ప్రతిజ్ఞాయౌగంధరాయణం : భాస

కోవిడ్ వల్ల చాలా మట్టుకు క్లాసులు, లెక్చర్లు, వర్క్ షాపులూ ఆన్‍లైన్‍కి చేరాయి. అకడమిక్ సర్కిల్స్ లో ఉన్నవారికి మాత్రమే అందుబాటులో ఉండే మెటీరియల్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వస్తోంది. భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్‍స్టిట్యూట్ (BORI) వారు కూడా తమ లెక్చర్లు కొన్ని యూట్యూబ్ లో పెట్టారు. వాటిల్లో నన్ను అమితంగా ఆకర్షించిన ప్లేలిస్ట్: సంస్కృత డ్రామా మీద లెక్చర్ సీరీస్. మొన్నో సారి “అభిజ్ఞాన శాకుంతలం” నాటకం కూడియట్టం (కేరళ నాటక కళారూపం)లో చూశాను. ఆ నాటకం గురించి విశ్లేషణ రెండో లెక్చర్ లో ఉంది. అక్కడ నుంచే మొదలెడదామనుకున్నా కానీ మళ్ళీ అసలు మొదటి లెక్చరులో ఏం చెప్పారో చూద్దామని చూస్తే భాసుని “స్వప్నవాసవదత్తమ్” ఉంది. థియరీ గురించి చెపుతున్నారు కదా అని వింటూ పోతే, స్వప్నవాసవదత్తానికి ఒక prequel ఉందనీ దాని పేరు  “ప్రతిజ్జాయౌగంధరాయణ” అని తెలిసింది. 

కథా కమామిషు

ఈ నాటకంలో కథ కూడా భలే ఆసక్తికరంగా ఉంది.

కోశంబీ రాజు ఉదయన కళా విద్వాంసుడు కూడా. తన వీణా వాయిద్యంతో ఏనుగులని మంత్రముగ్ధులని చేసి వశపర్చుకోలగడు. ఈ నేర్పునే అవకాశంగా తీసుకుని దెబ్బ కొట్టాలని కుట్ర పన్నిన శత్రు రాజ్యంవారు ఉదయన వేటకెళ్ళినప్పుడు అడవిలో ఏనుగుల గుంపుతో పాటు ఒక కృత్రిమ ఏనుగుని కూడా ప్రవేశపెడతారు. (ట్రోజన్ వార్ లో ట్రోజన్ హార్స్ గుర్తొచ్చింది నాకైతే.) రాజుగారి వీణావాయిద్యానికి నిజమైన ఏనుగులు వశమవుతాయి కానీ ఈ మాయా ఏనుగు అవ్వదు. అది శత్రురాజ్యపు కుట్ర అని తేలేసరికి చాలా ఆలస్యమైపోతుంది. సైన్యం, మందీ బలగం ఏవీ లేని రాజుని వాళ్ళు బంధించుకుని పోతారు. పట్టుకున్నవాడిని చంపకుండా బంధీగానే ఉంచుతారు.

అతని దగ్గరకి తమ కూతుర్ని, వాసవదత్తను, వీణ నేర్చుకోవడానికి పంపిస్తారు రాజూ, రాణీ. అటు తల్లిదండ్రులు ఆశించినట్టుగా, ఇటు ప్రేక్షకులమైన మనం ఊహించినట్టుగా వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. ఈ లోపు రాజుగారి మహామంత్రి రాజునీ, రాకుమారినీ అక్కడనుంచి తప్పించడానికి పన్నాగం వేస్తాడు. రాజూ, రాకుమారీ తప్పించుకుని తమ రాజ్యానికి చేరుకుంటారు. ఇక్కడి వరకూ “ప్రతిజ్జాయౌగంధరాయణ”లో ఉన్న కథ. అలా ప్రేమించుకుని పెళ్ళైన వారి జీవితాల్లో తర్వాత వచ్చే ఒడిదుడుకులు “స్వప్నవాసవదత్తమ్”కి కథాంశం.

