కవిత్వంలో నిశ్శబ్దం – సమీక్ష
రాసి పంపిన వారు: C.S.Rao
***********************************
“కవిత్వంలో నిశ్శబ్దం” ప్రఖ్యాత సాహితీ విమర్శకులు,కవి,ఇస్మాయిల్ గారి సాహిత్య వ్యాసాల సంకలనం.ఇరవై ఎనిమిది వ్యాసాల ఈ సంకలనం లో దాదాపు సగం వ్యాసాలలో కవిత్వానికి సంబంధించిన సైద్ధాంతిక చర్చ,తక్కిన వ్యాసాలలో వారికి బాగా నచ్చిన కవుల విశ్లేషణాత్మక కవిత్వ పరామర్శ చేస్తారు.అంతేకాని ఒక గిరి గీసుకుని ఒక కాలానికో,ఒక కవితా రీతికో,ఒక కవితావస్తు సారూప్యతకో ,లేదా ఇదొక సమగ్ర సాహిత్య చరిత్ర కావాలనే ప్రణాళిక కో తనను తాను కట్టడి చేసుకోకుండా కవిత్వం ఎడల తనకున్న అభిప్రాయాలను,విశ్వాసాలను,గొప్ప ధైర్యంతో,నిబద్ధతతో,నిష్పాక్షికతతో ,నిశిత పరిశీలనతో ,నిస్సంకోచంగా,నిర్మొహమాటంగా ,అందంగా ఆలోచనలను రేకెత్తించేవిధంగా విశదీకరిస్తారు.
“కవిత్వం అంటే ఏమిటి?” అనే మూల వ్యాసం లో ఏది కవిత్వం అనే మౌలికాంశాన్ని ప్రస్తావిస్తూ ” అనుభవాన్ని వ్యక్తం చేయటమే కాదు,అది మనకు అనుభూతమయ్యేటట్లు చేయటం కవిత్వం పని” అంటారు.ఈ పనిని కవిత్వం నిర్వహించటానికి అవసరమైన సాధనాలు పదచిత్రాలు.కవిత్వం లో పదచిత్రాల ద్వారా తన అనుభూతులను ఉత్తేజితం చేసి అభివ్యక్తీకరించటమే కాకుండా ఫ్రెంచ్ కవి బోద్లేర్ చెప్పినట్లు మానవానుభవం లోని సార్వత్రిక సాదృశ్యాన్ని తన భావనా శక్తితో సాధించటం ద్వారా పాఠకుడి కి అవి అనుభూతమయ్యేటట్లు చేస్తాడు కవి. బోద్లేర్ అన్న సార్వత్రిక సాదృశ్యం అంటే యూనివర్సాలిటీ ఆఫ్ ఎక్స్పీరియెన్స్ గా చెప్పుకోవచ్చు.కామన్ హ్యూమన్ సెన్సిబిలిటీస్ ఉంటవి కాబట్టి ఉత్తేజితం చేయబడ్డ అనుభవాలు మానవులందరినీ స్పందింపచేస్తావి.అంటే మంచి కవిత్వం యూనివర్సల్ అప్పీల్ కలిగి వుంటుంది.
ఇస్మాయిల్ గారు శబ్దసంవిధానాన్ని పెద్దగా పట్టించుకోరు; అంటే శబ్దసంవిధానానికి కొద్దిగా చిరాకు పడతారు. అర్ధసంవిధానానికే ప్రాముఖ్యత నిస్తారు. ఈ అర్ధసంవిధానమే కావ్యం యొక్క కావ్యత్వాన్ని నిరూపిస్తుందని, అదే కావ్యానికి అనన్యమైన ఆకృతిని కల్పిస్తుందని చెపుతారు. ఇదంతా బాగుంది. కానీ ఒక్క చిన్న సందేహం; ఇస్మాయిల్ గారు అంటారు, ” “వచనకవిత్వం” అనే పదం అర్ధహీన మను కుంటున్నాను. నిజమైన కవిత్వానికి ఒక ‘అర్ధసంవిధానము, ఒక ఆకృతి ఉంటాయి. ఈ లక్షణాలే కవిత్వాన్ని వచనాన్నుంచి వేరు చేస్తాయి. అటువంటప్పుడు వచనం కవిత్వమెలా అవుతుంది? వంధ్యాపుత్రుడిలాగ?” కానీ అర్ధసంవిధానమే కావ్యానికి అనన్యమైన ఆకృతిని కల్పిస్తుందని వారు పైన చెప్పారుగదా? అటువంటి అర్ధసంవిధానాన్ని వచన మాధ్యమంలో సాంద్రమైన అనుభూతి వ్యక్తీకరణ ద్వారా సాధించగలిగితే, ఆ అర్ధసంవిధానమే ఆ కవితకు అనన్యమైన ఆకృతిని కల్పిస్తుందనే కదా అర్ధం? వచనకవిత్వం గురించి ,దాని ఆకృతిని గురించి ప్రామాణికగ్రంధం మనకు ఇంతవరకు రాకపోయినా , గాఢానుభూతి, దాని వ్యక్తీకరణ మాధ్యమాలుగా వాడబడే పదచిత్రాలు, వానిలో నిబిడీకృతమై వుండే సూచితార్ధాలు ఆ కవితయొక్క అర్ధసంవిధానానికి దోహదం చేస్తవి. ఎన్నుకున్న పదాల మధ్య వుండే శబ్దసారూప్యం,కవితాపంక్తులమధ్య వుండే సమతూకం ఒక లయను , ఒక అందమైన ఆకృతిని, కంఠవశమయ్యే గుణాన్ని దానికి సమీకరించి పెడతవి. అర్ధానికి తగిన వాక్కే వాక్కు; తగనిది వాక్కే గాదు. కాబట్టి సరి అయిన వాగర్ధాలు ఒకటిగా మారి అలరిస్తవి. అప్పుడది నిరభ్యంతరంగా వచన కవిత్వ మవుతుందిగద.ఇస్మాయిల్ గారు గూడా ‘కవిత్వంలో ఆధునికత ‘ అనే వ్యాసంలో ‘పద్యమైతేనేమి,గద్యమైతేనేమి, అది కవిత్వమయితే కవిత్వమనే అందాం,’ అని వారి ఆమోదముద్ర వేస్తారు. సంతొషం. ఈ నాడు వాస్తవానికి వచనకవిత్వం తిరుగులేని విధంగా స్థిరపడిపోయినమాట పరమవాస్తవం.
