కథకీ మనకీ మధ్య ….ఒక పూలగుర్తు !
రాసి పంపిన వారు: అఫ్సర్
(కూర్మనాథ్ గారి ‘పూల గుర్తులు ‘ – గురించి)
జ్ఞాపకాలు వేధిస్తాయే గాని
ఆప్యాయంగా పలకరించవు –
– అని ఎప్పుడో రాసుకున్న వాక్యాన్ని మళ్ళీ ‘పూల గుర్తుల ‘ (ప్రాణహిత, ఆగస్టు 2007) తో గుర్తు చేశాడు కూర్మనాథ్ ఈ మధ్య.
1
ఈ కథ నన్ను వొక మిత్రుడి మరణ జ్ఞాపకంలోకి తీసుకెళ్ళింది.
యాసీన్ – వొక అందమయిన చిరునవ్వు, నిదానమయిన మాట, ఖమ్మం గోడల్ని యెరుపెక్కించిన అతని చేతుల కరచాలనం నాకు ఎప్పటికీ గుర్తు. మా ఇద్దరికీ అయిదారేళ్ళ తేడా. నేను పదో క్లాసులో వున్నప్పుడు అతను ప్రతి సాయంత్రం ఖమ్మంలోని కాప్రి హోటల్ బయట కాసేపూ, ఆ పక్కనే వున్న రికాబ్ బజారు స్కూలు విశాలమయిన ఆవరణలో కాసేపూ కూర్చొని- గంటల తరబడి మాట్లాడుకునే వాళ్ళం.
నా ఆలోచనలు అప్పుడప్పుడే వేడెక్కుతున్న కాలం అది. యాసీన్ చాలా మామూలు విషయాలే మాట్లాడే వాడు. కాని, అతని మాటల్లో ఆ విషయాలన్నీ కొత్త వెలుగులో మెరిసేవి. అతని మాట తీరులోని ఉద్వేగం ఏదో నా ఆలోచనలకి పదును పెట్టేది. ఒక రోజు నేను అతనితో మాట్లాడ్డం చూసిన మా దగ్గిర బందువు వొకాయన పనికట్టుకుని మా ఇంటికి వచ్చి “వీణ్ణి సాయంత్రాలు ఇంట్లోంచి కదలనివ్వకుండా చెయ్యండి” అని తీవ్రంగా హెచ్చరించి వెళ్ళిపోయాడు. అయితే, ఆ హెచ్చరిక మా ఇంట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు గాని, నేను రోజూ వొక నిషిద్ధ మనిషితో కలుస్తున్నానన్న విషయం నాకు అర్ధమై, కాస్త పొగరుగా అనిపించింది. ఆ తరవాత నాకు తెలియకుండానే అతనికి నేను దగ్గిర య్యాను.
చాలా కాలం దాకా యాసీన్ ఏమయ్యాడో నాకు తెలియలేదు. నేను బెజవాడ ఆంధ్ర జ్యోతిలో చేరాక, అతన్ని మళ్ళీ చూశాను, కాని ఆ చిరునవ్వుల యాసీన్ ని కాదు, వొళ్ళంతా తూటాల జల్లెడయి, నేలకొరిగిన యాసీన్ ని ఫోటోలో! అప్పుడు అతనికి నా చివ్వరి చూపు అదే! ఒక పత్రికా రచయితగా అతని ఫోటోనీ, వార్తనీ విశేషంగా అచ్చు వేయించడం మాత్రమే … అప్పుడు నేను చెయ్యగలిగింది!
2
నిబద్ధత/నిమగ్నత గురించి చాలా కాలం చర్చలు జరిగాయి సాహిత్య లోకంలో!
నిజమే! ఆ రెండిటీకి మాటకీ, చేతకీ వున్నంత దూరం వుంది. అనుకున్న ప్రతి మాటలోకీ నిమగ్నమయి, దాని కోసం జీవితాన్ని పూచిక పుల్లలా విసిరేసే సాహసం అంత తేలిక కాదు. ఆ రెండీటికీ మధ్య చాలా రకాల దూరాలున్నాయి. యాసీన్ అలా పోయినప్పుడు, అతను ఏ ఆశయం కోసం ప్రాణాన్ని పణంగా పెట్టాడో, అది ఆ క్షణానికి నాకు గుర్తు రాలేదు. నాకు వెంటనే గుర్తొచ్చింది, అతని రాక కోసం ఎదురుచూపులు చూస్తున్న తల్లి, నాలాగానే ఆ రికాబ్ బజారు స్కూలు బయట అతని మాటల కోసం ఎదురుచూస్తున్న స్నేహితులు. నా పిచ్చి గాని…యాసీన్ అంతకు మించిన ప్రపంచం చూస్తున్నాడని నాకు గుర్తు రావాలి కదా?!
