ఒక చదువరి రెండవ విన్నపం

 వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి                                          

మనిషి చనిపోయినట్టు ఎలా నిర్ధారిస్తారు?

కవులు/భావుకులు ప్రకృతిలోని ప్రతి అణువునూ ‘ప్రాణి’ గా చూడగలరు. ఒక శరీరిగా కాదు, ఒక అనుభూతి చెందగలిగిన జీవిగా చూడగలరు. అందుకే వారు చంద్రుడిని, ఆకాశాన్ని, నదిని, పర్వతాన్ని చూసినపుడు వాటిని ‘మానవీకరణం’ చేస్తారు తమ భావనలో. అంటే మానవులమైన మనం ఎటువంటి అనుభూతులను పొందుతామో అవన్నీ వాటికి ఆపాదిస్తారు.

ఇది కొద్దో గొప్పో అందరం చేస్తాం. ఉదాహరణకు పిల్లలు క్రింద పడినప్పుడు క్రింద నేలని కోప్పడినట్టు నటిస్తూ ‘ఏయ్, దెబ్బ తగిలిస్తావా’ అని నేలను అంటూ పిల్లలను సమాధానపరచడం కొంత కాలం క్రితం వరకూ ఉండేది. 

(ఈ విషయంలాగే కవుల మానవీకరణ చర్యనూ మెచ్యూరిటీ లేని విషయంగా లోకం పరిగణిస్తుంది. లోకం తన నలుపును తానెరుగదు లెండి. లోకం మానవులనే అమానవీకరణం చేస్తూ ఉంటుంది. అంటే మానవులు సాటి మానవుల అనుభూతులను, సున్నితత్వాలను ఏమీ లెక్క చేయరు. ఇది ‘maturity’నా? కాదు. ‘ మెచ్యూరిటీ’ కవులకెంత లేదో కవులను గేలి చేసేవారికీ అంతేలేదు అన్నది వేరే చర్చ.) 

కవులు (శరీరిగా మాత్రమే కాక) అనుభూతి చెందగలిగేది గా దేన్నైనా మానవీకరించి లేదా మనుష్యులతో పోల్చి చెప్తున్నారంటే అందులో వారు అసలు చెప్పదల్చుకున్న ముఖ్య విషయానికి దీన్ని సహాయంగా తీసుకున్నారని మాత్రమే అర్థం.

భూమాత అనడంలోనే అమ్మ అడగనప్పుడు కూడా అన్నం పెట్టినట్టు, భూమి మీద పెరిగే చెట్లు పండ్లు, కాయలు మన ఆకలి తీరుస్తాయి అనే వాక్యం చెప్పడానికే అమ్మతో పోల్చుకోవడం జరుగుతుంది. వరుణుని రాకకు భూదేవి పులకరించింది అన్న మాటలో వర్షం పడితేనే భూమి మీద విత్తనం మొలకెత్తుతుంది పుష్పిస్తుంది పంట పండుతుంది అనే వాక్యం చెప్పడానికే మానవుల ప్రణయంతో పోల్చి చెప్పడం ఉంటుంది. 

అయినంత మాత్రాన శరీరి కాని వాటికంతా నిజంగానే ఇలాంటి అనుభవం ఏమీ ఉండదు అని కవులకు తెలీదని కాదు. ఇటువంటి అనుభూతి ఉంటే ఎలా ఉంటుంది అని కల్పన చేసుకొని చదువరుల ఊహలో తమ కల్పనను సాకారం చేసి చూపగల ఒక ప్రత్యేక శక్తి ఆ కవులది. 

వాటిలో భాగంగానే పాత కాలంలో జీవితకాలం వెచ్చించి కావ్యం వ్రాసినప్పుడు ‘తమ బాగోగులను చూసుకుంటా’మని మాటిచ్చి తమను ప్రోత్సహించిన వారికి కావ్యం అంకితమిచ్చినప్పుడు కృతిని కూతురని, స్వీకరించిన వారిని కృతిభర్త అనీ అన్నారు. కృతికి నామకరణాలూ, పాణిగ్రహణాలుగా వీటిని భావించేసి; చదవబడని, ఆదరం పొందని వాటిని ‘మరణించినట్టు’గా భావించి దహనాదులు జరపాలనడం వికృతమైన ఆలోచన. ఆ మాటే సహ్యం కాదు, కాబట్టి  దహనోత్సవం (అనే ఒకానొక ప్రహసన రచన) పుస్తకం చదవాలనుకోవడం లేదు. 

