ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కిన్నాళ్ళకు!, సి. రామచంద్రరావు వేలుపిళ్ళై కథాసంకలనం – మళ్ళీ అచ్చులో!

ఈ శనివారం (మార్చ్ 19) మధ్యాహ్నం డోర్‌బెల్ అకస్మాత్తుగా మోగింది. ఎవరా అని చూస్తే పోస్ట్‌మాన్, ఇండియానుంచి వచ్చిన పార్సెల్ ముట్టినట్లు సంతకానికి. ఎక్కడ నుంచి అని చూస్తే – ఆశ్చర్యం: చిన్నగంధం రామచంద్రరావు, నంది నగర్, హైదరాబాద్. అంటే సి. రామచంద్రరావుగారు. హడావిడిగా పార్సెల్ తెరిచిచూస్తే, వేలుపిళ్ళై కొత్త ఎడిషన్, రెండు కొత్త కథలు చేర్చి. ముళ్ళపూడి వెంకటరమణ గారి కొత్త ముందు మాటతో (1-1-11న వ్రాశారు). లోపల రామచంద్రరావుగారి ఆటోగ్రాఫ్. ఆయన ఉదారత్వానికి నా మనసంతా కృతజ్ఞతతో, ఆనందంతో నిండిపోయింది. తొమ్మిదేళ్ళ క్రితం ఒక మధ్యాహ్నం బహుకొద్దిసేపు మాత్రం కలిసిన నన్ను గుర్తు పెట్టుకొని ఇంత ఇదిగా…

నాకూ, చాలామందికీ, బహు ఇష్టులైన తెలుగు కథకుల్లో సి. రామచంద్రరావుగారి స్థానం ప్రత్యేకం. ఇన్ని తక్కువ కథలు వ్రాసి ఇంతమంది మెప్పూ, అభిమానమూ సంపాదించిన రచయితలు తెలుగులో ఇంకెవరూ లేరేమో. ఆయన 1950లలో మొదలుబెట్టి 1960 నాటికి ఏడంటే ఏడే కథలు వ్రాశారు. నేను చదవడం ప్రారంభించేటప్పటికే ఆయన రాయటం మానేశారు. ఆ ఏడు కథలతో వేలుపిళ్ళై అనే సంకలనం 1964లో మొదటిసారి అచ్చయింది. ఆ తరువాత అదే సంపుటం 1991లో రెండవసారి వచ్చింది. మళ్ళీ ఇరవయ్యేళ్ళ తరువాత ఈ ఎడిషన్. దీంట్లో వేలుపిళ్ళైలోని ఏడు కథలతో పాటు ఇంకో రెండు కథలు: 1987లో వ్రాసిన క్లబ్‌నైట్, 2009లో వ్రాసిన కంపెనీ లీజ్ కథలు కూడా ఈ సంపుటంలో ఉన్నాయి.

సి. రామచంద్రరావుగారి కథని నేను మొట్టమొదట చదివింది ఆరో తరగతో ఏడో తరగతో చదువుతున్నప్పుడు. మా ఇంట్లో దేవుడి గదిలో ఒక పుస్తకాల అలమర ఉండేది. దాంట్లో మా చిన్నమామయ్య సేకరించుకొన్న తెలుగు పుస్తకాలు ఉండేవి. వాటిలో కథ-11 పేరుతో (అని గుర్తు) ఒక కథల పుస్తకం ఉండేది. ఈ పుస్తకం బాపు గారు ప్రచురించారని తర్వాత చాలాకాలానికి ఎవరో చెప్పారు. మా మామయ్య పుస్తకం ఏమైందో తెలీదు. ప్రయత్నించినా ఆ పుస్తకం మళ్ళీ దొరకలేదు. దాంట్లో చాలా మంచి కథలు చదివాను. అన్నీ గుర్తు లేవు కాని నాలుగు కథలు ఇప్పటికీ బలంగా గుర్తున్నాయి – కల్యాణ సుందరీ జగన్నాథ్ మాడంత మబ్బు, రావి శాస్త్రి వర్షం, కొకు ఫాలౌట్, సి. రామచంద్రరావు నల్లతోలు. నల్లతోలు కథలో సన్నివేశాలు, కథాస్థలం, పాత్రలు, వారి ప్రవర్తన అంతా నాకు కొత్త. ఆ రోజుల్లో ఆ కథ నాకు సరిగా అర్థమైందని కూడా చెప్పలేను. కానీ ఆ కథలో ఏదో గొప్పతనం ఉందని, చాలా ముఖ్యమైన విషయం చెప్పబడిందని మాత్రం అనిపించింది. ఆ కథ అప్పటినుండీ నా మనసులో నిలిచిపోయింది. 2004లో మేము తెలుగు నాడి పత్రిక ప్రారంభించినప్పుడు, క్లాసిక్ తెలుగు కథలను కొత్త తరం పాఠకులకు పరిచయం చేయడానికి ఉద్దేశించిన అలనాటి కథ శీర్షికలో ప్రచురించిన తొలి కథ నల్లతోలు.

