‘మో’ నిర్నిద్ర నిషాదం

రాసిన వారు: నరేష్ నున్నా
(ఈ వ్యాసం జులై పదకొండున సాక్షిలో వచ్చిన వ్యాసానికి పూర్తి పాఠం. ఇటీవలే “మో” కవితల సంకలనం “నిషాదం’ కవితా సంపుటికి తనికెళ్ళ భరణి సాహితి పురస్కారం వచ్చిందన్న విషయం అందరికీ తెలిసే ఉంటుంది.
***************************

“The wisdom of a great poet is concealed in his work; but in becoming aware of it, we become ourselves more wise…”

-ఇది ‘ఆన్‌ పొయెట్రీ అండ్‌ పొయెట్స్’ అన్న తన గ్రంథంలో ‘జ్ఞానిగా గెథే’ని దర్శిస్తూ, ఆ జర్మన్‌ మహాకవి గురించి టిఎస్‌ ఎలియట్‌ చేసిన వ్యాఖ్య. ‘మో'(వేగుంట మోహన్‌ప్రసాద్‌) ‘నిషాదం’ చదివాక, గొప్ప కవికున్న జ్ఞానం అతని రచనలో నిక్షిప్తమై ఉంటుందంటూ ఎలియట్‌ వెలిబుచ్చిన పై అభిప్రాయం అక్షరాలా నిజమనిపించింది. అయితే, అది గ్రహించి మరింత జ్ఞానవంతమయ్యే దశకి తెలుగు సాహిత్యలోకం చేరుకుందా అన్నది ప్రశ్నార్థకమే.

నాటి ‘చితి-చింత’ నుంచి నేటి ‘నిషాదం’ వరకూ (తర్వాత కూడా) యాభై ఏళ్లుగా ‘మో’ కవిత్వం రాస్తూనే ఉన్నారు. కవిత్వం రాయడం ‘అభ్యాసం కూసువిద్య’ వంటి కాదని, ప్రతి కవిత తొలి కవితేనని, కవి అంటే కవిత్వాన్నినిరంతరాయంగా ఉత్పత్తి చేసే యంత్రం కాదని చెప్పకనే చెప్పినట్లు కొన్ని ‘అన్‌-మో’ పోయెమ్స్‌ కూడా అప్పుడప్పుడు రాస్తూ, తనలోని అహంకారాన్ని ఆయన ఎప్పటికప్పుడు చెరిపేసుకుంటూనే ఉన్నారు. ఇటువంటి వినమ్ర పరిణామక్రమం ఆంధ్ర సాహితీప్రపంచానికి ఉందా అన్నది కూడా సందేహమే. నిజానికి ‘ప్రగతిశీల’మైన పరిభాషలో చెప్పుకుంటే, అర్థశతాబ్దిగా పారుతున్న ‘మో’ అనే కవితావాహినికి ‘అభివృద్ధి’ ఉన్నట్టు అన్పించదు. ఈ కొత్త సంకలనం ‘నిషాదం’లోని కొన్ని కవితల్ని, అప్పుడెప్పుడో రాసిన కవితల్తో తైపారు వేసి చూడండి:

ఓ ఆనంద క్షణాన (నిషాదం పే.54) – నిరీహ (1968:చితి-చింత):
‘…పియానో మెట్ల మీద
తూనీగేదో వాలినట్లుంది
కొత్త జరీ పట్టుచీర
ఎందుకో గరగరమన్నది
……
ఓ మోదుగు పూసింది
….
పలహారంగా ఉదయమే ఓ గ్లాసుడు
సూర్య నారింజ రసం తాగాను….’

అంటూ నీటిబుడగల్లా గతంలోకి చిట్లిపోతున్న ఒకానొక క్షణాన్ని పట్టి కవిత్వంతో ఫ్రేమ్‌ కడతారు ‘మో’.

‘… వెల్లవేసిన గోడలేమో తెల్లబోతూ ఉంటాయి,విద్యుత్కాంతికి.
మహా అయితే ఏ బల్లో ప్రాకుతూంటుంది గోడమీద

గోడకు తగిలించిన గళ్ల టెరిలిన్‌ చొక్కా మెల్లగా చేతులు కదుల్చుతుంది.

నూనెలా మెరుస్తున్న నల్లని గచ్చు మీద చీమ ఒకటి కాశీయాత్రకి ప్రాకుతూంటుంది…’

అంటూ ఒకానొక ‘నిరీహ’ క్షణాన్ని ఆనాడు పటం కట్టారు.

