వేలుపిళ్ళై కథలు ఎందుకు చదవాలి?

ఎందుకు చదవాలని నాకు అనిపించిందో చెప్పేముందు కొత్తవారి కోసం, వేలుపిళ్ళై కథలు అనే పుస్తకం పేరు వినని వారి కోసం ఒక మాట (నేను కూడా ఈ పేరు విన్నది గత మాసంలోనే) వేలు పిళ్ళై కథలు అనేది సి.రామచంద్ర రావు తన జీవిత కాలంలో రచించిన తొమ్మిది కథల సంకలనం.

అది 1950 – 1960 మధ్య కాలం, నండూరి వారి ఆధ్వర్యంలో ఆంధ్ర సచిత్ర వార పత్రిక బ్రహ్మాండంగా నడుస్తోంది. నండూరి వారి వద్ద ముళ్ళపూడి వేంకట రమణ, బాపు అదే పత్రికలో పని చేసేవారు. ఈ కథలు పత్రికలో ప్రచురణకు వస్తే వాటికి బొమ్మలు గీసిన బాపు (ఇప్పటి పుస్తకం సంకలనంలో కూడా అవే బొమ్మలు వేశారు), ముళ్ళపూడి – మరల మరల చెప్పుకోని ధ్రిల్లయ్యేవారట(ముళ్ళపూడి వారి ముందు మాట నుండి). అంత గొప్పగా ఈ కథల్లో ఏముంటాయి?

ఎప్పుడో యాదృచ్చికంగా ఒక కథ విని, దాని గురించి మర్చిపోకుండా బ్లాగి, ఆ తరువాత ఆ కథా రచయిత పుస్తకం రిలీజ్ అయిందంటే తన రోజు వారీ ప్రోగ్రాం కూడా మార్చుకోని వెళ్ళి, షాప్ తీసేవరకు వేచి చూసి (ఆహా తెలుగు పుస్తకాలు ఎంత అదృష్టం చేసుకున్నాయి, ఎక్కడో అమెరికాలో ఆపిల్ ప్యాడ్లకోసం జనాలు షాపు తెరిచే వరకు ఎదురు చూసేవారని వినటమే)  పుస్తకం కొని చదవిన అభిమాని ఉన్నాడంటే, ఆ కథల్లో ఏముంటాయి?

కథల గురించి, ఒక్కో కథా విషయం గురించి క్లుప్తంగా జంపాల గారు ఈసరికే పుస్తకంలో వ్రాశారు. నేను వాటిని స్పృశించడంలేదు. కాని ఆ పుస్తకం పలు మార్లు చదివేటప్పుడు, చదినిన తరువాత ఆసలు ఈ పుస్తకం ఎందుకు బాగుంది, అసలు ఈ పుస్తకంలోని కథలు ఎందుకు బాగున్నాయి, వీటిని ఎందుకు చదవాలి, వీటినుండి మన కాబోయే కథా రచయతలు ఏమి నేర్చుకోవచ్చు అనే ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కునే క్రమంలో ఈ టపా.

తెలుగుతనం – కథలు జరిగింది, తెలుగు వారికి ఆమడ దూరంలో, ఎక్కడో తమిళనాడు – కర్నాటక టీ, కాఫీతోటల్లో, పాత్రలు, పాత్రల పేర్లు కూడా తెలుగు కాదు. ఉదాహరణకు వేళుపిళ్ళై – చిత్తూరు జిల్లాలో తప్ప ఇటువంటి పేర్లు ప్రస్తుత తెలుగు ప్రాంతంలో నేను వినలేదు. ఇటువంటి కథల్లో తెలుగుతనమేమి ఉంటుంది? రామచంద్రరావు గారి కథల్లో గొప్పతనం అక్కడే ఉంది. పాత్రలు మాట్లాడేది తెలుగు. పాఠకున్ని ఆ ప్రాంతానికి తీసుకువెళ్తారు. అక్కడి వాతావరణంలో మమేకం చేస్తాడు. అంతా తమ ఎదురుగా జరుగుతున్నట్టే చేస్తారు. అక్కడి పాత్రలు తమవారు కాదు, అది ఒక డబ్బింగ్ సినిమా అన్న ఫీలింగ్ ఎక్కడా రానీయరు. ఈ గ్లోబలైజేషన్ యుగంలో కథలు వ్రాస్తున్న, వ్రాయబోతున్న రచయితలు, రచయిత్రులు గట్టిగా గమనించాల్సిన లక్షణం ఇది.

