నూతన ఆర్థిక విధానాలు – కార్మికోద్యమం

వ్యాసకర్త: నాదెళ్ళ అనూరాధ

********

ప్రొ. శేషయ్య గారి రచనా సర్వస్వంలో ఈ పుస్తకం మూడో సంపుటమని ముందుమాటలో పౌరహక్కుల సంఘం చెప్పింది. నెల క్రితమే అచ్చైన పుస్తకం కావటంతో దీనిని ముందుగా పాఠకుల ముందుకు తీసుకొస్తున్నాను. 

పుస్తకంలోని వ్యాసాలన్నీ హక్కుల చైతన్యాన్ని, కార్మికవర్గ దృక్పథాన్ని పెంచుతాయంటుంది పౌరహక్కుల సంఘం. శేషయ్య గారికున్నరాజకీయార్థిక దృక్పథం వల్లనే న్యాయం, చట్టం, రాజ్యాంగం చేసే పనుల వెనుక రాజకీయార్థిక శక్తులు పనిచేస్తూ ఉంటాయన్న ఎరుకను కలిగించగలిగారు. ఉదారవాద, అకడమిక్, స్వచ్ఛంద సంస్థల హక్కుల దృక్పథం నుంచి పౌరహక్కుల సంఘం అవగాహనను వేరుచేసే బలమైన పునాదిని శేషయ్యగారు అందించారని, ఆ నేపథ్యంలోనే ఈ వ్యాసాలను పరిశీలించాలని సంఘం చెపుతుంది.

గుంతకల్ స్పిన్నింగ్ మిల్లు – కార్మికుల బతుకులు బజారుపాలు

సాధారణంగా ఒక ఫ్యాక్టరీలోనో, పరిశ్రమలోనో జీతాలు పెంచమని, బోనస్ ఇవ్వమని, పనిభారం తగ్గించమని, ఇళ్లు కట్టించమని, పిల్లలకి విద్యా, వైద్య సదుపాయాలు కల్పించమని కార్మికులు ఆందోళనలు జరిపేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులను రిట్రెంచ్ చేసారని, పరిశ్రమను మూసివేసారని, ఖాయిలా పరిశ్రమగా ప్రకటించారని ఆందోళన చేయటం చూస్తున్నాం. నూతన పారిశ్రామిక విధానం కార్మికులు జీవనోపాధిని కోల్పోయేలా చేస్తోంది.

గుంతకల్ లో (1951 లో నెహ్రూ శంకుస్థాపన చేసారు) ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్లు జిల్లాలోని పత్తి పండించే రైతుల, చేనేత కార్మికుల ప్రయోజనాలను, ఆ ప్రాంతానికున్న రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించారు. సహకార రంగంలో నిర్వహిస్తున్న మిల్లు కావటంతో స్థానికులు బోర్డ్ డైరెక్టర్లుగా ఉంటూ కావల్సిన ముడి సరుకును సమీప ప్రాంతాలనుంచి కొనటం, సరుకును అమ్మటం, యంత్రాల రిపేరి క్రమబద్ధంగా చెయ్యటం లాటి నిర్ణయాల్ని కచ్చితంగా అమలు పరిచారు. మిల్లు అభివృద్ధి బాట పట్టింది.

సహకార మిల్లుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ఒక సమాఖ్య కిందకి మార్చి మేనేజింగ్ డైరెక్టర్లుగా ఐ. ఎ. ఎస్. లను నియమించింది. కాంట్రాక్టు పద్ధతిలో ఒకటి రెండు సంవత్సరాలకోసం మేనేజింగ్ డైరెక్టర్లను నియమించటం ప్రారంభమయ్యాక లక్షల రూపాయలు కుంభకోణాలు మొదలయ్యాయి. కమిషన్ల కోసం ఆశపడిన అధికారుల అశ్రద్ధ వల్ల మిల్లు నష్టాలలో కూరుకుపోయింది. కార్మికులు మిల్లును కాపాడుకునే ప్రయత్నాలెన్నో చేసినా లాభం లేకపోయింది. లే ఆఫ్, లాకౌట్ల తో కార్మికుల హక్కులను, సౌకర్యాలను అదుపుచేసారు. కార్మిక సంక్షేమ చట్టాలు కార్మికుల పట్ల ప్రేమతో కాక యాజమాన్యానికి అనుకూలంగానే ఉంటూ వచ్చాయి. ఖాయిలా పడిందన్న పేరుతో మిల్లును అతి తక్కువ ధరకు ప్రైవేటువ్యక్తుల పరం చేసే ప్రయత్నాలు జరిగాయి. (నలుపు పక్షపత్రిక, 1992)

