A Patchwork Quilt: Sai Paranjpye
సాయి పరాంజపె ఒక మెమొయిర్ రాశారనీ జయ్ అర్జున్ సింగ్ (ప్రముఖ సినీ రచయిత, బ్లాగర్) ఫేస్‍బుక్ పోస్ట్ ద్వారా తెల్సుకుని ఎగిరి గంతేశాను. అప్పటికింకా మార్కెట్టులోకి రాని పుస్తకానికి ప్రి-ఆర్డర్ పెట్టి, వేయి కళ్ళతో వేచి చూడ్డమే కాకుండా, వేవేల ఊహల్లో మునిగితేలి, ఫేస్‍బుక్ వాల్ మీద కొంచెం భారీగానే #fangirling చేసి, పుస్తకం అందీ అందగానే ఆరారగా చదివేసుకుని, నచ్చిన పేరాలు ఫోటోలు తీసి వాట్సాప్‍లో దోస్తులని స్పామ్ చేసి, “అందరికన్నా నేనే ముందు చదివేశానోచ్” అన్న విజయగర్వంతో పాటు “ఇప్పుడింత జీవితం గురించి ఏం రాయను, ఎలా రాయను?” అన్న మీమాంశలో పడి, ఏవో కొన్ని డ్రాఫ్టులలా బుర్రలో రాసేసుకుంటూ తెగ నవ్వేసుకుంటూ, గాల్లో గెంతులేసుకుంటూ రాయాల్సిన వ్యాసం మాత్రం ఆలస్యం చేసేశాను.
నాలోని #fangirlకి నెగిటివ్ మార్కులు పడ్డేట్టు మొన్న (మార్చి 19) సాయి పుట్టినరోజన్న సంగతి గుర్తే లేదు నాకు, పొద్దున్నే సత్యవతిగారు పింగ్ చేసి చెప్పేవరకూ. “సగం రోజు లీవ్ పెట్టైనా ఇవ్వాళ సాయి పుస్తకం గురించి రాస్తానండి” అని ఆవిడతో అన్నాను. అందుకే ఇది రాయడానికి కూర్చున్నాను కానీ, ఆ పూట పూర్తి చేయలేకపోయాను. ఇంకో రెండు రోజుల జాప్యం.
ఎలా రాయడమో తోచకపోతుంటే “కోతికొమ్మచ్చి” ఆడియో గురించి నేను రాసిన వ్యాసం గుర్తొచ్చింది. నన్ను పట్టి ఊపేసే సాహిత్యం బాగానే చదివున్నాను కానీ, ముళ్ళపూడిగారిలానో, సాయిలానో జీవితమంటే ఏంటో తేలిగ్గా, సూటిగా, మనోరంజకంగా తెలియజెప్పేటప్పుడు నేను ఉక్కిరిబిక్కిరి అయిపోతాను. వాటి గురించి రాయాలంటే నా గురించి నేను ఎక్కువ బయటపేట్టేసుకుంటానేమోనన్న ఒక భయమైతే, ఎంత ప్రయత్నించినా వాళ్ళ పట్ల నాకున్న కృతజ్ఞతని సరిగ్గా వ్యక్తీకరించలేను కదా అన్న నిరాశ కూడా! అందుకే మన విస్లవ అన్న ఈ మాటని “మమ” అనుకుంటూ మొదలెడుతున్నాను.
All imperfection is easier to tolerate if served up in small doses – Wislawa Szymborska
ఇది పుస్తక పరిచయమో, సమీక్షో కాదు. అంతకు మించినదేదో! కనీసం, నా వరకూ.
****
“చష్మె బద్దూర్ సినిమా అంటే తెలీదా?” టెక్స్ట్ మెసేజ్‍లో కూడా విసుగు స్పష్టంగా తెల్సింది.
“నయ్ మాలూమ్! తొ క్యా హువా?” అన్న పొగరే నాదీను.
