రైతు కవిత – ఒక చర్చ, పరిశీలన

చర్చా సమీక్షకుడు : శం. నారాయణస్వామి

[2005 నవంబర్ 5 వ తేదీన DTLC (Detroit Telugu Literary Club, USA) వారి మీటింగులో జరిగిన చర్చ సందర్భంగా రాసిన సమీక్ష]
*****************************************************************************************
రైతుకవిత – ఇందులో, 1985 నుండీ 2000 సంవత్సరం వరకూ వివిధ పత్రికల్లో రైతు జీవన నేపథ్యం మీద వెలువడిన 75 కవితల్ని సంకలించారు. మూడింటిని మినహాయిస్తే మిగతావన్నీ రెండు పేజీలు దాటని కవితలే. ఏ కవిదీ ఒకటి కంటే ఎక్కువ కవిత లేదు. కవులలో అవార్డు గ్రహీతల్నించీ, కవులుగా పేరుపడ్డ వారి దగ్గర్నించీ, ఏదో అప్పుడప్పుడూ పేరు వినబడుతుండే వాళ్ళూ, సాధారణ పాఠకులకి కవులుగా పరిచయం లేని వాళ్ళూ వున్నారు. విప్లవ ఫెమినిస్టు మైనారిటీ వాదాలకి కట్టుబడ్డ వాళ్ళున్నారు. వాదాలకి దూరంగా వుండే వాళ్ళూ వున్నారు. ఇలా ఇందులో చేరిన కవుల్లో విస్తృతమైన వైవిధ్య ముంది.

చర్చలో వెసులుబాటు కోసం ఈ పుస్తక పరిశీలనని కొన్ని ముఖ్య భాగాలుగా విభజించుకున్నాము.

1. నేపధ్యం
2. Themes – వస్తువు
3. భాష, గొంతు
4. నిర్మాణం, శిల్పం, శైలి

నేపధ్యం :
ఈ పుస్తకం ఒక వర్తమాన సాంఘిక పరిశీలనా పత్రంగా చాలా విలువైనది. 1988 లో ఒంగోలు జిల్లాలో పత్తి పంట విఫలమవటంతో పత్తి రైతులు అప్పుల పాలై అనేక సందర్భాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ తరువాతి పదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం పార్టీల చేతులు మారినా రైతుకి వొరిగిందేం లేదు సరి కదా రైతు పరిస్థితి మరింత
క్షీణించింది. రైతు దేశానికి వెన్నెముక లాంటి నినాదాలు తుప్పు పట్టి పోయాయి. వాటి స్థానే దేశ వ్యాప్తంగా ఆర్ధిక సంస్కరణలూ, అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలూ రైతు జీవితాన్ని నిర్దేశించనారంభించాయి. బహుళజాతి వ్యాపార సంస్థలు వ్యవసాయానికి మూలమైన విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందుల సరఫరాని నియంత్రించటం మొదలైంది. వీటికి తోడు దేశ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతులకీ స్థానిక వ్యవసాయానికీ బలాన్నిచ్చే పాలసీలని రూపొందించి అమలు చెయ్యటంలో పూర్తిగా
విఫలమయ్యాయి. కొన్ని పరిస్థితుల్లో రైతునీ, రైతు బాధల్నీ నిర్లక్ష్యం చేశాయి.

ఇది కాక 1998 నుంచీ 2002 వరకూ వరసగా జూన్ మాన్‌సూన్ విఫలమై ఆంధ్రదేశంలో తీవ్రమైన కరువు పరిస్థితి నెలకొన్నది. వాన పడకపోతే పంట నిలవదు. పంట నిలిచినా కోత కొచ్చేలోపు ఏ తుపానో వచ్చి కొట్టుకు పోతుంది. ప్రకృతి కరుణించి, ఇలాంటి అవాంతరాలన్నీ దాటి పంట బాగా పండితే మార్కెట్లో గిట్టూబాటు ధర పలకదు. 1988 లో పత్తి రైతులు మాత్రమే ఎదుర్కున్న నిస్సహాయ స్థితి 1998 వచ్చే సరికి చెరకు, మిరప, ఇతర పంటల రైతులకీ ఎదురవుతున్నది. రైతు జుట్టు షావుకారు గుప్పిట్లో ఉండటం కొత్త కాదు. కానీ గత పదిహేనేళ్ళలో ఈ పరిస్థితి మరింత విషమించిందని ఈ మధ్య కాలంలో పెరుగుతూ వస్తున్న రైతు ఆత్మహత్యల సంఖ్యే చాటుతున్నది. దేశం వెలిగి పోతోందనీ, రాష్ట్రం ప్రగతి పథంలో మూందుకు పోతోందనీ నినదించటం ఆత్మవంచన చేసుకోవటమే. ఇది సభ్య సమాజమంతా అవమానంతో తలదించుకోవలసిన సందర్భం.