స్వర్గాదపి (నిషాదం)- జరీ అంచు చొక్కా (1969: చితి-చింత)- నుంచుని చూచే కల (1973: రహస్తంత్రి)

డాలర్ల వేటలో ‘కాని’దేశాలు పట్టి ప్రవాసం వెళ్లిపోయి, మాతృదేశానికి పరాయి అయిపోయిన వారి సొద ఈ కవితల్లో వస్తువు. ‘…….తూర్పు దిశన మా గవాక్షం నుండి ఒక కాంతి రేఖ నను సముద్రాల మీంచి తీసుకెళ్లిపోయింది…’ అంటూ మన ప్రాచ్యసంస్కృతిని సూచించే ‘జరీ అంచు సిల్కు చొక్కా’ తనకు తిరిగి దక్కాలంటే ‘కాలసర్పపు మెడలో వేలాడే హారం’- అంటే విదేశాల్లో పి.హెచ్‌.డి డిగ్రీ- సంపాదించి తిరిగి వెళ్లిపోవాలన్న కాంక్ష ఆనాటి కవితలో ఉంటుంది.
‘…ఏటికీ కోటికీ మా వూరు వెళ్లి మా వంశ వృక్షాన్ని చూస్తే నేనిలా జలదరిస్తాను’ అంటాడు ఒక ప్రవాసుడు ‘నుంచుని చూచే కల’లో.
‘… నా చిన్నప్పుడు వెలిసిన చెరువు గట్టుమీది
రాతికోతి స్వామికి దీపం వెలిగించేందుకు ఎవరూ లేరు
కొబ్బరి ముక్కలు ఎవరూ పెట్టరు

ఆ పచ్చగన్నేరు పూలు భయపెట్టే
బాల్య మృత్యుభీతిలోని సరదా ఇక కలగదు
తడారిన ఒంటితో నల్లని నిగనిగల గేదెలు ఇంటికి వెళ్లవు…’

అన్న ఆ చిన్ననాటి జ్ఞాపకాల తలపోతలో తనని తాను ‘ఎంతో కక్షతో గాని క్షమించుకో’లేడా వలసజీవి (ఆ ఎడ్లు ఏవని ఆ గడ్డామి ఏదని/ ఆ తోటలేవని ఆ చెరువు గట్టున చెట్టు నీడలేవని/ నా గుండె ఎందుకిలా చెరువు చెరువై పోయిందనీ/ ప్రతీ సాయంకాలం కొబ్బరిముక్కలూ బెల్లం పెట్టిన/ ఆ ఆంజనేయ కోతి స్వాముడేడనీ…-ఉలవచారు: సాంధ్యభాష 1999లో కూడా ఇదే పలవరింత).

ఇక ఈనాటి ‘స్వర్గాదపి’లో
‘…వెబ్‌సైటు కొట్టొచ్చినట్టుండి,’ ‘తలనిండా సైబర్‌ వైరస్‌’తో పరాయి దేశం నుంచి తిరిగొచ్చిన కిరాయివాడితో నిష్ఠూరం, ‘ఇంతకీ ఏ విమానంలో దిగావు’ అంటూ. ‘… ఉంటే పెట్టు అరిసెలూ గారెలూ, తిరిగిరాని మన ఎడ్లు, సాయంకాలానికి ఉలవచారు కాద్దాం … ఈ షాంపేన్‌ బుడగల్లోనూ నా కన్నీళ్లు పగుల్తున్నయ్యేవిటి … ఉండిపోనివ్వు నను ఓ క్లుప్త పదంలా ఈ జన్మభూమిలో’అని ఇంటికొచ్చేసిన ప్రవాసాంధ్రుడి క(వి)త ‘స్వర్గాదపి’.

అంచున (పే.52) – అందాక… అందాకా….అన్‌దాక (1976:రహస్తంత్రి):
‘…రొప్పుతున్న జింకడొక్కల్లోకి
ఓ కనుపాప ఊయల ఊగుతోంది
ఊయలే కాల్జారుతుందేమో
లోయల అధో జగత్సరోవరంలోకి…
అంటూ ప్రమోదంకాని ప్రమాదకర ‘ప్రయాణం అనంతవేవీకాదు అంతమే’ అంటారు ‘మో’.

‘…చీకట్లో లాంతరులా
భిక్షుక గాయకుడి ఏక్‌ తారలా
చేతన లోంచి అచేతనలోకి
గీతంలోంచి నిస్సంగీతములోకి
గమనం లోంచి నిర్గమనంలోకి…’
‘అందాక అందాకా అన్‌దాక’ చేసిన ప్రయాణం నాటి ‘రహస్తంత్రి’లో.

…అలానే, వికలాంగాలు (పే.56)ని ఆనాటి కాపలా (1979: రహస్తంత్రి)తో, కవుల భూగోళం (పే.84), ఫెలిన్నీ నడిపించిన గాయాలు (పే.108)లని ఆనాటి ఎక్స్‌ప్రెషనిజమ్‌, ఓ సినిమాలో ఓ ప్రశ్న (1986: రహస్తంత్రి)లతోనూ పోల్చిచూస్తే సారూప్యాలు ఎన్నో. ఇంకా ‘నిషాదం’లో మరికొన్ని కవితలు మరోదారి, వీడ్కోలు గీతం, కృష్ణబిలం, శాంతంగా, ఒక కానుక, మూడు జ్ఞానాలు, ఓ ప్రయాణం ….వంటివి కొత్త పాత గేయాలే, పురానవ గాయాలే. మూగబోయిన ఆకసం, వెలవెలబోయిన తారకాసరసు, పారిపోయిన చంద్రకాంత లలిత లోటస్సులు,దయనీయంగా నీరెండగా ప్రసరిస్తున్న స్నేహసూర్య సజల కరాంగుళీయకాలు, బ్లూ వెన్నెల కిర్మీర కెరటాలు, కాలి కిందబడి కిలకిల నవ్వే స్పటికపుటిసుక, కెవ్వున పెనవేసే ఉప్పటి వెన్నెల, గాలికి విరిగిన వానతీగల ముక్కల గాజులు, అలల తెప్పలపై దోగాడుతూ బంగారు బుగ్గల్తో చొంగగార్చే సూర్యుడు, ఊరు ముంగురులతో ఆడుకునే సముద్రం……వంటి ఎన్నో ఆనాటి కవితాత్మక వ్యక్తీకకరణలు ఈనాటి ‘నిషాదం’ నిండా ఉన్నాయి:

కప్పు సాసరు మీద
ఆవిరవుతున్న కన్నెపొర

రెయిలు పట్టాలమీద వెన్న వెన్నెలి
నీలికెరటాల మీద కోస్తూన్న కత్తి
క్షితిజ రేఖల మీద అతుక్కున్న
కవి కంటినీలాలు
(ఆ కవి- పే.47)

ఒక పువ్వు ప్రసవించింది
కన్న కలలు విన్న అలలు
తటిత్తుని తట్టాయి శిశువు కేక విని
చివరికి ఆ కళ్లు ప్రథమ ప్రేమలో సౌందర్య సర్వమై కామాన్ని మూసేసి
శాశ్వతంగా తల్లిలా తెర్చుకున్నాయి
దేహపు స్ర్తీ చచ్చిపోయింది
ప్రసవ సమయాన
(ప్రాణం – పే.48)


కాలకృష్ణ నీళులపై
దూసిన వెండి ఖడ్గాలు
సూర్యోదయాంతాన బొట్టు చెరిగిన చందమామ
రాగి చెంబులోకి
పాల సూదులు
సువ్వుమంటో…
(క్లుప్తంగా- పే.112)

ఊదా దీపం, ద్రోహి, విద్రోహి, మరోదారి, శ్రీనగర్‌లో, క్లుప్తంగా, రెండు గళాలకొకే హారం, అజ్ఞాతం….వంటివి కవితోత్సవానికి మరికొన్ని ఉదాహరణలు. స్ర్తీ జననాంగంపై రాసిన ‘ప్రాణాయామ’ (పే.110) ‘మో’ మాత్రమే రాయగలిగిన కవిత:
‘అదేరా ఆదారేరా మనవందరం
వందనాలు చేస్తో నడిచి వచ్చిన దారేరా
అంతం అనుకొంటాం అహోబిలమనుకొంటాం
కానీ అదో స్వయం నియంత్రిక మాంత్రిక ద్వారం
మార్గాలన్నీ మూసేసుకొంటోన్న ఈ రాత్రింబావు
మాయలో యంత్రాన్ని చూడకు జీవన మంత్రాన్ని కను
ద్వారపాలిక ద్వార ప్రవేశాన్ని కప్పేసిన నిశాకేశాలు…’

‘మో’ తన పునరపి (1994)లో రెండు పెదాల్ని దర్శించాడు:
‘అర్థశరీరత్వం
ఆ లో పైపెదవీ
ఆ లో లోపెదవీ
ఈశ్వరత్వంలో విచ్చుకుంటూనే
ఆరా తీస్తుంటాయి’.

ఈశ్వరత్వంలోకి విచ్చుకునే రెండు పెదవులు ఆనాడు. ఈనాడు ‘ప్రాణాయామ’లోనూ రెండు పెదాల్ని చూసి, చూపిస్తున్నారు:
‘పోనీ ఇలా చూడు
ఒక నిలువుని
నిట్టనిలువుగా చీలిన దృశ్యాన్ని
పనిగట్టుకు అడ్డంగా చూడు
ఆ రెండు పెదవులే నీవు పలికే రెండు అర్థసత్యాలు’.

స్ర్తీ జననాంగాన్ని ఒక మృదుపుష్పమంటుంది మెక్సికన్‌ కవయిత్రి Rosa Maria Roffiel (Mi vulva es una flor… – Gioconda).. అది చెమ్మ ఉన్న ‘పూవిల్తుని రాజ్యమం’టాడు మన మహాకవి శ్రీశ్రీ. ఎన్నటికీ మానని గాయమని ( wound that never heals up) అని ఎందరో పాటలు కట్టారు. అయితే, అది జీవన మంత్రాన్ని ఉచ్ఛరించే రెండు పెదవులని మరింత పారమార్ధిక సత్యాన్ని చెప్పారే’మో’, ‘ప్రాణాయామ’ కవితలో.

