నాన్న … పాప … – అవధానుల మణిబాబు
వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ
***********
ఈ కవితా సంపుటి పేరు చూసారా? “నాన్న… పాప… “ఆ పేరు చదువుతూనే మన కంటెదుట ఒక నాన్న, ఒక పాప కనిపిస్తున్నారు కదూ.
ఒక నాన్న తన పాప గురించి ఏదో చెపుతున్నట్టున్నాడు! నిజమే. అసలు పాప అంటే నాన్నకి, అమ్మకి ప్రత్యేకమే కదా. అయినా అమ్మ తొమ్మిది నెలలు తనలో దాచి, పెంచిన పాప ఆ తర్వాతే నాన్న కి అందుతుంది. అంతకాలం ఎదురుచూపులతో ఉన్న నాన్నకి పాప మరింత అపురూపమైనది కాదూ మరి?!
సరే, ఈ నాన్న తన పాపాయి గురించి ఏం చెపుతాడో చూద్దాం. కవి తన ముందు మాటలో పారవశ్యాన్ని, విస్మయాన్ని ఏక కాలంలో కలిగించే శక్తి పసివాళ్లకే ఉంటుందంటాడు. ఆ రెంటినీ తమతో పాటు అమ్మా, నాన్నలకూ కలిగిస్తుందిట పాపాయి.
రచయితకి చిన్నప్పట్నుంచి పిల్లల్ని ఆడించటం ఇష్టం. జాషువా శిశువు, ముళ్లపూడి బుడుగు కవి మీద బలమైన ముద్రను వేసాయి. అలా అలా సాహిత్యంలో పిల్లలపైన వచ్చిన కవితల్ని ఇష్టంగా చదువుకుంటూ పెరిగిన మణిబాబుకి తన పాప ‘సాహితి సాలంకృత’ పుట్టాక ఆమె చేష్టలు తను చదివిన శైశవ గీతాలన్నీ జ్ఞాపకానికి తెచ్చాయట. ప్రతి పాపాయి కథా ఓ కావ్యమే నంటూ ఏకంగా ఒక కవితాసంపుటినే తీసుకొచ్చారు మణిబాబు. కొన్ని కవితలిలా…
మొదటి కవిత పెద పండుగ నిజంగా పాఠకుల మనసు నిండా పండుగని కుమ్మరిస్తుంది. పాపాయికి భోగి పళ్ల పేరంటం జరిగిన రోజున నాన్న ఎందుకో కంగారు కంగారుగా ఉన్నాడు. తీరా పేరంటం అయ్యాక ఎందుకలా ఉన్నారంది అమ్మ. రేగు పళ్లు, చిల్లరతో పాటు పాప రాల్చిన నవ్వుల్ని పిల్లలు ఏరేసుకుంటారేమో అని అన్నాడు నాన్న! ఈ సంభాషణ విన్నదేమో పాపాయి కాలి పట్టీల్ని ఘల్లుమనిపిస్తూ నిద్రలో ఒత్తిగిలి నవ్విందిట! పెద పండుగ కంటి ముందు దృశ్యమానం ఔతోంది కదూ!
చేతకాని పనులు కవిత ఓరోజు అమ్మ పాపాయికి భయం చెప్పమంది నాన్నని. నాన్న చాలా ప్రయత్నం చేసి ‘హన్నా’ అంటూ కొంచెం నటించాననుకున్నాడు. తీరా పాపాయి దగ్గరకొచ్చి ముఖంలోముఖం పెట్టి “బూ” అంటూ పారిపోయిందట! అప్పుడెప్పుడో ద్వాపర యుగంలో కొడుకు బుల్లి నోట్లో ప్రపంచాన్ని చూసిన యశోద జ్ఞాపకం రాకుండా ఉంటుందా?
భౌ భౌ రాత్రి పగలు తిండి, నిద్ర మాని కుక్క బొమ్మతో ఆడుతున్న పాపాయి చేతిలో బొమ్మ అమ్మ దాచేసింది. నాన్న ఆఫీసు నుంచి వచ్చాక కుక్క బొమ్మ కావాలంది పాపాయి. నేనే భౌ భౌ, ఆడుకో మన్న నాన్న అరక్షణంలో కుక్క బతుకు భలే వేడుకగా ఉందంటూ మురిసిపోయాడు.
కృతి పాపాయి ముఖంలో అయినవాళ్లందరి పోలికలూ ఉన్నాయి. నిత్యం వారందరికీ పొలమారుతోందంటే మారదూ మరి! ఏదో కని పెంచి ఉద్ధరించామనుకుంటాం కానీ పాప ఇచ్చే వేలాది సంతోషాల్ని ఎన్ని జన్మలైతే దాచిపెట్టగలం అనుకుంటాడు నిస్పృహగా నాన్న!