ఖాయిలా పరిశ్రమలు – కార్మికుల హక్కులు

వ్యాసారంభంలో జస్టిస్ కృష్ణ అయ్యర్ చెప్పిన మాటలుః “ఆకలితో అలమటించే కార్మికులకు పనిచేయడం లేదా మరణించడం తప్ప మరో మార్గం లేదు.”

మనదేశం అన్ని వర్థమాన దేశాల్లానే ఆర్థిక సంక్షోభంలో పడింది. అప్పులు ఇచ్చేందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచ బ్యాంకు దేశంలో “వ్యవస్థాగత సర్దుబాట్లు” కోరాయి. ప్రభుత్వరంగ పరిశ్రమల ప్రైవేటీకరణ, ప్రభుత్వరంగ ఖాయిలా పరిశ్రమల మూసివేత, ప్రైవేట్ రంగంలో ‘ఎగ్జిట్’ పాలసీ, ఎగుమతులకు సంబంధించిన పరిశ్రమల ప్రోత్సాహం, విదేశీ పెట్టుబడులు, బహుళజాతి కంపెనీలు మన దేశంలో స్వేచ్ఛగా పరిశ్రమలు నెలకొల్పే అవకాశం వంటివన్నీ నూతన పారిశ్రామిక విధానంలోని అంశాలు.

వీటివల్ల కార్మికుల, ఉద్యోగుల జీవితాలపై, జీవనప్రమాణాలపై ప్రభావం పడుతుంది. ప్రజలనుభవించిన సామాజిక, ఆర్థిక సేవలు అందక, ధరలు పెరిగి జీవనం కష్టమవుతుంది. దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులు మాయమైపోతాయి.

కార్మికుల సోమరితనం, అధిక జీతాలు, యంత్రాలను సమర్థవంతంగా వాడకపోవటం, కార్మికుల సమ్మెలు, క్రమశిక్షణా రాహిత్యం పరిశ్రమలు ఖాయిలా పడేందుకు కారణమన్నది యాజమాన్యాల నెపం. నూతన పారిశ్రామిక విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మిక హక్కులకు సంబంధించిన చట్టాలను రద్దుచేయాలని పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. న్యాయస్థానాలు కూడా ఆయా విధానాలకు అనుగుణంగానే తీర్పులిచ్చాయి.

ఖాయిలా పడిన పరిశ్రమలను గురించి చదువుతుంటే కార్మికుల దుస్థితి అర్థమవుతుంది. ఆకలితో అలమటించే కార్మికులు మరణించటం కంటే హక్కుల్ని సాధించుకునేందుకు పోరాడాలి. (స్వేచ్ఛ, 1993)

నూతన ఆర్థిక విధానాలు – ప్రజాస్వామిక హక్కులు

1980 నుంచి భారత ఆర్థిక విధానాలలో మౌలికమైన మార్పులు వేగవంతమయ్యాయి. భారత నిపుణుల సూచనలుగా చెపుతున్నవన్నీ ద్రవ్యనిధి విధానాలే. వాటిని అనుసరించి భారత ప్రభుత్వం రూపాయి విలువ తగ్గించటం, విదేశీ పెట్టుబడులపై ఆంక్షలు తొలగించటం, దిగుమతి సుంకాలను తగ్గించటం, ఎగుమతుల పెంపుదల, ధరలపై ప్రభుత్వ నియంత్రణ తొలగింపు వంటి అనేక చర్యలను చేపట్టింది. దానితో దేశీయ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ మార్కెట్లకు అనుబంధంగా మారిపోతూంది. లైసెన్సుల వ్యవస్థ రద్దైంది. వాతావరణ కాలుష్యం చేసే పరిశ్రమల నియంత్రణ లేదు.

