లకుమ

వ్రాసిన వారు: కె.చంద్రహాస్, అమరశ్రీ
*********

లకుమ ఒక నాట్యకత్తె.

Dr. నటరాజ రామకృష్ణగారు “రుద్ర గణిక” పుస్తకాన్ని రాసి 1987లో ప్రచురించారు. గణికలంటే దేవనర్తకులు. వారినే ‘సానులు’, తర్వాత దేవదాసీలని పిలిచారు. గణికలు దేవదాసీ సంబోధన సరి కాదన్నారు. వారి వృత్తిలో దాసీతనం లేదన్నారు. ఈ విషయంపై చక్కగా విశ్లేషించారు నటరాజ రామకృష్ణ గారు. మాచల్ దేవి, లకుమ, రంగాజమ్మ, కుప్పాయి, తారామతి, ముద్దుపళని, జోగుమిత్తి, నాగరత్నమ్మ మొదలైన ప్రసిద్ధ నర్తకిల గురించి హృదయంగమంగా చెప్పారు.

బాపట్లలో వున్న భావనారాయణస్వామికి అంకితమై, ఆ స్వామి సేవలలో నృత్యపూజలు చేసే దేవనర్తకి మల్లమ్మ. లకుమ అమె కూతురు. అందగత్తె. నృత్య, సంగీత కళలలో మేటి. కూతుర్ని భావనారాయణుడి సేవకు అర్పించడానికి సమయం ఆసన్నమైంది అనుకుంటుంది మల్లమ్మ. ఆ సమయంలో బాపట్లకు రెండు ముత్యాల పల్లకీలు వస్తాయి. అప్పట్లో కొండవీటి ప్రభువు కుమారగిరి రెడ్డి ‘వసంత రాజీయం‘ అనే నాట్యశాస్త్ర గ్రంథం రాయాలనుకున్నారు. లకుమ ప్రావీణ్యం గురించి విన్న రాజు అలాంటి నర్తకి తన గ్రంథ రచనకి అన్నివిధాలా సహాయంగా వుంటుందని తలచి, బాపట్లకు ఆ పల్లకీలు పంపారు. ఒకటి లకుమకోసం — ఆమెను ఆస్థాన నర్తకీమణిగా ఆహ్వానిస్తూ. రెండవది మల్లమ్మకోసం — అస్థానాన్ని సందర్శించమని. నిర్ణయం లకుమకే వదిలేస్తుంది తల్లి. రాజాహ్వానాన్ని మన్నించడానికి మొగ్గుచూపి, తల్లి అనుమతి కోరుతుంది లకుమ. భావనారాయణుడి సేవకు లకుమ జీవితాన్ని అంకితం చెయ్యాలనుకుంటున్న సమయాన ఇలా జరగడం దైవాజ్ఞగా భావించి మల్లమ్మ సరే అంటుంది. తాను స్వామి సేవకురాలినని, ఆస్థానాలతో పనిలేదని తనకోసం వచ్చిన పల్లకీని వెనక్కి పంపేస్తుంది మల్లమ్మ. లకుమ కొండవీటికి ప్రయాణమవుతుంది.

లకుమను కొండవీటి రాజ్య ఆస్థాననర్తకిగా నియమిస్తారు.

