2011- నా తెలుగు పుస్తక పఠనం

ఈ ఏడాది దేశం బయట గడిపిన రోజులే ఎక్కువ, లోపల ఉన్న రోజులకంటే. అందువల్ల, తెలుగు చదవడం బాగా తగ్గిపోతుందేమో? అనుకున్నాను. కానీ, కినిగె.కాం పుణ్యమా అని, ఆపై ఒక చిన్న మొత్తంలో ఏవీకెఎఫ్ వారి పుణ్యం, దగ్గరలో ఉండే ఒక తెలుగు స్నేహితురాలి చిన్ని లైబ్రరీ పుణ్యం, కౌముది పత్రిక సైటులో ఈబుక్స్ పుణ్యం: అన్నీ కలుపుకుని నాకు లోటు తెలియకుండా చేసాయి. ఈ ఏటి చదువుల్లో – నచ్చినవి, నచ్చనివీ, పూర్తి చేసినవీ, నెమ్మదిగా చదువుతున్నవీ, చదవలేక చేతులెత్తేసినవీ – తెలుగులో ఇవీ…

కథలు:

ఇల్లేరమ్మ కథలు” (సోమరాజు సుశీల), “అనార్కో” (సత్యు), “పోలేరమ్మ బండ కతలు” (ఖదీర్ బాబు) ఆపకుండా చదివించాయి. “ప్రళయ కావేరి కథలు” (స.వెం.రమేశ్) కూడా బాగా నచ్చాయి కానీ, నాకు ఆ యాసతో అంతగా పరిచయం లేకపోవడం వల్ల కొంచెం కష్టపడ్డాను. అయితే, ఈ పుస్తకంలో మంచి గుణం ఏమిటి అంటే, స్థానిక పదాలకి ఎక్కడికక్కడ ఫుట్నోట్లలో అర్థాలు కూడా రాసారు. వసుంధర, ఎమ్బీయస్ ప్రసాద్ గార్ల కథల సంకలనాలు రెండూ (సస్పెన్స్ థ్రిల్లర్ కథలు, .౩౮ కాలిబర్ కథలు) – అపరాధ పరిశోధన, సస్పెన్స్ తరహాలో సాగుతాయి. కాలక్షేపానికి చదువుకోవడానికి వీటిల్లో సగానికి పైగా కథలు బాగున్నాయి. తక్కినవి సాదాసీదాగా అనిపించాయి. సాయి బ్రహ్మానందం గొర్తి గారి “సరిహద్దు“, నిడదవోలు మాలతి గారి “కథల అత్తయ్యగారు” లలో కొన్ని కథలు బాగా నచ్చాయి. “సరిహద్దు” కథలు ప్రధానంగా కథాంశాల వల్ల, “కథల అత్తయ్యగారు” రచనా శైలి వల్లా నచ్చాయి అనిపించింది. ఇక, మృణాలిని గారి “కోమలి గాంధారం” కూడా మంచి కాలక్షేపం. కాకపోతే, నేనింకా ఎక్కువగా ఊహించుకున్నాను. ఇలాగే బోలెడు అంచనాలతో చదివినందుకేమో, సి.రామచంద్రరావు గారి “వేలుపిళ్లై” కథలు చాలా సాధారణంగా అనిపించాయి. ముళ్ళపూడి “రాధాగోపాలం” కథల సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది? ఎప్పుడు చదివినా నాకు బోరు కొట్టదు :). ఇవి కాక, అప్పుడొకటీ ఇప్పుడొకటీ అంటూ, శ్రీపాద వారివీ, బుచ్చిబాబు గారివీ కథలు కూడా చదువుతూ ఉన్నాను.

చదవలేక వదిలేసినది: “చిన్నరావూరు లోని గయ్యాళులు“… అనువాదంలో వాడిన భాష, వాక్య నిర్మాణం నాకు ఒక పట్టాన మింగుడు పడలేదు.

