కాలుష్యం అంటని కవి
రాసిన వారు: శిఖామణి
(బొల్లోజు బాబా రచించిన “ఆకుపచ్చని తడిగీతం” కవితా సంపుటికి ప్రముఖ కవి శిఖామణి గారు వ్రాసిన ముందుమాట. ఈ సంకలనంలోని దాదాపు అన్ని కవితలనూ బాబా గారి బ్లాగులో చదువుకొనవచ్చును)
*************
1991 ప్రాంతంలో ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ వారం కవిత శీర్షికలో బొల్లోజు బాబా పేరుతో కవిత చదివి ఆశ్చర్యపోయాను. మన బొల్లోజు బసవలింగం మాస్టారి గారి అబ్బాయి బాబా నా అనే సందేహం కలిగింది. సందేహం లేదు ఆ బాబానే. మా బాబానే. అప్పటికి ఒకటి రెండు సంవత్సరాలకు ముందే ఆంధ్రజ్యోతి వారపత్రికలో ఈ వారం కవిత అనే కొత్త శీర్షిక లో నా కవిత రావాలి అని ఎంతో మంది కవులు అనడం విన్నాను. బాబాతో అదే అన్నాను. ఎవరి ప్రాపకం లేకుండా నీ కవిత ఈ వారం కవితలో వచ్చిందంటే ఇక నీకు తిరుగులేదు, రాసుకో పో అన్నాను. నాకు యానాం మట్టిలో పుట్టిన మరో కవిత్వ వారసుడు దొరికాడు అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. అయితే నా ఆనందాన్ని ఆవిరిచేస్తూ సుమారు దశాబ్ద కాలం పైగా అదృశ్యం అయిపోయాడు. ఇదిగో ఇపుడు ఈ 2009 లో ఒక ఆకుపచ్చని తడిగీతం గా విస్తరించి మనముందు ప్రత్యక్ష్యం అయ్యాడు.
ఈ బాబా ఒఠి బాబా కాదు. ఇతని వెనక సాహిత్య వారసత్వం ఉంది. అది వాళ్ళ నాన్నగారిచ్చిన సంపద. బొల్లోజు బసవలింగం మాస్టారు ఉత్త మాస్టారు కాదు. ఆయనకు తెలుగుతో పాటు, సంస్కృతం, ఆంగ్లం, ఫ్రెంచి భాషా సాహిత్యాలలో మంచి అభినివేశం ఉంది. “సువర్ణశ్రీ” పేరుతో ఆయన రచనలు చేసారు. ఆయన రాసిన సాంఘిక ప్రభోదాత్మక నాటకం “నేటి విద్యార్ధి” మా కాలేజీ రోజుల్లో విద్యార్ధులు విజయవంతంగా ప్రదర్శించేవారు. “ఆనందరంగరాట్ఛందం” గురించి కొంత పరిశ్రమ చేసారు. విద్యార్ధినాయకునిగా ఫ్రెంచి పాలననుండి యానాం విమోచనోద్యమంలో చురుకైన పాత్రపోషించారు. అలాంటి సాహిత్య, సాంస్కృతిక వారసత్వం నుండి కవిగా ఎదిగొచ్చిన వాడు బొల్లోజు బాబా.
ఈ తడిగీతంలోకి విస్తరించుకొంటూ లోపలికెల్తుంటే ఎందుకో నాకు 70 ల నాటి ఇంద్రగంటి శ్రీకాంతశర్మగారి అనుభూతిగీతాలు, దానికి అజంతా రాసిన ముందుమాటా గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఈ పద్యాలు చదువుతుంటే బాబా కల్మషం అంటని కవిలా గోచరిస్తున్నాడు.
హేమంతోత్తరీయాన్ని కప్పుకొన్న వనం
ఆకుల కొనల వేలాడే
మంచుబిందువుల భారాన్ని
మోయలేక అలసిపోతోంది.