కొన్నేళ్ళు గడుస్తాయి. మల్లమ్మకు వృద్ధాప్యం. తన పేరిట ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో అఖండ దీపారాధన చేయించమని కూతుర్ని కోరుతుంది. ఇది చాలా ఖర్చుతోకూడిన వ్యవహారం. లకుమకు తలకు మించిన భారం. తన కోరిక తీరకముందే మల్లమ్మ కాలం చేస్తుంది. తల్లి కోరిక తీర్చాలని లకుమ రాజు సాయం కోరుతుంది. రాజు సరే అన్న తర్వాత ద్రాక్షారామం ఆలయంలో మల్లమ్మపేరిట దీపారాధన చేయిస్తుంది లకుమ. ప్రభువు కుమారగిరికూడా దీపారాధన తిలకిస్తాడు. తర్వాత కార్యక్రమం నృత్యపూజ. దీన్లో ఎవరంటే వాళ్ళు నృత్యం చేయడానికి వీల్లేదు. ఎన్నుకున్న కొన్ని కుటుంబాలవారే అర్హులు. అఖండ దీపారాధన అనంతరం అలా అర్హులైన వందమంది నాట్యకత్తెలు దేవునికి సహస్ర హారతులిచ్చి నాట్యపూజ చేశారు. ఆ సమయంలో లకుమను నాట్యం చేయమంటాడు ప్రభువు కుమారగిరి. ఆ దేవాలయ సాంప్రదాయానుసారం అక్కడ నాట్యం చేసే అర్హత తనకు లేదంటుంది లకుమ. తన కోరికే ఒక శాసనం కాదా అంటాడు ప్రభువు. “దైవ సాన్నిధ్యంలో మానవ శాసనాలకు విలువలేదు ప్రభూ” అంటుందామె. ఆమె నాట్యం అక్కడ చూడాలనే ఆకాంక్షతో, వివశుడై “నా శాసనంతో నిన్ను బలవంతపెడితే” అంటాడు రాజు. దానికామె “నాకు మరణమే శరణ్యం ప్రభూ” అని తన బంగారు వడ్డాణం కింద వున్న పిడిబాకుని పైకి తీసింది లకుమ. రాజు నిశ్చేష్టుడయ్యాడు.

లకుమ వృత్తాంతానికి ఆధారాలు ఏవిటో నటరాజ రామకృష్ణగారు పుస్తకంలో చెప్పలేదు. అందువల్ల ఆయన రాసిందాంట్లో నిజమెంతో కల్పన ఎంతో తెలియదు.

రెడ్డిరాజ్య చరిత్రను 1948లో మల్లంపల్లి సోమశేఖర శర్మగారు ఇంగ్లీషులో రాశారు. తద్వారా కుమారగిరిరెడ్డికి కర్పూరవసంతరాయలు బిరుదు వుండేదని తెలుసుకున్న Dr. నారాయణరెడ్డి గారు మనసుపడి అతనిపై “కర్పూరవసంతరాయలు” కావ్యం రాసి 1957లో మొదటిసారి ప్రచురించారు. కావ్యాన్ని మల్లంపల్లి సోమశేఖర శర్మగారికే అంకితమిచ్చి ఆ మహనీయుడి ఋణం తీర్చుకున్నారు నారాయణరెడ్డి గారు.

Dr. C. నారాయణరెడ్డిగారి “కర్పూరవసంతరాయలు” కావ్యం కొండవీడులో వసంతోత్సవ సంబరాలతో మొదలౌతుంది. మహారాజు కుమారగిరి, అతని మహారాణి, ఆమె సోదరుడు కాటయవేముడు ఉద్యానవనానికి వస్తారు. కొండవీడు ఆ రాత్రి అచ్చం కైలాసంలా వుందట. సాయంకాలం లకుమ నాట్యం. లకుమ కళాలక్ష్మి. ఆమె నాట్యం అద్భుతం. ఆమె అందంచూసి రాజు మంత్రముగ్ధుడవుతాడు. లకుమ తప్ప ఇంకెవరూ మహారాజుకు కనిపించరు. రత్నహారం లకుమకు బహూకరించేందుకు వేదికపైకి వస్తాడు కుమారగిరి. లకుమ వినమ్రంగాముందుకు వస్తుంది. ఆమె మెళ్ళో పూలదండ వేస్తాడు రాజు. ఆ క్షణంలో ఆయన చేతులు కూడా ఆమెకు అలంకారమయ్యాయి. మహారాణి నవ్వుకుంటుంది. లకుమా కుమారగిరిల పరిచయం అలా జరుగుతుంది.