ఈ పుస్తకంలోని కవితలు ఈ నేపధ్యంలో పుట్టినవి. ఈ నేపధ్యాన్ని ప్రతిబింబించటంలో, దాని వెనుక కార్య కారణ సంబంధాల్ని వెలికి తీయటంలో, ఎంచుకున్నది కవితా మాధ్యమం కనుక ఎంత కవితాత్మకంగా చెప్పగలిగారో పరిశీలించటానికి ఈ చర్చలో ప్రయత్నించాము.

వస్తువు

ఆరు ముఖ్యమైన వస్తువులు (themes) కనిపిస్తున్నాయి ఈ పుస్తకంలో.

    భూదేవి – దేశం – అమ్మ
    రైతు – వృత్తి ఔన్నత్యం – రైతు జీవితం
    పత్తిపంట – పురుగుమందు – ఆత్మహత్యలు – రైతు కుటుంబాల దీన స్థితి
    కరువు – వర్షం కోసం ఎదురు చూపులు – రాయలసీమ
    గ్లోబలైజేషన్ – అంతర్జాతీయ ఒప్పందాలు – బహుళజాతి సంస్థల నియంతృత్వం
    రైతు స్త్రీల అధోగతి, ముఖ్యంగా రైతు ఆత్మహత్య నేపధ్యంలో.

భూమిని తల్లిగా భావించటం పాత వాడుకే. ఈ కవితల్లో అమ్మకీ భూమికీ తేడా లేనట్టు చొప్పిన పోలిక బలంగా ధ్వనిస్తుంది. దేశం, దేశమాత లాంటి ప్రతీకలు అక్కడక్కడా కనిపించినా, దానికింటే సకల జీవానికి మాతృత్వం వహించే భూమే ఒక elemental mother గా కనిపిస్తుంది. చిన్నపద్యమైనా ఒక epic fantasy పద్ధతిలో కొప్పర్తి “తల్లీ భూదేవీ” అద్భుతమైన కవిత. భూమికీ మనిషికీ అనాదిగా ఉన్న సంబంధాన్ని తాత్త్విక దృష్టితో ఆవిష్కరించారు కవి.

రైతు జీవితాన్ని వృత్తి ఔన్నత్యాన్ని సెలబ్రేట్ చేస్తున్నట్లు, మొదటి కవిత నాగభైరవ కోటేశ్వర రావుగారి “నేను” తప్ప కనబడలేదు. ఈ మధ్య కాలంలో రైతు జీవితంలో సెలబ్రేట్ చేసుకోవటాని కేం లేదు అని కవుల భావన కావచ్చు. పత్తి పంట వైఫల్యం, ఆత్మహత్యలు, కరువు, వానకోశం దాహంతో ఎదురు చూడటం – ఈ సంకలనంలోని ఎక్కువ కవితలకి వస్తువులుగా ఉన్నయ్. ఈ దారుణ కరుణామయ పరిస్థితులకి మన కవులు ఎలా స్పందించారో, ఎలా విశదీకరించారో పరిశీలిద్దాము.

భాష, గొంతు, శిల్పం, శైలి ఈ ఆరు వస్తువులనీ విశదీకరించటంలో రకరకాల శైలీ శిల్ప విన్యాసాలు ఉపయోగించారు కవులు. దయ, కరుణ, జాలి – ఆందోళన, అసహనం, కోపం – నిర్భయత్వం, నిబ్బరం – ఇవి ఎక్కువగా ధ్వనించాయి. రైతుని గురించి మాట్లాడుతున్న కవి ఏ దృక్పథం నించి, ఏ గొంతుతో మాట్లాడుతున్నాడు? చాలా కవితలు వ్యవసాయ వాతావరణంతోనూ రైతు జీవితంతోనూ గాఢమైన సంబంధంలేని బస్తీ కవులు రాశారని తెలిసిపోతుంది. పల్లెల్లో పుట్టి, రైతు కుటుంబాలనించి వచ్చిన కవులు కూడా నేడు బస్తీల్లో స్థిరపడటం వల్ల కాబోలు – కవితల్లో ఒక దూరం కనిపిస్తుంది. ఉదాహరణకి శివశంకర్ “నాగలి విరిగినప్పుడు” లో

