నక్షత్ర దర్శనం

భరణి గారి “నక్షత్ర దర్శనం” చదివాను. నాకు చాలా నచ్చింది. అయితే, నేను ప్రత్యేకం పరిచయం చేసేందుకు ఏమీ లేదు. కానీ, తనదైన శైలిలో ఆయన చేసిన వ్యాఖ్యానాలు మాత్రం బాగున్నాయి. నాకు నచ్చిన కొందరు ఇందులో లేరు. మరేం పర్లేదు. రాసింది నేను కాదు కదా 🙂 ఆయన వివిధ సినీరంగ వ్యక్తుల గురించి రాసిన వాటిలో నాకు నచ్చినవి కొన్ని పెట్టేందుకు – ఈ టపా.

ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి గురించి చెబుతూ :
“ఆవిడెప్పుడు భజనలు పాడుతుందా అని శివకేశవులు మగతగా నిద్దరోతారు.”
-అన్నారు. ఆ భావనే అద్భుతంగా అనిపించింది, నాకు శాస్త్రీయం, ఎమ్మెస్ ల గురించి పెద్ద ఆసక్తి, అభిమానం లేకపోయినా.

“సూర్యున్ని కుడి చేత్తోనూ, చంద్రున్ని ఎడం చేత్తోనూ తబలా చేసి దరువేస్తూ”

-అనగానే, అరె హుజూర్! వహ్ తాజ్ బోలియే! అంటున్న జాకీర్ హుస్సేన్ కళ్ళముందు నిలవని వాళ్ళెవరు, చెయ్యెత్తండి? 🙂

“ఉగ్రవాది విశ్వనాథ-చాంధసుడు శ్రీశ్రీ” అన్న టైటిల్ కింద రాసిన ఈ వాక్యాలు కూడా బావున్నాయ్:
“విశ్వనాథ పెరుగు పచ్చడి – శ్రీశ్రీ కొరివికారం
విశ్వనాథ శివార్పణం – శ్రీశ్రీ శ్రీరంగం
విశ్వనాథ చాతుర్వర్ణం – శ్రీశ్రీ వర్ణచాతుర్యం”

ద్వారం వారి వాయులీనం గురించి:
“ఆయన వాయులీనం వాయిస్తూ మైమరచిపోతాడు
మనం వాయులీనం లో విలీనం అయిపోతాం.”

చలం గురించి:
“ఆహార నిద్ర భయ మైథునాల్లాగానే చలం పుస్తకాలు కూడా అనుభవించదగ్గవి.”
“చలాన్ని చదవడం ప్రారంభిస్తే మతం పుచ్చుకున్నట్లే. “

-నాకీ అనుభవం కాలేదు కానీ, చలం అభిమానుల మాటలు సరిగ్గా ఇలాగే ఉంటాయి అనుకుంటాను. కనీసం, ఆన్లైన్ వ్యాఖ్యల్ని బట్టి చూస్తె అలాగే అనిపిస్తుంది!

“అమరశిల్పి జక్కన” దాశరథి పాట గురించి చెబుతూ…
“ఆ పాట విని అవతలవాళ్ళ బుగ్గలెర్రపడకపోతే దాశరథి కాలం పాళీ మీదొట్టు.”

అంటారు.

“అయన అక్షరాలూ రాని కాళిదాసు
చల్ల తాగే దేవదాసు”

-ఏఎన్నార్ గురించి.

“మందినచో సత్తెనపల్లి నిప్పు
కొండకచో కాకినాడ ఉప్పు”

-బ్రహ్మానందం గురించి (అన్నట్లు, పుస్తకం ఆయనకే అంకితం ఇచ్చారు)

చాప్లిన్-హిట్లర్ పోలిక… వావ్! అన్నింటికంటే ఈ పుస్తకంలో ఈ రెండు పేజీలు తెగ నచ్చాయి నాకు. ముఖ్యంగా –
“చాప్లిన్ కన్నా హిట్లరే పెద్ద కమెడియన్. చచ్చి చచ్చేలా నవ్వించాడు” అన్న వాక్యం.

రేలంగిని గురించి చెబుతూ –
“హాస్యానికి రేలంగనే మారుపేరు ఉందని
హాస్యానికీ తెలీదు, రేలంగికీ తెలీదు
తెలిసినవాడొక్కడే తెలుగువాడు!”

ఇక, సూర్యకాంతం పై :
“సూర్యకాంతం తెరమీద విరిస్తే చాలు
చుక్కలు దిక్కులు చూసేవి
సూర్యుడు బిక్కమొహం వేసేవాడు.”

“ఏ పాత్రనైన ఎడం చేత్తో చేసి
అవతలకి గిరవాటేసేది”

రమణారెడ్డి గారి గురించి:
“ఆయన సాగదీసిన
చార్లీ చాప్లిన్ ల ఉండేవాడు
నెల్లూరు యాస భాషకి
సూటేసినట్లు ఉండేవాడు.”

