తెలుగు వారి జానపద కళారూపాలు

వ్యాసకర్త: Halley
***************
ఈ పరిచయం మిక్కిలినేని రాధాకృష్ణమూర్తిగారు రాసిన “తెలుగు వారి జానపద కళారూపాలు” అన్న పుస్తకం గురించి. జానపద కళలూ వాటి వెనుక ఉన్న కథలూ, వాటి చుట్టూ అల్లుకుపోయిన కులాలూ, జాతి ప్రాంత విశ్వాస భేదాల వల్ల వచ్చిన వైవిధ్యాలూ, ఇన్ని వైవిధ్యాలు ఉన్ననూ ఈ కళలన్నీ తెలుగు ప్రాంతంలో ఎలా జీవించాయీ, జీవిస్తున్నాయీ, ప్రజలందరినీ ఎలా అలరించాయీ వారి జీవన విధానంలో ఎలా అంతర్భాగం అయ్యాయీ, కాలప్రవాహంలో మెల్లగా ఎలా కనుమరుగు అవుతున్నాయీ అన్న విషయం గురించి తెల్సుకోవాలి అని అనుకొనే వాళ్ళు తప్పక చదవాల్సిన పుస్తకం. 818 పేజీలు ఉన్న పుస్తకం. వందల కళల గురించి ప్రస్తావన ఉన్నది. నేను తెల్సుకున్న కొన్ని కొత్త విషయాలూ నాకు తెలియని తెలుగు సామాజిక వ్యవస్థ లోని కొన్ని కొత్త కోణాలూ ఇతరత్రా ఆలోచింపజేసే విషయాల గురించి ఈ పరిచయం. ఒక రకంగా చెప్పాలి అంటే కొన్ని కొన్ని snippets గురించి మాత్రమే అనమాట .

ఒకనాడు దేశానికి జాతికి విఙ్ఞాన వినోద వికాసాలను కలిగించిన మహోన్నత కళాకారుల దుస్థితి గురించీ మిక్కిలినేని గారిని అది కదిలించిన తీరు గురించీ ఆయన రాసిన “నేనెందుకు రాయాలి?” అన్న వ్యాసం నన్ను కదిలించింది.

జమిందారులు లేరు రాజులూ లేరు పోషకులూ లేరు, ప్రజల ఆదరణ కూడా అంతంత మాత్రమే కాబట్టి అంతరించి పోతున్న ఈ జానపద కళలను కాపాడాలంటే ప్రభుత్వమే పూనుకోవాలి అని అన్నారు. ఇది 1992 నాటి మాట. ఏం పూనుకున్నాయో ఏమో నాకు తెలియదు. ఒకటి మాత్రం అనిపించింది నాకు ఈ పుస్తకంలో కళల విస్తృతి చూసాక, ప్రభుత్వాలు ఏం చేసినా కూడా మహా అంటే అవి conservation కో museumization కో ఉపయోగ పడతాయి అంతే. కళలు జీవించాలి అంటే జీవన విధానాలలో మార్పు జరగాలి. అదొక్క పెద్ద civilizational question మన కాలానికి, ఏం చేస్తాం! ప్రస్తుతానికి అయితే relentless march of technology లో ఇది ఒక collateral damage అనుకోవాలి అంతే. లేదంటే కష్టం అనుకుంటాను మన కాలానికి!

చాళుక్య రాజుల కాలం లో దేవాలయాలలో సంగీతం, నాట్యం, శిల్పం, చిత్ర లేఖనం, సాహిత్యం వగైరా లలితా కళలు పోషించారట. వీటి కోసం మూడు వందల మంది సానులు మానులు ఉండేవారట. అసలు “సాని” అంటే ఇలాంటి అర్థం కూడా ఉందని నాకు తెలియటానికి చాలా ఏళ్ళు పట్టింది. అది బూతు అని అనుకొనే పెరిగాను నేను! దేవాలయాల్లో నృత్య కళా వైభవం గురించి రాస్తూ పిఠాపురం, తిరుమల, శ్రీకాకుళం, బాపట్ల, మాచర్ల, కాళహస్తి, మార్కాపురం వగైరా ప్రాంతాల్లోని కొన్ని దేవాలయాల గురించి కొన్ని విశేషాలు తెలిపారు.

