కథా సాగరం-II

వ్యాసకర్త: శారదా మురళి

చిన్నప్పుడు మా ఇంట్లో ఎండా కాలం లో రాత్రుళ్ళు అందరం మేడ పైన చల్ల గాలిలో పడుకునే వాళ్ళం. అప్పుడు ప్రతీ రాత్రీ నాకు ఆకాశంలో చుక్కలు లెక్కబెట్టాలన్న కోరిక పుట్టేది. కళ్ళు నిద్రతో మూసుకు పోయేంతవరకూ లెక్క పెట్టి మర్నాడు అందరితో  “నిన్న ఆకాశంలో ఇరవై రెండు చుక్కలొచ్చాయి” అని చెప్పేదాన్ని. కొంచెం పెద్దయింతరువాత గానీ నాకర్ధం కాలేదు! నేను లెక్క బెట్టిన వాటికన్నా ఇంకా బో….లెడు నక్షత్రాలున్నాయని. అంత మాత్రం చేత ” నిన్న రాత్రి నక్షత్రాలు లెక్కబెట్టాను” అన్న భావనలో నేను పొందిన ఆనందాన్ని తక్కువ చేయలేం కదా? అలాగే తెలుగు కథా వినీలాకాశంలో నేను లెక్క పెట్టిన నక్షత్రాలింకో రెండు….

గాలివాన- పాఠకులని “పడవ ప్రయాణం” చేయించిన పాపరాజు (పాలగుమ్మి పద్మరాజు) గారికి ఈ కథ ఇంగ్లీషు వెర్షన్ (Cyclone) కి అంతర్జాతీయ బహుమతి (1952) లభించింది. ఆయన రాసిన అరవై కథలూ మూడు సంకలనాలుగా వచ్చాయి. నా దగ్గర సాహిత్య అకాడమీ అవార్డు (1985) పొందిన “గాలివాన” కథా సంపుటి వుంది. అందులోదే ఈ కథ.

మనమందరం (లేదా మనలో చాలా మంది) ప్రపంచ రీతులకనుగుణంగా, నిజం చెప్పాలంటే ప్రాక్టికల్గా మనసు చుట్టూ జీవితాల చుట్టూ దుర్భేద్యమైన గోడలు కట్టుకుని ఆ గోడల లోపలినించే ప్రపంచాన్ని చూస్తూ బ్రతుకుతుంటాం. అయితే అంత దుర్భేద్యమైన గోడా కొన్నిసార్లు బయటినించి ఎవరైనా “బలమైన” వ్యక్తులు ఒక్క తాపు తంతే బీటలు వారుతుంది. (ఇక్కడ “బలమైన” అనేది ఏ అర్ధంలో వాడానో తెలిసే వుంటుంది.) ఆ అనుభవం తరువాత ఆ బీటలు రిపేరు చేసుకుని మళ్ళీ గోడల మధ్యే నిలబడిపోయామా, లేక కొత్త అనుభవంతో మన దృక్పథం ఏమైనా మారిందా అన్నది వేరే విషయం. ఇలాటి కథలు చాలా వరకు “స్నాప్ షాట్” టెక్నిక్ తో వుంటాయి.

అంటే కథలో ఒకే ఒక్క సన్నివేశం వుంటుంది. ఆ సన్నివేశంలో కొందరు వ్యక్తులు అనుకోకుండా ఒకరికొకరు తటస్థ పడతారు. ఆ సన్నివేశం తరువాత ఎక్కడి వారక్కడికి వెళ్తారు. ఆ సన్నివేశంలో పాల్గొన్నప్పుడు వాళ్ళ మనస్థితి ఏమిటి? ఆ సన్నివేశం తరువాత వారి మనస్థితి ఏమిటి? ఇదే పాఠకుడికి లభించే ‘సమాచారం’. ఇలాటి కథలు నేను మొదటిసారి కొన్నేళ్ళ క్రితం D.H.Lawrenceరాసినవి చదివాను. (డి.హెచ్.లారెన్స్ Lady Chatterly’s lover, Sons and lovers నవలలే కాక చాలా గొప్ప కథలు కూడా రాశారు. తప్పక చదవాల్సినవి.) అంతకు ముందు నేను కథలు కేవలం కాలక్షేపం కోసం చదివేదాన్ని. ఆయన కథలు చదివాక మొదటిసారి “శైలీ”, “టెక్నిక్” గురించి ఆలోచించి మళ్ళీ అంతకు ముందు చదివిన తెలుగు కథలన్నీ చదివాను. అలాటి శైలిలో రాసిందే “గాలివాన” కథ.

