ప్రియబాంధవి

రాసిన వారు: బి.అజయ్ ప్రసాద్
*****************

సుమారు ఇరవై సంవత్సరాల క్రితం అద్దంకి శాఖా గ్రంధాలయంలో యాత్రికుడు అన్న నవల చదివాను. యాత్రికుడు నవలకి ముందు పేజీలు చినిగిపోవడంతో అప్పట్లో రచయిత ఎవరో తెలియలేదు. ఆ తరువాత చాలాకాలానికి ఆ పుస్తకానికి బెంగాలి మూలం మహాప్రస్తానేర్ -పథ్ అనీ, రచయిత ప్రబోద్ కుమార్ సన్యాల్ అనీ తెలిసింది. దానిని తెలుగులోకి అనువాదం చేసింది మోతుకూరు వెంకటేశ్వర్లు, కాసుఖెల్ సుబ్బారావు గార్లు. మద్దిభట్ల సూరి అనువాదం కూడా ఉంది. యాత్రికుడు చదివిన వేడిలో ప్రబోద్ కుమార్ సన్యాల్ రాసిన ఇతర పుస్తకాలేమైనా దొరుకుతాయేమోనని తెగ వెతికాను. తెలుగులో అనువాదమయిన ఆయన ఇతర ముఖ్య పుస్తకాలలో ప్రియబాంధవి, జ్వాలాముఖి, పుష్పదను వచ్చాయని తెలిసింది.

పేర్లు తెలిసినా ప్రియబాంధవి పుస్తకం చేతిలోకి రావడానికి చాలాకాలం పట్టింది. ఒకసారి విజయవాడ లెనిన్ సెంటర్లో పాతపుస్తకాల షాపులో ప్రియబాంధవి నవల కనిపించి కొందామని అడిగితే పుస్తకం వెల రూ.250 చెప్పాడు షాపువాడు. అందుబాటులో లేని ధరకావడంతో కొనలేకపోయాను. 1966 లో ప్రచురించబడిన ఈ పుస్తకం అప్పటి వెల అక్షరాలా ఆరు రూపాయలు. ఆ తరువాత పోయిన సంవత్సరం కాబోలు (లేక అంతకుముందు సంవత్సరమో) విజయవాడలోనే బుక్ ఫెస్టివల్ లో అమ్మకానికిలేని అరుదైన పుస్తకాల గ్యాలరీలో అద్దాల కింద మాత్రమే చూడగలిగాను ఈ ప్రియబాంధవి నవలని. చివరికి ఇటీవల మిత్రుడొకరు అఫ్జల్ గంజ్ స్టేట్ లైబ్రరీలో ఈ పుస్తకాన్ని సంపాదించి తీసుకువచ్చాడు. పుస్తకం గురించి విన్న తరువాత చేతికి రావడానికి ఇరవై సంవత్సరాల కాలం పట్టింది.

ఇక నవలలోకి వెళ్తే –
మనిషికీ మనిషికీ ఎక్కడ ఏ ముడి ఉంటుందో, అది ఎక్కడ ముడివేయబడి కలిసిందో తెలుసుకునేందుకు ఎవరికి శక్తుంది?
అది ప్రియమైనది.
కాని అదొక బంధం.
దీనిని వదిలిపెట్టలేము.
దీనిని పట్టుకుని కూడా ఉండలేం.

ఈ రెండిటిమధ్య ఊగిసలాడే జహర్, సుఖలత అనే యువతీయువకుల కథ ఇది. జహర్ అవ్యవస్థ మనస్కుడు. కలకత్తా నగరంలో మురికివాడలమధ్య ఇరుకుసందుల్లో రికామీగా తిరుగుతుంటాడు. ఎక్కడా స్థిరంగా ఉండలేని మనిషి. ఏపూట భోజనం దొరుకుతుందో తెలీదు. తీరూతెన్నూలేని జీవితం. ఒక మురికి సందులో చీకటిగదిలో అద్దెకుంటూ ఉంటాడు. అర్థరాత్రి గస్తీ పోలీసులని తప్పించుకుని తిరుగుతూ ఒక చీకటి వీథిలో సుఖలతను కలుసుకుంటాడు. (ఆమె అసలు పేరు శ్రీమతి) ఆమె భర్త నుంచి పారిపోయి దాసీ ఇల్లు చేరి దాసీ ఉద్దేశం మంచిగాలేదని అక్కడనుంచి కూడా తప్పించుకుని పారిపోతూ ఇరుకువీథిలో జహర్ ని చేరుకుంటుంది.