మొదటి విషయానికొస్తే – మనిషి చనిపోయినట్టు ఎలా నిర్ధారిస్తారు? ఊపిరితిత్తులు, గుండె, మెదడు వీటిలో ఏవి ఆగిపోయినా చనిపోయినట్టు ఆ శరీరాన్ని పంచభూతాలలో కలిపేస్తారు. ఎందుకంటే ఇవి ఆగాక మళ్ళీ పనిచేయవు అని ఖచ్చితంగా తెలుసు కాబట్టి. పనిచేయవు అని తెలుసుకోడానికి ఒక శాస్త్రీయమైన పద్ధతి నిరూపించబడి ఉంది కాబట్టి. అప్పటికీ వీటిలో కొన్ని చాలా బలహీనంగా ఉన్న స్థితిలో కోమా అని చెప్పి చాలాకాలం ఆ శరీరాన్ని బయటిసహాయాలతో రక్షిస్తూ ఉంటారు. ఇక పని చేయదు అని తీర్మానం అయ్యాకే మరణం అంటారు.

ఒక పుస్తకాన్ని ఇక చదవరు అని ఎవరు ఎలా తీర్మానిస్తారు? ఫలానా ఫలానా కావ్యాలను, ఇతర రచనలను సమకాలీనులు వ్యర్థం అనీ, హానికారకం అనీ భావించి నిషేధాలు విధించినా , అవి కూడా తర్వాతి కాలాలకు పనికి వచ్చిన ఉదాహరణలు చరిత్రలో కోకొల్లలు. మరి?!

కాలక్రమంలో మంచి చెడుల కొలమానాలు ఒకేలా ఉండడం లేదని చరిత్రలో నిరూపణ అయిన విషయం. శరీరబలం, మాతృత్వం, పాలనాపద్ధతులు వంటి వాటి గుర్తింపు దేశకాలపరిస్థితులననుసరించి మార్పు చెందింది.  

అంతేనా! కొంతకాలం వ్యావహారిక భాష పనికే రాదన్నారు. తర్వాత అదే ఎంత ముఖ్యమైందో చూస్తున్నాం. కొంతకాలం ప్రామాణికమైన భాషే తప్ప మాండలికాలు అసలు అచ్చులో రానివ్వలేదు. ఇప్పటి పరిస్థితి? మాండలికాలకే జేజేలు!! మరి??

ఒక పుస్తకం నేటికి పనికిరాకపోవచ్చు. ముందుకాలానికీ పనికిరాకపోవచ్చు. కానీ చెట్లేలేని కాలానికి ఆముదం చెట్టు ఒకటి మిగిలినా మంచిదేనేమో ఎవరికి తెలుసు?

నిజమే, నేటి కవిత్వాలూ, కథలూ నేనూ చదవను. నాకసలు నచ్చవు. అయినంత మాత్రాన వాటినన్నిటినీ కాల్చివేయాలని నేను అనను.

‘కవిత్వం’ ఒలికిపోతోందని సభలు, సన్మానాలలో మొహమాటాల చాటున చాలా గొప్పగా కొనియాడబడుతున్న ఆధునిక’కవితల’ను నేను కవిత అని కూడా అనను. రాతలనే వ్యవహరిస్తాను. చదవడం, ఆనందించడం అనే ప్రసక్తి కూడా రాదు.

అవి కూడా వీరికి, ఇంత గొప్ప చదువరులకు ఆనందం కలిగిస్తున్నాయా అని ఈసడించుకుంటాను. వాటి ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం సభామర్యాద కాదు.

