నేను విజయావారి మాయాబజార్ చదివాను!

మొన్నేదో పరధ్యానంలో ఉండి ఫలనా సినిమా చూశావా అన్న ప్రశ్నకు, “లేదు.. చదవలేదు” అని జవాబిచ్చాను. వెంటనే ఫక్కున నవ్వు.. ” చదవలేదూ..  సినిమాలు కూడా చదివేస్తున్నారట అమ్మాయి గారు” అంటూ కాసేపు ఆటపట్టిస్తుంటే నేనూ నవ్వటం తప్ప ఏమీ చేయలేకపోయాను. ఇప్పుడు మాత్రం “ఆ అవును.. విజయావారి మాయబజార్‍ని నేను చూడ్డమే కాదు.. చదువుతాను కూడా” అని హార్లిక్స్ ఆడేజీని కాస్త అటు ఇటు మార్చి ఘాట్టిగా చెప్పగలను.

సినిమానో, పుస్తకాన్నో ఎన్నుకోమంటే నేనెప్పుడూ పుస్తకానికే ఓటేస్తాను. పుస్తకంలోని అక్షరాలను ఏరుకుంటుంటే, అవి అర్థమయ్యే కొద్దీ మెదడులో ఊహా చిత్రం విస్పష్టం అవుతూ ఉండడం నాకిష్టం. సినిమా తెరపై ఉన్నది ఉన్నట్టు చూసేయాలంటే నాకెందుకో. పుస్తకం రేకెత్తించే ఊహలతో పోల్చి చూస్తే నాకు నచ్చదు. మరి ఈ పుస్తకానికి ఎందుకు కొన్నట్టు? అట్టపై ఎస్వీర్ ఠీవిగా నుంచున్న బొమ్మ చూసి, “ఔరా!” అనేసుకుని, అసలు పుస్తకంలో ఏముందా అని తెరచి చూస్తే, మధ్య మధ్యన ఉన్న స్కెచ్చులు చూసి, “నా దగ్గరుండాల్సిందే” అని కొనేశాను. మాయాబజార్ చిత్రం ప్రతీ పాత్ర వేషధారణనీ, ప్రతీ సన్నివేశంలోని సెట్టుని ఎంత తీక్షణంగా ఊహిస్తే ఆ ఊహలు సజీవ చిత్రాలై మన కళ్ళ ముందు నిలిచాయో ఊహించుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. మాయాబజార్ లాంటి మరో చిత్రం రావాలంటే కళా దర్శకులు గోఖలే, కళాధర్ మళ్ళీ రావాల్సిందే! ఊహని అచ్చమైన బొమ్మల్లోకి తర్జుమా చేయగల వీరి నైపుణ్యానికి జోహార్లు!!

స్కెచ్చులూ, అక్కడక్కడా సినిమాలోని ఫొటోలు అన్నీ గబగబా తిప్పి చూసేసుకున్నాక, పుస్తకం పక్కకు పెట్టక, ఒక్క సారి చదివి చూద్దాం అనుకుంటూ మొదలెట్టాను. ఒక్కో సీనూ చదువుతుంటే, నలుపు తెలుపు దృశ్యాలు కళ్ళ ముందు కదలాడడం ఒక వింత అనుభవం. సావిత్రి నటవిన్యాసానికి రెండు కళ్ళూ సరిపోవే అని ఎంతగా వాపోయినా, ఈ పుస్తకం చదువుతున్నప్పుడు, ఆవిడ అలా కళ్ళముందు మెదలాడుతూనే ఉంటుంది. కనుబొమ్మలను ఎగరేయడం, పెదవి విరవడం, బుంగ మూతి, అమాయకత్వం, ఘటోత్కచుడు పూనినప్పుడు, అతి మోటైనా “నాజూకు”తనం.. అన్నీ మరో సారి “రి-ప్లే” అవుతూ ఉన్నాయి. వివాహ భోజనంబు లిరిక్స్ చదువుతున్నా, ఎస్వీర్ ఏ తినుభాండారాన్ని ఎంత బాగా తింటారో, ఎక్కడ వేలి కొసతో మీసానికంటుకున్న ఆహార పదార్థాన్ని తొలగిస్తారో తెలుస్తూనే ఉంటుంది. దానితో పాటు అక్కడున్న వచనం కూడా భలే పసందుగా ఉంది.