లకుమని చూసిన ప్రభువు, అతని సత్కారం అందుకున్న లకుమ ఇద్దరూ నిదురలేక కలలు కంటారు. రాజ్యం విషయం ప్రభువుకు గుర్తురాని స్థితి. ఇక తాళలేక, కాటయవేమను పిలిపించి లకుమని అస్థాన నాట్యకత్తెగా నియమించాలని తన అభిమతం అంటాడు. కాటయవేముడు బదులేమీ చెప్పడు. అతని మౌనానికి అర్థం ఏమిటని అడిగితే, కాటయవేముడు లౌక్యంగా ముహుర్తమెప్పుడా అని అలోచిస్తున్నానని చెబితే కుమారగిరి సంతసిస్తాడు.

లకుమ అస్థాన నాట్యకత్తెగా నియమితురాలౌతుందన్న వార్త విన్న లకుమ ఉత్సాహానికి హద్దుల్లేవు. అదే వార్త విన్న మహారాణి భయోత్పాదానికి గురైంది.

రాణి కా వార్త క
ల్వనెలంత చెవులలో
ఖరఖరుని అశ్వరిం
ఖల చప్పుడుగ తోచె.

లకుమ రాజనర్తకి అవుతుంది. అప్పుడు —

రేనిలో వెల్తురుల మేడలు
రాణిలో తిమిరంపు నీడలు
కాటవేమునిలో రెండును
కలసిపోయిన సందెజాడలు.

ఆమె నాట్యాన్ని ఆస్వాదించాలనుకుని రాజు తీర్థాటనం సంకల్పిస్తాడు. తనొక రథంలో బయల్దేరుతాడు. పక్కన మహారాణి లేదు. రాజు రథం వెనక ఇంకో రథం. అందులో ఆమె లేదు. పైపెచ్చు ఆ రథంలో లకుమ వుంది.

రాజు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ, లకుమ నాట్యవిలాసాలను చూడడంలో మునిగిపోతాడు. వారిద్దరిమధ్యా ప్రణయం పెరుగుతుంది. మహారాణికి చెడ్డ కలలు వస్తాయి. ఆమె దుఃఖానికి అంతం లేదు.

కొండవీటికి తిరిగివస్తాడు రాజు. ఈసారి రథంలో వెళ్ళేటప్పట్లాగా ఆయన ఒక్కడే లేడు. పక్కన లకుమ వుంది. ఈ దృశ్యాన్ని తన మందిరంలోనుండి చూసిన రాణి వణికిపోతుంది.

రాజ్యవ్యవహారాలను పట్టించుకోడు రాజు. లకుమకు కేళీమందిరం నిర్మిస్తాడు. “వసంతరాజీయం” రచన, లకుమే అతని ప్రపంచం.

ఇరువురు చదరంగమాడు
దురు ఎంతో కక్షబూని
ఎవరోడిన చివరికి బిగి
కవుగిలింత శిక్షయౌను.

రాజ్యపాలనా, సంరక్షణాభారం కాటయవేముడిదే.కాటయవేముడు విజయనగరంపై యుద్ధం గురించి చెప్తే రాజు పౌరుషంతో తనే యుద్ధానికి నేతృత్వం వహిస్తానని అంటూ మాట మధ్యలో ఆగిపోతాడు. ఎందుకంటే —

లకుమ కాలిగజ్జెలు ము
క్త కంఠమ్ముతో పిలిచెను
రేనిలోని పౌరుషాగ్ని
జానువెన్నెలై నిలిచెను.

కాటయవేముడు సూక్ష్మగ్రాహి. మరొక్కమాట మాట్లాడక యుద్ధానికి బయల్దేరాడు.

కుమరగిరి లకుమతో సల్లాపాలు కొనసాగించాడు. అతని పరిస్థితి ఎలావుందంటే —

ఆమెకన్నులు విరిసి
నంతసే పతడు పగలనుకొనును.
ఆమె కన్నులు మోడ్చి
నపుడె రాతిరి యయ్యెననుకొనును.

మహారాజుకు లకుమ తప్ప వేరే ధ్యాస లేదు. ప్రజలు, పరిపాలన, మహారాణి ఎవరూ అతని కంటికి అగుపించరు. రాజ్యభారమంతా కాటయవేముడి భుజస్కందాలమీదే వుంది. అతను మహారాణికి తోడబుట్టినవాడు. సోదరి, అంటే మహారాణి, దుఃఖం చూడలేక కాటయవేముడు రాజుని ఒకసారి ఆస్థానానికి రావల్సిందిగా ఒప్పిసాడు.