ఐతే, సి.రామచంద్రరావు కథలు ఇంకా ఏమీ కనిపించకపోవడంతో, ఆ రచయిత ఒక మిస్టరీ మాన్‌గా మిగిలిపోయారు. 1970 ప్రాంతాల్లో ఇంటూరు లైబ్రరీలో వేలుపిళ్ళై కథాసంకలనం దొరికితే చదివాను. బుర్ర తిరిగిపోయింది. ఏడు కథలు. ఒకదాని కొకటి సంబంధం లేని ఏడు కథలు. చక్కటి తెలుగు కథలు. మంచి శిల్పమున్న కథలు. మనుషుల్నీ, వారి మనఃప్రవృత్తుల్నీ చక్కగా అధ్యయనం చేసిన కథలు. కనీసం నాలుగు మహగొప్ప కథలు. ఒకటి సరదాకథగా పక్కన పెట్టినా, మిగతా కథలన్నిటినీ మాత్రం మళ్ళీ మళ్ళీ తలచుకోవాల్సిందే. తరచి తరచి ఆలోచించాల్సిందే. ఈ అభిప్రాయాలు నా ఒక్కడివే కాదు. పుస్తకం వెనుక అట్ట (ఈ వ్యాసంతో పాటు ఉంది) మీద ఉటంకించిన చాసో, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, కోడూరి శ్రీరామమూర్తి, ఆదివిష్ణుల అభిప్రాయమూ అదే. లోపల పేజీల్లో నండూరి రామ్మోహనరావు, ముళ్ళపూడి వెంకటరమణలూ అదే మాట చెప్తారు.

రామచంద్రరావు గారి కథల్లో వేలుపిళ్ళై, నల్లతోలు, టెన్నిస్ టూర్నమెంట్ కథలు చాలా కథాసంకలనాల్లో పునర్ముద్రించబడ్డాయి. ఈ మూడు కథల పక్కన ఉండడం వల్ల కాబోలు, ఉద్యోగం కథకు మాత్రం రావలసినంత పేరు లేదని నాకు అనిపిస్తుంది.

ఆ రోజుల్లో ముళ్ళపూడి వెంకటరమణ, సి. రామచంద్రరావుల కథలు ఎప్పుడు వస్తాయా అని ఆంధ్రపత్రిక వీక్లీ కోసం ఎదురు చూసేవాళ్ళమని చికాగో మిత్రుడు ద్రోణంరాజు శ్రీరామకృష్ణ ఒకటి రెండు సార్లు మాటల్లో అన్నారు. అదే మాటని ఈ సంకలనం మొదటి ముద్రణకి ముందు మాట రాసిన నండూరి రామ్మోహనరావుగారూ అన్నారు. 1964లో రాసిన ఈ ముందు మాటని ఒక ప్రశ్నతో ముగించారు నండూరివారు, “ఎందుకు రాయడం లేదు సి.రా.రావు గారూ?”, అంటూ. ఆ ప్రశ్న, రామచంద్రరావుగారి పైన కుతూహలాన్ని ఇంకా పెంచింది.

బహుశా ఆ ప్రశ్నకు జవాబు కాబోలు తానా తెలుగు కథ (1993) సంకలనంలో క్లబ్‌నైట్ పేరుతో కనిపించింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత ఆయన రాసిన కథ. రామచంద్రరావుగారి లాంటి ఒక టీ ఎస్టేట్ ఎక్జిక్యూటివ్, టెన్నిస్ ఆటగాడు, ఒకప్పటి గొప్ప కథారచయిత చాలా ఏళ్ళ తరువాత నండూరి రామ’మోహన’రావు వంటి సంపాదకుణ్ణి ఒక టీ ఎస్టేటులో పార్టీలో కలుసుకొన్నట్టి కథ అది. 1987లో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ముందు వచ్చిందట ఆ కథ. మరి, విశాలాంధ్ర వారు 1991లో వేసిన వేలుపిళ్ళై ఎడిషన్‌లో ఈ కథ ఎందుకు చేర్చలేదో?

కొన్ని నెలల క్రితం స్వాతి వారపత్రిక తిరగవేస్తుంటే సి. రామచంద్రరావు రచయితగా కంపెనీ లీజ్ అనే కథ కనిపించింది. ఆయనేనా, లేక అదే పేరు ఉన్న మరొకరా అని అనుమానిస్తూనే చదవడం మొదలుబెట్టాను. కథ చదివాక, ఆయనే మళ్ళీ ఇన్నాళ్ళకు కథ వ్రాశారు అని తెలిసిపోయింది. రెండురోజుల తర్వాత ఆ విషయం నిర్ధారణ అయ్యింది. అంటే ఈ కథను ఇరవైరెండేళ్ళ విరామం తర్వాత, తన 78వ ఏట వ్రాశారన్న మాట. ఇరవైల్లో ఉండగా రాయటం మొదలుబెట్టిన ఆయన దాదాపు అరవైయేళ్ళలో మొత్తం తొమ్మిది కథలు మాత్రం రాశారన్న మాట. ఐతేనేం, గంగిగోవు పాలు.

ఇప్పుడు వచ్చిన ఎడిషన్లో ఈ రెండు కథలూ చేర్చారు. క్లబ్‌నైట్ కథకు కొన్ని చేర్పులు చేశానని రామచంద్రరావు గారు చెప్పారు. ఇంతకు ముందు సూచనగా చెప్పిన విషయాలు ఇంకొంత స్పష్టంగా చెప్పడానికి అలా చేశారట.