కొన్నాళ్ళకి బుద్ధి పుట్టి ఆ సినిమా గురించి గూగుల్ చేస్తే ఒక మహిళా దర్శకురాలు తీసిందని చూసి, ఆశ్చర్యపోయి, ఆమె ఫిల్మోగ్రఫీ అంతా తవ్వి ఒక్కొక్కటీ చూడ్డం మొదలెట్టాను. 2011లో. ఒక సినిమాలో టైటిల్స్ పడేటప్పుడు దర్శకురాలి కార్డు వచ్చేసరికి ముందు మగ చేతులు కనిపిస్తాయి, దాన్ని పక్కకు తోసేసి మళ్ళీ ఆడచేతులు కనిపిస్తాయి. అప్పుడు సాయి పేరు పడుతుంది. నేను “సాయీఈఈఈ” అంటూ కరిగిపోవడం ఆ క్షణం నుంచి మొదలైంది.
చూసిన సినిమా చూసినట్టు అప్పట్లో నవతరంగంలో రాశాను. తోచినట్టుగా. వాటికేమో కామెంట్లు ఇలా వచ్చేవి:
“మేము డబ్భైలలో పూణెలో ఉన్నప్పుడు ఆమె నాటకాలు చూశాము.”
“అసలు ఆవిడ నాటకాలెంత గొప్పగా ఉండేవో.”
“అవునా! హౌ థ్రిల్లింగ్” అని నేను కామెంట్ పెట్టినా అసలు అనుకునే మాట మాత్రం: “నేనడిగానా?! ఎందుకిలా ఊరించడం?” . సినిమాలంటే ఏదోలా పట్టుకుని ఎప్పటికన్నా చూడచ్చు. నాటకాలు అలా కావే! ఆ క్షణంలో ఉండి ప్రత్యక్షంగానే వాటిని అనుభవించాలే గానీ, కొన్నాళ్ళకి డిటెయిల్స్ అన్నీ కరిగిపోయి అవొక జ్ఞాపకంగా పేరుకుపోవాలే గానీ ఇంకో మార్గం లేదుగా?! వీళ్ళంతా నాకన్నా ముందు పుట్టేసి, నాకిష్టమైనవన్నీ నేను లేకుండా ఎంజాయ్ చేసేసి, నాకేం మిగల్చలేదని, నాకు అన్యాయం చేసేశారని నా ఉక్రోషం.
అందుకే సాయి జీవితం మీద పుస్తకం అనగానే “దేవుడా, దేవుడా… ప్లీజ్! అందులో బోలెడన్ని సంగతులు నాటకాల గురించి ఉండేట్టు చూడు” అని మొక్కుకున్నాను. (సాయి మొదట ఈ పుస్తకాన్ని మరాఠిలో రాశారు, 2016లో. అనువాదం చేసింది 2020లో. నేను మొక్కుకున్నది ఇవ్వన్నీ జరిగిపోయాక!)
ఉండబట్టలేక ప్రివ్యూలు, రివ్యూలు చదువుతుంటే అర్థమైంది, పుస్తకం చివరిభాగంలో తన సినిమా ప్రయాణం గురించి వివరంగా చెప్పినా, నేను కోరుకున్నట్టే నాటకరంగం గురించి కూడా బోలెడు కబుర్లున్నాయని. వాటి గురించే కాదు, టివి, రేడియో, చిన్నపిల్లల నాటకాలు, ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్ – అసలు ఒకటని చెప్పడానికి లేనన్ని ఉన్నాయి.
నాటకాలని నా కళ్ళతో చూడలేకపోయినా, ఆవిడ మాటల్లో వినడం మహాప్రసాదంలా తోచింది.
