్రుకలతో చేస్తారేమోనని దాని పేరు చెబుతు న్నది), దూడదుడికి(గొడ్డుగోద, పొలము పుట్ర లాంటి పదబంధం), గాజుల గాదె(ఒరని గాజు అంటారు, ఒరలని ఒకదానిమీద ఒకటి నిలిపి ధాన్యం నిల్వజేసుకునే గాదె, గాజుల గాదె), మొఖాసా దారుడు(తనకు ఆప్తులైనవారికి, వీరులకు, యుద్ధంలో సాయపడిన వారికి, ఎటువంటి ఆస్తి లేని సమీపబంధువులకు, ఎటువంటి పన్ను లేకుండా, రాజు యిచ్చే నేలను మొఖాసా అంటారు. దాని యజమాని మొఖాసాదారు ), తురాయి కట్టు(దుష్టగ్రహపీడనలను, పాముమంత్రం, తేలుమంత్రం వంటివాటిని తొలగించే విరుగుడు ప్రక్రి యలు, దీనినే దురాకట్టు అనికూడా అంటారు), బోడసరం (ఔషధ విలువలు కలిగి, వివిధ డిజైన్లలోని పూలను పూసే తీగెజాతికి చెందింది, గుడ్డతో చేసిన ఈ పువ్వుల డిజైన్లను, చీరలపై అందంగా కుట్టుకునే వారట!), దొండగరి(మామూలు గడ్డితో కలిసి పోయిన హితవు గాని మొక్కలను తిన్నపుడు, పశువుల నాలుకపై కనిపించే బొబ్బలు) వంటివి నేడు శిథిలమై పోయిన పలుకుబడులు. ఇవిగాక ఆ నాటి ఆచార వ్యవహారాలను తెలిపే ఎన్నో అంశాలను కూడా పానుగంటివారు ప్రస్తావించారు….

సోది చెప్పించుకోవడం ఒక ఆచారం. సోదిని స్త్రీలే చెబుతారు. కాని ‘నూనెగుడ్డలవాళ్లు’ అనే ఒక జాతి ఉండేవారని, వాళ్ళు శకునాలు(భవిష్యత్తును) చెప్పేవారని, వారిలో పురుషులే శకునాలు చెప్పేవారని, ఆ జాతి ఇప్పుడు అంతరించిన జాతి అన్న విలువైన (పుట:51) సమాచారాన్ని పానుగంటివారి కథ (చిన్నకథ) అందిస్తూంది. 

ఒకప్పుడు నక్కదోసకాయలను, కృష్ణాజిల్లా మెట్టప్రాంతాల నుండి, ఎడ్లబండిపై తెప్పించి, గుంటూరు మాగాణి ప్రాంతాలలో బియ్యానికి కట్టు (కట్టు అంటే మూడు కిలోలు) లెక్కన అమ్మేవారని, ఆ కాయలకు బూడిద పూసి ఇంట్లో ఒక మూల దొర్లించి పెడితే, రెండు నెలలవరకు అవి పాడవకుండా ఉంటాయని (పు: 60, కానుగచెట్టు), వాటితో ఊరుగాయలు కూడా వేసేవారని, ముదరని లేత జొన్నకంకులను వలవగా వచ్చిన వాటిని ఊచబియ్యం అంటారని(పు: 62),ఈ కథలు చెబుతాయి.

‘తెలినాటి నియోగులనే గోలకొండ వేపారులు అందురు’(హిందూగృహిణి, పు:52) అని అంటారు కథకులు. గోలకొండ వేపారులనే,’వేపార్లు’, ‘వేపారి పంతులు’అంటారు. వేపారులు అంటే లౌకిక వ్యవహారంలో నిష్ణాతులు అని అర్థం. వీరు మొదట కర్ణాటకం నుండి చిన్న చిన్న ఉద్యోగులుగా గోల్కొండ రాజ్యంలోనికి ప్రవేశించిన వారు.(పు:19) అందుకే వారికా పేరు.అని, తెలంగాణాను తెలినాడు అన్నారేమో అన్న సంపాదకుల మాటలతో మనమూ ఏకీభవిస్తాం.

“‘కాసు’తోటను చూసి నవాబుగారు తీరుగా నింటికి బోవుచున్నారు”. (65)అన్న వాక్యం లో కాసు అన్న పదం కూడా ఒక సాంస్కృతికాంశాన్ని చెబుతూంది. స్వంత ఖర్చు కోసం, రాజ్య కోశాగారంపై ఆధార పడ కుండా, రాజకుటుంబానికి స్వంత ఆస్తిని ఏర్పాటు చేయటం ఒక పద్ధతి. రాజుగారి స్వంత ఆస్తిని, ఫారసీలో, ‘సర్ఫ్-ఏ-ఖాన్’ అంటారు. దీనినే పానుగంటివారు, క్లుప్తంగా ‘కాసు’ అన్నారు.

“నేను నీ చేతిలోని కాసండి ననుకున్నావా?”(పు:99) అని ఒక ప్రయోగముంది వీరి కథలో (రామరాజు). కాసండి, కాసెన్డి(కాసు+వెండి)అంటే మంచి రకపు వెండి అని అర్థం. ‘నీ యిష్టప్రకారం నేను నడచుకోవాలా?’ అని అర్థం కావొచ్చు. ‘కాసాండ్’ అంటే ఉర్దూ- తెలుగు నిఘంటువు ప్రకారం, ‘విధవ పెంచిన కొడుకు’ అని, అంటే అసమర్ధుడు అని అంతరార్థం. పానుగంటి వారికి ఉర్దూ పదాల వాడకం సరదా కాబట్టి ఉర్దూ అర్థమే ఇక్కడ సరైనఅర్థం అన్న సంపాదకుని మాట ఆలోచింపజేస్తున్నది. 