ఈ తొమ్మిది కథల్లో ఆరు కథలకు టీ ఎస్టేట్లు నేపథ్యం. కొన్ని ఆ ఎస్టేట్లలో పై అధికారుల గురించి, మరికొన్ని అక్కడి సామాన్యుల గురించి. ఏ వర్గం గురించి రావుగారు వ్రాసినా అసహజత్వం ధ్వనించదు. వర్ణనలు ఎక్కువగా లేకపోయినా ఆ పరిసరాలు, ఆ మనుషులు స్పష్టంగా కళ్ళకు కడతారు. కథలు అనుకోని మలుపులు తిరిగినా, కథ అయిపోయాక ఆలోచిస్తే అలా జరగడంలో అతిశయోక్తి, ఆశ్చర్యం కనిపించవు. కథ పేరు చూసో లేక కథ మొదలు కొంత చదివో రామచంద్రరావుగారి కథావస్తువు ఏమిటో, కథలో ముఖ్యపాత్రలు ఎవరో, కథ ఎలాటి మలుపులు తిరిగి ఎక్కడ చేరుతుందో చెప్పటం కష్టం. పెద్దగా ఉపన్యాసాలూ, వివరణలూ ఉండకపోయినా, మనుషుల్ని, వాళ్ళ ప్రవర్తనల్లోని సామాన్యాలనీ, వైపరీత్యాల్నీ రచయిత బాగా అర్థం చేసుకొన్నాడని అనిపించటం ఈ కథల ప్రత్యేకత. కథలో కీలక విషయం చెప్పకుండా, రావుగారి కథల్ని పరిచయం చేయటం కష్టం. విషయం ముందే చెప్పేస్తే ఆ కథలు చదివినప్పుడు మీరు పొందాల్సిన ఆనందం మీకు దక్కదు. అంచేత ఈ కథల్ని పూర్తిగా చెప్పకుండానే కొద్దిగా రుచి చూపించటానికి మాత్రం ప్రయత్నిస్తాను.

యాభైయేళ్ళు దాటిన వేలుపిళ్ళై ఒక టీ ఎస్టేటు పెద్దబజారులో కిరాణా కొట్టు నడుపుతుంటాడు.గయ్యాళి భార్యతో చాలాకాలం ఇబ్బందులు పడి, ఆమెను వదుల్చుకొని సెందామరైని చేరతీశాడు వేలుపిళ్ళై. తన చాకచక్యంతో సెందామరై అతని వ్యాపారాన్ని పెంచి, వేలుపిళ్ళై సమస్యలని దూరం చేసి అతన్ని చాలా జాగ్రత్తగా చూసుకొంది. ఉన్నట్టుండి సెందామరై చచ్చిపోతే వేలుపిళ్ళై అన్నపానాలు మానేసి దాదాపు పిచ్చివాడైపోయాడు. అతన్ని ఓదార్చడంకోసం చుట్టుపక్కల వాళ్ళంతా సెందామరైని తక్కువచేసే మాటలు మాట్లాడ్డం మొదలుబెట్టారు. ఆ మాటలకు వేలుపిళ్ళై ఎలా స్పందించాలి? టీ ఎస్టేటు చుట్టూ బతికే సామాన్యుల నేపథ్యంలో ప్రేమకి ఇంకో నిర్వచనం చూపించారు రావుగారు.

నల్లతోలు కథానాయకుడు పేట్ రావు (ప్రతాపరావు). ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొని ఇంగ్లీష్ జెంటిల్మెన్ పద్ధతులన్నిటినీ ఆకళింపు చేసుకొన్నవాడు. అతని మిత్రులు స్టూవార్ట్ దంపతులు క్లబ్‌లో ఇస్తున్న పార్టీకి వెళ్ళాడు. రగ్గర్ టూర్నమెంట్‌ని గెలిచిన వారికి అభినందనగా ఏర్పాటు చేసిన ఆ పార్టీకి ఆహ్వానించబడ్డ ఏకైక ఇండియన్ అతను. ఆ పార్టీకి నల్ల డిన్నర్ జాకెట్ వేసుకొని వెళ్ళటమే సరైన పద్ధతి అని, టీ ఎస్టేట్స్‌లో పనిచేస్తున్న అసలు సిసలు ఆంగ్లేయులకన్నా ఆంగ్లేయుడిలా బతుకుతున్న అతనికి తెలుసు. ప్రొహిబిషన్ రోజులు. క్లబ్‌లో పర్మిట్ ఉన్నవాళ్ళకు మాత్రం అల్కహాల్ సర్వ్ చేసే పార్టీహాల్లో పేట్‌రావుకు పర్మిట్ లేకపోవడం అడ్డు కాదు. రగ్గర్ ఆడే బాచెలర్ కుర్రాళ్ళకి ఆల్కహాల్ బాగా తలకెక్కింది. అల్లరి ఎక్కువయ్యింది. ఆ మత్తులో వాళ్ళకి పార్టీలో కనిపీంచిన ఒకే ఒక్క నల్లవాడు పేట్‌రావుని బయటకు పొమ్మన్నారు. పర్మిట్ లేకుండా నీకిక్కడ ఉండే హక్కులేదు అని అతన్ని బయటకి నెట్టేశారు. పేట్‌రావు ఆక్స్‌ఫర్డ్ చదువూ, ఇంగ్లీషు పెద్దమనిషితనమూ, అతని ఆంగ్ల మిత్రగణమూ అతన్ని ఈ అవమానం నుంచి తప్పించలేకపోయాయి.