******
ఏం కబుర్లవి, ఏం కబుర్లవీ?! ముఖ్యంగా థియటర్‍కి సంబంధించిన ముచ్చట్లు! ఎంత కాదనుకున్నా ఒక ముప్ఫై, నలభై ఏళ్ళ క్రితం జరిగిన సంగుతులన్నింటినీ, అప్పట్లో ఉత్తరాల్లో రాసుకున్న విశేషాలు బట్టీ, పూసగుచ్చినట్టు పుస్తకంలో చేర్చారు.
పెళ్ళై పిల్లలుండి, ఉద్యోగం చేస్తున్న ఆవిడ అది మానేసి ఏడాది పాటు పారిస్‍లో పర్యటించారు, నాటకాలని అధ్యయనం చేయడానికి. నగరంలో ఏ మూలన ఏ రోజున జరిగే నాటకానికైనా లేదూ రిహార్సల్‍కైనా హాజరు కాగల పాస్ ఒకటి పట్టుకుని, దేశంకాని దేశంలో, భాషతెలీని మనుషుల మధ్య తిరుగుతూ వాళ్ళు కళని ప్రదర్శిస్తున్న తీరుతెన్నులు బట్టి దానిలో మెలకువలు నేర్చుకునే విధానం ఏదైతే ఉందో… that was the most beautiful & insightful passages I ever read about “how to learn.” అంటే ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో ఫాన్సీగా అంటున్న “lifelong learner” (నిత్యవిద్యార్థి) అనేది మార్కెటింగ్ జిమ్మిక్ అనుకోవచ్చు కానీ, ఆవిడ ఆ కాలంలో, ఒంటరిగా ప్రయాణించి, పారిస్‍లో ఒంటరిగా ఉంటూ ప్రదర్శింపబడుతున్న నాటకాలని అధ్యయనం చేసిన విధానం, వాటిని గురించి రాసిన విధానం నేనైతే ఇంతకు ముందుకు చదవలేదు. బహుశా, సినిమా ప్రముఖుల బయోగ్రఫీలలో ఇలాంటి సంగతులుండి ఉండచ్చేమో. సాయి పరాంజపె అనగానే కూడా వినిపించేవి సినిమా పేర్లే! కానీ పుస్తకంలో మాత్రం దండిగా ఉన్నవి నాటకాలు కబుర్లు. ఆవిడ రాసి, తీసి, చేసిన నాటకాల గురించే కాదు, ఆవిడ చూసిన నాటకాలు, కల్సిన కళాకారులు, పనిచేసిన తోటివారు – ఇలా పుస్తకమంతా కళకళాడిపోయింది. అసలు ఎంత శ్రద్ధా, ఆసక్తి, ఆకళింపు చేసుకోగల సమర్థత, అన్నింటికన్నా ముఖ్యంగా ఆకలి (appetite) ఉంటే ఇంతిలా దాంట్లో నిమగ్నమైపోగలరనేది నాకింకా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం.
సాయిని ఇంకోసారి ఎవరన్నా “సినిమా మనిషి” అంటే లెక్చరిచ్చేస్తాను, జాగ్రత్త! ఆవిడ “సినిమా మనిషి కూడా!” Theatre is an intrinsic part of Sai. వాళ్ళ నాన్న తరుఫున వాళ్ళకి కూడా ఈ కళతో సంబంధముందని తెల్సుకున్నాక ఆవిడ, “ఓహో, ఇది నా రక్తంలోనే ఉందన్న మాట” అని మురిసిపోతారు. కానీ, ఏమో మరి, అలాంటో లింక్ లేకపోయినా ఆవిడ ఈ రంగాన్ని దున్నేసే ఉండేవారని నా ప్రగాఢ విశ్వాసం. (అసలు, ఆ ఈ రంగమని కాదులే, ఆవిడ ఏం చేసినా దున్నేయడమే!)
