డా. జి.వి.కె. విరచిత నాటకము: “బొమ్మ ఏడ్చింది”

వ్యాసకర్త: బి.వి. రామిరెడ్డి

(జి.ఆర్.కే. మూర్తి గారి ద్వారా పుస్తకం.నెట్ కు అందింది.)

*******

డా. జి.వి.  కృష్ణారావు తెలుగులో లబ్ధిప్రతిష్ఠుడైన కవి, నవలాకారుడు, కథకుడు, సాహిత్యవిమర్శకుడు. ఆయన నాలుగు నవలలు, రెండు నాటకాలు, ఒకనాటికా సంకలనం, రెండు కథాసంకలనాలు, నాగార్జునుడి విగ్రహవ్యావర్తిని మీద విమర్శనాత్మక రచన చేశారు. ఆయన తెలుగులో గొప్ప సాహితీకర్త. ఆయన రచనలు ఆదర్శ వాదం, నీతి, జీవన తాత్వికత తో కలిసి ఉంటాయి. ఆయన పాత్ర చిత్రణలో ప్రాథమిక మానవలక్షణాలు దర్శనమిస్తాయి. ఆయన రచనల్లో తన వ్యక్తిత్వానికి సంబంధించిన నమ్రత, మానవత, హేతువాదం దర్శనమిస్తాయి.

ఆర్యనాగార్జునుడి రచనలతో ప్రభావితుడై, ఉపనిషత్తుల సంభాషణా విధానంతో నాగార్జునుడి తాత్వికరచనలను వివరించే ప్రయత్నం చేశాడు. మహాయాన బౌధ్దసాంప్రదాయాలను వివరిస్తూ, నాగార్జునుణ్ణి రెండో బుద్ధుడిగా వర్ణిస్తాడు. ఆయన రచనల్లో మూలమధ్యకారికల మీద వ్రాసిన శూన్యసిద్ధాంతం ప్రసిద్ధమయినది. ఏవీ వాటంతట అవే సృజించబడలేదనీ, కారణ పరిస్థితులమీద ఆధారపడి సృజించబడ్డాయనీ, ఇదే సహజమనీ; ఇది ప్రజ్ఞద్వారానే గ్రహించబడుతుందనీ, కరుణ ద్వారా వ్యక్తీకరింపబడుతుందనీ అన్నాడు. శూన్యం సాధ్యమైనపుడే అంతా సాధ్యమౌతుందనీ, శూన్యం సాధ్యం కానపుడు ఏదీ సాధ్యం కాదనీ అన్నాడు.

ఈ స్థిరమైన స్థితినుండే అన్నీ పరిణామక్రమమైన మార్పు చెందుతాయి. ఈ మార్పువల్లనే మనుషులు జీవించడం, మరణించడం, పునర్జన్మించడం, బాధలనుభవించడం, జ్ఞానవంతులవడం, మోక్షాన్నిపొందడం జరుగుతాయి. అలాంటి ముక్తులు ఇతరులకు తమకు అభేదాన్ని గ్రహిస్తారు. వారు జ్ఞానం వల్ల తాత్వికంగా నిస్స్వార్ధులౌతారు. స్వపరభేదులౌతారు. ఈ విషయాన్ని వివరించడానికే జి.వి.కె. నాగార్జునుడి కృతులను అనువదించారు. నాగార్జునుడి తాత్వికచింతన జి.వి.కె. మీద తిరుగులేని ప్రభవాన్ని చూపింది. అదే ఆకర్షణతో “బొమ్మ ఏడ్చింది” నాటకాన్ని తెలుగులో రచించాడు.

ఈ నాటకం గౌతమీపుత్రశాతకర్ణి చరిత్ర ఆధారంగా రచింపబడింది. శాతకర్ణి బ్రాహ్మణ వాది. అతడు శత్రవులమీద అనేకయుద్ధాలు చేసి, తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేసుకున్నాడు. ఆ సమయంలోనే నాగార్జునుడు రాజుకు ‘సుహృల్లేఖ’ వ్రాశాడు. కాని రాజు ఆయన సలహాను అంగీకరించలేదు. దీన్ని ఆధారంగా చేసుకుని, చారిత్రకపాత్రల ఆధారంగా జి.వి.కె. “బొమ్మ ఏడ్చింది” నాటకాన్ని రచించాడు. ఈ నాటకంలో అయిదు అంకాలున్నాయి. స్వేచ్చ, ప్రజాస్వామ్యం, సామ్యవాదం, భావస్వేచ్చ మొదలైన నాగార్జునుడి ఆలోచనలను, అభిప్రాయలను ఈ నాటకంద్వారా విశదీకరించాడు.

ఈ నాటకంలో రచయిత మతసిద్ధాంతాల మధ్య సంఘర్షణని, అధికారానికీ శాంతిని ప్రేమించే భిక్షువుకీ అంతేవాసులకీ మధ్యసంఘర్షణనీ; ఈ సంఘర్షణ లోంచి నీతిపథం, జ్ఞానం ద్వారా భిక్షువులు బోధిసత్వులుగా ఎలా బైటపడిందీ వివరిస్తాడు.

ఈ నాటకం బంగారుబొమ్మలాంటి కన్య – వాశిష్ఠి తన ఉత్తరీయంతో చలువరాతి బొమ్మ ముఖాన్ని తుడవడంతో ప్రారంభమౌతుంది. బొమ్మను తుడుస్తూ, ఆ బొమ్మ మొహంలోకి, కళ్ళలోకి తీక్షణంగా చూస్తుంది. వెనక నుంచి “బుద్ధం శరణం గచ్చామి… లోకేశ్వరం భజావిం” అని వినిపిస్తూ ఉంటుంది. అది వింటూ ఆమె – ఆ గీతం ఏదో నాటకానికి నాందీగీతం అనుకుంటుంది. ఆ సందేహ నివృత్తి కోసం అంతః పురచారిక విజయను పిలుస్తుంది. ఆమె పలకదు. అయ్యగారు లింగాలకు, అమ్మగారు జంగాలకు అంకితమయ్యారు అంటూ రాజుకు వైదికమతం మీద, రాజమాతకు బౌద్ధసాంప్రదాయం మీద ఇష్టమనే విషయాన్ని తెలియజేస్తుంది.