‘సాహిత్యం అవసరమా’ అనే వ్యాసంలో తత్వానికి, కవిత్వానికి తేడాను చాలా బాగా చెప్పారు. “అద్భుతమూ, సంశ్లిష్టమూ, మూర్తిమంతమూ అయిన జీవితాన్ని వడబోసి దోసెడు అమూర్త ప్రత్యయాల్ని అందిస్తుంది తత్వం. ఇది జీవిత తాత్పర్యం కావచ్చుగాని, జీవితమంటే ఇది గాదు” మరి కవిత్వం? సమీక్ష మొదటే చెప్పుకున్నట్లు, “అనుభవాన్ని అనుభవంగా మనకు ఇవ్వగలిగేది ఒక్క సాహిత్యం మాత్రమే” ఇక్కడ సాహిత్యం అంటే ముఖ్యంగా కవిత్వం అనే అర్ధంలో వాడినట్లు విదితమవుతుంది. టి.ఎస్. ఇలియట్ కవిత్వం గురించి చెబుతూ కవిత్వంలో ఐడియా ఐడియా గా పాఠకుడికి ఎప్పుడూ చేరగూడదని, అది ఇమోషన్ గా చేరాలని అంటారు. ఐడియా ను ఇమోషనలైజు చేస్తే కవిత్వమౌతుందని, ఇమోషన్ ని ఇంటలెక్చువలైజ్ చేస్తే తత్వమౌతుందని అనుకోవచ్చు.
ఇదే ఈవ్యాసంలో ఇస్మాయిల్ గారు సాహిత్యాన్ని గురించి (సాహిత్యం, కవిత్వం పర్యాయ పదాలు గా వాడుతున్నారు) మాట్లాడుతూ ” ఇది సామూహిక సృష్టి గాదు, వ్యక్తి సృష్టి . ఇది వైయక్తిక దర్శనం”. అంటే నిజమయిన కవి తన కవిత్వాన్ని ఏ రాజకీయ,ఆర్ధిక సిద్ధాంతాలనూ, ఆధ్యాత్మిక మార్గాలనో,ఏ మతపరమైన విశ్వాసాలనో ప్రచారం చేయటం కోసం వ్రాయడు.ఇస్మాయిల్ గారు అంటారు :”స్పానిష్ కవి పాబ్లో నెరూడా ను తీసుకోండి.అతడు యావజ్జీవ కమ్యూనిస్టు .అయినా కమ్యూనిస్టులు డికడెంట్ అని ఈసడించే సర్రియలిస్ట్ విజన్ ని అతనెప్పుడూ విడిచిపెట్టలేదు.” ఇస్మాయిల్ గారికి నిష్పాక్షితతో పాటు,గొప్ప నిర్భీతి,మంచి హాస్య ప్రియత్వం ఉన్నవి. “రాజకీయసిద్ధాంత పంజరాల్లోకి ఆకర్షితులై రెక్కలు పోగొట్టుకున్న కవులూ కనిపిస్తారు.ఇంగ్లండ్ లో సి.డి.లూయిస్,స్టీఫెన్ స్పెండర్ ,ఆడెన్ రెక్కలు పూర్తిగా తెగక మునుపే బయటపడ్డారు. మార్క్సిస్ట్ ప్రభావంతో వీళ్ళు చవకబారు కవిత్వం వ్రాసారు” శ్రీ శ్రీ గురించి చెబుతూ “తన గొప్ప కవిత్వం అంతా అంటే “మహాప్రస్థానం ” మార్క్సిజం గురించి తెలుసుకొనక మునుపే రచించారు. మార్క్సిజం పుచ్చుకున్నాక రాసినవి దసరా పద్యాల్లాంటివి” .మరలా దేనికదే. “కవితా విహంగానికి స్వేచ్ఛ ఊపిరి” అనే వ్యాసం లో ఎంతో చక్కగా శ్రీశ్రీ ని మెచ్చుకుంటారు. “అభ్యుదయ ఉద్యమానికి దానికి రూపాంతరమైన విప్లవ ఉద్యమానికి కలిపి ,చెప్పుకోదగ్గ కవి శ్రీశ్రీ ఒక్కడే మహావృక్షం లా మిగిలాడు. మిగతాదంతా పర్రే”.ఎప్పుడు ఎవరిని గురించి ఎలా చెప్పాలో అలా చెప్పడం ఆయన రీతి.
భావకవుల గురించి ఇస్మాయిల్ గారు ఇలా అంటారు,”వారిది ఆత్మాశ్రయ వైఖరి…..వైయక్తిక అనుభూతి వీరి కవిత్వానికి ప్రాణం…..అతి సున్నితమూ,అతి తీక్షణమూ అయిన చేతనా సౌకుమార్యం వీరు సాధించగలిగారు” భావ కవులకు ప్రతినిధిగా నిలిచినవారు కృష్ణ శాస్త్రి గారు.కృష్ణశాస్త్రి గారంటే ఇస్మాయిల్ గారికి అపారమైన గౌరవము,ప్రేమ.మాటి మాటి కీ ఆయన ప్రస్తావన తెస్తారు.ఈ సంకలనం లో ఒక్క ఆయన మీదనే నాలుగు వ్యాసాలు వ్రాసారు.ఎంత నిరలంకారత,క్లుప్తత,అన్వేషణ ,శబ్దసంవిధానాన్ని అంతగా పట్టించుకొనక పోవటం కవిత్వంలో వారు అభిమానించే గుణాలైనా కృష్ణశాస్త్రి గారి ‘ఊర్వశి ‘ లోని కవిత్వాన్ని అభిమానించి ,ఆనందించినట్లే అనిపిస్తుంది.