“పారిస్” అని ఒక చాప్టర్ ఉంది. చేయి పట్టుకుని అలా ఊరంతా తిప్పుకుని వస్తారు. What a brilliant writer she is! ఒక పక్క ఏం నాటకాలు, ఏ హాల్స్ లో జరుగుతున్నాయి, ఏం చేశారు అందులో లాంటి విషయాలే చెప్పుకుంటూ పోతూనే, ఇంకో పక్క ఆవిడకి లైన్ వేస్తున్న పారిస్ అబ్బాయిలతో “ఏం, మీ ఇంట్లో అమ్మా అక్కా లేరా?” అనాల్సిన అవసరం పడలేదనీ, ఫ్రెంచ్ భాష రాకపోయినా వచ్చినట్టు ఫోజ్ కొట్టి పడిన భంగపాటులూ, అంత చలిలో రోజూ స్నానం చేయాలా వద్దా అన్న టాపిక్ మీద లాండ్ లేడీతో వాదోపవాదాలు, రోడ్డుపై కనిపించే మనుషులు ఏ కాలంలో ఎలాంటి బట్టలేసుకున్నారు కూడా చెప్పుకుంటూ భలే కామెడీ చేస్తారు.
అలానే, ఇండియాకి తిరిగొచ్చాక, పారిస్‍కి వెళ్ళకముందూ కూడా ఎలాంటి నాటకాలు వేశారన్నది ఎంత వివరంగా రాశారంటే – ఈ ఒక్క పుస్తకం ఒక ట్రెనింగ్ మెటీరియల్‍గా కూడా పనికొస్తుంది, కథలు రాసేవాళ్ళకి – సినిమాలకైనా, నాటకాలకైనా, పుస్తకాల్లో రాసేవైనా. ఏ ఊహ/ఆలోచన నుంచి కథ ఎలా పెరిగి పెద్దదైందీ, దాన్ని ఆవిడ ఎలా జాగ్రత్తగా మల్చుకుంటూ వచ్చిందీ, ఎక్కడ తిరకాసుపెట్టిందీ, పేరెలా నిర్ణయించిందీ – అన్ని వివరాలూ పంచుకున్నారు. This book is so deeply about craft! Craft of playwriting! Craft of production of a play! Craft of theatre!
Craft of life!
******
సినిమాల గురించీ బోలెడు రాశారు. ముఖ్యంగా చష్మె బద్దూర్, సాజ్ లాంటి సినిమాలు ఎక్కడి నుంచి మొదలై ఎలా రూపు మార్చుకుని చివరకి సినిమాలుగా వచ్చాయన్న ప్రయాణాన్ని తెల్సుకున్నప్పుడు అసలు ఒకే కథ, ఏ మాత్రం సంబంధం లేదనిపించే ఇన్ని విభిన్నమైన ఫార్మాటుల్లో ఎలా కుదురుకుంటుందా అని ఆశ్చర్యమేసింది. అంటే, అయితే సినిమా లేదా షార్ట్ ఫిల్మ్, లేదూ వెబ్ సీరీస్ అన్న త్రికోణంలో ఇరుక్కుపోయిన ప్రస్తుత తెలుగు (సినీ) రచయితలకి “నువ్వో టెలీఫిలమ్ తీసి, దాన్నే సినిమాగా మార్చగలవు, తెల్సా?” అని చెప్తే స్పందన ఎలా ఉంటుందా అని నా కుతూహలం. అసలు తెలుగు సాహిత్యానికి, నాటకానికి, సినిమాకి సంబంధం లేకపోవడమే వల్లే ఇంత నాసిరకం సినిమాలు వస్తున్నాయని నా మిడిమిడి జ్ఞానం చేసే కామెంట్!
