అడుగడున తిరుగుబాటు – గీతా రామస్వామి

వ్యాసకర్త: అమిధేపురం సుధీర్

**********

చాలా రోజుల తర్వాత ఏక బిగిన చదివిన పుస్తకం ఇది. హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వ్యవస్తాపకురాలు, ఉద్యమకారిణి అయిన గీతా రామస్వామి గారు ఇంగ్లీష్ లో వ్రాసిన ఆత్మకథ కి ఇది తెలుగు అనువాదం. నాకు గుర్తుండి హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ నుంచి వెలువడిన పుస్తకాల్లో నేను మొట్టమొదట చదివిన పుస్తకం ‘ప్రవహించే ఉత్తేజం చే గెవారా’. ఆ పుస్తకం తర్వాత ఇంకా కొన్ని మంచి పుస్తకాలని చదువుతూనే వున్నాం కానీ దాని స్థాపకుల గురించి ఎప్పుడూ తెలీదు.

కొన్నేళ్ళ క్రితం అకస్మాత్తుగా అందరి దృష్టీ జార్జి రెడ్డి మీద పడింది. యూట్యూబ్ లో, పేపర్లలో ఒక్కసారిగా అతని గురించి విపరీతంగా వినిపించ సాగింది. ఎప్పుడో 2004 విడుదలైన మణిరత్నం గారి సినీమా ‘యువ’ లో సూర్య పాత్ర, జార్జి రెడ్డి ని స్పూర్తిగా తీసుకొని రూపొందించారు అన్న ఒక్క విషయం నాకు చాలా ఆసక్తిని కలిగించింది. అసలు ఎవరీ జార్జి రెడ్డి అన్న వెతుకులాటలో, ‘జీనా హై తో మర్నా సీఖో’ అనే పుస్తకం మళ్ళీ హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళదే పబ్లిష్ అయితే కొని చదివాను. అప్పుడు తెలిసిన విషయాలే, జార్జి రెడ్డి తమ్ముడు సిరిల్ రెడ్డి అని, సిరిల్ రెడ్డి గారి భార్య గీతా రామస్వామి గారని. సిరిల్ రెడ్డి, గీతా రామస్వామి ఇంకా కొందరు కలిసి హైద్రాబాద్ బుక్ ట్రస్ట్ ని స్థాపించారు అని. పీ.వీ. నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే, పిల్లర్ నంబర్ 68 దగ్గరలో వున్న వారి ఆఫీస్ కి కూడా వెళ్ళాం ఒకసారి. అప్పుడు గీతా రామస్వామి గారు ఆఫీసు లో లేరు. కానీ వారి దగ్గర స్టాక్ లో ఉన్న కొన్ని పుస్తకాలు కొనుక్కొని వచ్చాం. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే, అప్పటికి నాకు వారి గురించి తెలిసింది చాలా తక్కువ, అయినా ఖచ్చితంగా వారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని వుంటారు, ఇప్పటికీ ఎన్నో ఇబ్బందులతోనే పుస్తక ప్రచురణ చేస్తుంటారు అన్న ఒక చిన్న భావన వారి మీద గౌరవాన్ని పెంచింది. అలాంటిది తనే స్వయంగా తన చరిత్ర వ్రాసారు అన్న విషయం తెలిసాక వెంటనే ఈ పుస్తకం కొని చదివాను.

457 పేజీల సుదీర్ఘ పుస్తకం, ఎక్కడా కొంచం కూడా విసుగనేది తెలియకుండా చదివాను. గీతా రామస్వామి గారు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోనే వ్రాసారు, అయినా ఇది తెలుగు అనువాదంలా అనిపించకుండా, వారే ఇది తెలుగులో వ్రాసారేమో అనిపించింది. ఆ విషయం లో అనువాదకర్త ప్రభాకర్ మందార గారిని అభినందించాలి.

ఈ పుస్తకం లో నాకు నచ్చిన విషయాలు చాలానే వున్నాయి. రెండు మాత్రం క్లుప్తంగా మీతో పంచుకుంటాను.

