World Tales – collected by Idries Shah
వ్యాసకర్త: రానారె
****
అరవై ఐదు కథలు.
ప్రతి కథకూ ముందు చిన్న ఉపోద్ఘాతం.
ప్రపంచపు వివిధ ప్రాంతాల్లోతరతరాలుగా వినవస్తున్నవి.
6 – భారతదేశం నుండి, 5 – ఇంగ్లండు, 3 – స్పెయిన్, 3 – గ్రీకు, 3 – జర్మనీ. చైనా, నార్వే, సెర్బియా, డెన్మార్క్, టర్కిస్తాన్, టిబెట్, పర్షియా, మడగాస్కర్, ఉజ్బెకిస్తాన్, మొరాకో, ఐస్‌లాండ్, మధ్యప్రాచ్యం, సిసిలీ, అల్బేనియా తదితర ప్రాంతాల నుండి.
ప్రపంచంలోని ఎక్కడెక్కడి ప్రాంతాల జానపదులు చెప్పుకొంటూ వుండిన కథల సంకలనం కాదిది. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రాంతాల జానపదులూ ఏదో ఒక కాలంలో చెప్పుకొంటూవుండిన కథల సంకలనం. కాకతాళీయమే అయినా సార్వకాలీనములూ సర్వస్థములూ అయిన కాకమ్మ చిలకమ్మ కథల అసాధారణ అవితర్కితసంభవం. కాకమ్మ చిలకమ్మ కథలే మాకొద్దు – అని బిడాయించుకొనిన వాళ్లకు కూడా కొంత ఆసక్తిని కలిగించే పుస్తకం World Tales. సేకరణ ఇద్రీశ్ షా.
ఇంగ్లీషులో స్టోరి, టేల్ అని రెండు పదాలున్నాయి. చదువుకోటానికి వీలుగా ఉండేది స్టోరి, చెప్పుకోటానికి వీలుగా ఉండేది టేల్ అనుకొందాం ప్రస్తుతానికి. కథలు రాత రూపంలో లభ్యంకావడం, వాటిని చదువుకోవడం అనేది మానవ నాగరికతలో ఇటీవల వచ్చినది మాత్రమేనని అందరూ అంగీకరించేమాట. “ఒక రచయిత – గొప్ప మేథావి కాడు, గొప్ప ఆలోచనాపరుడు కాడు, గొప్ప తాత్వికుడూ కాడు, – అతడొక కథకుడు.” అంటాడు అమెరికన్ రచయిత ఎర్స్‌కైన్ కాల్‌డ్వెల్. కథను రమ్యంగా చెప్పగలగడమనేది గొప్ప కళ. కథనకౌశలం కలిగిన కళాకారులు ఇప్పుడు అరుదు. బహుశా ఒక అర శతాబ్దానికి ముందు ప్రతి గ్రామంలోనూ వుండేవాళ్లేమో.
ఈ పుస్తకపు ఉపోద్ఘాతంలో ఇద్రీశ్ షా అంటాడు, “నేను సేకరించి మీ ముందుంచిన ఈ కథల సంకలనంలో కనీసం ఒక్కటి, కొన్ని వేల యేండ్లకు పూర్యం ప్రాచీన ఈజిప్టులోనిది. దాన్నిక్కడ సమర్పిస్తున్నది దాని వయసుతో పాఠకుని మెప్పించాలని కాదు. ఆ కథ వినోదాత్మకం కనుక. అంతేకాదు, ఫారోలు కొన్ని శతాబ్దాల క్రితమే అంతరించిపోయినా, ఈ కథ మాత్రం జగమంతా జనుల నాల్కల మీద – దీని పుట్టుపూర్వోత్తరాలేవీ తెలియకపోయినా – నిలచి ఆడుతూనే వుంది గనుక. జాతులూ, భాషలూ, విశ్వాసాలూ ఎన్నడో అంతరించిపోయినా ఈ సాంస్కృతిక రూపం నిత్యమై నిలిచివుంటుంది. ప్రస్తుతం అందుబాటులో వున్న విజ్ఞానానికి అందని మన్నిక ఇలాంటి కథలది. ఒకానొక కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ కథ ఆ తరువాత రూపుమాసి, మరో సంస్తృతిలో, బహుశా శతాబ్దాల తరువాత మళ్లీ శ్రోతలను ఆకర్షించి, మైమరపించి, పులకింపజేసి, కట్టిపడేయడానికి పునర్జన్మనెత్తుతుంది. ఇలాంటివే పంచతంత్రకథలు, రెండువేల యేళ్లనాటి జాతకకథలూ, ఆ తరువాత వచ్చి ఐరోపా ఆసియాదేశాల సంప్రదాయసాహిత్యానికి ఆధారపీఠమనదగిన స్టారాపోలా, బొకాసియో, ఛాసర్, షేక్‌స్పియర్ వగయిరాల సంకలనాలు.”
