కవి సంధ్య – ‘మో’ కవితా వీక్షణం

వేగుంట మోహనప్రసాద్ పేరు మొదట విన్నప్పుడే ఒకింత ఉత్సుకత. మా అమ్మమ్మ వేగుంటవారి ఆడపడుచు. వట్లూరులోనే పుట్టింది. మో లాగానే.

ఆయనతో మొదటి పరిచయం ఏదో కవితాసంకలనంలో (మహాసంకల్పం?) నిరీహ, అనుభూతి కవితలని చదివినప్పుడు. నిరీహ ఎత్తుగడే (అట్లా అని / పెద్ద బాధా ఉండదు) నరాల్ని మెలిపెట్టేసింది. ఆ బాధ ఇప్పటికీ సుళ్ళు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటికీ వదలని తీపు అది. మోహనప్రసాద్ (ఇంతకీ ఆయన మోహనప్రసాదా, మోహన్ ప్రసాదా? ఏమైతేనేం, తను గూడా తన్ని మోగానే మిగుల్చుకొన్నాడు కదా) మనకు వదిలింది ఒక అస్పష్ట దుఃఖాన్ని నిరంతరంగా అనుభవిస్తూ మనల్ని మనం వెతుక్కోవటమే కదా.

చితి-చింత పుస్తకం కొని చదువుకొన్న రోజు ఇంకా గుర్తు. గుంటూరు బ్రాడీపేట సెకండ్ లైన్, సెకండ్ క్రాస్‌రోడ్‌లో అప్పటి మా రూంలో ఒక వేసవి మధ్యాహ్నపు ఉక్కలో ఉక్కిరిబిక్కిరై బరువెక్కిన మనస్సు చెమ్మ ఇంకా గుర్తే. పుస్తకం (మొదటి సంపుటం) అట్ట పై ఎస్.వి.రామారావు గారిది నాలుగురంగుల నైరూప్య చిత్రం (ఈ వ్యాసంతో వేసిన 2000 ప్రచురణపై ఉన్న బొమ్మ కాదు; 1969 ఎడిషన్ బొమ్మ వేరే). ఇప్పటికీ నాకు అనుమానమే ఆ బొమ్మ సరిగ్గా ముద్రించబడిందా, లేక ఒక బ్లాకు కొద్దిగా పక్కకు జరిగిందా అని. ఎప్పుడైనా రామారావుగార్నే అడగాలి.

‘మో’ని నేను మొదటిసారి గుంటూరు నవోదయా పుస్తకాలషాపులో చూశాను. పొడుగ్గా, పొడుగుజుత్తుతో, హుందాగా ఉన్న స్ఫురద్రూపి. ఆయనే వేగుంట మోహనప్రసాద్ అని చెప్పారు నవోదయా రమేష్ గారు ఆయన వెళ్ళిపోయాక. అప్పుడు ఆయన గుంటూరు జెకెసి కళాశాలలో ఆంగ్లోపన్యాసకులు. ఆ తర్వాత హిందూ కాలేజీ/హైస్కూల్ ఆవరణ బహిరంగ రంగస్థలంలో బి.ఆర్.కృష్ణ మాలపల్లి నాటకం వేసినప్పుడు ప్రేక్షకులలో ఆయనా ఉన్నారు. మేం గుంటూర్లో ఫిలింక్లబ్ నడుపుతున్న రోజుల్లో ఆయన కూడా సభ్యుడే. మోహనప్రసాద్‌గారు, సుజాత గారు రెగ్యులర్‌గా సినిమాలకి వస్తుండేవారు. అందంగా తయారై, రొమాన్స్ నవలలోంచి దిగివచ్చిన జంటలా ముచ్చటగా, ఆకర్షణీయంగా, హుందాగా ఉండేవారు. కొంతకాలానికి ఆయన గుంటూరునుంచి (ఉయ్యూరు కాలేజీకి అనుకుంటా) వెళ్ళిపోయారు.

ఇన్నేళ్ళ తర్వాత ఈ మధ్య విజయవాడలో తరచు కలిశారు. పూర్వపు నేవళం లేదు. ఆఖరుసారి కలసింది 2009 జనవరి విజయవాడ పుస్తకప్రదర్శనలో. ద్రవిడ విశ్వవిద్యాలయం వారు కూడా ఓ పుస్తకాల అంగడి పెట్టారు. అక్కడ ఎక్కువగా కవి సీతారాం ఉండేవాడు. సాయంత్రం పూట మో కూడా వచ్చేవారు. ఒక సాయంత్రం పక్కన కూచోపెట్టుకుని విశ్వవిద్యాలయం అనువాదాల ప్రణాళిక ప్రకారం చేసిన పనులు, చేద్దామనుకుంటున్న, భవిష్యత్తులో చెయ్యాల్సిన పనుల గురించి కబుర్లు చెప్పారు. ఆయనతో ఎక్కువసేపు గడిపింది అప్పుడే.