కార్మికులను ఉద్యోగంలోంచి తొలగించటం, జీతాలు తగ్గించటం, పని పరిస్థితికి ప్రమాణాలను ఉల్లంఘించటం, యూనియన్ హక్కుల్ని అతిక్రమించేందుకు యాజమాన్యాలకు అవకాశాలు కల్పించటం వంటివి – ద్రవ్యనిధి నుంచి అప్పు తీసుకున్న ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల్లో జరిగి పరిస్థితి విషమించింది. భారతదేశంలోనూ ఇవే పరిణామాలిప్పుడు. వ్యవసాయ రంగాన్ని ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తూ అక్కడ గిరాకీ ఉన్నవాటి ఉత్పత్తినే ప్రోత్సహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేటాయింపులు తగ్గాయి. తీరప్రాంతాల్లో రొయ్యలపెంపకం ప్రోత్సహిస్తూ స్థానిక ప్రజల జీవనోపాధిని దెబ్బకొట్టారు. కరువుతో పశువులను అమ్ముకునే రైతులను దోచి, లాభాలు ఆర్జించే కంపెనీలొచ్చాయి.    

రాజ్యం అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తున్నదని అనిపించినా నిజానికి అది ఆర్థిక రంగంలో మరింతగా జోక్యం చేసుకుంటోంది. ఆర్థిక అసమానతలను నిర్మూలించి, ప్రజల జీవనప్రమాణాలను పెంచాల్సిన ప్రభుత్వాలు వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. నూతన ఆర్థిక విధానాలను అనుసరిస్తున్న అనేక దేశాల్లో నిరంకుశ పాలనాధికారం నడుస్తోంది. మనదేశ భవిష్యత్తూ అదే కావచ్చు. (స్వేచ్ఛ, డిసెంబరు 1993)

చీకటి వెలుగుల నడుమ చేనేత పరిశ్రమ

భారతదేశంలో వ్యవసాయం తరువాత అతి ప్రధానమైనది వస్త్ర పరిశ్రమ. నూలు మిల్లులు మొదలయ్యే వరకు చేనేత పరిశ్రమే మన వస్త్ర పరిశ్రమ. సుమారు ఐదున్నర వేల సంవత్సరాల పాటు మన చేనేత కార్మికుడు వంశపారపర్య అనుభవంతో దీనిని ఉపాధిగానే కాక ఒక కళగా తీర్చిదిద్దాడు. అందమైన, సున్నితమైన వస్త్రాలను నేసి, నైపుణ్యమున్న పారిశ్రామిక కళాకారునిగా జీవించాడు. ఖండాంతరాల్లో దేశ ప్రతిష్టను పెంచాడు. 

బ్రిటీష్ పాలనలో దిగుమతి అయిన మిల్లువస్త్రాల పోటీ, స్వదేశీ మిల్లుల పోటీ, రంగులు, నూలు, రసాయనాలు ధరలు పెరగటం వంటివాటితో చేనేతరంగం కష్టాల్లో పడింది. గ్రామీణ మార్కెట్లను కోల్పోయి ముడి సరుకులకు, మార్కెటింగుకు పట్టణాలపై ఆధారపడింది. తయారైన నూలు మరమగ్గాల పరమైపోయేది. తీవ్రమైన నూలు కొరత ఉండగా ప్రభుత్వం పత్తి, నూలును ఎగుమతి చేసి విదేశీ మారకాన్ని సంపాదించే ప్రయత్నం మొదలెట్టింది.