వాతావరణం –ఈ కథలన్నీకూడా కాఫీ, టీ తోటల్లో జరుగుతాయి. ఆ సెట్టింగ్ కూడా ఒక పాత్రలాగా ఇమిడిపోయింది. కథలు చదువుతుంటే ఆ చల్లగాలి, ఆ పచ్చదనం, అక్కడి ఘాట్ రోడ్లు పాఠకుని ముందు ప్రత్యక్ష్యం అవుతాయి. అంత చక్కగా వాతావరణాన్ని ఈ కథల్లో ఇమిడ్చారు రచయిత.

భాష – ఈ కథలు చదివాక, ఒక్క క్షణం నాకు నమ్మబుద్ది కాలేదు, ఈ కథలన్నీ యాబై పైబడి వయసు గలవని. నిన్నో మొన్నో స్వాతిలో ప్రచురించిన కథల్లా ఉన్నాయి. అంత పాత కథలయినా భాష విషయంలో రచయిత తీసుకున్న జాగ్రత్తలు వీటిని అజరామరం చేస్తాయేమో. అమెరికాలో కథ జరిగితే సగం తెలుగు కథలో ఆంగ్లం, హైదరాబాద్లో కథ జరిగితే సగం తెలుగు కథలో ఉర్దూ, డిల్లీలో కథ జరిగితే సగం తెలుగు కథలో హిందీ తప్పనిసరి అనుకునే రచయతలు, రచయిత్రులు ఈ విషయంలో రామచంద్రరావు గారి వద్ద నుండి చాలా నేర్చుకోవచ్చు. గతంలో నేనీ విషయంపైనే వాపోయాను. ఈ కథలు చదివాక తెలుగు కథల్లో తెలుగు భాషకు ఉండాల్సిన ప్రాముఖ్యతపై నాకు మరింత స్పష్టత వచ్చింది. నేను పరభాషా పదాల గురించి వాపోవటం లేదు, పూర్తి పరభాషా సెంటెన్సులు, పారాగ్రాఫుల గురించి వాపోతున్నాను.

లోతుల్లో చూడటం – రోజువారీ విషయాలే, కాని లోతుగా చూస్తే ఏదో ఉంటుంది. తొమ్మిది సంవత్సరాలు చక్కగా పనిచేసిన ఉద్యోగి అకస్మాత్తుగా రోగ్ లా ఎందుకు మారిపొయ్యాడు? రాజమండ్రిలో ఉచ్చస్థాయిలో ప్రాక్టీస్ ఉన్న యువ లాయర్ పెళ్ళి తరువాత ఎందుకు ప్రాక్టీస్ కోల్పోయాడు. ఇటువంటి విషయాలను కథలుగా రామచంద్రరావు గారు అద్భుతంగా మార్చారు. రవి గాంచని చోట కవి కాంచును అనే సామెతను, రవి గాంచని చోట కథకుడు గాంచును అని మార్చుకోవాలేమో రామచంద్ర రావు గారి కథలు చదివాక.  పాత్రలు గాని, వాటికి వ్యక్తిత్వాలు ఇవ్వటం, ఆ వ్యక్తిత్వాలను పాఠకులుకు అర్థం అయ్యేట్టు చేయటం అన్నీ బహు చక్కగా అమరాయి ఈ కథల్లో. ఏ కథ చూసుకున్నా ఇది సత్యమే. ఉదాహరణకు – వేలుపిళ్లై, గాలిదేవర, ఫాన్సీ డ్రస్, ఉద్యోగం, నల్లతోలు (సరే అన్ని కథలు.. 🙂 )