టెన్నిస్ టూర్నమెంట్ కథలో ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్ గిరి టెన్నిస్ ఆటను చూసి, అతన్ని ప్రేమించి, తండ్రి మాటని కాదని మరీ, పెళ్ళి చేసుకొంటుంది కమల. ఆస్ఠిపరుడైన తండ్రి ముందు ఆమెతో బంధాలు తెంపేసుకొన్నా, తర్వాత ఆమెతో మళ్ళీ సంబంధం కలుపుకోవడానికి తహతహలాడుతున్నాడు. కమల మాత్రం ఆయన పొడ కూడా గిట్టనివ్వదు. అవసరమైనప్పుడు చూపించలేని ప్రేమ ఇప్పుడు తనకు వద్దని, ఇప్పుడు ముసలితనంలో డబ్బుతో సహవాసాన్ని కొనుక్కొందామనుకొంటున్నాడని తండ్రిని నిందిస్తుంది. గిరి కరూర్ అనే ఊళ్ళో మామూలు ఉద్యోగం చేస్తుంటాడు. అతనికి టెన్నిస్ పిచ్చి ఇంకా వదల్లేదు. పెళ్ళై, ఉద్యోగంలో చేరడం వల్ల నేషనల్ రేంకింగ్ ఉండవలసిన ఆటగాణ్ణి ఇలా మగ్గిపోతున్నానని కొట్టుకులాడుతూ ఉన్నాడు. ఆ ఊళ్ళో అతని ఆట చూసిన మిగతావాళ్ళూ అదే మాట అంటున్నారు. ఉన్నట్టుండి ఒక రోజున కమల అప్పటిదాకా దూరంగా ఉంచిన తండ్రిదగ్గర డబ్బు తీసుకొని, గిరి ఉద్యోగం మానేసి మళ్ళీ టెన్నిస్‌లో కృషిచేసే అవకాశాన్ని కల్పిస్తుంది. అంత ఆత్మాభిమానం కల కమల ఎందుకిలా చేసిందో మనకు మాత్రం తెలిసిన రహస్యం; గిరికి తెలీదు.

ఉద్యోగం కథలో జస్టిస్ జగన్నాథం గారికి కుర్రలాయరు వెంకటరమణలో పైకొచ్చే లక్షణాలు చాలా కనిపిస్తాయి. కిందినుంచి పైకొచ్చిన వెంకటరమణలో ఉన్న దూకుడూ, చొరవా, ఆకలీ లాయరుగా ప్రైవేటుప్రాక్టీసులో  అతని భవిష్యత్తుపై ఆయనకు చాలా నమ్మకాన్ని ఏర్పరచాయి. జడ్జీగారి కూతురు నిర్మల – ఆయనకు అంతగా ఇష్టం లేకపోయినా – వెంకటరమణను కావాలని పెళ్ళి చేసుకొంది. చిత్రంగా, ఇప్పుడు వెంకటరమణ ప్రాక్టీసు మానేసి ఏదైనా ఉద్యోగం చేసుకొంటానంటున్నాడు. ముందు ఆశ్చర్యపడ్డా, జడ్జీగారికి అసలు విషయం అర్థం అయ్యింది. వెంకటరమణ ఇక ప్రాక్టీసుకి పనికిరాడని, ఉద్యోగమే మేలనీ ఆయనా ఒప్పుకొంటారు.

అడవిలో సంచారులుగా జీవించే కాడా జాతి మనిషి కడకరై. అడవిలో తిరిగే ఏనుగులతో అతనికి నేస్తం. ఆ ఏనుగుల్ని అతను ఏనుగులరాయి దగ్గర కలుసుకొని వాటితో ఆడుకొంటూ ఉంటాదు. కొత్త టీ తోటలకు నారు కోసం అడవుల్ని చదును చేసే కార్యక్రమంలో ఏనుగులరాయిని బద్దలు చేస్తారు. దాని వల్ల వచ్చిన పరిణామాల కథ ఏనుగులరాయి.

ఎస్టేట్‌లో అందరూ మంచి కాఫీ పంటలు కావాలని కొలిచే స్థానిక దేవత గాళిదేవరు. మేంగిల్స్ టీ ఎస్టేటు అధిపతి మిస్టర్ మేంగిల్స్ ముచ్చటపడి కట్టించుకొన్న కొత్త బంగళా వంటింటి మురికినీరు గాళిదేవరు గుడి పక్కగా పోవటం అశుభమని ఆ నీటిదారి మళ్ళించమని కూలీలు ఆయన్ని అడిగితే, అప్పటికే కట్టిన సిమెంటు కాలవను పగులకొట్టటానికి నిరాకరిస్తాడు మేంగిల్స్ దొర. అప్పటినుంచి అనేక విచిత్రమైన సంఘటనలు, కష్టాలు ఎదుర్కొంటాడు. చివరికి, ఆ బాధలు పడలేక ఎస్టేట్‌ని చవగ్గా అమ్మేసి ఇంగ్లాండు వెళ్ళిపోతాడు. ఇంతకీ గాళిదేవరుకు అంత మహత్తు ఎలా వచ్చింది అన్నది గాళిదేవరు కథ.

క్లబ్‌లో కష్టపడి లలిత ఫ్యాన్సీ డ్రస్ పార్టీ ఏర్పాటు చేస్తే, పార్టీకి ముందురోజు ఆమెకు భర్త మురళీకి మధ్య కలతలు వచ్చాయి. ఆ భార్యాభర్తలు తిరిగి ఒక్కటైన విధానం ఫ్యాన్సీడ్రస్ పార్టీ కథ.