“ఆమె కన్నులలో
ననంతాంబరపు నీలి నీడలు గలవు
వినిర్మలాంబు పూర గంభీర శాంతకాసార చిత్ర
హృదయములలోని గాటంపు
నిదుర చాయ లందు నెడనెడ గ్రమ్ము
సంధ్యావసాన సమయమున
నీప పాదప శాఖిగాగ్ర పత్ర కుటిల
మార్గముల లోపల వసించు
ఇరుల గుసగుసల్ వానిలో
నిపుడు నపుడు వినబడుచుండు;”
“మళ్ళీ తెలుగు కవిత్వం లో రొమాంటిసిస్టు లక్షణాలు పొడచూపుతున్నాయని వెల్చేరు నారాయణ రావు గారి లాంటి విజ్ఞులు అంటున్నారు.ఇది శుభ సూచకం.”
అంటారు. మరలా ” కవి కవే. కృష్ణశాస్త్రి గారు కృష్ణశాస్త్రి గారే.”వారి యెడల ఆయన అభిమానానికి అంతు లేదు .
ఇస్మాయిల్ గారు విశ్వ సాహిత్యంలో కవితా విలువలను ,సామాజిక ప్రయోజనాలను సమన్వయించి కవిత్వం వ్రాసిన ఎందరో మంచికవులను పేర్కొంటారు. యేట్స్ ,ఉంగరిటీ, మొంటాలె ,మయకోవిస్కీ,పాస్టర్నాక్.కవిత్వపు విలువలకు,రాజకీయాలకి మధ్య గొప్ప సామరస్యం కవిత్వం లో సాధించిన జర్మన్ కవి బ్రెహ్ట్ ను ప్రత్యేకంగా ప్రస్తుతిస్తారు.
కవిత్వం లో నిశ్శబ్దం అనే వ్యాసంలో ,శబ్దాలకందని అనుభవం నిశ్శబ్దావరణం లో ఉంటుందని అంటారు.అంచేత “ఈ నిశ్శబ్దాన్ని శబ్దాలలోకి ప్రవేశపెట్టటమే కవిత్వ విశిష్ట లక్షణం.కవిత్వానికి శబ్దం ఎంత ముఖ్యమో నిశ్శబ్దం కూడా అంతే.” అంటే నిగూఢార్ధాలను నిక్షేపించుకున్న పదచిత్రాలను కూర్చుకుని వాటిని కవి తన అనుభూతి మెరుపులతో ప్రకాశవంతం చేసి పాఠకుడికి ,తనకు అడ్డుగా నిలిచిన అంధకారాన్ని చీల్చుకుని వాటి అర్ధవత్వం పాఠకుడి హృదయంలోకి ఎకాఎకిన చేరేట్లుగా చేసుకోవాలి.శబ్దం యొక్క అంటే భాష యొక్క కమ్యునికేటివ్ లిమిటేషన్స్ ను ఇలా అధిగమించాలి.కవియొక్క పరిపూర్ణానుభవం ,చదువరి యొక్క పరిపూర్ణానుభవం కావాలి.ఆవిధంగా ,నిశ్శబ్దంలో దాగివున్న భాషకందని భావాలను పాఠకుడికి అనుభూతమయ్యేట్లు చెయ్యటం జరుగుతుంది.
ఇస్మాయిల్ గారిలో గొప్ప మేధాసంపత్తి ఉంది. నిశిత విమర్శనాశక్తి ఉంది.శంకించటానికి ఏ మాత్రం వీలులేని,నిష్పాక్షికత ఉంది.ప్రపంచ సాహిత్యం తో పాండిత్యం స్థాయిలో గొప్ప పరిచయం ఉంది.కసి లేని సాహసం ఉంది.లోకమంతా కోడై కూసినా దాంతో కూడా తనకు నచ్చకపోతే విబేధించగలిగిన ధైర్యం ఉంది.అన్నిటినీ మించి కవిత్వమన్నా, సాహితీ వ్యాసంగమన్నా అపారమైన ప్రేమ ఉంది.వర్ధమాన కవుల నెందరినో ప్రవర్ధమానులయ్యేటట్లు తీర్చి దిద్దాలనే తపన,ఔదార్యం,నిస్వార్ధమైన వాత్సల్యం ఉన్నవి.ఇన్ని ఉన్నా గొప్ప వినయ శీలత పుష్కలంగా ఉంది.”కొత్త సంస్థానాల్లో కవి పోషణ” అనే వ్యాసం లో ఒక్క కవిత్వానికి మాత్రమే నిబద్ధత కలిగి కవిత్వం వ్రాస్తున్న వారికి తన కంటే వయస్సులో ఎంతో చిన్నవారయినా పేరు పేరు చెప్పి “వీరందరికీ సలాములు” అనగలిగిన వినయం,సంస్కారం,అరమరికరలు లేని నిగర్వత ఉన్నవి.ఇటువంటి గొప్ప మేధావితో ,మంచి వ్యక్తితో ఏ విషయం మీదనైనా విబేధించవలసి వచ్చినప్పుడు ఏదో డిస్ లాయల్ గా ఉంటున్నామేమొ అనే ఇబ్బంది లాంటి ఫీలింగ్ తప్పనిసరిగా కలుగుతుంది.నేను అటువంటి ఫీలింగ్ కే ఇప్పుడు గురవుతున్నాను .