రాజమాత గౌతమిబాలశ్రీ అంతఃపురానికి తిరిగివొస్తుంది. ఆమెను స్వాగతించేందుకు విజయ, వాశిష్ఠి పరిగెడతారు. ఆ తొందరలో వాశిష్ఠి తనపై ఉత్తరీయాన్ని వేసుకోవడం మరిచిపోతుంది. అది గమనించి రాజమాత “మనం మహా సామ్రాజ్య పాలకులం. జాతిని దిద్ది సంప్రదాయం నెలకొల్పవలసినది మనం. మనమే సంప్రదాయం ఉల్లంఘిస్తే పాటించే వారెవరు?” అని చెప్పి కాబోయే రాణికి కర్తవ్యపాలన సూచిస్తుంది. తాను రాజును కలుసుకోవడానికి తానువెళ్ళాలో, లేక రాజే స్వయంగా రాజమాతను కలుసుకుంటాడో తెలుసుకోమని విజయను పురమాయిస్తుంది. వాళ్ళకి రాజధర్మాన్ని బోధిస్తుంది. వాశిష్ఠి తన మీద బెంగతో చిక్కిపోయినందుకు బాధపడుతుంది. అప్పుడు వాశిష్ఠి బొమ్మ ఏడుస్తున్న సంగతి రాజమాతకు తెలియచేస్తుంది. అందుకు రాజమాత ఆశ్చర్యంతో బాధపడుతుంది. ఆ అనర్ధానికి కారణం వాశిష్ఠిని అడుగుతుంది. దేశంలో భిక్షాటనను నిషేధించారనీ, భిక్షాటనకు వొచ్చిన ఎందరో భిక్షువులను, ఉపాసకులను చెరసాలలో బంధించారనీ చెబుతుంది. దీనికి కారకుడు అమాత్యుడు శివగుప్తుండనీ తెలుసుకుంటుంది. అతడు వైదీకుడు. పదిరోజులక్రితం ముగ్గురు భిక్షువులు, భిక్షయాచిస్తూ భిక్షాపాత్రలతో తమ గుమ్మం ముందు నిలబడ్డారు. వారిలో ఒక భిక్షువు తనను ఆరోగ్యంతో వర్ధిల్లమని ఆశీర్వదించాడనీ, ఇంతలో సైనికులు వొచ్చి తీసుకొనిపోయి జైలులో బంధించారని విజయ చెప్పింది. అప్పట్నించీ బొమ్మ ఏడుస్తోందని రాజమాతకు చెబుతుంది.

రాజమాత వినయధరుణ్ణి పదిరోజులక్రితం జైలులో ఉంచిన ముగ్గురు భిక్షువులను తనదగ్గరకు తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తుంది. రాజమాతకు స్వస్తి చెబుతూ ఆ భిక్షువులు రాజమాతను దర్శించుకుంటారు. తాము భిక్షువులమనీ, భిక్షాటనను రాజ్యంలో బహిష్కరించిన విషయం తెలియక తాము భిక్షకోసం వచ్చామనీ చెబుతారు. వారు వాశిష్ఠి నించి భిక్ష ఎందుకు స్వీకరించలేదని అడిగితే ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడబోతోందనీ, అలాంటి జబ్బులు ఆచార్య నాగార్జునులు మాత్రమే నయం చేయగలరనీ చెప్పి, తమను కారాగారంలో వుంచినందుకు సైనికులను క్షమించమనీ వేడుకుంటారు. ఆ విధంగా ప్రధమరంగంలోనే రాజుకు రాజమాతకు మధ్య వున్న మతవిభేదాలను, రాజమాతలోని మమతాస్వభావాన్ని, బాధితులను ఆదుకునే దయాగుణాన్నీ తెలియజేస్తాడు.

రెండవరంగంలో రాజు అంతరంగిక సమావేశంలో తనమంత్రులతో చర్చిస్తుంటాడు. ఆచార్యనాగార్జునుడు వ్రాసిన (సుహృల్లేఖ) ఉత్తరాన్ని చదవమని మంత్రి నాగామాత్యుణ్ణి ఆదేశిస్తాడు. ఆ ఉత్తరం సారాంసం ఇదీ:

మీరు బలవంతులైన ప్రభువులు. నేను సామాన్యభిక్షువును. మీమీది ప్రేమపూర్వక స్నేహం ప్రప్రంచం మీది కరుణతో మీకిష్టంలేని ఒక మంచి సలహా ఇవ్వాలనుకుంటున్నాను!! మీరు ఈ లోకంలోకి వొస్తూ రాజ్యాన్ని మీతో తెచ్చుకోలేదు; పోతూ వెంట తీసుకుపోరు. ధర్మమార్గాన్ని ఆచరించండి. మత్తును వొదిలించుకోండి. మత్తుకు బానిసైన వారిని సంఘం గౌరవించదు. అది సంపదను దూరం చేస్తుంది. మత్తు కోరికలకూ, కోరికలు అవినీతిపనులకూ దారితీస్తాయి. అందుచేత మత్తుపానీయాలను విసర్జించండి. మీ కారగారబంధితుల్లో రోగగ్రస్తుల్ని విడుదల చేయండి. కారాగారవాసులకు స్నాన, భోజన సౌకర్యాలు సరిగా అందేట్టు చూడండి. వాళ్ళను సంతోషంగా ఉండనివ్వండి. న్యాయ విచారణలేకుండా బందీలైన నేరస్తులను న్యాయవిచారణ చేసి దేశబహిష్కారశిక్ష విధించండి!!