 అసలు ప్రపంచంలో పనికిరానిది ఇది అంటూ తీర్మానించగల అర్హత ఎవరికి ఉంది? నేను పద్యం అర్థం చేసుకోగలను అని పద్యం చదివితే , వచన కవిత నాకర్థమౌతుంది అని ఇంకొకరు అది చదువుతారు, ఇంకొకరు నాకు హైకూ చాలంటారు. 

ఎవరి పొట్టకు తగిన ఆహారం వారిది. పెద్ద జంతువును మాంసాహారులు స్వీకరిస్తే చిన్న పురుగులను పక్షులు, కీటకాలు స్వీకరిస్తాయి. పచ్చని అందమైన చెట్లతో పాటు జంతువులు, పురుగులు , చివరికి కనిపించని బాక్టీరియా కూడా ప్రకృతికి అవసరమే. దాంట్లో మంచి చెడు చేసేవి రెండూ ఉంటాయి. రెండు బాక్టీరియాలూ సమతుల్యతకు అవసరమే. సింహం మన కుందేలు పిల్లను చంపితే విలన్, తోడేలును చంపితే విలన్ కాదు అనేవన్నీ మన ఇరుకైన దృష్టి. ప్రకృతికి రెండుపనులూ అవసరమే. ఊహూ. అవసరమో కాదో సహజమే.

ఔను. అవసరమో కాదో సహజమే.

అలాగే రచనలు అని ఉన్నప్పుడు మంచి రచనలు చెడు రచనలు అని ఉంటే అది మన దృష్టి. అంతే. మన వరకూ ఏది మంచి రచన ఏది వ్యర్థ రచన అని దృష్టి ఉండడం సహజం. అంతేకానీ మనకు వ్యర్థం అనిపించినవి ఉండకూడదనడం రాక్షసం. రాక్షసమే.

వ్యక్తీకరణ అందరికీ వచ్చే విద్య కాదు. ఇది ఒక కళ. అబ్బినవారికే అబ్బుతుంది. కానీ వ్యక్తీకరించకుండా ఉండలేకపోవడం బలహీనత. దాన్ని మనుషులకుండకూడదు అనడం అసహజం. 

కొందరు బొమ్మ గీసినంత అందంగా వ్యక్తీకరించగలరు. కొందరు తుమ్ము ఆపుకోలేనట్లు మాత్రమే వ్యక్తీకరించగలరు. నచ్చని వారం దూరంగా తప్పుకోవాలి గానీ పాపం తుమ్మొద్దంటే ఎలా?

ఇది కొంచెం రూడ్ గా అనిపిస్తుందేమో నావ్యాఖ్య. పైగా ‘ముందు మీరా పుస్తకం చదవలేదు, చదివితే తెలుస్తుంది’ అని ఎవరైనా అంటారేమోనని ఊరుకున్నా. అసలు ఆ దహనపు ఆలోచనే నచ్చలేదు. నిజమే, వ్యర్థ రచనలు ఉంటాయి గానీ అలా నిర్ణయించడంలో ఎవరికైనా సామర్థ్యం ఉందా? ఉందంటే అది మాత్రం అందరికీ ఆమోదయోగ్యమైన తీర్పా? 

స్వయంగా గుణాఢ్యుడే, అంత కవే తనది యోగ్యమైన రచన అని నిర్ధారించుకోలేకపోయినట్టేగా, తన అవమానాన్ని దృష్టిలో ఉంచుకొని దహించడానికి సిద్ధపడ్డాడు. మరి? కాబట్టి సుకవి, కుకవి, చదువరులు, విమర్శకులు ఎవరూ ఇది దహించదగినది అని చెప్పేందుకు సమర్థులు కారు. తప్పొప్పులు ఎంచవచ్చు. ఇష్టాఇష్టాలు ప్రకటించుకోవచ్చు. కానీ దహిస్తే? 

ఆ భయానికి సుకవులు కూడా జంకరని ఏమిటి నమ్మకం? అదెంత నష్టం?

ప్రపంచంలో చెడునంతా నిర్మూలించలేనట్టే , చీకటి నంతా పోగొట్టలేనట్టే వ్యర్థరచనలను పోగొట్టలేం ఏం చేసినా. మంచి, చెడు, చీకటి , వెలుతురు లాగే సార్థక రచన, వ్యర్థరచనలను ఎవరి లోకజ్ఞత, రసజ్ఞత లను బట్టి వారు నిర్ణయించుకోవాల్సిందే. అవి కూడా వైయక్తికమే. లోకానికంతా వర్తించేది కాదు.