శైలి, కథా బలం – కథ చెప్పటంలో ఒక పట్టు ఉంది. చివరి దాకా చదివిస్తాయి, చివరి దాకా చదివిన తరువాత మరళా మరళా చదివిస్తాయి. ఒక్క ఫాన్సీ డ్రస్ తప్ప అన్ని కథలూ నాకు అద్భుతమైన కథా బలం ఉన్నవిగా తోచినాయి. కథా బలమొక్కటే కాకుండా ఆ కథను నడిపించే విధానం, ఆ కథల్లో సంభాషణలు – ఓ మై గాడ్! గాలి దేవరలో సంభాషణలు చూడాలి , ఒక్కొక్క సెంటెన్స్ ఆ పాత్ర యెక్క క్యారక్టర్‌ను తమలో ఇముడ్చుకున్నాయి.

మేనేజ్మెంట్ పాఠాలు ఈ కథల్లో అంతర్లీనంగా రచయిత అనుభవం నుండి నేర్చుకున్న మేనేజ్మెంట్ పాఠాలు చాలా ఉన్నాయి. ఆ నాడు బ్రిటీష్ వారి కాలంలో, ఆ తరువాత స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మేనేజర్లు ఎలా మేనేజ్ చేసేవారు, ఆ రోజుల్లో అజమాయిషీ ఎలా ఉండేది, వారు వేటికి విలువ ఇచ్చేవారు మొన్నగున్నవి చక్కా తెలుసుకోవచ్చు. మనం గమనించినా, గమనించకున్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఆ రోజుల్లో బ్రిటీష్ వారి వద్ద ఎలా చాలా మంది భారతీయులు మేనేజర్లుగా ఉత్తానమొందారో ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ యుగంలో కూడా భారతీయులు చాలా మంది మేనేజర్లుగా ఉత్తానమొందుతున్నారు. ఆనాటి పరిస్థితులు అవగాహనలో ఉండటం చాలా అవసరం. ఇంకా ఆ రోజుల్లో బ్రిటీష్ మేనేజ్మెంట్ స్టైల్ భారతీయుల నరనరానా జీర్ణించుకోనిపోయి, ఈ రోజుల్లో అమెరికన్ మేనేజ్ మెంట్ స్టైల్లోకి త్వరగా మూవ్ అవ్వలేకపోవటం, మేనేజర్ మూవ్ అయినా రిపోర్ట్ చేసేవారు మూవ్ అవ్వకపోవటం, లేదా వైస్ వర్సా గా ఉండటం. ఈ విషయాల్లో అవగాహన లేక ప్రొడక్టివిటీ తగ్గిపోవటం వంటి సమస్యలు అదిగమించటానికి ఆనాటి వాతావరణం అవగాహనలో ఉండటం చాలా అవసరం.

చివరగా రెండు మాటలు – నండూరి వారు మొదటి కథ, రెండవ కథ బాగా నచ్చాయంటే , నేను ఈ పుస్తకం మొదటి సారి చదివిన తరువాత ఉద్యోగం అనే కథ చాలా బాగా నచ్చింది. ఆతరువాత అన్ని కథలూ వేటికవే సాటి అనిపించాయి. ఫాన్సీ డ్రస్ మాత్రం మామూలు కథే అనిపించింది. కానీ రామచంద్ర రావు గారి శైలిలో పడి అది కూడా మెరిసిపోయిందనుకోండి.

అందరూ ఎందుకు అన్ని తక్కువ కథలు వ్రాశారు అని రామచంద్రరావుగారిని అడిగారేమో, వాటికి సమాధానం అన్నట్టు వారు క్లబ్ నైట్ కథ వ్రాసినట్టున్నారు. ఈ క్లబ్ నైట్ కథ పొడుగు కొంచెం ఎక్కువైంది. కొంత ఎడిటింగ్ చేస్తే బాగుండేది.

బాపు గారి బొమ్మలు, ఆ వయసులో బాపుగారు వేసిన బొమ్మలు బహు షోగ్గా ఉన్నాయి పరికించి చూడటం మర్చిపోకండి.