ఉత్తరం చదవడం అయ్యాక శాతకర్ణి తల్లి గౌతమితో, “అమ్మా, ఉత్తరాన్ని విన్నావుకదా, దాని సారాంశం నీకు బోధపడిందా? ఇంతకీ అతను రాజును పొగుడుతున్నట్టా తెగడుతున్నట్టా? ఈ రాజ్యానికి రాజులేడా? ఇన్ని రోజులూ మనం పాముకు పాలు పోసిపెంచాం. గతాన్ని తవ్వుకుని ప్రయోజనం లేదు. నా అభిప్రాయాల్ని విని మంచి చెడులని తెలియజెయ్యి. ఈ దేశంలో వేదమతం తప్ప వేరేమతం ఉండడానికి వీల్లేదు. రకరకాలమతాలు, వాటి మధ్య భేదాభిప్రాయాలు, రకరకాల నమ్మకాలతో ఈ దేశం నాశనం కారాదు. తీర్థయాత్రల పేరుతో ఏ విదేశస్తుడూ ఈ దేశంలో ప్రవేశించడానికి వీల్లేదు” మంత్రులు మల్లనాగు, శివగుప్తుడు రాజు అభిప్రాయాన్ని బలపరుస్తారు. రాజు రాజమాత అభిప్రాయం కోసం ఎదురుచూస్తుంటాడు.

యువకుడైన శాతకర్ణి వేదధర్మాన్నే రాజధర్మంగా ప్రకటించడంతో రాజమాత తన కుమారుణ్ణి “హేతుబద్ధంగా ఆలోచించమనీ, విశాలదృక్పధంతో నిర్ణయాలు తీసుకోమనీ, అందువల్ల దేశం అభివృద్ధి చెందుతుందనీ, తల్లిగా, రాజమాతగా తాను రాజు మంచినే కోరతాననీ; మనుషుల్లో కొందరు అంతర్ముఖులు, కొందరు బహిర్ముఖులుగా ఉంటారనీ; అంతర్ముఖులకు మతం కావాలనీ, బహిర్ముఖులకు రాజ్యం కావాలనీ అంటుంది. యువకుడిగా నీకు రాజ్యకాంక్ష వుంది. నీమంత్రులు ఆలోచనా అదే. లేకుంటే వారు ఈ పాటికి వానప్రస్థం స్వీకరించి తపస్వులుగా  అరణ్యంలో వుండవలసింది. అందరిదీ సామ్రాజ్యవిస్తరణ జరగాలనేదే కోరిక. చిన్న రాజ్యంలో అయితే ఒకే మతం, ఒకే సాంప్రదాయం అనే ఆదర్శం ఉంటుంది. అయితే మనరాజ్యం చిన్నది కాదు. అది హిమాలయాల వరకు విస్తరించబోతోంది. ఇంత విశాల సామ్రాజ్యంలో అనేకమతాలు, జాతులు, లక్ష్యాలు ఉంటాయి. వీటన్నిటినీ మనం అణచి వేయగలమా? సామ్రాజ్యం విస్తరించి, సుస్థిరంగా నిలబడాలంటే ఏమి కావాలి? ఇంతకూ ఆ ఉత్తరం రాసింది ఆచార్య నాగార్జునులేనా? అయితే ఆ ఉత్తరం ఎందుకు రాశారో ఊహించావా? లోకమంతా ఆయన్ని ‘మానకలశు’డని పొగుడుతోంది. తల్లి పుత్రుడికి అండగా ఉంటుందని ఆయనకు తెలియదా?” అంటుంది. అందుకు మంత్రులు ఆయనను క్షుద్రబోధకుడని నిందించారు. అందుకు గౌతమి – “క్షమించండి. అన్నీ తెలిసే మహారాజు ధాన్యకటకానికి చుట్టూ రక్షణగోడను నిర్మించారు. శ్రీపర్వతం మీద విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. అక్కడ వేలమంది విద్యార్ధులు వివిధ విద్యల్లో, శాస్త్రాల్లో విద్యనభ్యసిస్తున్నారు; వేలాదిరోగులు స్వస్థతపొందుతున్నారు. అయితే మనం వారికెప్పుడైనా సాయపడ్డామా? వారెప్పుడైన మన సహాయాన్నర్ధించారా? మనం సాయం చేయలేదని మనల్ని ఎప్పుడైనా అసహ్యించుకున్నారా? అలాంటి వార్తల్ని వారి గురించి మనం ఎప్పుడైనా విన్నామా?” అని రాజును నిలదీసింది.

“మరి ఈ ఉత్తరమేమిటి?” అని శాతకర్ణి తల్లిని ప్రశ్నిస్తాడు. అందుకు గౌతమి – “ఆయన మనల్ని బౌద్ధమతం స్వీకరించమని అడగడం లేదు. బౌద్ధుల్ని ప్రేమగా చూడమనీ అడగడం లేదు. మతభావాల్ని అణిచివేయటం సాధ్యం కాదు. ఆ మతాన్ని పట్టించుకోకు అసహ్యించుకోకు. ద్వేషం అగ్ని కంటె భయంకరమైనది. ఉపేక్ష పాపం కాదు. మధ్యపానం మానుకో. ప్రజలను నీ పిల్లల్లా కాపాడు. ప్రజల ప్రేమతో రాజ్యాన్ని విస్తరించు. ధర్మాన్ని వీడకు. అదే ఆయన చెప్పింది. దానికి మనం కోపగించుకోవాలా? కత్తిదూయాలా? ఆయన సలహాని పాటించు, లేదా వొదిలెయ్యి. ఆయన ఆ ఉత్తరం వ్రాయడం దేశద్రోహం కాదు. అలాంటి సలహాలను తన అనుయాయలకూ ఇవ్వరు; దేశద్రోహాన్ని ప్రోత్సహించరు. నీవు పశ్చిమరాజ్యాలమీద దండు వెడలునపుడు అంతర్యుద్ధానికి ఆయన ప్రయతించలేదు. నా మూడు నెలల పర్యటనల్లో ఈ మధ్య మనం జయించిన రాజ్యాలు తిరగబడడానికి సన్నద్ధమౌతున్నట్టు తెలిసింది. రాజమాతగా నేను నీకిచ్చే సలహా! గర్వం మంచిది కాదు. అంతర్ ఘర్షణలు మంచివికావూ” అన్నది. తల్లిమాటలు విని నాగార్జునుడు తమకు హితుడో అహితుడో తెలుసుకోవాలని శాతకర్ణి భావించాడు. రాజమాత హేతుపూర్వంకంగా ఒకే మతం అంత విశాల సామ్రాజ్యంలో ఉండాలనుకోవడంలోని అసంబద్ధతను తనకుమారుడికి, మంత్రులకి తెలియజేస్తుంది.

