అగ్నిమాలా, మృత్యులోయా…

దాసరి సుబ్రమణ్యం గారి నవలలు కొన్ని చిన్నప్పుడు తిరుపతెళ్ళినప్పుడల్లా ’చందమామ’ పాత సంచికలు తిరగేస్తున్నప్పుడు చూసేదాన్ని, ఆయన రాసారు అని తెలీకున్నా. కొన్ని చదివిన జ్ఞాపకం ఉంది. అయితే, నేను చందమామలు బాగా ఎంజాయ్ చేస్తూ చదివినదాన్నే ఐనా, ఎవరు ఏది రాస్తున్నారు? వంటివి పట్టించుకున్నదాన్ని కాదు. వరుసగా అన్ని చందమామలూ చదువుకుంటూ పోవడమే! అయితే, ఇటీవలి కాలం లో ’రచన’ శాయి గారు, ఇతరులు కలిసి దా.సు. గారి రచనలని ప్రచురించాలని పూనుకున్నారని తెలిశాక, కుతూహలం కలిగింది. అప్పటిగ్గానీ అర్థంగాలా – రాకాసిలోయ, జ్వాలాద్వీపం, ముగ్గురు మాంత్రికులు, మాయాసరోవరం ఇలాంటివన్నీ ఈయనే రాసారని! పుస్తకావిష్కరణ గురించి తెలిసాక, తరువాత కొన్నాక, ఫైనల్లీ, ’అగ్నిమాల’, ‘మృత్యులోయ’ చదివాను. ఆ పఠనానుభవం, ఈ వ్యాసం. కథను పరిచయం చేయబోవడం లేదు.

చిన్న నవలలే కనుక, ఎక్కువసేపు పట్టలేదు కానీ, ’అగ్నిమాల’ చదువుతున్నప్పుడు నా మామూలు రెండో కాఫీ టైము ఐపోయిందన్న విషయం కూడా తట్టనంతగా మునిగిపోయానందులో. 🙂 ’మృత్యులోయ’ చదువుతున్నప్పుడేమో రాత్రి డిన్నర్ కి పిలిచేదాకా టైం అయిందని గమనించలా 🙂 అప్పుడే ఒక విషయం అర్థమైంది – దా.సు. గారి నవలల విషయంలో పెద్దలైనా పిల్లలే అని. “పిల్లల జానపద నవల” అని రాశారు కానీ, ఎవరండీ పిల్లలు? వయసును బట్టి వీళ్ళు పిల్లలు అని చెప్తామా చెప్పండీ? 🙂 పుస్తకంలోపల ఒక బుక్మార్క్ కూడా ఇచ్చారు కానీ, ఏకబిగిన చదివేస్తాం కదండీ, బుక్మార్కర్ల అవసరమే రాదు. కథనశైలి ఆకట్టుకునేలా ఉంది కనుక, కథలలో కూడా కొంత ’సస్పెన్స్’ ఉంది కనుకా, తక్కిన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోలేదు. ఒకటీ అరా అచ్చుతప్పులున్నాయి కానీ, అవేం పెద్ద అడ్డంకులు కావు. “మృత్యులోయ” లో రకరకాల ఫాంటసీ ప్రపంచాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి.

అగ్నిమాల నవల 1975 లో “యువ” పత్రికలో ధారావాహికగా వచ్చిందట. అలాగే, మృత్యులోయ – బొమ్మరిల్లు ప్రారంభ సంచిక నుండీ దాదాపు మూడేళ్ళు వచ్చిందట, ప్రతి నెలా. పుస్తకాలకి రాసిన ముందుమాటల్లో “రచన”శాయి గారు ఈ ’అగ్నిమాల’, ’మృత్యులోయ’ వీటిలోని అన్ని భాగాలూ అందరూ కలిసి ఎలా సంపాదించారో చెప్పారు. అలాగే, చివర్లో – దాసరి వెంకటరమణ గారు ఈ నవలల గురించి, దా.సు. గారి గురించి, కొన్ని సంగతులు చెప్పారు. ఇవి కాక, “వసుంధర” గారు రాసిన చక్కటి విశ్లేషణాత్మకమైన వ్యాసాలు కూడా ఉన్నాయి. అసలు నవలే ఆపకుండా చదివిస్తుందంటే, దానికి కొసరుగా ఈ మూడు వ్యాసాలూ ప్రతి పుస్తకం వెనుక కథనూ, ముందు కథనూ, లోపలి కథనూ గురించి కథలు చెప్పి అకట్టుకుంటాయి. కథలంటే ఇష్టముండే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చదవాల్సిన పుస్తకాలివి.

పుస్తకాలు చక్కగా, కలర్ఫుల్ అట్టతో అందంగా ఉన్నాయి. లోపలి బొమ్మలు కూడా చాలా బాగున్నాయి..

అగ్నిమాల (పేజీలు: 154, వెల: అరవై రూపాయలు)
మృత్యులోయ (పేజీలు: 312, వెల: నూటా యాభై రూపాయలు)
కానీ, ఇవి రెండూ దాసరి సుబ్రహ్మణ్యం గారి కథలథో కలిసి సెట్టుగానే లభ్యం అనీ, విడిగా కొనేందుకు వీలుపడదనీ విన్నాను. (ప్చ్!)
ప్రతులకు: వాహిని బుక్ ట్రస్ట్, మంచిపుస్తకం, విశాలాంధ్ర, నవోదయ శాఖలను సంప్రదించవచ్చు.

You Might Also Like

One Comment

  1. సుజాత

    మూడూ సెట్ గా కొంటే మీరు దాసు కథలు (సాంఘికం) కూడా తీసుకుని ఉంటారే? అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. “Awesome”! వాటి మీద కూడా రాయండి. వాటికి ఇంత సింపుల్గా రాయలేరు. I bet….!

Leave a Reply