ప్రతీ విషయాన్ని గురించీ, ఆఖరికి కూతుళ్ళ తల కట్టుపై సైతం ఖచ్చితమైన అభిప్రాయాలున్న రావుగారు రైలులో ప్రయాణిస్తున్నారు. తను తీర్చిదిద్దుకున్న ఇంటినీ, కుటుంబాన్నీ, కుటుంబ సభ్యులనీ తలుచుకున్నప్పుడల్లా ఆయనలో ఇంచుక గర్వం! ప్రతీ విషయం గురించి కూలంకుషంగా విశ్లేషించి కానీ ఒక అభిప్రాయానికి రారాయన. ఒక్క వేదాంతి మాత్రమే కాదు, అనేక విషయాల గురించి “అమితమైన ఉత్సాహం తోటీ, పవిత్రమైన ఉద్రేకంతోటీ” అనర్గళంగా ప్రసంగించగల వక్త కూడాను. ఒకానొక సమావేశంలో “సామ్యవాదమూ రమ్య రసామోదము” అనే విషయాన్ని గురించి ఉపన్యసించటానికే ఆయన ప్రయాణం. “ఆయన తన జీవితంలో కొన్ని నియమాలను పాటించాలని నిశ్చయించుకున్నారు. వాటిని అతిక్రమించకుండా వుండగల సాహసం ఆయనకుంది”. (నాకీ వాక్యం చాలా నచ్చింది. నియమాలని, self-imposed వైనా సరే,  అతిక్రమించటానికి సాహసం కావాలా, లేక అతిక్రమించకుండా వుండటానికి సాహసం కావాలా? బహుశా రెండూ సరే నేమో!)

రైలు ప్రయాణిస్తుండగా రావు గారు చుట్టూ వున్న మిగతా ప్రయాణికుల్ని పరిశీలించి తన సహజ ధోరణిలో వారి వారి వ్యక్తిత్వాలని అంచనా వేస్తారు.. ఉన్నట్టుండి పెద్ద గాలివాన మొదలొతుంది.  ఆ గాలివానలో ఒక బిచ్చగత్తె ఆ రైలెక్కి రావుగారున్న కంపార్ట్మెంట్ ఎక్కుతుంది. దాని వాలకమూ, అతి వాగుడూ మిగతా ప్రయాణీకులకి నచ్చినా, రావుగారు విసుక్కుంటారు. అది ఎంత బతిమాలినా ఒక్క పైసా కూడా ముష్టి వేయటానికి ఒప్పుకోరు.

ఆ గాలివానలోనే రావుగారు దిగాల్సిన స్టేషనొచ్చేస్తుంది. ముష్టి మనిషి రావుగారి సామాను దించి ఆయన ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ రాత్రి  గాలివానలో రావుగారు స్టేషన్ వెయిటింగ్ రూంలోనే తల దాచుకోవాల్సి వస్తుంది. గాలినీ, వాన భీభత్సాన్నీ చూసి భయంతో వణికిపోతున్న రావుగారికి ముష్టి మనిషి ధైర్యాన్నిస్తుంది. ఆమె భౌతిక దేహన్ని అసహ్యించుకున్నా “ఆ రాత్రి తనకి తోడుగా వున్నందుకు కృతఙ్ఞత ఏర్పడిందాయన మనస్సులో”.

ఆ రాత్రి వచ్చిన గాలి వాన వల్ల ఆ వెయిటింగ్ రూం పెంకులన్నీ ఎగిరిపోయాయి. పెద్ద పెద్ద చెట్లు ఒరిగిపోయాయి. వాటితో పాటు ఆయన హృదయం చుట్టూ కట్టుకున్న గోడలన్నీ మాయమై పోయాయి.