కాకతీయుల కాలంలో కళాకారులకి రాజులు ఇచ్చిన మాన్యాలు నర్తకీమణులకు ఆటకత్తెలకు చేసిన గృహదానాలు భూదానాలు గురించి రాసిన విషయాలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి. రెడ్డి రాజుల కాలంలో దొమ్మరి సానుల ప్రదర్శనలు వీథి భాగవతాలు ప్రజలని అలరించిన తీరు గురించి చెప్పుకొచ్చారు. “కామేశ్వరి కథ” గురించి రాసిన కొన్ని విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. ఈ కథా కార్యం ఉదయం ప్రారంభిస్తే సాయంత్రం వరకు జరిగేదట. అప్పటి బ్రాహ్మణుల ఇళ్ళలో అమ్మలక్కలందరూ ఇండ్లలో పని పాటలు ముగించుకొని సాయంత్రం వరకు కర్ణానందం గా వినే వారు అట. అందుకనే “అక్కలు లేచే వరకు నక్కలు కూసే” అన్న సామెత వచ్చింది అట. అటు తర్వాత ఈ కామేశ్వరి కథే కామవల్లి కథగా పరిణామం చెంది అన్ని జాతుల స్త్రీలకూ వ్యాపించి తర్వాత కలుపు తీసే వారు, కోత కోసేవారు, పిండి విసిరే వారు తమ పని చేసుకుంటూ పాడుకొనే వారు అంట. సో ఇది స్త్రీలలోనే పుట్టి స్త్రీల ద్వారానే ప్రచారమైన ఒక జానపద కథ/కళ అనమాట. చరిత్ర పాఠాలలో ఇవి చెబితే ఈ ప్రభుత్వాలకి పోయేది ఏంటో నాకు అర్థం కాదు. కనీసం అప్పటి స్త్రీల గురించి కొన్ని అపోహలన్నా పోతాయి కదా? అంటే అందరూ ఇలానే ఉండేవారు అని కాదు పాయింటు ఇలా కూడా కొందరు ఉండేవారు అని! నా వరకు నాకైతే నేను చదివిన చరిత్ర పాఠాలలో ఇలాంటివి ఎవరూ చెప్పలేదు.

ఇకపోతే దేవదాసి ఐన పల్లెమకు పుట్టిన లకుమాదేవి గురించి చెబుతూ, అపర నాట్య సరస్వతి ఆవిడ అని అన్నారు. పేద సాదలకు ధనాన్ని వస్త్రాలని దానం చేస్తూ ఉండేది అని తెలిపారు. నేను సెలెక్టివ్ గా నాకు నచ్చిన కొన్ని విషయాలు మాత్రమే ప్రస్తావిస్తున్నాను ఈ పరిచయం లో. లకుమాదేవి కుమారగిరి అనే రాజు ప్రేయసి. ఆ రాజు అంతఃపురంలో ఎందఱో స్త్రీలతో కలిసి జల క్రీడలు ఆడేవాడు. అంటే స్త్రీ ఆట వస్తువా? అసలు బహు భార్యత్వం పాటించిన ఆ రాజు మనిషేనా? వాట్ అ regressive system! ఇలా కూడా ఆలోచించచ్చు నేను చించట్లేదు అంతే.

విజయనగర సామ్రాజ్య శోభ వెలిగిన కాలంలో భోగం స్త్రీల వైభోగం గురించి కొన్ని విషయాలు తెలిపారు. దేవి నవరాత్రులలో ప్రతి ఉదయం, భువన విజయంలో, రథోత్సవాలలో, దేవాలయంలో ప్రతి శనివారమూ వారు నృత్యం చేసేవారట. భోగం సానులు ఆనాడు సంగీత విద్యలో ప్రత్యేక కృషి చేసే వారట. తమ పిల్లలకు పది సంవత్సరాల ముందు నుంచే నృత్య విద్యను నేర్పే వారట. అప్పటి దేవదాసీలు దర్బారులలో, రాణీవాసపు మందిరాలలో, దేవాస్థానాలలో, వీథి మంటపాలలో తమ నాట్య నాటక గాన మాధుర్యాలు వెదజల్లారట. భోగం మేళం అన్నది కూడా బూతు మాట లానే అనుకొనేవాడిని నేను చిన్నపుడు. అవసాన దశలో ఉన్న వ్యవస్థను చూసి ఆ వ్యవస్థ యొక్క ఉన్నత స్థితిని గురించి ఒక అభిప్రాయంకి రావటం తప్పు అని తర్వాత తర్వాత తెల్సుకున్నాను. ఈ వాక్యాలు నా ఆ అభిప్రాయానికి కొంచెం ఊతం ఇచ్చినట్టుగా అనిపించాయి. ఆకాలంలో విప్ర వినోదాల గురించి చెప్పిన విషయాలు కూడా నన్ను ఆకట్టుకున్నాయి. ఎరుకల సాని ప్రాభవం గురించి చెప్పిన విషయాలు కూడా నన్ను అలా పుస్తకానికి కట్టిపడేశాయి. కూచిపూడి భాగవతుల గురించి చెప్పిన ఒక కథ నాకు చాలా నచ్చింది. ఈ కథలో ఒక సామంత రాజు పాలనలో దారుణాలని తమ ప్రదర్శన ద్వారా వారు చక్రవర్తికి చూపి అతనికి కనువిప్పు కలిగించి తద్వారా ఆ సామంత రాజు కిరాతక పాలన ఎలా అంతమొందించారో చెప్పారు. ఇటువంటి కథ ఒకటి విశ్వనాథ వారి నవలలో అనుకుంటాను చదివినట్టు జ్ఞాపకం.

