కథా సాగరం –I

వ్యాసకర్త: శారదా మురళి

కాలంతో పాటు అన్నీ మారతాయి. సమాజం, నీతీ నియమాలూ, మంచీ చెడ్డలూ, రాజకీయాలూ, ఆర్ధిక పరిస్థితులూ, ఒకటేమిటీ, అన్నీ మార్పుకి బందీలే. సమకాలీన సమాజాన్నీ, బ్రతుకులోని స్థితి గతుల్నీ అద్దంలా ప్రతిబింబించే (కనీసం ప్రతిబింబించాల్సిన!) సాహిత్యం కూడా మార్పుకి అతీతం కాదు.

అందుకే ఒకప్పటి సాహిత్యం మనకి చాలా సార్లు అంత నచ్చదు, కొంచెం బోరుగా కూడా అనిపిస్తుంది. ఉదాహరణకి నిరుద్యోగం, చెల్లెలి పెళ్ళీ,  తమ్ముడి చదువూ, అనారోగ్యంతో తీస్తుకుంటున్న తల్లీ/తండ్రీ, ప్రేమించి తనని పెళ్ళాడాలని ఎదురుచూస్తున్న హీరోయినూ, వగైరా వగైరా సమస్యలున్న హీరో కథ ఇప్పుడు మనకెంత వరకు నచ్చుతుందంటే అనుమానమే!

అయితే ఇంత మారే వాతావరణంలో కూడా ఏ మాత్రం మారని విషయాలు కొన్ని వున్నాయి. మనం చదివే సాహిత్యం ఆ మారని విషయాలని ప్రతిబింబిస్తే ఆ సాహిత్యం కాలాతీతమై ఎన్ని ఏళ్ళూ-పూళ్ళూ గడచినా ప్రజల మనసుల్లో నిలబడి పోతుంది. ఉదాహరణకి తల్లికి పిల్లల మీద వుండే ప్రేమ, ప్రేయసీ ప్రియుల మధ్య వుండే ప్రేమా, ఆకలి బాధా, వంటివి.

కాలాతీతమైన కథలు తెలుగు సాహిత్యంలో లెక్కలేనన్ని వున్నాయి. అలాటి ఒక పది కథలని పరిచయం చేయటమే ఈ వ్యాసావళి ఉద్దేశం. (ఈ కథలు కాలాతీతమైనవన్నది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనితో అంగీకరించే వాళ్ళుండవచ్చూ, విభేదించే వాళ్ళూ వుండవచ్చు.) ఇన్స్టాల్మెంటుకి రెండు చొప్పున అయిదు ఇన్స్టాల్మెంట్లలో పది కథలు పరిచయం చెయ్యటానికి ప్రయత్నిస్తాను.

నిజమైన అపచారం (1948)– ఈ కథని స్వర్గీయ కుటుంబరావు (1909-1980) గారు రచించారు. ఆయననీ, సాహిత్యంలో ఆయనకి వున్న స్థానాన్నీ సాహితీ ప్రియులకి కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆయన గురించి ఇంతకు ముందు నేను వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇక్కడ చదవండి.

పేదరికం ఎంత నికృష్టమైనదో అంత రొమాంటిక్ అయినది కూడా. పేదరికాన్ని ఎంతో మంది రచయితలు ఎన్నో విధాల చిత్రీకరించారు. పేదరికంలో మగ్గుతున్నవాళ్ళకి ఎమోషన్స్ ఒక లగ్జరీ, అని కొంత మంది అభిప్రాయ పడితే, ఇంకొంతమంది పేదరికంలో కూడా అద్భుతమైన భావోద్వేగాలని వెలి చూపారు. మొత్తం మీద పేదరికంతో రచయితలూ, కవులూ సాగిస్తున్న ప్రేమ వ్యవహారం ఈనాటిది కాదు, ఇప్పట్లో పోదు.