నాటక రంగంలో జరిగే అనేక పాలిటిక్స్, డబ్బులేక వచ్చే ఇబ్బందులూ, నాటకాన్ని వేయలేక మానుకోలేక పడే ఇక్కట్లూ అన్నీ రాసినా, సినిమారంగంలో వాటి ప్రస్తావనే వచ్చినప్పుడు బాగా తాకాయి. బహుశా ఆవిడ ఎత్తుకున్న పేర్లన్నీ సుపరిచితమవ్వడం వల్లనేమో. నసీరుద్దీన్ షాహ్, ఫారూఖ్ షేక్‍తో ఆవిడ అనుబంధం లెజండరీ. పుస్తకం వెనుక అట్ట మీద నసీర్, “నసీరుద్దీన్ షాహ్, ప్రెసిడెంట్, సాయి పరాంజపె క్లబ్ ఫాన్ క్లబ్” అని రాసుకునేంత అనుబంధం. నసీర్ ఆత్మకథకి మరాఠి అనువాదం చేసి సాహిత్య అకాడమీ అవార్డు పొందారు సాయి.
బాసూ భట్టాచార్య, సంజీవ్ కుమార్ విషయంలోనే తెల్సిన సంగతులు నిరాశపరిచాయి. ఆవిణ్ణి ఎంత సతాయించాలో అంతా సతాయించారు. ఇందుకే అంటారు గొప్ప కళాకారులు అయినంత మాత్రన మంచి మనుషులు కాలేరు!
******
ఈ పుస్తకం ఇంకొద్ది రోజుల్లో అందుతుందనగా, ఫేస్‍బుక్ లో సత్యవతిగారితో ఒక లైవ్ సెషన్ జరిగింది. దాంట్లో: “యాభై, అరవై దశకాల్లో స్త్రీలు నిర్విరామంగా కృషి చేసి, పోరాటం చేసి సంపాదించుకున్న స్పేస్‍ని, హక్కుని తర్వాతి తరాల వరకూ అందిపుచ్చుకోలేదు. టివి సీరియల్స్ చూస్తూ గడిపేయడం చాలుననుకున్నారు” అని ఒక మాట అన్నారు. అది నన్ను చాలా గట్టిగా కొట్టింది. మా ముందు తరం (అంటే ఇప్పుడు యాభై, అరవైలలో ఉన్న మహిళలు) ఏం చేశారన్నది పక్కకి పెట్టినా, ప్రస్తుతం ఉన్నవాళ్ళం (అంటే ఇప్పుడు ఇరవై, ముప్ఫైలలో ఉన్నవాళ్ళం) అటు పాట్రియార్కీకి ఇటు కాప్టిలిజంకి మధ్య కొట్టుమిట్టాడుతూ స్త్రీగా మా ఉనికేంటోనన్న స్ఫృహ కూడా కలగనంత బిజీగా అయిపోతున్నాం. ఇప్పటికీ మహిళా దినోత్సవమంటే ఆఫీసంతా పింక్‍తో నింపేస్తుంటారు. స్టార్టప్ ఫండింగ్ అప్లికేషన్‍లో ఒకరైనా మహిళ ఉంటే ఇన్వెస్ట్ చేస్తారని అంటారు, కానీ అందరూ మహిళలలే ఉంటే డబ్బులు పెట్టడానికి వెనుకాడతారు. వీటిని గురించి ఎంత ఆలోచిస్తున్నాం? ఎలా ఆలోచిస్తున్నాం?
శాంతా గోఖలే, ఇంకో జూమ్ సెషన్‍లో ఒక మాట అన్నారు, “మన వెనుకటి తరాల వాళ్ళు ఏం చేశారు, మన అమ్మమ్మలు ఎక్కడివాళ్ళు? ఎలాంటి వారు? మన సోషల్ హిస్టరీస్ ఎలాంటివి? ఇవేం తెల్సుకోలేకపోతే మన ఎదుర్కుంటున్న సమస్యలు కొత్తగా పుట్టినివా, పాతవే కొత్తగా వచ్చాయా? అన్నది తేల్చుకోలేం. ఇప్పుడు ప్రతీ దానికీ టెక్నాలజిని అంటున్నాం. ట్రోలింగ్ నుంచి మాబ్ సెన్సరింగ్ వరకూ. కానీ ఇవి మన ముందు తరాలు ఎదుర్కున్నాయా? ఎదుర్కునుంటే వాళ్ళేం చేశారు? లాంటివి తెల్సుకోవాలి మనం.”