కాటయవేముడికిచ్చిన మాటకు కట్టుబడి, బహుకాలానంతరం సభకు వస్తాడు రాజు. సభలో ఆసీనుడైవుండగా లకుమకు కాలుబెణికిందన్న వార్తను వింటాడు. దిగ్గున లేచి సభనుండి వెళ్ళిపోతాడు లకుమవద్దకు. సభాసదులు విస్మయం చెందుతారు. కాటయవేముడికి దిక్కు తోచదు. మహారాణికి ఈ విషయం తెలుస్తుంది. ఆమెకు అంతులేని ఖేదం. ఇక ఉపేక్షించడం భావ్యం కాదనుకుని సోదరుడైన కాటయవేముడుతో తన బాధను పంచుకుంటుందిలా-

ఆటకత్తెల నాదరించుట
అధిపులకు ధర్మమ్మె కానీ
వారి అడుగుల మ్రోల బ్రతుకుల
ధారవోయుట యేటి న్యాయము?


కేళికా మందిరము కన్నను
ఓలగమ్ము పవిత్రమైనది
వ్యక్తికన్నను దేశ సౌభా
గ్యమ్ము ఆదర్శపాత్రమైనది.

కాటయవేముడికి ఆమెనెలా ఓదార్చాలో తెలియలేదు. ఆమె వద్దనుండి వెళ్ళి రాజును కలుస్తాడు. మహారాణి పడుతున్న వ్యథను చెప్తాడు. ఆమెను ఓదార్చమని రాజుకు సలహా ఇస్తాడు. కాటయవేముడు వెళ్ళింతర్వాత అతని మాటలు చాటుగా విన్న లకుమ కూడా మహారాణి వద్దకు వెళ్ళమని రాజుకు సలహా యిస్తుంది. రాజుకు ఆ మాటలు రుచించవు. రాణి అంటే గౌరవమే కానీ ఆమెకు దూరంగా వుండటమే తనకు సౌఖ్యమంటాడు. దేశమేమైనా సరే నిన్ను వదలిపోను అంటాడు రాజు. తన ప్రయత్నం ఫలించలేదని కాటయవేముడు చెప్తాడు రాణితో.

రాణికి ఏం చెయ్యాలో వూహకందదు. సగం రాత్రి తర్వాత ఆమెకో ఆలోచన తడ్తుంది. వెంటనే ప్రభువు వుండే కేళీ సౌధానికి వెళ్తుంది. మెల్లగా తలుపు తట్టి లకుమను పిలుస్తుంది. లకుమ పాదాలపై పడ్తుంది రాణి. లకుమ ఆశ్చర్యపోయి తను ఎంత పాపినో అంటుంది. తన రాకకు కారణం చెపుతుంది రాణి. ప్రభువు నిన్ను ఆదరించినందుకు పరితపించనుగానీ దేశాన్ని ఉపేక్షించటాన్ని భరించలేను అంటుంది రాణి. సమస్యకు పరిష్కారంకూడా ఆమే సూచిస్తుంది —

భూపతిని ఎటులైన విడిపో
వుటయె నీకు అవశ్యమమ్మ!

అంటుంది.

లకుమ ఇరకాటంలో చిక్కుకుంటుంది. అటు రాజ్యం. ఇటు రాజు. లకుమయే లోకం అనుకునే ప్రభువును విడిచివెళ్తే అతడు పిచ్చివాడవటం ఖాయం. అంతేకాక రాజ్యాన్ని, రాణినీ తనకోసం వదిలిపెట్టిన రాజును తనెలా వదలగలదు? రాణికి ఇచ్చిన మాటనెలా తీర్చాలా అని లకుమ మథనపడుతుంది. రాత్రంతా ఆమెకు రకరకాల ఆలోచనలు.

తెల్లవారేసరికి —
లకుమలో నొక వజ్రసంక
ల్పమ్ము వేళ్ళను దన్ని లేచెను.