చాలా మంది రచయితల లాగే కుటుంబరావు గారు కూడా పేదరికపు నిస్సహాయతను కళ్ళకు కట్టినట్టూ, మనసుకి హత్తుకునేట్టూ  చూపించారు. కడుపు నింపుకోవటానికి సవాలక్ష మార్గాలు కనపడుతున్న ఈ రోజుల్లో ఆ ఆకలి కేకలు మనకంతగా అర్ధం కాకపోవచ్చు. కానీ తమకి అతీతమైన శక్తి కోరల్లో చిక్కుకుని మనిషి చేసే ఆక్రందనలకి కాల ధర్మం వర్తించదు.

అయితే ఈ “నిజమైన అపచారం” లో పేదరికం తో పాటు స్త్రీ హృదయపు ఆవేదన కూడా వుంది. నిజానికి అదే నన్ను ఎక్కువగా కదిలించింది.

కథలోకి వెళ్తే- ఇది కనకమ్మ అనే పేదరాలి గురించిన ఫాంటసీ కథ. కనకమ్మ బ్రతికి వుండగా వర్ణనాతీతమైన కష్టలు అనుభవించింది. కట్టుకున్న భర్తా, అత్తగారూ, చుట్టు పక్కల వాళ్ళూ, బంధువులూ అందరూ ఆమెని అష్ట కష్టాల పాలూ చేసిన వారే. భర్త కి ప్రాణాంతకమైన జబ్బు చేసి, వైద్యుడి దగ్గరకెళ్తే, ఆ వైద్యుడి మోసం వల్ల భర్త మరణించాడు. దారిద్ర్యపు దెబ్బకి ఓర్చుకోలేక కనకమ్మా, ఆమె పిల్లలూ మరణిస్తారు.

చచ్చిపోయిన కనకమ్మ స్వర్గానికి చేరుకుంటుంది. అక్కడ ఆమెకి అన్నిటికన్నా నచ్చిన విషయం తన పిల్లలని మళ్ళీ చూడగలగటం! స్వర్గ లోకంలో ఒక న్యాయ వ్యవస్థ వుండటమే కాదు, ఆ వ్యవస్థలో కనకమ్మ కేసు విచారణకి వస్తుంది కూడా. స్వర్గాధిపతి ఆమెది విచిత్రమైన కేసుగా పరిగణిస్తాడు. ఎందుకంటే, తన తప్పేమీ లేకపోయినా ఆమె జీవితంలో ఒక్క రోజు కూడా సంతోషపడింది లేదు కనక! అంతే కాదు, ఆమె అనుభవించిన కష్టాలన్నీ ఆమెకి ఇతరులు కలగచేసినవే!

అందుకే స్వర్గాధిపతి ఆమెని రకరకాలుగా హింసించిన వారి పేర్లన్నీ వెల్లడించి, వాళ్ళని తన ఇష్టం వచ్చినట్టు శిక్షించుకోమని కనకమ్మతో అంటాడు. దానికి కనకమ్మ ఆశ్చర్యపోయి, తనకెవరి మీదా కోపం లేదనీ, తన ఖర్మ బాగాలేకపోవటం వల్లనే అన్ని కష్టాలూ పడిందనీ అంటుంది. దానికి స్వర్గాధిపతి ఒప్పుకోక తనకి ఇతరుల వల్ల జరిగిన అపచారాల్లో కనీసం ఒక్కటైనా ఎన్నుకొని ఆ అపచారాన్ని చేసిన వ్యక్తిని శిక్షించ వల్సిందని ఆదేశిస్తాడు.

దానికి ఆలోచించి కనకమ్మ, “అయ్యా! నా జీవితంలో జరిగిన వాటి గురించి నేనెప్పుడూ బాధ పడలేదు. కానీ, ప్రాణాంతకమైన వ్యాధిన నా భర్త పడినప్పుడు, అతను చచ్చిపోతాడని తెలిసీ నేను నా నగలమ్మి అతనికి వైద్యం చేయించాను. ఇదొక్కటే నాకు జీవితంలో జరిగిన పెద్ద అపచారం. నా భర్త ఇంకొక్క రెండేళ్ళు ముందు చనిపోయి వుంటే ఆ నగలు మిగిలి వుండేవి. నా బిడ్డలు ఆకలి బాధతో చచ్చిపోయేవాళ్ళు కాదు. ఆ నగలమ్మి వాళ్ళని ఇంకొక రెండేళ్ళయినా బ్రతికించుకునేదాన్ని. ఎవరికి తెలుసు? అంతలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగే వాళ్ళేమో! తను చచ్చిపోతాడని తెలిసీ అ నగలు పొట్టన బెట్టుకున్న నా భర్తని నేనెన్నిసార్లు తిట్టుకున్నానో లెక్క లేదు.” అంటుంది. సభలో ఎవ్వరూ మాట్లాడరు!