తెల్లవారి ఆయన లేచేసరికి గాలివాన ఆగిపోయింది. ముష్టి మనిషి ఏమయింది? రావుగారామెని గురించీ, ఆమె రావుగారి గురించీ ఏమనుకుందీ అన్నదే కథ ముగింపులో చెప్తాడు కథకుడు.

మనకే మాత్రం నచ్చని మనిషి మన దృక్పథాన్నీ ఆలోచనలనీ మార్చటం అన్న ఇతివృత్తంతో లక్షలాది కథలు వచ్చాయి. అయితే ఏ మాత్రం నాటకీయత లేకుండా చాలా సహజంగా ఆ పని జరగటం చూపించాలంటే చాలా సున్నితత్వం వుండాలి. మళ్ళీ ఆ సున్నితత్వం ఎబ్బెట్టుగా వుండకూడదు. అలా రాసి పాఠకులని మెప్పించటం ఎంత కష్టమో కదా అనిపిస్తుంది.

రావుగారి వ్యక్తిత్వంలో, ఆలోచనల్లో వచ్చే పరిణామమే (evolution) కథంతా కాబట్టి, రావుగారి పాత్రని చాలా స్పష్టంగా పరిచయం చేస్తాడు రచయిత. రైల్లో మిగతా ప్రయాణీకుల గురించి రావుగారి అభిప్రాయాలుకూడా ఆయన వ్యక్తిత్వాన్ని చిత్రీకరించటానికే ఉపయోగించుకోబడ్డాయి. ముష్టి మనిషికీ రావుగారికీ గల కాంట్రాస్టు, వాళ్ళిద్దరి మధ్యా పెరిగే love-hate సంబంధమూ, అన్నీ చాలా అబ్జెక్టివ్ గా ఏ రకమైన జడ్జ్మెంట్లూ లేకుండా వుంటాయి. (ధారాళంగా ఇంగ్లీషు పదాలు వాడుతున్నందుకు క్షమించాలి!)

మనుషులందరూ మంచికో చెడ్డకో ప్రతీకలు కాదు, కేవలం మనుషులు అన్న ఆలోచన వస్తుంది రావు గారిని అర్ధం చేసుకున్నట్టయితే. పాత్రలని గురించి అంత detatchedగా రాయటానికి చాలా పరిపక్వత వుండాలేమో!

పోతే, నాకెందుకో “గాలివాన” అన్న పేరే చాలా సింబాలిక్ గా అనిపిస్తుంది. మనసులో చాలా దృడంగా ఏర్పరుచుకున్న అభిప్రాయాలనీ, ధోరణులనీ, దృక్పథాలనీ సమూలంగా కూల్చి వేసి సంఘటనలన్నీ “గాలివాన”లే కదా? వాటి శక్తి ముందు మనమెంత?

ఓడిపోయిన మనిషి (1963)- స్వాప్నికుడూ, భావుకుడూ తన అక్షరాలని వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలుగా వర్ణించిన సున్నిత మనస్కుడూ అయిన తిలక్ ఈ కథని రాసారు. నిజానికి నేను ముందు తిలక్ రాసిన “అమృతం కురిసిన రాత్రి” చదివిన తరువాతే ఆయన కథలు చదివాను. ఆయన కవితల్లో వున్న సున్నితత్వమే ఆయన కథల్లోనూ కనిపించింది నాకు.

అసలు జీవితంలో గెలుపు-ఓటములంటే ఏమిటి? సంతోషంగా జీవించటం గెలుపైతే, నిత్యం పరిస్థితులతో రాజీ పడుతూ బ్రతికేయటం ఓటమి అనుకుంటాను. దాదాపు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు తిలక్.