అయినా కన్విక్షన్ అనేది ఒకటి ఉంటుంది.“కవిత్వానికి కొత్త ఊపిరి” అనే వ్యాసంలొ “అందరికీ తెలిసిన దాన్నే అందం గా చెప్పటం కాదన్న మాట కవిత్వం….కవిత్వం ఎక్స్ ప్లొరేషన్ కనక కొత్త సత్యాలని ఆవిష్కరిస్తుందని వీళ్ళంటారు.” అంటారు ఆయన.”వీళ్ళూ” అంటే ఆధునిక కవులు అయినా ఈ సందర్భం లో వారు చెప్పి రీతిని బట్టి అది వారి అభిప్రాయం కూడా అని అనుకోవలసివస్తుంది.కవిత్వం మానవానుభవాలకు సంబంధించినది.కాబట్టి జీవితానుభవాలకు సంబంధించినంతవరకు ఎవరికీ తెలియనిదంటూ ఏమీ ఉండదు.విద్యాసంస్కారాల హెచ్చుతగ్గుల వల్ల ,అధ్యయన ,అభ్యాసాల వ్యత్యాసాల వల్ల అనుభూతమైన విషయమే అయినా అది కొందరికి తెలిసినట్లు అనిపించదు.కవి చక్కగా చెప్పినపుడు “అవునవును,ఎంత నిజం,ఎంత బాగుంది” అని అనుకుంటారు.అందరికీ చేతనా సారూప్యత వుంటుంది,అదే సార్వత్రిక సారూప్యం.రెండవ విషయం ఎక్స్ ప్లొరేషన్.నేననుకోవటం కవి,తాను పొందిన అనుభూతిని అన్ని కోణాలనుంచి సమగ్రంగా పరిశీలించుకుని దాని సమగ్ర స్వరూప వ్యక్తీకరణకు వాడవలసిన పదాలు ,పదచిత్రాలు,రచనలో పాటించవలసిన క్రమానికి సంబంధించిన వివరాలను స్థిరీకరించుకునే వ్యాసంగమే ఎక్స్ ప్లొరేషన్ అనుకుంటాను. కొత్త సత్యాలను వ్యక్తీకరించటం కోసం చేసే అన్వేషణ ఈ ఎక్స్ ప్లొరేషన్ అని అనుకోలేకపోతున్నాను.జీవితసత్యాల ఆవిష్కరణ కొన్ని అమూర్త ప్రత్యయాలద్వారా తత్త్వ శాస్త్రం చేసే పని గదా. ఇస్మాయిల్ గారే చెప్పినట్లు కవిత్వం పని మాటిమాటికీ అనుభవాన్ని అనుభవం గానే పాఠకుడికి అనుభూతమయ్యేట్లు చెయ్యటమేగదా.
టాగూర్ గారన్నా,కృష్ణశాస్త్రి గారన్నా,చలంగారన్నా,రఘుపతి వెంకటరత్నం నాయుడు గారన్నా ఇస్మాయిల్ గారికి అపారమైన గౌరం,ప్రేమ.కాకినాడన్నా,పి.ఆర్ కాలేజీ అన్నా ఎంతో మమకారం .సాహిత్యమన్నా,ప్రపంచవ్యాప్తంగా కవిత్వానికి మాత్రమే నిబద్ధత కలిగి సత్కవిత్వం వ్రాస్తున్న కవులన్నా సంతోషంతో పులకించిపోయే తత్వం ఇస్మాయిల్ గారిది.ధనసంపాదనకు గానీ,వస్తుసముపార్జనకు గానీ ఏ మాత్రం ప్రాముఖ్యత ఇవ్వకుండా అహర్నిశలు కవితా స్పృహతో మనసు నింపుకున్న మహా మనీషి.లిటరరీ కల్చర్ తో తొణికిసలాడే వ్యక్తిత్వం వారిది.
ఒక మంచి కవిత,లేదా కధ,నవల మాటిమాటికీ చదువుతాము.కానీ సాహిత్యవిమర్శాగ్రంధాల్ని పదే పదే చదవటం సామాన్యం కాదు.ఇస్మాయిల్ గారి “కవిత్వం లో నిశ్శబ్దా”నికి ఎన్ని సార్లైనా చదివించుకోగల సామర్ధ్యం ఉంది.సాహితీ విమర్శ సైద్ధాంతిక రచన.దానికి అవసరమైన అందమైన ఇంటలెక్చువలైజ్డ్ శైలి ,రమ్యత,విశిష్టత,హుందాతనం ఈ సంకలనానికున్నవి.
దేశి బుక్స్
@Murali Mohan Mallareddy:
దేశి బుక్స్ ద్వారా ప్రచురించిన ఇస్మాయిల్ పుస్తకాల్లో ఇది ఒకటి. నవోదయ బుక్ హౌస్ , ఆర్యసమాజ్ రోడ్ , కాచిగూడ , హైదరాబాద్ వారి దగ్గర ఈ పుస్తకం , పల్లెలో పాత ఇల్లు ( ఇస్మాయిల్ గారి చివరి పుస్తకం ) దొరుకుతాయి. అమెరికా , కెనడాలలో పుస్తకం కావాలి అనుకున్న వారు desibooks@gmail.com
ఈమెయిల్ ఇవ్వండి.
Murali Mohan Mallareddy
ఈ పుస్తకాన్ని పోస్ట్ ద్వారా తెప్పించుకునే మార్గం ఉంటే దయచేసి చెప్పగలరు
–మల్లారెడ్డి మురళీ మోహన్
గరికపాటి పవన్ కుమార్
సమాజ ప్రభావాలకు లోనై సమాజ నియమాలను గొఱ్ఱె దాటుగా పాటించేవాడెప్పుడూ గొప్ప కవిత్వం రాయగలడని నేననుకోను. రవికిరణ్ గారు వైయుక్తికమనేది వైయక్తికమనే భావంలోనే వాడారని భావిస్తున్నాను. వైయక్తికమనేది వ్యక్తి కి సంబంధించినది (యుక్తి కి కాదు). కవి విశ్వాంతరాళాల్లో విహరిస్తూ, సముద్రగర్భాల్లో సంచరిస్తూ, త్రిలోకాలలో తిరుగాడుతూ ఏదో ఒక ప్రత్యేక క్షణాన భావావేశంతో ఉబికివచ్చే కవిత్వానికి సమాజం, సమాజం యొక్క ప్రభావం అతి స్వల్పం.