నేనిప్పుడు
వాడి చేతిలో పంట నొల్లుకుని
కంట్లో కారం జల్లిన వాళ్ళనే ప్రశ్నిస్తాను
ఖండాంతర లావాదేవీల్లో
జాతి వెన్నెముకని తాకట్టు పెట్టిన వాళ్ళనే ప్రశ్నిస్తాను
శవాల ఉసురు పోసుకునే చీకటి డబ్బునీ
దాని కాపలా కుక్కల్నీ ప్రశ్నిస్తాను
మట్టిని నమ్ముకున్న బతుకు మట్టిలోనే పొలి అయినప్పుడు
అది ఖచ్చితంగా హత్యే
చేసిందెవరనే నేను ప్రశ్నిస్తాను

– ఇక్కడ కవి ఒక public prosecutor గొంతుతో వినిపిస్తాడు. కానీ 1988 లో ఆర్థిక సంస్కరణల అమలుకి ముందే ఆంధ్రదేశంలో రైతు అధోగతికి అంతర్జాతీయ ఒప్పందాలు కారణమవుతున్నాయిని సూచించటం కవి నిశిత దృష్టికి తార్కాణం.

రైతు ఆత్మతో మమేకమైన ఎస్వీ రామిరెడ్డీ “ఒక వాన చాలు” మంచి కవిత. వానకోసం చకోర పక్షుల్లా ఎదురు చూడటంలో కార్తెలు గడిచిపోతున్న కొద్దీ పంట చేతికొస్తుందన్న ఆశ తరిగి పోవడం, అయినా చివరిదాకా ఆశ చావకపోవటం, ఆశ చచ్చిపోయిందన్న తరుణంలో అది నిరాశ కాకుండా – ఆ నిస్సాహయ స్థితిమీదనే తిరస్కారంగా పరిణమించటం చక్కగా మలిచారు కవి. ఉత్తరంలో ఊసుల్లా నడిచే గోపిని కవిత “పొద్దున్నే వచ్చిన వాన” కూడా మంచి ఉదాహరణ. రైతుతో మట్టితో తన పేగు బంధాన్ని సతీష్ చందర్ (పిడికెడు మట్టి కావాలి) విలక్షణంగా నిర్వచించారు. శివారెడ్డి “నాలుగు చినుకులు పడండే” లో మొదట పల్లెతో భూమితో ఒకటిగా ఉన్న కవి చివరికొచ్చేసరికి వాటికి దూరంగా జరిగి వాన లేక ఎండిపోతున్న భూమిని చూసి ఆర్తి చేందే ఒక sympathiser గా మాత్రం మిగిలిపోతాడు. ఈ గొంతు మార్పు పైన చెప్పిన పరాయీకరణ వల్ల కావచ్చు.

పల్లెతో రైతుతో మమేకమవుతూ, లేదా సంబంధం కలుపుకుంటూ చెప్పిన కవితలు ఇంకొన్ని ఉన్నాయి కానీ, అవి కేవలం వ్యక్తిగత అభిప్రాయాలుగానో, ఆక్రోశంతో చేతులు పిండుకోవటాలుగానో మిగిలి పోయాయి. ఈ సందర్భంలో ఒక కవిత గురించి తప్పక చెప్పుకోవాలి. (భాగ్య) నగర కవిగా పేరెక్కిన ఆశారాజు తెనాలి ప్రాంతపు పల్లెని చూసి
ముచ్చటపడిపోయి చిన్న పిల్లడిలాంటి సంబరంతో రాసిన “ఇది నీళ్ళు వీస్తున్న నేల” పాఠకుణ్ణి ఆహ్లాద పరిచే పిల్లతెమ్మెర.

పైన ఉదహరించినవి కాక మంచికంటి వెంకటేశ్వర రెడ్డి “మా సమాధులపై”, ఛాయారాజ్ దీర్ఘ కవిత “తొలకరి” నీటి సమస్య మరో కోణాన్ని చూపించే మంచి కవితలు. వాన ఎక్కువై వరదాగా మారి నోటిముందున్న కూటిని కొల్లగొట్టి తుదకు ప్రాణాల్నే కబళించే పరిస్థితిలో నిర్లక్ష్యంగా నిలుచుండి పోయిన ప్రభుత్వ యంత్రాంగాన్నీ విధానాలనూ నిలదీసి ప్రశ్నిస్తున్నాయి. ఈ సంకలనంలోని మూడు దీర్ఘ కవితల్లోనూ “తొలకరి” మనసుకి హత్తుకునే దృశ్య చిత్రాలతో స్పష్టతో చెప్పిన కవిత.

