కవితా! ఓ కవితా!
ఇప్పుడు నేను పరిచయం చేస్తున్నది – ఎప్పుడో వచ్చి, ఎవరికీ తెలియని అంత లావు పుస్తకం కాదు. మార్కెట్లోకి ప్రవాహంలాగా వచ్చి ఎటువంటి పాఠకులనైనా వశీకరించుకోగల నవలా కాదు. సరిగ్గా మూడునెల్ల పసిపాపను ఈసారి పుస్తకం డాట్ నెట్ మిత్రుల ముందుకు తీసుకొచ్చాను. దానిపేరు ‘కవితా!’. ట్యాగ్‌లైన్ సమకాలీన కవితల కాలనాళిక.. అని.
ఈపాటికి ఇదేదో కవితల పుస్తకం అని అర్థమయిపోయి ఉంటుంది. అవును. అయితే అంతకుమించిన ప్రత్యేకతలు కొన్నున్నాయి ఈ పుస్తకానికి. అసలు పుస్తకం అనకూడదేమో.. నెలానెలా పలకరించే పత్రిక అనొచ్చేమో. అనాలి. కొందరు కవులు, కవిత్వప్రియుల స్వప్నాల సాకారంగా మొన్న డిసెంబర్‌లో మొదలయింది. జనవరి, ఫిబ్రవరి నెలలకు మరో సంచికగా వచ్చింది. పేరుకు తగ్గట్టే ఇప్పటి కవుల కవిత్వంతో పలకరిస్తుంది ‘కవితా!’ ఇతర భాషలనుంచి అనువాదాలూ ఉన్నాయి. కేవలం నలుపుతెలుపుల్లో ఓ చిన్న పత్రికను ఎంత అందంగా తీర్చిదిద్దవ చ్చో అర్థమవుతుంది ఇందులోని కాగితాల్ని చూసినప్పుడు.
‘ప్రతి కవిత్వమూ
కవి తనమీద తాను రాసుకున్నదే ఓ విధంగా
ఎందుకంటే కవిత్వం
అల్టిమేట్‌గా సబ్జక్టివ్ కదా
నా కవిత్వంలో నేను దొరుకుతాను..’
– బాలగంగాధర తిలక్
అన్నట్టుగా తమ కవితల్లో కవులందరూ దొరుకుతారు ‘కవితా!’లో.
చూపు తనవైపు తిప్పుకొనే ముఖచిత్రాలు ఈ పుస్తకానికి ప్రత్యేక ఆకర్షణ. వెండితెరపై వెన్నెల సంతకం అంటూ సావిత్రి పలకరిస్తే, మీనాకుమారి వచ్చారీసారి. ఈ సమకాలీన కవితల కాలనాళికను తీర్చిదిద్దడంలో శ్రీశ్రీ విశ్వేశ్వరరావు అభిరుచి, కృషి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆయన దీనికి నిర్వాహక సంపాదకులు కూడా. ఇంతాచేసి ‘కవితా!’ వెల పదంటే పది రూపాయలు. సంవత్సర చందా వంద రూపాయలు. కవిత్వాన్ని ఇష్టపడేవారు ‘కవితా!’ను తప్పకుండా ఇష్టపడతారు. మీక్కూడా కావాలంటే ఈ చిరునామాలో సంప్రదించండి.
kavitaa!
సాహితీమిత్రులు
28-10-26/1, మసీదు వీధి
అరండల్ పేట, విజయవాడ – 2
ఫోన్ – 0866 2433359
సెల్ – 94906 34849
మెయిల్ – kavita.viswam@gmail.com
పుస్తకం » Blog Archive » ‘పత్రిక’ - పరిచయం
[…] అలాంటి కోవకు చెందిన ‘కవితా!’ అనే మ్యాగజీన్ గురించి ఇదివరకు […]
బొల్లోజు బాబా
ఈ పత్రిక లో కవిత్వంమాత్రమే ప్రచురింపబడుతూండటం చాలా చాలా గొప్పవిషయం. విశ్వేశ్వరరావుగారు అభినందనీయులు.
కవితా లో నావి రెండు కవితలు అచ్చవటం అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంటర్నెట్టులో ఈ పత్రికను గురించి తెలుసున్న వారెవరైనా ఉంటారా అని సందేహించి ఊరుకొన్నాను.
మిత్రులు
ఇదే కాక పత్రిక-(మన మాస పత్రిక) అని మరో పత్రిక కవిత్వాన్ని, మంచి కధలను, వ్యాసాలను ప్రచురిస్తూ ఉంటుంది.
దీనికి గౌరవసంపాదకుడు శ్రీరమణ గారు. (నెలనెలా వీరి వ్యాసం ఒక బోనస్)
సుమారు అరవై పేజీల వరకూ ఉండే ఈ పత్రిక అయిదు రూపాయిలు మాత్రమే. సంవత్సర చందా అరవైరూపాయిలు.
ఎడ్రసు
మోనిక పబ్లికేషన్స్
103, నవ నిర్మాణ్ నగర్
రోడ్ నం 71
జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033
bollojubaba
అరుణ పప్పు
శ్రీనివాస్ గారూ, స్పందనకు ధన్యవాదాలు.
రెండునెలలు వేచిచూశాను.. కవితా పరిచయం ఎవరైనా చేస్తారేమోనని.
దక్షులెవ్వారలుపేక్షసేతురది వారల చేటగుగాని.. అని మొదలుపెట్టాను.
కవితలతో పత్రిక నడపడం – తేలికేలెండి. అందరూ ఏదోకటి గిలుకుతారుగనుక.
మంచి.. కవితలతో నడపడం కష్టం.
పరుచూరి శ్రీనివాస్
మొదటి సంచిక విశ్వేశ్వరరావుగారినుండి అందుకున్నప్పటినుంచీ రాద్దాం,రాద్దాం అనుకుంటున్నా. ఈ మధ్యలో రెండో సంచిక కూడా అందుకోవడం, చదవడం పూర్తయి పోయాయి. మీరు పరిచయం చేశారు. చాలా సంతోషం, అంతకంటే ముందు బోలెడన్ని thanks! కేవలం కవితలతోనే ఒక పత్రిక నడపడం తేలిక కాదు. గతంలో యిలాంటి ప్రయోగాలు (తెనాలి నుండి బి. తిరుపతిరావుగారు మిత్రులు, తంగిరాల సుబ్బారావుగారి “చైతన్య కవిత”, …) అంత విజయవంతం కాలేదు. ఈ పత్రికకి అలాంటి సమస్యలు రాకూడదనీ, అంతకంటే ముఖ్యంగా కవులు/కవయిత్రులనుండీ *మంచి* కవిత్వం 🙂 రావాలనీ కోరుకుంటూ …
— శ్రీనివాస్