ఒక దీర్ఘ జీవితపు ఆత్మకథనాత్మక కవితా వచనాన్ని నిన్నటి ‘బతికిన క్షణాలు’ (1990)లో కూర్చిన ‘మో’, ఆ ‘బతికిన క్షణాలు’ గ్రంథాసారాన్నంతా ఒక్క కవితలోకి కుదించేసారు ‘చివరాహరిగా’:
అక్షరాద్యవస్థ/ ఉంగా ఉంగా/ వధ్యస్థలం/ ఈలోగా/ ఏలాగానో/ వీడ్ని పట్టుకో/ బడా చోర్‌/ పట్టుకో పట్టుకో/ బాల నేరస్తుడు/ వీడ్ని ముట్టుకో/ దొంగ ఆంగ్ల పద బంధాల్ని/ కడుపున పడ్డపుడే/ వడ్ల గింజలో నువ్వుల గింజ/ ఇంకానా వీడి/ గింజుకోటాలూ/ తెగించుకోటాలూ/ వేడి విద్యుత్తీగ మీద/ తడిపొడి పాదాలు/ పులి నోట్లో వీడి/ సొర బీడీ/ నీటి మీద తైలపు నవ్వు/ దొంగ ఏడుపు దిండు/ లో కళ్ళల్లో నవ్వు చివ్వు/ నటిస్తూన్నట్టు నటిస్తూ/ నాట్య లీనలోలుడు/ సీయూ అంటూనే/ సో నెవర్‌ గాడు/ సోల్జరుడూ కాడు/ ఊంజెరుడూ కాడు/ వీడికి సమాజం/ సహెఊదరం కాదు/ అసహజం అహస్యం కాదు/ అసహాయత్వం అన్యాయం కాదు/ వీడికి సరోజం శిరోజం/ వీడో పంకపు పద్మం/ యౌవనంలో పెరోల్లో/ పారిపోయి దొరికి పోయిన/ వృద్ధ ఖైదీ/ గోళ్ళని రాళ్ళతో కొట్టుకుంటూ.
-ఇక గతంలో ఉన్నట్టే ఏం పాపం, దయాహీన నదులు, విచారణం, రాష్ర్ట కీడుడు వంటి కవితలతో ‘అన్‌-మో’ నిర్వహించిన కొన్ని ‘రిక్కీలు’ కూడా ఉన్నాయి.

అయితే, ఏ చలనశీలతా లేక నిలవనీరులా ఆయన నిన్నా, మొన్నల్లోనే ఉన్నారని అనడమో, లేదా కుత్తుకబంటి అన్పించి భయపెట్టే ఆ ప్రవాహం మోకాలిబంటేనని తేలిక చేయడమూ నా ఉద్దేశం కాదు. వందల సంవత్సరాలుగా మానవ సమాజంలో వచ్చిన మార్పులన్నీ ఒకెత్తు, గత యాభై ఏళ్లుగా వచ్చిన మార్పులు మరొక ఎత్తు. ఇంతటి పెనుమార్పులు జీవితంలో సంభవిస్తుంటే, ‘మో’ కవిత్వం గతంలోనే ఉందనడం అసలే కాదు. ఆయన కవిత్వం గతానుగతికంగా స్థలకాలాల్ని అధిగమించి (అధిగమించడం అంటే విడనాడటం కాదని ‘మో’ ఉవాచే) ప్రవహిస్తోంది. 1960లలో యవ్వనాల మొగదల కార్చిన కన్నీళ్లని, 1990ల నాటి నడివయసులోనూ, ఇప్పుడు 2010లో రాల్చిన కన్నీటి బిందువుల్ని కూడా పోల్చిచూస్తే, కాలానుగుణంగా కళవెలబోయి పల్చబడలేదు సరికదా మరింత సాంద్రమయ్యాయి, భాష సజలమయింది, శైలి మరింత నిశితమయింది, వెరసి రూపం సారమై, సారస్వం మరింత సారవంతమయింది. ఈ రిఫైన్‌మెంట్‌కి ఉదాహరణగా ‘నేను’ (పే.46) చూడండి:

సితార తంత్రుల పైని
చివ్వుమని కుర్షించిన వానని
శతకోటి స్వేద రంధ్రాల పైని
నోళ్ళు విచ్చుకున్న రోమ రంధ్రావయవాల్ని
తన్మయీ తన్వైక్యతలోని
వీర్య వాసనా రూపస్పర్శని
శబ్ద పరాగంలో విచ్చుకున్న
దూదేకుల మబ్బు సాయిబ్బుని
సెజెన్నీ చిత్ర విచిత్ర కల్పనా వర్ణాల్లోకి
దాక్కున్న త్రికోణాల చతురస్ర వృత్తాల్ని
బ్లేక్‌ జబ్బుపడిన గులాబీ
దళిత పంకజదళాల్లోకి ఇరుక్కున్న పురుగుని.