మూడవ రంగంలో మంత్రి శివగుప్తుడు శ్రీపర్వతానికి వొచ్చి, నాగార్జునునితో రాజ్యంలోని ప్రజలు నిత్యానుష్టానాలతో ప్రవర్తించినపుడే దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందనీ, అందరికీ రక్షణ ఉంటుందనీ, అందుకే తాము దండయాత్రలు చేస్తునామనీ, ఆయుద్ధాల్లో గాయపడే తమ సైనికులకు వైద్యసేవలందించేందుకు భిక్షులందరూ సైన్యంతో పాటుగా యుద్ధభూమికి రావలసివుంటుందని రాజాజ్ఞగా తెలియజేస్తాడు. అందుకు నాగర్జునుడు “ప్రజలబాధల్ని వినే మహాయాన బౌద్ధ భిక్షువులు తలలు గొరిగించుకుని, సాధువస్త్రాలు ధరించి, భిక్షాపాత్రలతో, భక్తితో, వారి శక్తినంతా ప్రజాశ్రేయస్సుకోసమే సంసారాన్ని స్వర్గాన్ని నిర్వాణమార్గంలో నడిపించేందుకు హిమాలయాల పర్యంతం పర్యటిస్తున్నారనీ, దీన్నంతా వొదిలి, భిక్షువుల్ని సైన్యంతో బాటు రమ్మనడం ధర్మమేనా? రాజుగారి ఆజ్ఞ ప్రజోపయోగకరమేనా? బౌద్ధధర్మం సన్యాసాన్ని ప్రజోపయోగం కోసం ఉద్దేసించింది. అది ఎప్పుడూ రాజుగారికి వ్యతిరేకమయింది కాదు. అది ఎప్పుడూ శాంతికీ, ప్రగతికీ ప్రయత్నిస్తుంది. అందుచేత రాజుగారే నిర్ణయించాలి – మతం కావాలో రాజ్యం కావాలో. ఆయనకు మతమే కావాలనుకుంటే రాజ్యాన్ని వొదులుకోవాలి. ఇది నేను రాజుగారి మంచిని కోరి మాత్రమే చెబుతున్నాను” అన్నాడు.

అందుకు మంత్రి శివగుప్తుడు, “మమ్మల్ని బెదిరిస్తునారా?” అని ప్రశ్నిస్తాడు. అందుకు నాగార్జునుడు – “బడుగు బిచ్చగాండ్రు బెదిరించగలరా? నా తాత్పర్యం తమకు స్పష్టం కాలేదు. దానశీలం, క్షాంతివీరం ధ్యానప్రజ్ఞలు బౌద్ధానికి ప్రాధమిక సూత్రాలు. ఇవి ప్రాపంచికంగా కోరబడేవి. మతం పేరుతో ఎవరైనా వీటిని తృణీకరిస్తే వారు ఇతరుల్ని మోసం చేయడమేగాక, తమ ఆత్నని తామే మోసగించుకున్నవారవుతారు. నిజమైన మతం ధ్యానప్రజ్ఞాసమ్మితం. ఇది ఆత్మ ప్రభోధితం. దీనికి బాహ్యప్రభోధాల్లేవు” అన్నాడు. శివగుప్తుడు రాజానుయాయి, మూర్ఖుడు. అతడివేమీ అర్ధం చేసుకోకుండా, అయితే మీరు రాజాజ్ఞను శిరసావహించరన్న మాట అన్నాడు. “బౌద్ధులు మతం, జాతి, కులం దేశం అనే భేధం లేకుండా మానవాళికి సేవ చేసేందుకు అంకితమయ్యారు. అందుచేత వారు రాజుగారికి సహాయపడేందుకు సిద్ధంగా వుంటారు. కాని, అందుకోసం వారు తమ కాషాయవస్త్రధారణను వదులుకోలేరు” అన్నాడు. అందుకు శివగుప్తుడు యుద్ధంలో గాయపడ్డ సైనికులు మనవాళ్ళైనా శత్రుసైనికులైనా వారికి సేవచేస్తారన్న మాట! “శ్రీపర్వతమెక్కడ ఉన్నది? మహారాజులవకాశమిస్తే కదా క్షతగాత్ర శత్రువులకు ప్రవేశం! పూజ్యభిక్షువులేమంటారు? అంతేకదా?” – అంటూ మూర్ఖంగా వాదించిన శివగుప్తునికి రాజుగారికి తన శుభాశీస్సులు తెలియజేయవలసిందిగా నాగర్జునుడు కోరాడు.

నాలుగవరంగంలో విహారంలో జరుగుతున్న అనుకోని సంఘటనలు గురించి ఆర్యదేవునితో ఆలోచిస్తూ, తనలో జీవితం అంత తేలిగ్గా తర్కానికిలొంగి అర్ధం కాదనుకుంటాడు. అంతలో గంటారావం వినిపిస్తుంది. అంతరాత్రిలో వొచ్చిన వారెవరో చూసిరమ్మని ఆర్యదేవుణ్ణి పంపుతాడు. వారు కొంతమంది విదేశీయుల్ని వెంటబెట్టుకొచ్చారు. వారిలో ప్లాటినస్ తాను విదేశీయుడననీ, తన అనుయాయులు కొందరు గాయపడ్డారనీ వారంతా గ్రీకుసైనికులనీ, రేవులో నిరీక్షిస్తున్నారనీ, వారిబోధనలవల్ల వారు ప్రపంచవీరులని అర్ధమైందనీ, తాము యుద్ధాన్నీ తమ రాజునీ వొదిలి, వైద్య సహాయం అందగలదనే ఆశతో వొచ్చామనీ తెలియజేస్తారు. వారి కథనం విని నాగార్జునుడు వారికి నాలుగు షరుతులు పెడతాడు. అవి: 1. వారు తమ గ్రీకుగుర్తింపును వొదులుకోవాలి. 2. అహింసామార్గాన్ని విడనాడకూడదు. 3. ఇక్కడి న్యాయసూత్రాల ప్రకారం నడుచుకోవాలి. 4. ఇక్కడి ప్రజలతో మమేకమై వారి కస్టసుఖాల్లో భాగస్థులు కావాలి. వారీ నాలుగు షరతుల్ని వొప్పుకొని, మహాయానమార్గాన్ని అవలంబించడానికి అనుమతి కోరారు. భిక్షులెవరూ వారిని అడగకపోయినా తమంతతామే బుద్ధధర్మంలోకి తీసుకోమని ప్రాధేయపడ్డారు. వెంటనే గాయపడ్డవారిని వైద్యశాలకు తీసుకువెళ్ళమని శాంతిమూలుని నాగార్జునుడు ఆజ్ఞాపిస్తాడు.

