పుస్తకం.నెట్ – అజెండాలు – అభాండాలు

తెలుగులో ఒక ఆన్‍లైన పత్రిక (ప్రింట్ పత్రికలెటూ మనలేకపోతున్నాయిలే) నడపడమెంత దుర్భరమో, జటిలమో, ఎంత నష్టదాయకమో అంటూ వాపోయే పోస్టులు, పరామర్శలు బాగానే వినిపిస్తుంటాయి తెలుగు సాహితీ వీధుల్లో, సోషల్ మీడియా పోస్టుల్లో. మరి వాళ్ళకున్న కష్టనష్టాలు వాళ్ళకి మాత్రమే పరిమితమని, వాళ్ళతో పాటుగా వేరే పత్రికలు నడుపుతున్నవాళ్ళకీ అచ్చంగా అవే కాకున్నా అలాంటివే ఏవో సమస్యలూ, తలకాయనొప్పులూ ఉంటాయనీ, అందుకని చేయూతనిచ్చి, ప్రోత్సహించేలాంటి పనులెటూ మనకి చేతకావు కాబట్టి కనీసం ఎవరి మానాన వాళ్ళు ఉందామనే ఇంగితం కూడా ఉండదెందుకో మరి, తోటి పత్రికా నిర్వాహకులకి! వీళ్ళచేత ఏవో మాటలు పడడం, పడి ఊరుకోవడం చేశాము ఇన్నాళ్ళూ! కానీ, మాకూ ఓపికలు చస్తాయి కదా, ఎంతని భరిస్తారు ఎవరన్నా ఎన్నాళ్ళైనా? 

పుస్తకం.నెట్ ఎందుకో, అదేమిటో మొదలుపెట్టిననాటి నుండి గొంతు చించుకుని చెప్తున్నాము అందరికీ! ఇన్నేళ్ళలో అది సాధించింది ఏమైనా ఉందా, లేదా అన్నది మాకనవసరం. ఓ పదేళ్ళ తర్వాత దీన్ని ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా అన్నది మాకనవసరం. మేము బతికున్ననాళ్ళూ మమ్మల్ని ఆడిపోసుకుంటూనే ఉంటారన్నది నిజం – అయినా అది కూడా మాకనవసరం! 

“ట్రోల్” అన్న పదం జనప్రాచుర్యంలో లేని రోజుల్లోనే, నిండా పాతికేళ్ళు లేని వయసులోనే, ఇంటర్నెట్‍లో దారుణాతి దారుణంగా ట్రోల్ కాబడ్డ పత్రికా నిర్వాహకులం మేము. “ఆడోళ్ళు పెట్టిన సైటది. ఆడసైటది. అందుకే గేట్లు మూసుకుని బయటకు రాకుండా కూర్చుంటారు,” అని కనీసం అసలు-పేరు రాసే దమ్ములేని ఒకడు వాడి మగతనాన్ని అలా వెళ్ళగక్కాడు. “పూర్ణిమ, సౌమ్య జైలుకి” అని బ్లాగ్ హెడ్డింగ్ పెట్టాడు ఇంకోడు. “వాళ్ళు ముస్లిమ్ వ్యతిరేకులు, అందుకే నన్నూ నా కవిత్వాన్నీ తొక్కేస్తున్నారు,” అంటూ బలగాన్ని పోగేశాడు ఇంకో పేరుపొందిన కవి. ఇవ్వన్నీ జరిగినప్పుడు కూడా మేమేం ఈ వేదిక మా చేతుల్లో ఉంది కదా అని మా మనోభావాలూ, అభిప్రాయాలూ “ఎడిటోరియల్” కిందకు తోసేసి ముక్కు చీదుకోలేదు. 

మాకు మీ ఖర్చీఫులూ అక్కర్లేదు. శాలువాలు అంతకన్నా అక్కర్లేదు.

మేము ఎప్పుడూ అడిగిందొక్కటే: మీరు చదివిన పుస్తకాలు గురించి రాసి పంపండి.