పైన చెప్పిన కథని అలాగే నాటకీకరించుంటే, నేను కూడా “కథ బాగుందే!” అని అనుకుని లెక్చర్ వింటూ ఉండిపోయేదాన్ని. కానీ ఈ కథ నాటకీకరణలో ముఖ్యపాత్రలైన ఉదయన, స్వప్నవాసవదత్త అసలు స్టేజ్ మీదకు రానే రారని విని అవ్వాక్కయ్యాను. నాట్యశాస్త్రం ప్రకారం ప్రతీ అంకంలోనూ కథలోని ముఖ్యపాత్రలు స్టేజ్ మీదకు తప్పనిసరిగా రావాలి. ఆ నియమాన్ని ఉల్లంఘిస్తూ భాసుడు నాటకం రాశాడనేసరికి నాకా నాటకం వెంటనే చదవాలనిపించింది. (అలా శాస్త్రాన్ని ఉల్లంఘించి రాసినందుకు గాను భాసుడు చాలా చిక్కుల్లో పడ్డాడని, ఆనాటి విమర్శకులు అతని పనిని ఒప్పుకోలేదనీ, దాని అధారంగా “భాసో అ హాసం” అనే సంస్కృత నాటకం BORIకి సంబంధించిన ప్రొఫసరే రాశారని ఈ లెక్చర్లలో చెప్పారు.) 

అనుకున్నట్టుగానే ఆర్కైవ్.ఆర్గ్ లో ఒక ఇంగ్లీష్ అనువాదం దొరికింది. కొంచెం పాత పుస్తకం కాబట్టి భాష కొంచెం archaic గా ఉంటుందేమో, అయినా పర్లేదు, భాసుడు నాటకాన్ని ఎలా ఫ్రేమ్ చేశాడో తెలిస్తే చాలు నాకు అనుకుంటూ మొదలెట్టాను. కానీ ఆశ్చర్యం! ఇంగ్లీష్ అనువాదం భలే బాగుంది. సంస్కృత నాటకంలానే ఇక్కడ కూడా వచనం, పద్యం వేరువేరుగా ఉంచారు. అవసరమైన చోటల్లా ఫుట్‍నోటులు ఇచ్చారు. అంతకు మించి, రెండొందల పేజీల పుస్తకంలో వంద పేజీలు భాసుణ్ణి, నాటకాలని పరిచయం చేస్తూ విస్తృతమైన వ్యాసం రాశారు. అన్నీ అలా పళ్ళెంలో అమర్చి పెట్టి ఇస్తే చదవకుండా ఊరుకోగలమా? 

ఆ పుస్తకంలో  “ప్రతిజ్జాయౌగంధరాయణ”, “స్వప్నవాసవదత్తమ్” రెండూ ఉన్న, ఈ వ్యాసంలో కేవలం మొదటి దాని గురించే చెప్పబోతున్నాను.


జానపద కథ నుంచి నాటకీకరణ 

భాసుడు ఎన్నుకున్న ఈ వత్సరాజు ఉదయుని కథ ఆయన కాలంలో జానపదంగా ప్రసిద్ధమట. వింటున్న కథనే తీసుకుని నాటకీకరించాడు. దాదాపు సంస్కృత నాటకలన్నీ ప్రదర్శన ముఖ్యోద్దేశ్యంగా రచించినవే అని, వాటిని చదువుకోవడం (క్లాసురూముల్లో అయినా, విడిగా అయినా) అప్పట్లో ఆచారం కాదని కూడా వినిపిస్తూ ఉంటుంది. మరి ఒక రాజకూమారీ-రాజు మధ్య ప్రేమాయణాన్ని వాళ్ళిద్దరూ స్టేజ్ పైకి రాకుండా నడిపిస్తే ఎలా ఉంటుంది? 