ప్రతి చేనేత కార్మికుడూ మాస్టర్ వీవర్ దగ్గర వెట్టిచాకిరీ చేసే కార్మికుడయ్యాడు. సంక్షోభ పరిస్థితిలో మజూరి తగ్గింది. చేతినిండా పని లేదు. తగిన పౌష్టికాహారం లేక అనేక రోగాలతో, ఆకలితో కార్మికుల మరణాలు మొదలయ్యాయి. 

1954 కనుంగో కమిటీ సూచించినట్లు చేనేత రంగంలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలి. చేనేత మగ్గాలను మర మగ్గాలుగా మార్చి, కాలానుగుణంగా కొత్త డిజైన్లతో వస్త్రాల తయారీ ప్రోత్సహించాలి. చేనేత కార్మికుల వృత్తిని వారి హక్కుగా గుర్తించాలి. (స్వేచ్ఛ మార్చి – ఏప్రిల్ 1994)

చట్టాల్లో మార్పులు – కార్మికులు ఎదుర్కొంటున్న సవాళ్లు

1980 నుండి, ముఖ్యంగా 1991 నుండి దేశంలో సరళీకృత విధానం పేరుతో నూతన ఆర్థిక విధానాలు నిరాటంకంగా అమలవుతూ ప్రైవేటీకరణ జరిగిపోతూంది. నష్టాల పేరుతో ఫ్యాక్టరీలు మూతపడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు పోరాడినా వాటిని ఆపలేకపోతున్నారు.

మనదేశంలో కార్మిక, ఉద్యోగ సంఘాలు మొదటి నుండీ రాజకీయ చైతన్యంతో జాతీయ పోరాటంలో పాల్గొన్నా ఇప్పటి పరిస్థితి వేరు. సంఘటిత రంగంలో కార్మికులు అసంఘటితమవుతూ, కార్మిక సంఘాల నుండి దూరమవుతున్నారు.

హరిత విప్లవం పేరుతో ఆర్థికంగా బలమైనవారు, ప్రభుత్వ సాయమున్నవారు మాత్రమే లాభపడ్డారు. వ్యవసాయంలో యంత్రాల రాకతో వ్యవసాయ కూలీలు పనికోసం వలసలు పట్టారు. ఒకప్పటి బలమైన కార్మికోద్యమం ఇప్పటి పెట్టుబడి విధానాల వలన బలహీనమైపోయింది. ప్రత్యక్షంగా ఎంపిక చేసి ఉద్యోగులను పర్మనెంటు నియామకం జరిపే సంస్థలు తక్కువ. పరోక్షంగా లంచాలతో, పలుకుబడితో పనిలో చేరినవారు పర్మనెంటు కాకుండా తక్కువ జీతాలకు పనిచేస్తుంటారు. పర్మనెంటు ఉద్యోగాలున్న కార్మికులు కేవలం ఇరవై శాతమే.

నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచీకరణ పేరుతో చట్టాల్లో మార్పులను ప్రోత్సహిస్తోంది. అవన్నీ శ్రమను దోపిడీ చేసేవే. ‘పారిశ్రామిక వివాద చట్టా’లన్నీ సంస్థలకే అనువైనవి. సరళీకృత ఆర్థిక విధానాలను అమలు చేయటం ప్రభుత్వానికి తప్పని సరై, అనేక కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. (స్వేచ్ఛ, మార్చి- ఏప్రిల్, మే-జూన్, 2000)

ప్రమాదంలో కార్మికుల చట్టాలు

ఇంగ్లండులో కార్మిక ఉద్యమాల నుండి రాజకీయ పార్టీలు ఆవిర్భవించగా, మనదేశంలో రాజకీయ పార్టీలకు అనుబంధంగా జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. స్వాతంత్ర్య పోరాటంలో కార్మిక ఉద్యమం చురుకైన పాత్ర వహించింది. స్వాతంత్రానంతరం కార్మికుల ఉద్యోగ భద్రత, సరైన పని పరిస్థితులు, రక్షణ, సంక్షేమం వంటి అనేక చట్టాలొచ్చి, వారు ఆత్మగౌరవంతో బతికే పరిస్థితుల్ని కల్పించాయి.

కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రత, సంక్షేమాలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర పరిధిలో దాదాపు 200 కు పైగా చట్టాలున్నాయి. వీటన్నిటి అమలు సాధ్యంకాదు కనుక కొన్నిటిని రద్దుచెయ్యమని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. పారిశ్రామిక వివాదాల చట్టం పర్మనెంట్ కార్మికులకే వర్తిస్తుంది. ఇవాళ దేశంలో సంఘటిత రంగంలో కేవలం 10శాతం కార్మికులు, అసంఘటిత రంగాల్లో 90 శాతం కార్మికులు ఉన్నారు.  

“కాంట్రాక్టు లేబర్ రెగ్యులేషన్ చట్టం” ద్వారా కూడా యాజమాన్యాలకు అనుకూలంగానే మార్పులు జరిగాయి. ఎంతమందినైనా అప్రెంటీసులను నియమించుకోవచ్చని, ప్రభుత్వ అనుమతి లేకుండానే పరిశ్రమలో 49మంది వరకూ కార్మికులను నియమించుకోవచ్చని చట్టం తెచ్చినప్పుడు వీరికి కనీసం కాంట్రాక్టు కార్మికుల చట్టం కల్పించే రక్షణ కూడా ఉండదు. కార్మికులు యాజమాన్యంపై ఫిర్యాదు చెయ్యాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి అవసరం. అప్పుడే దానిని లేబరు కోర్టు విచారణకు తీసుకుంటుంది. ఇలాటప్పుడు కార్మికుడి గొంతు ఎంతవరకు వినిపిస్తుంది?

ఇదివరకు కార్మికవర్గ చైతన్యంతో పాటు సామాజిక, రాజకీయ చైతన్యం ఉండేది. ప్రస్తుతం సరళీకరణ ఆర్థికవిధానాలు, మారుతున్న ఉత్పత్తి విధానం, సాంకేతికత, ఉద్యోగభద్రత లేకపోవటం, అధిక ధరలు కారణంగా కార్మికులు సంఘాలకు దూరమయ్యారు. పైగా కులాలవారీగా విడిపోవటంతో వారి అనైక్యత యాజమాన్యాలకు లాభం తెస్తోంది. (సేకరణః ప్రజాస్వేచ్ఛ, ఏప్రిల్‍- మే 2018)

కన్నీళ్ల మే డే

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల దోపిడీని ప్రశ్నించి, పోరాడి, రక్తాన్ని చిందించి 8 గంటల పని దినాన్ని సాధించుకుంది కార్మికవర్గం. అదే మే డే!

శ్రమజీవుల వలసలకు కారణం అసమాన అభివృద్ధి. ఒక ప్రాంతం వెనుకబడి ఉండగా ఒకప్రాంతం అభివృద్ధి చెందటమే. ఇటీవల కాలంలో కరోనా సమయంలో జరిగిన వలస కార్మికుల ఇక్కట్లు, మరణాలు మనమంతా చూసాం.

నేషనల్ శాంపిల్ సర్వే ప్రకారం (అంతర్రాష్ట్ర, అంతర్ జిల్లా) దేశంలోని మొత్తం కార్మికుల జనాభాలో 28.3 శాతంగా ఉంది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల సంరక్షణ చట్టం 1979లో చేసినా అమలు మాత్రం 1982 లో జరిగింది. కార్మికుల రక్షణకోసం యాజమాన్యాలు, కాంట్రాక్టర్లు తీసుకోవలసిన చర్యల్ని చెపుతుందిది. అమలు చెయ్యవలసింది లేబరు ఇనస్పెక్టర్లు. కానీ వారు యాజమాన్యాలకు, కాంట్రాక్టర్లకు అనుకూలంగా ఉంటూ చట్టాన్ని నీరుకారుస్తున్నారు. వలస కార్మికులు ఫిర్యాదు చెయ్యాలనుకున్నా లేబర్ ఇనస్పెక్టర్లకే చెయ్యాలి.

