నడిచే విజ్ఞానసర్వస్వం ఎన్నెస్కే
[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. – పుస్తకం.నెట్]
రోజుకు పదిపేజీలు చదవండి…నాలుగు పేజీలు రాయండి. నాలుగు పేరాలు ఉపయోగపడుతుంది…రేపటికి నాలుగు లైన్లైనా నిలబడుతుంది.
-ఇవి యువతను, సాహిత్యకారులను నిత్యం ప్రోత్సహించే వ్యక్తి వాక్కులు. వెన్నుతట్టడమే కాదు, నిజానికి వారే విజ్ఞానగని, నడిచే విజ్ఞాన సర్వస్వం. వారిని చదువగలిగితే నెల్లూరు జిల్లా చరిత్రను సమగ్రంగా ఆకళింపు చేసుకున్నట్లే. ఆయనే నేలనూతల శ్రీకృష్ణమూర్తి. ఎన్నెస్కేగా నాటి జిల్లావాసులకు సుపరిచితులు. చరిత్రకారులుగా చిరస్మరణీయులు. విక్రమసింహపురి మండల సర్వస్వం గ్రంథం నెల్లూరు చరిత్రకు వారి చిరునామాగా నిలిచింది. ప్రముఖ చరిత్రకారులు ఒంగోలు వెంకటరంగయ్య శిష్యరికం చేసారు. సంస్కృత గ్రంథాలు, నాట్యశాస్త్రాలపై ఆరాధనతో పరిశోధనలపై మక్కువ చూపారు. నాట్యశాస్త్రంలో వారికి ఎంత ఆసక్తో అంతే ప్రాధాన్యత ఇస్తారనేదానికి – ’డాన్స్ స్కల్ప్చర్స్ ఇన్ ఆంధ్ర’ అనే ఆంగ్ల గ్రంథం ఒక తార్కాణం. చారిత్రక అంశాలపై ఉన్న ఆసక్తితో న్యాయవాద వృత్తిని వదిలి 1965లో వీఆర్ కళాశాలలో చరిత్ర అధ్యాపకులుగా చేరారు.
1910 ఏప్రిల్ 10వ తేదీన అప్పటి నెల్లూరు జిల్లాలోని అద్దంకి గ్రామంలో ఆయన జన్మించారు. 1927-29 నెల్లూరు వీఆర్ కళాశాలలో ఇంటర్, 1932 చిదంబరంలోని అన్నామలై యూనవర్సిటీలో బీఏ, 1936 లో మద్రాసు న్యాయకళాశాలలో లా పరీక్షలు పూర్తి చేసి పట్టా పొందారు. త్యాగరాజు నాటకాలను, 1948లో కుమార స్వామి జీవితచరిత్ర, 1963లో విక్రమసింహపురి మండల సర్వస్వాన్ని వెలువరించారు. 1970 లో స్పెసస్ అండ్ ఎసెన్స్ ఆఫ్ సి.ఆర్.రెడ్డి గ్రంథానికి సంపాదకులలో ఒకరిగా, 1976లో వ్యాసరచనల సూచి తయారుచేసి సాహితీవేత్తలకు దిక్సూచిగా నిలిచారు. సుప్రసిద్ధమైన తులసీరామాయణాన్ని తెలుగులోనికి అనువదించారు. 1951-52లో ఉత్తర భారతావని పర్యటించి అక్కడివారికి నెల్లూరు సాహితీ సువాసనలను అందించారు.
Leave a Reply