నన్ను చదివే పుస్తకం..

హమ్మ్..

“మాటలకు నానార్థాలు కాని, మనసుకా?!” అంటారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు, కృష్ణాతీరంలో! మనసు అంతరార్థం తెల్సుకోవటం కూడా అంత తేలికైన పని కాదు. ఈ ఫోకస్ అనౌన్స్ చేద్దాం అనుకున్నప్పటి నుండి, మనసుకి నచ్చినవేంటా అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఒక రస్కిన్ బాండ్ లేదా టాగోర్, లేదా వివేకానంద. వీళ్ళెవ్వరూ కాకపోతే కొత్త మోజైన మిలన్ కుందేరా? కర్ట్ వాన్‍గట్? ఓహ్ నో.. కాల్వినో! పోనీ బార్తెస్? ఫ్రెష్ గా జోసెఫ్ హెల్లర్? పాబ్లో? పోనీ.. తెలుగులోనే వెతుక్కుందాం! శ్రీపాద రామాయణం? తిలక్ అమృతం కురిసిన రాత్రి? శ్రీశ్రీ కవిత్వం? ముళ్ళపూడి సాహిత్యం? బాపూ బొమ్మలు?

పారేసుకోడానికి వీలుంది కదా అని, పారేసుకున్న కాసేపటికి మనల్ని వెతుక్కుంటూ అదే ఎటూ మన దగ్గరకే వచ్చేస్తుందన్న నమ్మకమూ ఉంది కదా అని, కాస్త నచ్చగానే మనసు పారేసుకోవడం పరిపాటి. అది మాత్రం, ఇన్ని ప్రేమలను ఎలా భరిస్తుందో ఏంటో పాపం! ఇందరిలో నా ప్రమేయం లేకుండా, మనసు దేనిపై మనసు పారేసుకుంది?  మనసు మనసులో ఏముందో తెల్సుకోవటం ఒక ఎత్తు. తెల్సుకున్నాక, దాన్ని అంగీకరించటం మరో ఎత్తు. “రీడ్ ఇట్ అగైన్, సాం!” అని నా మనసు నాతో పదే పదే చెప్పే పుస్తకం గురించి రాయడానికి నాకిప్పుడు మనస్కరించటం లేదు.

కారణం?

ఇన్నేసి అరల్లో అంతలేసి వస్తాదులను పెట్టుకొని, సాహిత్యపు సముద్రాన ఆణిముత్యాలకోసం వేటాడుతున్న వేళ, ఒక మామూలు కంప్యూటర్ ప్రొఫెసర్ జీవితాన్ని నర్సరీ రైం గా మార్చి “లాస్ట్ లెక్చర్”గా చెప్తే, దాని గురించి నేను రాయటమేమిటి? కాఫ్కా లెక్క ప్రకారం మనలో గడ్డకట్టుకొని పోయినదేన్నో విరగ్గొట్టగల గొడ్డలి కోసమే పుస్తకాలు చదవటం అనుకుందాం. ఈ పుస్తకం మొదటి సారి చదివాక, రిక్టార్ స్కేలు పై స్వల్పాతి స్వల్పంగా కనుగొన్న రీడింగ్స్ అప్పుడే నమోదుచేసుకున్నాను. అది అక్కడితో అయ్యిపోవాలి. ఇప్పుడేంటి కొత్తగా? మనసుకు కూడా నానార్థాలుంటాయా?

అయినా ఏముంది రాండీ పుస్తకంలో?!

ఆత్రేయ అన్నారట.. మనిషికి తెలీనివి మూడు: పుట్టుక, వివాహం, చావు. వాటి మధ్యనే జీవితం అని. రాండీ జీవితాన్ని పుస్తకం అనుకుందాం. చివరి పేజీలో ఉండాల్సిన పేరా ఏదో మరి కాస్త ముందుకొచ్చేసింది. తాను చనిపోతున్నాన్న విషయం ముందుగా తెల్సిపోయింది. “అబ్బా.. సస్పెన్స్ పాడయ్యిపోయింది!” అని బాధపడాల్సిన తరుణం. ఏది ముందో ఏది వెనుకో తెలీయని వాణ్ణి దుమ్మెత్తి పోయాల్సిన తరుణం. ఇదే జోసెఫ్ హెల్లర్ అయితే, పైకి వెళ్ళాక చెయ్యాల్సిన పని ఎంత బా చెప్పిస్తాడు చూడండి.