జంధ్యాల గురించి చెబుతూ –
“ఆయన నవ్వించినపుడు
వచ్చిందీ నువ్వే కదా
అప్పుడు నీ పేరేమిటి
అశ్రుబిందువా

కన్నీరా నీ అంతటి
కసాయిది ఇంకేదీ లేదు
నవ్వించీ, నమ్మించీ
గొంతు కోస్తావా! ”

-అన్నప్పుడు, నాకు కలిగిన అనుభవమే, ఆయనే అన్న “గుండెకి ఉక్కపోయడం” అని నా అనుమానం.

“ఉగ్గేల తాగుబోతుకు
ముగ్గేల తాజుమాహాలు మునివాకిటిలో
విగ్గేల కృష్ణశాస్త్రికి
సిగ్గేలా భావుకునికి సిరిసిరిమువ్వా”

-అన్న శ్రీశ్రీ కవితను ఒకచోట ఉటంకించారు. అది కూడా నాకు చాలా నచ్చింది.

జయజయజయ ప్రియభారత… పాట గురించి చెబుతూ:
“ఆ పాట భారతమాత పాదాలకి రాస్తే పారాణి అవుతుంది
అరచేతులకి రాస్తే గోరింటాకులా పండుతుంది
మెడకి పూస్తే మంచి గంథమవుతుంది
కురులకి రాస్తే సంపెంగ నూనె అవుతుంది
పెదాల అరునిమతో కలిసి తాంబూలమౌతుంది”

-అంటారు. అందమైన ఊహ!

“అతను జ్వరమొచ్చిన దేవుడు
కాస్త జాగ్రత్త
అన్నట్లు శ్రీశ్రీ అంటే
రెండు మెరుస్తున్న కొడవళ్ళు
రెండు చెమరుస్తున్న కళ్ళు”

-అతను జ్వరమొచ్చిన దేవుడు :). భరణి గారికి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం లాగుంది. ఈ పుస్తకంలో చాలా చోట్ల శ్రీశ్రీ కనిపించారు.

ఆరుద్ర పై రాసిన వ్యాసం లో గుండెకి ఉక్కపోయడం గురించి చెబుతారు.
“గుండెకి ఉక్కపోయడం అనే ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా కలిగిందా?
సాక్షి లో “చందమామా నిజం చూడకూ, చూసినా సాక్ష్యం చెప్పకూ”
అన్న పాట వింటే, గుండెకి ఉక్కపోసి అది ఆవిరై, మనసుని తడి పే కళ్ళలోంచి ఒక్కొక్క బొట్టై కారుతుంది.”
-ఈ ఉక్కపోత నాకు అయన జంధ్యాల గురించి రాసింది చదువుతున్నప్పుడు కలిగింది.

వేటూరి, “భక్త కన్నప్ప” లో రాసారని కోట్ చేసిన ఈ వాక్యాలు:
“నిప్పులుమిసే కన్ను నిడురోయి బొట్టాయే
తలలోని గంగమ్మ తలపులోనికి జారె
ఎరుక గలిగిన శివుడు ఎరుకగా మారగా
తల్లి పార్వతి మారే తానూ ఎరుకతగా”

-ఆట్టే నమ్మకాలు లేని నాకే శివపార్వతులని సాక్షాత్కారింపజేసాయి.

“త్యాగరాజు తన కృతుల్ని
జేసుదాసు పాడాలనుకుంటాడు
ఆయన పాడుతూంటే…రాముడు
తాండవం ఆడాలనుకుంటాడు”

-జేసుదాసు గురించి రాసిన కవితలో
…ఇలా, ఒక్కొక్కరి గురించీ చదువుతూ ఉంటే, ఒక్కోచోట అద్భుతంగా అనిపించింది. చాలా చోట్ల బాగుందనిపించింది. ఒక్కోచోట మాత్రం కొంచెం బోరుగా అతి వర్ణనగా అనిపించింది. ఏమైనా, పుస్తకం మాత్రం అప్పుడప్పుడూ తీసి ఒక పేజీ విప్పి చూసి, చదువుకుని ఆనందించడమో, భారంగా నిట్టూర్చడమో (ఎవర్ని గురించి చదివారు అన్న దాన్ని బట్టి) చేయవచ్చు.

పుస్తకాన్ని ఈ-పుస్తకంగా కినిగే.కాం లో అద్దెకు తీసుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు. వివరాలకి ఇక్కడ చూడండి.
Nakshatra Darshanam – Tanikella Bharani

You Might Also Like

4 Comments

  1. sarath

    మీ రివ్యూ బాగుంది సౌమ్యగారు,వెంటనే బుక్ కొని చదవాలనిపిస్తుంది……వేరి వేరి థంక్ యు.

  2. శబ్బాష్ రా శంకరా :నాకు నచ్చిన కొన్ని తత్వాలు | పుస్తకం

    […] శుభదినాన, కినిగె.కాం పుణ్యాన, “నక్షత్ర దర్శనం” చదివిన క్షణం నుండీ భరణి గారంటే […]

  3. devulapalli durgaprasad

    ‘nakshatra darsanaanni makkoodaa chala bagaa cheyincharu. Thanikella bharani teluguthalli medaloni madhura bhavanala maatala moukthikamani.

  4. chavakiran

    మీరు ఎన్నుకున్నవి బాగున్నాయి.
    పాట చాలా చోట్ల పాత గా టైపాటైంది. గమనించగలరు.

Leave a Reply