చితి-చింత (1969)
తర్వాత చాలా కాలం పాటు మో పుస్తకాలేవీ అచ్చు కాలేదు. This Tense Time పేర 40 మంది తెలుగు కవుల కవితల ఆంగ్లీకరణ 1981లో వచ్చింది. భారతిలో బతికిన క్షణాలను త్రిపురనేని శ్రీనివాస్ ప్రచురించాడు. 1991లో రహస్తంత్రి అచ్చయ్యింది. తర్వాత పునరపి, పద పారిపోదాం (కె. శివకుమార్‌తో సంయుక్తంగా), సాంధ్య భాష, రచాలనం, నీడలూ జాడలూ వచ్చాయి. గత సంవత్సరమే కొంత విరామం తర్వాత నిషాదం ప్రచురితమైంది. మధ్యలో మిత్రుడు యగళ్ళ రామకృష్ణగారి షష్టిపూర్తి సందర్భంగా కొమ్మలూ రెమ్మలూ సంపుటానికి సంపాదకత్వం వహించారు.

 

మూడు దశాబ్దాలుగా అధ్యాపక వృత్తిలో కొనసాగిన మోహనప్రసాద్ ‘మాస్టారు’ సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఆంగ్లశాఖాధిపతిగా 23 సంవత్సరాలు పనిచేసి జులై 31, 2000న అధ్యాపకవృత్తిని విరమించారు. ఆయన అభిమానుల్లో కొంతమంది ‘కవి సంధ్య’గా ఏర్పడి ఆయన్ని సత్కరించటమే కాక, చితి-చింత, బతికిన క్షణాలు, రహస్తంత్రి పుస్తకాలని పునర్ముద్రించారు. సాంధ్యభాష, కరచాలనం పుస్తకాలను కూడా ఆవిష్కరించారు.

ఆ సందర్భంలో మో అభినందన సంచికగా ప్రచురించిన పుస్తకం కవి సంధ్య – ‘మో’ కవితా వీక్షణం. ఈ పుస్తకంలో మోకు సన్నిహితులైన కోందరు రాసిన కవితలు, వ్యాసాలు, మో పుస్తకాలలో కొన్నిటి ముందు మాటలు, మో కవిత్వం పైన సాహితీకారుల వ్యాసాలు, ఆయన పుస్తకాలపై వచ్చిన సమీక్షలు, పునరపి ఆవిష్కరణ సభ విశేషాలు, మో తో ఇంటర్వ్యూలు, మో రాసినవే రెండు వ్యాసాలు ఉన్నాయి.

ఈ పుస్తకంలో ఉన్న వ్యాసాలు, ఇంటర్వ్యూలు మో సాహిత్యానికి ఒక కరదీపికలా ఉపకరిస్తాయి. ఆయన కవిత్వానికి టీకాతాత్పర్యాలు చెప్పటానికి ఎవరూ సాహసించలేదు కానీ కవిత్వంతో, వచనంతో, శబ్దంతో, లిపితో ఆయన చేస్తున్న విన్యాసాలని ఎలా చూడాలో, ఎలా అర్థం చేసుకోవాలో వివిధ దృక్కోణాల్లోంచి చెప్పారు. మో కవిత్వం చదువుకొని ఇంకొద్దిగా అర్థం చేసుకోవటానికీ, అనుభవించటానికీ కొంతవరకూ ఉపయోగపడే పుస్తకం, నాకు తెలిసి, ఇదొక్కటే.

త్రిపుర, స్మైల్, చినవీరభద్రుడు, గౌస్, రామసూరి, నరేష్ నున్నా, జూలూరు గౌరీశంకర్, మోహనరాంప్రసాద్, నాగభైరవ, ఆరుద్ర రాసిన పద్యాలున్నాయి. రెండ్నిమిషాలు ‘మో’నంగా అంటూ నరేష్‌గారు రాసింది ఆరోజుకు ఎంత సరిపోయిందో కానీ, గతవారం మళ్ళీ మననం చేసుకోదగ్గది.

ఇందులో చాలా వ్యాసాలు ‘మో’ని – ఒకోసారి నిందాస్తుతిగా, అప్పుడప్పుడూ అతి అనిపించేలా – పొగుడుతున్నా, కొన్ని విమర్శలు, సమతూకంలో ఉన్న కొన్ని అంచనాలు ఉన్నాయి. మో మీద వచ్చిన కొన్ని పారడీలు కూడా (శ్రీరమణ వ్రాసిన రెంటితో సహా) ఉన్నాయి.