నవలలు:

కినిగె సౌజన్యంతో మ.వె.కృ. నవలలు మూడు – “పరంజ్యోతి“, “ది ఎండ్“, “అందమైన జీవితం” చదివాను. కాలక్షేపానికి బానే ఉన్నాయి. ఇంత భయంకరమైన ఇమాజినేషన్ తో రాసే వాళ్ళు ఉంటారు అని ఇప్పుడే తెలిసింది. ఇవి కాక, ఆయనదే సినిమాగా వచ్చిన “రేపటి కొడుకు” కూడా చదివాను. ఆపకుండా చదివించింది. కొమ్మూరి సాంబశివరావు నవలలు – ౮౮౮, “చావు తప్పితే చాలు” చదివాను. సస్పెన్స్ పరంగా రెండూ బాగున్నా, రెండోది మొదటిదానికన్నా ఎక్కువ గ్రిప్పింగ్ గా ఉన్నట్లు అనిపించింది. బొందలపాటి గారి బ్లాగులో (ఆపై కినిగె.కాం లో) వచ్చిన “ఒక తెలుగు సాఫ్ట్వేర్ ఇంజినీర్ కథ” – శైలి పరంగా పెద్ద గొప్పగా అనిపించకపోయినా, తొలి ప్రయత్నానికి బాగుంది. వంశీ నవల “దిష్టిబొమ్మ” ఆయనంటే విరక్తి పుట్టిస్తే, కాశీభట్ల వేణుగోపాల్ గారి “నేనూ-చీకటి“, ఆయన శైలి పట్ల విపరీతమైన కుతూహలాన్ని కలిగించింది. ముదిగొండ శివప్రసాద్ గారి నవల “రెసిడెన్సీ” విలియం దాల్రిమ్పుల్ రాసిన “వైట్ ముఘల్స్” కి సంక్షిప్త పాఠం లా అనిపించింది. కొంచెం నిరాశ పడ్డాననే చెప్పాలి. ముళ్ళపూడి గారి “ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు” చదివాక, ఈయన పుట్టుకతోనే స్క్రీన్ప్లే రైటర్ ఏమో అనిపించింది :). కథా పరంగా మామూలు కథే అయినా కూడా, ఆయన మార్కు డైలాగుల వల్ల నాకు నచ్చింది. ఇక, దాసరి సుబ్రహ్మణ్యం గారి జానపద నవలలు – “అగ్నిమాల”, “మృత్యులోయ” ఆపకుండా చదివించాయి. గొల్లపూడి గారి “చీకట్లో చీలికలు” చదివించినా కూడా, ఆకట్టుకోలేకపోయింది. కానీ, ఆయనదే “సాయంకాలమైంది” మాత్రం ఆపకుండా చదివించడమే కాక, కొన్ని రోజుల పాటు అలా మనసులో నిలిచిపోయింది కూడా.

చివరగా, మధుబాబు నవలల గురించి: కినిగె.కాంలో బోలెడు సార్లు చూసీ, చూసీ, కుతూహలం కొద్దీ – కాళికాలయం, కంకాళలోయ, కళ్యాణతిలకం : ట్రైలజీ చదివాను. నాకు మామూలుగా రాజులు, మంత్రాలూ యుద్ధాలూ వంటి కథలపై ఉన్న ఆసక్తి వల్లో, ఏమో, అర్థ రాత్రి దాటినా, మూడు భాగాలూ ఏకబిగిన పూర్తిచేసాకే పడుకున్నాను 🙂 అలాగే, “షాడో” నవలలు – సి.ఐ.డీ.షాడో, ప్రొఫెసర్ షాడో, “ఫ్లయింగ్ హార్స్” ఇలా కొన్ని చదివాను – కాలక్షేపం….మహా ఫాస్టు కాలక్షేపం 😉

స్వీయచరిత్రలు/జీవిత చరిత్రలు:

సి.పి.బ్రౌన్ అకాడెమీ వారు వేసిన జీవిత చరిత్రలు రెండు – సి.కే.నాయుడు, వావిళ్ళ రామస్వామిశాస్త్రి చదివాను. వస్తు పరంగా సి.కే.నాయుడు పుస్తకం కాస్త నయంగా తోచింది. కానీ, రెండు పుస్తకాల ముద్రణ విషయంలో మరికాస్త శ్రద్ధ వహించాల్సింది అనిపించింది. అయితే, సి.పి.బ్రౌన్ సంస్థ వారి ఆలోచన మాత్రం అద్భుతంగా ఉంది. ఈ రెండు పుస్తకాల్లోనూ చివర ఒక రిఫరెన్సు జాబితా ఇవ్వడం బాగుంది. అయితే, ఇన్ని పుస్తకాలు చెంతన ఉన్న వారు కాస్త శ్రద్ధ పెట్టి, మరింత వివరంగా రాసి ఉంటే బాగుండేది. అందునా, వావిళ్ళ గారి గురించిన పుస్తకంలో భాష నాకు ఒక పట్టాన కొరుకుడు పడలేదు. గ్రాంథికం, వ్యావహారికం కాకుండా మధ్యలో నిలిచినట్లు అనిపించింది. కినిగె.కాం ద్వారా చదివిన “నాయకురాలు నాగమ్మ” పుస్తకం వస్తు పరంగా నాకు నచ్చినా కూడా, దాన్ని నాగమ్మ జీవిత చరిత్ర అనలేము. పల్నాటి చరిత్ర అనడం సబబేమో.

శారదా శ్రీనివాసన్ గారి “నా రేడియో అనుభవాలు-జ్ఞాపకాలు“, బాలాంత్రపు రజనీకాంత రావు గారి “రజనీ భావతరంగాలు” – రెండూ తప్పక చదవాల్సిన పుస్తకాలు (ముఖ్యంగా నేటి యువతరానికి!) అని నా అభిప్రాయం.

మొదలి నాగభూషణ శర్మ గారి “తొలినాటి గ్రామఫోన్ గాయకులు“, తనికెళ్ళ భరణి గారి “ఎందఱో మహానుభావులు” – ఇవి రెండూ వివిధ సంగీతజ్ఞుల, గాయకుల జీవితాలను సంక్షిప్తంగా పరిచయం చేసే వ్యాస సంకలనాలు. ఇవి కూడా నా అభిప్రాయంలో అసలుకి చాలామట్టుకు వీళ్ళ పేర్లైనా వినని నాలాంటి వాళ్ళకోసం తప్పకుండా ఇంట్లో ఉంచుకోవలసిన పుస్తకాలు. మన చరిత్రను గురించి తెలియజేసేవి. “మహామనీషి” – భానుమతి స్మారక సంచిక, ఎస్వీ రామారావు గారి “సినీ గీత వైభవం” కూడా ఇలాంటి విలువ గలవే అయినా కూడా, పై పుస్తకాల స్థాయిలో కట్టిపడేసే లా వీటిలో వ్యాసాలు లేవు అని నా అభిప్రాయం.

వ్యాసాలు:

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వ్యాసాలు వేరుగా అప్పుడొకటీ ఇప్పుడొకటీ చదివాక, ఎన్నో రోజులు ఎదురుచూసి చదివిన “సిరివెన్నెల తరంగాలు” సంకలనం కాస్త నిరాశ పరిచింది. ఆయన ఎప్పటికైనా మరో సంకలనం వేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నాను.

రాచమల్లు రామచంద్రారెడ్డి గారి “అనువాద సమస్యలు” పుస్తకం కూడా విపరీతమైన నిరాశకు గురిచేసింది. ఇక, చార్వాకాశ్రమం పుస్తకాలు కొన్ని కినిగె.కాం పుణ్యమా అని చదవగలిగాను. ఇవి కూడా బాగా నిరాశ కలిగించాయి. ఇలాగే “గణితం అతని వేళ్ళ మీది సంగీతం” అన్న పుస్తకం కూడా, ఎంతో ఊహించుకుని చదివితే, సాధారణంగా అనిపించింది.

గొల్లపూడి గారు పరిచయం చేసిన “ఐదు నాటకాలు”, “తీర్థయాత్ర – టాంజేనియా ట్రావెలాగ్” రెండూ మంచి కాలక్షేపం. అలాగే, రాం గోపాల్ వర్మ “నా ఇష్టం” (దీనిపై పుస్తకం.నెట్లో వచ్చిన పూర్ణిమ వ్యాసం ఇక్కడ.) కూడానూ.