పొదుపు పొదుపంటే ఏమిటో నేర్చుకున్న పాపాయి భోజనాలప్పుడు పులుసులో ముక్కల్ని పెరుగన్నంలోకి పొదుపు చేసుకున్నానంటుంది నాన్నతో. నాన్న ఏం చెప్పగలడిక?!
ధన్యత ‘ప్రసాదాన్ని చీమలు కరిచేస్తున్నాయి నాన్నా’ అన్న పాపాయి మాటలు ప్రముఖ కవి (మాకినీడి) తన కవితలో కూర్చి ఆ మాటలకి కవిత్వ గౌరవాన్నిచ్చారట. మరో ప్రసిద్ధ కవి (మధునాపంతుల) కి పాపాయి పేరే కవితా శీర్షిక అయింది. నాన్న జీవితం ధన్యమైంది కదూ!
సంఘ జీవనం పాపాయి అప్పుడే అర్థం చేసేసుకున్నట్టే ఉంది. పార్కు నుంచి వస్తూ జారుడు బల్లలు, ఉయ్యాలలు ఎక్కువే ఉన్నాయి, మరి ఒంటరిగా ఉన్న రంగుల రాట్నం బెంగెట్టుకోదూ అంటోంది పాపాయి.
పాపాయి దీపం వెలిగిస్తే నాన్నకి ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టుందట! ఈ నాన్న మురిపెం తీరేలా కనిపించదు.
పాపాయి తనసొంత తెలుగు భాష మాట్లాదగలదు. అది మరెవరికీ సాధ్యం కాదు. మచ్చుకి వార్తలొస్తుంటే వాత్రలొస్తున్నాయంటుంది. పాపాయి భాషనే నాన్న నేర్చుకుందామనుకున్నాడు. ఈ లోపు పాపాయి నాన్నలా మాట్లాడేసింది.
పాపాయి భలే చురుకైనది.
వినాయకుణ్ణి నీటిలో నిమజ్జనం చేస్తుంటే, పుస్తకాలు కూడా జేజే కనుక వాటినీ నిమజ్జనం చేసేద్దామంటుంది. స్కేటింగ్ చేస్తున్న పిల్లల్ని చూస్తున్న పాపాయిని ఆ షూస్ కొనుక్కుందామన్నాడు నాన్న. ఆకాశంలో ఎగురుతున్న పక్షుల్ని చూస్తూ ఏకంగా రెక్కలు కొనుక్కుందాం అంటోంది పాపాయి. పాపాయి గది కప్పు మీద చందమామని, నక్షత్రాల్ని అలంకరించిన నాన్న ‘వానొస్తే గదిలో కురుస్తుందా’ అంటూ అడుగుతున్న పాపాయిని బిత్తరపోయి చూసాడు. రోడ్లు పాడు చేస్తున్న గేదెలకి డైపర్లు వెయ్యరేం అంటుంది గడుగ్గాయి. గులాబ్ జాం లు మునిగిపోతున్నాయని బాధ పడిపోతుంది.
సముద్రంలో వలలకు కట్టిన బెండు ముక్కలపైన వాలిన కొంగల్ని చూపించి అవి బ్రిడ్జి కట్టుకుంటున్నాయంటుంది! అమ్మ చేసిన దిబ్బరొట్టె ఎక్కువ పిండి తినేసి అలా లావుగా అయిపోయిందంటోంది. పాపాయి ఎప్పుడు నేర్చుకుందో ఇదంతా?!
అమ్మంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా అంటే నాకు నేనంటేనే ఇష్టం అనే పాపాయి అమ్మ, నాన్న కొంచెం తనలాగే ఉంటారంటుంది.
ఏకం సత్ గూట్లో దశావతారాల బొమ్మల్ని చూస్తూ ‘వెరైటీ వేషాలేసుకున్న ఒకే రాముడులు’ అంటున్న పాపాయి దగ్గర పెద్దలు నేర్చుకోవలసింది చాలానే ఉందనిపిస్తోంది.
‘పాపాయి కదా ఏం చేస్తుందనుకున్నాను! చూడండి ఒక పుస్తకమే రాయించేసింది’ అంటాడు, కవితలన్నీ రాసి ఆఖర్న ఆ పిచ్చి నాన్న!
పాపాయిలందరికీ ఇలాటి నాన్నలుండాలి. ప్రపంచంలో పాపాయి లందరికీ ఇలాటి ప్రేమ అందాలి.
యాభై కవితలున్న ఈ పుస్తకంలో ఒక్కో కవితా మూడు నుంచి ఆరు పాదాలతో క్లుప్తంగా ఉంది. ఆ క్లుప్తతలో ఆకాశమంత అర్థాన్నీ, ఆర్తినీ చెప్పిన ఈ అందమైన చిన్న పుస్తకం పాపాయిల్ని ప్రేమించే అందరూ చదవాలి.
కవి మణిబాబు గారికి అభినందనలు!
ముద్రణః కలిమిశ్రీ, విజయవాడ, 2018
వెలః రూ. 100/
Leave a Reply