3
ఒక మరణం మిగిల్చి వెళ్ళే ఎలాంటి నిశ్శబ్దాన్ని అయినా భరించగలిగే ధైర్యం ఈ గుండెకి ఇంకా చిక్కబట్ట లేదు. ఆ మాట కొస్తే, ఏ మరణం అయినా వెంటనే ఏడ్పిస్తుంది, గుండె ఖాళీ అయ్యేట్టుగా. కాని, అసలు బాధ /నరక యాతన కొంత వ్యవధి తరవాత వెంటాడడం మొదలెడ్తుంది. వొక నిశ్శబ్దంలోకి జారిపోతాం. ” ఆ స్నేహితుడికి జీవితం ఇంకో అవకాశం ఇచ్చి వుంటే, ఎంత బాగుండేది” అనిపిస్తుంది, అది అయ్యే పని కాదు అని తెలిసి, తెలిసే!
4
కూర్మనాథ్ నన్ను ఎంత దూరం లాక్కు వెళ్ళాడో ఈపాటికి మీకు అర్ధమయి వుండాలి. కథకి ఇంత బలం ఎక్కడి నించి వస్తుంది? రచయిత కథనంలోంచా? ఆ కథలోని ఏదో వొక గుర్తు వెంటాడి వుక్కిరి బిక్కిరి అయ్యే అనుభవం యెందుకు కలుగుతుంది? నా లోపలి వొక ఉద్వేగాన్ని మరింత వేగవంతం చెయ్యడంలో రచయిత పాత్ర ఎంత? లేక, నేనే సున్నితమయి పోయి, ఆ కథని వొక సాకుగా తీసుకొని మాట్లాడుతున్నానా?
నాలో కొంత సున్నితత్వం వుందే అనుకుందాం. అది కూర్మనాథ్ కథ చదివాకే ఎందుకు కంట తడి పెట్టుకోవాలి? రోజూ, ఎన్ని మరణాలు వార్తల్లో, కబుర్లలో! కాని, అన్ని మరణాలూ వొకేలా అనిపించవు. ఇప్పుడే వొక ఈమైల్ చదివాను. నా కలీగ్ అయిదారేళ్ళ కొడుకు స్విమ్మింగ్ పూల్ లో గాలి ఆడక చనిపోయాడట ఆస్టిన్ లో! వొక్క సారిగా వొంట్లో నెత్తురంతా తోడేసినట్టయ్యింది. మళ్ళీ గుర్తొచ్చింది కూర్మనాథ్ కథ.
5
కథ చేసే పని చాలా చిత్రమయ్యింది. ఒక కథ యెప్పుడో చదివి వుంటాం. వెంటనే ‘ఇది మంచి కథ ‘ అనుకోవచ్చు. కాని, నిజంగా అది మన అనుభవం అయినప్పుడు అది మన యాదిని వెలిగించే కథ అవుతుంది. కథనం ద్వారా తన అనుభవాన్ని మన అనుభవం చేస్తాడు రచయిత. పూల గుర్తులు కథలొ అలాంటి కథనం వుంది. మామూలు కూర్మనాథ్ కథలకి భిన్నమయిన కథ ఇది. ఇతర కథల్లో కొన్ని సంఘటనలనో, అనుభవాలనో ‘కథ ‘గా మలచడానికి కూర్మనాథ్ తన శైలితో తన ప్రమేయాన్ని కొంత బాహాటంగానే ప్రకటించుకుంటాడు. అక్కడ కూర్మనాథ్ కనిపిస్తాడు, వ్యంగంలోనో! కొరడా దెబ్బల చురుకులోనో!
‘పూల గుర్తులు ‘ కథలో అలాంటి కూర్మనాథ్ కనిపించలేదు. ఆ తాతయ్య మాత్రమే కనిపించాడు నాకు. కథ చివరిలో అతని కళ్ళూ, నా కళ్ళూ వొకేసారి తడి పెట్టుకున్నాయి.