“When you talk to the man upstairs I want you to tell Him something for me. Tell Him it ain’t right for people to die when they’re young. I mean it. Tell Him if they got to die at all, they got to die when they’re old. I want you to tell Him that. I don’t think He knows it ain’t right, because He’s supposed to be good and it’s been going on for a long, long time. Okay?”

రాండికి ఇవేం పట్టవు. పైగా, ఇదొక సందడి.. చెయ్యాల్సిన పనులు, అప్పజెప్పాల్సిన పనులూ – ఇవే గొడవలు. చక్ పాలహ్నియుక్ అన్నట్టు: If death meant just leaving the stage long enough to change costume and come back as a new character, would you slow down? Or speed up? రాండిది ఇదే కంగారు. తొందర. ఫ్లైట్ మిస్స్ అయ్యిపోకూడదు, పనులూ అయ్యిపోవాలి! అంత హడావిడిలో ఈ పుస్తకం రాసేసి, నా బోటి వాళ్ళకి పాఠాలుగా పనికొస్తాయని ఆశ!

అయినా ఇప్పుడు రాండి చెప్పే పాఠాలు ఎవడికి కావాలి? అసలు, జీవితంలో జీవితంతో పీక లోతు ప్రేమలో పడినవాడి మాటలు ఎవ్వరన్నా పట్టించుకుంటారట! “నాకు కాన్సర్! నే పోతున్నా!” అని ప్రతీవాళ్ళ దగ్గరా చెప్పుకోవటం కుదరక, నచ్చక, పళ్ళికిలిస్తూ చాలా మంది తమలో నటుల్ని బయటకి తీసుకువస్తారు. కాని, ఏకాంతంలో, ఇంకెవ్వరూ చూడని సమయంలో కూడా “ఈ క్షణం నేను జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను!” అన్నట్టు నవ్వుకుంటూ ఉంటే, జనాలు పిచ్చి అనుకోరూ?! “Live this moment!” అనేవి స్టేటస్ మేసేజులు గానో, వాల్ పోస్టర్ల గానో బాగుంటాయి గాని, మరి తుచ తప్పకుండా బతికేస్తే ఎలా? అందులో, అయినదానికీ, కానిదానికీ జీవితాన్ని ఆడిపోసుకొని ఎప్పుడెప్పుడు చద్దామా అని కాచుక్కూచోవటం ఫ్యాషన్ అయ్యినప్పుడు. (అన్నట్టు, రాండికి ఫ్యాషన్ అంటే పడదు!)  పీప్లీ లైవ్ సినిమాలో డైలాగ్ గుర్తులేదూ? జైసె జిందగీ బెల్ బాటం బన్ గయీ, ఔర్ ఖుద్‍ఖుషీ జీన్స్! (జీవితం బెల్ బాటం అయ్యినట్టూ, ఆత్మహత్యలు జీన్స్ అయ్యినట్టూ జనాలు వ్యవహరిస్తున్నారని ఒక సెటైరులాంటి నిజంలే!) ఇప్పుడా రాండి పాఠాలు కావాల్సింది?

అది జీవితంతో సంగతి అయితే, ఇహ ప్రేమ సంగతుందే! “ప్రేమిస్తావా? చస్తావా? చావమంటావా?” అని ఊపిరాడనివ్వకపోవటం ప్రేమంటే! కనీసం, “నువ్వు లేక నేను లేను”, “నీతోనే సర్వస్వం!”, “చేతులు నీవి, గీతలు నీవి, జాతకం మాత్రం నాది!” లాంటి కవిత్వాలైనా ఉండి తీరాలి ప్రేమంటే! పైగా, ప్రేమలో పడే లోపు, “నేనింకా పడ్డం లేదో.. పడలేదో” అని గుక్కతిప్పుకోకుండా ఏడుస్తూ ఉండాలి. కాని రాండీ?! ముప్ఫై తొమ్మిదేళ్ళు తన మనిషికోసం ఎదురుచూసి, తీరా ఆమె తారసపడ్డాక, “చూడూ, నువ్వు ఒప్పుకుంటే, నీతో ఆనందంగా బతకటానికి దారులు వెతుకుతాను. నువ్వు కాదంటే, నువ్వు లేకుండా ఆనందంగా బతకటానికి దారులు వెతుక్కుంటాను. నాకు ఏదైనా సమ్మతమే!” అని చెప్పాడు. బుగ్గలు నొక్కుకొని, “హవ్వ!” అని అంటుందేమో లోకం! ఏం చేస్తాం, రాండి తీరే అంత! బహుశ, తనలో తాను సంపూర్ణమైన ఏ వ్యక్తైనా ఇదే తీరులో ఉంటాడేమో! అలా ఉండే వాళ్ళని ఏమనాలి? ఫ్రాయిడ్ ఏదో పదం కనిపెట్టే ఉండాలే!

