నింగికి దూరంగా… నేలకు దగ్గరగా…
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
********
అవధానుల మణిబాబు గారి నాన్న పాప, నేనిలా తానలా కవితాసంపుటాలను ఇప్పటికే పరిచయం చేసుకున్నాం. ఆ సంపుటాలు ఒక్కోటి ఒక్కో వస్తువు చుట్టూ తిరుగుతూ ఆ వస్తువు తాలూకు అనేక రకాల అనుభవాలను, అనుభూతులను అందించాయి. ఈ కవితా సంపుటి వివిధ కవితా వస్తువులతో మనల్ని పలకరిస్తుంది.
దూరంగా కనిపించే నింగి ఆచ్ఛాదన కింద ఒదిగిన కవి తాను నిలబడిన నేలంతగా తన కవిత్వాన్నీ సహజీకరించాడని ఈ సంపుటి పేరు చెపుతున్నట్టుంది.
ఇందులో ఉన్న వస్తు వైవిధ్యం ప్రత్యేకమైనది. కొందరు ప్రసిద్ధ సాహితీ మూర్తులను మన కళ్ళ ముందు నిలబెడతాయి. వారివారి ప్రత్యేకతలతో వారు పాఠకులను పలకరిస్తారు.
“పాపిట్లో సిందూరం మణిబాబు కవిత్వం” అంటూ ఈ సంపుటి గురించి వివరంగా ముందుమాటలో చెప్పారు శిఖామణి.
ఒక మౌనవాక్యాన్ని రాసే క్రమంలో ఇదిగో ఇన్ని హృద్యమైన శబ్దాలు పోగుచేసి పంచుతున్న మణిబాబుకి అభినందనలంటారు ఆఖరి పేజీలో వసీరా.
ఈ సంపుటిలో 48 చిన్నా, పెద్దా కవితలున్నాయి.
సాయంకాలమైంది కవిత కవి జీవితంలో దశాబ్దకాలం నాటి సాయంకాలాల్ని అపురూపంగా తలుచుకుంటుంది. డా. అద్దేపల్లి వారి సమక్షంలో మిత్రుల మధ్య గడిపిన అందమైన సాయంకాలాలు చదువరిని కూడా గతకాలపు పట్టాలెక్కించి, అక్కడికి చేర్చేసి ఆ కవిత్వలోకంలో కూర్చోబెడతాయి. అవయవ దానం గురించి చెప్పిన మృత్యోర్మా అమృతంగమయ ఒక్కడిగా లోకం విడిచినా విభిన్న దేహాలలో విస్తరించమంటుంది. జీవితానంతరం కూడా బతుకుని సార్థకం చేసుకొమ్మంటుంది.
“అదేవిటో ఇంత వయసొచ్చినా నాకు ఆల్బం చూడడం రాలేదం” టూ ఆల్బం కేవలం జ్ఞాపకం కాదు, ఎంతసేపైనా ప్రదర్శించుకోగలబ్రతుకు రూపక మంటుందో కవిత.
శవ దర్శనం కవిత అలాటి సందర్భంలో నువ్వెంత ఆత్మీయుడివైనా అవతలివారు తేలికయ్యేవరకూ ఏడ్చేందుకు తీరికనిమ్మంటూ, అసలందుకే ఓ రెండు నిముషాలు మౌనం పాటించమనేదంటారు. ఎంత చక్కని వ్యాఖ్య! ఆ సందర్భాలు ఎవరికైనా ఎదురయ్యేవే. సాటివారి కన్నీళ్ళు మనవేనన్నంత తీవ్రంగా కదిలించే బాధాకర సన్నివేశాలు.
క్షణాల్లో కలల పానీయాన్ని సృష్టిస్తూ, దశాబ్దాల ఇంద్రజాలంతో గ్లాసులు నింపుతూండే డ్రింకుల బండి తాత తన బాల్యాన్ని వర్తమానంతో ముడివెయ్యటాన్నిఇష్టంగా తలుచుకుంటాడు కవి.
“జట్టులో నువ్వొక్కడివే మిగిలినపుడు కూతకెళ్ళొచ్చి, మోకాళ్ళపై చేతులుంచి ఊపిరి లాక్కుంటున్నట్టు” ఓ కవితను రాయవూ అంటాడు స్నేహితుడిని. కవిత్వం చెప్పటం అంత సులువైన విషయమేం కాదుసుమా, అది నీదే అయిన వ్యక్తీకరణ అయితీరాలంటాడు కవి. “అయిపోయింది ఇక పారేద్దామనుకున్నాక ఓ సారైనా వెలుగు ముద్దలు రాల్చే మతాబులా బతికి చూపాలని నేర్పిం” దట దీపావళి!