ఆ తడిలో వుంది కూర్మనాథ్ కథన శిల్పం!
kurmanath
కథకి లింక్ ఇస్తున్నాను
https://kv-kurmanath.blogspot.in/2016/10/blog-post_26.html
రాయడం ఎవరి కోసం? దేని కోసం?! | సారంగ
[…] మరణాల్ని ఎలా గుర్తు చేసాయో. (link — http://pustakam.net/?p=1564) ఓసారి ఓ రచన చేస్తే అది బతికిన […]
Ashok
” పూలగుర్తులు ” కదిలించాయి. మనిషి విలువను ‘ పువ్వంత ‘ సున్నితంగా గుర్తు చేశాయి. మదిలో మానవత్వాన్ని తట్టి లేపాయి. కూర్మనాథ్ గారికి కృతజ్ఞతలు.
కధ గురించి అఫ్సర్ గారు చేసిన వ్యాఖ్యలు లోతుగా, వివరణాత్మకంగా ఉన్నాయి
kurmanath
Thanks, Seetaramulu, Varma for your comments.
Jhani
అఫ్సర్ గారు, పూలగుర్తులు ఇంకా చదవలేదు కాని, మీరు వ్రాసిన విశ్లేషణ, మీ పాత ఙాపకాలు మనసును హత్తుకు పోయాయి. అద్బుతం గా పరిచయం చేశారు.
లింక్ ఇచ్చిన కుర్మనాథ్ కి థాంక్స్.
kurmanath
Dear Afsar,
This link is working. ‘ve just checked. Telugulo type cheyyadam naakinkaa raadu.
http://www.pranahita.org/2007/07/pulagurtulu/
BTW, thanks for the response to my story. naaku anipistundee, we all carry some wounds along. yeppudu, yenduku avi rupture avuthayo teleedu. Marikonni ayithe open wounds, yeppatikee. Naakinka anipistundi, ave manalni nilabeduthunnayemonani.
Yasinni VV kooda gurtu chesukunnaru, mee vyasam chadivi.
luv
kurmanath
అరిపిరాల
ప్రాణహిత ఆగష్టు 2007 సంచికలో కథ దొరకలేదు.. కాస్త లింకు ఇస్తారా..
Gurram seetaramulu
యాసిన్ ను గుర్తు చెసిన మిత్రునికి దన్యవాదాలు
యాసిన్ ది మా పక్క ఊరె అతన్ని తలుచు కుంటే మా అందరికి రొమాలు నిక్కర పొడూస్తాయి
టిరుమలయపాలెమ్ లొ యాసిన్ చెసిన సాహసమ్ ఇప్పతికీ కథలు కథలు గా చెప్పుకుంటారు కుర్మానాథ్ కథల0టే నాకు అభిమాన0 ఆయన్ రాసిన ఓక జనన0్ గురించ్జహిన కథ గొప్పదనులకుంతాను సమాజమ్ లొ విద్యనంసాన్ని కురమానాథ్ లా గా కొంతమందె చెప్పగలుగుతున్నారు సమాజ0 లొ జరిగె అలజడూలు అక్సరబద్దమ్ చెసినప్పుదె సాహిత్యానికి సార్థకథ….లెకుంటె టన్నుల కొద్ది ఇన్కు మరిగించినా అన్వసరమె…
Thank you Afsar gaaru
kcube varma
ఒక మరణం మిగిల్చి వెళ్ళే ఎలాంటి నిశ్శబ్ధాన్ని అయినా భరించగలిగే ధైర్యం ఈ గుండెకి ఇంకా చిక్కబట్టలేదు. తడి ఆరని తనమే కవిని సజీవంగా ఉంచుతుంది కదా సార్. కూర్మనాధ్ కథ అరుణతారలో చదివినప్పుడు ఆరోజంతా అమరుల జ్ణాపకాలు వెన్నాడాయి. ఇప్పుడు మీ ఆర్థ్రమైన వాక్య పరిచయం గుండెలోని తడిని కళ్ళలోకి ఒక్కసారిగా ఒలికించింది. ధన్యవాదాలు సార్
Purnima
WOW!
>> కథనం ద్వారా తన అనుభవాన్ని మన అనుభవం చేస్తాడు రచయిత.
మీరూ అదే చేశారు కదా, ఈ వ్యాసంతో!