అదీ అడగడం మానేశాము. మీ ఈగోలకి ధూపదీపనైవేద్యాలు సమర్పించే తీరికా, ఓపికా ఉన్నన్నినాళ్ళూ చేశాము. ఇహ, చేయలేకపోతున్నాం, కాబట్టి ఇప్పటి వరకూ వచ్చిన వ్యాసాలని, సాహితీ సంపదని భద్రంగా ఉంచడం తప్ప, వచ్చే అడపాదడపా వ్యాసాలని వేయడం తప్ప ఇంకేం చేయలేమని సవినియంగానే చెప్పుకున్నాము ఏడాది మొదట్లోనే! 

అయినా కూడా పుస్తకం.నెట్ రాజకీయాలు చేస్తుందని, అజెండాలు నడుపుతుందని పింగ్ చేసి మరీ సతాయించడంలో అర్థమేమిటి? మాకున్న కుటుంబ, ఆరోగ్య, ఉద్యోగ ఒత్తిళ్ళలలో కూడా రెండు ముక్కల్లోనే అయినా మీకు సమాధానం చెప్పి పక్కకు తప్పుకుంటున్నామంటే మాదెంతటి సంస్కారమో తెలీడం లేదా?!  

ఫేస్‍బుక్‍లో సెప్టంబర్ 2020లో నా వాల్ మీద పోస్ట్ పెట్టాము, పుస్తకం.నెట్‍కి వ్యాసాలు తక్కువొస్తున్నాయి, వీలు చూసుకుని రాసి పంపండంటూ. దానికి మా ఇద్దరి ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్నవాళ్లు బాగానే స్పందించారు. రాస్తామన్నారు. “మీరు చాలా పని మంచి పనిచేస్తున్నారు” అని కూడా అన్నారు ఒకళ్ళిద్దరు. ఆ ఒకళ్ళిద్దరికీ ఫోన్లొచ్చాయి వెంటనే, “వాళ్ళు చేస్తున్న పనిని మెచ్చుకుంటావా?” అంటూ! 

ఇప్పుడు చెప్పండి, రాజకీయాలు ఎవరు చేస్తున్నారో, మేమేదో కీర్తి మూటకట్టుకుపోతున్నామని ఏడుస్తున్నదెవరో?!

మా కెరీర్లలో మేం టాప్ ఉన్నాం. పుస్తకం.నెట్ కాకుండా కూడా మేం సాహిత్యానికి మాకు చేతనైనంత, వీలుకుదిరినంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నాం. ఈ వెబ్సైట్‍ని నిర్వహించేది మా రెస్యూమెలో పెట్టుకోడానికి కాదు. మాకు రెగ్యులర్ ఉద్యోగాల్లో కాకుండా మరే వేదికల్లో అయినా (టెక్ కాన్ఫరెన్సులో, భారతీయ భాషా సాహితీ సమావేశాల్లో) పరిచయం చేసుకున్నప్పుడు మాత్రం పుస్తకం.నెట్‍ని ముందు తల్చుకుంటాము. అదీ కూడా “community driven website” అని చెప్పుకుంటాము. మేము traditional senseలో “పత్రికా సంపాదకులం” కాము, ఎవరెలా రాసినా మేము వీలైనంత వరకూ మార్చకుండా, వాళ్ళ వ్యక్తీకరణకి సముచిత స్థానాన్ని ఇస్తూనే టైపోలవీ కరెక్ట్ చేస్తాం తప్ప ఇంకేం చేయము అని కూడా ప్రస్తావన వస్తే వివరణ ఇస్తాం. ఇది పూర్తిగా ఒక కమ్యూనిటీ ముందుకి రావడం వల్ల జరిగిన పని అని నొక్కివక్కాణిస్తాం. 

ఎందుకు? 