“ఆ మాత్రపు అచ్చిక బుచ్చిక యల్లాయపుల్లాయ సంసారమే యై…..” ( పు.102., రామరాజు)అన్న ప్రయోగంలో అల్లాయపుల్లాయ అన్న రూపానికి మూలరూపాన్ని అన్వేషిస్తూ చెప్పిన సంపాదకుని మాటలు గమనార్హం. రాష్ట్ర విభజన సమయంలో, ‘పరస్పరం ఆప్యాయంగా కౌగిలించుకోవడం’ అని అర్థం వచ్చే, అలాయ్ బులాయ్’ పేరితో సమావేశాలు నిర్వహించే వారు, ఆ పదానికి కల్పించిన గ్రాంధిక రూప మిది’ అన్న మాటలు పరిగణింపదగినవి.

“..తూర్పు సిద్ధాంతాలు స్థిరమనుకున్నావా(పు;103, రామరాజు)?” అన్న ప్రయోగంలో ‘తూర్పు సిద్ధాం తాలు’ అన్న పదాన్ని గమనించాలి. తక్కువరకం, చౌకరకం, నమ్మలేనివి, మోసపూరితం… వంటి అర్థాలు వచ్చేటట్లు ‘తూర్పు’ అనే విశేషణం చేరుస్తారు. తూర్పు గాలి అంటే, జబ్బుచేసే గాలి, తూర్పు కాళ్ళు అంటే బోదకాలువ్యాధి. న్యూనార్థమే .అంటే ‘నమ్మదగని మాటలు’అని అర్థంలో “తూర్పుసిద్ధాంతాలు” అని వాడుతారనేది ఒక సాంస్కృతికాంశమే!

“ఎవడో ‘పంచపక్ష్యుపాసకుడు’- తాగుబోతు……” అన్నవాక్యం (104, రామరాజు)ఉన్నది. భవిష్యత్తును తెలిసికోవడానికి ఉన్న ఎన్నో తంత్రాలలో, పంచపక్ష్యుపాసన అన్నతంత్రం కూడా ఒకటని, నేదునూరి గంగాధరం గారి, ‘జానపద కుటీరం” అన్న గ్రంథంలో పేర్కొన్నారట! అగస్త్యుడు రచించిన, సంస్కృత మూల గ్రంథాన్ని, లొల్ల రామచంద్రరావు(రాంజీ) అనువాదం 2016 లో ముద్రణ పొందింది. ఈ పంచపక్ష్యుపాసన అన్న తంత్రం ఇంకా మనుగడలో ఉన్నట్లు తెలుస్తున్నది అంటారు సంపాదకులు. 

వీరి కథలు ఇలా ఎన్నో శిథిలమై పోతున్న, అక్కడక్కడా శిథిల రూపంలో కొనసాగుతున్న విలువైన సాంస్కృతిక అంశాలను, చెబుతూ, వారి అలభ్యమైన మిగిలిన కథలలో ఇంకెన్ని ఉన్నాయో కదా అన్న ఉత్సుకతను కలిగిస్తూ ఉన్నాయి. 

చివరగా ఒక్కమాట చెప్పకపోతే ఈ వ్యాసం సంపూర్ణమైనట్లు కాదు. గత శతాబ్దానికి చెందిన ఈ కథలలో, కొన్ని పదాలకు అర్థాల కోసం నిఘంటువుల, సాంఘికచరిత్రల వెంటబడే అవసరం లేకుండా, వాటి వివరణ లను, ఆయా పుటలలోనే అధస్సూచికలుగా పొందుపరచిన సంపాదకుల ప్రజ్ఞ అనిర్వచనీయం. 11వ కథ ‘హాస్యకథ’ ఆనాటి మూడవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకు పాఠ్య గ్రంథాలుగా నున్న ‘ఆనంద వాచకంలో ఎనిమిదవ తరగతి వాచకంలో వచ్చిన కథ అని, వాటిలో కొంత ప్రౌఢంగా అనిపించినందువలన, యీ ఒక్క కథనే యీ సంపుటిలో చేర్చానని, ‘చిన్నకథ’ పేరితో, ఇంకా ఐదు కథలు తన దగ్గర ఉన్నాయని, వీటికే పానుగంటివారు శీర్షికలు పెట్టి, తన కథా సంపుటులలో చేర్చి ఉండవచ్చునని అంటారు సంపాదకులు. అలభ్యమైన ఆ రెండు కథా సంపుటులు లభ్యమయ్యేదాకా మనమూ ఈ అభిప్రాయంతో ఏకీభవించవలసినదే! పదకొండు కథలను తెలుగుసాహితీ లోకానికి అందించిన సంపాదకులు, మోదుగుల రవికృష్ణ గారిని, ఈ పుస్తకాన్ని అందంగా ప్రచురించిన, వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , నంబూరు, గుంటూరు జిల్లా వారిని అభినందించకుండా ఉండలేము.

You Might Also Like

Leave a Reply