In the land of invented languages

నాకు ఈ పుస్తకంతో పరిచయం కాస్త వింతగానే జరిగిందని చెప్పాలి. జాన్ హాప్క్రాఫ్ట్ మా ఆఫీసుకు వచ్చినప్పుడు మా లాంటి అర్భకపు జనాభాతో ఆయనకి ముఖాముఖి ఏర్పాటు చేస్తేనూ, అప్పుడు ఏదో చర్చలో ఒకబ్బాయి అన్నాడు – “మనం అన్ని విధాలుగా సౌకర్యవంతంగా ఉండేలా, ప్రోగ్రామింగ్ కి అనువుగా ఉండేలా, జనం నేర్చుకోడానికి సులువుగా ఉండేలా ఓ భాషను కనిపెట్టలేమా?” అని. నిజం చెప్పొద్దూ, నాకు చాలా నవ్వొచ్చింది. సరే, తరువాత చర్చ కొనసాగింది, వివిధ విషయాలపై. కానీ, “అబ్బ చ! భాషలు కూడా అలా కనిపెట్టుకుంటామా ఏమిటి? అంత ముందూ వెనుకా చూస్కుని తయారు చేస్తే, అది సహజ భాష ఎలా ఔతుంది?” అనిపించింది. అంతా అయి, మళ్ళీ పనిలో పడ్డాక ఓ మెయిలు – “మనం అనుకున్నట్లు ఆ అబ్బాయి చెప్పింది నవ్వులాటేం కాదు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారట” అని ఈ సైటుకి లంకె ఉంది. వెళ్ళి చూస్తే, ఇంకేముంది – తెరిచిన నోరు తెరిచి అలాగే ఆ సైటు చూస్తూ ఉండిపోయా కాసేపు.

inthelandofఎస్పరాంటో తప్పితే ఇలా కనిపెట్టబడ్డ భాషలు ఉన్నాయని నాకు తెలీదు ఇప్పటిదాకా. పదకొండో శతాబ్దం నుండీ దాదాపు తొమ్మిదొందల భాషలు ఇలాంటివి ఉన్నాయంటే, వీటి వెనుక ఏళ్ళ తరబడి చేసిన కృషి ఉందంటే, వీటికి చాలామంది అభిమానులు ఉన్నారనీ, అసలు వీటన్నింటి గురించీ పరిశోధనలు ఇంత స్థాయిలో జరుగుతున్నాయనీ తెలిసాక నాకు కలిగిన ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ ఏమని చెప్పను. ఆశ్చర్యం దేనికో చెప్పనక్కర్లేదనుకుంటాను. ఆనందం దేనికంటే, నాకు ఊహతెలిసేనాటికే నాకో ఆశయం ఉండేది (ఇప్పుడు లేదు లెండి) – నేనో కొత్త భాషను, లిపితో సహా కనిపెట్టాలని. ఓ ఇరవై ఒకటి-ఇరవై రెండేళ్ళు వచ్చేదాకా కూడా ఆ కోరిక ఉండేది. ఇప్పుడు కాకుంటే ఏం, ఇంత పెద్ద జీవితంలో చచ్చేలోపు కొత్త భాష కనిపెట్టే చస్తాను అని. ఈ నేపథ్యంలో, ఇలాంటి ఓ పుస్తకం ఉందని తెలియగానే, చదవాలనిపించింది. అది ఇక్కడ దొరికే అవకాశం కనబడలేదు. అయితే, దానికి నాచేత చదివబడే ప్రాప్తం ఉంది కనుక, అమెరికా నుండి ఎగిరొచ్చింది 🙂

విషయానికొస్తే, ప్రపంచంలో వివిధ కారణాల వల్ల, వివిధ రకాలుగా, ఎంతో మంది కొత్త భాషలను కనిపెట్టారు. ఇది కొన్ని శతాబ్దాలుగా జరుగుతూనే ఉంది. వాటిలో కొన్నింటి గురించి వివరంగానూ, కొన్నింటి గురించి నామ్ కే వాస్తే గానూ, కొన్నింటిని కలిపి పేర్లు మాత్రం చెప్పీ – ఇలా రకరకాలుగా పరిచయం చేసారు ఈ పుస్తకంలో. రచయిత్రి Arika Okrent – ఆమె వెబ్సైటు మొదటిపేజీ అంటే నాకు చాలా ఇష్టం 🙂 పుస్తకం గురించి మాట్లాడుకుందామా? అంటారా? అదే ఇన్నాళ్ళ బట్టీ నాకున్న సమస్య. దీనిగురించి రాయాలనుకోడం, బ్లాగులో కాసేపు ఏదో వాగడం, మళ్ళీ వాగడం, మళ్ళీ వాగడం. అంతే! ఎలాగైనా ఈ పుస్తకం గురించి ఒకసారైనా సవ్యంగా రాయాలని తీర్మానించుకుని రాయడం మొదలుపెట్టాను ఇప్పుడు 🙂

అయ్యా! ఈ పుస్తకానికి నేను పెద్ద పంఖాను. కనుక, నేను కాస్త అతిగా పొగడొచ్చు – భరించగలరు.