క్లబ్‌నైట్ కథ గురించి ఇంతకు ముందే కొద్దిగా చెప్పాను. ఒక గొప్ప రచయిత తన రచనలు కొనసాగించకుండా ఉండడానికి ఎలాటి కారణాలు ఉండవచ్చు అన్నది ఈ కథ. సృజనాత్మకత బయటకు వచ్చేది ఒక్క కళల ద్వారానే కాదు కదా.

ఇన్నాళ్ళ తర్వాత రాసిన కంపెనీ లీజ్ కూడా విలక్షణమైన కథే. రాజేష్ ఒక పెద్ద కంపెనీ యజమాని. అతని భార్య సునీత ఇంకో పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఎక్జిక్యూటివ్. వారి ఇంట్లో పనిచేయటానికి రాజేష్ కంపెనీ ఫతీమా అనే మనిషిని పెట్టింది. రాజేష్ ఆమెతో అక్రమసంబంధం పెట్టుకొన్నాడు. ఆ సంగతి తెలిసిన సునీత ఫతీమాను ఇంట్లో పని నుంచి తీసేసింది. భార్యాభర్తలు మళ్ళీ సఖ్యంగా ఉండడానికి ప్రయతిస్తున్నారు. కొన్నాళ్ళకి సునీతకి ఫాతీమా దయనీయస్థితిలో కనిపిస్తుంది. ఇంట్లో పని మానిపించగానే కంపెనీ ఆమె ఉద్యోగం తీసేసిందట. ఫతీమా పట్ల జాలిపడుతుంది సునీత. రాజేష్ కంపెనీ ఆమెకు వేరే ఉద్యోగమివ్వవచ్చు కదా అని ఆమె వాదన. ఆ ప్రయత్నంలో ఆమె వేసిన అడుగులు అనుకోని ముగింపుకి దారి తీస్తాయి.


రావు గారి కథల గురించి, నండూరి రామ్మోహనరావుగారి మాటల్లో:

…ఈ కథావస్తువులన్నీ రచయిత తనకు తెలిసిన, పరిచితమైన జీవితంలోనుంచి ఏరుకుని, పరిశీలించి, భావన చేసి రాసినవే. అందుచేత వీటిలో ఒక నిజాయితీ, వాస్తవికత ఉన్నాయి. కనుకనే, అవి సజీవంగా కదులుతున్నట్లు ఉంటాయి. మనల్ని కదలిస్తాయి. ఈ గుణవిశేషం వల్ల అవి నిస్సందేహంగా గొప్ప కథలే…

ఒకసారి అడిగితే ఆయన చెప్పినట్లు జ్ఞాపకం – మంచి కథావస్తువు దొరికేవరకు, దాని ఎత్తుగడనుంచి ముగింపు వరకు సంవిధానమంతా మనస్సులో స్పష్టంగా రూపు కట్టేవరకు తాను కథ రాయలేనని. ఇది నిజం కావచ్చు. కనుకనే ఈ కథల్లో ఇంత శిల్పం, వైవిధ్యం సాధించారేమోననిపిస్తుంది.

ముళ్ళపూడి వెంకటరమణ గారి ముందుమాట నుంచి:

…ఆంధ్ర సచిత్ర వారపత్రికలో – ఆ గోల్డెన్ పీరియడ్‌లో నండూరివారి సహాయకుడిగా పనిచేసిన నేనూ, రావుగారి కథలకు బొమ్మలు వేసిన బాపూ ఈ కథలు చదివి త్రిల్లైపోయేవాళ్ళం, చెప్పుకుని, తల్చుకుని మురిసిపోయే వాళ్ళం…

…ఇంగ్లీషు, తెలుగు, తమిళ పాత్రల చుట్టూ అల్లిన ఈ కథలు – ఏ దేశంలోనయినా రాణించే కథలు… మాటల వెనుక మనసులను ఎక్స్‌రే తీసి చూపించగల కథలు. అన్‌హెర్డ్ మెలొడీస్ ఆర్ స్వీటర్ స్టిల్ అన్నట్టు – ఆకుచాటుపిందెలా, మబ్బుచాటు వెన్నెలలా, నీడ చాటు నీడలా – ఆయన కథలలో మాట చాటు మాటల అంతరంగ తరంగాలు అపురూప శిల్పాలు.

గంగిగోవు పాలు గంటెడైనను చాలు అని వేమన్న అన్నా – ఈ గోవు పాలు మరిన్ని చేపాలని రావుగారిని కోరుకోందాం.

సి. రామచంద్రరావుగారు 1931లో పుట్టారు. లాయరు. ఊటీప్రాంతాల్లో టీ ఎస్టేట్స్‌లో ఉన్నతాధికారిగా తెల్ల దొరల – నల్ల దొరల మధ్య హాయిగా విహరించారట. ఆయన, ఆయన సోదరులూ మంచి టెన్నిస్ ఆటగాళ్ళు. ప్రస్తుతం ఇండియా జెండా అంతర్జాతీయంగా ఎగురవేస్తున్న ప్రఖ్యాత టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి రామచంద్రరావుగారి తమ్ముడు సి.జి.కె.భూపతి కుమారుడు. (కో.కొ: నేను చూసిన మొదటి టెన్నిస్ మేచ్ – ఏలూరు క్లబ్ టూర్నమెంట్ డబుల్స్ ఫైనల్స్‌లో (1967/68?) – సి.జి.కె. భూపతి గారు ఆడింది. సి.రా.రా గార్ని కలిసినప్పుడు మాటల్లో నేనా సంగతి చెబితే, ఆయన ఆ మేచ్‌లో ఆడిన మిగతా వాళ్ళ పేర్లు – ముప్పయైదేళ్ళ తర్వాత – కరెక్టుగా చెప్పారు).  రావుగారు బాపు-రమణల సినిమా కొకదానికి ప్రొడ్యూసరని కూడా ఎక్కడో చదివినట్లు గుర్తు.

