A Lover’s discourse – Roland Barthes
నేను కె.జిలో ఉండగా అనుకుంటా మణిరత్నం గీతాంజలి చూసింది. “ఐ-లవ్యూ” అన్న వాక్యంతో తొలి పరిచయం. అప్పుడు మొదలుకొని జీవితాల్ని ప్రతిబింబించే సినిమాల్లో, సినిమాలా అనేంతగా అబ్బురపరిచే జీవితాల్లో, కథల్లో, నవల్లో, కవిత్వాల్లో, కావ్యాల్లో, కలల్లో, కల్పనల్లో, కన్నీళ్ళల్లో, నవ్వుల్లో, మాటల్లో, మౌనాల్లో, ప్రయాసల్లో, ప్రయాణాల్లో, త్యాగాల్లో, తగాదాల్లో, స్నేహితుల వల్ల, ఏవగింపు కలిగించే ప్రవర్తనల వల్ల, ప్రయత్నపూర్వకంగానో, అప్రయత్నంగానో ప్రేమను గురించి వినడం, చూడ్డం, మాట్లాడ్డం, పోట్లాడుకోవడం జరుగుతూనే ఉన్నాయి. ప్రేమ ప్రస్తావన రాగానే ముసిముసిగా నవ్వుకునే అమాయకత్వం నుండి, “నేను ప్రేమను ప్రేమిస్తున్నాను” అనుకొన్న భ్రమ నుండి, “నాకూ ప్రేమకీ ఈ జన్మకి పొంతన కుదరద”నిపిస్తున్న తరుణంలో చదివిన పుస్తకం: A Lover’s Discourse!
ఈ పుస్తకాన్ని కొనబోతున్నాను అని ఒక స్నేహితుడితో అంటే, “ఎందుకూ?! కొన్నుంటాయ్ అమ్మాయ్, వాటిని అనుభవించాలి, అనుభూతి చెందాలి. అంతే గానీ ఇలా పుస్తకాల్లో చదవకూడదు. చదివినా అర్థం కావు.” అని తేల్చేశాడు. “ఒప్పుకుంటా”నంటూనే పుస్తకం కొన్నాను. చదివాను, చదివేశాననుకొని దండోరా వేశానుగానీ ఇంకా చదువుతూనే ఉన్నాను. రాయాలి అనుకుంటూ కొన్ని మెదడులోనే డ్రాఫ్ట్ చేసేసుకొని అక్కడే వదిలేశాను. అది రాయలేకపోవడమో, రాయకపోవడమో నాకే అర్థం కాలేదు. ఇంతటి పుస్తకం గురించి నాబోటి వాళ్ళేం రాయగలరూ అనిపించింది. నా బోటి వాళ్ళల్లో కూడా ఆలోచనలు రేకెత్తించగలదూ అని తెలియజెప్పడానికైనా నా ప్రయత్నం పనికి రావచ్చూ!
అప్సరస లాంటి అమ్మాయి, మన్మధుడి లాంటి అబ్బాయి కళ్ళూ, కళ్ళూ కలిసి, మది వీణలు మ్రోగి, నవనాడుల్లో కొత్త తేజం పొంగి, ఉక్కిరిబిక్కిరై ఊహల్లో తేలుతూ, వాస్తవాన్ని గుర్తించక, గుర్తించలేక మధనపడి, మతి చెడి… అంటూ కథలా ఉండదు ఈ పుస్తకం. అసలు అబ్బాయీ, అమ్మాయీ అన్న ప్రస్తావనే రాదు. అలా అని “ప్రేమ” అనే అంశంపై అనర్గళంగా దంచిపారేసిన ఉపన్యాసాలూ కావు. ఒకరు మరొకరిపై గుప్పించిన ప్రేమలేఖల పైత్యం అంత కన్నా కాదు. కవిత్వం ఉంటుందిగానీ కవితలు కావు. కథనం ఉంటుందిగానీ కథ కాదు. ప్రేమలో మునిగి(పోయి)న ఒక జీవి, తాను తప్ప అన్యులు ప్రవేశించలేని “ఏకాంతం”లో అనుకునే / అనుభవించేవన్నీ మాటల్లో ఉంటాయి ఈ పుస్తకంలో. ఇక్కడున్న ఇంకో విషయం ఏంటంటే ఇది ఏ ఒక్కరి అనుభవాల్లో లేక ఊహాత్మకమో కావు. ఇందులో వినిపించేది ఏ ఒక్కరి గొంతో కాదు. ఎన్నో గొంతులు. వారిలో Goethe, Plato, Nietzsche కూడా ఉన్నారు.