అంతవరకూ ఆ పుస్తకం గురించి వినడమే – కానీ, పుస్తకం గురించి ముందుమాటగా రాస్తూ, రచయిత్రి స్టార్ ట్రెక్ సిరీస్ లోని క్లింగోన్ ను నిజజీవితంలో మాట్లాడేవాళ్ళ గురించి చెప్తూ వస్తున్నప్పుడు ముందు ముందు ఈ పుస్తకం ఎంత ఆసక్తికరంగా ఉండబోతోందో అర్థమైంది. “The nine hundred languages over nine hundred years, we do have evidence to suggest that the urge to invent languages is as old and persistent as language itself.” అన్నప్పుడు నాకు సందేహం – సహజ భాష అన్నదే సమస్యలతో కూడుకున్నదా? లేక సహజ భాషలో సమస్యలేకపోడం మనిషికి సమస్యై కొత్త భాష కనిపెట్టుకోవాలనుకుంటాడా? అని 😉 ఇప్పుడంటే, యంత్రాలకు మానవభాష నేర్పాలని ప్రయత్నించి, మన భాషల్లోని క్లిష్టత ను ఒప్పుకుంటున్నారు కానీ, మనుష్యులుగా మనం మాతృభాషను సులభంగానే నేర్చుకుంటామని నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనిషికి కొత్త భాష దేనికి? మనిషి కీర్తికాంక్ష కొద్దీ కూడా భాష కనిపెట్టొచ్చు. తన భాషలో తనకు నచ్చని అంశాలు తీసేసి, ఇతర భాషల్లో తనకు నచ్చిన అంశాలు తీసుకుని, తన అవసరానికి తగ్గట్లుగా భాష రూపొందించుకోవచ్చు – కానీ, భాష ఇంకోళ్ళతో సంభాషించడానికి కూడా కదా 🙂 అసలు మనిషి భాషెందుకు కనిపెడతాడు? అనుకుంటూ చదివాను ఈ మొదటి భాగాన్ని. చదివేకొద్దీ మనుషులకి కొత్త భాష కనిపెట్టడానికి గల కారణాలను చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగింది.

అన్నింటికంటే ముందుగా విల్కిన్స్ కనిపెట్టిన “ఫిలసాఫికల్” భాష గురించి సవివరంగా తెలిపారు. అంత వివరంగా పరిశోధించినందుకు – ఎవరు? అంటారా – విల్కిన్స్, మన రచయిత్రీ – ఇద్దరూనూ. చాలా గాఢంగా పరిశోధించి విల్కిన్స్ కనిపెట్టిన భాషను తానుకూడా చాలా పరిశోధించి అర్థంచేసుకున్నందుకు – ఇద్దరికీ ఒకే టోపీ తీసి నమస్కారం పెడుతున్నాను. సాంకేతికంగా ఆలోచిస్తే, విల్కిన్స్ భాష అద్భుతమైనది (నాకు దాని కాన్సెప్ట్ అర్థమైనంతలో). అయితే, ఆచరణలో దాన్ని ఉపయోగించడం దాదాపు అసాధ్యమైనట్లే. రచయిత్రి ఒకట్రెండు ఉదాహరణలతో దీన్ని వివరించిన తీరు నాకు చాలా నచ్చింది. కానీ, ఈ విషయం గురించిన చర్చలో భాషను గురించి లేవనెత్తిన ప్రశ్నలు చాలాసేపు ఆలోచనలో పడేశాయి. రాత్రి పగలౌతున్న వేళల్లో చాలాసార్లు కలల్లోనో…కలవరింతలుగానో…వెంటాడాయి. సంఖ్యలకూ, భాషకూ మధ్య ఉన్న సంబంధాన్ని చర్చిస్తూనో, ఊహిస్తూనో, పోలికలని అన్వయిస్తూనో, ఇలా ఎన్నో విధాలుగా మరి కొందరు కొత్త భాషల కోసం ప్రయత్నించారు. వీళ్ళ గురించి చెప్పిన భాగం పేరు – “A calculus of thought”. ఆ పేరు వింటూ ఉంటేనే మనసులో రకరకాల ఆలోచనలు. ఆలోచనలకు కాల్క్యులస్ కూ సంబంధం ఏమిటో! ఆలోచనల కాల్క్యులస్ ఏమిటో! అని. ఆ పేరు అలా నిలిచిపోయింది నా ఆలోచనల్లో.

