స్వప్నవాసవదత్తము : భాస

(నోట్: భండార్కర్ ఓరియంటల్ రిసర్చ్ ఇన్‍స్టిట్యూట్ (BORI) వారి యూట్యూబ్ ఛానల్ లో “సంస్కృత డ్రామా” లెక్చర్ సీరీస్ వింటూ రాస్తున్న వ్యాసాల వరుస ఇది. వీటిని పుస్తక పరిచయాలగానో, సమీక్షలగానో ప్లాన్ చేయడం లేదు. సంస్కృత డ్రామా థియరీ, నాటకకర్త పుట్టుపుర్వోత్తరాల వైపుకి కూడా ప్రస్తుతం పోదల్చుకోలేదు. కేవలం, కథ, కథని నాటకంగా మలచిన తీరు మీద మాత్రమే శ్రద్ధ పెట్టబోతున్నాను. ఇవి, లెక్చర్లు వింటున్నప్పుడు నాటకాలు చదువుతున్నప్పుడు నా రన్నింగ్ నోట్స్ అనుకోవచ్చు.

ఇది సీరీస్ లో రెండో వ్యాసం. అన్నింటినీ ఈ లింక్ లో చూడవచ్చు. )

భాసుణ్ణి సంస్కృత నాటకానికి తండ్రిలాంటి వాడు అంటారు. (Father of Indian theatre.) ఆయన రాసిన నాటకాలు ఒక పదమూడు ఇరవైయ్యో శతాబ్దంలోనే దొరికాయి. వాటిల్లో స్వప్నవాసవదత్తము మహోత్కృష్టమైన రచన అని అంటారు. అందుకు తగ్గట్టుగానే ఉంటుంది నాటకం కూడా. దాని విశేషాలే ఇక్కడ పంచుకుంటున్నాను.

కథా కమామిషు

నిన్నటి వ్యాసంలో చెప్పుకున్నట్టు ఇది వత్సరాజు ఉదయనుడు, వాసవదత్తల ప్రణయ కథ. ప్రతిజ్ఞాయౌగంధరాయణం నాటకంలో రాజూ, రాకుమారి మగధ రాజ్యం నుంచి తప్పించుకుని కోశంబికి చేరుకుంటారు. వాళ్ళకి ఎటూ పెళ్ళి చేద్దామని నిశ్చయించుకున్న ఆమె తల్లిదండ్రులు, కూతురు అలా పారిపోవడంతో, మరో దారి లేక, వాళ్ళిద్దరి చిత్తరువులు గీయించి, వాటికే పెళ్ళి చేస్తారు. 

అలా దంపతులై, అన్యోన్యంగా ఉంటున్న వారి జీవితంలో కొన్ని ఆటంకాలు వస్తాయి. ఉదయనుడికి రాజ్యం పోయి అడవులు పాలవుతాడు. రెండో పెళ్ళి చేసుకుంటే రాజ్యం దక్కుతుందని జ్యోతిష్యులు సూచిస్తారు. కానీ వాసవదత్త అంటే ప్రాణం అతనికి. ఇంకో పెళ్ళికి ఒప్పుకునే ప్రసక్తే లేదు. అందుకని మహామంత్రి యౌగంధరాయణుడు మరో ఎత్తుగడ వేస్తాడు. ఓ రోజు వనవిహారానికి వెళ్ళిన వాసవదత్త మంటల్లో చిక్కుని చనిపోయిందనీ, ఆమెని కాపాడబోతూ మహామంత్రి కూడా అంతమొందాడని కట్టుకథ సృష్టిస్తాడు. అది విన్న రాజు పూర్తిగా శోకంలో మునిగిపోతాడు. “స్వప్నవాసవదత్తం” ఇక్కడే మొదలవుతుంది. 

బూటకపు అగ్ని ప్రమాదం తర్వాత వాసవదత్త, మహామంత్రి మరో రాజ్యానికి చేరుకుంటారు. వాసవదత్తని చూసుకునే బాధ్యత అప్పగించి ఆ రాజ్యపు రాకుమార్తెకు, మహామంత్రి వెళ్ళిపోతాడు. ఆ రాకుమార్తె పద్మావతి. ఆమెకి ఉదయనుడి మీద మనసు. రాజకీయపరంగా కూడా అన్నీ కలిసొచ్చి ఆమె తండ్రి అతనికే ఇచ్చి పెళ్ళిచేస్తాడు. మారు వేషంలో అక్కడే ఉన్న వాసవదత్త తన భర్త పెళ్ళి ఏర్పాట్లు చూసుకోవాల్సి వస్తుంది. ఒక రోజు అనుకోకుండా నిద్రావస్థలో ఉన్న అతనికి ఎదురుపడుతుంది. కానీ చనిపోయిన మనిషి తిరిగిరాదు కనుక అది కల మాత్రమే అని ఉదయనుడు సరిపుచ్చుకుంటాడు.