అంటూ మొదలయ్యే ‘వెన్నెల నావ’ ప్రయాణం అంతరంగపు లోతుల గుండా ప్రయాణించి మనల్ని అనుభూతి శిఖరం మీద కూచోపెడుతుంది. వాన కురవడానికి కవి ఊహించిన కారణం ప్రకృతి తన్మయీభావాన్ని ప్రకటిస్తుంది.
మేఘాలూ నేలా
రాత్రి చుంబించుకొన్నట్లున్నాయి
తెల్లవార్లూ వాన కురుస్తూనే ఉంది //
సూర్యకిరణాల కిలకిలారావానికి
లిట్మస్ పేపర్ లా ఆకాశం రంగుమారింది.
ఈ పంక్తులు కవిలోని రసాయినిక చర్యను మనకు పట్టి ఇస్తాయి. మొత్తం పర్యవసానం కవి ఆలపించే ప్రాచీన గీతానికి కాన్వాసును సిద్దం చేయటమే!
తడిసిన సీతాకోక చిలుక
కవిత్వంపై వాలి రెక్కల్లల్లార్చింది.
అనడం ద్వారా ఒక రసార్థ్ర చిత్త హృదయాన్ని కవి పాఠకుని ముందు పరిచాడు. ముగింపు వాక్యాలు చదివాక పఠితల్లో ఒక కొత్త మనో ద్వారం తెరుచుకుంటుంది. అక్కడ్నుంచి అంతర్గత సంభాషణ మొదలౌతుంది.
ఒంటరి దీవిలో ఉన్న కవి ఒక సమూహం అంత శక్తిమంతుడు. సమూహంలో సంచరిస్తున్నా కవి అపరిచితుడు, ఒంటరికూడా! దీనికి కృష్ణశాస్త్రి సహపంక్తిలోని వాడు బాబా, లేకపోతే-
అపరిచిత ప్రపంచంలో బతకటం అంటే
మబ్బుల మధ్య గుంపును కోల్పోయిన
కొంగపిల్ల తుమ్మచెట్టుకు గాయమై
వేలాడడమే!
అని వ్రాయగలిగే వాడు కాదు. జ్ఞాపకం మానవజీవితాన్ని సౌందర్య విషాదాలలో ముంచితేల్చే అమృత గుళిక. జ్ఞాపకాలు లేనివాడు ముందు మనిషెట్లా అవుతాడు? అసలు కవెట్లా అవుతాడు. బాబా జ్ఞాపకం గురించి మూడు మధురమైన కవితలు రాసాడు. ఈ కవితలు చదివితే నల్లగేటు నందివర్ధనం చెట్టులో నేను రాసుకొన్న “ఎందుకొస్తావే జ్ఞాపకానికి మీరా” కవిత గుర్తుకొచ్చి హృదయం చెమ్మగిల్లింది.
1. రాత్రయితే చాలు
ఋతువుతప్పని/వలస పక్షుల్లా
నీ జ్ఞాపకాలు/హృదయంపై వాలతాయి.
2. ఏకాంత సాయింకాలపు పలుచని వెలుతురులో
హృదయంలో విరిసిన సన్నజాజుల గానంలా
ఓ జ్ఞాపకం హాయిగా సలుపుతుంది.
౩. ఆల్చిప్ప కన్నుతో/మామిడి చెక్కు ఒలిచినట్లుగా
జ్ఞాపకాల ఒక్కోపొరనీ/ఒలుచుకుంటూ పోతే
చివరకు ఒక స్ఫటిక సదృశ/కన్నీటి బిందువు మిగిలింది.
ఈ పంక్తుల్లోని ‘రుతువు తప్పని’ మాట జ్ఞాపకం అనివార్యతనీ, ‘హాయిగా సలపటం’ జ్ఞాపకం యొక్క స్వభావాన్ని, చర్యనీ, స్ఫటిక సదృశ పదంతో దాని నిర్మలత్వాన్ని కవి ధ్వనిస్తున్నాడు.
భారతీయ సంస్కృతిలో ‘గురు’ సంస్కృతికి ఎంతో ఉన్నత స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులకిచ్చి గౌరవించిన సంస్కార సంపద మనది. శిష్యుల్ని అభిమానించి ప్రేమించే తత్వంలోని మాధుర్యగుణం అనుభవపూర్వకంగా తెలుసుకోవలసిందే! అలాంటి అనుభవం నుండి రాసిన ‘సార్ గారండీ! సార్ గారండీ!’