ఉద్యోగ విరమణ చేసిన రావుగారు ఇప్పుడు హైదరాబాదులో ఉంటున్నారు. రోజూ టెన్నిస్, గాల్ఫ్ ఆడుకొంటూ ఉండేవారు కాని ఈ మధ్య టెన్నిస్ ఆడటం మానేశానన్నారు. రచయిత, పోలీసు ఆఫీసరూ సదాశివరావుగార్ని నేను 2002లో హైదరాబాదులో కలిసినప్పుడు రామచంద్రరావుగారు హైదరాబాదులో ఉంటున్నట్లు తెలిసి హడావుడిగా ఆయన్ని కలుసుకోవటానికి అరుణతో కలసి వెళ్ళాను. సన్నగా, పొడుగ్గా, దృఢంగా ఉండి సౌమ్యంగా, మర్యాదగా మాట్లాడుతున్న రామచంద్రరావుగార్ని కలవటం నాకు ఎంతకాలంగానో వెదుకుతున్న అపురూప వస్తువును చూడ్డం, ఎప్పట్నుంచో వేధిస్తున్న మిస్టరీని ఛేదించటం లాంటి అనుభవం. అడిగి మరీ ఆటోగ్రాఫ్ తీసుకొన్నాను. ఆయనతో గడిపింది అరగంటే అయ్యుండచ్చు కానీ నేను బాగా గుర్తు పెట్టుకొన్నాను. ఆయన కూడా గుర్తుంచుకొని ఇలా పుస్తకం పంపుతారని మాత్రం నేను ఊహించలేదు.

ఈ పుస్తకానికి ముఖచిత్రమూ, కథలకు లోపలి బొమ్మలూ బాపుగారు ఈ కథలకు ఒకప్పుడు వేసిన బొమ్మలే.

ఈ వ్యాసంలొ మీకు ఆబ్జెక్టివిటీకంటే హీరో వర్షిప్పే ఎక్కువగా కనిపిస్తే, అది నా బలహీనతేనని నిరభ్యంతరంగా ఒప్పేసుకొంటున్నాను. ఆయన మరిన్ని కథలు రాసి, పత్రికలకు ఇంటర్వ్యూలు గట్రా విరివిగా ఇస్తూ ఉండుంటే ఇంత మోజుండేది కాదేమో మరి.

ఇంకో కొత్తతరం పాఠకులకు రామచంద్రరావు గారి కథలు చదివే అవకాశం కలిగించే ఈ కొత్త ఎడిషన్ రావటం ఆనందకరమైన విషయమే.  విశాలాంధ్రవారు ప్రచురించిన ఈ పుస్తకంలో అచ్చు తప్పులు పుష్కలంగా, మంచిభోజనం మధ్యలో పంటికింద రాళ్ళలా ఉన్నాయి. ఎన్నో మంచి పుస్తకాలను పునర్ముద్రిస్తున్న ఈ ప్రచురణ సంస్థకు, పుస్తకాల పట్ల ఇంకొంత శ్రద్ధ, ముఖ్యంగా తెలుగు తెలిసిన మంచి ప్రూఫ్‌రీడర్, ముద్రణకు వెళ్ళేముందు పుస్తకాన్ని ఆసాంతం చదివే సంపాదకుడూ అత్యవసరమని  నా భావన.

వేలుపిళ్ళై
రెండు కొత్తకథలు చేర్చి

సి. రామచంద్రరావు

ఫిబ్రవరి 2011
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
విజ్ఞాన భవన్, 4-1-435, బ్యాంక్ స్ట్రీట్
హైదరాబాద్ – 01
120 పేజీలు; 55 రూ.

ఆన్లైన్ లో కొనుగోలుకు/అద్దెకు చదివేందుకూ, కినిగే.కాం లో లభ్యం
********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. తానా, ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. పుస్తకంలో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

You Might Also Like

15 Comments

  1. సౌమ్య

    ఫ్యాన్సీ డ్రస్ కథ నాకు అసహజంగా, నాటకీయంగా అనిపించింది.ఎంత మారువేషాలేసినా, అంత గుర్తుపట్టలేనంతగా వేస్కుంటారా మామూలు జనాలు? అందునా, భార్యా, భర్తా ఒకరి ఎదురుగ్గా ఒకరు నిలబడ్డప్పుడు ఆ మాత్రం పోల్చుకోలేరా ఎవరు ఎవరో! అని సందేహం కలిగింది.