రెండో వివాహం జరిగి, రాజ్యం మళ్ళీ చేతికి అందాక మారువేషంలో చెలికత్తెగా ఉంది వాసవదత్త అనీ, ఆమెని అప్పగించినవాడు మహామంత్రి అని తేలడంతో నాటకం ముగుస్తుంది. 

నాటకీకరణలో మహాద్భుతాలు

ఈ లెక్చర్ చెప్తున్న ప్రొఫసర్ మాటిమాటికీ గడియారం చూస్తూ “చెప్పాల్సింది చాలా ఉంది, సమయం సరిపోదు” అంటూ ఉన్నారు. ఈ నాటకమనే కాదు, అసలు సంస్కృత నాటకాలకి సంబంధించి ఏ పుస్తకం తెరుస్తున్న రెండు మూడొందల పేజీల సుధీర్ఘ వ్యాఖ్యానాలు, పరిచయాలు కనిపిస్తున్నాయి. కేవలం నాందీ వాక్యం గురించో, ఒక సన్నివేశం గురించో పేజీలకి పేజీలు వ్యాఖ్యానం చెప్పుకుంటూ పోవచ్చు అని అర్థమైంది. “అర్థమైనవారికి అర్థమైనంత” అన్న తరహాలో, నన్ను బాగా ఆకట్టుకున్న రెండు మూడు విషయాలు ప్రస్తావిస్తాను.

నిర్మాణ పరంగా చూస్తే స్వప్నవాసవదత్తం, ప్రతిజ్ఞాయౌగంధరాయణానికి complimentary model. అందులో ప్రధాన పాత్రలు అసలు తెర ముందుకే రారు, ఇందులో అక్కడక్కడే ఉంటారు కానీ ఒకరికొకరు తెలియరు. ప్రేక్షకులనుంచి మాత్రం ఏ దాపరికమూ లేదు, ఏయే పాత్రలు ఏయే పాత్రలుగా మారురూపంలో ఉన్నాయో ముందే వారికి తెలియజేస్తారు. అందులో కపటంతో రాజుని బంధిస్తారు. ఇందులో కపటంతో రాజుని రక్షిస్తారు.

ఈ నాటకానికి ఆయువుపట్టు ఉదయనుడు వాసవదత్తను కలలాంటి నిజంలో చూడడం, చూసి భ్రమని సరిపుచ్చుకునే సన్నివేశం అని చెప్తారు. నాటకానికి పేరు కూడా ఆ సన్నివేశం నుంచే వచ్చి ఉంటుంది. కానీ, నాకు దీని కన్నా, దీని ముందు సన్నివేశం మహా గొప్పగా అనిపించింది.

ఉదయనితో పెళ్ళైన వెంటనే పద్మావతి, వాసవదత్త తోటకి వెళ్తారు. అక్కడ కొత్తపెళ్ళికూతురితో భర్త గురించి ముచ్చట్లు మొదలవుతాయి. “ఏమ్మా, మీ ఆయణ్ణి వీణ నేర్పించమనక పోయావా?” అంటుంది ఒక చెలికత్తె పద్మావతితో. “అడిగాను. ఆయన బదులివ్వకుండా గమ్మునైపోయాడు. నా మీద దయుంచి కన్నీళ్ళు పెట్టుకోలేదంతే!” అని చెప్తూ వాసవదత్త మీద అతని అనురాగానికి మురిసిపోతుంది. ఇది చాలా poignant సన్నివేశం. అచ్చంగా వాళ్ళిద్దరి మీదా నాటకీకరించినా బాగుండేది అనిపిస్తుంది. కానీ, నాటకంలో సినిమాలా జూమ్-ఇన్, క్లోజప్స్ ఉండవు. దూరంగా కూర్చున్న ప్రేక్షకునికి మొహంలో సున్నితంగా మారుతున్న హావభావాలు, కళ్ళల్లో ఉబికి వస్తున్న కన్నీరు కనిపించే సమస్య లేదు. అందుకే వాళ్ళిద్దరి మధ్యన గాఢమైన క్షణాలని ఒక డైలాగు ద్వారా చెప్పించి ఉంటారు.

