రుద్రగణిక – డా. నటరాజ రామకృష్ణ
వ్యాసకర్త: Halley
********
ఈ పరిచయం డా. నటరాజ రామకృష్ణ గారు రాసిన “రుద్ర గణిక” గురించి . నటరాజ రామకృష్ణ గారి గురించీ వారు చేసిన కళా సేవ గురించీ “గొల్ల కలాపం” గురించి చదివినపుడు తెలుసుకున్నాను (ఒక గొల్లకలాపం పుస్తకం గురించి గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసం ఇక్కడ). తర్వాత మిక్కిలినేని వారి “తెలుగు వారి జానపద కళారూపాలు” చదివినప్పుడు మరి కొంత తెల్సుకున్నాను. ఇది 156 పేజీల పుస్తకం. చిన్న చిన్న వ్యాసాలు చాలా ఉన్నాయి ఎందరో కళాకారుల గురించి. నాకు నచ్చిన కొన్ని విషయాలు, నేను తెలుసుకున్న కొన్ని కొత్త విషయాలు, ఈ పరిచయంలో పొందుపరుస్తున్నాను.
పుస్తకం తెరవగానే నన్ను ఆకర్షించినవి అట్ట వెనుక బొమ్మలు. ఎంత చక్కగా ఉన్నాయో! మిక్కిలినేని వారి పుస్తకం పుణ్యమా అని ఏదో ఒకటి అరా గుర్తు పట్టగలిగాను లేదంటే కష్టమే. నాలాంటి అర్భక పాఠకుల కోసం ఆ కళల పేర్లు కూడా రాసి ఉంటే బాగుండేదేమో.
శ్రీమతి ముత్తులక్ష్మి రెడ్డి గారి గురించి రాసిన వ్యాసం పుస్తకం మొదట్లో ఉంది. చాలా బాగుంది. శ్రీరాం గారు రాసిన బెంగుళూరు నాగరత్నమ్మ చరిత్ర చదివినపుడు తెల్సింది ఆమె గురించి. అయితే ఆ పుస్తకం వస్తు విశేషం దృష్ట్యా కొంచెం నెగటివ్ గా అనిపించింది అప్పట్లో ఆవిడ గురించి. ఆమె కళా వ్యతిరేకి కాదనీ కళ విషయంలో శస్త్ర చికిత్స చేశారనీ అన్నారు రామకృష్ణ గారు ఈ వ్యాసం లో. “ఈ కళారాధనను ఒక ప్రత్యేక కులం వారికే ఎందుకు పరిమితం చేయాలి? కులాలననుసరించి కుల విద్యను కుల వృత్తిగా చేపట్టాలన్నది పాత కాలపు వ్యవస్థ. అందరూ అన్ని వృత్తులని చేసికొంటున్న ఈ ఇరవయ్యో శతాబ్దిలో దేవదాసీలు మాత్రమే ఈ నృత్య కళకు ఎందుకు కట్టుబడి ఉండాలి? ఇతర వృత్తుల్లాగానే ఈ వృత్తిని కూడా అందరు ఎందుకు చేపట్టకూడదు?” అని అన్నారు. ముత్తు లక్ష్మి రెడ్డి గారి కృషి దీనికి చాలా ఉపయోగపడింది అనీ అన్నారు.
“స్వ విషయం” అని ఒక వ్యాసం ఉంది ఈ పుస్తకంలో. తన జీవిత చరిత్ర టూకీగా చెప్పుకొన్నారు. ఈ పుస్తక పరిచయవ్యాసానికి ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా, రామకృష్ణ గారి రమణాశ్రమ దర్శనం గురించి ఒక మాట రాసారు ఈ వ్యాసంలో. దాని గురించి కొంత రాస్తున్నాను ఈ పరిచయంలో. రామకృష్ణ గారి భావాలను అర్థం చేసుకోవటంలో ఇది నాకు తోడ్పడింది. నాకు తెలియని కొత్త విషయం ఇది. అయితే తెలిసి ఆశ్చర్యపోయిన విషయం అయితే కాదు. రామకృష్ణ గారు రమణాశ్రమం కి వెళ్ళినప్పుడు అక్కడ అగ్ర కులాలకు, ఇతర కులస్తులకు వేరు వేరు భోజనశాలలు ఉండటం వలన ఇబ్బంది పడ్డారట (అప్పటికి ఆయన ఏ కులమో ఆయనకి తెలియదు అట మరి). చివరికి తిరిగి తన మైలాపూర్ రామకృష్ణ మఠానికి వెళ్లి భోంచేసారట. అక్కడ కులం పేచి లేదు మరి. ఈ విషయమై “రామకృష్ణా మఠం వేరు. తిరువన్నామలై ఆశ్రమం వేరు” అని అన్నారు. ఈ వ్యాసంలోనే ఆమ్రపాలి, వాసవదత్త కథలను తలచుకొని బౌద్ధ గ్రంథాలలో గణిక చరిత్ర గురించి కొంత రాసారు.