అంతే కథ! ఈ కథ చదివిన ప్రతీ సారీ నాకు గొంతులో ఏదో వుండ అడ్డు పడినట్టూ, కళ్ళల్లో సన్నటి నీటి పొర వున్నట్టూ అనిపిస్తుంది. కథంతా కుటుంబరావుగారి సహజ శైలిలో, చిన్న పదాలతో ఇంటెన్స్ గా వుంటుంది. అక్కడక్కడా ఆయన మార్కు వాక్యాలూ మామూలే. ఈ కథ “కుటుంబరావుగారి కథలు- అయిదవ సంపుటం” లో వుంది. ఈ సంపుటి లో వున్న కథలన్నీ ఎక్కువగా స్త్రీల గురించి రాసినవే.

వాయులీనం (1952)- చాసో – చాగంటి సోమయాజులు (1915-1994)గారు అనగానే, మనకి చాలా మంచి కథలు ఙ్ఞాపకం వస్తాయి. “ఎందుకు పారేస్తాను నాన్నా” కథ నాకు చాలా నచ్చి, దాన్ని ఇంగ్లీషులోకి అనువదించి మాలతి గారి తూలిక పత్రికకి పంపించాను కూడా. ఆ ఆంగ్ల అనువాదం ఇక్కడ చదవండి.

చాలా వరకు ప్రేమకథల్లో ఒక అందమైన అమాయకమైన హీరోయినూ, ఆమె అమాయకత్వమూ చిలిపి తనమూ చూసి మనసు పారేసుకునే హీరో లనీ చూసి చూసి విసుగెత్తి ప్రేమ కథలు చదవటం మానుకున్నాను. పెళ్ళయి ప్రేమించుకుంటున్న వాళ్ళ గురించెవరూ కథలు రాయరు. ఒక వేళ మంచి భార్యా-భర్తల గురించి రాసినా వాళ్ళ మధ్య వుండే ప్రేమ గురించి అసలే రాయరు.

అందంగా చిలిపి గా వుండి, పెళ్ళి కాని అమ్మాయిని ప్రేమించడం చాలా ఈజీ! ఎవ్వరైనా చేయగలరు. పెళ్ళై, పెళ్ళి నాటి అందమూ చందమూ తరిగిపోయి నిత్యం ఇంటి పనులతో పిల్లల బాధ్యతలతో సతమతయ్యే భార్యని ప్రేమించేవాడే హీరో, నన్నడిగితే! రామాయణంలోని రాముడైనా, స్వీట్ హొం లోని బుచ్చి బాబైనా, అందుకే అంత పాప్యులారిటీ వాళ్ళకి.

వాయులీనం కథలోని వెంకటప్పయ్య అలాటి హీరోనే. అపస్వరాలతో, తప్పుడు తాళాలతో పెళ్ళి చూపుల్లో పాట పాడిన రాజ్యాన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసుకున్నాడు వెంకటప్పయ్య. పెళ్ళయింతరువాత మళ్ళీ ఎప్పుడూ ఆమెని పాడమని అడగలేదు కూడా. పెళ్ళి వలన పెరిగిన బాధ్యతలతో రాజ్యానికి పాటా, వయొలీన్ వాదనా అన్నీ మూల పడతాయి. ముగ్గురు పిల్లల తల్లయింతరువాత రాజ్యం భయంకరమైన టైఫాయిడ్ జ్వరంతో తీసుకుని మృత్యువు అంచుల వరకూ వెళ్ళొచ్చింది. తీవ్రమైన అనారోగ్యమ్నించి కోలుకుంటూ ఎముకల గూడు లా తయారైన రాజ్యం గురించి వెంకటప్పయ్య ఎప్పుడూ ఆదుర్దా పడుతూ వుంటాడు. పిల్లలకి కూడా మిగల్చకుండా పళ్ళు తినెయ్యమనీ, ఓవల్టీన్ తాగాలనీ ఖరాకండీ గా చెప్తాడు. గాలీ వెల్తురూ సరిగ్గా రాని ఇరుకు ఇంట్లో ఆమెకి ఆరోగ్యం చెడిపోయిందని కొంచెం ఎక్కువ అద్దె అయినా విశాలంగా వుండే ఇంటికి మారతాడు.

