పుస్తకం
All about booksఅనువాదాలు

February 19, 2009

శ్రీశ్రీ కథలు-అనువాద కథలు 2

More articles by »
Written by: సౌమ్య
Tags: , , ,

శ్రీశ్రీ కథలు-అనువాద కథలు” చలసాని ప్రసాద్ గారి సంకలనాన్ని సమీక్షించడం మొదలుపెట్టాము. ఆ వ్యాసాలలో మొదటి వ్యాసంలో “నవరసాల శ్రీశ్రీ” తొమ్మిది కథ-వ్యాసాలను గురించి పరిచయం చేయడం జరిగింది. ఈ వ్యాసంలో, దీని తరువాతి వ్యాసంలోనూ శ్రీశ్రీ అనువాదకథల గురించిన పరిచయం ఉంటుంది. శ్రీశ్రీ విరివిగా అనువాదాలు చేశారని పుస్తకంలోని ఈ భాగం మొదలయ్యేముందు చలసాని ప్రసాద్ గారు రాసిన పరిచయాన్ని బట్టి అర్థమౌతుంది. అయితే, అన్నింటినీ అనువాదాలు అనలేము. కొన్ని అనుకరణలు ఉన్నాయి. కొన్ని అనువాదాలు ఉన్నాయి. కొన్ని కథల్ని తెలుగు జీవనశైలికి తగ్గట్లుగా మార్చి రాసినవున్నాయి.

అలాగే, భాషా పరంగా చూస్తే, కొన్ని కథల్లో భాష కాస్త గ్రాంథికానికి దగ్గరగా ఉంది. చాలామటుకు కథల్లో మాత్రం భాష మామూలు పత్రికల భాషలాగానే ఉంది. మొత్తం దాదాపు పాతిక కథలున్నాయి. అందుకనే ఈ అనువాద కథల గురించిన పరిచయాన్ని రెండు వ్యాసాలుగా విభజించాల్సి వచ్చింది. ఒకేసారి మొత్తం పాతిక కథల్ని గురించీ చెప్పేస్తే ఓవర్ డోస్ అవుతుందేమో అన్న భయంకూడా ఉంది. 🙂 చాలా కథలు William Saroyan కథల అనువాదాలు. మిగితావి వివిథ రచయితలవి. నామటుకు నాకైతే వారి రచనలతో తొలిపరిచయం ఇప్పుడీ పుస్తకం ద్వారా, శ్రీశ్రీ ద్వారానే.

ఈ భాగం “సశేషం” అన్న సింగిల్ పేజీ కథ(?) తో మొదలౌతుంది.  ఇది అనువాదం కాదు. ఎందుకంటే ఎక్కడా ఫలానా చోట నుండి తీసుకున్నాము, ఇదీ అసలు రచయిత పేరు అని రాయలేదు. 1929 లో రాయబడ్డది. రచయిత శ్రీ.శ్రీనివాసరావు అని ఉంది. ఈ పుస్తకం గురించి నాకు మొదట్నుంచీ ఉన్న కంప్లైంటే మళ్ళీ – సరిగా విభజించలేదని. తరువాతిది “చిత్రరహస్యము” (1928). ఆంగ్ల రచయిత Sir Arthur Conan Doyle సృష్టించిన షెర్లాక్ హోమ్స్ కథలనుండి స్పూర్తి పొంది రాయబడ్డ కథట. బాగుంది. గ్రాంథికం లో డిటెక్టివ్ కథ చదివడం ఇదే తొలి అనుభవంనాకు. ఇది చదువుతూ ఉంటే, బెంగాలీలకు శరదీందు బందోపాధ్యాయ సృష్ట్టించిన బ్యోంకేశ్ బక్షీ గుర్తు వచ్చాడు. ఈ కథలను శ్రీశ్రీ కొనసాగించి ఉంటే, మనకు కూడా అలాంటి ఓ పాత్ర సృష్టించబడి ఉండేదేమో అనిపించింది. తరువాతి కథ – “సోములు చెప్పిన కథ”, Charles Dickens ప్రముఖ రచన “పిక్విక్స్ పేపర్స్” ఆధారంగా రాసినది. అసలు రచన గురించి వినడమే కానీ ఎప్పుడూ చదవలేదు. కనుక నేనేమీ వ్యాఖ్యానించలేను. కానీ శ్రీశ్రీ రాసిన కథ మాత్రం బాగుంది. ఓ థ్రిల్లర్ సినిమా చూస్తున్న భావన కలిగింది.