ఇంజినీరింగ్ పూర్తయ్యి, ఉద్యోగంలో చేరే మధ్యలో ఒక సెమినార్ అటెండ్ అయ్యినప్పుడు ఒక ఆట ఆడించారు. ముందుగా మనం రాంగ్ హాండ్ తో ఒక నిముషంలో ఎన్ని అక్షరాలు రాయగలమని మనం అనుకుంటున్నామో, ఆ సంఖ్య అందరికీ చెప్పాలి. ఆ తర్వాత ఒక నిముషంలో ఆంగ్లాక్షరాలు రాయాలి. అందరం చెప్పాం. రాసాం. గమ్మత్తుగా, అందరం అనుకున్న సంఖ్యకన్నా ఎక్కువ రాసాం. అప్పుడు ఆ సెమినార్ ఇచ్చే ఆయన, ఆటలో మతలబును మూడు ముక్కల్లో చెప్పాడు. ౧) మనం మన గురించి అంచనా వేసుకోవడం అంత తేలిక కాదు! ౨) “ఒక్క నిముషం” అనగానే, “ఓస్.. అంతేనా?” అన్న భావం కలిగిస్తుంది. కాని ఒక్క నిముషంలో నిజానికి చాలా పనులు చెయ్యగలం! ౩) ఇప్పుడు దాకా కాలేజీల్లో చదివిన దాన్నంతా మీరు ఉద్యోగాల్లో ఉపయోగిస్తారు. కాని అది ఎలా ఉంటుందంటే, మీకు తెల్సినదంతా మీ రాంగ్ హాండ్ తో రాయాల్సినంత కష్టంగా ఉంటుంది.

“లాస్ట్ లెక్చర్” మొదట చదివి, “ఆహా.. భలే మంచి క్లాసూ” అనుకున్నాను. జీవితం అదే క్లాసు నోట్సుని ఎడం చేత్తో ఇంపోజిషన్ రాయిస్తున్నప్పుడు, మనసు రాండి మీదకు పోతుంది. అలా అరటి పండు వల్చి నోట్లో పెట్టే వాళ్ళు కావాలనిపిస్తుంది. అందుకే పదే, పదే ఆ పుస్తకం చదవాలనిపిస్తుంది. మనుషులూ, పరిస్థితులూ లేవనెత్తే ప్రశ్నలకు రాండి సాయం కావాలనిపిస్తుంది. బుద్ధిగా చేతులు కట్టుకునో, పొగరుగా తల ఎగరేస్తూనో, ఆయణ్ణి ఈ ప్రశ్నలు అడగాలనిపిస్తుంది.

“స్నేహితులూ, పుస్తకాలూ, ఆహారం – ఇవి ఉండగా, ఆనారోగ్యం బాధించదూ” అనంటే, “బాధించినది రోగం ఎలా అవుతుంద”న్న ఎద్దేవా ఎదురయితే?!
“నీవున్నా సంతోషమే! లేకున్నా సంతోషమే!” అనంటే, “అయితే, అది ప్రేమ కిందకే రాదు!” అన్న మాట వినిపిస్తే?!
మీరన్నట్టు, మనుషుల మధ్య పగలగొట్టలేని గోడలుంటాయి. మీరన్నట్టు, అవి మన ఆప్తులెవరో తెల్సుకోవటం కోసమే ఉంటాయి. కాని, గోడల బద్దలయ్యి, లోపలికి చేరుకున్నాక, బయట కొత్త గోడలు పుట్టుకొస్తే? బయటకి వచ్చే మార్గం లేక, లోపల ఉండలేక.. అప్పుడు మళ్ళీ గోడలు విరగొట్టాల్సి వస్తే?