వాని ఆలోచనల చురకత్తులు
పదును పెట్టుకోవటానికి
నా మెదడును సానరాయిని చేస్తాను.
నిజమైన గురువు చేయవలసింది అదే! అలాంటి శిష్యులనుండి ‘బాగున్నారా మాస్టారూ’ అన్న పలకరింపు కన్నా ఇంకేం కావాలీ జీవితానికి అంటాడు.
గురువు తరువాత అంతటి ప్రభావాన్ని చూపగలది పుస్తకమే! పుస్తకం చీకటిగదిలో దీపంలాంటిది అన్నాడు డా. బి.ఆర్. అంబేద్కర్. పుస్తకాన్ని చదవడంలోని అనిర్వచనీయమైన ఆనందాన్ని ‘పుస్తకంలోకి నడవటమంటే’ అనే కవితలో బాబా ఒడిసిపట్టుకొన్నాడు
ఎప్పుడో, ఎక్కడో ఎవరో ఒకరు/ ఆ పుస్తకాన్ని తెరుస్తాడు
ఒక జీవనది వాని గుండెల్లోకి/ప్రవహించటం మొదలౌతుంది.
జీవనది ఆర్థ్రతకు, కదలికకు, చైతన్యానికి ప్రతీక. చలం అన్నట్టు ఈ పుస్తకాలు పటమల్లె గోడకి వేళాడేవి కావు. మంచికో చెడ్డకో జీవితాల్ని ప్రభావితం చేసేవి. ఉత్తమ పాఠకుడు కాగలిగిన వాడే ‘ఉత్తమ కవీ కాగలడు’ బాబా ఉత్తమ పాఠకుడని ఇలాంటి కవితలు సాక్ష్యమిస్తాయి.
ఈ సంపుటికి మకుటాయమానమైన కవిత ‘యూజర్ నేమ్:మనిషి – పాస్ వర్డ్:మానవత్వం’ కవిత. ఆధునిక టెక్నాలజీలో వచ్చిన సాంకేతిక పరిభాషను మనుషులు మర్చిపోతున్న మానవత్వానికి అన్వయించి రాసిన గొప్ప కవిత ఇది – అభివ్యక్తిలోనూ కొత్తదారులు తొక్కిన కవిత. కవిత అంతా చదివాక గొప్ప అనుకంపం మనసునిండా శరీరం నిండా ఆవరిస్తుంది. శక్తివంతమైన లక్షల మెగావాట్ల హైపర్ టర్బైన్లతో శరీరంలోని రక్తాన్నంతా బయటకు తోడిపోసిన ఒక డొల్లతనం భయపెడుతుంది. ఇంతాచేసి మనిషి ఇంతేనా అనిపిస్తుంది. ఈ వాక్యాలు చదవండి ఎంత భయపెడుతున్నాయో!
జీవితం ఫోల్డర్ లోని శాంతి అనే ఫైలు
ఎంత ప్రయత్నించినా తెరుచుకోవటంలేదు.
దేవుడా! దయచేసి నా పాస్ వర్డ్
రిట్రీవ్ చేసి పెట్టవూ?
ఈ నూతిలో గొంతుకను మనందరం వినితీరవలసిన అగత్యం ఎంతైనా ఉంది.