సాయి పుస్తకం చదువుతున్నంత సేపూ నాకీ రెండు మాటలూ బుర్రలోనే ఉన్నాయి. అసలు, ఒక మనిషి అన్ని రంగాల్లో, అంత విశేష కృషి చేయడం సాధ్యమా అన్నది నాకింకా అంతుపట్టని విషయం. ఏదో అప్పుడే స్వాతంత్ర్యం వచ్చింది కాబట్టి, అన్నీ కొత్తకొత్తగా మొదలవుతున్నాయి కాబట్టి వీళ్ళకి అవకాశాలు ఎక్కువ, కాంపిటీషన్ తక్కువ అని కొట్టిపారేయచ్చు కానీ, అదే నిజమనుకున్నా వీళ్ళసలు ఎంత తెగువతో, ఎంత “నేను అనుకుంటే చేసి తీరతా” అన్న స్పిరిట్‍తో పనులుచేశారో! ఉదాహరణకి, అప్పుడే టెలివిజన్ మొదలైంది కాబట్టి అప్పటికే నాటకాలు, ఫిల్మ్ ఇన్‍స్టిట్యూట్‍లో మంచి పేరు తెచ్చుకున్న సాయికి ప్రోగ్రామ్ డైరెక్టర్ అవ్వడం పెద్ద విశేషం అనిపించకపోవచ్చు. అదో అక్సిడెంటనే అనిపించచ్చు. కానీ ఆమె అందులో “హట్కే”వి చేస్తారు. అప్పట్లో నగరాల్లో మహిళా డ్రైవర్ల గురించి ఒక ప్రత్యేకమైన సీరిస్ చేశారంట. వారానికో మహిళా డ్రైవర్‍తో! How cool is that! ఇప్పటికీ మధ్యాహ్నం టివిలలో “సఖి” లాంటి ప్రోగ్రాముల్లో కుట్లూ అల్లికలూ, వంటలూ వార్పులు తప్ప ఇంకేం మాట్లాడరు! And this lady did the things she did in the 60s and the 70s!
ఈ పుస్తకం ద్వారా నాకు, ముఖ్యంగా ఒక మహిళగా, “ఇది మెంటల్ నోట్ చేసుకుని నేను పాటించకపోతే నన్ను నేనే మొట్టికాయలు వేసుకుంటా” అనిపించేవి కొన్ని ఉన్నాయి. వాటిని ఇక్కడ ఇస్తున్నాను. (అలా అని మగవాళ్ళు చదవకూడదా అని మొదలెట్టకండి. అందరికీ పనికొచ్చేవే, కానీ మహిళలకి ఎక్కువ అవసరం.)
- డబ్బు విషయంలో మొహమాటాలు పక్కన పెట్టి, ఖచ్చితంగా లావాదేవీలు చూసుకోవడం ముఖ్యం. సాయి, తన కెరీర్‍లో, డబ్బు విషయంలో మాట్లాడక నష్టపోయారు. వేరేవాళ్ళకి వచ్చినంత జీతం ఆమెకి రాలేదు. ఏ సందర్భంలోనైనా ఈ విషయాన్ని నిస్సంకోచంగా ప్రస్తావించారు.