అది ఎలా ఉంటుందయ్యా అంటే..
మీరు మీ మనిషి కోసం ఎదురుచూస్తున్నారు. అక్కడే నేనుంటే మీరు నాకు ఎలా కనిపిస్తారంటే, చెతిలో మాగ్‍జైన్ పట్టుకొని, కుర్చీలో కూర్చొని చదువుకుంటూ అప్పుడప్పుడూ తలపైకెత్తి ఒక వైపుకు చూస్తూ ఉంటారు. ఇలాంటివి మన సినిమాల్లో, నిజ జీవితంలో చాలా చూసే ఉంటాం. కానీ అప్పుడు మీలో కలిగే ప్రతీ ఆలోచనా (“రమ్మన్న సమయానికి రావాలని తెలీదు?”, “ఎందుకు రాలేదో?”, “ఏమన్నా జరుగుంటుందా?”, “నా మీద ప్రేమ లేదు”, “నేనంటే లక్ష్య లేదు”, “వెళ్ళిపోనా?, “నే వెళ్ళాక వస్తే!”, “ఛ.. ఇహ నా వల్ల కాదు”, “పర్లేదు ఉంటా”, ), మీ శరీరంలోని ప్రతీ కదలికనూ ( చేతిలో ఉన్న దాన్ని చదవాలనీ చదవలేకపోవటం, కళ్ళు పదే పదే ఒకే దారి వైపు చూడ్డం, దృష్టి మరల్చడానికి విశ్వప్రయత్నం చేయటం, అసహనంగా కదలటం, చిరాకూ, ఆందోళన వంటివి ముఖంపై తెలీటం) మీకే మళ్ళీ ఒకరు చెప్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే మీ లోపల ఒక వెబ్ కామ్ పెట్టి మీలో జరిగేవన్నీ చూపిస్తే ఎలా ఉంటుందో అలా! (జాలంలో ఇక్కడ)
ప్రేమలో పడ్డాక లేవాలి కదా! అలాంటప్పుడు.. “either you have some hope, and then you’ll act; or else you have none, in which case you’ll renounce” అని healthy subject అనుకుంటుంది.
అదే పీకలోతు ప్రేమలో మునిగిన వాడు మాత్రం “I’m trying to slip between the two members of the alternative: i.e., I have no hope, but all the same… Or else: I stubbornly choose not to choose; I choose drifting: I continue” అన్నవి చదివినప్పుడు చెంప చెల్లుమనేలా ఉంటుంది.
“ఈ పిల్ల నాకు అర్థం కావటం లేదురా బాబూ” అని జుట్టు పీక్కునే ప్రతీసారి, “ఈ పిల్ల నా గురించి ఏమనుకుంటుందో అర్థం కావటం లేదురా బాబూ” అని మన అంతరార్థమని మనకే చెప్పినప్పుడు ఉలిక్కిపడేలా చేస్తుంది.
“What does “thinking of you” mean? It means: forgetting “you” (without forgetting, life itself is not possible) and frequently waking out of that forgetfulness.” – మరుపే తెలియని మన హృదయానికి చిన్ని షాక్!
ఇలా చాలా వాటి గురించే ఉంటాయి. (పూర్తి చిట్టా ఇక్కడ!) ప్రేమలో ఉన్న మనల్ని మనకే కళ్ళకి కట్టినట్టు చూపిస్తుంది. “అంతే, అలానే జరుగుతుంది” అని మనం ఒప్పుకునే చేస్తుంది. మన వ్యధ మరొకరి నోట వింటున్నప్పుడు కలిగే సాంత్వన. మన బాధను గుర్తు చేస్తున్నందుకు అసహనం. చదువుతున్న కొద్దీ ఆపేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఆపడం కష్టం. “మనలా ఎందరో” అని కూడా అనిపిస్తుంది.