1. ప్రముఖ మార్కిస్టు, స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మ గారి పుస్తకాలకి కూడా నేను అభిమానినే. లాభాపేక్ష లేకుండా పుస్తకాలు ప్రచురించడంలో ఆమె కూడా ఎన్నో కష్టాలకి గురయ్యే వుంటారు. కాకపోతే సిద్దాంతపరంగా రంగనాయకమ్మ గారిది మొండి పట్టు. ప్రపంచంలోని సమస్యలన్నిటికీ మార్క్సిజమే సమాధానం అని ఆమె గట్టి నమ్మకం. ఆమె అనువదించిన ‘కాపిటల్ ‘ రెండు భాగాలూ, ఇంకా ఇతర పుస్తకాలు చదివాక ఏవో కొన్ని సందేహాలు వుంటే, ఆ సిద్దాంతం మీద కొన్ని ప్రశ్నలతో, తనకి ఈమెయిల్ చేస్తే సమాధానమిచ్చారు. ఆ సమాధానానం అంతగా సంత్రుప్తికరంగా లేక మళ్లీ కొన్ని ప్రశ్నలతో, తనకి మరో ఈమెయిల్ పంపిస్తే, దానికి సమాధానంగా, మార్క్సిజం అనే సిద్దాంతం అర్థం కావాలంటే, ఎకనామిక్స్ లో చాలా సిద్దాంతాలు అర్థం చేసుకోవాలి, కాబట్టి, నేను అడిగిన ప్రశ్నలకి అంత తేలికగా జవాబు చెప్పడం కుదరదు అన్నారు. అప్పటికే మార్క్సిజం అనేది పూర్తిగా సైంటిఫిక్ సిద్దాంతం కాదేమో అన్న భావన నాలో బలంగా ఏర్పడింది. అప్పటినుంచి ఆమే పుస్తకాలు చదవలేదు. (నేను అంత పెద్ద విషయాలని అర్థం చేసుకోలేకపోవడం, నా అజ్ఞానమే అయ్యుండొచ్చు, కానీ దేవుడి ఉనికిని నమ్మడం / నమ్మక పోవడం అనేది కూడా పూర్తిగా వ్యక్తిగతమే, దానికి సిద్దాంత ఋజువులు అడగరు కదా, అలాగే, ఈ సిద్దాంతాన్ని, నా ఆలోచనా పరిధి మేరకు నేను నమ్మడం మానేసాను).  నాకు తెలిసీ రంగనాయకమ్మ గారికి ప్రత్యక్ష పోరాటాల అనుభవం లేదు. కానీ, గీత ఇంకా సిరిల్ రెడ్డి గారు ఇద్దరూ కొంతకాలం, ప్రత్యక్ష రాజకీయల్లో వున్నారు. మొదట సిద్దాంతాన్ని నమ్మి పార్టీ కోసం పని చేసారు, అండర్ గ్రౌండ్ కి వెళ్ళారు, ప్రత్యక్ష పోరాటాల్లో వున్న ఎంతో మంది తో కలిసి పనిచేసినవారు. ఎందుకు పార్టీలోంచి బయటకి రావలిసి వచ్చిందో, ఎందుకు మార్క్సిస్ట్ పార్టీలు ఇప్పటికీ విజయవంతమవ్వలేకపోతున్నరో వివరించిన తీరు, కారణాలు నాకు బాగా నచ్చాయి. మన దేశానికి మాత్రమే ప్రత్యేకమైన కుల వ్యవస్తని, దాని మీద ఎంతో చెప్పిన అంబేద్కరిజాన్ని, మార్క్సిస్ట్ పార్టీలు తమ విధానాల్లో, సిద్దాంతాల్లో, ఆచరణలో చూపెట్టకపోవడం, అలాగే పార్టీలో అంతర్గతంగా వుండే కఠినమైన ఏక పక్ష విధానాలు, చీలికలు, ఈగో లు ఇలాంటి సమస్యలని బాగా వివరించారు. మొత్తమ్మీద మార్క్సిస్ట్ ఇంకా అంబేద్కర్ సిద్దాంతాల మధ్య ఉన్న అంతారాల గురించి ఇంకొంచం తెలుసుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా కలిగింది.

2. మన దేశం లో శాకాహరులా, మాంసాహారులా అన్నది వ్యక్తిగత అభిప్రాయం కాదు. అది కూడ ఒక మనిషి యొక్క స్థాయిని అంచనా వేసే ఒక వివరం. గీత రామస్వామి గారు పుట్టుకతో బ్రాహ్మణులు. కానీ తన కులాన్ని సూచించే అలవాట్లని వదులుకొని, తన చుట్టూ వున్న వారి పరిస్తితులకనుగుణంగా గొడ్డు మాంసం కూడా తిన్నారు. ఇది చాలా debatable విషయం. కానీ నా వ్యక్తిగత విషయం ప్రకారం, నేను చాలాకాలం శాకాహారిని, దాని ద్వారా ‘నేనేంటి??? ‘ అనే  విషయాన్ని కనుక్కోవాలని కొన్ని చోట్ల జరిగిన ప్రయత్నాలు, నాకు ఈ విషయం మీద ఒక రకమైన చిరాకుని కలిగించింది. ఇప్పుడు నేను స్వచ్చమైన మాంసాహారిని. మరీ గొడ్డు మాంసం తినకపోయినా, ప్రత్యేకంగా, నాకు శాకాహారమే కావాలని అడిగి ఒక అటెన్షన్ కి గురవ్వటం నాకు తప్పింది. ముందే చెప్పినట్టు ఇది చాలా debatable విషయం. ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వారివి. నేను మాత్రం ఈ విషయం లో ఈ పుస్తకం తో ఏకీభవించాను.

ఈ పుస్తకం 1975 నుంచి 1993 వరకూ గీతా రామస్వామి గారి జీవితంలో జరిగిన ముఖ్యమైన విషయాల సమాహారం. చాలా విషయాలని చాలా నిర్మొహమాటంగా ఇందులో వివరించారు. 

మొత్తం పుస్తకం లో నేను ఇబ్బందికి గురైంది, ఈ టైం లైన్ విషయం లోనే, ఎన్నో సంఘటనలు, తన జీవితంలో పారాలల్ గా జరుగుతుండటం వల్ల, కొన్ని చాప్టర్లలో చదివిందే చదివినట్టనిపించింది. కీలక సంఘటనల తేదీలు లేదా సంవత్సరాలని ఒక దగ్గర పొందుపరిస్తే, ఆ కంఫ్యూజన్ కొంత తొలగి వుండేది అనిపించింది.

పుస్తకం పూర్తయ్యేటప్పటికి ఒక సంత్రుప్తి, ఇంకా తెలుసుకోవలసిన కొత్త విషయాల గురించి ఒక అవగాహన రెండూ కలిగాయి.

ఈ వ్యాసం మళ్ళీ చదివితే అనిపించింది, ఈ పుస్తకం నన్ను బాగానే ఆవహించిందని, లేకపోతే ఇందులో వాడిన పదాలు ఇంతకు ముందెప్పుడూ ఇలా నేను వాడలేదు.

ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకాలలో దీన్ని కూడా చేర్చుకోమన్నదే నా విన్నపం.

You Might Also Like

Leave a Reply