- Unapologetic career choices: ఇంకా కాలేజ్‍కి వెళ్తున్న సమయంలోనే రేడియోలో పార్ట్ టైమ్ ఉద్యోగం మొదలెట్టారు, న్యూస్ రీడర్‍గా. అప్పటినుంచి ఏదో ఒక రంగంలో తనదైన ముద్రని వేసుకుంటూనే పోయారు. దానికోసం భర్తకి, పిల్లలకి దూరంగా ఉండాల్సి వచ్చినప్పుడు ఉన్నారు. ఒంటరిగా ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు చేశారు. అటూ-ఇటూ పరిగెత్తితే కానీ పూర్తవని పనుల కోసం పరిగెత్తారు. వాటిని నెమరువేసుకోవడంలో మాత్రం ఎలాంటి అపాలజీకి, “అయ్యో!”కి స్థానమివ్వలేదు. It felt like I was reading a man’s memoir because she never ever, not even for one second, brought in the feeling of doing some kind of injustice to family by being such an aggressively career-oriented woman.
- ఏ అవకాశమొచ్చినా అందుపుచ్చుకోవాలి. దాంట్లో నేర్చుకోడానికి ఏదో ఒకటి ఉంటుంది. అది మనం చేసే పనిలో ఇంకేదోలా దోహదపడుతుంది. అందుకని ఒక కుతూహలంతో పనులు చేసుకుంటూ పోవాలి. ఆవిడ ఈ పుస్తకానికి “A Patchwork Quilt” అని పేరు పెట్టడంలో, తాను ఏ రంగంలో కుదురుగా ఉండలేకపోవడం కారణమని నవ్వులాటగా చెప్పినా, నిజానికి, she pulled off a massive feat in her life. And she’s a woman who is very well aware of that fact!
- స్పర్ష్ సినిమా తీస్తున్న క్రమంలో బసు భట్టాచార్య (ప్రొడ్యూసర్) వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆయన తీస్తున్న సినిమాని నేషనల్ అవార్డ్ కి పంపించి, స్పర్ష్ ని వెనక్కి ఉంచేయాలని ప్లాన్ వేశాడు. సాయికి ఆ విషయం అర్థమై ఆఘమేఘాల మీద పనులు పూర్తి చేయించి అవార్డుకి పంపించారు. అది నాకు చాలా ముచ్చటగా అనిపించింది. మన పని మీద మనకి ఎంత గౌరవం లేకపోతే దానికి సముచిత స్థానాన్ని, అవార్డుని ఇచ్చే అవకాశం కోసం ప్రయత్నిస్తాం. (అవార్డు వస్తుందా రాదా అన్నది వేరే విషయం). ఆ విషయంలో సాయికి మంచి జడ్జ్మెంట్ ఉంది తన పని మీద. అది ఎంత దూరం వెళ్ళగలదూ, ఎప్పుడు చతికిలపడగలదూ అన్నది ఆమె గమనించుకుంటూనే ఉంటారు! (ఇప్పుడసలు “విమెన్ ఇన్ టెక్” అన్న టాపిక్ మీద ఎవరు మాట్లాడినా, అమ్మాయిలు గొడ్డుచాకిరి చేస్తారే గానీ నోరువిప్పి జీతం పెంచమని అడగరు, లేదా అవార్డులకి నామినేట్ చేసుకోరు – ఇవే వినిపిస్తుంటాయి. కొంతవరకూ ఆడవాళ్ళు ఈ విషయంలో వెనుక ఉంటారన్నది నిజం కూడా! కానీ స్టేజ్‍లెక్కి స్ఫీచుల్లో ఇచ్చే సోది టిప్స్ కన్నా ఇలాంటి జీవితాలని చదువుకుంటే బోలెడు ధైర్యం, స్థైర్యం!)
*****
పుస్తకం మొదలవ్వడమే “ఏముంది మన జీవితంలో, ఏం రాస్తాంలే అన్న నిర్లిప్తత అంతా పోయి, ఫ్లైట్ ఎక్కాల్సిన టైమ్ అయ్యిందని తెల్సాక గబగబా ఒక చిట్టీ ముక్క రాసి మన గుర్తుగా వదిలినట్టు నేనీ పుస్తకం వదిలేస్తున్నాను.” అని రాశారు.