అసంఘటిత కార్మికుల ఉద్యోగ భద్రతకు, సంక్షేమానికి ‘అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం’, 2008 వంటివి ఉన్నాయి. కార్మికోద్యమం బలహీనంగా ఉండటంతో చట్టాల అమలు జరగటం లేదు. కార్మికచట్టాలు కఠినంగా ఉన్నాయని, మార్చాలని యాజమాన్యాల డిమాండ్. కేంద్రం ప్రతిపాదించిన చట్టాలు ఆచరణలోకి వస్తే కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగాలుండవు. కనీస వేతనాలను కూడా చెల్లించేందుకు మినహాయింపును పరిశ్రమలు కోరుతున్నాయి. కేవలం 8 శాతం మాత్రమే కార్మికులు సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. దేశంలోని కార్మిక సంఘాలన్నీ హక్కుల కోసం పోరాడాలి. (అముద్రితం, మే 2020)

ఖాయిలా పడిన మిల్లుల – ముందుమాట

పారిశ్రామిక ప్రగతి ప్రజల జీవన స్థాయిలోనూ, కార్మికుల ఉత్పాదన సామర్థ్యంలోనూ, సాంకేతిక నైపుణ్యంలోను మార్పును తేవాలి. అప్పుడే పారిశ్రామికీకరణ ప్రజాస్వామిక దృక్పథంతో నడిచినట్టు. మొదటినుంచీ పెట్టుబడిదారీ సంస్కృతే భారత పారిశ్రామిక విధానాలను తీర్చిదిద్దింది. అయినా, కొంతవరకూ కార్మికుల ఐక్య పోరాటాలు, ప్రజల్లోని ప్రజాస్వామిక సమసమాజ ఆకాంక్ష దీనిని అదుపుచేసాయి. ప్రజల చైతన్యం దృష్ట్యా ప్రభుత్వం తన సామాజిక బాధ్యతను నిర్లక్ష్యం చెయ్యలేదు. కార్మికుల ప్రయోజనాల కోసం అనేక చట్టాలను చేసినా అమలు పట్ల చిత్తశుద్ధి చూపలేదు.

ఈ వ్యాసం అనుబంధంగా రాష్ట్రంలో ఖాయిలా పడిన నాలుగు మిల్లులు ఏ క్రమంలో ఖాయిలా పడ్డాయో వివరించారు. ఆయా మిల్లుల్లో పనిచేసిన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు, ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు తెలియజేసిన అభిప్రాయాలు, అనుభవాలు, ఇచ్చిన సమాచారాన్నంతా సేకరించి వీటిని అందించినట్లు ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం తెలిపింది.

ఖాయిలాపడిన మిల్లుల పరిస్థితులు యాజమాన్యాల వైపునుండి అలక్ష్యం, స్వార్థ ప్రయోజనాలను స్పష్టం చేస్తాయి. కార్మికులు మిల్లులు ఆర్జించే లాభాలలో వాటాలను కానీ, యాజమాన్యపు హక్కుల్ని కానీ కోరుకోరు. పని హక్కు అంటే జీవించే హక్కు. జీవిక కోసం, కుటుంబాలతో సగౌరవంగా సమాజంలో జీవించేందుకు మాత్రమే వారు ప్రయత్నిస్తారు. దానిని కూడా వారినుంచి లాక్కునే యాజమాన్యాలు, ప్రభుత్వం తమ బిడ్డల్లాంటి ప్రజలకోసం ఏం చేస్తున్నట్టు? 

