నేనిలా… తానలా… దీర్ఘకవిత

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

*****

ఈ శీర్షిక చూస్తుంటే ఒక కుతూహలం మన మనసుల్లోకి రాకపోదు. ఎక్కడెక్కడో మాగన్నుగా నిద్రపోతున్న సున్నితమైన భావనలు నెమ్మదిగా ఎవరో తట్టి లేపినట్టు ఉలికిపడి లేస్తాయి. మనసంతా వర్షంలో ఇష్టంగా తడుస్తున్న భావం! 

కవి తనకెంతో ప్రియమైన వారి గురించి మురిపెంగా చెప్పుకుంటున్నాడు కాబోలు! పుస్తకంలోకి వెళ్తూనే మన ముఖాలపై నవ్వు పూలు పరుచుకుంటాయి. నిజమే, కవి తన ప్రేమిక గురించే చెపుతున్నాడు. కవి స్వేచ్ఛ ని ప్రశ్నించేదెవరని? అందులోనూ ప్రేమలో పడితే…

కవి సంగతి సరే, ప్రకృతి మాటేమిటి? అది ఎవరినీ కుదురుగా ఉండనివ్వదు కదా. తన వన్నెచిన్నెలన్నీ కురిపించి ఎందరెందరినో మాయలో పడేస్తూనే ఉంటుంది. యుగయుగాలుగా పడేస్తూనే ఉంది. ఋతువులను బట్టే కాదు, క్షణక్షణమూ తన రూపు మార్చుకునే ఆకాశం, దానికి రంగులద్దే ఉషోదయాలు, సంధ్యోదయాలు, అడవులు, కొండలు, సముద్రం…

అనాదిగా మనిషిని మోహావేశంలో ముంచేసే ప్రకృతిని మించిన ప్రేరణ, ప్రేమిక ఎవరూ ఉండరన్నది మళ్లీ మళ్లీ నిరూపించబడిన సత్యమే. పరిధులెరుగని ఆకాశంలో రెక్కలు విప్పి హాయిగా ఎగిరే పక్షితో పోల్చదగ్గది కాదూ కవిమనసు?! అయినా, అది గమ్యం ఎరగక ఎక్కడెక్కడికి, ఎలా, ఎందుకు పరుగులెడుతుందో, లోలోపలి ఏయే భావోద్వేగాల్ని మన కళ్ల ముందు దృశ్యాలుగా ఆవిష్కరిస్తుందో ఎవరికి తెలుసని?! తన లోపలి ఊహలు, ఆలోచనలు అక్షరాలై కాగితం మీదకి ఒలికినప్పుడే కవికైనా అవగాహనకొచ్చేది. తనవైన అనుభవాల్ని, అనుభూతుల్ని ఉదారంగా పంచుతూ, తన కవిత్వంలోకి తొంగిచూసేవారిని కూడానడిపించే కవి ఒఠ్ఠి నిష్కామ యోగి! చుట్టూ ప్రపంచాన్నంతా కవిత్వంతో మరింత రంగులమయం చేసే వారు ఎంత ధన్యులు! 

పుస్తకం ముందు పేజీలో కవి మణిబాబు తనవో రెండుమాటలు వినిపించాడు. తనకి పసివాడుగా ఉన్నప్పుడే సముద్రంతో ఏర్పడిన బాంధవ్యం చెప్పుకొచ్చాడు. అప్పుడే ఉప్పాడ సముద్రాన్ని తనదిగా చేసేసుకున్నాడట. అది ఆకర్షణతో పాటు ఆవేదనకూ గురిచేసిందట.

అప్పుడెప్పుడో సముద్రం చూసేందుకు వెళ్లినప్పుడు సముద్రంలో ఉంగరం పారేసుకున్నాడట. ‘’సముద్రం ఏదీ ఉంచుకోదండీ, తిరిగి ఇచ్చేస్తుం’’దని ఓదార్చారట చుట్టుపక్కలవారు.

ఇంతకీ ఆ సముద్రం ఈ దీర్ఘ కవితనే ఇచ్చేసిందని చెపుతూ, సముద్రం ఇవ్వనిదేముంటుందంటాడు! ఎలా కాదనగలం?

