Through the language glass

“భాష” గురించి కొంతవరకూ మొదట్నుంచే కుతూహలం ఉన్నా, అరికా ఒక్రెంట్ రాసిన “In the land of Invented Languages” పుస్తకం చదివాక  అసలు భాష ఎలా రూపొందుతుంది? అన్న కుతూహలం ఎక్కువైంది. ఈ క్రమంలోనే పొద్దున్న లేస్తూనే పదాలు కుప్పలు తెప్పలుగా మీద పడుతున్న భ్రాంతులు, నా ఆలోచనలపై  నా మాతృభాష (కాకపొతే, మొదట నేర్చిన భాష) ప్రభావం ఉందా? అన్న అనుమానమూ మొదలయ్యాయి. ఇలాంటి అనుమానం మొదలయ్యాక కూడా, బహు జాగ్రత్తగా నివృత్తి చేసుకునే ప్రయత్నమేదీ చెయ్యక, దాదాపు రెండేళ్ళు నెట్టుకొచ్చా. ఈ రెండేళ్లలో, భాషా, పరిణామం, మెదడు పనితీరు ఇత్యాది విషయాలపై ఐదారు పుస్తకాలు కొని, ఒక్కటి మాత్రం పూర్తిచేసి, తక్కినవన్నీ తిరగేసి, భద్రపరిచా. ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే, మొన్నోరోజు “Through the language glass: Why the world looks different in other languages” అన్న పుస్తకం కనబడగానే, ఒకటికి పదిసార్లు అలోచించాను, కొనాలా వద్దా అని. కానీ, మన ఆలోచనలపై భాష ప్రభావం అన్న అంశంపై అంతకు కొద్దిరోజుల క్రితమే మా మాస్టారు కాని మాస్టారు ఒకరు మెయిల్లో నాకు కొన్ని విషయాలు చెప్పారు. అందువల్ల, నా అలోచనల్లో  ప్రస్తుతానికి “in vogue” అనబడు అంశం ఇది. ఆ విధంగా, పుస్తకం చదవడం మొదలుపెట్టాను.

పుస్తకం గురించి క్లుప్తంగా చెప్పాలంటే. మనం ప్రపంచాన్ని చూసే విధానాన్ని మన మాతృభాష శాసిస్తుంది – అని భాషా శాస్త్రవేత్తలలో ఒక వర్గం వాదిస్తుంది. అలా కాదని, ప్రపంచ భాషలు అన్నింటికీ సార్వజనీనంగా ఒకే తరహా మూసలు ఉన్నాయని, మనం ప్రపంచాన్ని చూసే పద్దతికీ, మన మాతృభాషకి సంబంధం లేదు (అంటే, ఏ భాషైనా ఒకటే అని అనమాట) అని భావించే వర్గం ఒకటి. ఇప్పుడీ పుస్తకంలో రచయిత వాదం ఈ రెండింటినీ కాదంటూ – మనం ప్రపంచాన్ని మన భాష అనే లెన్స్ ద్వారానే చూస్తాము.  కానీ, భాష మనల్ని ఒక విధంగా ఆలోచించడానికి అలవాటు పడేలా చేస్తుంది తప్పిస్తే, ఆ ఆలోచనా విధానం నుంచి బయటకు రాలేనంతగా కట్టడి చేయదు అని.  ఉదాహరణకి – మనం కాలివేళ్ళు, చేతి వేళ్ళు అంటాము. ఇంగ్లీషులో టోస్, ఫింగర్స్, అంటారు. మనం రెండింటినీ వేళ్ళు అన్నంత మాత్రాన మనం కాలి వేళ్ళకి, చేతి వేళ్ళకి తేడా చూపలేం అని కాదు కదా. ఇంగ్లీషులో మంచు కి పది పదాలున్నాయ్, తెలుగులో లేవు.  కానీ, అలాగని, మనం మంచుల్లో తేడాలను గురించి ఎవరన్నా చెప్పినా, చూపించినా కూడా అర్థం చేసుకోలేనంతగా కట్టడి కాలేదు కదా, తెలుగు మాట్లాడుతున్నందుకు? – ఇదీ ఈ పుస్తకం వాదన.