కుకవి నింద అనేది అనాగరీకం అన్న కొత్త తరమే నిందను దాటి పుస్తక దహనం కావించడం ఏమిటి? ఇదెంత అనాగరీకం?

తమ పుస్తకాలనే అయోగ్యంగా భావించే, రియలైజ్ అయ్యే హక్కు కవులకూ ఉండొచ్చు. అది మెచ్యూరిటీనే. అంతకన్నా గొప్పగా వ్రాయొచ్చు. కానీ వాటిని దహించమనడం? ఆత్మహత్య, పరువుహత్య, సంతానహత్యల వంటిదే అవదా??

ఏమాత్రం నాణ్యత లేని రచనలు కుప్పలుగా చేరడాన్ని పరిహరించడానికి, డిస్కరేజ్ చేయడానికి మార్గం లేకపోలేదు. 

దహనోత్సవంలా గాలిలో మేడలు పద్ధతి  కాకుండా కొంచెం ప్రాక్టికల్ గా  ఆలోచిద్దాం.

గ్రంథాలయాలకు ప్రభుత్వం పుస్తకాలు కొనడం గురించి

పల్లెబడులలో గ్రంథాలయాలు ఎన్నున్నాయో వాటిని విద్యాశాఖ ఎంత పట్టించుకుంటుందో నాకు తెలీదు. మేము చదువుకున్న పల్లెలో బడిగ్రంథాలయంలో విద్యార్థులకు ప్రవేశమే లేదు. స్టాఫ్ రూమ్ కూడా అదే. అటుగా వెళ్తున్నప్పుడు కళ్ళబడినంతలో లోపలున్న ‘సా’ర్లు కూడా ఏదో మాట్లాడుతున్నట్టుండేవారే గానీ పుస్తకాలు చదవడం, సర్దడం వంటి పనులు కూడా చూడలేదు.అది కూడా పెద్ద క్లాసులకొచ్చాకే అక్కడో లైబ్రరీ ఉందని మాటగా విన్నామంతే. ప్రత్యేకం లైబ్రేరియన్ అనే ఉద్యోగమూ లేదు. నా ఊహ ప్రకారం చాలా పల్లెలలో ఇదే స్థితి ఉండుండొచ్చు. ఇంట్లో లైబ్రరీని చూసినవాళ్ళది భాగ్యమే నా దృష్టిలో. 

నిజానికి బడులలో గ్రంథాలయాల ఆలోచన గొప్పది. కొన్ని ప్రాంతాలలో ప్రతిరోజూ ప్రతి విద్యార్థీ గ్రంథాలయాలలో ఒక పుస్తకం తీసుకొని చదివి నోట్స్ వ్రాసి చూపాలన్నది నియమంగా పాటిస్తారని విన్నాను. అలా చేయడం ఎంతో గొప్పపని. చిన్నతనం నుంచీ చదవడం అలవడుతుంది. అది కూడా శ్రద్ధగా. తర్వాత టేబిల్ మానర్స్ లా లైబ్రరీ మానర్స్ అలవడుతుంది. అది ప్రతి చోటా జరిగితే నాలాగా సంతోషించే వారెందరో!

నగరాల్లోని పెద్ద విశాలమైన గ్రంథాలయాల్లో వేల కొలదీ పుస్తకాలుంటాయి. కొన్నిట్లో కాటలాగ్ , అరల అమరిక సక్రమంగా చేస్తూ, సౌకర్యవంతమైన మార్పులు చేస్తూ ఉన్న లైబ్రేరియన్ లను కూడా చూశాను. బ్రిటిష్ కౌన్సిల్ లైబ్రరీ, చెన్నై & కృష్ణదేవరాయాంధ్రభాషానిలయము, హైదరాబాద్, ఇంకా కొన్ని లోకల్ మునిసిపల్ లైబ్రరీలు చిన్నవి అలా గొప్పగా ఉన్నాయి. 