  2. సౌమ్య

    ఈ కథలు నిన్నే మొదలుపెట్టాను. మీరన్నట్లు అచ్చుతప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను కినిగె వర్షన్ చదువుతూ ఉండటంతో, వారి పొరపాటేమో అని అనుమానం వచ్చి వారిని అడుగగా, విశాలాంధ్ర వారివే అన్ని టైపోలని అన్నారు. ఈసారి ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే – మాలతి గారి “కథల అత్తయ్య” గారిలో ఇంతకంటే బోలెడు టైపోలు ఉన్నాయి. ఇవి కాక, ఈ మధ్య రచ్చబండ గుంపులో కూడా అన్నారు ఇదే విషయం. విశాలాంధ్ర వాళ్ళు ఇలా ఐపోయారేంటో.

  3. ఈమాట » నల్లతోలు: కథ నచ్చిన కారణం

    […] ముద్రణ జరిగేనాటికి నేను పుట్టలేదు. ఈ సంకలనం మళ్ళీ ఈ మధ్యే ప్రచురించారని తెలిసి […]

  4. ఆర్ ఎం ఉమామహేశ్వరరావు

    సి రామచంద్రరావు గారు నిజంగానే వొక unsung hero . తెలుగు రచయితలకు మాత్రమే తెలిసిన పేరు. జంపాల చౌదరి గారి దగ్గరున్నట్టే నా దగ్గరా పాతికేళ్ళ కిందటి నుంచీ బుజ్జి పుస్తకం వేలుపిళ్ళై వుంది. ఏడు కథలూ ఏడు అద్భుతాలే. కథ, కథనం,శిల్పం .. చెట్టులోనే మిగల పండిన మామిడి పండు లాంటి మాధుర్యం. తెలుగులో అరుదైన కథకుడు ఆయన. చౌదరి గారూ, ఏం పరవాలేదు, సంజాయిషీలు ఇచ్చుకోనవసరం లేదు..నచ్చిన కథను నెత్తిన పెట్టుకోవచ్చు. వేలుపిళ్ళై ను మీరు వొక విమర్శకుడిగా సమీక్షించలేదు. వొక పాఠకుడిగా పరిచయం చేశారు. ఆ పుస్తకాన్ని ప్రేమగా మీరు చేసిన పరిచయం చాలా మంది చదవడానికి ఉపయోగపడుతుంది.

  5. ravikiran

    andhariki namaskaaram,

    Nenu inkaa ee pustakam chadavaledhu. Meeru andharu raasina vishayaalu choosaka, veelunnantha thondaraga chadavaalani anipishu vundhi. manaki enno T.V channels vunna, yeppudu ilanti katha la gurinchi maatram prasthaavicharu. oka vela prasthavinchinaa… yedo gaba gabaa 4 mukkalu yadhaalaapamga vaagestharemo. Vishalaandra ku kruthajnathalu (thappulo voppulo… asalu pusthakaani malli prachurinchaaru, santhosham). maro saariki aa thappulu kooda lekunda choosukovachu. ippatikippudu anthaa ayipoledhani naa bhaavana.
    Meeku andhariki subhakaankshalu, machi pusthakaala gurinchi, ila prasthaavisthunnandhuku.

    andhariki dhanyavaadaalatho…..
    Ravikiran.

  6. పుస్తకం » Blog Archive » వేలుపిళ్ళై కథలు ఎందుకు చదవాలి?

    […] ఒక్కో కథా విషయం గురించి క్లుప్తంగా జంపాల గారు ఈసరికే పుస్తకంలో వ్రాశారు. నేను వాటిని […]

  7. chavakiran

    http://kinige.com/kbook.php?id=142

    the book is now available on Kinige as digital book. Enjoy Folks.

  8. రాఘవ

    ఈసారి హైదరాబాదు వెళ్లినపుడు విశాలాంధ్రవారి వద్ద కొనుక్కోవలసిన పుస్తకాలలో ఇదీ చేర్చేసుకుంటున్నానండీ. 🙂 నెనర్లు.

  9. Jampala Chowdary

    @gaddeswarup:
    రామచంద్రరావు గార్ని టెన్నిస్ విషయం గురించి అడిగాను. రామనాథన్ కృష్ణన్‌తో ఒక ఫైనల్‌లోనూ, కొన్ని సెమీఫైనల్స్‌లో ఆడాను కానీ ఎప్పుడూ గెలవలేదు అన్నారు. (రామనాథన్ కృష్ణన్‌తో రామచంద్రరావుగారు ఏలూరు క్లబ్ టూర్నమెంట్లో ఫైనల్స్ ఆడటం చూశానని ఇంతకుముందొకసారి వేరే సందర్భంలో వేలూరి వెంకటేశ్వరరావుగారు అన్నారు).
    ఆయన టెన్నిస్ ఆట గురించి తెలిసిన ఇతర విషయాలు: ఒకప్పుడు రాష్ట్రంలో నంబర్ 1 రాంకింగ్ ఉన్న టెన్నిస్ ఆటగాడు; చాలా టూర్నమెంట్లు గెలిచారు. జాతీయ స్థాయిలో రాంకింగ్ లెక్కించటానికి సరిపడేటన్ని టూర్నమెంట్లు ఏ సంవత్సరమూ ఆడలేదట. 1956లో దేశంలో మూడు, ఆ లోపు స్థానాల్లో ఉన్న టెన్నిస్ ఆటగాళ్ళందర్నీ కనీసం ఒకసారైనా ఓడించారట. Hassanలో టీ ఎస్టేట్స్‌లో ఉద్యోగానికి వెళ్ళి, కాంపిటీటివ్ టెన్నిస్ మానేసిన ఆరేళ్ళకు, మైసూర్ రాష్ట్రం టీంలో నంబర్ 1 ఆటగాడిగా ఒక అంతర్రాష్ట్ర టూర్నమెంట్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్ తరపున ఆడుతున్న ఎస్.ఎస్. మిశ్రా పైన ఒక రబ్బర్ గెలిచారు. ఆ రోజుల్లో ఉద్యోగం వల్ల మారుమూల ప్రాంతాల్లో ఉంటున్నా, ఏడాది కొకసారి ఒక నెలరోజుల సెలవులో టెన్నిస్ టూర్నమెంట్లలో నేషనల్ రాంకింగ్ ఉన్న ఆటగాళ్ళతో ఆడి గెలిచేవారు. ఈ మధ్యదాకా రోజూ టెన్నిస్ ఆడేవారే కాని ఇప్పుడు మానేశారు.