ఇదీ నవలారంభం. అతడి గురించి ఆమెకు తెలీదు. ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అతడికి లేదు. ఆడవాళ్ళకు ఉపకారం చేయబోవడం అనే పని నుంచి ప్రపంచంలో ఎప్పుడూ తప్పించుకు తిరగడం మంచిది.’ అని అనుకున్నా ఆమెనుంచి తప్పించుకోలేడు. అనుకోని పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ముందు అతడి గదికీ, అటునుంచి ఆమె బంధువుల ఇంటికీ అలా కలిసి ప్రయాణం చేయాల్సివస్తుంది. మొదట ఆమెని పినతల్లిగారింట్లో దిగబెట్టి అక్కడనుంచి వెళ్ళిపోతాడు జహర్. మళ్ళీ వీథులవెంట జీవితం. జనప్రవాహంలోంచి నడుచుకుంటూ వెళుతుంటే మళ్ళీ సుఖలత కలుస్తుంది. తను భర్తను విడిచిపెట్టి వచ్చిన సంగతి వారికి తెలిసిపోయిందనీ వాళ్ళు తనను ఉండనివ్వలేదనీ చెబుతుంది. మళ్ళీ ఇద్దరి ప్రయాణం. ఒకచోట ఇద్దరూ భార్యాభర్తలుగా చెప్పుకుని ఇల్లు అద్దెకు తీసుకుంటారు. రెండురోజులకే ఘర్షణపడి మళ్ళీ ఎవరిదారి వాళ్ళు వెళ్ళిపోదామని నిశ్చయించుకుంటారు.

“నువ్వు వెనక్కైతే చూడవేమో కాని నేను బైలుదేరానంటే వెనక్కేకాదు – ముందుకి కూడా చూడను. అలా వెళ్ళిపోవడమే వెళ్ళిపోవడం. నాకు వెనకెంత పొగమంచో ముందుకూడా అంటే పొగమంచు” అంటాడు జహర్. అలానే వెళ్ళిపోతాడు. మిటమిటలాడే ఎండలో జనసంచారం లేని వీథిలో నుంచుని ఉంటుంది సుఖలత. ఆ దారి ఎక్కడా అడ్డంకనేదిలేకుండా కనబడేంత వరకూ తిన్నగానే ఉంది. తను ఎక్కడన్నా ఆగితే ఆగిపోవచ్చునేమో గాని ఆ మార్గానికి మాత్రం అంతమంటూ లేదు. అది అపరిమితం. కనబడేంత దూరం అది అలానే ఉంది.
జహర్ మళ్ళీ రోడ్డున పడతాడు. అలా నడుస్తూ ఉండటం, ఎడతెరిపిలేకుండా మనుషులని పరిశీలించి చూడటం, అదే నడక మళ్ళీ అదే జీవితం. అలా నడుస్తూనే జలాల్ అనే తాగుబోతు మిత్రుడిని కలుసుకుంటాడు.

అతికష్టం మీద తంటాలుపడి అతడిని వెంటపెట్టుకుని ఒకనెల అద్దె ముందుగానే ఇచ్చిన ఇంటికి తీసుకువస్తాడు. మిత్రుడి తాగుబోతు ప్రేలాపనలకి పక్కన గదిలో పడుకున్నవారికి మెలకువ వస్తుంది. ఎవరో తలుపులు దబదబా బాదటంతో తాగుబోతుమిత్రుడు తన ఛాతీ వెడల్పు విరిచి ‘నువ్విక్కడే ఉండు’ అని జహర్ ని కళ్ళతోనే వారించి తలుపు తెరుస్తాడు. అక్కడ వెలుగులో అతడేం చూసాడో కాని అతడి ఛాతి కుంచించుకుపోతుంది. కాళ్ళూ చేతులూ చల్లబడతాయి. జహర్ తలెత్తి సుఖలతని చూసి దీర్ఘంగా నిట్టూర్చి “అయితే నువ్వు వెళ్ళలేదా ఏమిటీ శ్రీమతీ?” అనడుగుతాడు.