అది చదవగానే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అసలు సాయికి ఎనభై నాలుగేళ్ళన్న స్పృహే లేదు నాకు, ఈ పుస్తకం ప్రస్తావన వచ్చేదాకా. నా బుర్రలో ఆవిడ యాభై, అరవైలు దాటలేదు ఎందుకనో. అంటే, ఆవిడది మా నాన్నమ్మ వయసు. కానీ ఆవిడ గురించి ఇంత చదివాక కూడా నాకు ఆవిణ్ణి “సాయిఈఈఈఈ” అనే పిలవాలనిపిస్తుంది. గారు లేదు, జీ లేదు, ఇంకేం లేదు. ఒట్టి సాయి! అంతే!
ఇంకో తమాషా ఏంటంటే, ఇప్పుడు ఎక్కడైనా ఆవిడ ఫోటో కనిపిస్తుంటే “ఓహ్… సాయి ఇలా ఉంటారు కదా!” అని కొత్త మనిషిని చూసిన ఫీలింగ్ వస్తుంది. మళ్లీ అది పక్కకు పెట్టేయగానే నా సాయి నా సాయిలానే కనిపిస్తుంటారు. మళ్ళీ అలానే బోలెడన్ని కబుర్లు, కథలు చెప్పేస్తుంటారు. గలగలా నవ్వుతూ.
I do hope that this quilt can provide some warmth and comfort to those it reaches. I am a hardcore optimist, and always look for a silver lining. A gloomy situation can be savaged by peppering it with a dash of humour. […] If my work – in this case my book, my quilt – can bring a smile to the face of the reader, why then, I will be happy to smile back in return, blissful in the knowledge that a mission has been accomplished.
ఆవిడ నాకోసమే, అచ్చంగా నాకోసమే, రాసినంత అపురూపంగా అనిపించింది ఈ పుస్తకం అందుకున్నప్పటి నుంచి. జీవితం మనకి ఇవ్వడానికి నిరాకరించినవాటిని, మళ్ళీ ఏం బుద్ధి పుడుతుందో మరి, మరో విధంగా మన దగ్గరకి చేరవేస్తుంటుంది. అసలు ఏ మాత్రం సంబంధం లేని మనుషులని ఆత్మీయులంత దగ్గర చేసేవాటిల్లో కళ కూడా ఒకటి. మన అనుకున్న మనుషులు మనకి దూరమైపోయినా వాళ్ళు మన దగ్గర వదిలిపెట్టిపోయిన అభిరుచులు మన జీవితాన్ని ఎంతలా పోషిస్తాయి (nourishing) అనేది కూడా ఈ పుస్తకం ద్వారానే తెల్సింది. “చష్మె బద్దూర్” తెలీని అజ్ఞానంలోనే నేను ఉండిపోయుంటే సాయి ఇంత ప్రేమతో అల్లిచ్చిన ఈ క్విల్ట్ నాకు ప్రాప్తమయ్యేది కాదుగా!
(పోయిన వారం సాహిత్య అకెడామి అవార్డు అందుకున్న సమయంలో సాయి పరాంజపె, సత్యవతిగార్ల ఫోటో… వీళ్ళద్దరినుంచి పొందిన స్పూర్తి చాలానే ఉంది. నేను కాస్త #fangirling పక్కకు పెట్టి, సాలిడ్ వర్క్ ఏదైనా చేయడమే నేను వీళ్ళకి చెప్పుకునే థాంక్స్!)
Jai Arjun Singh’s blog:
https://jaiarjun.blogspot.com/2020/11/from-childrens-theatre-to-chai.html
సత్యవతి
You did it, Purnima.
There is warmth in your review.
ns murty
This is a very interesting review of Sai Paranjpye’s book.
I am not a great fan of movies but, that did not stop me from reading this. Every life is an interesting saga when it is properly presented. Your review has tempted me to place the order for the book on Amazon.