ప్రేమకి థియరీ అంటే చాలా మందికి చిర్రెత్తుకు రావచ్చు. ప్రేమలో చేసే ప్రతి చర్యకీ పోస్ట్-మార్టమ్ రిపోర్టును ఏం చేసుకోవాలని నిలదీయవచ్చు. ప్రేమలో పడి, చావబోయి కన్ను లొట్టపోయిందనే కేసులు ఈ పుస్తకాన్ని చదివితే తమని తామో, లేక “ప్రేమ”నో ఛీత్కరించుకోవచ్చు. (ఈ పుస్తకం గురించి నేను చదివిన ఒక పరిచయ వాక్యం: a must read at the end of an intimate relation! బహుశా, ఒక outlet గా పనికొస్తుందేమో మరి!) “దేవుడు లేడు” అంటే కొంతమంది ఎంత కోపమోస్తుందో, “ప్రేమ”కు వ్యతిరేకంగా ఒక్క మాట అన్నా తోక తొక్కిన తాచుపాములా లేచే వాళ్ళు అసలే ఈ పుస్తకాన్ని చదవకుండా ఉండడం మేలు. ప్రేమలో ఉన్నప్పుడు మనసు / మెదడు చేసే వీరంగం చూడ్డం అంత తేలిక కాదు మరి!
రచనల్లో ఎంచుకున్న అంశం, ఎన్నుకున్న శైలి అనేవి రెండయితే, ఈ పుస్తకం నన్ను రెండు విధాలా ఆకట్టుకుంది. అసలు ప్రేమే incomprehensible అనుకుంటే, దాన్ని ఇంత వినూత్నంగా ప్రెజెంట్ చేయడం అనేదే సాహసం. ఇది అంత సరళమైన రచన కాదు, చదవడానికి కూడా కాస్త కష్టమే! ఇందులో ప్రస్తావించిన కొందరి పేర్లు కూడా నాకు తెలీవు. అలాంటి వారివి చదువుతున్నప్పుడు కష్టమయ్యింది. భాష కూడా కష్టమే! పైగా ఇందులోని భాష ఒక్కలానే ఉండదు. పేరా పేరాకి మారవచ్చు. Freud, Rilke, Goethe వెంట వెంటనే చదవటం అంత తేలికైన విషయం కాదు. మన కళ్ళముందు ఒక చిత్రపటం ఉంచి, వెనుక నుండి కొన్ని గొంతులు వెంటవెంటనే మాట్లాడే భావం కలిగిస్తుంది.
“To try to write love is to confront the muck of language: that region of hysteria where language is both too much and too little, excessive and impoverished.” – Roland Barthes.
అలాంటి కత్తి మీద సాము లాంటి పనిని ఈయన చాలా బాగా చేశారనిపించింది.
పుస్తకం చదివేసిన మరుసటి రోజు, షెల్ఫారీలో “Read it” అని మార్క్ చేస్తుండగా, “Did I?” అన్న ప్రశ్న మదిలో మెదిలింది. ఒకసారి చదివేసి పక్కకు పెట్టేశాననే అనుకున్నాను. అడపాదడపా, “నీకు చెప్పేనే నేనొక పుస్తకం చదివాననీ…” అంటూ పుస్తక విశేషాలను చెప్తూ ఉన్నాను నాతో తరచూ మాట్లాడే వాళ్ళతో. నెల రోజులుగా నేనెక్కడున్నా కొన్ని నిముషాల్లో తెరచి చదువుకునేంత అందుబాటులో ఉంటోంది. “రెండు పూటలా నాలుగు చంచాలు” టైపులో ఈ పుస్తకాన్ని చదవకపోతే నాకేదో అవుతోంది. ఇప్పటికొచ్చి ఈ రచయితను గురించి గానీ, ఆయన చేసిన పరిశోధనల గురించి గానీ శ్రద్ధగా చదవలేదు. ఇంకేవైనా పట్టించుకోడానికి ఈ పుస్తకం నన్ను వదిలితే కదా! చదివే కొద్దీ చదవాలనిపిస్తోంది. చదవకుండా ఉండలేననిపిస్తోంది. This is not a book to read or re-read. Seems like it is something to study, or better put, something to digest. Or is it just that I’ve ended up loving this book? Oh, no!
