పుస్తకం
All about booksఅనువాదాలు

February 25, 2009

శ్రీశ్రీ కథలు-అనువాద కథలు 3

More articles by »
Written by: సౌమ్య
Tags: , , ,

“శ్రీశ్రీ కథలు-అనువాదకథలు” పుస్తకాన్ని సమీక్షిస్తూ ఇదివరకే రెండు వ్యాసాలు పుస్తకం.నెట్ లో ప్రచురించాము. రెండో వ్యాసం లో కొన్ని అనువాదకథల గురించి రాసాను. ఈ వ్యాసంలో ఈ పుస్తకంలోని మిగితా అనువాద కథల్ని గురించి పరిచయం చేస్తున్నాను.  మొదటివ్యాసం ఇక్కడ, రెండోవ్యాసం ఇక్కడా చదవొచ్చు.

“నీ యుద్ధం నువ్వే చేసుకో” సారోయాన్ కథకు శ్రీశ్రీ 1949 లో చేసిన అనువాదం.  నిర్భంద సైనిక సేవను విమర్శిస్తూ రాసిన కథ. కథలోని ప్రధానపాత్ర ద్వారా దానిగురించిన తన కోపాన్ని వెళ్ళగక్కుతాడు రచయిత. “పెదనాన్న-సర్కస్ పులీ” అన్నది మరో సారోయాన్ కథ. ఇందులో మొదటి భాగమంతా కథలోని హీరో జుట్టు పెరగడం గురించి అందరూ వేసే కామెంట్లూ, చివరికి అతను మంగలి షాపుకి వెళ్ళడానికి నిశ్చయించుకునే వరకూ. రెండో భాగంలో ఇక మంగలివాడు ఇతనికి క్షవరంచేస్తూ చెప్పే కథ. అదే, “పెదనాన్నా-సర్కస్ పులీ” గురించిన కథ. కాలక్షేపానికి చదూకోడానికి బానే సరదాగా ఉంది కానీ, వరుసగా చదువుతూ వచ్చిన సారోయాన్ కథలు చూసాక తెలీకుండానే నేను కొన్ని ఆశలు పెట్టుకున్నాను అతని కథ అనగానే. దానికి ఇది నిలువలేకపోయింది. “ఈ భూమిమీద నేను” అన్నది మరో సారోయాన్ కథ. కథలు, కథకులు, కథా రచన వంటి విషయాల గురించి చర్చిస్తూ సాగుతుంది ఈ కథ. అదొక ఆలోచనా స్రవంతి. చదువుతూ ఉంటే మనం ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం.

“ప్రతి స్వప్నం మనం ఇంకా తర్జూమా చేయని ఆ విశాల నిశీథ విజ్ఞానపు చంధస్సులేని, వ్యాకరణంలేని, సరిహద్దులు లేని భాషలో ఒక భాగం” వంటి వాక్యాలు అబ్బురపరుస్తూ ఆలోచింపజేస్తాయి. అనువాదం చేసేటప్పుడు ఇలాంటి క్లిష్టమైన వాక్యాలని ఎలా అనువదిస్తారో అన్న కుతూహలం కలిగింది. “స్వప్నశీలి శర్మ, సినీమా తార తార ప్రజాస్వామ్య వాది ప్లేటో” – మళ్ళీ సారోయాన్ కథ. ఈ కథ ఓ తాగుబోతు ప్రేలాపనగా సాగుతుంది. ఎక్కడ్నుంచో ఎక్కడికో వెళుతూ, నిజంగానే ప్రేలాపనలా ఉంది. అయితే, రీడబిలిటీకి తక్కువేమీ లేదు. ఇక్కడితో సారోయాన్ కథలు ముగిసాయి. తరువాతి కథ మొపాసా రాసినది “ఆత్మహత్యలు”.

“ప్రతి మెదడూ ఒక సర్కస్ లాంటిది. ఇక్కడ తిరిగిన గుర్రమే మళ్ళీ మళ్ళీ తిరుగుతూ ఉంటుంది. ఎంత యత్నించి తప్పించుకోవాలన్నా దగ్గరనే ఉంటున్న గోడలో అనుకోక దొరికే దారిగానీ, అవతలి అజ్ఞాత ప్రపంచాలకి తలుపుగానీ కనబడదు. ఎప్పుడూ ఇలా గిర్రున తిరుగుతూనే ఉండాలి మనం అవే ఊహలలో, అవే ఆనందాలలో, అవే సుఖాలలో, అవే అలవాట్లలో, అవే విశ్వాసాలలో, అవే విసువుపాట్లలో” – ఓ ఆత్మహత్య చేసుకుంటున్న మనిషి రాసిన లేఖ రూపంలో, మధ్య మధ్యన రచయిత వ్యాఖ్యానంతో ఈ కథ సాగుతుంది. కథాంశం నాకు కొత్తగా అనిపించింది. కాస్త ఫ్రస్ట్రేటెడ్ మూడ్లో ఈ కథ చదివితే కథ నిండా బోలెడంత ఫిలాసఫీ కనిపిస్తుంది మీకు జీవితం గురించి.  తరువాతి కథ Edgar Allan Poe కథకు శ్రీశ్రీ అనువాదం – “ఆ గుండెల చప్పుడు”. కొంత గగుర్పాటునూ, కొంత ఉత్కంఠనూ, కొంత భయాన్నీ, కొంత అనుమానాన్నీ ఇలా మిశ్రమ స్పందనలను కలిగిస్తుంది ఈ కథ. Poe కథలు నేను ఒకటీ అరా తప్ప చదవలేదు కానీ, ఆయన శైలి గురించి విన్న విషయాలకి తగ్గట్లుగా ఉంది ఈ కథ. సైకో థ్రిల్లర్ అనొచ్చు ఏమో. అంతా కళ్లకు కట్టినట్లు ఉండింది చదువుతూ ఉంటే.