ఊరూరా తిరుగుతూ భాగవతం చెప్పే భాగవత మేళాల గురించి కూడా కొన్ని చక్కని విషయాలు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ వీథి భాగవతాలని అప్పటి తంజావూరు పరిసర గ్రామాల ప్రజలు ఆబాలగోపాలం తరలి వచ్చేవారట.

ఇది కాక గోల్కొండ నవాబులు చేసిన సాహితీ వాఙ్ఞ్మయ సేవ గురించి మిక్కిలినేని గారు తెలిపిన కొన్ని విషయాలు నాకు కొత్తగా అనిపించాయి.

ఇది కాక కురవంజి (ఎరుకల సాని) కళా రూపం గురించి తెల్సుకున్నాను మిక్కిలినేని గారి పుణ్యమా అని. కొన్ని యక్షగానాలలో ఈ కొరవంజి పూర్తిగా వేదాంత బోధ చేసేది అట. యక్షగానాల్లో వేషం వేసుకొచ్చే కొరవంజి మాములు ఎరుకల సాని కాదు అని, పార్వతి దేవి ప్రతి రూపం అని చెప్పిన మాట నాకు బాగా నచ్చింది.

యక్షగానాల వైశిష్ట్యం గురించి తెలుపుతూ వాటిలో ఎరుకలు గొల్లలు మొదలైన వారి జాతి చరిత్ర, వారి సాంఘికాచారాలు, వారి వాలకాలు, మాటల తీరు, వృత్తి ధర్మాలు, కట్టు బొట్టులతో సహా తరగతుల వారిగా ప్రజా జీవిత వివరాలు ఎలా తెలుస్తాయో చెప్పారు.

కొయ్య బొమ్మలాట గురించి చెప్పుకొస్తూ, అనంతపురం జిల్లా హిందూపురంలో అక్కడి గ్రామ వడ్రంగులు కళ్ళతో కూడా అభినయం చేయగల కట్టె బొమ్మలు చేసే వారని తెలిపారు. ఆ కళల ప్రాభవం ఇంటి పేర్లతో ఊరి పేర్లతో ముడి పడిన విధానం చెప్పుకుంటూ “బొమ్మలాట పల్లె” అని ఒక ఊరు గురించి చెప్పారు. బొమ్మను ఆడించే వ్యక్తి ఆ పాత్ర ఔచిత్యాన్ని తానూ అనుభవించి హృద్యంగా ఎలా ప్రదర్శించారో చెప్పారు.

తోలు బొమ్మలాటల వారి గురించి చెబుతూ కుటుంబం అంత కలిసి ఎలా పని చేసే వారో ఇలా చెప్పారు. భర్త శ్రీరాముడి పాత్రకు వాచికం చెప్పి పాట పాడితే, భార్య సీతగా వాచికం చెప్పి వంట పాడుతుంది. బిడ్డలు బాల బాలికల పాత్రలకు అభినయాన్నిస్తారు. వీరి కథా ఇతివృత్తాలు ప్రధానంగా భారత రామాయణ గాథలకు సంబంధించినవి అని తెలిపారు. అవి కాక పల్నాటి వీర చరిత్ర వంటి దేశీయ కథలని కూడా ప్రదర్శించే వారని తెలిపారు. ఈ కుటుంబాలు ఈ ప్రదర్శనలను చేయాలి అంటే ఎంత “చదువు” చదువుకోవాలో అనిపించింది నాకు.

అటు తర్వాత 17వ శతాబ్దపు ఆంధ్రదేశంలో జిక్కిణి నాట్య ప్రదర్శనల గురించి కొంత తెలిపారు. నాకసలు అదేంటో కూడా తెలియదు. ఈ పుస్తకం లోనే మొదట వినటం!

హరిజనులు జరుపుకొనే గొంతాలమ్మ పండగలో ప్రదర్శనలు ఇచ్చే సొలిగాడి గురించి కొన్ని విషయాలు తెలిపారు. కూచిపూడి వారి భామా కలాపం గొల్ల కలాపం వలె ఈ చోడిగానిది కూడా ఒక కలాపమే అన్నారు. ఈ కలాపంలో ఇతర కథా వస్తువుని పక్కన పెడితే చోడిగాడు దశావతారాలను అభినయించి నారాయణ మూర్తిని ప్రార్థించి, రామాయణ గాథని అంతా కూడా అభినయించే వాడంట. ఈ కలాపానికి ఎరుకల కథ అని కూడా పేరట. చరిత్ర పుస్తకాలని అతిగా తిడుతున్నా అని అనుకోక పోతే, నాకు అనిపించింది ఒక్కటే. ఇప్పటి దాక ఒక్క అఫీషియల్ పాఠ్య పుస్తకంలో కూడా (అది ఏ తరగతిది అయినా కానీ) హరిజనులకి ఇలా వారి వారి నృత్య రూపకాలు ఉండేవనీ, వాటి గొప్పతనం ఇదనీ ఎవడూ చెప్పిన పాపాన పోలేదు నాకు తెలిసి. ఇప్పుడు ఒకవేళ ఇస్కూలు చరిత్ర పుస్తకాలు తిరిగి రాసారేమో నాకు తెలీదు!