రైతంటే మన ముందు నిలిచేది ఒక మగవాడి బొమ్మ. కానీ వ్యవసాయంలో స్త్రీల పాత్ర ఉన్నంతగా బహుశా మరే వృత్తిలోనూ లేదేమో. ఆమాటకొస్తే పిల్లలు కూడా. రైతు ఉనికి అయోమయమైన పరిస్థితిలో రైతు కుటుంబం ఏమవుతోందని భావగర్భితంగా చెప్పిన కవిత పాటిబండ్ల రజని “మండుతున్న వానపాట”. ఫెమినిస్టు కవిత్వపు narrow definitions ని దాటి, రైతు కుటుంబాల్లో రగులుతున్న మంటలు ఎక్కడ పుట్టాయో ఎటువైపు సాగుతున్నాయో చిక్కగా చెప్పారు.

ఎత్తుగడలోనూ పోకడలోనూ విలక్షణమైన కవిత గౌతం రాసిన “రిహార్సల్”. మన వూరి రైతు సమస్యలు కేవలం స్థానికం కావనీ, ఇవి అంతర్జాతీయమనీ గుర్తించి ప్రకటిస్తున్నదీ కవిత. “వెదురుతో వేణువులెలా చేస్తాడు బాణాలే గానీ”, “వాడి పళ్ళ గాట్‌లు పడ్డ దేశాలన్నీ” ఇలా అద్భుతమైన వాక్య నిర్మాణంతో ఎక్కడా వస్తువు మీద నుంచి దృష్టి సడలకుండా కవిత నడిపించారు. ఇదే పంథాలో వసీరా “మొలక” కూడా కదిలించే కవిత. తన సహజమైన నిర్మొహమాటంతో గుండెలకి దడపుట్టించే పదచిత్రాలతో విత్తనాలు బుల్లెట్లుగా ఎందుకు మారాయో చెబుతుందీ కవిత.

రైతు చెమటని పిండి డబ్బు చేసుకోవటమే ధ్యేయంగా ఏర్పడిన వ్యవస్థ, రైతుని అంతకంతకూ అప్పుల ఊబిలోకి తోసివేస్తే దాని పైశాచికత్వాన్ని, నియంతృత్వాన్ని ధిక్కరిస్తూ రైతు తిరుగుబాటు దారుడుగా పరిణమిస్తున్నట్లు కొన్ని కవితలు కొసమెరుపులో సూచించాయి.
“శ్వాసలో నాగలి వాసన కోల్పోయిన వాడి గుండెపై ఒక్క సారి గాల్లో ఎగిరి
నీ కర్రుమొన దించు”
“పోరు అనివార్యమే అయినప్పుడు చర్మం మీది రోమరోమమూ ఆయుధమై
నిక్కబొడుచుకోవాల్సిందే”
“వీరుని చేతుల్లోంచి శత్రువు గురిగా గాల్లో కెగిరే బుర్రుపిట్టలానో”

స్వతంత్ర భారతంలో రైతులు సామూహికంగా తిరుగుబాటు దారులుగా మారి సాయుధ పోరాటం తమ దారిగా ఎంచుకున్న దాఖలా కనపడదు. రైతు తెలిసో తెలియకో ఈ దేశాన్ని పోషించే భారాన్ని నెత్తినేసుకున్నాడు. ఆ బాధ్యత మరవాలన్నా మరువలేడు. లేకపోతే ఏవీ మిగులుండదని తెలిసీ, గిట్టుబాటు కాదని తెలిసీ ప్రతి యేడూ ఎందుకు సేద్యం చేస్తాడు. అలాంటి బాధ్యతని మోసే రైతు తమ కవితల్లో తిరుగుబాటు దారుడిగా మారతాడని ఊహించడం, మారాలని కోరుకోవటం రైతుల జీవితం గురించీ మనస్తత్వం గురించీ తెలియకుండా రాసినట్టు అనిపిస్తుంది. ఇది బాధ్యతా రహితమూ హాస్యాస్పదమూ కూడా.