పడవలో ప్రయాణం చేసేటప్పుడు, ఏదైనా ప్రమాదం వస్తే అవసరం లేని సామానులన్నీ పడవ మీది నించి నీళ్ళలో పడేస్తాం (jettison.) బ్రతుకు ప్రయాణంలో కూడా అప్పుడప్పుడూ అవసరం లేని విషయాలని వదిలేస్తూ వుంటాం. అవి కలలే కావొచ్చు, నమ్మిన విలువలే కావొచ్చు, ఆశలే కావొచ్చు, ఆఖరికి ఆత్మాభిమానం కూడా కావొచ్చు. మనం వొదిలేసిన విలువలు కొన్నిసార్లు మన కళ్ళ ముందుకీ మనసు ముందుకీ వచ్చి కలవరపెడతాయి. కొంచెం సేపు బాధ పడతాం. మళ్ళీ మన ఆత్మ వంచనలతో బ్రతుకు ప్రయాణంలో మునిగి పోతాం. “ఓడిపోయిన మనిషి” లోని విషయం ఇదే.

ప్రథమ పురుషలో సాగే ఈ కథలో కథకుడు ఒకనాటి వర్షాకాలపు ఉదయం తన మరిచిపోయిన జీవితాన్ని దిగులుతో తలచుకోవటంతో మొదలవుతుంది. తను మరిచిపోయిన అందమైన రోజుల గురించి కలలు కంటున్న అతను అప్రయత్నంగా పక్కనే పడుకున్న భార్యని ముట్టుకోగానే మేలుకుంటాడు.

ఇక్కడ ఒక అద్భుతమైన విషయం వుంది. నిజానికి పెళ్ళయి అందాన్నీ జీవ శక్తినీ కోల్పోయిన ఆడవాళ్ళని గురించి హీనంగా, వెటకారంగా రాసేవాళ్ళంటే  నాకు ఒళ్ళు మంట. పెళ్ళి, ఇల్లూ, భర్తా పిల్లలతో వచ్చిన బాధ్యతలతో ఒళ్ళూ మనసూ నలక్కొట్టుకుని, అంద విహీనంగా అయిపోయిన ఆడదానికిదా కితాబు అని అడగాలనిపిస్తుంది. యవ్వనంలో వున్న అంద చందాలూ, జీవ శక్తీ పోవటం ఆమె తప్పేమీ కాదే అన్న ప్రశ్న ఉదయిస్తుంది. అయితే ఇక్కడ కథకుడు ఆ ఉద్దేశ్యంతో రాయలేదేమో! ఇల్లాలిలో కథకుడు తన జీవితాన్నే చూస్తున్నాడనిపించింది. భార్యని గురించి చెప్పుతూ.. “పండ్రెండేళ్ళ క్రితం తాకగానే కొత్త ఉద్రేకాలూ, రహస్యాలూ నాలో ప్రవర్తింపచేసిన ఈమె శరీరం, ఇన్నేళ్ళ పరిచయంలో, అనుభవించబడటంలో, పిల్లల్ని కనడంలో వయస్సు పెరిగి, ఈనాడు ఆకర్షణని కోల్పోయి “ఇల్లాలు” అనే ఒక వ్యర్ధ గౌరవప్రదమైపోయిన ఈమె శరీరం, నా చేతికి తగలగానే వానా, వేకువా, మందార చెట్ట్లూ గబుక్కున మాయమైపోయాయి”, అంటాడు. నాకెందుకో ఇక్కడ భార్యని తన జీవితానికి చిహ్నంగా ఉపయోగించుకున్నాడనీ, అతను భార్యని గురించి చెప్పేదంతా నిజానికి అతని జీవితం గురించీ అనిపించింది. లేని సింబాలిజం కొరకు వెతుకున్నానేమో మరి!