ఏమిటా వజ్రసంకల్పము? ఏమిటా కఠోరనిర్ణయం? ఆమె ఏం చేసింది? … నాట్యంచేస్తూ లకుమ పిడిబాకుతో పొడుచుకుంటుంది. ఆ పిడిబాకులో ఒక పత్రం వుంది. అందులో రాజుకు message — రాజ్యం ముఖ్యమని, తనని మరచిపొమ్మని.

లకుమ త్యాగము నిరుపమానము. అందువల్లే —
నేటికిని లకుమ అందెల ఝణత్కారములు
వినిపించు కొండవీటను వీచు వాయువులు.

-అలా ముగుస్తుంది కావ్యం.

ఈ కావ్యం సినారె గారికి ఎంతో ఖ్యాతినార్జించింది. కావ్యమంతా హాయిగా చదువనిస్తుంది.

*

ఒక చారిత్రక శకలాన్ని ఆధారంగా తీసుకుని దానిచుట్టూ అల్లిన కథ సినారె గారి ‘కర్పూర వసంతరాయలు‘ అని ప్రకాశకుల మాటగా రాశారు (5th Edition: 2000. Rs.60). అందువల్ల రెడ్డిరాజుల చరిత్రకీ ఈ కావ్యానికీ సంబంధం ఏదన్నా వుంటే అది కాకతాళీయమనే అనుకోవాలి. చరిత్ర ప్రకారం కుమారగిరి రెడ్డి రసికుడు, కళలంటే వ్యామోహమున్నవాడు. నాట్యంపై పుస్తకం రాశాడు. లకుమతో పరిచయం, ఆమె నాట్యానికి ఆయన ముగ్ధుడవడం వరకు అసమంజసమేమీ లేదు. లకుమ వ్యామోహంలో అతనికి రాత్రికీ పగలుకీ తేడా తెలియలేదని చెప్పడంలో ఔచిత్యం లోపించినట్లు తోస్తుంది. కుమారగిరి రెడ్డి రాజు. కొన్నాళ్ళు తనను తాను మరచిపోయాడంటే infatuation అని అర్థం చేసుకోవచ్చు. రాజ్యం లేదు, రాణి లేదు, కొడుకు ధ్యాస లేదు, యుద్ధంలేదు, ప్రజల వూసు లేదు. లకుమకు కాలుబెణికిందన్న వార్తను విని సభనుండి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం. ఇంతగా కుమారగిరిరెడ్డిని దిగజార్చి చిత్రించడం కాస్త ఇబ్బంది కల్గించవచ్చు. కుమారగిరి రెడ్డి కల్పిత వ్యక్తి అయితే ఫరవాలేదు. అతను దాదాపు 16 ఏళ్ళు కొండవీటిని పాలించిన రాజు. గొప్ప దక్షుడు కాకపోయినా భ్రష్టుడూ కాదు.
*
సినారె గారి కావ్యం కల్పితం అన్నారు గానీ ఆయన రాసిన కథే చరిత్రలాగా భావించి పుస్తకాలు వచ్చాయి. వాటిల్లో ఒకటి “లకుమ“. ఈ పుస్తకాన్ని బాలశౌరి రెడ్డి గారు హిందీలో రాస్తే దాన్ని పి. రాజగోపాలనాయుడు గారు (పేరున్న రాజకీయ నాయకులు, ఒకప్పటి M.P. ప్రస్తుత మంత్రి గల్లా అరుణ తండ్రి) తెలుగులోకి అనువదించారు; 1977లో తొలిసారి పబ్లిష్ చేశారు. దాన్ని జూన్ 2011న ఎమెస్కో సంస్థ “లకుమ” titleతో మళ్ళీ ప్రచురించారు (వెల Rs.60).”