అచార్యనాగార్జునుడు, ఆర్యదేవుడు, ప్లాటినస్, మంత్రి శివగుప్తుడు, సభలో ప్రవేసించి రాజుకు శుభాభినందనలు తెలుపుతారు. శివగుప్తుడు నాగార్జునుని రాజుకు పరిచయం చేస్తాడు. నాగార్జునుడు రాజుకు అన్ని శుభకామనలు జరుగుగాక అని ఆశీర్వదిస్తాడు. అందుకు శాతకర్ణి “నేరస్తులనుండి న్యాయాధిపతి శుభాశీస్సులు స్వీకరించలేడు” అంటాడు. నాగార్జునుడు “ఇంతకు ముందుమీరు మరొక నేరస్తుడికి ఆసనమిచ్చి గౌరవించారు గదా” అంటాడు. శివగుప్తుడెలా  నేరస్తుడో రాజుకు అర్ధంకాదు. రాజు తమను బంధించి తీసుకురమ్మని ఆజ్ఞాపించినా, శివగుప్తుడు తమను బంధించి తీసుకురాలేదనీ; మహాభట్టారిక అనారోగ్యంతో వున్నారనీ, మిమ్మల్ని చూడాలని రమ్మన్నారని అబద్ధం చెప్పి తీసుకొచ్చారు; రాజమాతను గురించి అమంగళం మాట్లాడడం అన్నిటికన్నా గొప్పనేరమనీ అంటాడు. రాజు మల్లనాగుని అడిగితే రాజాజ్ఞను ధిక్కరించడం, రాజుగారు ఆత్మబంధువుల్ని గురించి అమంగళంగా మాట్లాడ్డం నేరమేననీ చెబుతాడు. రాజు అతణ్ణి ఉరితీయమని ఆజ్ఞాపిస్తాడు. ఆర్యదేవుడు శాతకర్ణిని మల్లనాగుకు పోయిన చూపు ఎవరి దయవల్ల వొచ్చిందో అడిగి తెలుసుకోమంటాడు. అందుకు మల్లనాగు రాజుశ్రేయస్సు కోసమే తాను రహస్యంగా మారుపేరుతో అక్కడికి వెళ్ళాననీ అక్కడ వైద్యం చేయించుకోవడం వల్ల తనకు కంటిచూపు వొచ్చిందని చెబుతాడు. ఆ విషయాన్ని తనకు తెలియకుండా దాచిపెట్టిన మల్లనాగు రేపు తనను హత్య చేయించడని నమ్మడం ఎలాగని రాజు కోపంతో అతనికి యావజ్జీవకారాగార శిక్ష విధిస్తాడు. ఆ విధంగా నాగార్జునుడు, ఆర్యదేవుడు మంత్రుల మోసపూరిత కార్యకలాపాలను రాజు దృష్టికి తీసుకువచ్చి వారికి శిక్ష పడేలా చూస్తారు.

తరువాత ఆభిక్షువులను తానెందుకు రాజాస్థానానికి రప్పించాడో, వారిమీద అభియోగలేమిటో తెలుసా అని ప్రశ్నిస్తాడు. ధర్మోపదేశం కొరకు అంటాడు నాగార్జునుడు. తాను భిక్షువుకాదనీ, తాను ఉపదేశించమని అనలేదని అంటాడు రాజు. మనం అడక్కపోయినా సూర్యుడు తన ప్రకాశంతో, చీకటిని తొలగిస్తున్నాడు కదా అంటాడు నాగార్జునుడు. అది సరైనపోలిక కాదంటాడు రాజు. నాగార్జునుడు – నాయనా, నీవు రాజువే, చక్రవర్తివికావు. అహంకారం వొదులుకోవడం మంచిదే కాని ప్రమాదం కాదు. నేను చెప్పింది బుద్ధభగవానుని గురించి. రెండోది, కాషాయాంబర ధారణను త్యజించడం బుద్ధ ధర్మానికి వ్యతిరేకం. మూడోది, రాజ్యం మీద విదేశీ దండయాత్ర జరిగితే విహారాలను ఎలా కాపాడుకోవాలో భిక్షులు చూసుకోవాలి. నాలుగోది, విదేశీయులకు కావాలని మేము ఆశ్రయం కల్పించలేదు. మాధర్మాన్ని, మా సిద్ధాంతాలను ఆచరించేవారికి మాత్రమే ఆశ్రయం కల్పించాం. అందుకోసం కొన్ని ప్రాథమిక సూత్రాలున్నాయి. అవి – మానవత, శాంతి, రక్షణ. ఇవి బుద్ధభగవానుని బోధనలు.

శాతకర్ణికి కోపం వొచ్చింది. రాజ్యానికి రాజు గౌతమీపుత్రశాతకర్ణి, బుద్ధుడు కాదు. నీది దేశద్రోహం. అందుకు నిన్ను ఉరితీయాలి. కాని, మీరిద్దరూ బ్రాహ్మణులు. అందుచేత మీకు దేశబహిష్కార శిక్ష విధిస్తున్నాను. ప్లాటినస్ విదేశీయుడు. అతనికి మరణశిక్షకూడ తక్కువే. ఆర్యదేవుడు ఒకేరకమైన నేరానికి వేరువేరు శిక్షలేమిటి అని ప్రశ్నిస్తున్నాడు. అదే వైదికధర్మం అన్నాడు. భిక్షువులిద్దరు ఏమీ చలించకుండ, ఏమీ జరగనట్లు రాజప్రసాదం నించి నిష్క్రమిస్తారు.