ఆ కలత నిద్రలోనే అతనికి బాల గుర్తుకొస్తుంది. అతని భార్య అతని ప్రస్తుత జీవితానికి సంకేతం అయితే బాల అతని గత జీవితానికి అర్ధం. బాలని గాఢంగా ప్రేమించినా అతను తల్లి తండ్రులకెదురు చెప్పలేకపోతాడు. పెళ్ళి రోజూ రహస్యంగా అతన్ని కలుసుకుని పారిపోదామని కన్నీళ్ళతో వేడుకుంటుంది. తను పిరికి వాణ్ణనీ అంత సాహసం చేయలేననీ ఒప్పుకుంటాడతను. మాట్లాడకుండా వెళ్ళిపోతుంది బాల. సమస్య ఇలా పరిష్కారమైపోయినందుకు సంతోషపడాలో, బాల దూరమైనందుకు బాధ పడాలో తెలియని స్థితిలో మిగిలిపోతాడతను. నాలుగేళ్ళ అనంతరం బాల చావు బ్రతుకుల మధ్య వున్నప్పుడూ మళ్ళీ చూస్తాడామెని.

బాల ఙ్ఞాపకాలతో వేడెక్కిన మనసుని చల్లార్చుకోవటానికి ఇంట్లోంచి బయటికొస్తాడతను. పొలం గట్ల వెంబడి నడుస్తూ వుండగా చిన్ననాటి స్నేహితురాలు సుబ్బులు కేక వినిపిస్తుంది. అతనికంటే మూడేళ్ళే చిన్నదయినా పదిహేనేళ్ళు చిన్నదిలాగుంది. సుబ్బులు ఈ కథలో మూడో కోణం. అతను చేజార్చుకున్న జీవితానికీ, ధైర్యానికీ, జీవితేఛ్ఛకీ ఆమె సింబల్. “మొహంలో విచారం తాలూకు నీడ కానీ వయస్సు తాలూకు నీరసం కానీ” లేని సుబ్బుల్నీ, “జీవితంలోంచి ఎంతో సుఖాన్నీ, స్వేఛ్ఛనీ పొందిన వాళ్ళలా నవ్వే” ఆమె నవ్వునీ చూసి ఆశ్చర్యపోతాడు అతను.
తనతో వేళాకోళాలాడుతూ, హాయిగా తనకి కావాల్సిన విధంగా జీవిస్తున్న సుబ్బులు జీవితంతో తన బ్రతుకుని పోల్చి చూసుకుంటాడు, ఆ ఓడిపోయిన మనిషి!

కథ చదివింతరువాత మనలో ఎంత మందిమి సుబ్బులు లా బ్రతుకుతాం, ఎంత మంది ప్రొటాగనిస్టులా బ్రతుకుతున్నాం అన్న ప్రశ్న కొద్ది రోజులైనా వేధించక మానదు. చదువుకునే రోజుల్లో ఎంతో ఊరించిన భవిష్యత్తు చేతికొచ్చేసరికి ఇలా ఎందుకు మారిందా అన్న వ్యథా కొంచెం సేపు కలగకా మానదు.

ఆ తర్వాత అంతా మామూలే!

ఈ వ్యాస పరంపరలో మొదటి భాగం: కథా సాగరం-I

You Might Also Like

5 Comments

  1. మాలతి

    రమణ గారూ, ధన్యవాదాలు. తప్పక చూస్తాను

  2. రమణ

    మాలతి గారూ,
    పాలగుమ్మి గారి ‘పడవ ప్రయాణం’ కధ ఇక్కడ దొరుకుతుంది. ఇదే లింకులో ఇతర ప్రముఖ పాతతరం రచయితల కధలు కూడా ఉన్నాయి.

  3. మాలతి

    కథల విశ్లేషణ అద్భుతంగా ఉంది. గాలివాన ఎప్పుడో చదివేను. మీవివరణ చూసింతరవాత మళ్ళీ చదవాలనిపిస్తోంది. ఆన్లైన్ లో ఉందా ఎక్కడయినా? అలాగే మీరు వ్యాఖ్యానిస్తున్న ఇతర కథలు కూడా ఎక్కడయినా దొరికితే చెప్పగలరు.

  4. మాలతి

    కథల విశ్లేషణ అద్భుతంగా ఉంది. గాలివాన ఎప్పుడో చదివేను. మీవివరణ చూసింతరవాత మళ్ళీ చదవాలనిపిస్తోంది. ఆన్లైన్ లో ఉందా ఎక్కడయినా?

Leave a Reply