  10. Jampala Chowdary

    నల్లతోలు కథ గురించి 2001 అక్టోబరులో, 9/11 సంఘటనలు జరిగిన కొన్నాళ్ళకు, రచ్చబండ ఇంటర్నెట్ వేదికలో నేను వ్రాసిన వ్యాసాన్ని మిత్రులొకరు గుర్తు చేశారు: http://groups.yahoo.com/group/racchabanda/message/3971.

  11. gaddeswarup

    It is a puzzle why he did not write more. Possibly lack of hunger and passion unlike SriSri who at some stage shouted in hunger. Even in tennis CRR was talented it seems. When I studied in Loyola College, Madras there were rumours that he defeated Ramanthan Krishnan in a local tournament.

  12. జంపాల చౌదరి

    ఈ కథాసంకలనం గురించి నెమలికన్ను మురళిగారి బ్లాగులో
    http://nemalikannu.blogspot.com/2011/03/blog-post_23.html

    ఆ బ్లాగులోనే ఇంతకు ముందు గాళిదేవరు కథ గురించి
    http://nemalikannu.blogspot.com/2010/11/blog-post_17.html

  13. వేణు

    సి.రామచంద్రరావు గారి ‘వేలుపిళ్ళై’ కథల సంపుటి చాలా కాలం క్రితం చదివాను. ఇప్పుడు పునర్ముద్రణ జరగటం సంతోషకరం. ముఖచిత్రం పాతదే ఉంచినప్పటికీ టైటిల్, రచయిత పేరు ఇప్పుడు ఇచ్చిన తీరు ఆకట్టుకునేలా ఏమీ లేదు. ఈ ముద్రణలోని అచ్చుతప్పుల గురించి రాశారు మీరు. విశాలాంధ్రక్కూడా ఇలాంటి స్థితి వచ్చిందన్నమాట! శ్రద్ధగా ప్రూఫులు చూడలేనపుడు పాత పుస్తకాన్ని యథాతథంగా స్కాన్ చేసి, ఆ కొత్త కథలవరకూ ప్రూఫ్ చేసి చేర్చివుండాల్సింది.

  14. సుజాత

    నిజమా? ఇది నా దగ్గర మాత్రమే ఉందని ఇన్నాళ్ళూ గర్విస్తున్నానే!

    ఈ సంకలనంలోని ఒక్కో కథా తెలుగు కథా సాహిత్యానికి ట్యూషన్ చెప్పేసే కథ! ఆ టీ ఎస్టేట్ల వాతావరణమూ, ఆ మనుషులూ….అడవీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఈ కథలన్నీ జ్యోతి మాసపత్రికలో కూడా ఏళ్ళ క్రితం వేశారు. అప్పుడే నేను “ఏనుగుల రాయి” కథ చదివాను.

    ఇలాంటి గొప్ప రచయితలు ఏ కారణం చేతనైనా రాయడం మానేస్తే పత్రికలు ప్రచురణ కర్తలూ ఎందుకు రాయడం లేదో కనుక్కుని తిరిగి రాస్తూ ఉండమని కోరాలని నా అభిప్రాయం. ఈ సంకలనం ఒకటుందని చాలామంది పుస్తకాల షాపుల వాళ్లకు కూడా తెలీదు కొన్నాళ్ళ క్రితం. ఆయన హైద్రాబాదులోనే ఉన్నారని చల్లని కబురు చెప్పారు, మీకు రుణపడి ఉండాలి నేను. అంతగా నచ్చాయి ఈ కథలు.

    ఈ వ్యాసంలొ మీకు ఆబ్జెక్టివిటీకంటే హీరో వర్షిప్పే ఎక్కువగా కనిపిస్తే, అది నా బలహీనతేనని నిరభ్యంతరంగా ఒప్పేసుకొంటున్నాను______________________________ఆ రచయిత పట్ల నా అభిప్రాయమూ ఇదే కాబట్టి నాకు ఇబ్బంది లేదు:-))

    ఎన్నో మంచి పుస్తకాలను పునర్ముద్రిస్తున్న ఈ ప్రచురణ సంస్థకు, పుస్తకాల పట్ల ఇంకొంత శ్రద్ధ, ముఖ్యంగా తెలుగు తెలిసిన మంచి ప్రూఫ్‌రీడర్, ముద్రణకు వెళ్ళేముందు పుస్తకాన్ని ఆసాంతం చదివే సంపాదకుడూ అత్యవసరమని నా భావన__________________________నా భావన కూడా!

Leave a Reply