ఇంతటీ స్వచ్ఛకవినీ ఇస్మాయిల్ గారు అన్నట్లు ‘బాధించే లోకపు ముల్లు’ బాధిస్తూనే ఉంది. ప్రాచీన గ్రామీణ భారతం నుండి, ఆధునిక గ్లోబల్ విలేజ్ వరకూ ఈ దేశ మూల వాసుల్ని ‘మీరేవుట్లూ’ అని శూలంతో ప్రశ్నిస్తూనే ఉంది. అనివార్య సామాజిక సంఘర్షణలో కవి దానికి సమాధానం చెప్పుకోవడం ‘బి.సి. అంటే ఎవరు నాన్నా’ కవితలో చూడవచ్చు. సంపదను ఉత్పత్తి చేసే కులవృత్తుల పతనం తరువాత స్మశానంలా తీసుకోవటమే కానీ ఇవ్వటం తెలీని ఈ సమాజానికి తరతరాలుగా సంపదను అందిస్తున్న ఈ జీవిని ఎలా నిర్వచించాలి? అని మధన పడతాడు. పుట్టి పెరిగిన ఇంటిని చాలా ఏళ్ళ తర్వాత చూసినపుడు కలిగిన బాధ, లేని నాన్న టేబుల్ మీద వదిలి వెళ్ళిపోయిన చేతిగడియారాన్ని చూసినప్పుడు పడ్డ సంవేదన కవితాకృతులు దాల్చాయి.
ఆధునిక జీవనం – సిక్స్ పాక్ హృదయం, యూజర్ నేమ్, క్లోన్డ్ సంతతి, వినైల్ ప్రింట్లు, డిజిటల్ దినాలు వంటి అత్యాధునిక పరిభాషను అందించినా ఈ కవి మూలాలు పల్లె పట్టుల్లోనే ఉన్నాయని కొన్ని కవితల్లోని పద సంపద తెలియచెప్తుంది. విత్తనాలకై ఎండబెట్టిన బీరకాయ, ఆల్చిప్పకన్ను, గాలిమొమ్ము, కట్రాట, మట్తుపైని అణుగుకోడి, వరికంకుల కుంచె, పూడికతీయని బావి, ఎద్దుకు కొట్టే నాడాలు, చూరు అంచులు ఇవన్నీ నేటి నవనాగరీకుని అనుభవంలోకి రాని వస్తు సామాగ్రి.
ఇస్మాయిల్ గారి కవిత్వాన్ని ఇష్టంగ, కంఠదగ్నంగా చదూకొన్న ఈ కవి ఇస్మాయిల్ గారు పనిచేసిన పిఠాపురం మహరాజు వారి కాలేజీలో ఉద్యోగించటం యాదృచ్ఛికమే అయినా ఇక్కడ కూడా ముఖ్యంగా లఘ్హు కవితల్లో ఇస్మాయిల్ గారు తొంగిచూడటం – మొదటి సంపుటి కనుక ఆహ్వానించదగ్గదే! దశాబ్దం విరామం తర్వాత కవిగా ముందుకొస్తున్న బాబాకు నా కవిత్వాలింగన.
శిఖామణి
కవి, విమర్శకుడు
ప్రొఫసర్, తెలుగు యూనివర్సిటీ, హైదరాబాద్.
**********
ఈ పుస్తకం పై పుస్తకం.నెట్ లో శ్రీనిక గారు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి.
బొల్లోజు బాబా గారు పుస్తకం.నెట్ లో రాసిన వ్యాసలనూ, ఆయన రచనలపై వచ్చిన వ్యాసాలనూ – ఇక్కడ చదవొచ్చు.
కెక్యూబ్ వర్మ
శిఖామణి గారు సమీక్షించడం బాబా గారి అదృష్టం.. ఇంత ప్రేమగా కాలుష్యం అంటని కవిగా పచ్చదనాన్ని పలవరింపజేసే కవిత్వాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు..
ఉష
ముందు మాట పై:
“సాహిత్య, సాంస్కృతిక వారసత్వం నుండి కవిగా ఎదిగొచ్చిన వాడు బొల్లోజు బాబా.”
“ఉత్తమ పాఠకుడు కాగలిగిన వాడే ‘ఉత్తమ కవీ కాగలడు’ బాబా ఉత్తమ పాఠకుడని ఇలాంటి కవితలు సాక్ష్యమిస్తాయి.”