“ఏమిటలా దూరంగా నిలబడి చూస్తావ్? పెళ్లిచేసుకున్నావేం బాబూ. ఇంట్లో పెద్దపులిని పెంచుతున్నానని కాస్త ముందుగా నాతొ చెప్పివుంటే – అని అప్పటికప్పడే పారిపోతాడు జలాల్.
ఎవరిదారిన వారు వెళ్ళినవారు మళ్ళీ అలా కలుసుకుంటారు. నిజానికి అక్కడికి సుఖలత మళ్ళీ వస్తుందని అతడు ఊహించడు. మళ్ళీ వాదోపవాదాలు. నేనెందుకు వచ్చినట్లు? నువ్విక ఎప్పటికీ ఈ ఇంటికి రావని తెలుసు. మరి నేనెందుకు వచ్చినట్లు? దీన్ని మీరేమంటారు? ప్రేమా, మొహమా, ఇంకేమైనా? ”
“ఏమంటారు? దాన్నేమీ అనరు. వొట్టి ఆడాళ్ళ మనసు తప్ప మరింకేమీ కాదు. – జహర్.
నీ నిర్వచనం మహా బావుంది. ఆడాళ్ళ మనసుమాత్రం కాదు. మానవుల మనసని అంటారు. మనసు ముందు మానవుడు ఓటమిని అంగీకరించాల్సిందే. తప్పదు. దుఃఖాన్ని గురించి సుఖాన్ని గురించి అనుకునేవి మనసుకు మాత్రం రెండూ సమానమైన మాధుర్యాన్నిచ్చేవే.”
జహర్ నిట్టూర్చి “అసలు సంగతేమిటంటే నీకెక్కడా ఇంకో ఆశ్రయమనేది లేదు కాబట్టే తిరిగి వచ్చావు అన్నాడు. “ఏముంది. నువ్వే ఇక్కడుండు. నేను వెళ్ళిపోతాను.” అంటాడు జహర్.
ఈ సంగతి వాళ్ళు పసికట్టేస్తారు. ఎందుకంటే – నాలాంటి ఆడదాన్ని ఎవరూ వొదిలిపెట్టి పోలేరనీ, నేనే మంచిదాన్ని కాదనీ..

“అందులో తప్పేమీ లేదు. వాళ్ళు నిజాన్ని గ్రహించినవాళ్ళవుతారు” అంటాడు జహర్.
“అంటే దానర్థం? ఏమీ తెలియని మనిషిలా నువ్వు నన్ను తేలిగ్గా వొదిలిపెట్టి వెళ్తావా?”
“ఆ. అలానే తప్పకుండా వెళ్ళిపోతాను.” – సుఖలత
“ఇంకేం వెళ్ళు. వెళ్ళినా తేలిగ్గా మాత్రం వెళ్ళలేవు. నాకు తెలుసు. ఎందుకంటే – పెళ్ళికాకముందు, రంగపూర్ లో నాకో కుర్రాడితో స్నేహమయింది. అతన్ని ప్రేమించలేదు. విడిచిపెట్టి ఇవతలికి వచ్చాను కాని, అనుకున్నంత తేలిగ్గా మాత్రం రాలేదు. చాలా రోజులదాకా, ఏమీ లేకపోయినప్పటికీ ఎందుకనో ఏమో – ఊరికూరికనే నా మనసు ఆ కుర్రాడి దగ్గరకు పరిగేట్టేది. చెప్పడం మాత్రం తేలికే. ఆ తర్వాత నీకు కూడా అలానే ఉంటుంది.
జహర్ కు అలా ఉంటుందా.. ఉండదు. అందుకే అతడు ఆమెను కలిసిన మొదట్లోనే అంటాడు – నువ్వు పెనం మీద నుంచి నిప్పుల్లో కాదు బూడిదలో పడ్డావని.”
సుఖలత మాటల్లో చెప్పాలంటే ఈ కష్టాలనించి బాధలనించి వొడ్డుకు చేరవేసుకోగలిగేంత విశాల హృదయం అతడికి లేదు.