కొంతమంది మాటల్లో:

‘మో’ని చదవడం వల్ల రెండు ఫలితాలు. అర్థమయితే ఒక నిసర్గ సౌందర్యాన్ని చూస్తామా! కాకుంటే బోలెడంత ఫిలాసఫీ, విమర్శ, సాహిత్య చర్చ మనకు అబ్బుతాయి….మో అంటే ఒకడు. మో అంటే రెండు. రెండు విరుద్ధాలు. పురాణం, ప్రబంధం, తత్వనిర్మాణం. మో కవిత్వ శాస్త్రం అంటే మూడు. నిర్మాణం, వినిర్మాణం, అభౌతిక నిర్మాణం. ఆన్నీ కలిసిన మో అంటే బహుళము…. – డా. వి. చంద్రశేఖరరావు.

ఆధునిక జీవిత నైరాశ్యాన్ని చావుబ్రతుకుల దుష్టభూయిష్ట సంఘర్షణను వీలైనన్ని తక్కువ పదాల్లో కుదించి పెడుతున్నారు. విపులీకరణాన్ని పఠిత భావనాశక్తికి విడచిపెడుతున్నాడు. అలముకుంటున్న చీకట్లలో దిగులుగొల్పే భీభత్సమయదృశ్యాలలో పారవశ్యాన్ని పంచిపెట్టే దివ్యానుభూతులు. అమృతతుల్య మధురక్షణాలు దాగుడుమూతలాడుతూ మిరుమిట్లు గొల్పుతుంటాయి… – రోణంకి అప్పలస్వామి (చితి-చింత ముందుమాట)

ఈ కావ్యం ఆధునిక మానవుని అంతర్‌గ్లానితో శ్రుతి చేయబడింది. కలల క్రీనీడలు తారాట్లాడతాయి. యవనికలు కూరుస్తాయి. మన చూపుల పక్కగా ఏవో ఆకృతులు సాగుతూ భయపెడతాయి.,, వివృత వికృతాంగాలు ప్రతిదారి మలుపునా మన గుండెల్ని గుచ్చుతుంటాయి. … – సోమసుందర్ (బతికిన క్షణాలు సమీక్షిస్తూ)

వచనంలో ఎక్స్పాండెడ్ రియాలిటీ కోసం టెంపొరల్ యాక్సిస్‌లో పిన్నులు గుచ్చుకుంటూ పోయాడు మో. జీవించడం ఎంత బాధాకరమైన అనుభవం. విధ్వంసమవుతున్న బతుకును భరిస్తూ మళ్ళీ అందులోకి ప్రయాణమై వెళ్తుండటం ఎంత అనివార్యం. మో కవిత్వం చదువుకుంటూ భోరున కసిదీరా ఏడవాలనిపిస్తుంది, తర్వాత ఎవరైనా వచ్చి ఆపమన్నదాకా. అక్కడక్కడా గొంతునిండా చిక్కటి బాధ అన్నంముద్ద లాగా అడ్దుపడినట్లుంటుంది…. వాస్తవాన్ని అధివాస్తవికంగా మలుచుకునే ప్రయత్నంలో వచనం విరిగి ముక్కలై ఇట్లా మనముందు దోసిళ్ళలోకి బతికిన క్షణాలుగా వచ్చాయి… భౌతిక, మానసిక ప్రపంచాలకు సమన్వయం సాధించే దారుల్లోంచి, పరుగెట్టిన జీవితంలోంచి రాలిపడ్డాయి. ఒంటరితనంలోంచి, అంతర్ముఖత్వంలోంచి, కలలకళ్ళు పగిలి కారిన క్షణాలివి. అక్షరం నిరక్షరమై ఆ ఖాళీలోంచి ప్రయాణం కట్టిన అవ్యక్తవ్యక్తానుభవాలివి… – యాకూబ్ (బతికిన క్షణాలు సమీక్షిస్తూ)