ఇలా చెప్పుకుంటూ సిద్ధేంద్ర యోగి గురించి కూచిపూడిలో వంశపారంపర్య విద్యల గురించీ ఆ వారసత్వాల గురించీ ఆ విద్య విధానాల గురించీ చక్కని విషయాలు తెలిపారు. ముఖ్యంగా వ్యాయామం ద్వారా నాట్య శిక్షణ అన్న శీర్షిక కింద రాసిన విషయాలు నాకు ఎంతగానో నచ్చాయి. విద్యాభ్యాసంలో వ్యాయామ శిక్షణ కూడా కలపడం వలన ఎక్కువ సేపు అలసట లేకుండా నృత్యం చేయటానికి వీలు అవుతుందని తెలిపారు. ఇది చెబుతూ కూచిపూడి నాట్య కళాకారులు ఒక్క నాట్య సంగీతాల్లోనే కాక అలంకార శాస్త్రంలోనూ, మంత్ర శాస్త్రంలోనూ, భాష శాస్త్రంలోనూ, వాద్య శాస్త్రంలోనూ నిరుపమాన ప్రజ్ఞ ,నైపుణ్యం కలవారు అని అన్నారు.

అటు తర్వాత మహారాష్ట్ర నుంచి ఆంధ్ర దేశానికి వచ్చిన సురభి కళాకారులు ఇచ్చిన జంఖండీ వీథి నాటకాల గురించి చెప్పారు. ఆ నాటకంలోని ప్రత్యేకతల గురించి చక్కగా వివరించారు.

తమ్మరపు వెంకటస్వామి గారి సారథ్యాన నడిచిన వీథి భగవతాల గురించి చెబుతూ అయన దేవదాసి కులానికి చెందిన వ్యక్తి అని అన్నారు. వీరి జట్టులో స్త్రీ పాత్రలను ధరించెడి అలివేలమ్మ అనెడి పాత్రధారిణి పండితులు భరతశాస్త్రం, అలంకరశాస్త్రం , భాగవత పద్యాల గురించి తనని అడిగే ప్రశ్నలకి సునాయాసంగా జవాబు చెప్పేది అట.

కూచిపూడి భాగవతుల వారి వీథి నాటకాల వలెనే యానాది, గొల్ల, చెంచుల నాటకాలు కూడా ఉండేవి అని చెప్పుకొస్తూ మాల వారి వీథి నాటకాల గురించి కొన్ని విషయాలు చెప్ప ప్రారంభించారు. వారు రామాయణానికి సంబంధించిన నాటకాలు ఆడే వారట. ఆ రోజుల్లో పేదవాళ్ళకి ఈ ప్రదర్శనలు కన్నుల పండుగగా ఉండేవి అట. ఇలా కుల భగవతాల గురించి చెప్పుకొస్తూ యానాదుల భాగవతం గురించి కూడా చెప్పారు. వీరి భాగవతాల్లో స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించేవారట. వీరు ప్రదర్శించే భాగవతాలలో ఉషా పరిణయం, కృష్ణ లీలలు, సావిత్రి, శశిరేఖా పరిణయం వంటివి ప్రసిద్ధి పొందాయట.

ఈ diversity ఏంటో బాబోయి అని అనుకున్నాను నేను. సరే కులాలు వాటి తాలూకా exploitation, discrimination, atrocities వగైరాలు ఎలాగూ ఊదరగొట్టేసారు చిన్నప్పటి నుంచీ, ఈ విషయాలన్నీ ఎవరు చెప్పాలి మరి? ఏమో!

ఇక పగటి వేషాల గురించి చెబుతూ దేవర పెట్టె గురించీ, కారు వాసాని సోమయాజుల గురించి, సున్నపు వీరయ్య గారు మాదిగ వేషంలో కుల వ్యవస్థను తూర్పార బెట్టిన విధానం గురించి, పఠాన్ గులాం అని ఉర్దూలో వేసే వేషం గురించీ, ఇంకా ఎన్నో మరెన్నో వేషాల గురించీ అనర్గళంగా చెప్పుకుంటూ పోయారు.

విప్ర వినోదుల గురించి చెబుతూ రోప్ ట్రిక్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. టిన్ టిన్ కథలు కానివ్వండి లేక ఇండియానా జోన్స్ కానివ్వండి అప్పట్లో ఇండియా అనగానే కొన్ని స్టీరియోటైప్లు ఉండేవి. వాటిలో ఈ రోప్ ట్రిక్ ప్రధానమైనది. దీని రహస్యం తెలియాలంటే పుస్తకం చదవాల్సిందే మరి.

జంగం కథలు, బుర్ర కథలు, తందానా కథలు అనుకుంటూ ఆ కళలలో ప్రాంతీయ భేదాల గురించి చెప్పిన విధానం నాకు నచ్చింది. ప్రధానంగా భారత రామాయణ కథలే వీటి ఇతివృత్తాలు అయినప్పటికిని, రకరకాల కుల సాంఘిక మత వైరుధ్యాల మూలాన ఈ ఇతివృత్తాలలో జరిగిన మార్పు చేర్పుల గురించి చదువుతూ ఉంటే ఆ విస్తృతిని చూసి ఆహా అనిపించింది. బుర్ర కథకురాళ్ళు కూడా ఉన్నారుట మరి.