కొన్నిట్లో ముఖ్యంగా నేను చూసిన సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీలలో ఎక్కువ పుస్తకాలుంటాయి. కాటలాగ్ దొరకదు. అరల వారీగా అమర్చి నీట్ గానే పెట్టారు గానీ అంత పెద్ద హాలు చాలక ఇంకా ఎక్కువై పుస్తకాలు అలా పడి ఉంటాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఉద్యోగులు కొంత కష్టపడాల్సే వస్తుందక్కడ. 

పాతవి అమూల్యమైన పుస్తకాలు, కొత్తవి అద్భుతమైన పుస్తకాలు ఎన్నుంటాయో పాత చెత్తవీ, కొత్త చెత్తవీ కూడా అన్నుంటాయి. అంత చెత్త పుస్తకాలు ఎలా చేరుతున్నాయి?? పుస్తకాలు వ్రాసిన వాళ్ళనుంచి ప్రభుత్వం లైబ్రరీలకు పుస్తకాలు కొంటుంది. ఒకానొక మాండలీక భాషలో వ్రాసే రచయిత, పుస్తకాలు బాగానే అమ్ముడు పోతున్న, మంచి పేరే ఉన్న ఒక రచయిత మాటల్లో విన్నదేమంటే దురదృష్టవశాత్తూ ఇది ఒక వ్యాపారంగా మారిందని, తాను అసలు లైబ్రరీకి పుస్తకాలే అమ్మనని, ప్రభుత్వం ఇలా రచయితలనుండి, ప్రచురణకర్తలనుండి పుస్తకాలు కొనడం మానేయాలని, ఇందులో చాలా మోసాలు జరుగుతున్నాయని, అమ్మడానికే ఏవో పుస్తకాలు గబగబా వ్రాయించి ప్రచురణకర్తలు అమ్మడం, రచయిత/త్రి అనిపించుకోవాలన్న కోరికతో, అచ్చు పేరులో చూసుకోవాలన్న కోరికతో ఏదో తోచిందల్లా వ్రాసేయడం , వాటిని వ్రాసినవారే అమ్మడానికి స్వంతంగా పూనుకోవడం ఇవన్నీ కొంతకాలంగా ఏర్పడిన వికృతులు అనీ , అంతేకాక రచయిత కే తెలీకుండా వారి కాపీలను నాలుగైదు వేరే పేర్లతో ప్రచురణకర్తలు అమ్మిన ఉదాహరణ (ఒక స్వంత ఉదాహరణ)లూ ఉన్నాయనీ కూడా అన్నారు. కాబట్టి ప్రభుత్వం సాహిత్యాన్ని ప్రోత్సహించే పేరుతో లైబ్రరీకి పుస్తకాలు కొనడం మానేస్తే ఈ అక్రమాలలో కొన్ని ఆగొచ్చు అన్నారు. ఈ మధ్య విన్నఈ కావ్యదహనోత్సవం కన్నా ఇది చాలా ప్రాక్టికల్ థింకింగ్ గా అనిపించింది నాకు. మన ప్రభుత్వంలో ముఖ్యంగా తెలుగు రాజకీయనాయకులలో సాహిత్యం గురించి తెలిసినవాళ్ళు దాదాపు సున్నా. వీళ్ళు చేసే సాహిత్యోద్ధరణ అంటూ ఏమీ లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ పని మాత్రం మానేయాలన్నదే మంచిదని నాకనిపిస్తోంది. పుస్తకాల నాణ్యత గురించి లోతుగా పలుకోణాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అంత తీరిక గానీ, అభిలాష గానీ ఉండదు ప్రభుత్వాలకు. 

కొన్నేళ్ళ క్రిందటి వరకు ప్రతి ముద్రణాలయం ప్రచురించిన ప్రతి పుస్థకం కాపీలు చట్టరీత్యా నాలుగు జాతీయ గ్రంథాలయాలకు – మద్రాస్ (కన్పెమెరా), ముంబాయి, ఢిల్లీ, కలకత్తాలలోనివి _ పంపించ వలసి ఉండింది. ఇంకా ఈ నియమం కొనసాగుతున్నదేమో తెలియదు. సేకరణ చురుగ్గా సాగడానికి చేసిన బ్రిటిష్ వాళ్ళ కాలం లోని  పాత చట్టమై ఉండొచ్చు.