ఇంత చెప్పినా ముక్కు మూసుకుని అడవుల్లో తపస్సు చేసుకునే మునులకు సమాజ జ్ఞానం ఎలా వస్తుంది లాంటి ప్రశ్నలతో తిమ్మి రెడ్డి గారు దండెత్తకపోవచ్చనే భావిస్తున్నాను.
కవిత్వం గురించి అంతగా తెలియదు గాబట్టి నేను సాహిత్యం అంటాను. — ఆరి సీతారామయ్య
సాహిత్యం అంటే తప్పదు సీతారామయ్య గారితో ఏకీభవించాల్సిందే. కవిత్వంతోనే ఈ మడత పేచీ.
హెచ్చార్కె
I felt that some important issues discussed here are touched upon by me in my recent article on Sri Sri. Would be happy if friends look into it. I am giving the Link below. hope I am not wasting your time.
http://www.pranahita.org/2009/11/udyamaalu_unnaa_lekunnaa_srisri/
ఆరి సీతారామయ్య
“కవిత్వాని ఎదైనా ఒక ఇజం లో బంధించాలని ప్రయత్నిస్తే పక్షి రెక్కలు కత్తిరించి పంజరంలో పెట్టినట్టే. అలాగే ఎవరి ఇజాలు వాళ్ళకున్నా కూడా చివరికి కవి కవి గా మిగలాలి అప్పుడు గొప్ప కవిత్వాన్ని సృజించగలడని అర్థమవుతూంది”
కవిత్వం గురించి అంతగా తెలియదు గాబట్టి నేను సాహిత్యం అంటాను. ఏ ఇజాన్నీ సాహిత్యంలో బంధించాలని ఎవ్వరూ ప్రయత్నించరు. అలా ఎవ్వరైనా చేస్తే వాళ్ళకు సాహిత్యం గురించి ఏమీ తెలియకపోవచ్చు.
కాని ఏదో ఒక ఇజంతో సంబంధం లేని సాహిత్యం లేదు. అది మార్క్సిజం కావచ్చు, స్త్రీవాదం కావచ్చు. బ్రాహ్మణాధిపత్యం కావచ్చు. దళిత వాదం కావచ్చు. ఇంకొకటి కావచ్చు. ఒక ఇజం కొందరిని ఉత్తేజ పరచవచ్చు. ఆలోచింఛేట్టు చెయ్యవచ్చు. గత ముఫై సంవత్సరాల్లో ఇదివరకు రాని విషయాలమీద మంచి కథలు రావటానికి స్త్రీవాదం కారణమయింది. స్త్రీవాదం గురించి కథ రాయాలని మొదలుపెడితే అది చెత్త కథ అవుతుంది. కాని స్త్రీల హక్కుల గురించి ఆలోచించేట్టు చెయ్యగల మంచి కథలు ఎన్నో వచ్చాయి. స్త్రీల హక్కులు అంటేనే గిట్టని వాళ్ళకి ఈ కథలు మింగుడు పడవు. స్త్రీవాదం సాహిత్యాన్ని నాశనం చేసిందంటారు ఈ మహానుభావులు. మార్క్సిజం కూడా అంతే. చెత్త సాహిత్యాన్ని విమర్సిస్తే ఏమీ ఇబ్బంది లేదు. వస్తువు మార్క్సిజానికి సంబంధించినందువల్ల సాహిత్యాన్ని ఈసడించటంలో మాత్రం నిజాయితీ లేదు.
రవికిరణ్ తిమ్మిరెడ్డి
“అనుభవాన్ని వ్యక్థం చెయ్యడవే కాదు, అది మనకు అనుభూతమయ్యేటట్లు చేయటం కవిత్వం పని,” అంటారు. ఈ అనుభూతవయ్యేటట్లు చెయ్యడంలోనూ, ఆ సార్వత్రిక సాదృశ్యాన్ని ఆవిష్కరించడంలోనూ, వైయుక్తికతని నేలనొదిలి సాముచెయ్యించడవే కవిత్వవనే అభిప్రాయం కనిపిస్తుంది. ఇది సామాజిక సృష్టి కాదు, నిజవే, వ్యక్తి సృష్టే. కానీ ఆ వ్యక్తి శూన్యంలో పుట్టి, శూన్యంలో పెరిగి, తన కవిత్వాన్ని శూన్యంలో ఆవిష్కరించాడా, ఆ సార్వత్రిక సాదృశ్యానికి సమాజవనే ఆలంబన కాదా? తను పుట్టి పెరిగిన వాతావరణం, తను సముపార్జించిన జ్ఞానం, తద్వారా సమకూడిన అవగాహన ఇవేవీ ఆ వైయుక్తికతలో భాగం కాదా. ఇవేవీ భాగం కాని వైయుక్తికత ఒక పరిపూర్ణవైన అబద్దం కాదా. అవన్నీ భాగవైన వైయుక్తికతలో రాజకీయ అవగాహనలు మాత్రం భాగం కాకూడదా? అనుభవాన్ని వ్యక్థం చెయ్యడవే కాదు, అది మనకు అనుభూతమయ్యేటట్లు చేయటం కవిత్వం పని అని మనం ఒప్పుకున్నప్పుడు, ఏవిటా అనుభవం? జీవితానుభవే కదా? జీవితానుభవంలో సామాజిక, ఆర్ధిక, రాజకీయ సిద్దాంతాలు, ఆధ్యాత్మిక, మతపరవైన నమ్మకాలు ఒక భాగవే కదా. ఆ అవగాహన మాక్సిస్టు అవగాహనగా మాత్రం వుండకూడదా? ఏ మాక్సిస్టు అవగాహన సర్రియలిస్టు విజన్ని డెకడెంట్ అని ఈసడించిందో ఎవరైనా తెలియజేస్తే బావుణ్ణు. ఒక రాజకీయ అవగాహన మాత్రం చవకబారు కవిత్వానికి ఆలంబనైతే, ఈ సార్వత్రిక సాదృశ్యం, ఒక చక్కని పదం ఎంతచక్కగా గాల్లో కలసిపోతుందో కదా. “కవిత్వం మానానుభవాలకు సంబంధించినది. కాబట్టి జీవితానుభవాలకు సంబంధించినంతవరకు ఎవరికీ తెలియనదంటూ ఏమీ ఉండదు. విద్యా సంస్కారాల హెచ్చుతగ్గుల వల్ల, అధ్యాయన, అభ్యాసాల వ్యత్యాసాల వల్ల అనుభూతవైన విషయమే అయినా అది కొందరికి తెలిసినట్టు అనిపించదు. కవి చక్కగా చెప్పినప్పుడు అవునవును, ఎంత నిజం, ఎంత బాగుంది అని అనుకుంటారు.” అది అందరికీ తెలిసినదే అయినప్పుడు అది చెప్పే విధానంలో వైయుక్తికత వుంటుందేవో గాని, చెప్పిన నిజం సామాజికం కదా. ఆ సామాజిక అనుభవంలో ఒక భాగవే కదా బతుకు మీద ఆర్ధిక, రాజకీయ అవగాహన.