మరో చోట విజయ నగర రాజ నర్తకిగా, నాటకరంగ నటిగా, గాయనిగా ప్రజలని అలరించిన “కళావర్ రింగ్” సరిదె లక్ష్మి నరసాయమ్మ గారి గురించి రాసిన విషయాలు కూడా నాకు ఎంతో నచ్చాయి. ఇలా ఎందఱో విదూషిమణుల గురించి, విద్వాంసురాళ్ళ గురించి తెలిపారు. వీరిలో చాలామంది కళారాధన కు జీవితం అంకితం చేసిన వాళ్ళే!

ఇక పోతే ఏకపాత్రాభినయాలు, హరికథల గురించి కూడా కొంత చెప్పారు. అనంతపురం ఆణిముత్యం “మెరవణి గద్య” అని ఒక కళ గురించి చెప్పారు. ఇది పెళ్లి ఉత్సవాలకి సంబందించిన వేడుక, ప్రధానంగా ఆడవారు చేసేటిది. ఈ వేడుకలో వాయిద్యాలు వాయించటానికి కొన్ని తెగల వారు స్పెషలిస్టులు. దేనికి మళ్ళీ ప్రత్యేకమైన స్తోత్ర పాఠాలు కూడానూ!

గణాచర్ల గరగ నృత్యాలు, బోనాలు వగైరాల గురించి కూడా చాలా చక్కగా విశదీకరించారు. ఇక పోతే చిందు మాదిగల చిందు భాగవతం గురించి చెప్పుకొస్తూ ఇది రెండు వేల సంవత్సరాల నాటి నృత్య కళ అని అన్నారు. వీరు మాదిగలపై ఆధార పడి జీవించేవారట. ప్రధానంగా రామాయణ, భారత, భాగవత కథలని నృత్య నాటకాలుగా ఆడే వారట. మోహిని రుక్మంగద, సారంగధర, చెంచు లక్ష్మి, సుందరకాండ, వీరాభిమన్యు వంటి నాటకాలు ప్రదర్శించే వారట. అయితే ఇతర కళల లాగానే సినిమా, రేడియో, వీడియో తాకిడికి ఈ కళలు కూడా శిథిలమైపొతున్నై అని బాధ పడ్డారు.

“గాలపు సిడి” అనే ఒక కళ గురించి చెబుతూ స్త్రీలు దేవతలని కొలవటం కోసం ఎటువంటి సాహసాలు చేసారో వివరించారు. కొందరు స్త్రీలకి కూడా ఇటువంటి ఆచారాలు ఉండేవా అని నేను షాక్ తిన్నాను. అమ్మాయి వీపు చర్మానికి కొక్కేమును గుచ్చి ఆమెని పైకి లేవనెత్తి ఏదో చేస్తారట. రక్తం కారుతూ ఉన్నా కూడా ఆ అమ్మాయి చలించదంట. ఇదంతా దేనికి అనుకున్నారు? తను ప్రేమించిన అబ్బాయితో తన పెళ్లి జరిగితే దేవతకి కృతజ్ఞత తో ఆమె ఇచ్చే ఒక offering అట ఇది!

ఇక రాయలసీమ పల్లెలో జట్టి జాములు అని ఒక పూర్తిగా స్త్రీలకే సంబంధించిన కళా రూపం ఒకటి ఉన్నది అట. ఈ జట్టి జాముల పాటలలో సాంఘిక గాథలు, ప్రేయసి ప్రియుల ప్రేమ కలాపాలు, పౌరాణిక చారిత్రక గాథలు ఉండేవట.

ఇలా భజన పాటలు, పాములాటలు, ఫకీరు వేషాలు, గోండుల నృత్యాలు ఇలా ఎన్నో కళల గురించి చెప్పుకొచ్చారు.

ఇక అప్పట్లో ప్రధానంగా మాదిగ కులస్తులు వాయించెడి డప్పుల గురించీ, డప్పుల కోలాట నృత్యం గురించీ చెప్పిన విధానం నన్ను పుస్తకానికి అతుక్కు పోయేలా చేసింది. ఘటనలకి అనుగుణంగా డప్పు వాయిద్యంలో మార్పులు చేసేవారని తెలిపారు. నా పిచ్చి కాని ఈ ప్రత్యేకతల గురించీ ఈ కళా వైశిష్ట్యాల గురించి ఇస్కూలు పిల్లకాయలకు ఎవరు చెబుతారు చెప్పండి? మనకి రాజకీయం చేయటమే బాగా వచ్చు! అది ఇస్కూలు సిలబస్ ను అయినా సరే!