సెలవు పాఠాలు సెలవులంటే పిల్లలకి ఒఠ్ఠి ఆటలే జ్ఞాపకమొస్తాయి. కానీ, ఆ రికామీ రోజుల్లో తిన్న తిళ్ళు, విన్న కథలు అంత మాత్రమే కాదట. వాటి వెనుక తరచి చూస్తే నేర్పిన జీవిత పాఠాలు తక్కువేం కాదంటాడు కవి.
రోజంతా రెండు రాటల మధ్య గెడ మీద బతుకు పోరాటం చేసిన పసిపిల్ల రాత్రి కోతిపిల్ల పక్కనే నిద్రపోతూ మళ్ళీ మళ్ళీ రేపటి ఆటలో దొరికే మరింత చిల్లరని, అమ్మ పెట్టే వేడన్నాన్ని కలకంటుందట! కవిత చదువుతుంటే ఆ పసిపిల్ల కంటి ముందు ప్రత్యక్షం కాక మానదు. విద్యలన్నీ పొట్టకూటికే అన్నా బాల్యం బాధ్యతను తలకెత్తుకోవలసి రావటం దిగులు పుట్టిస్తుంది. దిష్టికో, దేహపుష్టికో ఖర్చైపోకుండా సాగులోనూ, సాహిత్యంలోనూ మొలకెత్తగల గింజలు భవిష్యత్తు కోసం మిగలాలంటాడు.
ఎలాగైనా ఆ సెలవురోజు పుస్తకాల గూడు సర్దాలన్న ఆశ కవికి తీరనేలేదంటాడు. అవును, ఏ పుస్తకాన్ని ముట్టుకున్నా అది చెప్పే కథ అంతటితో అయ్యేది కాదు. అది ఎక్కణ్ణుంచి ఎక్కడిదాకా తీసుకెళ్తుందో చెప్పటం కష్టం. ఈ అనుభవం పుస్తకాల్ని ప్రేమించే వారందరిదీ!
ఆర్. ఎస్. వేంకటేశ్వరరావు గారు, మధునాపంతుల దంపతులు గురించి చెప్పిన కవితలు వారి వ్యక్తిత్వాల్ని పట్టిస్తాయి. అందమైన, అరుదైన కవితలు. అలాగే గాంధీజీ, కందుకూరి గురించిన సంగతులు కూడా.
జ్వరం, బదిలీ, కునుకు, కృతి వాళ్ళ డాడీ కవితలు ఎంత వ్యక్తిగతమో, అంత సార్వజనీనం అనిపిస్తాయి. చాలా అందంగా చెప్పిన సున్నితమైన కవితలు. కవిత రాసుకోవటాన్ని ఎంతో సులువైన మాటల్లో చెప్పేసింది కవి సహచరి ఇంతేకదా… కవితలో. నిజమే మరి, కవిత్వపు వాసనల్ని ఇంటి నాలుగు మూలలా నిత్యమూ ఊపిరితో పాటు పీలుస్తూనే ఉన్నట్టుంది.
ప్రగతి కోరని ప్రాంతం వైపు కవిత మనసును బరువెక్కిస్తుంది. ఇటీవల కాలంలో మన రోడ్లు విశాలంగా, మరింత సౌకర్యంగా వాహనదారులకి అందమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. కానీ రోడ్డెక్కిన ప్రతిసారి మునుపు ఆ మట్టిరోడ్డు వారన కనిపించే చిన్నచిన్న దుకాణాలు మాయమవటం మనసులో మెదలక మానదు. ఆ చిన్న వ్యాపారులు, వాళ్ళ వెనుకనున్న కుటుంబాలు ఏమైపోయి ఉంటాయో అర్థం కాదు. ఉన్న ఊరిని, ఇంటిని దేశాభివృద్ధికి ధారపోసాక వాళ్ల జీవితాలు ఎంత ధ్వంసం అయి ఉంటాయి? నిలువనీడ, సంపాదించే మార్గం కనిపించక రోడ్ల పాలైన ఆ జీవితాలు ఎలాటి దారులు పట్టాయన్న ఆలోచన ఊపిరాడనివ్వదు. ఇదంతా అభివృద్ధి! ఎవరి అభివృద్ధి? ఎవర్నడగాలి?