ఇలా మాములుగా మాట్లాడుకుంటూ ఉంటే, “ఓస్, ఇంతేనా! ఆమాత్రం అందరికీ అర్థమవుతుంది. దీనికో పుస్తకం కావాలా?” అనిపించే అవకాశం లేకపోలేదు. కానీ, ఇదే అంశం పై దాదాపు రెండొందల సంవత్సరాలుగా శాస్త్రవేత్తల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి అంటే, అర్థం చేసుకోండి మరి.

ఇక్కడ, ఈ పుస్తకం లో ప్రత్యేకించి నాకు బాగా నచ్చిన అంశం ఏమిటి అంటే, చెప్పిన పధ్ధతి. ఏదో, నలుగురు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సాగిన సంభాషణ లాగా ఉంది తప్పిస్తే, శాస్త్ర గ్రంథంలా క్లిష్టంగా లేదు. ఆ పరంగా, ఆట్టే లోతులేదు అనిపించినా కూడా, ఈ పుస్తకంలో చదివిన తరహా పిట్టకథలు వేరేప్పుడూ నేను చదవలేదు.  ఈ అంశాలపై జరిగిన పరిశోధనలు, మనుషులపై చేసిన పరీక్షలు, ఏళ్ల తరబడి సాగిన వాదనలూ – అన్నీ ఆపకుండా చదివించాయి. చదివించేలా రాయడమే కాదు,  చాలా విస్తృత పరిశోధన చేసి రాసారు. దీనివల్ల, ఎక్కడెక్కడి కథలో, సమయానుగుణంగా చేర్చారు. చివర్లో, చాలా వివరంగా ఇచ్చిన రిఫరెంసులలో కొన్ని పద్దెనిమిదో శతాబ్దం నాటివి కూడా ఉన్నాయి! పాపులర్ సైన్సు పుస్తకాలు ఇలా రాయాలి అనిపించింది.

అన్ని భాషలు చూసారు –  ఎక్కడా మన భాషల ప్రస్తావన లేదు. ఒకట్రెండు చోట్ల హిందీ, తమిళ్ పేర్లు వచ్చాయంతే. అనేకానేక అటవీ తెగల భాషల  గురించి కూడా రాసారు కానీ, మన భాషలు లేకపోవడం నాకు కాస్త చిరాకు తెప్పించింది. అయితే, అవి కూడా చేరితే, ఇక ఇందులో భాషల మధ్య పోలికలతో వచ్చే పిట్టకతలతో పుస్తకం మోయలేనంత బరువు అవుతుందని సందేహం కలిగింది. అలాగే, ఒక్కోచోట కొంతమంది పరిశోధనలపై వ్యంగ్యం ఎక్కువైంది అని కూడా అనిపించింది. కానీ, చక్కగా, అందరికీ అర్థమయ్యేలా ఉన్న శైలి చాటున ఈ నా కంప్లైంట్లు అన్నీ ఆట్టే నిలువవు.

మొత్తానికి, నేనైతే, భాష గురించి ఆసక్తి ఉన్న అందరినీ, ముఖ్యంగా ఆట్టే బరువైన, లోతైన పుస్తకాలు చదవలేని వారికి –  తప్పక చదవమని చెబుతాను. ఈయన రాసిన మిగితా రచనల వేట మొదలైపోయింది నాకు.

 

పుస్తకం వివరాలు:

Through the Language glass : Why the world looks different in other languages

Guy Deutscher

2010

అమేజాన్ కొనుగోలు లంకె ఇక్కడ.

ఫ్లిప్కార్ట్ కొనుగోలు లంకె ఇక్కడ.

ఈ పుస్తకం గురించి న్యూయార్క్ టైంస్ పత్రికలో వచ్చిన సమీక్ష ఇక్కడ, గార్డియన్ పత్రిక సమీక్ష ఇక్కడా, సైంటిఫిక్ అమెరికన్ లో వచ్చిన సమీక్ష ఇక్కడా చదవొచ్చు.

రచయిత వెబ్సైటు ఇదీ.

 

You Might Also Like

4 Comments

  1. The Language Web – Reith Lectures 1996 | పుస్తకం

    […] Language Glass పుస్తకం గురించి ఇదివరలో ఒకసారి పరిచయం చేశాను.) ఇంకా ఇంటర్నెట్ ఇంటింటి అవసరంగా […]

  2. Interview with Guy Deutscher | పుస్తకం

    […] Wikipedia page 2) An Interview from American Scientist. 3) A review of “Through the language glass“, published here in pustakam.net 4) A review of “The unfolding of language“, […]

  3. KumarN

    Thank you very much. Will have to buy

Leave a Reply