ఎన్నార్ మాయాబజార్ సినిమా గురించి మాట్లాడుతూ, “సినిమాపరంగా ఆ కథకి ముగ్గురు హీరోలు అనుకోవచ్చు. శశిరేఖా పరిణయం కథాంశం కాబట్టి, శశిరేఖను వరించేది అభిమన్యుడు కాబట్టి అభిమన్యుడు హీరో, అంటే ఎన్నార్, అనుకోవచ్చు. కానీ అన్ని అవాంతరాలనీ అధిగమించి పెళ్ళి అయ్యేట్టు చేసిన ఘటోత్కచుడు, అంటే ఎస్వీఆర్ హీరో అని వాదిందచ్చు. అయితే, ఆ అవాంతరాలు అధిగమించడానికి ఘటోత్కచుడు శశిరేఖలా ద్వారకలో అందరినీ నమ్మించడం ముఖ్యం కాబట్టి ఆ పాత్ర పోషించిన సావిత్రే సినిమా హీరో అని కూడా అనుకోవచ్చు.” అని చెప్పారు. తరచుగా మాయాబజార్ గురించి, “పాండవులు లేకుండా పాండవుల కథ చెప్పడమే ఆ సినిమా స్క్రీన్‍ప్లే గొప్ప” చెప్పే మాట కన్నా ఎన్నార్ మాటలు నాకు బాగా గుర్తుండిపోయాయి.  “ప్రతిజ్జాయౌగంధరాయణ” చదువుతున్నంత సేపూ నాకు అవే మాటలు గుర్తొచ్చాయి. 

నాటకం పేరులోనే ఇది “యౌగంధరాయణ” చేసిన ప్రతిజ్ఞలని గురించిందని తెలుస్తుంది. కానీ నాటకానికి నాయకుడు యవనుడు. అతను బంధీ కావడం, వీణ నేర్పించే క్రమంలో ప్రేమలో పడ్డం, పడ్డాక ఆమెతో సహా తమ రాజ్యానికి తప్పించుకుని రావడం. వీటిని పాత్రలతో “రాజుగారిని బంధీ చేసి పట్టుకుపోయారట!”, “బంధీలో ఉన్న రాజుగారి వద్దకు రాకుమారి వీణ నేర్చుకోడానికి వెళ్తుందట”, “రాజుగారు, రాకుమార్తె ప్రేమించుకుంటున్నారట” అని “అట-అట” అంటూ కథలోని కీలక ఘట్టాలన్నింటినీ చెప్పించేశాక కూడా నాటకం రసవత్తరంగా, ఉత్కంఠతతో కొనసాగించగలడం భాసుని మాస్టర్ ఫీట్! 

అయితే, యవనుడు స్టేజ్ మీదకి రాడు కాబట్టి నాటకమంతా మహామంత్రి, వేగులవారు, గూఢచారులు మాత్రమే ఉంటారు. ఎత్తులకి పై ఎత్తులు వేయడం, మారువేషాలలో తిరిగి సమాచారాన్ని పోగేయడం (ఇంత టెక్నాలజీ ఉన్నా ఈ survelliance gameలో అప్పటి వారితో పోటీపడలేం అనుకుంటా!) కుట్రతో ఆక్రమణలు చేయడం, నాటకీకరణలో కీలక ఘట్టాలుగా మారుతాయి. 

“అర్జునుడు సుభద్రని ఎత్తుకునిపోయినట్టు, ఏనుగులు కమలాలని పెకిలించినట్టు, వత్సరాజు వాసవదత్తను ఎత్తుకురాకపోతే, మాట్లాడుతున్నది యౌగంధరాయణుడు కానే కాడు” అని రెండో ప్రతిజ్ఞ పూనుతాడు. 

 వాసవదత్త తల్లిదండ్రులవి కూడా ముఖ్యమైన పాత్రలే. వాళ్ళకి కూతురిపై  ప్రేమ, ఆమెకి మంచి వరుడు దొరకాలన్న ఆత్రుతకి యౌగంధరాయణకి రాజు పట్ల, రాజ్యం పట్ల ఉన్న విశ్వాసానికి మధ్య జరిగే ఒక రకమైన కృత్రిమ పోరు (pseudo war). (వాసవదత్త తల్లిదండ్రులకీ యవనుడు అల్లుడు అవ్వడం ఇష్టమే. వాళ్ళు పెళ్ళి చేసే లోపు వీళ్ళే పారిపోతారు, మహామంత్రి సాయంతో.)