…ఈ కవిలోని కొన్ని క్షణాలైనా మామూలు మనిషి మనోనేత్రానికి అంతు చిక్కవు. గాయపడిన కాయానికి గాలం వేసి లాక్కెళ్ళుకుపోయే కవితా రసాస్వాద హృదయాలకు మాత్రం ప్రేమలోంచి, వెల్తురులోంచి, కాంతిలోకి లాక్కుపోయి ఆత్మసాక్షాత్కారం చేయిస్తాయి… మనకందని ఊహాసంకేతాల్ని అక్కడక్కడా ఒదులుతుంటాడు. పాశ్చాత్య సాహిత్యపఠనం బొత్తిగా లేకపోతే మో వాక్యాల్లో ఉండే చమత్కారం, వ్యంగ్యం గట్టు తెగిన చెరువులా అయిపోతాం (sic)… – నాళేశ్వరం శంకరం (బతికిన క్షణాలు సమీక్షిస్తూ)

మరి, వేగుంట ఈ సంపుటిలో తన కవిత్వంలో సాధించినదేమిటి? ఒక కొత్త సేద్య విధానం… అంటే కవితా బీజం మొలక ఎత్తకుండా చటుక్కున లేవదీసి వేరే శయ్యపై జల్లి రెండు క్షణాలలో మొలకెత్తించి, మంచిపైరు మీద గాలి కెరటం నడిపించే అస్థిర చిత్రంలా ఒక కవితా భావచిత్రం ముద్రించటం. …రసాయన భూతలంపై, సింథటిక్ బెడ్‌పై ఒక్కొక్కసారి అతితక్కువ నీటిజల్లుతో, తడిగాలితో కవితాబీజాలను చిగురు తొడిగించటం అందరికీ సాధ్యం కాదు. కవితా వస్తు నిర్వహణలో సూక్ష్మ పదార్ధాలను పొదుపైన యాజమాన్య పద్ధతులను వేగుంట అమలులోకి తెచ్చారు. ఇందువల్ల సృజన త్వరగా ఫలదీకరణ పొందింది… కవితామృత సేవనంలో ఆవకాయ పాలుగా రుచిసమృద్ధి కోసం అపరిచిత విషయాలను కలిపి భావతీవ్రతను ఇనుమడింపచేయటం ఈ కవి సాధించిన మరొక విజయం…. విచ్చిన పువ్వుల్లాంటి మాటల్లో ముడుచుకుపోయిన గుడ్ది మొగ్గలాంటి విరిగిన పదాల్లో అపరిచిత స్పర్శకల్గి మోహనప్రసాద్ కవిత్వంలో పాఠకుడికి రససిద్ధి కల్గుతుంది…. – పన్నాల సుబ్రహ్మణ్యభట్టు (రహస్తంత్రి సమీక్షిస్తూ)

ఆద్యంతం వేమో కవిత్వం ఒక అపూర్వసంతృప్తిని కలిగిస్తూనే బెంగల్నీ, దిగుళ్ళనీ మ్రోల నిలుపుతుంది — సోమసుందర్ (రహస్తంత్రి సమీక్షిస్తూ)

ఆయన చదివిన ఆంగ్లాంధ్ర కవుల, రచయితల రచనల్లోంచి సందర్భ వివరణ లేకుండా వాక్యభాగాలను ఏ కొటేషన్లూ లేకుండా దొర్లిస్తాడు. ఇది అనుకరణా కాదు, అనుసరణా కాదు, ప్రభావచోదితమూ కాదు. ఇది ఒక రకమైన భాషా సౌకర్యం. భాషాశాస్త్రంలో దీన్నే భిన్న భాషల మిశ్రమ సందర్భంగా భాషా మిశ్రమం (code mixture) అంటారు… మో విశెషమైన తెలుగు కవిగా అందరికీ తెలుసు. అయితే అంతకన్నా విశిష్టమైన వచన రచయితగా ‘పునరపి’లో కనబడతాడు. మో తెలుగు కవి మాత్రమే కాదు. తెలుగులో సృజనాత్మక వచనరీతుల్లో (creative prose styles) తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న రచయిత. – చేరా (పునరపి సమీక్షిస్తూ)

ఒక స్పష్టమైన కవిత్వపు చట్రంలో మో ఒదగడు… కవిత్వం లాంటి వచనం, వచనం లాంటి కవిత్వం కనిపిస్తాయి పునరపిలో. ఆ రెండిటినీ వేరు చేయటం కష్టం. – పాపినేని శివశంకర్ (పునరపి సమీక్షిస్తూ)

పదాల సమాహారంలో అర్థాన్ని కాక ధ్వనిని వినగలగాలన్న ఎలియట్ ‘ఆడిటరీ ఇమాజినేషన్’కు నూట ముప్పై పేజీల కవిత్వోదాహరణ పునరపి చదువుతున్నంతసేపూ కలలో వున్నట్టు వుంటుంది. కల ఎంతవరకూ జ్ఙప్తికి వుంటుందో మో కవిత్వమూ అంతే. మోకు ముందూ వెనుకా శూన్యం. అతనొక్కడే వాస్తవం. – కొప్పర్తి (పునరపి సమీక్షిస్తూ)