ఎందుకంటే, తెలుగువాళ్ళకి ఆ స్పృహ ఉన్నా లేకపోయినా, పుస్తకం.నెట్ అతి ప్రత్యేకమైన ప్రయత్నం (an extra-ordinary idea) కనుక. బహుశా వెబ్ 2.0లో తక్కిన భారతీయ భాషల్లో అరుదుగా జరిగిన లేదూ అసలు జరగని ప్రయత్నం కనుక. పదమూడేళ్ళ పాటు నిరాటంకంగా పుస్తకాల గురించి చెప్పుకున్న కబుర్లు కనుక. సగటు సాహిత్య పత్రిక కాదిది కనుక. కథలూ, కవితలు కాదు కదా కనీసం పుస్తకాలకి సంబంధించిన కొన్ని విషయాలనీ entertain చేయము కనుక. మీకు పుస్తకాలు ఉచితంగా ఇచ్చేసుకోవాలని ఉన్నా, ఈ సైట్‍లో హోస్ట్ చేయము కనుక. మీచేత పుస్తకాలు ఇప్పించుకుని మీకనుగుణంగా రివ్యూలు రాస్తూ కూర్చోము కనుక. మా పుస్తకాలే అచ్చైనా, అవ్వబోతున్నా, మేం వేదికలెక్కినా, ఉపన్యాసాలిచ్చినా ఈ వెబ్‍సైట్‍ని వాటికి వాడుకోము కనుక! మా వ్యక్తిగత ఇష్టాయిష్టాలకీ, ఐడియాలజీలకి అనుగుణంగానే వ్యాసాలు ఎంపిక చేసి వేయము కనుక. విశ్వనాథ సత్యనారాయణ గురించి పోస్టులెక్కువుంటే అది మేము చక్రాలు తిప్పి రాయించుకున్నవి కావు, కాంట్రిబ్యూటర్స్ కి ఏది నచ్చితే అది రాశారు కనుక. ఈ పదమూడేళ్ళల్లో పుస్తకానికి సంబంధించి వచ్చిన వ్యాసాల్లో మేం వేయమని తిప్పి పంపినవి పట్టుమని ఐదు కూడా ఉండవు కనుక. పుస్తకం.నెట్‍లో వచ్చిన ఇతర వ్యాసాలకి మనోభావాలు గాయపర్చుకుని కొందరు, వాళ్ళ పుస్తకాలకే నెగిటివ్ రివ్యూలు రావడం తట్టుకోలేక మతాన్ని అడ్డుపెట్టుకున్న కొందరు,  వాళ్ళ ఈగోలని మేం పెంచి పోషించడం లేదని కొందరు రాయడం మానుకున్నారే తప్ప వాళ్ళో రచయిత/పుస్తకం గురించి రాస్తే, మేం కాదన్న దాఖలాలే లేవు కనుక!  

ఇది అచ్చంగా పాఠకుల వ్యక్తీకరణకి మాత్రమే ప్రత్యేకించిన చోటు! పాఠకులిగా మీకేం నచ్చినా, నచ్చకపోయినా, ఆలోచింపజేసినా, చేయించకపోయినా ఇక్కడ రాసుకోవచ్చు! అట్లాంటి పాఠకులకి ఓ వేదికనివ్వడం తప్ప మాకు మరింకేం దురుద్దేశ్యాలూ, దురభిమానాలూ లేవు. 

మేమేం రాజకీయాలు చేయడం లేదు, మాకే అజెండాలు లేవు, మమ్మల్ని అపార్థం చేసుకోకండి అని అభ్యర్థించడం కోసం రాయడం లేదీ పోస్టు. 