“గంగాళాల నిండా, గుండిగల నిండా బృహత్పాత్రల నిండా వున్న ఆ పదార్థాల్ని జుర్రుకోవాలని, ఘటోత్కచుడు ఒక్కసారిగా తన శరీరం పెంచాడు. నోరు విప్పి, చెయ్యి తగలనివ్వకుండా – వేరుశెనగ గింజలు- తిన్నట్టుగా టపటపా లడ్డూలు మింగేశాడు! తక్కిన పదార్థాలన్నీ చేతికి పట్టినన్ని లంకించుకని, ఊదేశాడు! పక్కనుంచి శిష్యవర్గం ఆ తిండి చూసి ఆశ్చర్యపోతున్నది. మొత్తం పదార్థాలన్నీ తృప్తిగా భోంచేసి, పాత్రలన్నీ దూరంగా గిరాటేసి, ఆనందంగా మీసాలు మెలేశాడు – వృకోదర కుమారుడు ఘన ఘటోదరుడు – ఘటోత్కచడు!”

ఈ సినిమాలోని కొన్ని ముఖ్య సంఘటనలనూ, చిత్రీకరణ విశేషాలనూ, తెర వెనుకున్న వారి పరిచయాలనూ, వచ్చిన ప్రశంసలనూ కూడా ఇందులో పొందుపరచారు. పాటల సూచిక పెట్టడం, సాంకేతిక నిపుణలందరినీ పరిచయం చేయడం బాగుంది. డైలాగులన్నీ కాక పాటల పూర్తి సాహిత్యాన్ని కూడా ఉంచారు. ఈ సినిమా అంటే ఇష్టపడే ప్రతీ ఒక్కరి దగ్గరా ఉండాల్సిన పుస్తకం. ఇంత అద్భుత సినిమా స్క్రిప్టూ – సంభాషణలూ మన చేతిలో ఒదిగిపోయాయంటే.. ఆ ఆనందం వర్ణానాతీతం.

ఈ పుస్తకమై కొన్ని ఆసక్తికర లంకెలు:

http://radiospandana.spaces.live.com/blog/cns!41F42A5D60A419A3!241.entry

http://www.hindu.com/2007/04/05/stories/2007040519530200.htm

పుస్తక వివరాలు:
విజయా వారి మాయా బజార్ సినిమా నవల (Vijaya vaari Mayabazar – Cinema Navala)
ప్రచురుణ: 2007
వెల: రూ. 125/-
పుస్తక ప్రతులకు: విశాలాంధ్రా బుక్ హౌజ్, హైదరాబాదు, ప్రముఖ పుస్తకాలయాలు.

You Might Also Like

19 Comments

  1. varaprasad

    పాత కామెంట్స్ చూస్తుంటే అద్బుతమైన మాయాబజార్ దొరికింది,పూర్ణిమ గారికి అభినందనలు,

  2. రాజా పిడూరి

    పూర్ణిమ గారూ, మాయాబజారు సినిమాని ‘ఎన్ త్’ సారి చూసేటప్పుడు ఒక విషయం గమనించి ఇది రావి కొండలరావు గారు పుస్తకం లో‌రాసారా లేదా అని ఆసక్తి గా చూశాను. కానీ అది ఈ‌పుస్తకం లో‌‌ రాయక పోవడం చూసి ఆశ్చర్య పోయాను. ఎంత జాగ్రత్త గా ఈ‌సినిమా ని చెక్కారో అనడానికి ఇది ఒక తార్కాణం. (రావి కొండల రావు లాంటి దురంధరుణ్ణే మరపించిందన్న మాట‌!)
    సినిమా లో (దొంగ)‌పెళ్ళి పీటల మీద కూర్చునే టప్పుడు మాయా శశిరేఖ ముందు వచ్చి పీటల మీద కూర్చోబోతే చెలికత్తె వారిస్తుంది. ఎంత పాత్రోచితం గా ఉంది!

    రాజా పిడూరి

  3. Sreenivas Paruchuri

    జంపాల గారు: మీరు చెప్తున్న పుస్తకం 1999 ప్రాంతంలో వచ్చింది. తరువాత మాయాబజార్ (1/4 డెమీ సైజులో, కాస్త అందంగా, మంచి పేపరుపైన …), మల్లీశ్వరి మరింత అదనపు సమాచారం, బొమ్మలతో విడివిడిగా విడుదలయ్యాయి. అన్నింటినీ రావి కొండలరావుగారే ప్రచురించుకొన్నారు.