అటు తర్వాత కత్తుల గారడీలు, వీర భద్ర విన్యాసాలు గురించి చెప్పాక గొల్లసుద్దుల గురించి చెప్పిన విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. గొల్ల సుద్దుల వారు గొల్లలను మాత్రమే యాచించే వారని యాదవ చరిత్రకు సంబంధించిన కృష్ణ లీలలు కాటమరాజు కథలు వగైరాలు చెప్పేవారనీ అన్నారు. వీరిలో మళ్ళీ వైష్ణవ శైవ భేదాలు, గొల్ల తెగలలో భేదాలు వగైరాల గురించి చెప్పారు. ఈ సుద్దుల ప్రత్యేక ఛందస్సుల గురించీ వంతల గురించీ ఎన్నో విశేషాలు తెలిపారు.

తర్వాత అసాదుల ఆరాధనా చిందుల గురించి చెప్పిన విషయాలు కూడా నాకెంతో నచ్చాయి. ఆ మధ్యన ఏదో పాటలో ఈ ప్రస్తావన వచ్చి నా మిత్రులని అడిగితే నాకు సరి అయిన క్లారిఫికేషన్ రాలేదు. ఇన్నాళ్టికి తెల్సింది అసాదులు అంటే మాల మాదిగ కులాలలో పూజారి వర్గానికి చెందిన వారు అని. జాతరల సమయంలో మాల అసాదులు పాటలు పాడుతూ ఉంటే మాదిగ అసాదులు చేడిక వాయిస్తూ ఉండటం, మతంగ కన్యలకు పూనకం రావటం అని మిక్కిలినేని వారు వర్ణిస్తూ ఉంటే ఏదో అంతా కళ్ళ ముందే జరుగుతునట్టుగా అనిపించింది.

ఇది కాక గిరిజన కళల గురించి చెబుతూ చెంచు, కోయ, లంబాడి కళల గురించి చాలా విషయాలు తెలిపారు. ఇక్కడ చిరుతల రామాయణం అని ఒక కళ గురించి వారు చెప్పిన విషయాలు నాకు చాలా కొత్తగా అనిపించాయి. కరీంనగర్ జిల్లాలోని అతి ప్రాచీన కళా రూపం అట ఇది. వీరి రామాయణ ఉత్సవాలకి పల్లెల్లో ఊరంతా కదిలి వచ్చేదట.

కనికట్టు చేసే కాటి పాపల వాళ్ళ ఇంద్రజాల విద్యల గురించి కొన్ని విషయాలు తెలిపారు. నేనైతే ఇంక ఈ భారతీయ సంస్కృతికి సలామ్ పెట్టేద్దాం అని ఆగిపోయాను ఇది చదివినప్పుడు. ఇదేమి diversity బాబోయి! కాటి కాపరుల కళలు కూడా ఉండేవా అని!

ఇక మరికొన్ని జానపద కళల గురించి చెప్పాక, ‘కాటమరాజు’ కొమ్ము కథల దెగ్గర మళ్ళీ కాసేపు ఆగాను (అత్తారింటికి దారేది సినిమా ఒకటి వచ్చింది కదా మరి!). ఈ కథలను కొమ్ముల వారు పాడేవారట, వీరు మదిగలలో ఒక తెగ అట. ఇటువంటి పాటలను గొల్లలలో పూజ గొల్లలు కూడా పాడేటి వారట. కొమ్ముల వారు ఏ యాదవుని ఇంటి ముందు ఈ కథ చెబుతారో వారిని ఆ యాదవుడు సన్మానించి తీరాలట. లేదంటే ఇంటి ముందు గుడారాన్ని వేస్తారట.

వీర శైవపు వీర ముష్టుల కళల గురించి చెబుతూ వీరు గానం చేసే పాటలన్నీ కన్యకా ఇతివృత్తానికి సంబంధించినవనీ వీరు ప్రధానంగా వైశ్యులని మాత్రమే యాచించే వారనీ దాని తాలూకా ఒక ఇతిహసాన్ని గురించి కూడా చెప్పారు. నాకెంతో ఆశ్చర్యం వేసింది. ఇన్ని కనెక్షన్స్ ఏంటో అని. వీరు కర్ర సాములో కత్తి సాములో అసాధ్యులట.

ఒగ్గు కథలు, కోలాటాల గురించి చదివాక, మళ్ళీ ఉరుముల నృత్యం దగ్గర ఆగాను. అసలు అదేంటో కూడా వినలేదు నేను ఎపుడు. వీరు (అంటే ఉరుములోల్లు) అనంతపురం జిల్లా వారట. మాల తెగలో ఎక్కువగా ఉన్నారట. ఉరుము అనే అతి ప్రాచీన చర్మ వాయిద్యం వాడతారట. వీరి ఆరాధ్య దైవం శ్రీశైల మల్లన్న అట. ఆ వాయిద్యాన్ని వాయించినపుడు ఉరుములు ఉరిమిన శబ్దం వస్తుంది అట. ఈ బృందాలు వేరే ఏ జిల్లాలోను లేవట మన రాష్ట్రంలో.