మో కరచాలనం నుండి …
…అర్థం లేని కవిత్వం ఎంత వ్యర్థమో, కేవలం అర్థమే ఉన్న కవిత్వమూ అంత వ్యర్థమే. పదాల అర్థంకంటే కవి దర్శనం, చైతన్యం ముఖ్యమైనవి.
…కేవలం బుద్ధిహీనుడికి మాత్రమే కవిత తన రహస్యాలను తానుగా చెబుతుంది… కవిత్వాన్ని నరాలతో చదువుకోవాలి. కవిత కవిచేత సృష్టించబడిన ప్రకృతి. (వాలెస్ స్టీవెన్స్ నిర్వచనం)
…వస్తుగతమైన కవితలో అనుభూతికి పదాలు చిహ్నాలైతే, ఆత్మగతమైన కవితలో పదాలకు అనుభూతులు చిహ్నాలవుతాయి.
…జనన మరణాలు రెండింటిలోనూ ఒక వేదన ఉంటుంది. ఆ సంఘర్షణే కవిత్వపు చలనశక్తి.

మో కవిత్వమొక దుఃఖాన్వేషణ. దేని గురించి వెతుకులాడుతున్నాడో తనకే తెలీని, అన్వేషించదగినదేదో ఉండే ఉండాలని తాను వెతుకుతున్నాడు. కనుకనే దొరకదగినదేదో ఉందనే ధోరణి మోలో కనిపిస్తుంది – ఎ.ఎ.వి. ప్రసాద్

ఇంకా ఇలా చాలా రాసుకుపోవచ్చు కానీ, ముక్కలుగా విడదీసి కోట్ చేయలేని వ్యాసాలు చాలా ఉన్నాయి ఈ పుస్తకంలో – ముఖ్యంగా చేరా, సీతారాం, చందు సుబ్బారావు, ఆర్ సీతారామారావు వ్రాసినవి. మో రాసిన రెండు వ్యాసాలు, మాట్లాడిన రెండు ఇంటర్వ్యూలు కూడా చదవవలసినవే.

పుస్తకం ముఖచిత్రం (మిగతా మో పుస్తకాల్లాగే) విలక్షణంగా, ఆకర్షణీయంగా ఉంది. పుస్తకం సంపాదకులెవరో చెప్పలేదుకానీ, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వరరావుగారి ప్రస్తావన కనిపించింది ముందుమాటలో. హడావుడిగా తయారు చేసినట్టున్నారు, ముద్రారాక్షసాలు బాగానే ఉన్నాయి.

మో అభిమానులకీ, అర్థం చేసుకుందామనేవారికీ ఉపయుక్తమైన పుస్తకం.

—-
కవి సంధ్య – ‘మో’ కవితా వీక్షణం
జులై 31, 2000 విజయవాడ.
500 ప్రతులే ముద్రించారట; ప్రతులకు అప్పటి మో విజయవాడ చిరునామా ఇచ్చారు. షాపుల్లో దొరుకుతుందన్న నమ్మకం లేదు.
ప్రకటనలు కాకుండా 130 పేజీలు; 100 రూ.

*********************************

‘మో’ పై పుస్తకం.నెట్ లో గతంలో వచ్చిన వ్యాసాలు:

1) చంద్రలత గారు రాసిన “అదే ‘మో’..కానీ…

2) నరేష్ నున్నా గారు రాసిన ” ‘మో’ నిర్నిద్ర నిషాదం

3) తనికెళ్ళ భరణి పురస్కారాన్ని స్వీకరిస్తూ (జూలై 2011) మో ఇచ్చిన ప్రసంగ పాఠం

********************
చికాగో మెడికల్ స్కూల్‌లో సైకియాట్రీ ప్రొఫెసర్ డా. జంపాల చౌదరికి తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు కథాసంపుటానికి సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), ఫౌండేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారంస్ ఇన్ ఇండియా (ఎఫ్.డి.ఆర్.ఐ.), మరికొన్ని సంస్థలలోనూ, కొన్ని తెలుగు ఇంటర్నెట్ వేదికలలోనూ ఉత్సాహంగా పాల్గొంటుంటారు; చాలాకాలంగా తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు. తానా పాలక మండలి (Board of Directors) అధ్యక్షులుగా ఇటీవలే ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. పుస్తకం.నెట్‌లో జంపాల గారి ఇతర రచనలు ఇక్కడ చదవవచ్చు.

********************

You Might Also Like

Leave a Reply