*********************************************************************
Book Details:
A Lover’s Discourse – Fragments
Author: Roland Barthes
Translator: Richard Howard
Cost: Rs. 590
Paperback
ravi avula
చాలా బాగా రాశారు థాంక్స్
పుస్తకం » Blog Archive » నన్ను చదివే పుస్తకం..
[…] కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! పోనీ బార్తెస్? ఫ్రెష్ గా జోసెఫ్ హెల్లర్? పాబ్లో? […]
Purnima
@శ్రీను: Well, it wasn’t referred as “unhealthy” neither in the book nor in my post. The author used the term, “amorous” subject, which I referred as “పీకలోతు ప్రేమలో మునిగిన”.
Now most of your comment is your assumption. I believe, I gave the clarification that was needed and might help your understanding.
శ్రీను
పరిచయం బాగుంది.
ప్రేమలో పడ్డాక, లేవాలి కదా! అలాంటప్పుడు.. “either you have some hope, and then you’ll act; or else you have none, in which case you’ll renounce” అని healthy subject అనుకుంటుంది.
“Healthy subject”? హ్మ్, అంటే మీరు చెప్పిన రెండో ఉదాహరణలో “పీకలోతు ప్రేమలో మునిగిన” బాపతు వాడు unhealthy subject అన్నమాట. వాడి ప్రేమ, ప్రేమ కాదూ రోగం అన్నమాట. కానీ ఎవడి కన్నీళ్ళైనా కన్నీళ్ళే కదండీ. అవి లెక్కలోకి రాకుండా పోవు కదా. ఏమో ఈ పుస్తకం ప్రకారం లెక్కలోకి రావేమో. పుస్తకం ప్రకారం కాకపోయినా, ఈ పేద్ద cosmic farce లో అల్టిమేట్‌గా ఎవడి కన్నీళ్ళు ఎవడికీ లెక్కలోకి రావేమో. అయినా ఇక్కడ వాడిన ఈ క్లినికల్ టెర్మ్ చూసేసరికి ఇది చెప్పాలనిపించింది.
kesav
అద్భుతమైన పుస్తక పరిచయం. అహ! అది ఓవర్ స్టేట్‌మెంట్ గానీ, ప్రభావవంతమైన పుస్తక పరిచయం. సిస్టమ్ ముందు నుంచి గెంతి లేచి వెంటనే పుస్తకం కోసం వెతుకులాట మొదలుపెట్టేయాలనిపించేంత మంచి పరిచయం. ఇలాంటివి తక్కువ చదివాను: పత్రికల్లోనైనా, బ్లాగుల్లోనైనా. పుస్తకం సైట్‌కి కావాల్సినవి ఇలాంటి పరిచయాలే. మీరు మరింత తరచూ రాస్తుండాలి. చదువుతున్నవి తక్కువైతే, ఖాళీ వున్నప్పుడు, ఇదివరకే చదివిన వాటి గురించైనా రాయండి.
kalpana
పూర్ణిమా,
పుస్తకం లో ఏముందో తెలియదు గాని మీ అందమైన భాషానుభూతుల్ని బట్టి వూహిస్తున్నాను. మీరిచ్చిన లింక్స్ కన్నా అంత అందమైన పుస్తకాన్ని ఒక వెన్నెల రాత్రో, ఒక వర్షాకాలపు సాయంత్రంలోనో, వేడి వేడి కాఫీ కప్పు తో, చేత్తో ఒక రుమాలు కూడ పెట్టుకొని చదవాలని తెల్సింది.(రుమాలు ఎందుకంటారా? ప్రేమ ఏదిపిస్తుంది కూడా ) ప్రేమించటం , మోసపోవటం, తిరస్కరిపబడటము ఇవన్నీ మీ స్నేహితుడన్నట్టు ఎవరికి వారు అనుభవించి తెలుసుకోవాల్సిందే, అయినా ఇలాంటి పుస్తకాల ద్వారా కూడా మరో సారి అనుభవించి ఘనీభవించవచ్చు.
నా బుక్ లిస్ట్ కి మంచి పుస్తకం దొరికింది. థాంక్స్
కల్పన