ఇక “రుద్రగణిక” అన్న వ్యాసంలో ‘”స” నుంచి “ని” వరకు గల సంగీత విద్యలో నిష్ణాతులైన వారినే “సానులు” అనే వారు’ అని అన్నారు. ఈ వ్యాఖ్య ప్రామాణికత విషయం అటు ఉంచితే వినటానికి బాగుంది! “దేవదాసి” అన్న పదం గురించి చెబుతూ, వీరు పరిశోధన ప్రారంబించినప్పుడు కొందరు వృద్ధ గణికలు ఈ పద ప్రయోగం పైన అసమ్మతి వ్యక్తం చేసారనీ “మేము దాసీలం కాము, ఆరాధకులం. తెలిసో, తెలియకో మావారు ఈ “దాసీ” అన్న పద సంభోధనాన్ని ఏనాడు సమ్మతించారో ఆ నాటి నుంచి సంఘంలో మా పరపతి తగ్గిపోతూ వచ్చింది” అని అన్నారట.
మరొక వ్యాసంలో “వీరు వెలయాండ్రు కారు, వారాకాంతలు కారు.. కులటలు అసలే కారు. సంఘంలోని సంస్కారాన్నంతటిని తమలో నిముడ్చుకొని, ప్రకృతికి దర్పణంగా తమ జీవితాలను కళారాధనతో తీర్చి దిద్దుకున్న విద్వాంసులు వీరు” అని అన్నారు.
ఇక రంభ, ఊర్వశి, మేనకల గురించీ వారి వారి నృత్య సంప్రదాయాల గురించీ చాలా చక్కగా క్లుప్తంగా చెప్పారు. శివ పార్వతీ తాండవాల గురించీ, నర్తన కళ గురించీ, తిలోత్తమను గురించీ చాలా విషయాలు తెలిసాయి నాకు ఈ వ్యాసం ద్వారా.
మరొక చోట స్త్రీ గురించి పరస్పర విరుద్ధ ఆలోచనలు మన ఋషుల భావాలలో ఎలా ఉన్నవో చెబుతూ, స్త్రీ పురుషుని చేతిలో ఒక పని ముట్టు అవటం గురించి రాసారు. ఈ భావాలకూ ఈ కళాకారులు వెలయాండ్రుగా మారటానికి గల సంబంధం గురించీ కొంత రాసారు.
మండన మిత్రుని భార్య అయిన ఉభయ భారతికి ఆదిశంకరాచార్యులకి జరిగిన వాద వివాదాల గురించీ, అమరు శతకాన్ని గురించీ, ఆ శృంగార కావ్యాన్ని అభినయించటంలో ఆంధ్ర దేశ నర్తకీమణుల ప్రతిభ గురించీ కొంత చెప్పారు. ఇది చెబుతూ అంబాజీపేట గ్రామంలోని గణిక అయిన “రెడ్డెమ్మ” గురించి చెప్పిన కబుర్లు నాకెంతో నచ్చాయి. ఈవిడ సంగీతంలోనే కాక తర్క, వేదాంత, మీమాంస, వ్యాకరణాదులలో గొప్ప పండితురాలట. ఓటమి ఎరుగని ఈ పండితురాలిని మెచ్చి ఆవిడకి “శాస్త్రి” అని బిరుదు ఇచ్చారట. అప్పటి నుంచి ఆవిడ “రెడ్డిశాస్త్రి” అయిందట.
భాషకు వ్యాకరణం ఉన్నట్టు సంగీతానికి ఉండెడి వ్యాకరణం గురించి కొంత చెప్పారు. అయితే నాకు ఈ విషయాలు పెద్దగా అర్థం అవలేదు. గతి ప్రస్తారం, జతి ప్రస్తారం, యతి ప్రస్తారం, ఛందో ప్రస్తారం, బంధరచనా ప్రస్తారం వంటి వాటి గురించి కొంత రాసారు ఈ భాగంలో.