ప్రపంచశాంతి కోసం, వివిధ దేశాల మధ్య భాషా పరమైన అడ్డంకులు లేకుండా ఉండటానికి, కనిపెట్టిన రకం భాషలు ఒక రకం – వీటిలో చాలామటుకు అప్పటికే ఉన్న భాషలపై ఆధారపడి నిర్మించబడ్డవే. ఎస్పరాంటో ఇలాంటి వాటిలో అన్నింటికంటే బాగా ప్రాచుర్యం పొందిన భాష – ఇలాంటివి తక్కినవి చాలానే ఉన్నప్పటికీ కూడా. ఎస్పరాంటో మాతృభాషగా గలవారు కూడా ఉన్నారని తెలిసి ఆశ్చర్యం కలిగింది నాకు. ఇలాంటివే మరిన్ని భాషలు – ఒక్కో భాషకీ ఒక్కో ఆశయం. ఒక్కొక్క భాష సృష్టికర్తకూ ఒక్కో విధమైన ఆత్మవిశ్వాసం – తన భాష గొప్పతనం గురించి. ఓ పక్క ఎస్పరాంటో, దాని తరహాలో ఉన్న మరిన్ని భాషల గురించి తెలుసుకుంటూ ఉండగా – ఆడవారి మనోభావాలను మరింత వివరంగా, స్పష్టంగా తెలిపేందుకు అనువుగా ఉన్న భాష ఒకటిట. తర్కానికి అందే విధంగా ఉండే భాష మరొకటిట. ఒకటి ఒక నవలలోని పాత్రల కోసమట, ఒకటి మరింకేదో దానికోసం.

వీటి మధ్యలో లిపిలేని కంటి భాష కు, సంజ్ఞల రూపంలో లిపిని సృష్టించే ప్రయత్నాల గురించిన కథలు. వీటిలో బ్లిసింబాలిక్స్ గురించిన కథ అన్నింటికంటే ఆసక్తికరమైనది. ఒక్కోసారి ఈ భాషల సృష్టికర్తలలో ఉన్న విపరీతస్వభావాల గురించి రచయిత్రి పుస్తకం మొదట్లో కొంత వివరణ ఇచ్చారు కానీ, ఈ ఉదంతం చదువుతున్నప్పుడు అది మరింత బాగా అర్థమైంది. భాషవల్ల ప్రయోజనాలు, దాని సృష్టికర్త వల్ల ఉన్న ప్రమాదాలు – రెండింటి మధ్య పాపం గుడ్ సమారిటన్ల అవస్థలు -వీటి వల్ల వచ్చిన సంఘటనల్లో ఉన్న డ్రామా ఎలిమెంట్ – చదవడానికి ఎంత ఆసక్తికరంగా ఉండిందో, ఆలోచించేకొద్దీ అందులో ఉన్న సాధకబాధకాలు అంత అనుభవం లోకి వచ్చాయి.

అసలీ భాషా సృష్టికర్తల సంగతి సరే, వాటి వీరాభిమానులు, వాటిని మాట్లాడేవారి సంగతో? క్లింగోన్ వంటి భాషలకు జరిగే సమావేశాలూ, వారి భాష గురించి వారికున్న విపరీతాభిమానం, అలాగే, ఎస్పరేంటో సమావేశాలూ – వాటికి వచ్చే వ్యక్తులూ, వీటి గురించి, వీటి వల్ల కలిగే లాభాల గురించి వివరించే వ్యక్తులూ – వీళ్ళందరి గురించి కూడా ఈ పుస్తకం చదివితే ఓ అవగాహన వస్తుంది. ఎస్పరాంటో మాట్లాడేవారు ఒకరిద్దరితో ఆ మధ్య ఓ బ్లాగు టపా రాసినప్పుడు జరిగిన సంభాషణల్లో వారికి తమ భాష అంటే ఉన్న అభిమానం అర్థమై – భాషాభిమానానికి సహజ భాషా, కృత్రిమ భాషా అన్న తేడాలేదని స్పష్టమైంది.

“కొత్త భాష ఎందుకు?” అన్న ప్రశ్నకి ఈ పుస్తకంలో చాలా జవాబులు ఉన్నాయి. వెర్రి వెయ్యి విధాలనుకున్నా, భాష నిత్యనూతనం – ఎప్పుడూ కొత్త భాషకు చోటుంది అనుకున్నా – ఎలా అనుకున్నా, ఈ పుస్తకం మీకు ఎన్నో విషయాలను గురించి తెలుపుతుందనడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. భాష గురించి నాలో కొత్త ఉత్సాహాన్ని సృష్టించి, మరింత చదవడానికి, ఇలా కృత్రిమ భాషల నిర్మాణం గురించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి నన్ను పురికొల్పిన పుస్తకం ఇది.