“లకుమ” నవల దాదాపు సినారెగారి కావ్యానికి అనుసరణే. ముగింపుకూడా అదే. లకుమ రాజు వద్దకు ఎలా చేరింది అన్న విషయంపై తేడావుంది. ఆమెని సేనాపతి అపహరించి తీసుకునిపోయి రాజుకి బహూకరించినట్లు ఈ నవలలో వుంది. ఇది చాలా అసంబద్ధంగా, లకుమను కించపరిచేలాగా కూడా వుంది. ఏమాటకా మాట చెప్పుకోవాలి. పుస్తకానువాదం చాలా సరళంగా వుండి, నవలని చివరివరకూ ఒక్కబిగిన ఉత్కంఠతో చదివిస్తుంది.
*
లకుమతో వ్యవహారం ఇంతటితో అయిపోలేదు. “కొండవీటిరెడ్డిరాజులు” అనే పుస్తకాన్ని 2000లో ఈమని శివనాగిరెడ్డి రాశారు. మూడవ ముద్రణ 2010లో జరిగింది. (వెల రు.40. కాపీలు3000. ప్రచురణ: రెడ్డి సేవా సమితి). Prof. P. చెన్నారెడ్డి, Director, Dept. of Archeology and Museums దీనికి ముందుమాట రాస్తూ — “ఈ పుస్తకం మూడో ముద్రణకు నోచుకుందంటే రచయితకు చరిత్రపై పట్టు ఎంతో ఇట్టే తెలిసిపోతుంది” అని చెప్పారు! ఈ పుస్తకంలో సినారె గారి “కర్పూర వసంతరాయలు” కథంతా రాశేసారు! కల్పనే చరిత్ర అయిపోయిన ఈ వుదంతమంతా ఒకే ఒక్క జీవితకాలంలో జరిగింది. అసలే మనకు sense of history తక్కువని పేరు. ఇలా అయితే ఎలా మరి?

You Might Also Like

3 Comments

  1. Vanaja Tatineni

    కర్పూర వసంత రాయలు ..”నాటకం”గా కడప ఆకాశవాణి కేంద్ర సమర్పణగా విన్నప్పుడు..చరిత్ర ఆధారంతో.. వ్రాసిన నాటకం అనుకున్నాను. కానీ అసలు చరిత్రకి.. కర్పూర వసంత రాయలు కావ్యానికి ఇంత తేడా ఉందని తెలుసుకోవడం కూడా మంచిదయింది. ఏమైనా “లకుమ” ని ఇంత విశదంగా చూడటం కూడా సంతోషం కల్గించినది. వ్యాస కర్త కి ధన్యవాదములు.

  2. K. Chandrahas

    కొండవీడు ప్రాంతంలో లకుమగురించి రెండు శాసనాలు దొరికాయని ఎవరో చెప్పగా విన్నాను. తెలిసినవారెవరైనా వాటి వివరాలు చెప్పండి ప్లీజ్.

  3. పద్మవల్లి

    ఎప్పుడో నేను ఏడు ఎనిమిది క్లాసుల్లో ఉన్నప్పుడనుకుంటా, లకుమాదేవి అని లల్లాదేవి గారి సీరియల్ ఆంధ్రభూమి లో వచ్చేది. కధ అంతా గుర్తు లేదు, కొన్ని కొన్ని మాత్రం అస్పష్టంగా గుర్తు ఉన్నాయి. అందులో లకుమకు కొండవీటి రాజు, ఆస్థాన రాజనర్తకిగా రమ్మని ఆహ్వానం పంపినట్టు గుర్తు. (ఆ సీరియల్కి వేసిన అందమైన లకుమ బొమ్మలు మాత్రం ఇప్పటికీ కళ్ళముందు ఉన్నాయి). మళ్ళీ పూర్తిగా చదవాలని అనుకున్నా కుదరలేదు.

    సినారె గారి కర్పూరవసంతరాయలు మాత్రం అక్కడక్కడా భాగాలు మాత్రం చదివే అవకాశం దొరికింది. ఇపుడు మీరు చెప్పిన లకుమ (బాలశౌరి రెడ్డి ) కూడా చదవాలి వీలయితే.

    మీ వ్యాసం, నేను మరచిపోతున్న లకుమని మళ్ళీ గుర్తు చేసింది. థాంక్ యు. వెంటనే ఆ పన్లో ఉండాలి.

Leave a Reply