శ్రీశ్రీ కథలు-అనువాదకథలు -4

మహాకవి శ్రీశ్రీ రాసిన కథలు-అనువాదకథల సంకలనాన్ని గత మూడువారాలుగా సమీక్షిస్తూ వస్తున్న సంగతి పుస్తకం.నెట్ పాఠకులు గమనించే ఉంటారు. ఇది చివరి వ్యాసం. మొదటి వ్యాసంలో ఈ పుస్తకం లోని “నవరసాల శ్రీశ్రీ” తొమ్మిది కథలనూ, తరువాతి రెండు భాగాలలో శ్రీశ్రీ అనువదించిన పాతిక పైనే ఉన్న కథలను గురించి రాసాను. చివరి భాగం శ్రీశ్రీ కథలు. నిజానికి పుస్తకం మొదలైంది ఈ కథలతో. అయితే, నేను చివరగా పూర్తిచేసినది ఈ భాగమే. అందుకనే చివరి భాగంగా పరిచయం చేస్తున్నాను.

మొత్తం ఇరవై ఐదు కథలున్నాయి. “ఆనంద మందిరము” 1926 లో రాయబడిన కథ. అంటే, అప్పటికి శ్రీశ్రీ వయసు పదహారు సంవత్సరాలు మాత్రమే. కథంతా గ్రాంథికపు భాష. ఈ కథను నేనెక్కడో చదివాను ఇదివరలో. అప్పట్లో ఆ భాష వల్ల చదవలేదు పూర్తిగా. ఇప్పుడు పూర్తి చేసాను. బాగుంది కథ. ఈ పాతిక కథల్లోనూ కాస్త కథగా చదూకోడానికి బానే ఉంది అనిపించిన కొద్ది కథల్లో ఇదొకటి. “సీతయ్య”, “బొమ్మ అలేఖ్యం”, “కవిసన్మానం” – ఈ కథల్లో చమత్కారం బాగుంది. బానే నవ్వుకున్నాను. కానీ, ఏమిటో, కథలన్నీ కాస్త వెరైటీగా అనిపించాయి. “అసమాప్తం అధివాస్తవికత” సరేసరి. ఉన్నదే ఒక్క పేజీ. అది కూడా తిక్కతిక్కగా అనిపించింది. అధివాస్తవికత (surrealism) అలాగే ఉండాలి కాబోలు!

“శూర్పణఖా మానసంరక్షణ”-కథో, కథ అంటే వాస్తవాన్ని ఇష్టమొచ్చినట్లు చెప్పొచ్చనే సౌలభ్యం ఉంటుందని కథ అన్నారో అర్థంకాలేదు. ఒక సంభాషణలాగా అనిపించింది. “ఆశ్వమేధయాగం” టైటిల్ చూసి ఏమిటో అనుకున్నానా, కథ చదువుతూ ఉంటే మాత్రం నవ్వొచ్చింది. ముఖ్యంగా ఆ ఫ్లో. ఇది ఇంతకుముందే చదివాను ఎప్పుడో. అయినా కూడా బోరు కొట్టించలేదు. తరువాతి మూడు కథలు – “కోనేటి దినం”, “కోనేటి రాత్రి” మరియు “కోనేటి జన్మ”. మూడూ గుమాస్తాగిరీ జీవితాలపై రాసినవి. శ్రీశ్రీ ఒకప్పుడు మిలట్రీలో గుమాస్తా ఉద్యోగం చేశారనీ, ఆ అనుభవాలు ఈ కథలకి ఉపయోగపడి ఉండవచ్చనీ ముందుమాటలో చలసాని ప్రసాద్ గారు రాసారు. “ఒసే తువ్వాలు అందుకో” – శ్రీశ్రీ ఇలాంటి పేరు పెట్టి కథ రాయడం కాస్త వింతగా అనిపించింది నాకు. ఆయనేదో నాకు ఫ్రెండూ, ఆయన గురించి నాకు తెలుసని కాదు కానీ, ఎందుకో కొత్తగా అనిపించింది. “హేమంతం”, “పంచపాండవులు”, “ఒక్కల” – ఈ మూడు కథలు అధివాస్తవికంగా అనిపించాయి నాకు. దీనిగురించి నా సందేహాలు నాకున్నాయి కనుక ఇప్పుడే ఈ కథల గురించి వ్యాఖ్యానించలేను. “నేటి హిరణ్యాక్షుడు” కథ మళ్ళీ కాస్త మామూలు తెలుగుకథలా అనిపించింది. సుమారుగా చదివించగలదు.

“అనామిక”, “చరమరాత్రి” రెండూ వ్యాసాలనాలేమో. “బాధ కవిత్వానికి పర్యాయపదం” కూడానూ. బహుశా చలసాని ప్రసాద్ గారు అన్నట్లు వీటిని వ్యాసకథలనో, కథావ్యాసాలనో అనుకోవాలి కాబోలు. “ఐశ్వర్యం ఎదుట దారిద్ర్యం” కథ ఉండడానికి రెండు మూడు పేజీలదే అయినా కథావస్తువు కదిలించివేసే రకానిది. ఈ కథ మటుకూ అయితే కథనం గురించి ఆలోచించేంత లెంత్ లేదు కథకి అని నా అభిప్రాయం. ఎందుకో మొదట్నుంచీ ఈ “కథలు” భాగం గురించి నాకు నిరాశగానే ఉంది. అందుకే దీనిలోని మంచిని కూడా చూడలేకపోతున్నాను. “జాలి” కథ ఇటీవలే దూరదర్శన్ వారు “కథా స్రవంతి” అనో ఏదో కార్యక్రమంలో టెలీఫిల్మ్ గా తీస్తే చూశాను. మంచి కథ. “కరక్కాయ ముక్క-అరక్కాయ కుక్క”, “బొజ్జమ్మా-బొచ్చుకుక్కా”, “పెద్దాపురం ముదనష్టం”, “గాలిదారాల దేవతావస్త్రాలు” “మొహబ్బత్ ఖాన్” – ఈ కథలన్నీ కాలక్షేపానికి తీసి చదూకోడానికి సరదాగా బానే ఉన్నాయి. మొత్తానికి కథారచయితగా శ్రీశ్రీ నాకు పెద్దగా నచ్చలేదు కానీ, చాలా చోట్ల వాక్యాల్లోని చమత్కారం, వ్యంగ్యం నచ్చాయి.

హోలోవరాల్ గా చూస్తే, పుస్తకం మొదటి రెండు భాగాలు – కథలు, నవరసాల శ్రీశ్రీ – ఈ రెండూ శ్రీశ్రీ గురించి కుతూహలం ఉన్నవారందరూ చదవొచ్చు. అనువాదకథల భాగం ఐతే, సాహిత్యాభిమానులందరూ తప్పక చదవవలసినది. సారోయాన్ కి ఈ అనువాదాల ద్వారానే అభిమాని అయిపోయాను నేను ఇప్పుడు. అనువాదాలని అంత బాగా చేసిన శ్రీశ్రీ తాను రాసిన కథలతో మాత్రం ఎందుకు నన్ను ఆకర్శించలేకపోయాడో మరి, అర్థం కాలేదు. 🙁

పుస్తకం వివరాలు:
శ్రీశ్రీ కథలు-అనువాద కథలు
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్
కూర్పు; చలసాని ప్రసాద్
ప్రథమ ముద్రణ: ఆగస్టు 2008
వెల: 120 రూపాయలు.

You Might Also Like

Leave a Reply