మేం రాజకీయాలు చేస్తామనీ, మాకు అజెండాలు ఉన్నాయనీ, వాటితోనే పుస్తకం.నెట్‍ని నడిపిస్తున్నామనీ మరోసారి ఏ సాక్ష్యాధారాలు లేకుండా నోటికొచ్చినట్టు మాటలనేసి పక్కకుపోతే మా వ్యక్తిగత స్థాయిలో ఎటూ తప్పదు, పుస్తకం.నెట్ తరఫున కూడా సమాధానం అందుకోవాల్సి ఉంటుంది. ఎవరు, ఏమన్నది పబ్లిక్ డొమెన్‍లో (మాకు అనుకూలమైతే) పంచుకోడానికి వెనుకాడబోము. అసలు, మీరే ఏం కుట్రలూ, కుతంత్రాలూ నడుపుతున్నామో బహిరంగంగానే పంచుకుంటే (ఎటూ ఇట్లాంటి గోసిప్ మెటీరియల్ అంటే తెలుగు ఆన్‍లైన్ పత్రికలు సొంగ కారుస్తాయి కాబట్టి) మాకా పని కూడా తప్పించినవారవుతారు. మీరూ, మీ భజన బృందాలు, (మీరు ఊహించుకుంటున్న) మా భజన బృందాలూ కల్సి ఆన్‍లైన్ కచేరీ పెడితే మేమూ నోరెత్తకుండా ఎవరు ఎవరో, ఎవరివి ఏ రాజకీయాలో తెల్సుకుని తరిస్తాం. 

మేం మౌనంగా ఉండేది భయపడిపోయో, బెదిరిపోయో కాదు. పాప్‍కార్న్ నములుతూ మాట్లాడ్డం కష్టం కనుక! 

Toxic masculinity, casual sexismతో నిండున్న తెలుగు ఆన్‍లైన్ జగత్తులో దాదాపు పదిహేనేళ్ళ బట్టీ మైదానం వదిలిపారిపోకుండా ఉన్నామంటే, ఉండి జుట్టు పీక్కుని రోడ్లెక్కేంత పిచ్చెక్కిపోకుండా ఉన్నామంటే, మాకు తోచిందే రాస్తూ, మాకు చేయాలనిపించిందే చేస్తూ ఉన్నామంటే మాది కూడా  మామూలు సత్తా కాదని అర్థమవ్వాలి కదా! మా అంతట మేం రాజకీయాలు, అజెండాలు మొదలెట్టకపోవచ్చు.  కానీ మా మీద గానీ, ముఖ్యంగా ఈ సైట్ మీద గానీ మీకేం తోచకో, లేదూ మీ కుళ్ళునింక లోపల దాచలేకో రాజకీయాలో, నిందారోపణలో మొదలెడితే, we’re game for some fun! 

Pustakam.net has always been an epitome of certain values and passion, and it always shall stand for those. As long as at least one of us is on our feet, this website will be up and running. Whether someone contributes to it or not. Whether someone cares for it or not. 

Any aggression towards this website will be met with aggression. Ours is aggression that will not be seen but felt! Brace up for it before you advance. You’ve been duly warned! 

-పూర్ణిమ 

పుస్తకం.నెట్    

You Might Also Like

4 Comments

  1. గరికపాటి పవన్ కుమార్

    అద్భుతం! మీరు చేస్తున్న పనిలో నీతీ, నిజాయితీ, ఒక పరమార్థం ఉన్నప్పుడు ఇంత నిక్కచ్చిగా భావాలను ప్రదర్శించగలరు. బురదజల్లే వాళ్ళను, ఆ… వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు అనే పాత తరం మనస్తత్త్వానికి స్వస్తి పలికి కొత్త నెత్తురుతో ఉత్సహిస్తున్న ఈ తరానికి మీరు ఆదర్శం. ముందుకు సాగండి.

  2. నరేష్ నందం

    మీరు పుస్తకం.నెట్ ద్వారా ఇంతకుముందెవరూ చేయని మంచిపని చేశారు. ఇప్పటికీ చేస్తున్నారు. అందుకు అభినందనలు.
    అనుమానాలు, అవమానాలు, ఆరోపణలు తెలుగోళ్లలో మామూలే కాబట్టి, ఆ నోళ్లని, టైపు చేసిన వేళ్లని అక్కడే వదిలేసి మీ మానాన మీరు ముందుకు పోండి. మీకు శుభాకాంక్షలు.

  3. Anil అట్లూరి

    Ignore those trolls!
    Keep marching.
    With you all the way.

Leave a Reply