తరువాతి కథ: చినబాబు (1929). ఇది Hilaire Belloc రాసిన “Conversations with a cat” అన్న కథ ఆధారంగా రాసినదని అక్కడ నోటు రాసారు. ఒక బాలుడికి, ఓ కుక్కపిల్లకీ ఉండే అనుబంధం గురించి రాసారు. ఇది కాస్త కదిలించే కథ. తరువాతి కథ “పాడులోకం” (1938). అసలు రచయిత Guilo Caprin. ఇప్పటి వరకు అన్ని కథలకీ రచయిత పరిచయం రాసారు. ఈ కథకి రాయలేదు మరి. నన్నడిగితే, డోయెల్, డికెన్స్ ఇద్దరికీ పరిచయం అనవసరం. స్కూల్లో ఆంగ్లం చదివినవారెవరైనా ఆ రెండు పేర్లూ గుర్తించగలరు. ఇలాంటి రచయితల గురించే పరిచయం అవసరం నిజానికి. సరే, విషయానికొస్తే, హాస్యం బాగుంది ఈ కథలో. ఈ కథ రెండు మూడు సార్లు చదివినా బోరు కొట్టదు. ముగింపు చదివాక నవ్వని వారు ఉండరేమో. “ఇక నదిలో పడిపోదలుచుకున్న వారందరికీ తూర్పుకొస బాగా నచ్చినట్లు కనబడుతుంది………… మళ్ళి ఇక్కడ ఎడమగట్టు వారికి ఇష్టం. చనిపోయేవాళ్ళకి కూడా పద్ధతులూ పూర్వాచారాలూ ఉన్నట్లు తోస్తుంది” వంటి డైలాగుల్లో కనబడే తరహా వ్యంగ్యం ఈ కథనం ఆద్యంతమూ కనిపిస్తూనే ఉంటుంది.

భిక్షుక సంగీతం(1939) – Edmondo D Amicis  కథ అనువాదం. ఈ కథ చదువుతూ ఉంటే, “వావ్!” అనిపించింది ఆ కథనానికి. దీన్ని పూర్తిగా కథ అనడం కంటే కూడా ఓ వ్యాసం లాగా అనుకోవచ్చు. ఏదోఒకటి కానీ, బిచ్చగాళ్ళ నోటి నుండి వచ్చే పాటల గురించి, అవి కలిగించే స్పందనల గురించీ భలే రాసారు. “ఈ క్షుధామయ ప్రపంచంలో ఎవరి దు:ఖం ఎక్కువ? పాడుతున్న వాడిదా? వింటున్న వాడిదా?” అన్న వాక్యంతో మొదలౌతుంది ఇది. అక్కడే అర్థమౌతుంది విషయం ఏమిటో. ఇది కూడా ఎన్నిసార్లు చదివినా బోరు కొట్టదు. ఈ గొప్పతనం అసలు రచయితదా? అనువాదకుడిదా? అన్న సందేహం కలిగింది నాకు. తరువాతి కథ, మరో సారోయాన్ కథ “దేవతార్చన” (1944). ఇది కథ కాదు కానీ, ఒక విధమైన ప్రార్థన. దీని ఆంగ్ల మూలం పేరు Common Prayer. నాలో ఇది చదువుతున్నప్పుడు కూడా ఈ “వావ్!” భావన కలిగింది కానీ, ఇది ఒకసారికి గ్రాస్ప్ చేసుకోగల రచన కాదు. రెండు మూడుసార్లు చదవడం చాలా అవసరమని నాకు తోస్తుంది. రెండు “వావ్” ల తరువాత వచ్చిన మరో సారోయాన్ కథ “డియర్ గ్రేటాగార్బో” (1944) నిరాశ కలిగించింది.