“ఇటుపోదామా – అటు పోదామా / ఆ పని చేద్దామా ఈ పనిచేద్దామా / ప్రేమించుదామా – మానుదామా / ఒదులుదామా – పట్టుకుందామా లోకంలోని అన్నిటినీ పోగు చేదామా / ఉన్న వాటినన్నిటినీ ధర్మం చేద్దామా – అని నీ మనసేపుడూ రెండు పడవలమీద కాళ్ళు పెడుతూనే ఉంటుంది. నువ్వేపనీ చేయలేవు. ఏ పనీ చేతకానివాడివి. ఎందుకూ పనికిరానివాడివి. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు తిరిగే విశృంఖలుడివీ కావు. సంసారంలోని బంధాల్ని తెంచుకున్నవాడివి కూడా కాదు. నీలో నిలకడనేది లేదు” అని అంటుంది సుఖలత. నిజమే అంటాడు జహర్. “నేను ప్రేమించడానికి సరైన మనిషినికాను. ఇతరులనుంచి ప్రేమను పొందటానికి కూడా నేను అర్హుడిని కాను. ” అంటాడు

చివరికి తండ్రి మరణించడంతో పుట్టినిల్లు చేరుతుంది శ్రీమతి. తండ్రి ఆస్థినంతటినీ ఆమె పేరుమీదే వీలునామా రాసి ఉంటాడు. తండ్రినుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తిని సమాజసేవకోసం వినియోగించాలనుకుంటుంది సుఖలత. అదంతా వృధా అంటాడు జహర్.
“అయితే ఎవరికోసం నేనివన్నీ చేయాలనుకుంటున్నానో, వాళ్ళే చివరికి నాకింత తిండీ, బట్టా ఏదీ ఇవ్వరనా నీ ఉద్దేశం అంటుంది. “ఇవ్వరు” అంటాడు జహర్. “నీవల్ల వాళ్ళు ఉపకారం పొందాక, మళ్ళీ నీవైపు తిరిగి చూడటానికైనా తీరుబడిలేనంత జడత్వంతో స్తబ్దులుగా రాళ్ళమల్లే పడి ఉంటారు. వాళ్లకి కేవలం కృతజ్ఞత అనేది తెలియకపోవడమే కాదు; వీలైతే ఉపకారం చేసినవాళ్ళని నిలువునా చంపేందుకు కూడా వెనుకాడని విశ్వాసఘాతకులు కూడా; ఇవాళ వారికోసం నువెంతైనా త్యాగం చేయి. రేపు నీలో ఏదైనా రవంత పొరపాటు కనిపించిందా నిన్ను బురదగుంట ఈడ్చి పారేయడానికి కూడా ఏమాత్రం అనుమానించరు. వాళ్ళవాళ్ళ గౌరవం పొందటం ఎంత తేలికో అగౌరవం పొందటం కూడా అంత తేలిక.” అని జహర్ ఆమెని విడిచి వెళ్ళిపోతాడు. అదే ఆఖరి కలయిక.

నాలుగు సంవత్సరాల కాలం గడిచిపోతుంది. చివరికి జహర్ చెప్పినట్లే జరుగుతుంది. ఆమె పెంపుడు చెల్లి లఖియా పెళ్లి కాకుండానే హఠాత్తుగా గర్భవతి అవుతుంది. తీరా ప్రసవించాక ఈలోకంలోని మనుషులముందు తన సిగ్గును భరించలేక ఆసుపత్రి గదిలోనే ఆత్మహత్య చేసుకుంటుంది. లఖియా చెడు ప్రవర్తనకి సుఖలతే కారణమని అందరూ అనుమానించి ఆ కళంకాన్ని ఆమె మీద రుద్ది అసహ్యించుకుంటూ, వెటకారాలతో లోకులు కాకులు పొడిచినట్లు పొడుస్తుంటే మనుషుల ఆదరాభిమానాలు, స్నేహ, సత్సీలాలు ఎంత క్షణ భంగురాలో అర్థమవుతుంది. వస్తాడా మరి? సుఖలత పసికందుని తీసుకుని అందరికీ దూరంగా ఆశ్రమానికి వెళ్ళిపోతుంది.