గుంతకల్ స్పిన్నింగ్ మిల్ మొదట్లో స్థానిక మెంబర్ల నిర్వహణలో ఉండి లాభాలు పొందింది. ‘సహకార నూలు మిల్లుల సమాఖ్య’ నిర్వహణ కిందకి తేవటంతోనే నష్టాల దారిపట్టింది. నాణ్యత లేని ముడిసరుకు, యంత్రాలకు అవసరమైన రిపేర్లను చేయించకపోవటం, రవాణా, మార్కెటింగ్ పనులలో లంచాలతో మిల్లును నష్టాలలోకి నడిపారు. మిల్లును నిలబెట్టుకుందుకు కార్మికులెన్నో త్యాగాలు చేసారు. లే ఆఫ్, లాకౌట్ల ద్వారా తమను అణచివేయద్దని తమకు రావలసిన ప్రయోజనాలను కూడా కార్మికులు పణంగా పెట్టారు. 

పారిశ్రామిక వివాదాల చట్టంలో కార్మికులకున్న ఆయుధం కేవలం సమ్మె. దానికీ అనేక పరిమితులు, ఆంక్షలు పెట్టారు. యాజమాన్యంపై ఉన్న క్రిమినల్ కేసులు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్నాయి. ఆకలిబాధతో కార్మికులు రోడ్డున పడ్డారు. 

రాయలసీమ పేపర్ మిల్లు కొద్దిపాటి పెట్టుబడితో వచ్చిన ప్రైవేటు యజమానులు బ్యాంకుల నుండి, ప్రభుత్వం నుండి అనేక కోట్ల ఆర్థిక సాయంతో మిల్లును ప్రారంభించారు. కానీ దాని నిర్వహణ పట్ల చిత్తశుద్ధి లేక, స్వంతవ్యాపారాలను అభివృద్ధి చేసుకుంటూ మిల్లును కనీసం తొలిదశలో కూడా నిలదొక్కుకోనీయలేదు. మిల్లు కార్మికుల పని హక్కును హరించారు. కార్మికుల ఎదురుగానే మిల్లు కుంగి కునారిల్లిపోయిన పరిస్థితులు నమ్మశక్యం కాదు. వ్యూహాత్మకంగా అనుసరించిన పెట్టుబడిదారుల కుట్రలు సాధారణ ప్రజలకూ స్పష్టంగా అర్థమవుతాయి. ఈ వ్యాసం చివరలో అనారోగ్యంతో, ఆకలితో సంభవించిన కార్మికుల, వారి కుటుంబీకుల మరణాల పట్టిక ఇచ్చారు. వీటి బాధ్యత ఎవరిది?

విజయనగరం జిల్లా నెల్లిమర్ల గ్రామం, చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరి జీవితాలు అక్కడి జూట్ మిల్లు చుట్టూ, దాని ఆధారంగా గడిచేవి.1980ల మధ్య కాలంలో జూట్ పరిశ్రమ సంక్షోభం ఈ మిల్లుపై పడింది. పారిశ్రామిక సంక్షోభం, యాజమాన్య నిర్వహణ లోపాలు, యజమానే మిల్లును దోచుకోవడం వంటి కారణాలన్నీ ఒకదానికొకటి కారణమయ్యాయి. 

దేశంలోని జూట్ మిల్లులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటున్నా 1991-1992 తొలి అర్థభాగంలో అధికంగా ఎగుమతులు జరిపి, జూట్ పరిశ్రమకి ‘సువర్ణ సంవత్సరం’ గా చెప్పబడింది. అప్పుడూ నెల్లిమర్లమిల్లు లాకౌట్ల మీద లాకౌట్లతో కార్మికులను రోడ్డు మీద పడేసిన తీరు విస్మయాన్ని కలిగిస్తుంది. సంక్షేమరాజ్యంలో కార్మికుల మరణాలకి చోటెక్కడిదో!

నిజాంకాలంనాటి ఆజంజాహీ మిల్లు 1934 నుంచి ఉత్పత్తి మొదలెట్టింది. కార్మికుల మీదే నెపం చూపి వారి క్రమశిక్షణా రాహిత్యం వల్లనే మిల్లు మూతపడిందన్నారు. పని పోయి, జీవితం మధ్యలో ఉపాధిని వెతుక్కోవలసి రావటం, అది సాధ్యం కాక దారిద్ర్యంలోకి కూరుకుపోయిన కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వ విధానాలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ మిల్లుల నిర్వహణలో లోపాలు, యజమానుల, ప్రభుత్వాల నిర్లక్ష్యం కార్మికులను ఏవిధంగా కష్టాల్లోకి, ఆకలిచావుల్లోకి తోసిందో వివరమైన పట్టికలు ఇచ్చారు. 