వీళ్ళిలా మాట్లాడుకుంటుండగా, అక్కడికి ఉదయనుడు విదూషకుడు చేరుకుంటారు. వాసవదత్త పరపురుషులని చూడదు కాబట్టి ఆమెతో పాటు పద్మావతీ, చెలికత్తె కూడా తోటలో వెనక్కి వెళ్ళి నుంచుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఉదయనుడి మాటలు వినిపిస్తుంటాయి. ఆధునిక నాటకాల్లో అయితే ఈ సీన్ ఇలా చూపించచ్చు: స్టేజ్ మీదైతే ఆడపాత్రలు వెనుక భాగంలో ఒక మూలన నుంచుంటే, ముందు భాగంలో, స్టేజ్ మధ్యన మగవాళ్ళు ఉంటారు. ఏ భాగంలో ఉన్నవారు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఫోకస్ పడి, మిగితా భాగమంతా చీకటైపోతుంది. ఎవరి మాటలు ఎవరికి వినిపిస్తున్నాయి, ఎవరికి వినిపించడం లేదు అన్నది డైలాగుల ద్వారా తెలుస్తుంది.

“ఇప్పుడే ఇక్కడకి ఎవరో వచ్చి వెళ్ళినట్టున్నారు” అని ఊహిస్తారు విదూషకుడు, ఉదయనుడు. దానికి నేల మీద రాలిన పూల, కూర్చున్న బండ వెచ్చగా ఉండడం లాంటివి ఉదహరిస్తారు. (ఇప్పుడు క్రియేటివ్ రైటింగ్ క్లాసుల్లో show, don’t tell అని ఊదరగొట్టేది, ఇలా రాయమనే!) తర్వాత విదూషకుడు “నీకు నీ ఇద్దరి భార్యల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టం?” అని అడిగినప్పుడు ఉదయనుడు వాసవదత్త అనే చెప్తాడు. “మరి నీకెవ్వరు ఇష్టం?” అని తిరుగుప్రశ్న వేసినప్పుడు విదూషకుడు తనదైన రీతితో వాసవదత్త గురించి తమాషాగా ఒక మాట అంటాడు. అది వినీ వినగానే ఉదయనుడు “ఉండు, నీ సంగతి వాసవదత్తకి చెప్తాను” అని అనేస్తాడు. “అదేంటి, ఆమె చనిపోయింది కదా?” అని గుర్తు చేయగానే పుట్టెడు దుఃఖం పొంగుకొస్తుంది ఆ పిచ్చి మారాజుకి.

కన్నీళ్ళతో తడిచిన మొహం కడుక్కోడానికి విదూషకుడు నీళ్ళు తీసుకొస్తుంటే పద్మావతే ఎదురొచ్చి రాజుకి నీళ్ళు అందిస్తుంది. (నాట్యశాస్త్ర ప్రకారం స్టేజ్ మీదకు నీళ్ళు తీసుకురాకూడదట. అయినా భాసుడు నీళ్ళు తీసుకొచ్చి మొహం కడుక్కోవడం పెట్టాడు.)

ఈ మొత్తం సన్నివేశం ప్రేక్షకుల గుండెలని సూదులతో మెత్తమెత్తగా గుచ్చుతుంది. అటేమో వాసవదత్త, ప్రాణంగా ప్రేమించిన మనిషి కళ్ళెదుటే ఇంకో మనిషిని వరించడం చూస్తుంది. ఇటేమో పద్మావతి, నవవధువుగా వేవేల కోరికలు పొంగుతున్నా భర్త శోకాన్ని కూడా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. మధ్యనేమో ఉదయనుడు. ముగ్గురినీ ఒకేసారి స్టేజ్ మీద నిలబెట్టి, వారి అంతరంగాల్లోని భావోద్వేగాలని ఆవిష్కరించడం మాటలు కాదు. పైగా భారీ ఉపమాన, ఉపమేయాలు కూడా లేకుండా, కేవలం మాటమాటల్లో లోతులని చూపించడం.