కాకతీయుల కళావైభవం గురించి చెబుతూ క్రీడాభిరామం గురించీ నృత్త రత్నావళి గురించీ మాచల్ దేవి గురించీ కొన్ని విషయాలు చెప్పారు. అలానే మరొక గొప్ప కళాకారిణి లకుమ గురించి కూడా రాసారు. “దైవ సాన్నిధ్యంలో మానవ శాసనాలకు విలువ లేదు ప్రభూ” అని లకుమ ఒక రాజుతో చెప్పిన కథ కూడా పంచుకున్నారు.
మరొక కళాకారిణి రంగాజమ్మ గారి గురించి చెబుతూ ఆవిడ విజయ రాఘవుని ఆస్థాన కవయిత్రి అని, అష్ట భాషా ప్రవీణ అనీ (సంస్కృతం, తెలుగు, తమిళ, కన్నడ, పాళీ, ప్రాకృతం, మాగధి, శౌరసేని), యక్షగాన రచయిత్రి అనీ అన్నారు.
తురుష్కుల పాలనలో కళా సేవ గురించీ అప్పటి గణికా ప్రాశస్త్యం గురించీ కొంత రాసారు. అయితే లలిత కళల విషయంలో అక్బరు వంటివాడికీ ఔరంగజేబు వంటివాడికీ తేడా చెబుతూ మొదలు పెట్టారు ఈ భాగాన్ని. అయితే దక్కను గోలకొండ పాదుషాలు కళామతల్లికి చేసిన సేవలను పొగుడుతూ పంచుకున్న విషయాలు నాకు ఎంతో నచ్చాయి. తారామతి, ప్రేమామతి గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నారు. గోల్కొండ పాదుష అబుల్ హసన్ సంచార భాగవతులకి అగ్రహారాన్ని ఇనాముగా ఇవ్వటం, అదే నేటి కూచిపూడి అవ్వటం, నేడు ఆ అగ్రహారం నాట్యానికి నిలయమై విరాజిల్లటం గురించి చెప్పారు.
మరొక వ్యాసంలో ఉత్తరాది వారి గురించి దక్షిణాది వారికి తెలిసినంతగా, మన గురించి వారికి తెలీదు అని బాధ పడుతూ దానికి గల కారణాలను విశ్లేషించారు. మత కలహాలతో అల్లకల్లోలం అయిన ఉత్తరాది వారికి దక్కన్ పాదుషాలు మత సామరస్యం కోసం పాటుపడిన విధానం గురించి తెలియజేయాల్సిన బాధ్యత దక్షిణాది వారి మీద ఉన్నది అని అన్నారు. విశాదాంతమైన అక్బర్ సలీం అనార్కలి కథ గురించి సినిమా తీసిన తెలుగు వాడు, మత సామరస్యం గురించి ఎన్నో విషయాలు చెప్పే భాగమతి కథనూ, ఆ కథలోని పిట్టకథ పురానాపుల్ వంతెన కథనూ ఎందుకు తన నాటకాలలో, సినిమాలలో, కవితలలో, యక్షగానాలలో పొందు పరచలేదు అని వాపోతూ, ఇదే తెలుగు వాడి విచిత్ర మనస్తత్వం అని అన్నారు.
ముద్దుపళని రాధికా సాంత్వనం గురించి రాసిన వ్యాసం నన్ను ఆకట్టుకుంది. ఆవిడ సాహసాన్ని తలుచుకుంటూ ఆవిడ రెచ్చిపోయిన ఆడ పులి అనీ, ఆమె ధైర్యానికి జోహార్ అనీ అన్నారు. స్త్రీల దృష్టితో స్త్రీలు ఎందుకు మన్మథ క్రీడలను వర్ణించకూడదంటూ ఆమె విసిరిన సవాలు గురించి చాలా బాగా రాసారు. ఎపుడో వీరేశలింగం గారి సంస్కరణల గురించి చదివినపుడు విన్నాను అనుకుంటా ముద్దుపళని గారి గురించి. తర్వాత బెంగుళూరు నాగరత్నమ్మ గారి గురించి చదివినపుడు మరి కొంత తెల్సుకున్నాను. అయితే ఈ వ్యాసం చదివాకా ఫ్యాన్ ఐపోయాను అనమాట.