ఇప్పటి అన్ని ప్రభుత్వాలు నాణ్యతా పరిశీలన అంటూ ఏమీ లేకుండా గుడ్డిగా ఈ చట్టాన్ని అనుకరిస్తూ పాటిస్తున్న సంప్రదాయాల్ని వదిలిపెట్టాలి అని నా అభిప్రాయం.

పుస్తకాల క్రయవిక్రయాల గురించి –

పుస్తకాలు కొని చదివే అలవాటు మంచిది. ప్రతీ ఆధునిక పరికరానికీ ఎన్నో వేలు పెడుతున్నాం. పుస్తకాలకు అంతకన్నా విలువ ఎక్కువ. కానీ పుస్తకాలు కొని షెల్ఫుల అందం పెంచుకునే వారివల్ల సమాజ వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి ఏ ఉపయోగమూ లేదు. పుస్తకాలు కొని చదవండి అని చెప్పడం మంచిదే. కానీ కొనకుండా చదివిన వారిని ద్రోహులుగా చూపుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూ పుస్తకాలు కొనడాన్ని ప్రోత్సహించడం వల్ల కలిగేది తాత్కాలిక ప్రయోజనమే. పుస్తకాలు కొనడానికన్నా ‘చదవ’డానికి ప్రోత్సహించడం తెలిసిన సమాజాలే బాగుపడతాయి. దానికి పాతకాలపు సమాజాలు, నేటి విద్యాధిక సమాజాల ఉదాహరణలు చూడవచ్చు. పుస్తకాలు కొనడాన్ని మాత్రమే ప్రోత్సహించడం వల్ల వ్రాసేవారికి, ముద్రించేవారికి నాలుగు డబ్బులు రావడం తప్ప ఏమీ లాభం లేదు. వారికి కూడా ఏమీ అందులో లక్షలు, కోట్లు రావు. ఏదో ఇన్ని అమ్ముడుపోయాయి అన్న తృప్తి తప్ప. 

నిజంగా లోతైన అధ్యయనం చేసి ప్రతిభ, వ్యుత్పత్తి గలిగి రచనలు చేసేవారు, భావోద్వేగాలతో వ్రాసేవారు ఎవరూ అందులో డబ్బు చూడాలనుకోరు. అలాకాకుండా కొంత సమాచారం సేకరించి వ్రాసేవారు, సరదాకోసం వ్రాసేవారు, వ్రాసే ప్రతిభ మాత్రం ఉండి వ్రాసేవారూ వీరు అమ్మినా, ఆ డబ్బుతో వేరే చారిటీనే చేస్తారు గానీ డబ్బు మీద దురాశతో అమ్మరు. ముందే చెప్పినట్లు ఇందులో కోట్లు రావు. కానీ లేని పోని చెత్త ఈ పేరుతో కలెక్ట్ అవుతోంది ఫేస్ బుక్ లో మన పోస్ట్ ల వలె.

ఆ కాలంలో రాజులలో కొందరు అభిరుచి కలిగి ప్రోత్సహించినట్లు ఈ కాలపు ప్రభుత్వాలు చేయడం ప్రాక్టికల్ గా సాధ్యమయ్యే పని కాదు. రాజు ఒక్కని నిర్ణయం సర్వరీతులా యోగ్యమైనది కాకపోయినా నేటి ప్రభుత్వాలలో ఒకరి నిర్ణయంతో పని జరగదు. ప్రజాస్వామ్యంలో వివిధ పక్షాలు, యంత్రాంగం అంతా రకరకాల స్థాయిల్లో నిర్ణయాలుంటాయి కాబట్టి సాహిత్యోద్ధరణ వంటి ముఖ్యమైన అంశం ప్రభుత్వం చేతిలోకి తీసుకోకపోవడమే మంచిది. ‘డబ్బు సృష్టించే’ సాహిత్యం లేకపోవడమే మంచిది. స్వంత అభిరుచితో, కష్టాలకోర్చి వ్రాసే వాళ్ళ రచనలు మాత్రమే అయితే తక్కువ సంఖ్యలో వస్తాయి. ఇందులో ఎవర్నీ ప్రత్యేకంగా నిందించడం లేదని దయచేసి గమనించగలరు. 