1,2,3,4,5,6,7,8 మరో సారోయాన్ కథ. చూడబోతే 1944లో శ్రీశ్రీ ఈయనవి చాలా కథలు అనువదించినట్లు తోస్తుంది. ఈ కథ ఆసక్తికరంగా ఉంది, చాలా వైవిధ్యంగా ఉంది. కానీ, తరుచుగా ఈ కథలో రచయిత ప్రథమ పురషకీ, ఉత్తమ పురుషకీ మారుతూ ఉంటాడు కథలోని ఏకైక పాత్ర గురించి చెప్పేటప్పుడు. అదెందుకో నాకు అర్థంకాలేదు. శ్రీశ్రీ ఈ కథ చివర్లో ఓ వ్యాఖ్య రాసారు – “ప్రథమ పురుషలో చెబుతూ హఠాత్తుగా ఉత్తమపురుషలోకి కథని మార్చడంలో రచయిత వైదగ్ధ్యం గోచరిస్తుంది” అని. “వై…” ఏంటా పదం? అనిపించిందా? బ్రౌణ్యంలో చూస్తే తెలిసింది “నైపుణ్యం” అన్న విషయం చెప్పడానికి వచ్చిన తంటా అది అని. సరే, అలా ప్రథమ-ఉత్తమ పురుషలమధ్య మారుతూ చెప్పడానికి బోలెడు నైపుణ్యం కావాలి అన్నది అర్థమౌతోంది కానీ, ఎందుకలా మార్చి మార్చి చెప్పవలసి వచ్చిందోమాత్రం అర్థం కాలేదు.

మరో సారోయాన్ కథ “ప్రేమ, మరణం, త్యాగం వగైరా” (1944). ఇది కథ అనడం కంటే, కాలమ్స్ లో వచ్చే కాలం-కథ అనొచ్చేమో. చిన్నప్పుడు “At the theatre” అని ఒక పాఠం ఉండేది ఇంగ్లీష్ పాఠ్యపుస్తకంలో. అది గుర్తువచ్చింది ఇది చదువుతూ ఉంటే ఎందుకోగానీ. దానికీ దీనికి వస్తుపరంగా ఉండే పోలిక చాలా చాలా చిన్నది. అయినా, ఎందుకో అది మనసులో మెదిలింది ఇది చదువుతున్నప్పుడు. ఇక సారోయాన్ గురించి కుతూహలం పెరుగుతోంది నాకు. తరువాతి కథ “గొల్లవాడి కూతురు”, మరో సారోయాన్ కథ. అది ఒక జానపద కథ వంటిది. బాగుంది. సారోయాన్ రకరకాల పద్ధతుల్లో కథలు రాసేలాగున్నారు. అన్నీ ఆసక్తికరంగా రాయడం గొప్ప విషయం. “చలికాలపు రాత్రి” – ఇది కూడా సారోయాన్ కథే. ఓర్నాయనో! కింద శ్రీశ్రీ రాసిన ఫుట్‍నోటే గనుక లేకపోయి ఉంటే, ఇదో పది సార్లు చదివినా నాకు అర్థమై ఉండేది కాదేమో. కానీ, వర్ణనలు అవీ మాత్రం చాలా బాగా చేస్తారు. ఒక్కోచోట ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఈ కథలో. ఇందులో సమస్యల్లా ఆ ఆలోచనాస్రవంతి మరీ వేగంగా మలుపులు తిరుగుతూ ఉండటం అనుకుంటాను.