తూర్పు గోదావరి జిల్లాలోని కోలా సంబరం గురించి రాసిన విషయాలు కూడా నాకెంతో నచ్చాయి. తిరుపతి తీర్థ యాత్రలకు వెళ్లి వచ్చిన వారు సంతోషంగా దీపారాధన జరుపుకుంటూ ఈ కథను ఏర్పాటు చేస్తారట. ఇది మానటి గొల్లలు అనే కులం లో జన్మించిన గొల్ల అచ్చమ్మ అనే స్త్రీ చే ప్రారంభించ బడిన కళ అట. ఇది కూడా ఒక రకం entrepreneurship కదా. ఏమిటో ఇటువంటి వాటి గురించి మా తరానికి చెప్పే వారే కరువయ్యారు. అచ్చమ్మ గారు తిరుపతికి వెళ్ళేటప్పుడు ఈ కథను అల్లుకొని స్వంతంగా పాడుకుంటూ వెళ్ళేది అట. తర్వాతర్వాత తన అవసాన దశలో కొంత మంది పురుషుల చేతిలో పెట్టింది అట ఈ కళా వారసత్వాన్ని. ఈ ప్రదర్శనలో అందరు మగవారే పాల్గొంటారట. విచిత్రం! కనిపెట్టింది ఒక మహిళ కాని అటు తర్వాత కేవలం పురుషులు కలిసి చేసే కళగా అది రూపాంతరం చెందింది.

ఇక మనం వీడి వాలకం చూడు వాడి వాలకం చూడు అని అనటం వెనుక “వాలకం” అని ఒక ప్రాచీన ఆశు విద్య (extempore art form) ఉంది అని తెల్సుకున్నపుడు నేను చాలా ఆశ్చర్య పోయాను. అటు తర్వాత విశ్వబ్రాహ్మణులను ఆశ్రయిస్తూ వారిపై ఆధార పడిన రుంజ వారు చేసెడి రుంజ వాయిద్య కళా రూపం గురించి కూడా ఎన్నో విషయాలు తెల్సుకున్నాను. వీరు ఏ గ్రామానికి పోయినా విశ్వబ్రాహ్మణులనే యాచిస్తారట. వారికి సంబంధించిన పంచ బ్రహ్మలను గురించీ వాటి విధుల గురించీ కళా మాధ్యమం ద్వారా వివరించే వారట (పంచ బ్రాహ్మల విధులు అంటే: ఇనుప పనీ, కర్ర పనీ, ఇత్తడి పనీ, బంగారం పనీ, రాతి/శిల్పి పనీ అనమాట) .ఇవి కాక వీరి కథలలో పార్వతి కళ్యాణము, దక్ష యజ్ఞము, విశ్వ కర్మ వంటి ఎన్నో విషయాల గురించి కథలుగా చెప్పేవారట.

ఇంకొన్ని కళల గురించి చెప్పాక చిత్తూరు జిల్లాలో ధర్మరాజు గుళ్ళ గురించీ అక్కడి వీథి నాటక బృందాల గురించీ చెప్పారు. ఇదంతా చదివాక ఎప్పుడన్నా చిత్తూరు వెళ్ళాలి అని అనిపించింది. ఇప్పుడు ఎలా ఉందో ఏమో మరి పరిస్థితి. హరిజనులు, యానాదులు, జంగాలు, బలిజలు, గొల్లలు, రెడ్లు మొదలైన అనేక కులాల వారు రోజుల తరబడి మహాభారత వీథి నాటకాల ప్రదర్శనలు ప్రదర్శిస్తారట అక్కడ. క్రిస్టియన్లు, ముస్లింలు కూడా ఈ మహాభారత నాటకాలలో పాత్రలు వేసే వారట! కొన్ని వీథి భాగవత దళాలకు వారు గురువులుగా శిక్షణ కూడా ఇస్తారట.

మరికొన్ని కళల గురించి చదివాకా చెక్క భజనల ప్రస్తావన వచ్చే సరికి ఆగిపోయాను నేను. ఇది ఎంతో క్రమశిక్షణతో నేర్చుకొని చేయవలసిన కళ అని చాల శ్రమతో కూడుకున్న కళారూపం అని తెలిపారు. ఇది కేవల ఉత్సాహంతో చేసే భజన కాదనీ భక్తి తన్మయత్వంతో భగవంతుణ్ణి వేడుకుంటారనీ ఈ కళ గురించి ఎన్నో విషయాలు తెలిపారు.

కొమ్మ దాసరుల గురించీ, పిచ్చుకుంటల వారి గురించీ, జాలరి నృత్యాలు, సిద్ధి నృత్యాలు, కేవలం పద్మశాలిలను మాత్రమే యాచించే సాధనా శురుల గురించి, కేవలం మల మదిగలనే యాచించే చిన్న మాదిగల గురించీ ఇంకా ఎన్నో మరెన్నో కళల గురించీ చాలా చక్కని విషయాలు చెప్పారు. ఇది కాక ముస్లిం జానపద కళా ప్రదర్శనలు, క్రైస్తవుల జానపద కళా ప్రదర్శనాల గురించి కూడా కొన్ని చక్కని విషయాలు చెప్పారు.