తనకి కవిత్వ రహస్యాలు బోధించిన ఎలియట్‌ పట్ల కృతజ్ఞతతో, విదుల్చుకోలేని వ్యామోహంలో ‘చితి-చింత’, ‘రహస్తంత్రి’ వంటి తొలినాటి కావ్యాల్ని అథోజ్ఞాపికలతో, వ్యాఖ్యానాలతో నింపేశారు ‘మో’. ఎలియట్‌ మాదిరిగా పురాణ ప్రతీకలు, అన్యభాషల కవితాపంక్తులు తన కవితల్లో చొప్పించారాయన. అయితే, అనేక సాహిత్యాలు మధించి అతిశయించిన జ్ఞానప్రకర్షతో ఎలియట్‌ రాసిన ‘ద వేస్ట్‌ల్యాండ్‌’ ఒక కృతక రచన. అది ప్రచురించబడ్డాక, ‘అర్థం’ అద్దాన్నపు అడవిలో తప్పిపోయిందన్నారు విమర్శకులు. ఎలియట్‌ స్వయాన ఇచ్చిన 17 పేజీల ఫుట్‌నోట్లు, వివరణలకి తోడు, జెస్సీ వెస్టన్‌ రాసిన ‘ఫ్రమ్‌ రిచ్యువల్‌ టు రొమాన్స్‌’ అనే కరదీపిక కాకుండా, 30ఏళ్ల పాటు దానిమీద విశ్లేషణలు వచ్చాయి. ఈ అధోజ్ఞాపికలు, అర్థవివరణలే కవిత్వావగాహనకి రాహుకేతువుల అడ్డుపడ్డాయి. మరోపక్క ‘ద వేస్ట్‌లాండ్‌’ గురించి మాట్లాడటమే ఒక ఎడ్యుకేషన్‌ అయింది గానీ, దాన్ని అనుభవించి పలవరించడం జరగలేదు. పటాటోపం పెరిగి కవిత్వం పల్చబడింది. ఒక ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచిందే గానీ, ఒక జీవితానుభవం నుంచి ఒక తపనతో, సహజోద్వేగాలతో సృజించబడిన రచనకాకుండా పోయింది. అయితే, ‘మో’ తొలినాటి కావ్యాలు ‘చితి-చింత’, ‘రహస్తంత్రి’ , ‘ద వేస్ట్‌ లాండ్‌’ వంటి కృతక రచనలు కావు. ‘వేస్ట్‌లాండ్‌’లా అవి చమత్కార వినోదాత్మకమైన రచనలు కావు. స్వీయ జీవితానుభవం నుంచి రేగిన సహజోద్రేకాలకి దక్కిన అక్షరఫలితాలు. వాటిలోనూ ఎల్యూజన్లు ఉంటాయి, ఇతర కావ్యాల స్మృతులూ ఉంటాయి. అన్నింటినీ మించి అధోజ్ఞాపికలుంటాయి. కానీ వాటికి తాళం చెవులు ఇచ్చే ఆతృతలో ‘మో’ తనకు తాను కొంత కీడు చేసుకుంటే, మిగతాది విమర్శకులు పూర్తికానిచ్చారు.

ఇటువంటి అధోజ్ఞాపికలే కవిత్వ రహస్యాలకి మారుతాళాలుగా ‘వేస్ట్‌లాండ్‌’ మీద 30 ఏళ్లు నిర్విరామ శోధన జరిగింది. కానీ తెలుగులో అటువంటి తృష్ణ, శోధనాసక్తి లేకపోవడం వలన 30 ఏళ్ల పాటు ‘మో’ నిర్లక్ష్యానికి గురయ్యారు (తర్వాత ఆయనని తలకెత్తుకున్నారని కాదు). ‘కదిలేది… కదిలించేది పెనునిద్దర వదిలించేది… మునుముందుకు సాగించేది…’ అని నవకవిత నుదుటిన నిర్వచనాల రక్తసిందూరం దిద్దేసిన మూడు దశాబ్దాల తర్వాత, అభ్యుదయ గాలులు ప్రచండంగా వీచి, దిగంబర అకవితా వెల్లువలో ఆంధ్ర సాహితీ ప్రపంచం మెడలోతూ మునిగిపోయి ఉన్నప్పుడు, ఆ మూసల్లో ఒదగని ‘చితి-చింత’తో ప్రవేశించడం వల్ల కూడా ‘మో’ అనాదరణకి గురయ్యారు. ఇక్కడ పేరడాక్స్‌ ఏమిటంటే, ‘మో’ నిర్లక్ష్యానికి గురయ్యారు గానీ, ఆయన కవిత్వాన్ని శైలీగతంగా తెలుగు సాహిత్యం సొంతం చేసుకుంది, దొంగచాటుగా.

‘మో’ కవిత్వం కత్తిరించిన క్రోటన్‌ మొక్కల వరసలాగో, అడితిలో పేర్చిన కట్టెల మోపుల్లానో పొందికగా ఉండదు. పసిపిల్లలు చిందరవందర చేసిన ఇల్లులా, ఆంక్షలకు లొంగని సెలపాటల్లా ఉంటుంది. అదే ఆయన కవితలో మృదు బీభత్స సౌందర్యం. అధోజ్ఞాపికల ఆసరా, అర్థవివరణల సాయం, ప్రపంచ సాహిత్యాల పరిచయం… ఇవేమీ లేకుండానే కవిత మొత్తంగా ఒక భావాన్ని బట్వాడా చేస్తుంది. ఆ భావం ఏ ఇద్దరికీ ఒక్కలా ఉండకపోవచ్చు, సముద్ర ఘోషని ఏ ఇద్దరూ ఒక్కలా అర్థం చేసుకోనట్లు. భావం భవాన్ని దాటి అనుభవమవుతుంటే, టీకాటిప్పణి అనవసరమనే స్థితికి చేరుస్తుంది ‘మో’ కవిత. ఉదాహరణకి, ‘నిషాదం’లో ‘ఉర్దూ-ఆక్షరాలు’, ‘ఇంట్లోంచి ఒంట్లోకి’, ‘ఇక పునర్నిర్మాణం’, ‘లోలాలోలం’, ‘దృశ్యా దృశ్యాలు’… వంటి కవితలు.