ప్లాటినస్ వారివద్ద వీడ్కోలు తీసుకుంటూ—మీ కళ్యాణమిత్రత్వాన్ని పొందే అవకాశం ఇక నాకు లేదు. నా కడపటి ప్రణామాలు స్వీకరించండి అంటాడు. నాగార్జునుడు—నాయనా నీకెన్నో ఆశలు కల్పించాను, వాటన్నిటినీ మరిచిపో అన్నాడు. ప్లాటినస్—తమ దయవల్ల మాధ్యమిక విధానాన్ని నేర్చుకున్నాను. నాకిప్పుడేమీ విచారంలేదు. కాని ఈ అధికారకాంక్షలో మునిగి వున్న రాజుకు జ్ఞానోదయమౌతుందా? మైత్రేయభగవానుడైనా ఇతణ్ణి మార్చగలడా? అదే నా విచారం అంటాడు. సోపధి నిర్వాణాన్ని పొందినవారు ఏం చెబుతారో నీవు అదే చెప్పావు అంటాడు నాగార్జునుడు.

ప్లాటినస్ ని సైనికులు తీసుకువెడుతుండగా వాశిష్టి పరుగెడుతూ ఆర్యనాగార్జునుని దగ్గరకు “తాతయ్యగారూ … తాతయ్యగారూ” అని పిలుస్తూ వొస్తుంది. “మీరిప్పుడే వెళ్ళిపోతున్నారని విజయ చెప్పగా విని వొచ్చాను” అంటుంది. “విజయ ఎవరు?” అని నాగార్జునుడు ప్రశ్నిస్తాడు. “ఆ రోజు నేను చెప్పానే ‘బుద్ధపాలికా’ అని ఆవిడ. అది అబద్ధం. నన్ను క్షమించరూ”, అంటుంది. అందుకు నాగార్జునుడు “అమ్మ బుద్ధుడు కరుణాస్వరూపుడు. ఆయన అందర్నీ క్షమిస్తాడు” అంటాడు. “ఇలాంటి దుష్టప్రభువును కూడానా?” అని ఎదురుప్రశ్నిస్తుంది. “తప్పక క్షమిస్తాడమ్మా” అంటాడు. “అయితే భగవానుడు మంచివాడు కాదు” అంటుంది. “అమ్మా అలా అనకు. లోకంలో ఎప్పుడూ ఒక ఆశాకిరణం ఉండాలి. నీవు రాజును అసహ్యించుకోకూడదు. అతనిలోనూ మంచితనం ఉంది. నీవు అతణ్ణి వివాహం చేసుకోవాలి” అంటాడు. “దుర్మార్గపు కార్యాలు చేసేవాణ్ణి చేసుకోమంటారా?” అంటుంది. “అలా అనకు తల్లీ. నీవు రాణివవ్వాలి, నీ పుత్రుడు చక్రవర్తి కావాలి” అని బయలుదేరతాడు. ఆమె మరలా “తాతయ్యా… తాతయ్యా…” అని పిలుస్తుంది. ఆగి “ఏంతల్లీ” అని అడుగుతాడు. ఆమె “మా ఇంట్లో బొమ్మ ఏడుస్తోంది” అంటుంది. “అవునమ్మా, నాకు తెలుసు. ఆ బొమ్మ అలా ఏడుస్తూనే ఉంటుంది. ఆ బొమ్మ మనుషుల మనసుల్లో ప్రతిబింబించినపుడు ఈ ప్రపంచం సంతోషంగా ఉంటుంది. ఈ విషయాన్ని మీ అత్తయ్యకు చెప్పు” అంటాడు. ఆమె చివరిగా నాగార్జునునికి దుఃఖంతో నమస్కరిస్తుంది. “కళ్యాణ ప్రాప్తిరస్తూ” అని దీవిస్తాడు. ఆయన మాటల్లో కరుణ తాండవిస్తుంది.

నాటకాంతానికి ముందు రాజమాత గౌతమి బాలశ్రీ చెదిరిపోయిన తలతో, పాలిపోయిన ముఖంతో, చేతిలో బొమ్మలతో రాజప్రసాదంలోకి వొస్తుంది. ఆమె ప్రవేశిస్తుండగా “జయము జయము భట్టారికకూ” అని వినిపిస్తుంది. అదేమీ వినిపించుకోకుండ బొమ్మలతో ఆడుకుంటూ, పొంతన లేకుండా మాట్లాడుతూ, పాడుతూ ఉంటుంది. విజయ “అమ్మ.. అమ్మా లోపలికి రండి. మీక్కావల్సినన్ని బొమ్మలిస్తాను” అంటుంది. గౌతమి అలా పొంతన లేకుండా మాట్లాడుతూనే ఉంటుంది “వాళ్ళిద్దరేనా? ఎవరు చెప్పారు? నేనెవర్ని? నేను తధాగతుణ్ణి.. సిధ్దార్థుణ్ణి..” వాశిష్ఠి అంటుంది” “అత్తయ్యా … అత్తయ్యా … వారి గుండెలు మండుతున్నా రాజులు, మహాభట్టారికలు ఆవిషయాన్ని ప్రపంచానికి తెలియనీయకూడదు!” వాశిష్ఠి నాటక ప్రారంభంలో అత్తగారు తనకు ఏ సలహా యిచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే సలహాను తన అత్తగారికిస్తుంది. దురాన్నించి ఈ సంభాషణ వింటున్న ఆర్యదేవుడు తనలో గొణుక్కుంటాడు – “ఆహా! భగవాన్ తత్వం మనకు అర్ధం కాదు”. ఆర్యనాగార్జునుడు “బుద్ధం శరణం గచ్చామీ” అంటున్నాడు.