చివరగా జిల్లాల వారిగా కళా రూపాల లిస్టు ఒకటి ఇచ్చారు. ఔరా అనుకున్నాను అది చూసాక.

ఇదనమాట తెలుగు జానపద కళల ప్రశస్తి! అని అనిపించింది అంతా చదివాక.

ఇంచు మించు ప్రతి జానపద కళా పరిచయం .. “ఇది విశిష్టమైన కళ, కానీ అంతరించిపోతోంది, దీనిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది” అని ముగుస్తుంది. ఆ లైను చదివిన ప్రతి సారీ బాధ పడ్డాను. ఏం చేస్తాం! మన ఖర్మ! అన్ని స్మృతి చిహ్నాలు పోయి పూర్తిగా విజాతీయం అయిపోతామో ఏమో ఒకటి రెండు తరాలలో. “మనం చరిత్రలో ఏ అధ్యాయంలో ప్రవెశించామంటే చావు నెదుర్కోటం కంటే బ్రతుకు నెదుర్కోవటం పెద్ద సమస్య అయింది – అంతకంటే భయంకర సమస్య అంతా బాగుందని అందరమూ కలిసి పాడాలి.” అని అన్నారు శేషేంద్ర శర్మ గారు తమ కవితలలో ఒక చోట. మొదటి పార్టు పక్కన పెడితే, ఈ అంతా బాగుంది అని కలిసి పాడే batch మాత్రం రోజు రోజుకి పెరిగిపోతోంది. వారికీ ఇవేవి పట్టవు. మన ఖర్మ కాలి మన పాలకులు కూడా ఈ batch మెంబెర్స్ మరి. ఏం చేస్తాం! ఖండిస్తాం!

Telugu Vaari Jaanapada Kalaaroopaalu
Mikkilineni Radhakrishnamurthy

You Might Also Like

3 Comments

  1. Lakshmi Prasad

    ఈ పుస్తకం ఒక గని లా అనిపిస్తోంది. మీ పరిచయం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధన్యోస్మి.

  2. Halley

    This link contains videos related to many of these art forms.
    Link: http://www.youtube.com/user/prajanatyam
    Courtesy: Praja Natya Mandali .

  3. కౌటిల్య

    ఎన్ని మహాసంస్థలు మూలమట్టంగా నాశనమైపోయాయో, ఈ ఇంగ్లీషు చదువులు, సినిమాల వల్ల..హ్మ్!

    మా చిన్నప్పుడు, పోలేరమ్మ కొలుపులకి “బైనీడి కథ” అని చెప్పేవాళ్ళు, వాళ్ళని ఎక్కడి నుంచో పిలిపించేవాళ్ళు. వాళ్ళ వాయిద్యాలుకూడా విచిత్రంగా ఉండేవి వాళ్ళు చెప్పే కథాంశాలు, వాళ్ళ ఊహాశక్తి నాకు చాలా అబ్బురంగా ఉండేవి.

    కాటిపాపలు, వాళ్ళ ఇంద్రజాలం కూడా బాగుండేవి. కాని, నేను చూసిన వాళ్ళల్లో అంత విద్యలేదనిపించేది, డబ్బే ప్రధానంగా ఉండేది వాళ్ళకి. మా అమ్మమ్మ చెప్పేది, గింజలు సరిగ్గా పెట్టకపోతే, కప్పలుగా మార్చేస్తారు అని. అప్పట్లో ఆ ఇంద్రజాల విద్య ఎంతో బాగుండేది కాబోలు. ఎన్ని మ్యాజిక్ షో లకి వెళితే వస్తుంది ఆ అబ్బురం!

    నేను దగ్గరగా చూసిన మరో జానపద కళ, “పల్నాటి వీర చరిత్ర”…. ఇప్పుడు పూర్తి కథ చెప్పేవాళ్ళు తగ్గిపోయారు… వీరవిద్యావంతులు, మంచి మీడియా….

    ఇంకా గంగిరెడ్లని ఆడించేవాళ్ళు, పొట్టేళ్ళని ఆడించేవాళ్ళు, పాముల ఆటగాళ్ళు…. ఎంత ఒడుపు ఉండేదో, ఎంత సాహసంగా ఉండేదో! ఒక ప్రాణమున్న జంతువుని మాలిమి చేసుకుని, దానిని మన భావాలకి అనుగుణంగా నడుచుకునేట్టు చెయ్యటం ఎంత గొప్పవిద్యో కదా! ఈ చదువులన్నీ విద్యలయ్యీ, ఆ మహాసంస్థలు విద్యలు కాకపోయాయా?
    ఈ రోజుల్లో చదువులు లౌకికానికి పనికొస్తాయేమో! వినోదానికి ఎంత వరకూ? ఆనందానికి ఎంతవరకూ? మనశ్శాంతికి ఎంతవరకూ? తృప్తికి ఎంతవరకూ?

Leave a Reply