సంగీత యానం ఎందరెందరో అద్భుత సంగీతకారులను మనలోకి ఒంపుతుంది. ఆఖర్న బస్సు దిగి ఇయర్ఫోన్స్ తీసిన కవికి మాత్రం ఒక్క టికెట్ మీద ఇంతమంది ప్రయాణం చేసామన్న అపరాధ భావననిస్తుంది. గమ్మత్తైన భావం! చదివినంతసేపూ హాయిగా సంగీత లోకంలో విహరింపచేస్తుందిది. వంద అడుగుల వ్యాసపీఠం గొప్ప కవిత.
అచ్చం అలాగే కొన్న దాలియా మొక్కని ఇంటికి తీసుకొస్తుంటే కవి భుజాన్నానుకుని నిద్రపోయిందట పువ్వు. బహుశా ఆ దారివెంట కవి తన పాప తో కలిసి వెళ్ళటం చూసే ఉంటుందంటాడు. ఎంత సున్నితమైన భావన! ఇంతకీ కవి మనోలోకంలో పాప ఎప్పుడూ తోడుగా ఉంటూనే ఉంటుంది కాబోలు.
అవునవును కవితలో పదవినోదం పూర్తి చేసేందుకు నాన్నకి సాయం చేస్తూ, జీవితానికి అర్థాన్ని పాప ఇట్టే చెప్పేసింది, జీవితం మనకు నచ్చినట్టు కుదరదని, మొదలు, చివర ముందే ఫిక్సయిపోతాయంటుంది. ఆ చిన్నారి మాటల్లో తాత్త్వికత నాన్నకి అర్థమైపోయింది.
మాటలే చేతనైతే పిల్లాడి చేతికి చిక్కిన పింగాణీ టీ కప్పు, వీధిగేటు వంటివన్నీ తమ జీవితాల్ని బహుళార్థసాధకంగా మార్చినందుకు పిల్లలకి కృతజ్ఞతలు చెపుతాయంటుంది కదా కవిత! నిజమే. పిల్లల చేతికి చిక్కిన ఏ వస్తువైనా తన జీవితం ధన్యమైందనుకోక మానదు. ఆ నేర్పు పెద్దలెప్పటికీ నేర్చుకోలేరు పాపం!
తెలవారి లేచేసరికి పూలైన మొగ్గల్ని చూసి వికాసం అంటే ఇంత సులువా అనుకుంటాడు కవి. ఇంతకీ ఆ పువ్వులు రాత్రంతా నిద్రే పోలేదట! ఆ క్షణాన వికాసానికి చెయ్యవలసింది ఎంత గొప్ప త్యాగమో అసలు సంగతి కవికి స్ఫురణకొచ్చింది.
అంతే రాలిన చింతకాయల్ని పిల్లలేరుకుంటుంటే పెద్దలు పక్షులకు గింజలు జల్లుతున్నారట. పొందాలనుకోవటం బాల్యమైతే, పంచివ్వాలన్నది పెద్దరికమట. ఇంత సహజమైన విషయం పిల్లలకీ, పెద్దలకీ అమరితే ఎంత బావుణ్ణు.
దైనందిన ప్రపంచంలో తనచుట్టూ ఉన్న అనేకానేక విషయాల్ని అవి ప్రకృతికి సంబంధించినవైనా, సామాజికమైనా, వ్యక్తిగతమైనా సూక్ష్మంగా పరిశీలించే కవి తన ఆలోచనల్ని, అనుభూతుల్ని చిన్నచిన్న సులువైన మాటలతో కవిత్వీకరించి అందించటం ఈ సంపుటికి నిండుదనాన్నిచ్చింది. కవిత్వపు రూపు తొడుక్కున ఆ వస్తువులన్నీ ఇప్పుడు మన కంటికి కొత్తకొత్తగా కనిపిస్తాయనటంలో ఆశ్చర్యం లేదు. ఈ సంపుటిలో కవిత్వపు సాంద్రత ను మించి నిండైన శిల్పం కవితలన్నిటా చుట్టుకుంది. మణిబాబు గారికి అభినందనలు.
ప్రచురణః December 2023
ప్రింటింగ్ః కలిమిశ్రీ
ధరః 180/-
Leave a Reply