In to the passionate soul of subcontinental cricket
In to the passionate soul of sub-continental cricket
Emma Levine
Penguin, 1996
బెంగళూరు బ్లాసంస్ లో తిరుగుతూ ఉంటే, ఈ పుస్తకం కనబడ్డది. క్రికెట్ చూడ్డం కంటే, చదవడం పై ఆసక్తి ఎక్కువ ఉండడం మూలాన, కొనుక్కుని, చదవడం మొదలుపెట్టాను. ఇది కూడా క్రికెట్ ఆట గురించే. ఇది కూడా ‘క్రికెటర్ల గురించే. కానీ, ఇది మిగితా క్రికెట్ పుస్తకాల లా కాదు. ఎందుకంటే, ఇక్కడ రాయబడ్డ క్రికెట్ మైదానాలూ, క్రికెట్ ప్లేయర్లూ – సామాన్య జనాలు. ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్, షార్జా, ఆఫ్గన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ రచయిత్రి గల్లీల్లో ఆడే క్రికెట్ కోసం అన్వేషిస్తూ తిరిగి, వారి పరిస్థితులను అర్థం చేసుకుంటూ, క్రికెట్ వారి జీవితాల్లో ఎలాంటి పాత్ర పోషిస్తోందో చెబుతూ రాసిన ట్రావెలాగ్ ఇది.
ట్రావెలాగ్ అని ఎందుకంటున్నానంటే, వస్తువు క్రికెట్టే అయినా కూడా, ఈ పుస్తకంలో చాలా చోట్ల రచయిత్రి అనుభవాలే కనిపిస్తాయి.
ముంబై, డిల్లీ గల్లీలు మొదలుకుని, ఎక్కడో హిమాలయాల్లో ఉన్న ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న చైల్ క్రికెట్ స్టేడియం ను ఎముకలు కొరికే చలిలో చాలా ప్రయాస పడి వెళ్ళి చూసి, ఆపై శ్రీలంకలో గల్లీలు, స్థానిక టోర్నమెంట్లే కాక, తమిళ టైగర్ల జోరు తీవ్రంగా ఉన్న జాఫ్నా ప్రాంతంలోకి కూడా బోలెడన్ని పర్మిషన్లూ గట్రా సంపాదించి వెళ్ళి.. ఇదంతా అయ్యాక, పాకిస్తాన్ వెళ్ళి, అక్కడ కూడా ప్రమాదం అంచుల్లోనే సంచరిస్తూ, సామాన్యుల క్రికెట్ మైదానాలను దర్శించి, ఆఫ్గన్ సరిహద్దుల్నీ దర్శించి – రాసిన వ్యాస సంకలనం ఈ పుస్తకం.
చైల్ మైదానం గురించి చదివి ఆశ్చర్యపడ్డాను. దాదాపు రెండున్నరవేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ మైదానాన్ని అప్పటి పటియాలా రాజు భూపిందర్ సింగ్ 1893లోనే నిర్మించారట. అయితే, ఇక్కడికి చేరేందుకు ఉన్న రవాణా వ్యవస్థ పెద్ద గొప్పదేం కాదు. ఒక పక్క ప్రతికూల వాతావరణం. అంత గొప్ప వసతి సదుపాయాలు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో, వేరే దేశం నుంచి వచ్చి, భాష కూడా తెలీకపోయినా కూడా పట్టుదలగా అనుకున్నది సాధించిన ఎమ్మా కి నమస్కారం. “పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు” అన్న సామెత గుర్తొచ్చింది.
అలాగే, జాఫ్నా, కరాచీ ప్రాంతాల్లో – ప్రమాదాలతో సహజీవనం చేస్తూనే పిల్లలు క్రికెట్ ఆడుకుంటూ పోవడం క్రికెట్ వారి జీవితంతో ఎంతగా పెనవేసుకుపోయిందో చెబుతుంది. అంతేకాదు, మనకి తెలియని ఎన్నో రకాల క్రికెట్టులు, వికెట్లూ, టోర్నమెంట్లూ ఇందులో చూస్తాము. పాకిస్తాన్ లో ఒక చోట మంచాలను బౌండరీ లైన్లుగా గుండ్రంగా పేర్చుకుని ఆడుతున్నప్పుడు ఎమ్మా కెమెరా పట్టేసింది. భారత్లోనే ఒకసారి స్కోరుబోర్డు పైకి కూడా ఎక్కేసి, అక్కడే ఉన్న పనివాళ్ళని భయపెట్టేస్తూ, ‘వ్యూ’ ని ఫొటోలు తీస్తుంది ఎమ్మా. ఇలా సరదాగా అనిపించే అడ్వెంచరస్ కథలు చాలానే ఉన్నాయీ పుస్తకం లో. ఉపఖండంలోని గల్లీ క్రికెట్ గురించి నేనెప్పుడూ చదవలేదు. (గ్రహాం గూచ్ రాసిన పుస్తకంలో దక్షిణాఫ్రికాలోని ప్రాంతీయ క్రికెట్ గురించి కాస్త చదివా కానీ, అది గల్లీ క్రికెట్ కాదు). ఈ పుస్తకం గల్లీ క్రికెట్ ను చూపిస్తూనే, ఇక్కడి ప్రజల జీవితాల్లో క్రికెట్ పాత్రను గురించి చెబుతుంది. ఆ విధంగా చూస్తే, ఇదొక సాంఘిక చిత్రణ కూడా.
శైలి విషయానికొస్తే, అక్కడక్కడా కాస్త బోరు కొట్టింది కానీ, మొత్తంగా చూస్తే, సాఫీగా సాగింది. రెండు మూడు సార్లు చదివినా కూడా బోరు కొట్టని పుస్తకం.
అయితే, ఎక్కడ దొరుకుతుందని నన్ను అడక్కండి. బెంగళూరులో బ్లాసంస్ లో తిరుగుతూ ఉంటే, కనబడ్డది. అన్నట్లు, అక్కడ మంచి క్రికెట్ పుస్తకాలున్నాయ్.
Leave a Reply