భార్య వైద్యానికి కావల్సిన డబ్బు కోసం వెంకటప్పయ్య అప్పులు చేస్తాడు. ఆ అప్పు ఎలా తీర్చాలా అన్న బెంగతో సతమవుతున్న అతనికి ఉన్నట్టుండి ఒక మార్గం తోస్తుంది. ఒక స్నేహితుని సలహా ప్రకారం వెంకటప్పయ్య రాజ్యం వయొలీన్ అమ్మేస్తాడు. అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో “నాలుగు వేళ్ళ వెడల్పు చుట్టూ జరీ వున్న పట్టు చీరా, దానికి తగ్గ పట్టు రవికల గుడ్డా” కొని వణికిపోతూ రాజ్యం చేతిలో పెడతాడు వెంకటప్పయ్య.

“దొంగతనం కన్నా హీనమైన పని చేసానని” బిక్క మొహం తో భార్య దగ్గర వయొలీన్ అమ్మేసిన సంగతి ఒప్పుకుంటాడు. అతను చేసిన పనికి కోపగించుకోకుండా  రాజ్యం “ఏ సంసారైనా అదే చేస్తాడు” అని అతన్ని ఓదారుస్తుంది. పైగా, “నా తల్లి లాటిది ఆ వయొలీన్. అందుకే పోతూ పోతూ నాకొక చీరా రవికల గుడ్డ పెట్టింది,” అని కళ్ళనిండా నీళ్ళు నింపుకుంటుంది. ఇంత చిన్న సింపుల్ కథలో గొప్ప కథనమూ, మనసుని తడి చేసే చెమ్మా వున్నాయి.
“పిల్లలని సముదాయించటం, శాంతంగా సబబైన మాటలు చెప్పి అల్లరి చేయకుండా చెయ్యటం, మొహం మీదకి పొగరాకుండా పొయ్యి ఊదటం మొదలైన విద్యలన్నీ రాజ్యం అవలీలగా నేర్చుకుంది.”
“తాను పాడలేకపోయినా అర్ధం చేసుకోగలిగితే ఉత్తమ సంగీతం మంచిని చేస్తుంది.”
“పిల్లల హృదయాలు నిష్కల్మషంగా వుంటాయి. స్వభావ సిధ్ధంగా సంగీతం సమ్మోహన పరుస్తుంది.”

వంటి చిన్న చిన్న వ్యాఖ్యలూ/వాక్యాలూ ఎంతో బాగుంటాయి. చాసోకథలు రెండవ కూర్పులో ఈ కథ లభిస్తుంది.

(సశేషం)

You Might Also Like

7 Comments

  1. పుస్తకం » Blog Archive » కథా సాగరం-II

    […] వ్యాస పరంపరలో మొదటి భాగం: కథా సాగరం-I (1 votes, average: 5.00 out of 5)  Loading […]

  2. తృష్ణ

    చాలా మంచి ప్రయత్నం. బావుందండి.తరువాయి ఇన్స్టాల్మెంట్ల కోసం వేచి చూస్తాం.

  3. Sirisha Aravind

    Sameekshalu chaala baagunnai, Sarada garu. Bhasha paina meekunna makkuva, merugaina paatha kathalani meeru ennukovatam mudaavaham. Dhanyavaadalu.- Sirisha, Hyderabad

  4. కత్తి మహేష్ కుమార్

    బాగుంది.మంచి ప్రయత్నం.