రాజుగారి కథ జనుల నోట

మధ్య మధ్యలో కామెడీ రిలీఫ్ కోసం విధూషకుడి లాంటి పాత్రలు కూడా ఉన్నాయి. అయితే సందర్భోచితంగా, కథకి అనుగుణంగా ఉంటుంది. నాటక ప్రదర్శన ఆబాల గోపాలన్నీ రంజింప చేయాలని కాబట్టి హాస్యాన్ని చాలా చాకచక్యంగా ప్రవేశపెట్టాడు భాసుడు. (స్వప్నవాసవదత్తంలో అది ఇంకా effectiveగా ఉంటుంది.) ఈ నాటకంలో నాలుగో అంకంలో, యవనుడు-వాసవదత్తలను తప్పించడానికి, ఆమెకి ప్రత్యేకించిన ఏనుగుని చూసుకునే మావటివాడి మధ్యా, ఒక సైనికుని మధ్యా జరిగే సంభాషణ చాలా మనోరంజకంగా ఉంటుంది. 

రాజుల, రాకుమారుల కథల్లో మహళ్ళూ, కళ్ళు జిగేలుమనే నగలూ,  ప్రణయాలూ ఓపలేని విరహాలూ- ఇవే ఉంటాయి. వాళ్లలా ప్రేమించుకోడానికో, రహస్యంగా కలుసుకోడానికో, పెళ్ళి చేసుకోడానికో రాజ్యాధికారమూ ఉన్నా లేకున్నా, రాజభక్తి మాత్రమే ఉన్న ఎందరు కలిసి వస్తే పనులు జరుగుతాయో ఈ నాటకం చూపిస్తుంది. స్వప్నవాసవదత్తమ్ కి ఉన్న పేరు ఈ నాటకానికి లేకపోవచ్చు, కానీ ఒక మూలకథలోని అంశాలని అలానే ఉంచుతూ కూడా విభిన్నంగా, రసవత్తరంగా కథని ఎలా మలచవచ్చో, అలా మలచడం ద్వారా ఏయే కొత్త ప్రశ్నలకి, కొత్త గొంతుకులకి చోటు ఇవ్వచ్చో భాసుడు చూపించాడు.

“సంస్కృతం” అనగానే భయపడి దూరం పెట్టే నాలాంటి వాళ్ళకి  ఎంత కోల్పోతున్నామో తెలియజెప్పే నాటకం. పరిచయం చేసిన BORI వారికి, అనువాదం అందించిన ఏ.ఎస్.పి. అయ్యర్ గారికి వేవేల నమస్సులు. (చిలకమర్తి వారి స్వప్నవాసవదత్తమ్ నాటక అనువాదంలో కూడా ఈ కథని చెప్పారుగానీ, నాటక రూపంలో అయితే లేదు. తెలుగులో “ప్రజ్ఞాయౌగంధరాయన” కూడా ఉంటే తెలియజేయగలరు.)

BORI వారి యూట్యూబ్ ఛానల్‍లో సంస్కృత డ్రామా లెక్చర్ సీరీస్ కి లింక్

1956లో ఏ.ఎస్.పి.అయ్యర్ గారి అనువాదం: Two plays of Bhasa: ఆర్కైవ్.ఆర్గ్ లింక్

EDIT: కాటూరి వెంకటేశ్వరరావు గారి తెలుగు అనువాదం: ఆర్కైవ్.ఆర్గ్ లింక్ (సమాచారం అందించిన తాడిగడప శ్యామల రావుగారికి ధన్యవాదాలు)

భాస విరచిత ప్రతిమా నాటకం గురించిన చర్చా వ్యాసం ఒకటి

You Might Also Like

4 Comments

  1. srinivasa rao.v

    రివ్యూ ఎంతో బావుంది.తప్పక చదవడమే తరువాయి.పరిచయకర్త కు ధన్యవాదాలు.

  2. Bolloju baba

    Interesting

  3. తాడిగడప శ్యామల రావు

    మనకు archie.org సైటులో “ప్రతిజ్ఞాయౌగంధరాయణం” నాటకం ఆంధ్రానువాదం లభిస్తోందండీ. కాటూరి వేంకటేశ్వర రావు గారి అనువాదం 1945లో ముద్రితం. మీరు “భాస” అన్న కీ సహాయంతో వెదికితే కనిపిస్తుంది. నేను దిగుమతి చేసుకున్నాను. చదివే ముందు మీకు వర్తమానం ఇస్తున్నాను. ఈనాటకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండీ.

    1. purnima

      ధన్యవాదాలండీ! నేనూ డౌన్లోడ్ చేసుకున్నాను. వ్యాసంలో లింక్ కూడా ఇచ్చాను ఇప్పుడు.

Leave a Reply