    — శ్రీనివాస్

  4. జంపాల చౌదరి

    ఈ పుస్తకం వేరే ముద్రణ కావచ్చు: ఒక వేపు నుంచి తెరిస్తే మాయాబజార్; ఇంకోవేపు తెరిస్తే మల్లీశ్వరి. Double Delight

  5. శ్రీరామ్ వేలమూరి

    పూర్ణిమ గారూ ,అభినందనలు, తెలుగువారికి ఒక తిరుపతి, ఒక గోదావరి,ఒక బాపు,ఒక మాయాబజార్,అంతే, (తనికెళ్ళ భరణి గారు క్షమించాలి )

  6. VMRG Suresh

    బ్లాగ్ సైట్ బావుంది. మాయాబజార్ ఎన్ని సార్లు చూసినా, ఎన్ని సార్లు చదివినా బోర్ కొట్టదు. కమ్మటి అముద్దపప్పు, అవకాయ భొజనం, సుఖమైన నిద్ర, మాయాబజార్ సినిమా .. వీటికి ప్రత్యామ్నాయాలుంటాయా? అందుకు ఆస్కారమే లేదు.

    పుస్తకం.నెట్ తెలుగు పాఠకులకు మంచి రెఫరెన్స్ సైట్ గా మారుతుందని నా విశ్వాసం.

    – సురేశ్

  7. రవి

    పుస్తకం.నెట్ కు అభినందనలు.

    సమీక్ష సింపుల్ గా చక్కగా ఉంది. అభినందనలు.

  8. Srinivas

    మంచి ప్రయత్నం. సఫలమవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.

  9. పూర్ణిమ

    వెంకట్ గారు: రాయండీ.. మీ వ్యాసం కోసం ఎదురు చూస్తున్నాం. ఇక “మొదటి వ్యాఖ్యాత”గా చరిత్రలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించేశారుగా! 😉

    సౌమ్య: ప్రత్యేకంగా ఏమీ రాయలేదు దాని గురించి. స్క్రిప్ట్, మాటలూ, పాటలూ అంతే. అవును.. చదివేయచ్చూ, చూసేయచ్చూ “మాయాబజార్”ని ఏ రూపంలోనైనా! 🙂

    శరత్ గారు, వరూధిని గారు, వేణూ శ్రీకాంత్ గారు, చైతన్య గారు, దిలీప్ గారు, కుమార్ గారు: నెనర్లు!

    నిశాంత్: పుస్తకాల పురగుల అభినందనలు మాత్రమే సరిపోవు మరి! 🙂

  10. pappu

    మంచి ప్రయత్నం.ధన్యవాదాలు.అభినందనలు.

  11. kumar

    అభినందనలు

    కుమార్

  12. ఏకాంతపు దిలీప్

    అభినందనలు పూర్ణిమా!

  13. చైతన్య

    పుస్తకం.నెట్ నిర్వహక సభ్యులందరికి అభినందనలు.

    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  14. వరూధిని

    మీ కోరికకి ఓ రూపం వచ్చినందుకు అభినందనలు.

  15. వేణూ శ్రీకాంత్

    వాహ్ మంచి పుస్తకంతో మొదలు పెట్టారు. పుస్తకం.నెట్ నిర్వహక సభ్యులకూ… ఓ రూపం తీసుకు రావడానికి కష్టపడిన సభ్యులందరికీ అభినందనలు… విజయోస్తు..

    అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

  16. నిశాంత్

    నూతన సంవత్సర శుభాకాంక్షలతో – పుస్తక పురుగు…. 😉

  17. సౌమ్య

    ఓహ్! మాయాబజార్ పై పుస్తకం! సావిత్రి “అహ నా పెళ్ళంట” లో నటించిన విధానం గురించి ఏమన్నా రాసారా? ఎస్వీఆర్, సావిత్రి ల కోసం మాయాబజార్ కి సంబంధించి ఏ పుస్తకమన్నా, ఏ వీడియో అన్నా చదివేయొచ్చు, చూసేయొచ్చు…

  18. శరత్

    2009 క్రొత్త సంవత్సరం రోజున చక్కటి పని మొదలుపెట్టారు. సంతోషం. మీరు మంచి విజయం సాధించాలని ఆశిస్తున్నాను.

  19. వెంకట్

    పూర్ణిమ గారూ,
    చాలా బావుంది మీ వ్యాసం. పుస్తకం సైట్ కూడా.
    పుస్తకం లో నేను కూడా త్వరలోనే రాయడం మొదలుపెడ్తాను.
    పుస్తకంలో నాదే మొదటి వ్యాఖ్య 🙂

Leave a Reply