ప్రభుత్వం లైబ్రరీలకు డబ్బు పెట్టి పుస్తకాలు కొనడం ఆపేయాలన్న సూచన విన్నాక నేననుకుంటున్నదీ చెప్పాలనుకుంటున్నాను. ఏదో కొంత వ్రాయాలన్న ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. ముద్రణ సులువయ్యాక మరీనూ. సొంత ముద్రణలొచ్చాక మరీమరీనూ. మంచిదే, కానీ ఆ పుస్తకాలు, లేఖరులు వాళ్ళ ప్రతిభతో వాళ్ళను పేరు తెచ్చుకోనీయండి. వెనుక నిలబడి తోయడం మంచి పద్ధతి కాదు. మొదటి పుస్తకానికే (ఎంత బాగా వ్రాసి ఉన్నా సరే) పెద్ద ఆవిష్కరణ సభలూ, సన్మాన సభలూ చేయకండి. ఇక సినిమా వాళ్ళనెందుకు అనడం? సినిమా రిలీజ్ , విజయోత్సవసభల్లాగే ఇవీ అయిపోలేదూ?! రెండు మూడు పుస్తకాలు వారి చిన్న లోకంలోనే వాటంతటవే అమ్ముడుపోయి పేరు తెచ్చుకోనీయండి. కొంత టైమ్ ఇవ్వండి. సహజంగా ఏర్పడే కీర్తిని లేఖరులకు దూరం చేయకండి. దగ్గరి మిత్రుల్లో వారి పుస్తకం నచ్చితే వారికే చెప్పండి లేదా మిత్రులకు చెప్పండి. అంతేకానీ పబ్లిక్ ప్లాట్ ఫార్మ్ లలో పెట్టి చేసే హంగామా వల్ల అబద్ధపు కీర్తి వారికేర్పడేలా చేస్తే వారికా మిత్రులే ద్రోహం చేస్తున్నట్లే తెలిసీ తెలియకుండా. ఇక అసలు కీర్తి వారి ఛాయలకు వచ్చే అవకాశం తగ్గిపోతుంది. 

అదేమిటీ ఇలా చేసి అసలైన ప్రతిభ వెలుగులోకి రాకుండా పోతే ఎలా అంటారా? అసలైన ప్రతిభ ఎప్పటికైనా వెలుగులోకి రానే వస్తుంది. నన్నెచోడుని కావ్యాలు , అన్నమయ్య పదాలు శతాబ్దాలైనాక బయటికి రాలేదా? అంతకాలం వేచి ఉండలేము, జీవితకాలంలోనే వెలికి రావాలి అంటారా? సరే, ఆపేరుతో నానా చెత్తా పేరుకుంటోంది చూశారా?! ఈ మిథ్యాభిమానాలూ వ్యర్థమైన ప్రోత్సాహకాలూ లేకుంటే వ్రాసే వాళ్ళు కూడా తొందర పడరు. నెమ్మది మీద , బాగా వ్రాయగలిగిన, మంచి స్థాయి గల రచనలే బయటికి వస్తాయి. 

నేటి అభ్యుదయవాదులంతా ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా మాట ఇదే. 

  • కొనడాన్ని కాదు చదవడాన్ని ప్రోత్సహించండి, బడిలోనూ, బయటా గ్రంథాలయాల నాణ్యతనూ, మెయింటెనెన్స్ నూ పెంచడం ద్వారా. (ప్రభుత్వం అన్నిటినీ కొని పడేసి గ్రంథాలయాలను కలుషితం చేయకుండా ఆపగలగాలి.)
  • తొలి తొలి రాతలకే విపరీత ప్రోత్సాహకాల పేరుతో సాహిత్య లోకాన్ని కలుషితం చేయకండి.

You Might Also Like

Leave a Reply