తరువాతికథ Andre Breton, Paul Eluard కలిసి రాసిన The immaculate conception కు శ్రీశ్రీ అనువాదం “అలవాటు బలిమి”. ఇది కథ కాదు మళ్ళీ. ఒక వ్యాసకథో కథావ్యాసమో అనాలేమో. తరువాత కాఫ్కా కథకి అనువాదం -“వింతజంతువు”. కథ నమ్మశక్యంగా లేకపోయినా కూడా కథనం చదివించేలా ఉంది కనుక బానే ఉన్నట్లే. తరువాతి కథ – “కపీశ్వరుడు”, వి.ఎస్.ప్రిట్‍చెట్ కథకి శ్రీశ్రీ చేసిన అనువాదం. కథాంశమే కాస్త కొత్తది – కోతుల సమూహం, వాటి మధ్య యుద్ధాలూ, వాటిలో వర్ణ వ్యవస్థా, కోతి నుండి మనిషి ఉద్భవించడం గురించి కోతులు అప్పట్లో ఏమనుకుంటూ ఉండేవి, విప్లవకారులైన కోతులు – ఇలా సాగుతుంది ఈ కథ అంతా. నాకు చాలా నచ్చింది కథనం. చివరి రెండు అనువాద కథలూ ఆధునిక చైనా సాహిత్య వైతాళికుడిగా పేరుపొందిన లూషన్ (Lu Hsun) కథల అనువాదాలు. “ఆశ” కథ అనడం కంటే వ్యాసం అనడం సబబేమో. భావాలు చాలా లోతుగా ఉన్నా వీలైనంత తేలికైన వాక్యాల్లో రాసారు. ఇక్కడ అనువాదకుడిగా శ్రీశ్రీ నాకు చాలా నచ్ఛారు. చివరాఖరి కథ “కుంగ్-ఇ-చీ”. ఆ పరిసరాలు, సన్నివేశాలూ అంతా కళ్ళ ముందు కదలాడాయి ఈ కథ చదువుతూ ఉంటే.

మొత్తానికైతే అనువాదకుడిగా శ్రీశ్రీ నాకు చాలా నచ్చేశారు. ఎంచుకున్న కథల విషయంలోనే కాదు, అనువాదం చేయడంలో కూడా. దాదాపు మూడొంతుల కథల్లో క్లిష్టమైన మానసిక భావాల వర్ణన ఉంది. అనువాదంలో దాన్ని విజయవంతంగా చేయగలగడం మరి అంత సులువు కాదు కదా. కాకపోతే ఈ కథలన్నీ ఒక తరహా ఫ్రస్ట్రేషన్ తో ఉంటాయి. ఆ భావన భరించగలిగితేనే చదవండి. భరించలేకపోయినా, శ్రీశ్రీ అనువాదాలు ఎలా చేస్తాడు? అన్న కుతూహలానికన్నా చదవొచ్చు.About the Author(s)

సౌమ్యOne Comment


  1. P. Anand Kumar

    The critic has created an impression that SriSri made these translations
    under frustration.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 
vj13_sri-sri

శ్రీశ్రీ “అనంతం”తో నా అనుభవాలు

రైలు ప్రయాణంలో తినడానికి అయితే ద్రాక్షో, లేదా నారింజో, అదీ కాకపోతే ఏ ఆపిలో, అరటపళ్ళో ...
by Purnima
7

 
 
srisri

శ్రీశ్రీ హృదయగానం

వ్యాసకర్త:  డా.వై. కామేశ్వరి(9441778275) ఆధునిక కవిత్వంలో పరిశోధన చేస్తున్న రోజుల్లో కీ.శే . మ...
by అతిథి
19

 
 

నెమరేసే పుస్తకాలు

చదవడం – ఈ విషయంలో చిన్నతనంలో నాకో అలవాటు ఉండేది. అదేమంటే, మిరపకాయబజ్జీలు కొన్నా కూడ...
by రవి
8

 

 

మన టప్ టపా టప్

వ్యాసం రాసిపంపినవారు: చంద్రలత టప్ టపా టప్! ఏమిటీ శబ్దం ? ఎలుగుబంటికి భయం వేసింది.జింక ...
by అతిథి
4

 
 

2009 లో నేను చదివిన పుస్తకాలు

నాకు చిన్నప్పటినుండి పుస్తకాల పిచ్చి ఎక్కువే. అందునా తెలుగు పుస్తకాలు. అమ్మకు కూడా ...
by జ్యోతి
1

 
 

శ్రీ శ్రీ మహా ప్రస్థానం: కథనం,కదనం

రాసిన వారు: తమ్మినేని యదుకులభూషణ్ (ఢెట్రాయిట్ లో జరిగిన సభలో ఈ ఉపన్యాసం వీడియో ప్రదర...
by అతిథి
9