శ్రీకృష్ణదేవరాయ వైభవం

FrontPage

తెలుగదేల యన్న దేశంబు దెలుగేను,
దెలుగు వల్లభుండ దెలుగొ కండ,
యెల్లనృపులు గొలువ నెఱుగవే బాసాడి,
దేశభాషలందు దెలుగు లెస్స.

ఈ పద్యం చూడగానే కించిత్తు గర్వం పెదవిపై ఓ లాస్యాన్ని పూయించకపోతే అతడు తెలుగు వాడేనా అని సందేహించవలసి వస్తుంది. “తెలుగు” అన్న మాట వినబడినంతకాలం, తెలుగు భాష మనగలిగినన్నాళ్ళు, తెలుగువాడి దమ్మును అఖండ భారతావనికీ చాటి చెప్పిన ఆ రాజకవి –

కవితా స్త్రీలోల,
నిరంకుశప్రతిక ప్రౌఢిప్రియంభావుక,
నిస్తంద్రప్రతిభా సుధీనుత,
విద్యాఖేలనభోజ,సుధీలేఖద్రుమ,
ద్రాఘీయ: ప్రతిభా విచక్షణత్రయీ ధర్మైకసంరక్షణా,
భోజక్షమాపతి విద్యాపరిపాక,
మేధావదసాధారణబోధాకరహృదయ,
వేదార్థస్థాపనాప్రవీణ,
సరసకళాధోరణి,
ధీనిబంధన విధా సంక్రందనాచార్య,
కవితా ప్రావీణ్య ఫణీశ,
గజపతిగజకూటపాకవేన విదిత నానావికవేన వదన విజితాంభోజేన భోజేనాపరేణ కావ్యనాటకాలంకార ధర్మజ్ఞ,మర్మజ్ఞ,
సకళకళా భోజరాజవిభవమూరురాయరగండ శ్రీ శ్రీ శ్రీ నరసింహ కృష్ణదేవరాయలు!

ఈ కవిరాట్టు పుట్టకపోయి ఉంటే? తెలుగు, తెలుగువాడు ఏ స్థితిలో ఉండేవారో ఊహించనలవిగాదు. అయితే ఆ మహారాజు పుట్టాడు. పట్టాభిషేకమూ చేసుకున్నాడు., అది సరిగ్గా 600 యేళ్ళకు పూర్వం, 1509 లో.

శ్రీకృష్ణ దేవరాయల పైన లబ్ధప్రతిష్టులైన ఈ శతాబ్దపు రచయితలు, కవులు, వ్యాసకర్తలు వ్రాసిన  వ్యాసాల సమాహారం ఈ పుస్తకం. ఈ వ్యాసాలు ఇదివరకే “భారతి” తదితర పత్రికలలో అచ్చైనవి. దాదాపు ఆరొందల పేజీల ఈ పుస్తకంలో అద్భుతమైన సాహిత్య వ్యాసాలు, రాయలవారు, వారి సామ్రాజ్యం గురించిన అద్భుతమైన పరిశోధనలు, అక్కడక్కడా, చక్కటి చిత్రాలు, హంపి తాలూకు ఫోటోలు చోటుచేసుకున్నాయి.

వేదం వెంకటరాయశాస్త్రి గారు, నేలటూరి వెంకటరమణయ్యగారు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, విశ్వనాథ వారు, నిడదవోలు వెంకటరావు గారు, వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, వేటూరి సుందరరామమూర్తి గారు,చిలుకూరి నారాయణరావు గారు, మలయవాసిని గారు….వీరందరూ ఆ లబ్ధ ప్రతిష్టులలో కొందరు మాత్రమే.

పైన ముఖపత్రంలో ఉన్నవిధంగా ఈ పుస్తకంలో –
One Page
చారిత్రక వైభవం
వ్యక్తిత్వ వైభవం
సాంఘిక జీవన వైభవం
భాషా సాహిత్య – భువన విజయం
కళావైభవం
సాహితీ వైభవం

అని ఆరు అధ్యాయాలు ఉన్నాయి.