శోకం (grief) గురించి భారతీయ నాటకాల్లో, కావ్యాల్లో భలే గమ్మత్తుగా రాస్తారు. ఒక Othello, ఒక Oedipus చదివేటప్పుడు ముసిరే చిక్కని చీకటి భావన మనవి చదవుతున్నప్పుడు కలుగదు. “ఉండు, నీ సంగతి వాసవదత్తకి చెప్తాను” అన్న మాటలో ఉన్న మరుపు, ఆ మరుపు ఎద్దేవా చేసే వాస్తవం, ఆ వాస్తవం కింద పడి మరో వేయి మార్లు పడి ముక్కలయ్యే మనసు… చిక్కని చీకటిలో తీక్షణమైన కాంతిరేఖని చూసినట్టు… ఆహ్!

భాసుడు ప్రతిభావంతంగా వాడిన మరో డివైస్, పాత్రలు తమతో మాట్లాడుకోవడం, వేరేవాళ్ళతో మాట్లాడ్డం. దాని వల్ల కూడా మనోభావాల లోతులు తెలుస్తాయి బాగా.

అనువాదాలు

చదవడం మొదలెట్టడం ఏ.ఎస్.పి అయ్యర్ గారి ఆంగ్లానువాదంతోనే మొదలెట్టాను. తర్వాత, టిటిడి వారి వెబ్‍సైట్ లో చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి తెలుగు అనువాదం కూడా దొరికింది. రెంటిలోనూ విశేషమేమిటంటే వచనంతో పాటు పద్యాలు కూడా ఉన్నాయి. నాకు నచ్చిన ఒకట్రెండు పద్యాల మూలమూ, తెలుగు, ఆంగ్ల అనువాదాలూ ఇస్తున్నాను, ఆసక్తి ఉన్నావారి కోసం.

మధ్యాహ్నం పూట మొదలైన సన్నివేశం ముగిసేసరికి సంధ్యా సమయం అయిందని సూచించడానికి సూర్యాస్తమయాన్ని ఇలా వర్ణిస్తాడు భాసుడు:

సంస్కృత మూలం:

ఆంగ్లానువాదం:

పైన నేను వివరంగా రాసిన సన్నివేశంలో వచ్చే ఒక పద్యం, దుఃఖం గురించి ఉదయనుడు అనే మాటలు:

సంస్కృత మూలం:



ఆంగ్లానువాదం:

తెలుగానువాదం:

ముఖ్యమైన లింకులు

BORI వారి యూట్యూబ్ ఛానల్‍లో సంస్కృత డ్రామా లెక్చర్ సీరీస్ కి లింక్

1956లో ఏ.ఎస్.పి.అయ్యర్ గారి అనువాదం: Two plays of Bhasa: ఆర్కైవ్.ఆర్గ్ లింక్

టిటిడి వెబ్‍సైట్ లో చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి తెలుగు అనువాదం

స్వప్నవాసవదత్తలోని కొన్ని అంకాల గురించి వాడ్రేవు లక్ష్మీ దేవిగారి వ్యాసం, సారంగ వెబ్ పత్రికలో

You Might Also Like

One Comment

  1. తాడిగడప శ్యామల రావు

    ఈ స్వప్నవాసవదత్తం‌ నాటకాన్ని నాబాల్యంలో చదివానంటే నమ్ముతారా? నాహైస్కూలు రోజుల్లో నాకు యేటేటా బోలెడు ప్రైజులు వచ్చాయి. ఆరోజుల్లో అన్నీ పుస్తకాలే ఇచ్చేవారు వ్యాసరచన, వక్తృత్వం వంటి పోటీల్లో బహుమతులుగా. అలా వచ్చిన వాటిలో ఈ‌స్వప్నవాసవదత్తం‌ నాటకం ఒకటి. మహానుభావుడు ఎవరో మహమ్మద్ కాసిం ఖాన్ గారు చిన్నపిల్లలకు సులువుగా బోధపడేలా భాసుడి సంస్కృతనాటకాన్ని తెలుగులో అద్భుతంగా అనువాదం చేసారు. మీరు ఉదహరించిన రెండు ఘట్టాలూ నాకు మనస్సుకు బాగా పట్టాయి. ఈయన అంతబాగా అనువదించినదే మరొక పుస్తకం ఉత్తరరామచరిత్ర నాటకం కూడా నాకు వచ్చిన బహుమతుల్లో ఒకటి. అదీ మనస్సుకు బాగా పట్టింది. తరువాత ఆ సంవత్సరమే లవకుశ సినిమా వచ్చింది. ఆసినిమాలో చూపిన కథావిధానం తప్పు అని భావించేవాడిని భవభూతి నాటకం ప్రభావంతో ఆ చిన్నతనంలో.

Leave a Reply