  5. శారద

    @సౌమ్యా,
    అనారోగ్యంతో తీసుకోవటం అంటే “చాలా రోజులుగా జబ్బు పడి వుండటం” అనుకుంటున్నాను నేను. అది సరైన అర్ధం కాదా? correct me if I am wrong.
    @web site reader
    మిమ్మల్ని డిజప్పాయింట్ చేసినందుకు సారీ. ఇక్కడ రెండు పాయింట్లున్నాయి.
    1)కథలో నాకు గొప్పగా తోచిన అంశాలేంటివి- రెండు కథల్లోనూ నాకెందుకు నచ్చిందన్న విషయం చెప్పాను. కథని టెక్నికల్ గా సమీక్షించటం (Is analysing same as reviewing? I am not sure.) దీని ఉద్దేశ్యం కానే కాదు. (ఏ మాటకామాటే చెప్పుకోవాలి- నిజానికి కథని టెక్నికల్ గా సమీక్షించటం నాకు రాదు). నా పాయింటల్లా ఇంత సింపుల్ కథ కాలం పరీక్షనెందుకు తట్టుకుని నిలబడిందీ అనే!
    2)కథ సారాంశమూ, ముగింపూ చెప్పటానిక్కూడా కారణం అదే! ఇంత సాధారణమైన ముగింపుతో ఎంత అసాధారణంగా కథ రాయొచ్చు కదా అని. However, I admit that the life in these stories is in their ending. But I do not know how to throw light upon the greatness without mentioning the ending.

    నా అభిప్రాయమైతే- కథ పాఠకుల మనసుకి హత్తుకుని కలకాలమూ ఙ్ఞాపకం వుండటానికి అందమైన (or arresting)ముగింపు ఒక్కటే కాదు, ఇంకా చాలా వుండాలి.గొప్ప కథలని మనం అందుకే ముగింపు తెలిసిపోయినా మళ్ళీ మళ్ళీ చదువుతాం. నేను సారాంశము మాత్రమే చెప్పిందీ అందుకే. మిగతా అంద చందాలూ, అనుభూతులూ ఎవరికి వాళ్ళు చదివి ఆనందించవలసిందే. ఆ రకంగా నా ఈ సారాంశం వల్ల పాఠకుల ఆసక్తి తగ్గదనే నేను అనుకుంటున్నాను. In any case I will keep your in mind while writing about the ending.
    మీ అభిప్రాయం పంచుకున్నందుకు ధన్యవాదాలు.

    శారద

  6. Web site reader

    Et tu, Brute?

    సాధారణంగా ఈ వెబ్ సైటులో రాసే సమీక్షలనబడే పేజీలు –సమీక్షలనబడని “పరిచయం చెయ్యడం మాత్రమే” అనే ముసుగులో ఉన్న సమీక్షలు/పరిచయాలు కూడా– కథ/నవల సమ్మరీ రాయడాన్ని మించి దాటిపోవు. ఇది కేవలం రాయడం నేర్పు లేనివాళ్ళు చేస్తారు. నేర్పుగా రాసే వాళ్ళు కథంతా చెప్పకుండానే, చదవాలని ఆసక్తి కలిగించేలా రాయగలరు.

    ఇప్పుడు పరిచయం చేసిన ఈ రెండు కథల్లో ముగింపు చాలా ముఖ్యమైనది. అది కాస్తా చెప్పేస్తే చదవబోయే వాళ్ళ ఆనందం సగం దోచేసినట్లే! మీరు కథ సారాంశం మూడు పేరాల్లో రాసి, కథ గురించి ముచ్చటగా మూడు/నాలుగు వాక్యాలు రాసారు. సారాంశం కన్న “వాయులీనం” కథ గురించి చెప్పాల్సిందేమీ లేదా??

    కథ/నవల చదివి సమ్మరీ రాయడం అయిదో క్లాసు పిల్లలైనా చేస్తారు. కాస్త చెయ్యి తిరిగిన మీలాంటి వాళ్ళు కూడా ఆ స్థాయిని మించకపోవడం విచారించదగింది. (లేదా మీకు “ఈ వెబ్ సైట్ రీడర్స్ కి ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదులే” అనిపించిందో?)

  7. సౌమ్య

    “అనారోగ్యంతో తీస్తుకుంటున్న ..” ? Is there anything missing here?

    Very good article. Hoping to see the continuation soon!
    Thanks for the writeup.

Leave a Reply