యథాలాపంగా చూసి పోదామనే వెళ్లాడట, తీరా ఉప్పుగాలి ఏమైనా రాసి పొమ్మందిట. సముద్రం భలే గడుసరి! అయినా తాను మాత్రమే సముద్రగాలికి సొమ్మసిల్లి పోలేదని తనకంటే ముందుగానే ఆ అనుభవాన్ని చూసిన అద్దేపల్లి వారిని, గరికపాటి వారిని, వద్దిపర్తి వారిని, గ. నా. రా. ను కూడా చెప్పుకొచ్చాడు కవి. ధీటైన కవి గడుసుదనం చూసారా? 

తన బాల్యం చుట్టూ అల్లుకున్న సముద్రాన్ని, నాన్నపైన మేకపిల్లై ఏరును దాటిన వైనాన్ని, ఇంకేవేవో మురిపెంగా చెప్పబోతే,

“ఇవన్నీ మామూలు విషయాలే, కానీ కొత్తగా ఇంకేదైనా చెప్పవోయ్” అంటూ కవ్వించిందట సముద్రం. 

బాల్యంలో ముద్ర పడిన ఆ జల సౌందర్యం కౌమార, యౌవనాల్లో తనని మరింతగా వివశుణ్ణి చేసిందంటాడు. భావనారాయుణ్ణి కలిపేసుకున్న ఉప్పాడ సముద్రంతో పాటు తాను జంటగా చేసిన సముద్ర దర్శనాలనూ చెపుతాడు. ఏమీ తోచకపోయినా, మనసు భారంగా తోచినా, సంఘర్షణలో పడినా కారణం వెతికి మరీ సముద్రాన్ని చూసొచ్చానంటాడు నిజాయితీగా.

కవి పౌరుషానికి సముద్రం నవ్వి, “సరదాగా అన్నాలే కానీ, తైరేవ విన్యాస విశేష భవ్యై” అన్నది నాకు తెలియదా అంటూ ఒప్పుకుంది. అవును, ఏది జరిగినా, ఏమి జరిగినా అంతా మంచేనంటుంది.

ఐనా… నేనంటే అసలు ఎందుకంత ప్రేమ అంటూ కొసరుతుంది. 

తనను ఎపుడు నిద్రపోనిచ్చిందీ సముద్రం అంటూ బేలగా ఒప్పేసుకుంటాడు కవి తన బలహీనతని. అమ్మ, అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పిన పురాణ కథలన్నీ సముద్రం చుట్టూనే కదూ. పాల సముద్రం ఒకటుండేదట! మరి తోడు పెడితే అది పెరుగవుతుందా? ఉప్పు సముద్రంతో కలిస్తే విరిగిపోతుందా? బాల్యపు సందేహాలు… 

అట్లాసులోనూ, గ్లోబులోనూ కూడా నీలపు రాశి ఆ సముద్రమే కదూ ఆకర్షణ. భూగోళమే నేమిటి, ప్రతి శాస్త్రమూ సాగరమేనట. చదువుల్లో సరే, సాహిత్యంలోనూ సముద్రమే. ఇవన్నీ విని, చదివిన తర్వాత నిద్రెక్కడిదంటాడు కవి. కవిని మించిన నిరంకుశుడెవరులే అని సముద్రమూ నిట్టూర్చింది. 

ఉండబట్టలేక సముద్రానికి తానంటే ఎందుకంత ఆపేక్ష అని కవీ అడిగేసాడు…

“నువ్వు నా సంక్షిప్త రూపానివి, నేను నీ సమగ్ర రూపాన్ని” అంటుందది. దగ్గరగా ఒకలాగా, దూరంనుంచీ ఒకలాగా కనిపించే సముద్రాన్ని అన్నన్ని నటనలు ఎందుకంటే, మీ మనుషులు మాత్రం దగ్గరగా ఉన్నప్పుడు ఒకలా, దూరమైతే మరోలా ఉండరూ అంటుంది.