పతంజలి తలపులు” – కే.ఎన్.వై పతంజలి గారి స్మరణ లో ఆయనతో సంబంధం ఉన్న వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాల సంకలనం. కొన్ని వ్యాసాలు చాలా బాగున్నా కూడా, చాలా వ్యాసాలు మరీ భజన లా అనిపించాయి. అయితే, పుస్తకం చదివాక మాత్రం పతంజలి గారి రచనలు చదవాలి అన్న కుతూహలం కలుగక మానదు.

నండూరి రామమోహనరావు గారి “విశ్వదర్శనం” (భారతీయ చింతన) పుస్తకం ఆపకుండా చదివించింది. తత్వశాస్త్రాన్ని ఇంత సులభంగా చెప్పడం మరొకరికి సాధ్యం కాదేమో. సదాశివ గారి “ఉర్దు భాష-కవితా సౌందర్యం” పుస్తకం బాగుంది…ఎన్నో సంగతులు చెబుతుంది కానీ, ముద్రణ విషయంలో (ముఖ్యంగా కాగితాల నాణ్యత విషయంలో) కాస్త శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. బూదరాజు గారి “తెలుగు సంగతులు” వ్యాసాలు చదువుతూ ఉన్నాను. వారి మార్కు వ్యంగ్యం ఘాటుగా తగుల్తోంది 🙂 ఇస్మాయిల్ గారి “కరుణ ముఖ్యం” వ్యాసాలు చదివించాయి, ఆలోచింపజేసాయి. గుంటూరు శేషేంద్ర శర్మ గారి “పక్షులు, సముద్రం నా పేరు, ఈనగరం జాబిల్లి” లో కొన్ని పద్యాలు, వ్యాసాలు చాలా నచ్చాయి.

ఇవి కాక, రెండు పరిశోధన గ్రంథాలు చదివాను. వెల్చేరు నారాయణరావు గారి “తెలుగులో కవితా విప్లవాల స్వరూపం“, నా అంచనాలకు భిన్నంగా అర్థమయ్యే భాషలో ఉంది. వకుళాభరణం గారి “జోగిని వ్యవస్థ” చాలా పరిశోధన చేసి రాసినా కూడా, రాసిన శైలి నాకు నచ్చలేదు.

ఇక చదవలేక (నాకు చేతకాక), వదిలేసినవి: సాహిత్యమంటే ఏమిటి – వాడ్రేవు చినవీరభద్రుడు,దేవదాసి వ్యవస్థ: వకుళాభరణం లలిత

కవితలు

తనికెళ్ళ భరణి గారి “శబ్బాష్ రా శంకరా”(ఈ పుస్తకంపై పుస్తకం.నెట్లో వచ్చిన సమీక్ష ఇక్కడ.), “పరికిణీ”, “నక్షత్ర దర్శనం” సంకలనాలు నాకు నచ్చాయి. అలాగే, విన్నకోట రవిశంకర్ గారి “వేసవి వాన”(ఒక వ్యాసం ఇక్కడ) సంకలనం లో కూడా కొన్ని కవితలు చాలా నచ్చాయి. పోస్ట్ మాడర్నిజనికి నేను సిద్ధంగా లేనని అర్థమై “మో” నిషాదాన్ని మధ్యలో ఆపేసాను. “త్రిపుర కాఫ్కా కవితలు” పుస్తకం ఎందుకో గానీ, నాకు చాలా నవ్వు తెప్పించింది. ఇస్మాయిల్ గారి కవిత్వానువాదాలు “రెండో ప్రతిపాదన“, నన్ను కొంచెం నిరాశ పరిచాయి. మనుచరిత్ర లోని పద్యాలనూ పరిచయం చేస్తూ మల్లాది హనుమంతరావు గారు రాసిన “మనుచరిత్రలో మణిపూసలు” పుస్తకం చాలా, చాలా నచ్చింది. ఇక్కడ కూడా చదవలేక వదిలేసినది ఒకటుంది: తారకనామ రామాయణం – బ్రహ్మయోగి

కార్టూనులు, ఇతరాలు:

బ్నిం రాసిన/గీసిన “మరపురాని మాణిక్యాలు“, తలిశెట్టి రామారావు గారి కార్టూన్లతో కూడిన “తొలి తెలుగు వ్యంగ్య చిత్రాలురెండు పుస్తకాలూ కూడా నేటి తరంకోసం, తరువాతి తరాల కోసం దాచుకోదగ్గవి అని నా అభిప్రాయం. ముఖ్యంగా బ్నిం గారి పుస్తకం లోని ఆంగ్లం నాకు అంత నచ్చకపోయినా కూడా, ఆ పుస్తకం వెనుక ఉన్న ఆలోచన చాలా నచ్చింది.