“అతివాదాలు – అర్ధసత్యాలు” లో ఏవంటారో చూడండి, “అసలు సృజనాత్మకతకి మూలమేమిటి? కవి యొక్క దర్శనం (vision). ఇది పూర్తిగా వైయిక్తికమైనది. ఏ కవి దర్శనం వానిది. దీన్నించే కవిత్వం ఉద్భవిస్తుంది.” కవికి ఆ దర్శనం ఎలా సాద్యమయింది. అంత పూర్తిగా వైయుక్తికవైన దర్శనం ఒక సార్వత్రిక సాదృశ్యాన్ని ఎలా ఆవిష్కరిస్తుంది? అంటే ఆ దర్శనాన్ని చేరడానికి ప్రతి కవీ తన మార్గంలో వివిధ దశల్లో జ్ఞానాన్ని ప్రోవు చేసుకుంటాడనమాట. తన చుట్టూ వున్న సమాజంనుంచి, ఆ సమాజంతో తన సంబంధాలనుంచి, ఆ సమాజంలో తను ఇంటరేక్షన్స్ నుంచి, అప్పటికే పుస్తకరూపవైన శాస్త్రలనుంచి, పాఠశాలలనుంచి, అమ్మల్నుంచి, నాన్నలనుంచి, ఇతరుల అనుభవాలనుంచి నేర్చుకున్న అనుభావాల్నించి, కవిగానీ కాకపోనీండి, ప్రతిమనిషి తన వ్యక్థిగతవైన అవగాహనని రూపొందించుకుంటాడు, అది వ్యక్తిగతవే అయినా ఇంకా దానికి సమాజంతో వున్న లింకులన్నీ తెగిపోవు. అందుకనే ఒకే ఇంట్లో పుట్టిన కవలలు కూడా ఇద్దరు వేరు, వేరు వ్యక్తులుగా పరిణితి చెందుతారు. కానీ సమాజంలో అందరి వ్యక్తులకు కొన్ని కొన్ని సిమిలారిటీస్ వుంటాయి. వైయుక్తికవనేది ఒక సాపేక్ష పదవే తప్ప అదేవీఒక పరిపూర్ణ స్తితి కాదు. వైయుక్తికత ఒక గొప్ప పదవే గానీ దాని మీదే అధార పడిన వాదాలు అర్థంలేనివిగానే నాకు తోస్తుంది. ఆ వాదాలన్నీ సామాజిక శాస్త్రవైన మాక్సిస్టు అవగాహనని త్రోసిపుచ్చడానికి, కించపరచడానికి ఉద్దశించినవిగానే నాకనిపిస్తుంది.
చలం చెప్పినట్టు కవిత్వాన్ని కొలవకండి, నచ్చితే అనుభవించి పలవరించండి. తూకం రాళ్ళు పట్టుకుని త్రాసు సరిచూసుకోవడం, మాక్సిస్టు కవిత్వవనో, కేపటలిస్టు కవిత్వవనో, త్రాగుబోతు కవిత్వవనో, తెల్లీ తెల్లని ఎసట్లో, ఉడికీ ఉడకని కవిత్వవనో, అన్ని లేబుల్సు అవసరవా? మనసుని త్రాకి, మీ గుండెని కదిలించగలిగితే చాలదా. ఆ ఒక్క లక్షణం వున్నప్పుడు అద్భుతవైన పదబంధాలు, గొప్ప గొప్ప వస్తువులు, సాంకేతికంగా అమర్చిన నిశ్శభ్దపు గందరగోళాలు అవేవిలేని మా ఊరి ఎర్రెంకడి పదాలు నారేత, కోతలరోజుల్లో ఏ గొప్ప కవి కవిత్వానికీ తీసిపోవని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.
రవికిరణ్ తిమ్మిరెడ్డి.
గరికపాటి పవన్ కుమార్
ఎన్నో కీలకాంశాలను చర్చించిన ఈ సమీక్షలో ఒక భాగమైన మార్క్సిజం విడిగా చర్చకు రావడం కొంత ఆసక్తి కరమైన విషయమే. అందుకు పాఠకుల మునుపటి అభిప్రాయాలు కారణం కావచ్చు. సరే అదలా వదిల్తే.
మార్క్సిజానికీ నాసి రకం సాహిత్యానికి సంబంధం ఉందని ఇస్మాయిల్ గారికీ, ఇంకా ఇలాంటి వారికి కొందరికీ, ఒక అభిప్రాయం ఉంది.