భారత కార్మికోద్యమం – నక్సల్బరీ

తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగింపే నక్సల్బరీ ఉద్యమం. దాని ప్రభావంతో దేశంలో జరిగిన రైతాంగ, గిరిజన పోరాటాలు పీడితుల్ని ఉత్తేజపరచగా, పాలక, భూస్వామ్య వర్గాలను కలవరపరిచాయి. నక్సల్బరీ భారత సమాజంలోని రాజకీయ ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాలన్నింటినీ కుదిపేసింది. 

ఈనాడు కార్మిక ఉద్యమంలో విప్లవ రాజకీయాల ప్రభావం అంతగా లేదు. దేశంలో అమలవుతున్న నూతన ఆర్థిక విధానాలను ఎదుర్కొనే రాజకీయ చైతన్యం, శక్తి లేదు.

1956 లో రూపొందించిన పారిశ్రామిక విధానం ద్వారా దేశాన్ని సోషలిస్ట్ తరహా సమాజంగా మార్చడమే లక్ష్యం. కానీ జరిగిన పారిశ్రామికాభివృద్ధి ప్రైవేటు పెట్టుబడిదార్లకే లాభం చేకూర్చింది. ప్రంచవర్ష ప్రణాళికల ద్వారా అమలు చేసిన అభివృద్ధి విధానాలు పేదరికాన్ని, అసమానతల్ని పెంచాయి. ఇలాటి అభివృద్ధిని ప్రశ్నించింది నక్సల్బరీ ఉద్యమం. శ్రమను దోపిడీ చేసేందుకు పెట్టుబడివర్గం కార్మికులను, ఉద్యోగులను కేటగిరీలుగా చీల్చింది. క్రమంగా ఆర్థికవాదం, అవకాశవాదం కార్మిక నాయకత్వాల స్వభావమైపోయింది.

ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రతి జిల్లాలో పారిశ్రామికవాడలు ఏర్పడి, వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నా వారు సంఘటితం కావడానికి, సమ్మెలు చేయడానికి భౌతిక పరిస్థితులు లేవు. ఉత్పత్తి సామాజికం, యాజమాన్యం వ్యక్తిగతం అయిపోయాయి. కార్మికుడు సామాజిక ఉత్పత్తిలో పాల్గొంటున్నా ఒంటరివాడైపోవటం పారిశ్రామికాభివృద్ధితో పాటు జరుగుతోంది. సమాజంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక సంక్షోభం పెరిగి వర్గ వైరుధ్యాలు తీవ్రం అవుతున్నాయి. నూతన ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, ఉద్యోగులు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలు, బంద్ లు చేసినా వాటి అమలు ఆగటం లేదు. (ఆగస్టు, 1998)

చరిత్ర నేర్పిన పాఠాలతో పాటు కొత్త పోరాట రూపాలను తీసుకువచ్చి ఉద్యమాన్ని నడిపించగలిగిన నాడు కార్మికుల శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు సాధ్యమవుతుంది.

స్వాతంత్రానంతరం భారతదేశంలో జరిగిన పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ, పెట్టుబడిదారుల దృక్పథం, కార్మికుల స్థితిగతులు, వారి పోరాటాలు వంటి అనేక వాస్తవాలను ఈ పుస్తకం అందించింది. మన సమీప గతాన్ని గురించిన రాజకీయ, ఆర్థిక, సామాజిక చిత్రాన్ని వివరంగా తెలుసుకుందుకు ఈ పుస్తకం చదవటం ఒక అవసరం. 

ప్రచురణః పౌరహక్కుల సంఘం, మార్చి – 2024

వెల:  రూ. 200/-

You Might Also Like

Leave a Reply