బాబా గారు శిఖామణి గారికి చిరకాల పరిచితులు. అదీకాక, బాబా గారి తండ్రి తోనూ సాన్నిహిత్యం ఉంది. కనుకా ఆయన్ని గూర్చి చెప్పిన ఆ పైన వాక్యాలు బాబా గారిలోని కవిని, పాఠకుడినీ మన ముందు పెడతాయి. మిగిలిన భాగం ఈ పుస్తకం లో కవిత్వపు తొనలొకటొకటిగా రుచి చూపిస్తుంది. కానీ, ఎక్కడా కాస్త విమర్శ కనపడక, ఆ దినుసూ పడిఉంటే ఇంకాస్త సంపూర్ణం అయేదేమో అనిపించింది.
పుస్తకం పై + బాబా గారితో స్వానుభవాలు:
దాదాపు పదిహేను నెలల క్రితం “ఆకుపచ్చని తడిగీతం – పుస్తకావిష్కరణ” అంటూ బాబా గారు ఈ వివరాలు పంచినపుడు ఎంతగానో సంతోషించిన వారిలో నేనూ ఒకరిని. ఈ పుస్తకాన్ని అప్పుడే చదివిన తొలి విడత పాఠకుల్లో ఒకరిని.
శిఖామణి గారు బాబాగారి బ్లాగు ఆయన చూసినట్టుగా లేరు. బాబా గారితో నా పరిచయం బ్లాగు ముఖంగానే. ఆయన కవితలకు పాఠకురాలినే కాదు నా చిరు రచనలకు ఆయన అభిప్రాయాలూ, విమర్శలూ అందుకున్నదాన్ని. ఈ సంపుటికి మునుపే ఆయన బ్లాగు ద్వారాగా తన రచనలు చదివి, మరి కొందరికి నాకు నచ్చిన కవితల్ని పంచాను. అందులో కొన్ని మచ్చుక్కి…
40. అంతరించిపోతున్న పిచ్చుకలపై
ఇంటి చూరుకు వేలాడదీసిన
వరి కంకుల కుంచె ఓ నక్షత్రమై
నీకు ప్రేమగా స్వాగతం పలికేది.
.
నువ్వు వస్తావని, గుడిలో శఠగోపమంత
అందంగా పేనిన వరికంకుల కుంచె
ఇంటి స్లాబ్ ఇనుప కొక్కానికి
కాశీ ఆవు ఐదో కాలులా వేలాడుతూ
మమ్ములను వెక్కిరిస్తూంది.
43. సంవత్సరీకాలు
కాలం ఎంత చిత్రమైనది!
నీవులేవన్న వాస్తవం
ఎంత నిశ్శబ్దంగా అదృశ్యమైంది.
54. స్ట్రీట్ చీమలు
ఈ కవితపై జరిగిన మా చర్చలో “భౌతిక మైన మార్పుకు ముందుగా మానసికమైన వాతావరణం ఏర్పడాలి.” అన్న బాబాగారి మాట ఇంకా గుర్తే.
కొన్నిరోజుల తరువాత
సూర్యుని వెనుకే ఉదయించిన
మీసాలింకా రాని స్వరమొకటి ఇలా అరుస్తోంది
59. పులసా! పులసా!
* ఈ కవిత బాబా గారు నేను సంకల్పించిన సంకలనానికి తొలిసారి ఇవ్వటం నా భాగ్యం.
“పుస్తెలు తాకట్టు పెట్టైనా పులసను తినాలి”
అంటూండే మా అనాగరీక తాత
ఇపుడైతే
“పుస్తెలమ్మైనా పులసను కాపాడండర్రా”
అనే వాడేమో.
ఇలా రాస్తూపోతే అసలు మాట కన్నా పెద్దది అవుతుంది. 🙂 కనుకా… ఇక్కడ ఆపుతూ…చివరిగా వో మాట.
బాబా గారిలోని ఉత్తమ పాఠకుడు, సాహిత్యాభిమానిని గూర్చి తెలుసుకోవాలంటే ఆయన విమర్శ+కవిత http://maruvam.blogspot.com/2009/04/blog-post_16.html, ఆయన కోట్ చేసిన కవిత http://maruvam.blogspot.com/2010/07/blog-post_14.html (వేరొక లింక్స్ లేక నా బ్లాగువే ఇవ్వాల్సి వచ్చింది, వ్యాఖ్యల వరకే వీటి రిఫరన్స్.)