— ఆరి సీతారామయ్య
ఇది వ్యాసంలో ఎక్కడా ప్రతిఫలించలేదు కానీ ఇస్మాయిల్ గారు చెప్పదలుచుకున్నదేమిటంటే మార్క్సిజం మాత్రమే కవిత్వం లో ఉండాలని అనుకున్నప్పుడు చవక బారు కవిత్వం వచ్చిందని, పాబ్లో నెరుడా పేరుపడ్డ కమ్యూనిస్ట్ కవి, కానీ ఆయన ఆలోచనా పరిధి శిల్పాన్ని ఎన్నుకునేటప్పుడూ, కవిత్వాన్ని రచించేటప్పుడూ మార్క్సిజానికే అంకితమైపోలేదు. నా మట్టుకు అర్థమైంది ఏమిటంటే, కవిత్వాని ఎదైనా ఒక ఇజం లో బంధించాలని ప్రయత్నిస్తే పక్షి రెక్కలు కత్తిరించి పంజరంలో పెట్టినట్టే. అలాగే ఎవరి ఇజాలు వాళ్ళకున్నా కూడా చివరికి కవి కవి గా మిగలాలి అప్పుడు గొప్ప కవిత్వాన్ని సృజించగలడని అర్థమవుతూంది. “రవి కాంచని చోటు కవి గాంచును” అన్నది కదా నానుడీ, అంటే ఒక ఇజం అనే ప్రిజం లో బంధీ అయితే “రవి కాంచినది గూడా ‘ఇజానికి బంధీ’ అయిన కవి దర్శించలేడు” అని.
గరికపాటి పవన్ కుమార్
హెచ్చార్కె
ఆరి సీతా రామయ్య చాలా మంచి మాట చెప్పారు. అత్యవసరమైన మంచి మాట. అడ్డు గోడలు కట్టడం కాదు, ‘గోడలు పడగొట్టడం’ మన పని.
ఇస్మాయిల్, శ్రీశ్రీ, మరొకరు చాల గొప్ప కవులు. తాము పండించాల్సింది పండించి సెలవన్నారు. మనం మరింత గొప్పగా జీవించడం కోసమే వారిని గుర్తు చేసుకోవాలి. చదువుకోవాలి. ఏ ఒక్కరి దగ్గరా జీవితం ఆగదు, ఆగకూడదు. ఇస్మాయిల్/శ్రీశ్రీ రాసింది (ఆలోచించింది) శిఖరాగ్రం అయితే, అల్టిమేట్ అయితే, ఇక పయనం ఆగిపోవాలి. ఆ తరువాత పయనమంటే శిఖరాగ్రం నుంచి కిందికి దిగడం అవుతుంది. ఇస్మాయిల్‍ను/శ్రీశ్రీని నూటికి నూరు పాళ్లు ఆమోదించేట్టయితే, ఇక రాయడమెందుకు? ఇస్మాయిల్/శ్రీశ్రీ వున్నారుగా! అవే పుస్తకాలు మరి మరి చదువుకుంటూ వుండొచ్చు. కావాలంటే, ఆ కవిత్వంలోనే కొత్త కొత్త కోణాలు చూస్తూ భాష్యాలు రాస్తూ యుగాంతరాలు గడపొచ్చు. ఇక కొత్తగా ఎవరూ రాయక్కర్లేదు.
కవి పట్ల మోహం మంచిదే. వ్యామోహం హానికరం. ఏ కవి పట్లనైనా. ఏ వాదం పట్లనైనా. ఏ ‘ఇజం’ పట్లనైనా.
మన పెద్దలు మన నెత్తుల మీద దెయ్యపు భారాలుగా మారకుండా చూసుకోవాలి.
పుస్తకం చదవడం, ఇష్టపడడం గురించి భూషణ్ చాల బాగా చెప్పారు. అబ్బూరి వరద రాజేశ్వర రావు పుస్తకానికి ముందు మాట రాస్తూ అజంతా అన్న మాటలు గుర్తుకొచ్చాయి. ఒక మంచి పుస్తకం దొరికినప్పుడు…. చక్కగా స్నానం అదీ చేసి, మంచి మనస్సుతో, పూజకు కూర్చున్నట్లుగా కూర్చుని చదువుకోవాలని అన్నారు అజంతా. అంత ఇష్టంగా చదువుకోడం అంటే అంత ఇష్టంగా జీవించడమే.
ఔనూ, ‘వచన కవిత్వం’ గురించి ఇస్మాయిల్ చెప్పింది ఇదమిత్థమైన అర్థాన్ని ఇస్తోందా? నిజానికి ఆయనే ‘లిరికల్’ స్పర్శ వున్న (‘తరుచాపము వీడిపోయి/గురి మరిచిన బాణంలా/ తిరిగాడును పిట్ట) కవిత్వం రాశారు, చక్కని వచనంతో కవిత్వమూ రాశారు. తాత్విక ప్రకటనలు అన దగ్గ కవిత్వం రాశారు. అచ్చపు సంఘటనలు అనదగ్గ కవిత్వమూ రాశారు. వచన కవిత్వం మీద ఆయన మాటలు ఒక కవిగా ఆయన విచికిత్సను తెలియజేసినంతగా ఆయన నిర్ధారిత అభిప్రాయాల్ని తెలియజేయవు. నిర్ధారిత అభిప్రాయం తెలియజేసేంతగా ఆయన ఆలోచించలేదు, అది ఆయన వుద్దేశమూ కాదు.
మహా ప్రస్థానం తరువాత శ్రీశ్రీ కవితను ‘దసరా పద్యాల’ని ఇస్మాయిల్ అంటే, ఓహ్, ఈయన కూడా పనికి మాలిన చాపల్యాలకు అతీతుడు కాడే అని బాధ పడాలి గాని, ఆ హేతు విరుద్ధమైన మాటను నిర్విమర్శకంగా తలకెత్తుకోనక్కర్లేదు. అది పారుష్యం కూడా కాదు. వఠ్టి చెడ్డ మాట.
సి. ఎస్. రావు పుస్తక పరిచయ వ్యాసం చాల బాగుంది. అవసరమైన సమ తూకం వుంది. వ్యాసం నిన్న రాత్రి నిద్రపోవడానికి ముందు చదివాను. రాత్రంతా, మంచి కలల్లాగ, సి.ఎస్. రావు గారి మాటలతో మేల్కొన్న ఆలోచనలే. థాంక్యూ వెరి మచ్, సర్!
తమ్మినేని యదుకుల భూషణ్.