శేఖర్ కార్టూన్ సంకలనాలు రెండు “చూసాను”. అవి చంద్రబాబు పై వేసిన వ్యంగ్య కార్టూనుల కూర్పు – “బ్యాంక్ బాబు” మరియు ఇతర కార్టూన్ల సంకలనం -“శేఖర్టూన్స్“. రెండింటిలోనూ కొన్ని చక్కని వ్యంగ్య బాణాలు ఉన్నాయి.

చివరగా ఒక్క పుస్తకం గురించి చెప్పి ముగిస్తాను. అది వరాహ మిహిరుడి జలార్గళ శాస్త్రం గురించి తెలుగులో రాసిన ఒక సంక్షిప్త పరిచయం. నా మట్టుకు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది.

-అదీ నా తెలుగు పుస్తకపఠనం కథ! కినిగె.కాం కి ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు 🙂

You Might Also Like

4 Comments

  1. ఆ.సౌమ్య

    అమ్మో ఎన్ని చదివేసారో!

    నాకో డౌటు: ఇవన్నీ మీరు ఆన్ లైన్ లొ చదివినవా? లేక పుస్తకం కొని చదువుకున్నవా?

    మీ వల్ల నాకు చాలా కొత్త పుస్తకాలు తెలిసాయి…కొనుక్కోవాల్సిన నా లిస్ట్ పెరిగిపోతొంది! 🙂

  2. budugoy

    చినరావురులోని గయ్యాళులు అనువాదం చాలా కృతకంగా ఉండి విరక్తి కలిగించేలా ఉంది కాని కథ చాలా బాగుంటుందండీ. కినిగె పుణ్యమా అని నాకు తెలిసిన రచయితల్లో ఈ పూర్ణచంద్ర తేజస్వి ఒకరు. కృష్ణారెడ్డి గారి ఏనుగు తో మొదలెట్టి ఈ పాటికి 2 కథలు, 3 నవలలు చదివాను(పర్యావరణ కథలు, జుగాడి క్రాస్, చిదంబర రహస్యం). రాజగోపాల్ గారి అనువాదం బాగోలేకపోయినా ఈయన ప్రతి ఒక్కరు చదవదగ్గ రచయిత. సాహిత్య అకాడెమి వాళ్ళ చిదంబర రహస్యం కాస్త చదవదగ్గ అనువాదం. కన్నడలో పూర్ణ చంద్ర బాగానే పేరొందిన రచయిత. కువెంపు కొడుకు. చక్కగా మడికెరెలో ఎస్టేటు కొనుక్కొని ఆ పల్లెటూళ్ళ జీవితం అనుభవించి రాసిన రచనలు.
    మా ఆఫీసు కొలీగ్స్ ద్వారా విన్నదేంటంటే ఈయన carvalho కూడా గొప్ప పుస్తకం. ఇక్కడి విద్యార్థులకు పాఠ్య పుస్తకమట. ఇంగ్లీషు అనువాదం కోసం ట్రై చేస్తున్నాను. బ్లాసంస్ లో అడిగి చూడాలొకసారి.

    1. సౌమ్య

      @budugoy garu: అవునండీ…నేను కూడా కథలు బాగా ఉండి ఉంటాయి అనే నమ్ముతున్నాను. కానీ, మీరు అన్నట్లు, విరక్తి పుట్టించిన వాక్య నిర్మాణం వల్ల చదవడం ఆపేశా. మీరు ఇంతగా చెబుతున్నారు కనుక, మళ్ళీ చదువుదాము అనుకుంటున్నాను.

  3. chavakiran

    చాలా చదివేశారు!

Leave a Reply