ఈ నవలలో ఇది సంక్షిప్త కథ. నవలలో కాస్తంత నాటకీయత కనిపించినా అర్థాంతరంగా ఆగిపొయిందనిపించినా మొదలు నుంచి చివరికంటా ఏకబిగిన చదివించే నవల ఇది. ఇప్పుడీ పుస్తకం అలభ్యం. ఎక్కడైనా మారుమూల మీ ఊళ్ళో పాత గ్రంధాలయాల్లో దుమ్ముపట్టిన పుస్తకాలమధ్య దొరకొచ్చు. నేనలానే చాలా పాత పుస్తకాలు చదివాను. కొన్ని పేర్లు కూడా గుర్తులేవు. బన్ గర్ వాడి , వనవాసి, ప్రకృతి పిలుపు, డోరియన్ గ్రే, యాత్రికుడు, ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు ఈ ప్రియబాంధవి.

You Might Also Like

5 Comments

  1. jwaala

    ప్రియభాంధవి అన్న మీ టైటిల్ చూడగానె నేను చదివిన నవల గుర్తొచ్చింది.నెను చదివిన నవల ,ఇది ఒకటేనా అని చెక్ చేద్దమని ఓపెన్ చేస్తె అది,ఇది ఒకటే,నేను ఈ నవలని మా వూరి లైబ్రరీ లో చదివాను,యాత్రికుడు కూడా, రెండూ గొప్ప నవలలు,ఎంత గొప్ప నవలలంటే కథ నాకు పూర్తిగా గుర్తు లేకపోయినా,చదివి కొన్ని సంవత్సరాలయినా ఆ అనుభూతి నన్ను వెన్నంటివుంది,మీరు చెప్పిన మిగిలిన నవలలు కూడా చదువుతాను

  2. రాయదుర్గం విజయలక్ష్మి

    నిజమే. బంధాలను వదిలించుకోలేము. అలా అని శాశ్వతంగా పట్టుకోలేము కూడా. ప్రియభాంధవి గురించి వ్యాసం చాలా బావుంది. ఒక అరుదైన పాత నవలను పరిచయం చేసినందుకు అజయ్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు.
    రాయదుర్గం విజయలక్ష్మి

  3. jagadeeshwar reddy

    priyabaandavi parichayam baagundi. ban gar vaadi navalanu koodaa parichayam cheyandi ajay gaaroo. avi eppudu eatlaagoo dorakavu kaabatti mee parichayaalu chadivi trupti padathaam
    – tahiro

  4. gr.maharshi

    thank you ajay,goppa novelni parichayam chesavu.chalakalam kritam ee novel naa chetiki vachhindi.ayite dini gurinchi naaku teliyaka chadavaledu.ippudu aa pustakam naa daggara ledu–gr.maharshi

  5. భగవంతం

    ప్రభోధ్ కుమార్ సన్యాల్ బెంగాలీకి తెలుగు అనువాదమైన “ప్రియబాంధవి” నవలను బి.అజయ్ ప్రసాద్ గారు పరిచయం చేసిన తీరు బాగుంది. పరిచయకర్త ఇరవై సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లా, అద్దంకి శాఖాగ్రంధాలయంలో “యాత్రికుడు”నవలను చదవడంతో ప్రారంభమైన ఈ వ్యాసం ప్రియబాంధవి లాంటి నవలా పరిచయానికి మొదటే ఎలాంటి mood ని ఇవ్వాలో అలాంటి mood నే ఇచ్చింది. (అద్భుతమైన సన్నివేశానికి మధురమైన నేపథ్య సంగీతంలా…).

    నవలా పరిచయం – స్త్రీ పురుషుల మధ్య మనుషుల కొలతలకు అందని అనిర్వచనీయ అనుబంధాన్ని… మనిషితో మనసు ఆడుకునే క్రీడను… సమాజపుదుర్నీతిని ఈ నవలలో మరింత లిటరరి ఆర్ట్ తో తెలుసుకునే అవకాశమేదో ఉన్న ఆశను కలిగించింది. ఇప్పటిదాకా ఈ నవలను నేను చదవలేదు. ఇక ఇప్పుడు ఎంత కష్టపడైనా ఈ నవలను వెతికి పట్టుకుని చదవాలని అనిపిస్తోంది. కలకత్తా మురికివీధుల్లో చీకటిగదిలో అద్దెకుండే ‘జహర్ ‘ ని అర్జెంటుగా కలుసుకోవాలనిపిస్తోంది.

    అజయ్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు. పుస్తకానికి థాంక్స్.

    భగవంతం

Leave a Reply