కవి క్షీరసాగర మథనం గురించి మాట్లాడితే, నువ్వూ సాగరానివే, మథించి ఆత్మజ్ఞానాన్ని దొరకపుచ్చుకోమంటూ సముద్రం హితవు! ధనుష్కోటిలో ఆ రాళ్లెందుకు తేలుతాయంటే సాంద్రమైనదాన్ని వదులుకుని, గుండె ని మెత్తబరచుకుంటే నీకూ సాధ్యమేనంటూ ఉద్బోధ!  

 బ్రతుకంటే ఎన్నెన్నో చక్రాల భ్రమణాలంటూ తరిమే వారికోసమో, తోటి వారికోసమో నువ్వైనా, నేనైనా సాగిపోవాలంటుంది. సముద్రమా, ఇంత ప్రశాంతతెక్కడిది నీకు అంటే ఇదంతా పైపై నటనలే నంటుంది. లోలోపల బడబానలాలంటూ నీకూ, నాకూ నిశ్చలత్వం, నిర్మలత్వం సాధ్యమే? అంటుంది.

మనిషి దాహాన్ని తీర్చలేని రుచిని మార్చుకుని తనువంతా తీపి నింపుకోమని సముద్రానికి చెప్పబోతే,

‘’స్వార్థపరుడా, ప్రకృతి అంతా నీ కోసమే అనుకుంటున్నావా’’ అని కోప్పడుతుంది. తాను ఉప్పునీట బతికే జీవులకోసమంటూనే, ఉప్పునీటిని మంచినీటిగా అనువదించుకునే మనిషి సామర్థ్యం తనకు తెలుసంటుంది. 

సముద్రమూ, కవీ సరైన జోడి కదూ.

చెలియలి కట్టవరకే తరమగలదు అని సముద్రాన్ని తక్కువ అంచనా వేసాడు కవి. ఉహు, అది మైళ్ల దూరంలో ఉన్నా తరమగలదని ఉస్సురుమంటాడు నిస్సహాయంగా.

తెలియక సముద్రస్నానమంటాం కానీ అది అంతరాంతర జ్యోతిస్సీమల అపూర్వ సందర్శనం అంటూ తలవంచి ఒప్పుకుంటాడు. సముద్రపొడ్డున మౌనంగా గడిపిన ప్రతిసారి గొప్ప సంభాషణ ముగించిన అనుభూతిని పొందే కవికి సముద్ర పిపాస తీరేదెలా? తననుంచి విడివడేందుకే సముద్రం దగ్గరకెళ్తానంటాడు.

సముద్రాన్ని ఓ వ్యాపారకేంద్రంగా, రణరంగంగా, కార్యక్షేత్రంగా, విలాస స్థానంగా ఎవరికి ఏం కావాలో అదిచ్చి, ఎవరినీ నిరాశ పరచని సముద్రాన్ని అర్థం చేసుకున్నాననుకుంటాడు. సముద్రం కూడా అభినందిస్తుంది. నువ్వు, నేనూ కూడా శబ్దాలు, నిశ్శబ్దాలు, ముత్యాలు, మాలిన్యాలు, ఆటుపోటులు కాదా అంటాడు కవి.

రోజూ చూసే బిడ్డ పట్ల వాత్సల్యంలా సముద్రం పట్ల తన తపన తీరేది కాదంటాడు కవి. ‘ఎంతో సన్నిహితమైనదానవే అయినా మరెంతో అపరిచిత’వంటాడు.

“ఏదైనా సందేశం ఇద్దూ’’ అని కవి సముద్రాన్నడిగితే,

‘’నాలో ఉన్నట్టే నీలోనూ అవాంఛనీయతలున్నాయి, వాటిని పరిధి దాటనీయ’’ వద్దంటుంది. సమాజం నిర్ణయించిన నిర్దిష్ట రేఖాంశాలు, అక్షాంశాల మధ్య ఉనికిని సరిచూసుకొమ్మంటుంది. తుఫానులు నిలువరించినపుడు వెనకడుగు తప్పదంటూనే, అది పలాయనం కాదంటుంది నమ్మకంగా. సముద్రం చెప్పిందంతా ఆచరిస్తానంటాడు కవి. 