ఇలా రాసుకుంటూ పోతే, ప్రశ్నలకు అంతు ఉండదు. రాండి చెప్పిన “హెడ్ ఫేక్” సూత్రం, నాకు తారకమంత్రం. లాస్ట్ లెక్చర్ చదివి “ఇలా ఉండాలి నేను!” అని నిర్ణయించుకొని, వ్యవహరించలేదు. “నేనిలా ఉంటాను” అన్నది ఆయన మాటల్లో తెల్సుకున్నాను అంతే! చేపలు పట్టటం నేర్పుకునేటప్పుడు మనం తినే చేపలపైనే దృష్టి పెడతాం. తీరా విద్యను ప్రదర్శించేటప్పుడు, మనల్ని తినే చేపే వలలో పడవచ్చు. నడి సముద్రంలో “హలో.. మాస్టారూ! ఏం కర్తవ్యం?” అని అరచి గోల పెట్టనూకూడదు. పెట్టనూ లేము. సముద్రంపై వేటకు పోయే ధైర్యాన్ని ఇవ్వటమే గురువు పని. ఆ తర్వాత, ఎవడి పాట్లు వాడివి!

లాన్స్ ఆర్మ్ స్టాంగ్ కూడా కాన్సర్ పేషెంటే! “చావును నాపై గెలవనివ్వనూ!” అన్న పంతంతో దానితో పోరాడాడు. ఇప్పటికీ అత్యుత్తమ స్థాయి సైక్లింగ్ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఇది నాణానికి ఒక వైపు. రాండి కూడా చావుతో పోరాడ్డానికే సిద్ధమయ్యాడు. జీవితాన్ని, మరణాన్ని సమానంగా చూడగలిగాడు. జీవిస్తూనే మరణాన్ని సాదరంగా ఆహ్వానించగలిగాడు. మరణిస్తూనే, జీవితానికి ఏ లోటూ రానివ్వలేదు. Striking a balance కి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఇవ్వటం కష్టమేమో! అఖరి రోజుల్లో రాండి వాళ్ళ అబ్బాయిని ఒక సినిమాకు తీసుకొని వెళ్తాడు. ఆ సినిమాలో, బాబుకి చాలా ఇష్టమైన పాత్ర చనిపోబోతున్నట్టు తెలియగానే, వాడు ఆ పాత్ర కోసం ఏడ్వటం మొదలు పెడతాడు. అప్పటికింకా, ఆ పసివాడికి తన తండ్రి సంగతి తెలీదు. సినిమా నడుస్తూ ఉంటుంది. చనిపోబోతున్న పాత్రతో మరో పాత్ర అంటాడు: “నువ్వు చచ్చిపోవద్దు. You’ve to live.” అని. దానికి చనిపోబోయే పాత్ర సమాధానం: “I already did that!” రాండి కూడా, “నేను జీవించాను” అని చెప్పుకోగలిగారు. అలా చెప్పుకోగలిగారు కాబట్టే, మరణాన్ని స్వీకరించగలిగారు.

టైం ఉన్నది వేస్టు చేయడానికే అంటారో ఫ్రెండ్! ఊహు! టైం ఉన్నది జీవించడానికి. జీవితం ఏమన్నా కానీ – మహోత్కృష్ట తపస్సు ఫలితం లేదా ఒక బాధ్యత లేదా ఒక బరవు లేదా ఒక టైం పాస్ లేదా ఒక పిచ్చోడి చేతిలో రాయి లేదా పై వాడు గీకిపారేసిన చెత్త.. ఏదైనా! ప్రతీ క్షణం జీవించటంలో ఒక మజా ఉంటుంది. ఒక కిక్ ఉంటుంది. ఆ మజా, ఆ కిక్ ఈ పుస్తకంలో నిక్షిప్తమై ఉన్నాయి. లోకం పోకడలకు విసుగెత్తి, కాలంతో పరుగెత్తలేక వేసారిన క్షణాల్లో, నా మనసు ఈ పుస్తకంతో సేద తీర్చుకోవాలనుకోవటం విడ్డూరం కాదు. దాని నోరు నొక్కేసి, అందరూ “ఎంత గొప్ప టేస్టు మీది!” అని చెప్పుకునే పుస్తకాల గురించి రాయాలని నేను. మనసును వివరించటం కన్నా,  మనసును మభ్యపెట్టటం ఎంతో తేలికైన పని మరి!