“చలి:చలి” – మరో సారోయాన్ కథ. ఈయన కథలన్నీ ఒక విధమైన ఆలోచనా స్రవంతిలో సాగుతాయి. ఇవతల చదువరులకి రెండే దారులు ఉంటాయి – ఆ స్రవంతిలో కొట్టుకుపోవడం, “ఏంటో సోది చెబుతున్నాడు” అని విసుక్కోవడం. మధ్యేమార్గం అన్నదే ఉండదు అని అనుమానం కలిగింది ఈ కథ చదువుతూ ఉంటే.  చలి ఎలా హింస పెడుతోందో ఓ పక్క వివరిస్తూనే, పుస్తకాల మీద, రచయితలమీద, కథలు రాయడంమీద ఈ కథలో రచయిత చాలా వ్యాఖ్యలు చేసారు. చక్కని అనువాదం. “మన్యాల నుండి వచ్చిన మనిషి” అన్నది 1945 లో శ్రీశ్రీ మరో సారోయన్ కథకి రాసిన అనుకరణ. వీటన్నింటికీ అసలు ఆంగ్ల కథల పేర్లు కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. మళ్ళీ ఇదొక ఆసక్తికరమైన కథ. కాస్త హాస్యంగా కూడా ఉండింది. కథకుడికి, కిరాణాకొట్టు వాడికి మధ్య జరిగే సంభాషణ వంటివి నిజజీవితంలో చాలా కనిపిస్తూ ఉంటాయి. ఈ కథలో ఆలోచించాల్సిన విషయాలు కూడా చాలానే ఉన్నాయి. “కుర్రాడూ-చుంచెలుకా” 1946 లో శ్రీశ్రీ చేసిన సారోయాన్ కథ అనువాదం. ఇది కొంత ఫాంటసీ కథే అయినా కూడా హాస్యం, వ్యంగ్యం కావాల్సినంత ఉన్నాయి. ఎలుకకీ, కుర్రవాడికీ సంభాషణతో మొదలైంది, నాకు రాటాటూయీ (2008) హాలీవుడ్ యానిమేషన్ సినిమా గుర్తు వచ్చింది.

ఇప్పటికే వ్యాసం పెద్దదైపోయింది. మిగితా అనువాద కథల్ని ఈ వ్యాసాల సిరీస్ లో మూడో వ్యాసంలో పరిచయం చేస్తాను. మొత్తానికి శ్రీశ్రీ అనువాద కథల రచయితగా నాకు చాలా నచ్చాడు, కనీసం ఇప్పటివరకూ. కవిగా నేను ఆయన కవితలు చదివినది చాలా తక్కువ. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి లోని కొన్ని పద్యాలు మినహాయిస్తే. అనువాదకుడిగానే ఎక్కువ నచ్చాడాయన నాకు.  మరిన్ని కథల గురించిన పరిచయం వచ్చేవారం.About the Author(s)

సౌమ్యOne Comment


  1. […] మొదటివ్యాసం ఇక్కడ, రెండోవ్యాసం ఇక్కడా […]  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

ప్సామవేదం – శ్రీశ్రీ – అనువాద కవిత

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు మరియు ఇందు కిరణ్ కొండూరు **************** శ్రీరంగం శ్రీనివ...
by అతిథి
0

 
 

శ్రీశ్రీ “అనంతం”తో నా అనుభవాలు

రైలు ప్రయాణంలో తినడానికి అయితే ద్రాక్షో, లేదా నారింజో, అదీ కాకపోతే ఏ ఆపిలో, అరటపళ్ళో ...
by Purnima
7

 
 

శ్రీశ్రీ హృదయగానం

వ్యాసకర్త:  డా.వై. కామేశ్వరి(9441778275) ఆధునిక కవిత్వంలో పరిశోధన చేస్తున్న రోజుల్లో కీ.శే . మ...
by అతిథి
19

 

 

నెమరేసే పుస్తకాలు

చదవడం – ఈ విషయంలో చిన్నతనంలో నాకో అలవాటు ఉండేది. అదేమంటే, మిరపకాయబజ్జీలు కొన్నా కూడ...
by రవి
8

 
 

మన టప్ టపా టప్

వ్యాసం రాసిపంపినవారు: చంద్రలత టప్ టపా టప్! ఏమిటీ శబ్దం ? ఎలుగుబంటికి భయం వేసింది.జింక ...
by అతిథి
4

 
 

2009 లో నేను చదివిన పుస్తకాలు

నాకు చిన్నప్పటినుండి పుస్తకాల పిచ్చి ఎక్కువే. అందునా తెలుగు పుస్తకాలు. అమ్మకు కూడా ...
by జ్యోతి
1