శబ్దబ్రహ్మలైన గొప్ప కవులందరికీ ఉన్నట్టే ‘మో’కి కూడా శబ్దలౌల్యం ఉంది. ఎలియట్‌కి మల్లే ఒక అద్భుత కవితా పంక్తి పక్కనే ఏదో నేలబారు పదప్రయోగం చేస్తారు. కవిత వెంట ఒక స్థితిలో, ఒక ట్రాన్స్‌లో వెళ్తుంటే చటుక్కున కటికనేల మీదకి పడదోస్తారు.
‘శీతలాగ్రం మీద
ఉగ్ర రవిబింబ చుంబనం
వెన్నెల సోనపై
సోలిన చంద్ర చుబుకం
ప్రతి పాదమూ ప్రాణప్రదమే
ప్రతి ప్రమిదా
పాద ప్రదీపమే…’

అంటూ, వెంటనే
‘…చెమటచుక్కా
ఐసుముక్కా
అక్కా చెల్లీ
అల్లాబిల్లీ…’
అనేస్తారు (సౌందర్యం-పే.135).
ఎలియట్‌ ‘పొడవు పంట్లాం చివర్లు మడిచి తొడిగితే’, ‘దుఖపు లాగుని తిరగేసి తొడుక్కుంటారు ‘మో’, పదే పదే. ‘మో’కి ‘వస్తువు’ కూడా నెపమే.

‘……కనీలిక ప్రకంపనతో/ వినీల మర్మ మహాబిలాన్ని/ పదార్థ పరపరార్థ/ శక్తి సమూహ వ్యూహాంతర/ పరివర్తితంగా అనంత/ అవిశ్రాంతతలోని/ విశ్రాంతిగా/ పరమ ప్రపంచపు/ చంపూ ఛందస్సుగా/ స్మశాన శోభనరాగంగా/ శిశు ప్రసూన/ ప్రసవ వేదనగా// కుదించిన కాలపు చరిత్రలా/ చించేసిన విశ్వపు ధరిత్రిలా// భగవంతం గాడు/ వలవలా ఏడుస్తాడు’ట.
ఇంతకీ ఎవరూ ఈ భగవంతంగాడు? ‘… ఎలక్ర్టానిక్‌ కుర్చీలో కాస్మిక్‌ చొంగ కార్చే `స్టీఫెన్‌ హాకింగ్‌ గాడ్‌’. అలా భూమి అరల్లో చిక్కి, పొరల్లోకి ఇంకి, జలధార చేసే అంతర్‌ ప్రవాహయానంలా ‘మో’ కవిత వస్తువును వదిలి ప్రవహించిపోతుంది, అనిర్దిష్టపు హోయలతో. అటువంటి స్వీయంప్రకాశితమైన తన కవిత్వానికి తానుకూడా చేజేతులా చేసుకున్న నష్టాన్ని గ్రహించినందుకేనేమో, నిన్నటి ‘సాంధ్యభాష’, నేటి ‘నిషాదం’లలో ఫుట్‌నోట్లు పూర్తిగా పరిహరించారు ‘మో’. గోడకి కొట్టిన మేకులన్నీ లాగేసినా, మచ్చలు మాత్రం అలానే ఉన్నట్టు, ‘మో’ సంక్లిష్ట కవి, అస్పష్టకవి అన్న ముద్రలు పోలేదు. ‘నిషాదం’లో తన కవితా నేపథ్యాన్ని చెప్పుకున్నారాయన. నాటి ‘రహస్తంత్రి’లో కూడా తన చెవిలో కవిత్వ రహస్యాలు ఊదిన కవుల పేర్లు చెప్పారు: జాన్‌డన్‌, విలియం బ్లేక్‌, థామస్‌ హార్డీ, హాప్కిన్స్‌, వాల్టర్‌ డిలామార్‌, ఎలియట్‌, మలార్మే, బాదెలేర్‌, ఇంకా ఎర్నెస్ట్‌ డౌసన్‌. అంతటితో ఆగలేదు. ‘కవుల భూగోళం’ (నిషాదం-అపే.84)లో ఇలా చెప్పు కున్నారు:

‘ఫ్లారెన్స్‌ నను కన్నది/ రవెన్నా నను పెంచింది// క్రీ.పూ.వర్జిల్‌ అన్నకి/ నమస్కరిస్తూ/ క్రీ.త. దాంతే తమ్ముడ్ని/ స్మరిస్తాను/ పాదాభివందనం చేస్తో…’ ఇంకా చాలామందితో చుట్టరికాలు కలిపారు. దాంతో ఆయన పూర్తిగా ఆంధ్రాంగ్లకవి అనుకుంటాం. అదే ముద్ర వేసేస్తాం. కానీ, ఆయన చిన్ననాట మొదట విన్న పాట- ‘మనసులోని మాయా మాపీ రామా/ సర్వమంగళ నామా సీతారామా/ సర్వవినుతా శాంతిదాతా రామా…’ (పునరపి). తర్వాత్తర్వాత విన్నవి – పురందరదాసు కీర్తనలు, త్యాగరాజు పంచరత్నాలు, శంకరుడి సౌందర్యలహరి, బిస్మిల్లాఖాన్‌ షెహనాయి వాద్యం, భీంసేన్‌ జోషి గాంధర్వ గానం. ఆయన ‘వెళ్లిరావాలోసారి’ (పే.144) అనుకున్నది ఎక్కడికంటే, సుదూరంగా… ఏదో ఒక వీధి క్రీడాభిరామం/ వరూధిని వలవల వలపు వల/ కలడు కలండను వాడు కలడో లేడో/ ముక్కు తిమ్మన ముత్యపు ముక్కెర/ వెలలేని వేమన్న ఆటవెలది/ మల్లెపూల మొల్ల పద్యమాల/ కులుకక నడవరో కొమ్మలార/ ఏ హద్దులూ లేని ముద్దుల ఉచిత పణవిపణి/ సారంగ పాణి హొయల కులుకులు/ మువ్వగోపాల సరస సల్లాపాలు/ రారా మాయింటిదాకా నన్న పూరిల్లు/ సీతమ్మకు చేయించిన చింతాకు పతకం! ఇక సమీపగతంలోకి అయితే, మేలిసరముల ముత్యాల సరం/ వీరగంధము తెచ్చిన బరిణె/ పానశాలలో పద్యపు మద్యం/ నా ఇల్లు నా గుండె నమిలిమింగిన పిల్ల/ వెన్నపూసా మనసు కన్నతల్లీ ప్రేమ/ తిరుగులేని విశ్వనరుడు/ కిన్నెరపాట పాడే సుషుమ్న/ మధు స్వప్న శాఖ పల్లకీ బోయీ/ బహుదూరపు బాటసారి బైరాగి/ మరో ప్రపంచపు మహా స్వాప్నికుడు/ అచలా చల జ్వలనుడు/ కోటి రతనాల వీణియ. `వెళ్లిరావాలోసారి’ అన్నారుగానీ, ఆయన ఈ దేశీయతకు దూరమైంది ఎప్పడనీ.

‘ఫోర్‌ క్వార్టెట్స్‌’ అనే ఎలియట్‌ పద్య కావ్యంలోని నాల్గవ ఖండిక ‘లాస్ట్‌ గిడ్డింగ్‌’ ఇలా ముగుస్తుంది:

When the tongues of flames are in-folded
Into crowned knot of fire
And the fire and the rose are one.

అలా నిప్పు , గులాబీ కలగలిసిన సుమకీలలాంటి ‘మో’లో ప్రాక్‌-పశ్చిమాలు, జ్ఞాన కవిత్వాలు కలగలిసిపోయాయి. కొమ్మలు ఏ occidental ఆకాశాల్లోకి బారచాచినా, వేర్లు మాత్రం oriental నేలనే అంటిపెట్టుకున్న ఈ మహావృక్షం నీడన చాలామంది సిద్ధాంతాలకతీతంగా సేదదీరారు తమకి కావాల్సిన మేరకు సంగ్రహించారు. కానీ, ‘ఎవరినుంచి దొంగిలించామో వారిని క్షమించడం కష్టం’ కదా! బహుశా అందుకే తెలుగు ఆధునిక అత్యాధునిక కవిత్వానికి ఇంత కాంట్రిబ్యూట్‌ చేసిన ‘మో’ ఏ చిన్న గుర్తింపు కూడా పొందలేకపోయారు. ప్రపంచ సాహిత్యంలో మహారచయితలైన టాల్‌స్టాయ్‌, జేమ్స్‌ జాయిస్‌, మార్క్‌ట్వెయిన్‌, నబకోవ్‌, జార్జ్‌ లూయిస్‌ బొర్హాస్‌, ఆడెన్‌, రాబర్ట్‌ ఫ్రాస్ట్‌, ఎమిలీ జోలా, ఇబ్సన్‌ తదితరుల సాహిత్యాన్ని కూడా నోబెల్‌ కమిటీ గుర్తించలేదు. రాజకీయాలకి సాహిత్యరంగమేమీ అతీతంకాదని అవార్డులు నిరూపిస్తూనే ఉన్నాయి. అక్కడా, ఇక్కడా కూడా.

**********

స్థూలంగా చెపకోవాలంటే, ‘మో’ కవిత్వం మోనోలాగ్‌లా అన్పించే డైలాగ్‌. అది కవికి-కవిత్వాభిమానైన పాఠకుడికి మధ్య నడిచే ఆత్మీయ సంభాషణ. పక్కవారితో పంచుకోవడానికి వీల్లేని ఆంతరంగికమైన గొడవ. సామాజికంగా దండోరా వేయడానికి కుదరని సొంత వ్యవహారం. అంటే, కాసేపు విప్లవ వినోదాన్నో, విషాద దిగ్ర్భమనో కలిగించి, టైం టేబుల్లో షెడ్యూల్లా పూర్తయి, ఆనక పాఠకుడు తన తొడతొక్కిడి రొటీన్‌లోకి వెళ్లిపోయేలా చేస్తే, ఇక కవి,కవిత్వం మనకి ఒరిగించేదేమిటి? ‘మో’ ఏకాంతంగా పంచుకున్న విషాదం, రోజువారీ ఏడుపులో అలవాటుగా దొర్లిపోయే ఘటన కాదు. కన్నీటి మూలాలు వెదికేందుకు బయిల్దేరిన గౌతముడి తపన వంటిదది. కాబట్టి, శరీరమనే పరిమితి వల్ల ఒంటరిగా, వ్యక్తిగా కన్పిస్తున్న ఈ కవి తన అంతరంగాన్ని దుఖంలో నిండారా ముంచి, ముక్కలు చేసి, వాటినే సంపుటీకరిస్తాడు. అప్పుడు ‘వ్యక్తిగతం’ అంతమవుతుంది. ఆ సంపుటి అందుకున్న ప్రతి ప్రియ పాఠకుడి ద్వారా కవి విశ్వాత్మలో భాగమవుతాడు. కవి సంతకం చేసిన ఆ కాంప్లిమెంటరీ కాపీని అందుకోవాలంటే కవితో ‘సోహం’ అనే (భౌతికమైనది కాని) సాన్నిహిత్యం ఉండాలి. కవిత్వమంటే ఆరాధన, అనుభవం కోసం ఆరాటం, జ్ఞానం పట్ల వినయం ఉండాలి. ఈ లక్షణాలతో ఒక ధ్యానంలా చదవవలసిందే ‘మో’ కవిత్వం (అంత తీరుబడి లేకపోతే ‘మో’ జోలికి వెళ్లకపోవడమే మంచిదేమో).