మొదట మనకు ఒక పుస్తకం నచ్చాలి .అటు పిమ్మట ఆ పుస్తకాన్ని శ్రద్ధగా పలుమార్లు పదే పదే చదవాలి.
అప్పుడుగాని –ఆ పుస్తకం వంతెనలా మారి ,రచయితకు మనకు మధ్య ఉన్నదూరం తొలగిపోదు;రచయిత
అనుభవించి పలవరించిన అనేక విషయాలు మన మనసుకు అనుభూతమై మన ఆత్మను తాకవు;మన
అంతరంగం కాంతివంతమై మన ఆలోచనలు వెలిగిపోవు. ఆ క్షణాల్లోనే , ఎప్పుడూ ఏదో ఒక వస్తువును పట్టుకొని
వేలాడే మనసు కొంత తేలిక పడి కొంత ఆనందాన్ని అనుభవిస్తుంది.అటువంటి రసమయ ఘడియల్లోనే
ఎవరికైనా ఏమైనా రాయాలి అనిపించేది.కాబట్టి ఒక మంచి పుస్తకం మన జీవితాన్ని వెలిగిస్తుంది.(ఒక మంచి
పుస్తకం చదవక పోతే మనం జీవించనట్టే. లేదా ఒక చెడ్డ పుస్తకాన్ని చదివామంటే మరణించినట్టే.)
ఇటువంటి అనుభవానికి లోనై చేసిన సమీక్ష కాబట్టే, గ్రంథకర్త ఆత్మను పట్టుకురాగలిగింది. అంతేకాక
అత్యంత సూక్ష్మమైన అంశాలను చర్చకు తీసుకు రాగలిగింది.(ముఖ్యంగా వచన కవిత్వం దాని
పూర్వాపరాలు లాంటి విషయాలు).ఉడికీ ఉడకని వచనంతో నానా రకాలుగా బాధించే మహా
రచయితలున్న ఆంధ్రావనిలో ఇంటికి పిలిచి విందు భోజనం పెట్టడం ఎంతో ఆనందం కలిగించే విషయం.
ఆరి సీతారామయ్య
సాహిత్యంలో రెండు రకాలు: మంచి సాహిత్యం, నాసి రకం సాహిత్యం. మంచి సాహిత్యం ఏదో నాసి రకం సాహిత్యం ఏదో చెప్పటం అంత సులభం కాకపోయినా, వాటి మధ్య తేడా చదవగానే దాదాపు అందరికీ వెంటనే తెలిసిపోతుంది.
మార్క్సిజానికీ నాసి రకం సాహిత్యానికి సంబంధం ఉందని ఇస్మాయిల్ గారికీ, ఇంకా ఇలాంటి వారికి కొందరికీ, ఒక అభిప్రాయం ఉంది. ఇలాంటి వాదనకు మంచి ఆధారాలు ఉంటే ఇది మంచి వాదనే. కాని ఇంత వరకూ అభిప్రాయాలేగాని ఆధారాలు నేను చూడలేదు. పైగా మార్క్సిస్టులు కాకపోతే బాగా రాసేవారు అనో, మార్క్సిస్టులు కాకముందు బాగా రాసేవారు అనో వ్యాఖ్యానించేవారి అభిప్రాయాల వెనుక సాహిత్యం మీద ప్రేమ కంటే, మార్క్సిజం మీద వ్యతిరేకతే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. నిజంగా సాహిత్య ప్రేమికులైతే చెత్త సాహిత్యం ఎవర్రాసినా తెగడాలి. చెత్త సాహిత్యం మార్క్సిస్టులూ రాస్తున్నారు, మార్క్సిస్టేతరులూ రాస్తున్నారు, మార్క్సిస్ట్ వ్యతిరేకులూ రాస్తున్నారు. కాని ఈ పెద్దలకు మిగతా వారి చెత్తతో ఎలాంటి ఇబ్బందీ ఉన్నట్టు లేదు.
ప్రజా సమస్యల గురించి రాయకూడదు అనేది కూడా ఒక సిద్ధాంతమే. సమస్యల గురించి మాత్రమే రాయాలి అనే సిద్ధాంతానికీ దీనికీ పెద్ద తేడా లేదు. ఎటొచ్చీ అసలు విషయం బాగా రాయటమా లేదా అన్నదే. దానికీ మార్క్సిజానికీ ఎలాంటి సంబంధమూ లేదు.
గరికపాటి పవన్ కుమార్
ఎంచుకున్న పుస్తకాన్ని పరిమితులలో వివరిస్తూనే, కీలకాంశాలన్నిటిని చక్కగా పట్టుకొచ్చారు సి. యస్. రావు గారు. వ్యాసంలోని ప్రతీ వాక్యం “కవిత్వంలో నిశ్శబ్దం” పుస్తకం గురించే ఐనా ఇస్మాయిల్ గారి హృదయాన్నెరిగి రాసినవని చెప్పకనే చెపుతున్నాయి.
అనర్గళంగా జాలువారిన వాక్యాలు “ఇస్మాయిల్ గారిలో గొప్ప మేధాసంపత్తి ఉంది. నిశిత విమర్శనాశక్తి ఉంది.శంకించటానికి ఏ మాత్రం వీలులేని,నిష్పాక్షికత ఉంది ……….” ఎంతో గొప్ప అనుభవాన్ని కలిగిస్తున్నాయి.
ఇటువంటి కాలాతీత పుస్తకాలకు ఎన్ని సమీక్షలొచ్చినా, ఎన్ని సార్లు చదివిన ప్రతి సారీ కొత్త భావాలు మారాకులేస్తూనే ఉంటాయి.
ఈ వెలలేని ముత్యాన్ని అందించిన సి. యస్. రావు గారికి నా నమస్కారములు. మీ కలం నుంచి మరిన్ని సమీక్షలు వెలువడాలని కోరుకుంటూ…
ఇట్లు
గరికపాటి పవన్ కుమార్
దుప్పల రవికుమార్
చక్కటి పుస్తకానికి చక్కటి పరిచయం.
బొల్లోజు బాబా
thank you sir