అలనాడు అదే రాయల వారి కాలంలో రతనాలు రాసులు పోసి అంగళ్ళలో అమ్మారట.  అలాంటి రతనాల రాశి ఈ పుస్తకం. ఈ రాశిలో కొన్ని –

ఈ గ్రంథము పేరు ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద ఏమిటి?

అనగానర్థమేమి? దీనికర్థమేమని తెలిసికోగా “ఆముక్త” – అలంకరించుకోబడిన, “మాల్య” పూలదండను, “ద” -ఇచ్చునది. అనగా ఒక భక్తురాలు పూలదండ గ్రుచ్చి, మొదట తాను అలంకరించుకుని, తరువాత భగవంతుని మెడలో వేసెడిదట! ఇది ఆవిడ యొక్క కథ.

..ఆరవ ఆశ్వాసములోని మాలదాసరి కథ. ఓహో ఏమి కథ! ఏమి చెప్పుట! ఇట్లు కథ చెప్పుట సృష్టిలో అనేకములైన నాగరక భాషలలో, మహాకావ్యములున్న భాషలలో మరియొకచోట కనిపించదు. ఇదియొక ఆశ్చర్యము! ఒక తాజ్ మహల్! ఒక మధుర మీనాక్షీ దేవాలయము! ఒక మహాబలిపురము! గంగను భగీరథుడు నేలకు దీసికొని వచ్చుట!

పిఠాపురములో ’కొత్తపల్లి కొబ్బరి’ అన్న మామిడిపండు కలదు. అది రసము. పిఠాపురపు ప్రాంతంలోఅన్ని చెట్లు కలిపి పండ్రెండుకన్నా ఎక్కువ లేవేమో! రుచికి ఇమాందీన్ వంటిది. అటువంటిది మాలదాసరి కథ.

ఆ రచయిత, కవి ఎవరో మీ ఊహకే వదిలివేస్తున్నాను.

క్రీ.శ. 10 – 2 – 1513 నాడు తిరుపతిలో స్వామి వారికి కైంకర్యములు ఇచ్చినాడట. ఆ శాసన పాఠం

“శుభమస్తు స్వస్తిశ్రీ విజయాభ్యుదయ శాలివాహన శకవరుషాలు ౧౪౩౪ మీద నడచే ఆంగీరస సంవత్సర ఫాల్గుణ శు౫ ని|| శ్రీమన్ మహారాజాధిరాజ రాజపరమేశ్వర శ్రీ వీరప్రతాప శ్రీ వీరకృష్ణదేవరాయలు తిరువెంగళనాథ దేవునికి సమర్పించిన రత్నఖచితమైన కిరీటం 1 కి వొంమ్మెచ్చు పైండిత్తూంకాలు 1555 కుం(దనం) తూకాలు 1076, కెంపులు 2822 పచ్చలు 160 కి రతులు 108 వజ్రాలు 423 కి మంజాళు 65 మధ్య మాణిక్యం సహా మాణిక్యాలు 3 నీలాలు 10 వైఢూర్యం 17 గోమేదికం 1 సహతూంకాలు 3130 ముత్యాలు 139కి తూంకాలు 163 ముత్యాలు కూచ్చిన పైండికమ్మి తూంకాలు 15 వెరశి కిరీటం 1క్క్తి తూంకాలు 3308 త్రిపరం 1క్కి ముత్యాలు 1370, మాణిక్యం 1, నీలాలు 2, కుసుళు 2, అడ్డికలు 95, సహ తూంకాలు 225, పదకం 1క్కి ముత్యాలు 6, వజ్రాలు 60, పచ్చలు 411, మాణిక్యాలు 3, కెంపులు 5, సహా తూంకాలు 61, వెండి ఆరతులు 25,యివి ఇంతవట్టున్ను తమ సేవగాను సమపించినధరించిరి.”