ఆధునిక ప్రపంచంలోని ఏ మంచి సాహిత్యమూ ఎటువంటి సిద్ధాంతాల రైలుపట్టాలమీద నడిచిందిలేదు. సాహిత్య విశ్లేషణకి, వ్యాఖ్యానానికి సిద్ధాంతాలు, తత్వజ్ఞానం ఉపయోగపడ్డాయేమో గానీ, సాహిత్య సృజనకు కాదు. మార్క్స్‌ సిద్ధాంతాల్ని, ఫ్రాయిడ్‌ విశ్లేషణల్ని అనుసరించి సాహిత్యం రాదు (వచ్చినా, అది సాహిత్యం కాదు). మంచి సాహిత్యానికిమల్లే ‘మో’ కవిత్వానికి కూడా జీవితమే మూలం. అది ఏనాడూ ఏ సిద్ధాంతాల్ని, తత్వాల్నీ అనుసరించలేదు. కానీ అటువంటి ముద్రపడింది ఆయన కవిత్వంమీద. ఆ ప్రిజుడీస్‌ తొలగించుకోడానికి కూడా ధ్యానం వంటి లక్షణమే కావాలి పాఠకలోకానికి. అయితే, ఇంతకాలం ఒక జీవనదిలా ప్రవహించి వస్తున్న ‘మో’ కవిత్వాన్ని ఒక విస్మృత గీతంలా నేటికీ చూస్తున్నందువల్లే తెలుగు సాహిత్యలోకం ఎలియట్‌ పైన చెప్పిన జ్ఞానస్థాయిని అందుకోలేకపోతుందనిపిస్తోంది.

************************
పుస్తకం కినిగె.కాం లో లభ్యం.

You Might Also Like

8 Comments

  1. Bsmkumar

    Mo nannu gurthincharani…naa kosam konchamaina raasarani…matladarani..ippataki cheppukovadamo ..talchukovadamo…
    Oka ghadamaina virakthi…rakthi… samyamana dukkhanni deeraganga lagi pettina parugu… gaminchadam loni alasata naku Mo
    Oka jugupsha …anthalone oka istam..marintha bayam..na patla naku..aayana writings loki vellinappudalla…
    Naresh malli meeru ade thatti leparu…

  2. Bolloju baba

    Wonderful

  3. ఝాన్సీ పాపుదేశి

    Enigmatic! Thank you for such a great write up.

  4. పుస్తకం » Blog Archive » కవి సంధ్య – ‘మో’ కవితా వీక్షణం

    […] 2) నరేష్ నున్నా గారు రాసిన ” ‘మో’ నిర్నిద్ర నిషాదం” […]

  5. పుస్తకం » Blog Archive » అదే “మో” , కానీ …

    […] పుస్తకం.నెట్ లో వచ్చిన వ్యాసం లంకె ఇదిగో. మో ఎవరు? అంటూ అనిల్ అట్లూరి గారు […]

  6. బి.అజయ్ ప్రసాద్

    నిజమే నాటి చితి చింత నుంచి నేటి నిషాదం వరకు మో ఒకడే. తెలుగులో మో కి ఇవ్వతగ్గ అవార్డు ఏముంటుంది. తెలుగులో ఆయనకు వచ్చిన గుర్తింపుచూస్తే నిజంగా ఇదొక దిగులే. అయినా పర్లే. మనకూ ఇలాంటివాడొకడున్నాడని తెలుగువాళ్ళు గర్వపడొచ్చు. నోబెల్ కమిటీ గుర్తించికపోయినా టాల్ స్టాయ్, మార్క్ ట్వైన్ ఖండాంతరాలను దాటిపోయారు. రాజకీయం చేసి గుర్తింపు తెచ్చుకున్నవాళ్ళు పత్తా లేకుండాపోయారు. మనం మో కి ఇవ్వతగ్గ అవార్డు ఏముంటుంది? ఆయన కవిత్వంలో మైమరచి సోహం కావడమో, సంలీనం కావడమో తప్ప-

  7. prasen

    ee pusthakaniki sitaram rasina mumdhu mata meedha sameekshalo prasthavimchalaydemdhuku

  8. mohanramprasad

    Your views are correct about “MO”

Leave a Reply