డెబ్బయి అయిదు సంవత్సరాల వయసులో నటరాజ రామకృష్ణ గారికి నృత్య శిక్షణ ఇచ్చిన నాయుడుపేట రాజమణి గారి గురించి రాసిన వ్యాసం ఒకటి ఉన్నది. ఈ వ్యాసంలో దక్షిణాదిన దేవదాసి చట్టం అమలులోకి వచ్చిన కాలంనాటి విషయాలు పంచుకుంటూ, ఈ చట్టం వల్ల కొంత మంచి జరిగినప్పటికిని దాని వల్ల జరిగిన కళకు, కళాకారులకు జరిగిన నష్టాల గురించి కొంత చర్చించారు. అప్పటి సంస్కర్తలు నాట్యం అంటేనే పాపంగా భావించేవారని, నృత్తానికి, నృత్యానికీ గల తేడా వారికి తెలిసేది కాదనీ, నృత్య కళకీ, సంస్కృతీ సంస్కారాలకీ ఉన్న లంకె వారికి తెలియదనీ అన్నారు. ఇటువంటి పరిస్థితులలో వేశ్యలు, వెలయాండ్రు వారి విటులకి సంబంధించి ఎన్నో నాటకాలు వచ్చాయనీ, వాటి వలన చివరకు నాట్యం చేసేవారంతా కులటలని అందరు అనుకోటం ఎలా ప్రారంభమయిందో తెలిపారు. పెద్దాడ రామస్వామి అని ఒక సంఘ సంస్కర్తతో నటరాజ రామకృష్ణ గారికి జరిగిన సంభాషణ చదివినపుడు చాలా బాధ వేసింది నాకు. రామస్వామి గారు వృద్ధులు అయినాక నటరాజ రామకృష్ణ గారు యాదృచ్ఛికంగా అభినయ విద్యను ప్రదర్శించటం రామస్వామి గారు చూడటం జరిగిందట. అది చూసిన రామస్వామి గారు “ఏమిటీ విద్య! ఈ విద్యలో ఇంత గొప్పతనముందా! ఇంత మహత్తు ఉందా! నాకు ఈనాటి వరకు తెలియదు. మేము బ్రహ్మ సమాజ మతస్తులం కనుక మేము యంటి నాచ్ (Anti Nautch), మేము నృత్య విరోధులం. అందువలన ఇంతవరకూ నృత్త, నృత్య, అభినయాలను నేను చూడలేదు. ఈ విద్య గురించి ఇంతవరకు తెలుసుకొనక పోవటం పెద్ద పొరపాటు. నేను కళలను ఆరాధించలేదు. జీవితాన్ని వృథా చేసుకున్నానేమో” అని అన్నారట. ఆయన వృద్ధ వయసులో తెలుసుకున్నదైనా అసలు తెలుసుకోకుండానే చనిపోయి, దేన్ని సంస్కరిస్తున్నామో దానిని కనీసం తెలుసుకోకుండా సంస్కరించేస్తున్న వారు ఇంకెందరో! వారు చదవాల్సిన వ్యాసం ఇది. ఈ నాయుడుపేట రాజమణి అనెడి కళాకారినితో రచయిత గురు – శిష్య అనుబంధమూ, వారి విద్యా భ్యాసమూ గురించి చాలా విషయాలు చెప్పారు ఈ వ్యాసంలో.
ఇలానే “కళావర్ రింగ్” “చింతామణి” “రామలక్ష్మి” “చంద్ర వదన” అని మరి కొన్ని వ్యాసాలు ఉన్నాయి.