గౌతమి బాలశ్రీ తన హోదాను మరిచి, కుమారుడి ప్రవర్తన వల్ల, తనకు వాశిష్ఠికి ఇష్టంలేని విషయాలవల్ల, ప్రపంచానికి తెలియకూడదన్న రాచరికపు విషయాలు, ధర్మాలు ఇప్పుడు గౌతమి మాటలు మనకు నాగార్జునుడు శూన్యతను గురించి చెప్పిన మాటలు గుర్తొస్తాయి. “పరస్పరాశ్రయ హేతువులు, మార్పు, వస్తువులు ఎటైనా వెళ్ళొచ్చు”. అవి ఎటు వెడతాయనేది వ్యక్తి చేసే పనులు నిర్ణయిస్తాయి. “గౌతమిబాలశ్రీ హేతుబద్ధంగా, స్వతహాగా, రాజు చేసే నిర్ణయాలవల్ల జరగబోయే పరిణామాలను అర్ధం చేసుకుంది”. రాజు ప్రజల మత నమ్మకాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని చెప్పడంలో సఫలీకృతురాలు కాలేకపోయింది. సుదూర ప్రాంతాలనించి వొచ్చిన విధ్యార్ధులకు శాస్త్రం, తర్కం, తత్త్వ శాస్త్రాలు బోధించడం, అవసరమైనవారి ఆరోగ్యసహాయానందించడం లాంటివి ఆచార్య నాగార్జునుడి, అతని అంతేవాసులు శ్రీపర్వతం మీది విహారంలో చేస్తున్నారు. తనకుమారుడు గుడ్డి కోపంలో ఆచార్య నాగార్జునుణ్ణి దండించడం, రాబోయే పరిణామాలకు అవగాహన, తన అసహాయత, చిత్తసౌకుమార్యం ఆమెను మానసిక రోగిగా మార్చాయి. నిర్వాణమార్గంలోకి వెళ్ళాల్సిన ఆమె మానసిక సమతౌల్యాన్ని కోల్పోయింది.

ముగింపు

మతం వ్యక్తిగతం అంటారు. అది నీతికి, నడతకు సంబంధించింది కూడా. శాతకర్ణి బాలశ్రీ, శాతకర్ణి నాగార్జునుల మధ్య జరిగిన పర్యాలోచనలు మతానికి నీతికి మధ్య రేఖను చెరిపివేస్తే రాజ్యంలో శాంతి సామరస్యాలు సాధ్యం కావని తెలుస్తుంది. అంతే కాదు, రాజు ఒక మతం మీద అయిష్టతతో ఆ మతావలంబకుల మీద అసహానాన్ని పెంచుకుంటే అతని మంత్రులూ అదే మార్గాన్ని అవలంబిస్తే, ఇతర మతస్తుల విధ్వంసానికి కారణమౌతారు.

అజ్ఞానం, కోరికలు, కర్మ మొదలైనవి నిర్వాణానికి శత్రువులని ఆర్యనాగార్జునునికి తెలుసు. అవి లేకపోవడమే నిర్వాణం. మంచి దృక్పధం, మంచి జీవన విధానం, మంచి ప్రయత్నం, మంచి మనస్తత్వం, మంచిమాట, మంచి పని, మంచి ఆలోచన, మంచి దృష్టి – వీటిని తప్పకుండ జీవించడం నిర్వాణమార్గం. అందుకే శాతకర్నికి వీటికి ప్రతీకగా నిలచిన కాషాయధారణను విడిచి యుద్ధభూమికి రాలేనని తెలియజేస్తాడు. గాయపడిన ప్లాటినస్, అతని అనుయాయులను తన ఆరామంలోకి తీసుకుని వైద్యసహాయం చేశాడు. అంతేగాక రాజు అండతో నేరాలు చేస్తున్న మంత్రులకు శిక్షపడేలా చేశాడు. తనమీద మోపిన నేరారోపణలకు న్యాయంగా, హేతుబద్ధంగా సమాధానాలు చెప్పాడు. వెళ్ళిపోతూ వాశిష్ఠికి కళ్యాణప్రాప్తి జరగాలని దీవించాడు. ఆమె దుర్మార్గుడని భావిస్తున్న రాజులోనూ కొంత మంచితనం వున్నదనీ తెలియజేస్తాడు.

నాగార్జునుడిలో మరొక సుగుణం మనకు కనిపిస్తుంది. ఆయన తన అనుయాయులతోను, వాశిష్టితోను, ప్లాటినస్ తోను మహాకరుణతో ప్రవరిస్తాడు. వాశిష్ఠి తనను ప్రాసంగికులనీ, తమ ప్రసంగాల్లో ప్రామాణికత లేదనీ లోకం అనుకుంటున్నదనీ అన్నప్పుడు ప్రపంచ స్వభావం అంతేనని నవ్వేస్తాడు. వాశిష్ఠి బాల్యచాపల్యంతో “వినండి… వినండి. నాగార్జునులవారు ఓడిపోయారు” అంటుంది. అందుకాయన “నిజమే అమ్మా. నీ ఆనందమే నాక్కావల్సింది. కాని నేను గెలుపును గురించి ఎప్పుడైనా చెప్పానా” అంటాడు. ఆయనకు వాశిష్ఠి మీది వాత్సల్యం, మమత అలాంటిది.

ఆయనకున్న సత్యావగాహన ఆచార్య నాగార్జునుణ్ణి తన అనుయాయుల్ని జ్ఞానమార్గాన నడిపిస్తుంది. ప్లాటినస్ ఆర్యదేవుడు విముక్తులయ్యారు. ఉరికంబం ఎక్కడానికి ప్లాటినస్ సందేహించలేదు. అర్యదేవుడు నాగార్జునునితో బాటు దేశాంతరానికి బోధిసత్వుడిలా సిద్ధపడ్డాడు.