You Might Also Like

7 Comments

  1. పద్మవల్లి

    I just love this book also the video. This book is co authored by WSJ columnist JEFFREY ZASLOW. Randy said he cares about the first 3 copies for his children, which he called a message in the bottle.

    Read Jeffery’s tribute to Randy “A Final Farewell” which explains Randy’s last journey.
    http://online.wsj.com/article/SB120951287174854465.html

    In his congressional testimony on behalf of Pancreatic Cancer, in which he showed his wife’s picture and called it his widow’s picture. It just broke my heart.

    http://pancan.org/Press/video/video_pausch_testimony.html

    Here are couple of statements by him showing his positive mindset.
    In his last lecture, “if you are here to see a dying guy with morose feelings…sorry to disappoint you” and he did pushups on the stage….what a great guy…truely showing wonderful spirit and grit in the face of death.

    In one of the interviews with Diane Sawyer, for her consoling words of unfair, he replied saying “No, its not unfair, I was unlucky to get it…as 1 in 1000 ought to get affected by this, its not unfair…but I happened to be unlucky”.

    I strongly believe his story touched many lives thus serving the purpose of his life much more than the almighty wanted, though I am stupid enough to not to learn a lesson from it. He truly displayed the concept of “nirveda”, a total detachment yet wonderful approach to life.

    His thoughts for dying meet with mine, as not being afraid of you not being there, but your kids not having you to when they need you.

  2. Krishna Veni

    Really good.

  3. ఏరువాక

    బాగా రాసారు పూర్ణిమ గారు…నాకు మీ అంత బాగా రాయటం రాకపోయినా ఆస్వాదించడం వచ్చు…ఇక్కడ రాసిన ప్రతీ అక్షరం నన్ను తడిమింది…కాదు కాదు తాకేలా చేసాయి మీ అక్షరాలు…
    అందుకే నేనెప్పుడు చదవని ఈ పుస్తాకాన్ని కనీసం ఒక్కసారైనా చదువుదామని ఇప్పుడే మొదలు పెట్టా…

  4. Independent

    నిఝ్ఝంగా చాలా బాగా రాస్తావు పూర్ణిమా కొన్నిసార్లు. చదూతున్నంత సేపూ ఓ స్పర్శ గుండె చుట్టూ కోట కట్టి, నా హార్ట్ ని పదిలంగా చూసుకున్న భావన. ఏదో నిశీధి వేళ మళ్ళీ నిద్ర లోకెళ్ళ లేక, పుస్తకం దగ్గరకొస్తే, ఇంత ఇంటెన్స్ గా నన్ను పలకరించి, మంచి రీడ్ ని అందించినందుకు థాంక్స్.

    అయ్యో నేనిప్పుడు మళ్ళీ నా లోకం లోకి రావాల్సిందేనా? ప్చ్.

  5. లలిత

    పూర్ణిమా,
    నువ్వు బాగా రాస్తావు, చాలా బాగా రాస్తావు.
    ఎంత involved గా రాశావో.
    నేను ఇంతలా పుస్తకంలో, ఆ పాత్ర జీవితంలో లోతుకి వెళ్ళి ఆలోచిస్తూ, నా గురించి నేనూ ఆలోచించుకునే పుస్తకాలు చదివినప్పుడు రాయడానికి ఎంత కష్టపడతానో!
    ఆ అనుభవాన్ని వర్ణిస్తూ నువ్వు రాసేది చదవడం నా లాంటి వారికి ఇంకో అనుభం అవుతుంది! 🙂
    Very intense.

  6. సౌమ్య

    You forgot to acknowledge someone for introducing Randy to you 😛

Leave a Reply