ఇంకో చోట, ఆయన రాజ్యంలోని జీవన విధానాన్ని గూర్చి చెబుతూ –
First Cover

“ఆ ప్రజలకు బదకటం ఒక కళ. బ్రతుకంటే యేమిటో – యెలా బ్రతకాలో – కళాకారులే వారికి నేర్పారు.రాజుకత్తికంటే శిల్పి కుంచెకూ – కవికలానికీ ఆ ప్రజాసముదాయంపై ఎక్కువ ధికారం. ప్రతిదినమూ – మధ్యాహ్నమో,ప్రాతః కాలమో- ప్రతి గృహిణీ రత్నాలు కుప్పబోసినట్లు పింఛాలను విసురుకుని ఉండే తారకనాట్యం నేర్పేది. చేతితో చిటికెలు వేసుకుంటూ తారకలు తారతారంగా చలింపగా – కనుబొమ్మలు లలితాస్యభంగిమాలతో నెమలిని ఆడిస్తూండ్ ఆ మధురమూర్తిని కనుల చల్లగా చూస్తూ పురుషుడట్లే నిలిచిపోయేవాడు. ప్రొద్దుటిపూట – ఒకదినం – పలుకులు నేర్పకుండా కోడలు ఊరుకున్నదంటే – పంజరాలలో “అరగన్ను వెట్టి ముఖము ల్చరణాగ్రనఖాళి గోకుచిన్నిలుగుచు నావులించుచు” అత్తలు ” నీపని చూచుకొమ్మని కోడండ్రను తరిమేవారు…”

రాయలనాటి పేదకూడు

గురుగుంజెంచలి తుమ్మి లేదగరిసాకుం, దింత్రిణీ పల్లవో
త్కరముం గూడ బొరంటి నూనియలతో గట్టావి గుట్టారకో
గిరముల్ మెక్కి తమిం బసుల్ పొలమువో గ్రేపు ల్మెయిన్ నాక మే
కెరువుం గుంపటి మంచమెక్కిరి,ప్రభుత్తైకాప్తి రెడ్లజ్జడిన్

గురుగు, చెంచలి, తుమ్మి, లేత గరిసాకు, చింతచిగురు వీటిని పెసరపప్పుతో కలిపి నూనె వేసి వేయించి వాడుకునే వారట!గుట్టారికల ఓగిరాలు అంటే చిన్న గింజలుగా ఉన్న వైబియ్యంతో ఉడికిన అన్నం తిని పశువుల్ని తోలుకొని వెళ్ళిపొయ్యేవాళ్ళట.

ఆకుని ఎండించి దాచుకుని ఆకువరుగుల కూర కూడా వానాకాలంలో తినే వారు.

ఇది రాయలకాలం నాటి పేదవాడి కూడు.

“ఇదే జాత్యన్నం అంటే! తెలుగు జాతి అన్నం!!
“అమృతమైనా జాత్యన్నానికి సమానమా…” అని అడుగుతాడు కృష్ణరాయలు.

శ్రీకృష్ణదేవరాయల వారి పట్టాభిషేకం గడచి ౬౦౦ వర్షాలయిన సందర్భంగా రాయలవారికి అక్షర నీరాజనం ఈ పుస్తకం. ఇందులో అక్కడక్కడా ముద్రణాదోషాలు కూడా ఉన్నాయి. 288 పేజీ తర్వాత 321 వ పేజీ వచ్చింది. మరి కొన్ని చోట్ల పేజీలలో ప్రింటు ఎగిరిపోయి సగం పేజీ తెల్లగా వచ్చింది.

ఈ పుస్తకం రీదు 300/-.

ప్రచురణ కర్తలు : తెలుగు సమితి
పంపిణీ దారులు : ఎమెస్కో బుక్స్
ఫోను : 0866 -2577498, 98499 92890
emescobooks@yahoo.com
www.emescobooks.com

ఈ పుస్తకం విశాలాంధ్రలో కనబడడం లేదు. నా వద్ద ఉన్నది ఓ లైబ్రరీ తాలుకు కాపీ. ఏదేని పుస్తక షాపులో కనబడితే ఈ వ్యాస రచయితకు కూడా తెలుపగలరు.

You Might Also Like

One Comment

  1. గోపాల్

    చాలా బాగా రాశారు! ఆ పుస్తకం ఇది వరలో కొంత చూశాను, మళ్ళీ చూడాలనిపిస్తోంది! 🙂

Leave a Reply