సముద్రాన్ని ‘’ఇంకేదో చెప్పాలానుకుంటున్నావా’’ అంటే,

తరాలుగా తన సౌందర్యాన్ని సాహిత్యంలోనూ, ఛాయాచిత్రాల్లోనూ బంధించిన మనిషి ఇప్పుడు ప్లాస్టిక్ నింపుకున్న జలచరాల్ని, వాటి అసహాయ మృత్యువునీ చూస్తూ పర్యావరణ సదస్సుల్లో జాలి కురిపిస్తున్నాడంటుంది సముద్రం. నా విలాపాన్ని గురించి రాసే ‘’కరుణశ్రీ’’ ఎవరైనా ఉన్నారా అని దిగులుదిగులుగా అడుగుతుంది. 

ప్రగతి పేరుతో, మనిషి సుఖవిలాసాలకు తన అంతర్భాగాన్ని ఛిద్రం చేస్తున్నారంటుంది. తన సమ్మతి అడగకుండానే క్షిపణి ప్రయోగాలట తనలో. ఆ హక్కెవరిచ్చారంటుంది. విశాల సముద్రతీరంలోనూ కూర్చునే స్థలం కోసం వెతుక్కునే పరిస్థితి. పండుగలకీ, పబ్బాలకీ సముద్రస్నాం పుణ్యప్రదమనే వాళ్లే ఇప్పుడు సముద్రపు నీరు స్నానాలకు అనువైనది కాదన్న హెచ్చరికల్ని తీరం వెంబడి నాటుతున్నారు.

ఈ సందర్భంలో కవి “ఆఫ్ షోర్ డ్రిల్లింగ్, నేవిగేషన్ సోనార్, మినిమిటా, ఇటై ఇటాయి” వంటి పదాల్ని పరిచయం చేస్తారు. (ఈ పదాల వివరాలను పుస్తకం చివర ఇవ్వటం బావుంది.)  

సముద్ర గర్భం విషతుల్యం అయితే అది మానవాళిని రోగగ్రస్తం చెయ్యకమానదు. సునామీలని, భూకంపాలని సృష్టిస్తుంది. ఇదంతా నిర్లిప్తంగా నిలబడి చూస్తున్న మనిషి అర్థం కాడంటుంది. అసలు ఇంత ఘోష ఎందుకు? భూమి పై ఉన్న నీరంతా మృత సముద్రమే అంటూ దుఃఖిస్తుంది సముద్రం. 

యుగాల నాడు ప్రకృతి అంతా సముద్రమే అయినప్పుడు భూమి నీటిలోంచి విడిపడి తనకో అస్తిత్వాన్ని రచించుకుంది. తిరిగి నెమ్మదినెమ్మదిగా అది సముద్రగర్భంలో కలిసిపోయే సమయం ఎంతో దూరం లేదంటుంది. ఆపైన తన గోడు వినిపించేందుకు మనిషి దొరకడని, తలబాదుకుందుకు ఒడ్డూ మిగలదంటుంది. ఎంత దీనావస్థ!

“మంచి మిత్రుని దగ్గర దాచలేకపోయాను కానీ సముద్రమంత నా బాధ నువ్వు మాత్రం ఏం తీర్చగలవు” అంటూ సెలవు తీసుకుంది సముద్రం.

బాల్యమంతా సముద్రతీరంలో పెరుగుతూ దానితో ఒక ఆత్మీయతను, స్నేహాన్ని అల్లుకున్న కవి మణిబాబు! తన సుఖదుఃఖాల్లో ప్రియనేస్తంగా మెలిగిన సముద్రం ఎన్ని తీపి జ్ఞాపకాల్నిచ్చిందో! అంతలోనే అది పడే మరణయాతన ఆ సున్నితమైన హృదయాన్ని ఎంత గాయపరిచిందో!

35 పేజీల దీర్ఘకవిత సముద్రమంత భావం అందించింది. 

కవి మణిబాబు కు అభినందనలు. 

పుస్తకం ధర: రూ 80 /- 

ప్రచురణ:  కలిమిశ్రీ, డిసెంబరు, 2019

You Might Also Like

Leave a Reply