“జాలరి – అతనిభార్య” అనే కథలో జాలరి వలలో చిక్కిన ఒక చేప మానవభాషలో మాట్లాడుతుంది. అత్యాశాపరురాలైన జాలరి భార్య గొంతెమ్మ కోరికలను మాటమాత్రంచేత తీర్చగలిగిన శక్తి దాని సొంతం. ఈ కథకు ముందుమాటగా, మాక్సీమ్ గోర్కీ మాటలను ప్రస్తావిస్తూ ఇద్రీశ్‌షా అంటాడు, “గ్రహణ సామర్థ్యం వృధ్ధిచెందని ఆదిమమానవ మస్తిష్కాలు ఉత్పన్నం చేసినవే ఇలాంటి కథలు అనే అభిప్రాయంతో వంచింపబడక, ‘నిర్భీతితో సకలస్వేచ్ఛాయుతమైన శక్తి రాజ్యమేలే ఒక కొత్తలోకానికి నా కోసం తలుపులు తెఱచి, మెరుగైన జీవనం కోసం కలలుగనడానికి ప్రేరణనిచ్చినవి ఈ కథలే’నని మాక్సీమ్ గోర్కీ నిర్ద్వంద్వంగా అంగీకరిచాడు” అని.
పాత్రలనూ, సన్నివేశాన్నీ, సందర్భాన్నీ బట్టి కథల్లోని భాష కూడా మారుతుంది. ఇలా కొన్ని కథలను చెప్పడంలో బిబ్లికల్ పదాల వాడుక ఎక్కువగా జరిగింది. కథ శ్రోతల్లో కలిగించనుద్దేశించిన భావనలెలాంటివి? అసలు ఎంతమంది కథకులు ఈ ప్రశ్న వేసుకుంటారు? folk-tales మనకు చెప్పేది ఏమిటి? విద్యావంతులు వాటిని ముక్కలు ముక్కలుగా చేస్తారు. సిద్ధాంతాలు తలకెత్తుకున్నవాళ్లు కథల గురించి తామేర్పరచుకొన్న ఆదర్శాలకు ఊతాన్నిచ్చే వాటికోసం చూస్తారు. సాహిత్యకారులు తమ రచనలకు వస్తువులుగా ఈ కథలను మలుచుకుంటారు. ఇలా “దివ్యాహారం (The food of paradise)” కథకు ముందు ఒక చర్చకు తెరతీస్తాడు ఇద్రీశ్‌షా.
ఇంతకూ ఈ World Tales కథాకమామీషు ఏమిటి, ఇవన్నీ దేని గుఱించి? అని ప్రశించుకొంటే, విధి లేదా తలరాత గుఱించి అనేది సమాధానంగా వస్తుంది. సుదీర్ఘమైన జీవితాలను కవర్ చేసేవి కొన్ని, కేవలం జీవితపు ఒక శకలాన్ని మాత్రమే కవర్ చేసేవి కొన్ని. నిజజీవిత మానవులను ఉద్దేశించినవి కొన్ని, కల్పిత పాత్రలనుద్దేశించినవి కొన్ని. Fairytale అనేమాట లాటిన్ భాషలోని fata (తలరాత) నుంచి పుట్టిందనీ, సమ్మోహనపరచడమనేది ఫ్రెంచిలో దానికి సమానార్థకమైనదనీ, కనుక ఈ రెండు లక్షణాలూ కలిగిన కథలే fairy tales అనీ, కనుక వీటిని చిన్నపిల్లల కథలుగా అనుకోనవసరం లేదనీ అంటాడు ఇంకో కథ చెప్పడానికి ముందు.
టేల్స్ ప్రాముఖ్యం ఏమిటి? ఇవి చిన్న పిల్లలకోసమేనా? టేల్స్ చిన్నపిల్లలకోసమే కాదనడానికి ఎన్నో దృష్టాంతాలు చూపవచ్చు. రామాయణ భాగవత భారతాల వంటి ఇతిహాసాల్లో కూడా ఎన్నో టేల్స్ కనిపిస్తాయి. అవేవీ చిన్నపిల్లలకు చెప్పినవి కావు. ఏదో ఒక సందర్భంలో ఒక మనిషి అంతరంగంలోని చిక్కులను విప్పేందుకు సహాయపడేలా మరో మనిషి చెప్పినవే ఎక్కువ. ఏ కథను ఎక్కడి నుంచి తీసుకున్నా – రెండు వాక్యాల్లో ఆ కథను చెబితే అది మనం విన్నదే – అనిపించే కథలివి. ఈ పుస్తకం ద్వారా Aesop కథలూ, జర్మనీవాళ్లైన Grimm సోదరుల గురించీ తెలుసుకున్నాను. పొందుపరచిన కథలూ వున్నట్టు తెలుసుకొన్నాను.
మొత్తానికి “World Tales” అందరూ తప్పక చదవాల్సిన పుస్తకం.
http://en.wikipedia.org/wiki/World_Tales
Leave a Reply