శాతకర్ణి నాగార్జునుడితో విభేధించి, తన మతనమ్మకమే తన దేశాన్ని ఏకీకృతం చేస్తుందనీ, ప్రగతిమార్గాన నడిపిస్తుందనీ నమ్ముతాడు. నాగార్జునుడి లేఖను మంచి సలహాగా భావించలేదు. మంత్రుల ప్రోత్సహంతో, బ్రాహ్మణవాదమే దేశానికి మంచిదని, తదనుగుణంగా ప్రవర్తిస్తాడు. తల్లి గౌతమిబాలశ్రీ తన వాదాన్ని వ్యతిరేకించినా దాన్ని ప్రక్కన పెడతాడు. ఆ ప్రయత్నంలో తన ఇద్దరు నమ్మకస్తులైన మంత్రుల్ని పోగొట్టుకుంటాడు. వారికి యావజ్జీవ శిక్షలు విధిస్తాడు. ఒక చిన్న రాజ్యంలో ఒకే మతం ఉండాలనడం చెల్లుబాటు కావొచ్చు. కాని ఒక సామ్రాజ్యంలో అది సాధ్యంకాదు. రాజు మత విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఇది అగ్నికన్నా ప్రమాదకరం. పట్టించుకోకపోవడం పాపం కాదు. శాతకర్ణి తన భ్రమలో, అహంకారంలో తన ఇద్దరు మంత్రుల్ని పోగొట్టుకున్నా లెక్కచేయకుండా, నాగార్జునుణ్ణి, అతని అనుయాయులు ఆర్యదేవుణ్ణి దేశబహిష్కరణ శిక్షకు పాత్రుల్ని చేశాడు. ప్లాటినస్ కి ఉరిశిక్ష విధించాడు. రచయిత తరువాతి పరిణామాలను పాఠకుల ఊహకి వదిలివేశాడు. నాటకాంతంలో గౌతమిబాలశ్రీ పిచ్చిదైపోతుంది. ఆమె మాటల్లో జరగబోయే, పరిణామాలు సూచించాడు. “నీ భర్త మట్టిలో కలిసిపోలేదు. బిడ్డ గడ్డ కాలేదు. … ఎవరురా రక్షకులు.. కత్తులు ఎదురొడ్డండి… ఈ దేశం ఏం కావాలి? సంసార నిశ్చలమతికి నిర్వాణం తప్పదు గాక తప్పదు…” గౌతమి స్థితి పాఠకుల్లో / ప్రేక్షకుల్లో బాధను మిగులుస్తుంది.

నాటకాంతంలో ఈ పరిస్థితికి పరిష్కారం కూడా సూచించబడింది. నాగార్జునుడి చేత గౌతమికి ప్రసాదించబడిన ఏడుస్తున్న బొమ్మ “ప్రజ్ఞాపారమితాదేవి.” బౌద్ధ సిద్ధాంతపు ఆరు సూత్రాలకు ప్రతీక. దాన, శీల, క్షమ, ధీర, ధ్యాన, ప్రజ్ఞలు. బొమ్మను ఏడిపించడం ద్వారా రచయిత పాలకులు రాజ్యబహిష్కారాలు, భిక్షాటన నిషేధాలు లాంటి నిర్ణయాలతో ప్రజల మీద దౌర్జన్యాలు జరిపినపుడు శాంతిని కోరుకునే భిక్షువులను బాధించినపుడు, రాతిబొమ్మ కూడా ఏడుస్తుంది అని తెలియజెప్పారు. ఆర్య నాగార్జునుడి ద్వారా రచయిత దీనికి పరిష్కారం సూచించాడు – ప్రతిమ (ఆరు బౌద్ధ సుత్రాలు) (ప్రజల మనసుల్లో ప్రతిబింబించినపుడు లోకకళ్యాణం జరుగుతుంది. శాంతి, ప్రగతి ప్రజలు ప్రజ్ఞాపారమితా దేవిని మనసులో ధ్యానించినపుడే సాధ్యమౌతుంది. ఇంకా చెప్పాలంటే, ఈ ఆరు బౌద్ధ  సిద్ధాంతాలు—దానం, శీలం, కర్మ, వీరం, ధ్యానం, ప్రజ్ఞ—వీటిని తప్పనిసరిగా ఆచరించినపుడే లోకం ప్రశాంతంగా వుంటుంది. మనుషులు వివేచనతో, తమను తాము అర్ధం చేసుకుని, సాటి మనుషులతో కలిసి లోకంలో శాంతిని స్థాపించాలి. అప్పుడేవారికి సత్యం బోధపడుతుంది. తమలోని లోపాలు, శక్తులు గ్రహించుకుని, ప్రేమశక్తితో ఇతరులతో, సాటి జీవులతో కలిసి జీవించడం నేర్చుకోవాలి. ఈ ధర్మాన్ని పాటించడం ద్వారా మనిషి దివ్యజ్ఞానాన్నందుకుంటాడు. మనిషి తన శక్తిని తన జీవితంలోంచి గ్రహిస్తాడు; అంతేగాని ఇతరులమీద చూపించడంలోంచి కాదు. ఈ తత్వం మన మానసికజ్ఞానానికి సరిపోతుంది. అది మనిషి తనను తాను తెలుసుకోవడానికి, సృజనకు దోహదపడుతుంది. దీన్ని పాటించినపుడు మనుషులు అన్ని ప్రాణులతోను కలిసి జీవించడం నేర్చుకుంటారు. లోకంలో శాంతివర్ధిల్లుతుంది.

ఈ నాటకంలోని శాతకర్ణి నేటిపాలకులకు ప్రతీక అనిపిస్తుంది. సువిశాలమైన దేశాల్లో ఎన్నో మతాలు, జాతులు, భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు, అలవాట్లు ఉండి తీరతాయి. పాలకులు అజ్ఞానంతో, రాజకీయ దృక్పధంతో, తమ నమ్మకాలను, సిద్ధాంతాలను తమ అధికారంతో, అధికారంకోసం, అనాలోచితంగా, ప్రజలమీద రుద్దితే జరిగే పరిణామాలు అగ్నితుల్యంగా ఉంటాయి. అది స్వపరబేధం లేకుండా సర్వ నాశనానికి దారితీస్తుంది. ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటివి జరక్కూడదు. కాని శాతకర్ణి లాంటి కొందరు అహంకారపాలకులు చేసే శాసనాలు తీసుకునే అనాలోచిత నిర్ణయాలు సమాజచిత్రాన్ని సర్వనాశనం చేసి ఏడిపిస్తాయి. ఆ రకంగా కృష్ణరావుగారి “బొమ్మ ఏడ్చింది” నాటకం ప్రస్తుత పాలకులకు, సమాజానికి కూడా వర్తిస్తుంది, అన్వయిస్తుంది. వేల సంవత్సరాల ముందుచూపుతో ప్రభోధింపబడ్డ బౌద్ధసూత్రాలు సర్వకాలాల్లోనూ పాలకులకు, ప్రజలకు ఆచరణీయాలు, అనుసరణీయాలు.

Reference:

Murty, GRK, “The Idol Wept: A Portrayal of Clashing Ideas and Crashing Ideals at the Altar of Radical Humanism” (February 4, 2020). The Critical Endeavour, Vol. 26, January 2020, pp. 156-177, available at SSRN: https://ssrn.com/abstract=3531689

You Might Also Like

Leave a Reply