ఈ సంకలనంలోని కవితలేవీ కలకాలం గుర్తుండి పోయేలా లేవు అన్న విమర్శ ఒకటి వచ్చింది. ఈ విమర్శ నిర్దయతో చేసిందయినా అందులో కొంత నిజం లేకపోలేదు. మంచి కవులుగా పేరుపడ్డ నందిని సిధారెడ్డి, నాళేశ్వరం శంకరం, కొండేపూడి నిర్మల, దాట్ల దేవదానం రాజు, దర్భశయనం శ్రీనివాసాచార్య ఇత్యాదుల కవితలు చాలా నిరాశ కలిగించాయి. “మో”, దేవీప్రియ, సినారె ల కవితలు అసలీ పుస్తకంలో ఎందుకు చేర్చారో అర్థం కాదు. రాస్తున్నది రైతు కష్టాల్ని గురించి కదాని నినాదాలూ, కేకలూ, రోదనలూ, విప్లవానికి పిలుపులూ కవిత్వం కాజాలవు. ఈ సంకలనంలోని కవితల్లో యాభైకి పైగా ఈ స్థితిలో మిగిలిపోయాయంటే ఈ విషయాన్ని కవులందరూ సీరియస్‌గా ఆలోచించాలి – సమకాలీన సమస్యలకి స్పందిస్తూ రాసే కవులు మరీ ముఖ్యంగా. ఐతే, ఈ సంకలనం ఒక ఖచ్చితమైన చారిత్రక నేపధ్యంలో వచ్చింది గనక బహుశా అలా కలకాలం గురుతండనక్కర్లేదేమో కూడా – ఆ చరిత్ర నేర్పిన పాఠాలు మన తలలో కెక్కి మనసుకి పట్టే దాకా గుర్తుంటే చాలు.

కవుల పరిచయం లేకపోవటం ఈ పుస్తకంలో పెద్ద లోపం. అలాగే పేజీ నెంబర్లు పేజీ అంచున కాకుండా పేజీ లోపలకి ఇవ్వటం వల్ల పేజీలు వెతుక్కోవటం కష్టం. చివరలో సమకూర్చిన పాత పద్యాల పాటల అనుబంధమూ, ప్రతి పేజీ అడుగు భాగాన పొదిగిన సామెతలూ, ఏలే లక్ష్మణ్ తైలవర్ణ ముఖచిత్రాం మంచి అలంకారాలు.
*****************************************************************************************
పుస్తకం వివరాలు:
రైతు కవిత
సంపాదకులు : పాపినేని శివశంకర్, బండ్ల మాధవ రావు, ఎంవీ రామిరెడ్డి
మువ్వా చిన బాపిరెడ్డి ప్రచురణలు – 2004

గమనిక: ఈ వ్యాసం కాపీరైట్లు DTLC వారివి.

You Might Also Like

3 Comments

  1. Devidas

    ఇట్ ఐస్ వెరీ నైస్ గుడ్

  2. కొత్తపాళీ

    ఈ వ్యాసం టపాయించడంలో ఫార్మాటు గందరగోళం అయినట్టుంది. సంపాదకులు కొంచెం పరిశీలించగలరు.

    ఆరు వస్తువుల విభజన ఇది:
    భూదేవి – దేశం – అమ్మ;
    రైతు – వృత్తి ఔన్నత్యం – రైతు జీవితం;
    పత్తిపంట – పురుగుమందు – ఆత్మహత్యలు – రైతు కుటుంబాల దీన స్థితి;
    కరువు – వర్షం కోసం ఎదురు చూపులు – రాయలసీమ;
    గ్లోబలైజేషన్ – అంతర్జాతీయ ఒప్పందాలు – బహుళజాతి సంస్థల నియంతృత్వం;
    రైతు స్త్రీల అధోగతి, ముఖ్యంగా రైతు ఆత్మహత్య నేపధ్యంలో.

    ఆ శం నారాయణస్వామి నేనే 🙂

    *******************************************
    సరిచేశాము. ధన్యవాదాలు – పుస్తకం.నెట్ బృందం.

  3. బొల్లోజు బాబా

    సమీక్ష చాలా బాగుంది. ఆరువస్తువుల విభజన కొంచెం గందరగోళంలా ఉంది. బహుసా టైపింగ్ మిస్టేక్ ఏమో.

    ఈ పుస్తకంలో సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డిగారి కవితలేమీ లేవా. రైతు/గ్రామీణ జీవితంగురించి అద్బుతమైన కవిత్వం వ్రాసారాయన.

    వారి కవితలు ఇక్కడ చదవొచ్చు

    http://maakavithalu.blogspot.com/

    బొల్లోజు బాబా

Leave a Reply