ఎక్కడికక్కడ రకరకాల భాషల గురించిన ఉదాహరణలు పెట్టడం నాకు నచ్చింది. ఆ ఉదాహరణల ద్వారా భాష మనకి అర్థం కాకపోవచ్చు. కానీ, కనీసం ఈ భాషలో ఇలాంటి పదాలున్నవి అని తెలుస్తోంది కదా. పైగా అన్ని భాషల్లో ఉదాహరణలు సృష్టించాలంటే రచయిత్రి ఎంత కృషి చేసి ఉంటుందో ఊహించుకోవచ్చు. చివర్లో ఇలాంటి కృత్రిమ భాషల జాబితా కూడా ఉంది. మూడు భాషలకి మూలం భారతదేశంలో ఉండటం ఆశ్చర్యం. ఓ పక్క మూడేనా? అనీ, ఓ పక్క మూడున్నాయా! అని ఏకకాలంలో అనిపించింది. వీటి గురించి వివరాలు తెలియజేయలేదనుకోండి, అది వేరే విషయం.

మొత్తానికి మీకు “భాష” అన్న పదం మీద ఏ కాస్త ఆసక్తి ఉన్నా తప్పక చదువవలసిన పుస్తకం.

పుస్తకాన్ని నాకు తెచ్చిచ్చినందుకు మాలతి గారికి ధన్యవాదాలు.

పుస్తకం వివరాలు:

In the land of invented languages (esperanto rockstars, klingon poets, loglan lovers, and the mad dreamers who tried to build a perfect language)
author: Arika Okrent
publishers: Spiegel & Grau
publication: 2009

పుస్తకానికి ఇండియన్ ఎడిషన్ అందుబాటులో లేదు అనుకుంటాను. నేను చదివినప్పటికి ఇది అమేజాన్ వంటి సైట్లలోనే కొనుగోలుకు ఉంది. కొనుగోలు వివరాలు ఈ పుస్తకం వెబ్సైటులోనే ఉన్నాయి.

Update:

You Might Also Like

5 Comments

  1. Philosophies of Language and Linguistics-5 « sowmyawrites ….

    […] 6) మామూలు భాషలో కొన్ని పదాలకి అర్థాలు వేరైనా అవి ఒకే వస్తువును సూచించడం; ఒకే పదానికి వేర్వేరు అర్థాలుండడం వంటివి భాషలోని లోటుపాట్లుగా భావించి, ఇలాంటి ambiguities కి తావు లేని Logical sign language ఒకటుండాలని ప్రతిపాదించాడు. (ఈ విధంగా అయోమయాలకి తావులేని భాషలు కనిపెట్టాలన్న కోరికతో ఇప్పటి దాకా తొమ్మిదొందల పైచిలుకు కృత్రిమ భాషల సృష్టి జరిగిందంటే ఆశ్చర్యంగా ఉన్నా నమ్మక తప్పదు. ఈ విషయం గురించి – In the land of invented languages అని ఒక పుస్తకం చదివాను కొన్నాళ్ళ క్రితం. దాని గురించిన పరిచయం ఇక్కడ). […]

  2. పుస్తకం » Blog Archive » 2010లో చదివిన ఇంగ్లీషు పుస్తకాలు

    […] In the land of invented languages అనేది ఒక అద్భుతమైన పుస్తకం. ఎంత అద్భుతమైన పుస్తకం అంటే, మనం taken for granted గా వ్యవహరించే భాషల గురించి లోతుగా ఆలోచించే వీలు కల్పిస్తుంది. ఒక మనిషి మరో మనిషికి తానేమనుకుంటున్నాడో తెలియపరచటానికే భాష. ఉన్న భాషలు, వాటి అర్థాలూ, అంతరార్థాలూ ఎన్ని ఉన్నా, అవి ఎప్పుడూ అరకొరగానే ఉన్నాయన్న నిజాన్ని గుర్తెరిగి, ఏటికి ఎదురీది విశ్వజనీయమైన ఒక భాషను కనిపెట్టాలని కలలు గన్న కొందరి గాధలు! ఈ పుస్తకం చదివాక, నాకూ కాస్త పైత్యం ఎక్కి, కొన్ని స్మైలీలను తయారుచేశా.. o/ అనేది ఆవలింతకు సూచిక అని. అంతలా ప్రభావితం చేసింది. (ఎంతలా? అన్నది మీరు నిర్ణయించుకోండి) […]

  3. పుస్తకం » Blog Archive » Through the language glass

    […] ఉన్నా, అరికా ఒక్రెంట్ రాసిన “In the land of Invented Languages” పుస్తకం చదివాక  అసలు భాష ఎలా […]

  4. Malakpet Rowdy

    How did I miss this? Really an informative one.

  5. On “In the land of invented languages” « sowmyawrites ….

    […] My introduction to the book at pustakam.net can be seen here. […]

Leave a Reply