వేలుపిళ్లై On Kinige

****************************************
చావాకిరణ్ కినిగె వ్యవస్థాపకుల్లో ఒకరు, ప్రస్తుతం కినిగె డైరెక్టర్, ప్రోగ్రాం మేనేజర్. గతంలో ఏడేళ్లు మైక్రోసాప్ట్ – హైదరాబాద్లో , అంతకు ముందు ఒక వర్షం హెచ్ పీ బెంగుళూరులోనూ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేశారు. పుస్తక పఠనం, కవితలు, కథలు, నవలలు వ్రాయప్రయత్నించటం హాబీలు.
– http://chavakiran.com

You Might Also Like

7 Comments

  1. Sowmya

    మీ విశ్లేషణ బాగుంది. నేను ఇప్పుడే మొదటి కథ – “వేలుపిళ్ళై” చదివాను. తెలుగుదనం, వాతావరణం, భాష విషయాల్లో మీతో ఏకీభవిస్తున్నాను.

  2. శ్రీధర్

    మీ రివ్యూ బాగుంది. ధన్యవాదములు! 🙂

  3. chavakiran

    రాఘవ గారు,
    కినిగె లింకు – http://kinige.com/kbook.php?id=142

    budugoy,
    నెనర్లు.

    వసంతం వాసు – మీ వ్యాఖ్య అర్థం కాలేదు, కొంచెం వివరిస్తే బాగుంటుంది. -)

    సుజాత గారు,

    మీరు వ్రాస్తే చదవాలనుంది – ఈ పుస్తకం రివ్యూను. రచయిత గారు కూడా సంతోషిస్తారు.

  4. రాఘవ

    చావావారూ, ఈ పుస్తకం కినిగెలో దొఱుకుతోందా?

  5. budugoy

    జంపాల గారి పరిచయం చదివినప్పటినుండి కొందామనుకున్నాను. ఇంకా షాపుకే వెళ్ళడమే కుదరలేదు. ఇంతలో పుస్తకం కినిగెలో లభిస్తుందంటూ మీ వ్యాసం. ఇవాళే కినిగెలో మొదటి పుస్తకం కొన్నాను. సీంలెస్ ప్రాసెస్. మీ సైటు ఇలాగే పదికాలాల పాటు — తెలుగు పుస్తకాలన్నీ దిజిటైజ్ చేస్తూ– అదేపనిగా పుస్తకాలు కొంటూ, జాగర్తపరచడంలో ఇబ్బందులు పడుతూ, ఇంట్లో వాళ్ళ దెప్పులు భరిస్తూ సొంతింట్లోనే బిక్కు బిక్కుమంటూ బతికే పుస్తకప్రియులను ఆదుకుంటూ — ఉండాలని ఆకాంక్ష. జై కినిగె.

  6. సుజాత

    ఈ కథా సంకలనం పాతది నా వద్ద ఉంది. ఈ కథలు ఎంతగా ఆకట్టుకున్నాయంటే వీటి గురించి రాద్దామనుకుని కొంత రాశాక అది కథల స్థాయిని ఏ మాత్రం వివరించలేకపోతున్నదనిపించి ఆపేశాను. కథలను మౌనంగా ఆస్వాదించడమే మార్గం అని ఊరుకున్నాను.

    స్వల్ప సంఖ్యలో రాసిన కథలతో తెలుగు సాహిత్యంలో అజరామరంగా ఒక రచయిత నిలిచిపోయారంటే ఆ కథల స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

    కథంతా టీ కాఫీ ఎస్టేట్ల నేపథ్యంలో నడుస్తున్నా, అచ్చ తెలుగు ఫ్లో లో అద్భుతంగా సాగిపోయే కథలు! మీరు ప్రస్తావించిన మేనేజ్ మెంట్ కోణం కూడా అద్భుతం!

    చాలా బాగుంది మీ విశ్లేషణ! మీరన్నట్లు ఫాన్సీ డ్రెస్ కథ మామూలుదే అయినా రామచంద్ర రావు గారి శైలిలో అది కూడా తళుక్కుమంటుంది.

Leave a Reply