మళ్ళీ “జోగు ముత్తి” వ్యాసం దగ్గర ఆగాను. పల్లెల్లో నివసించే బీద కుటుంబాలకి హరిజనులకి వినోదం చేకూర్చే ఈ జోగితల గురించి ఈ వ్యాసం. అయితే ఈ వ్యాసంలో రచయిత స్వగతం చెబుతూ తనని పెంచి పెద్ద చేసిన ‘దాయి’ గురించి కొంత పంచుకున్నారు. ఆవిడ గొప్ప వైష్ణవి అట. రామకృష్ణ గారికి రామాయణ, భారత, భాగవత కథలు నేర్పించింది అట ఈ దాయి. ఆవిడ గీత గోవిందంలోని అష్ట పదులు పాడేది అట. పొద్దున్నే కృష్ణ కర్ణామృత శ్లోకాలు చదివి వాటి అర్థం చెప్పేది అట. ఆవిడ ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, నారాయణతీర్థుల తరంగాలు కూడా పాడేవారట. అసలు దాయి అయిన ఆవిడకే ఇన్ని విషయాలు తెలిసినపుడు, ఈ సంఘసంస్కర్తలంతా ఓ బ్యాండు వేస్తారెందుకనో ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళు అందరూ అజ్ఞాన తిమిరాంధకారంలో కొట్టుమిట్టాడేవారు అని! ఈ స్వగతం పూర్తి అయ్యాక తిరిగి జోగు ముత్తవ్వ దగ్గరికి వచ్చాక, క్రూర సంఘం యొక్క కట్టుబాట్లకి బలి అయిపోయిన ఒక ముత్తవ్వ గురించి చెప్పారు. ఆవిడ విషయంలో అయన పడిన ఆవేదనా, ఆ వ్యవస్థ మీద ఆయనకి వచ్చిన ప్రశ్నలూ మనల్ని ఆలోచింపజేస్తాయి. టంగుటూరి అంజయ్య గారి సహాయ సహకారాలతో జోగుల, చిందుల వారి జీవితాలను మెరుగుపరచటానికి రచయిత పడిన తపన తెలుస్తుంది మనకి ఈ వ్యాసం ద్వారా. అలాగే హరిజనవాడల జోగులాంబలని పల్లె ప్రాంతాల్లో వాడుకున్న తీరు చూస్తే బాధ వేస్తుంది.
బెంగుళూరు నాగరత్నమ్మ గారి గురించి మరొక వ్యాసం, ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు కళాకారిణుల గురించి వ్యాసాలయ్యాక ఈ పుస్తకం ముగుస్తుంది.
చాలా మంచి పుస్తకం. ఇదేదో పాతకాలపు వ్యవస్థలని glorify చేయటానికి రాసిన పుస్తకం కాదు. నిజానికి ఎన్నో విమర్శలు చేసారు చాలా వాటి మీద చాలా చోట్ల. పుస్తకం ప్రారంభించిందే దేవదాసి చట్టం ఉద్యమాన్ని ఒక ఊపు ఊపిన ముత్తులక్ష్మి రెడ్డి గారితో మరి! అయితే మన popular version of history లో ఈ పుస్తకం లో చెప్పిన విషయాలేవీ చెప్పరు. అప్పటి స్త్రీలలలో ఉండే ఈ diversity గురించీ చెప్పరు. మన సంప్రదాయాలలో ఉండే మంచిని గురించీ చెప్పరు. మన వ్యవస్థల ప్రాశస్త్యం గురించీ చెప్పరు. ఇవన్నీ తెల్సుకోవాలంటే తప్పక చదవవలసిన పుస్తకం ఇది.
S. Narayanaswamy
Very interesting. Where can I get it?
Amarnath
చాలా ఆసక్తి కరంగా వున్నా పుస్తకాన్ని పరిచయం చేసారు Halley గారు. ధన్య వాదాలు.
రెడ్డెమ్మ గారి గురించి లకుమ గారి గురించి చదువుతుంటే, వేయి పడగలు లో గిరిక, ఆవిడ తల్లి పాత్రలు గుర్తొచ్చాయి.
తృష్ణ
@Halley:ఆసక్తికరంగా ఉందండి పుస్తకం. క్రిందటేడాది మేం రామప్ప గుడికి వెళ్ళినప్పుడు ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోగలిగాను.
1983 ఉగాది నాటి (విజయవాడ AIR)ప్రత్యేక జనరంజనిలో రామకృష్ణ గారి రేడియో ఇంటర్వ్యూ ఒకటి ప్రసారమైంది. ఆసక్తి ఉంటే క్రింద లింక్ లో వినండి..
http://trishnaventa.blogspot.in/2011/06/blog-post_6665.html
M.V.Ramanarao
నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నటరాజ రామకృష్ణ గారితో కొద్ది పరిచయం ఉండేది .అప్పటికే ఆయన ప్రసిద్ధుడు.ఆయన నాట్యం.నృత్యం గురించి బాగా పరిశోధించి చాలా విషయాలు రాశారు.మీ పుస్తకసమీక్ష వివరంగా ఉంది.మేము చిన్నప్పుడు మార్కాపురం లో ఉన్నప్పుడు ఆ వూళ్ళో కొందరు వేశ్యలు ఉండేవారు.వారిలో చాలామంది సినిమాలు,నాటకాల్లో వేసేవారు.సంగీతం,నృత్యం లో కూడా పరిశ్రమ చేసి ,పేరుగడించారు.