The Unseeing Idol of Light: K.R.Meera

అదో లోకం. కె.ఆర్ మీరా లోకం. 

మన ప్రపంచాన్ని తలపించే లోకం. మన కళ్ళకి గంతలు కట్టినా మనం చకచకా నడిచేయగలమనిపించేంతగా సుపరిచిత లోకం. ఆ కొండా కోనా, ఆ చెట్టూ పుట్టా, ఆ నేలా నీరూ, ఆ ఎండా వానా,  ఆ బంధాలూ బంధనాలూ, ఆ మమతలూ మోహాలు, ఆ కాఠిన్యాలూ కార్పణ్యాలు, ఆ న్యాయాన్యాయాలు, ఆ చీకటి వెలుగుల దాగుడుమూతలు – అన్నీ, అన్నీ మనవే, మన లోకానివే. 

మన లోకంనుంచి కాపీ-పేస్ట్ చేసి ఆ లోకంలో పెట్టినంత అచ్చంగా, స్వచ్ఛంగా ఉంటాయి. అందుకని కథ  మొదలు పెట్టాక, కాస్త దూరమో చాలా దూరమో వెళ్ళాక, ఆవులింతలొచ్చో ఆయాసమోచ్చో “ఇహ, వద్దు బాబూ ఇది” అని ఊరుకోవాలనుకున్నా, లేదూ ఊపుతోనూ ఉత్సాహంతోనూ “నేను ఆగలేను, పదపద… పరుగందుకో” అని ఊరికే ఉండలేకపోయినా మన లోకానికి సంబంధించిన మెంటల్ జి.పి.ఎస్ మనకోటి ఉంటుంది కదా, దాన్ని వాడుకుంటూ ముందుకో, వెనుక్కో వెళ్ళిపోవచ్చనని అనుకుంటాం. 

ఓకే, ఒకామె నిండు గర్భంతో ఉండగా రైలు ప్రయాణంలో తప్పిపోతుంది. పదేళ్ళ పాటు ఎంత వెతికినా దొరకదు. సో? వాట్స్ ది బిగ్ డీల్?  

పాపం, ఆమె తప్పిపోయిందన్న షాకులో వాళ్ళాయనకి చూపు పోయిందంట. ప్చ్, ప్చ్, బట్ హౌ రొమాంటిక్! అట్లాంటి మగవాళ్ళు కూడా ఉంటారా లోకంలో! అయితే, ఇదో ప్రేమమయ, త్యాగమయ, విరహవేదనమయ, వగైరామయ కథ. అంతే అయ్యుంటుంది. 

చదువుతాం, చదువుతాం, చదువుతాం. రెండొందల అరవై పేజీలంటే రెండొందల అరవై పేజీలూ చదువుతాం. చదువుతున్నంత సేపూ ఏదో థ్రిల్లర్ చదువుతున్నట్టు “ఇంతకీ దొరుకుతుందా ఆమె?”, “అతనికి చూపొస్తుందా?”, “మిగితా పాత్రలు ఏమవుతాయో?” లాంటి ప్రశ్నలు వెంట పరుగులు. 

మీరీసారి గమనించండి, జి.పి.ఎస్‍ పెట్టుకుని వెళ్తున్నప్పుడు ఏ కారణం చేతనైనా మన గమ్యానికన్నా పక్కకో, దూరంగానో జరిగిపోయామని దానికి అనిపిస్తే వెంటనే అడ్జస్ట్ అయ్యి, “టేక్ యూ-టర్న్”, “గో స్ట్రేట్ ఆండ్ టేక్ యూ-టర్న్” అని ఒకటే ఊదరగొడుతుంది. గమ్యంనుంచి కొంచెం దూరంగా, పక్కకి వచ్చిన మాట వాస్తవమే కానీ అలా రావడం అగత్యమూ అయ్యుండచ్చు, అవసరమూ అయ్యుండచ్చు. కొన్ని కి.మీలు వృధా పోవచ్చు, లేదూ ఎంతో సమయం ఆదా చేయచ్చు. ఆ అగత్యం దానికి పట్టదు. దాని గోల ఆపదు. చెప్పాల్సింది చెప్తూనే ఉంటుంది. 

మన లోకంలో ఆల్గోరిథములు యంత్రాలనే కాదు, మనుషులనీ నడిపిస్తాయి. అందుకే పుస్తకం అవ్వగొట్టిన కాసేపటికి మనలో నస పెట్టే అనుమానాలు ఇవే: “స్త్రీలపై కుప్ప పోసినట్టు ఇన్ని అత్యాచారాలా?”, “అసలు ఒక్క పాత్రైనా సుఖసంతోషాలతో ఉందా ఈ నవల్లో?”, “ఏం, మగాన్ని, వ్యవస్థనీ కాళ్ళదన్ని ఆడది ఉదయిస్తున్న సూర్యునిలా వెలుగునివ్వలేదా? నిజంగా ఇవ్వలేదనుకో, కాబట్టే కల్పనలోనైనా ఇవ్వాలిగా?”   

 మన ప్రపంచాన్ని తీసుకెళ్ళి కాపీ-పేస్ట్ చేసి ఆమె ప్రతిసృష్టి చేసింది కనుక, మన ప్రశ్నలనీ, సవాళ్ళనీ అందులో కాపీ-పేస్ట్ చేయడానికి చూస్తాం, అలవాటుగా. అదే పొరపాటు.  

ప్రకాశ్-దీప్తి: భార్యాభర్తలు, అన్యోన్య దాంపత్యం. 

ప్రకాశ్-శ్యామ్: గాఢ స్నేహితులు.  చేదోడువాదోడు.  

ప్రకాశ్-రజని: అక్రమ సంబంధం, తనివి తీరని మోహం 

నిండు గర్భిణి అయిన దీప్తి తన తండ్రితో పాటు కలిసిన చేస్తున్న రైలు ప్రయాణంలో తప్పిపోతుంది. ఆ విషయం తెల్సుకున్న ప్రకాశ్‍కి షాక్ వల్ల కంటి నరాలు దెబ్బ తిని రంగులూ, ఆకారాలూ మెల్లిమెల్లిగా మసకబారుతూ చివరకి పూర్తి అంధత్వం వస్తుంది. అతని కోసం ప్రాణం ఇచ్చే స్నేహితుడు శ్యామ్ అతనికి కంటిలో కన్నై, మాటలో మాటై దీప్తిని వెతకడంలో సాయం చేస్తుంటాడు. కొన్నాళ్ళకి పరిచయమైన రజనితో ప్రకాశ్ సంబంధం పెట్టుకుంటాడు, కానీ ఆమెని ఎప్పటికీ మనస్పూర్తిగా ప్రేమించలేడు, ఎందుకంటే అతనికి భార్యపై ఉన్న ప్రేమ చావదు. కానీ రజనికి అతనంటే పిచ్చి… అరకొర బేరాలతో ఆమె సరిపెట్టుకోలేదు…అప్పుడూ… 

కథ ఇలానే సాగుతుంది. మన లోకంలో సాధ్యాసాధ్యాలకి లోబడి సాగే జీవితాల్లాగే.

కానీ, అదో లోకం. అది కె.ఆర్.మీరా లోకం. 

అక్కడ బిగుసుకుపోయి, గడ్డకట్టుకుపోయిన ఆలోచనలకి స్థానం లేదు. అక్కడ మనుషుల్లా కనిపిస్తున్న వాళ్ళెవ్వరూ మనుషులు మాత్రమే కారు. వాళ్ళు ప్రతీకలు. ప్రకాశ్, దీప్తి, శ్యామ్, రజని, సూరజ్ – అవి పాత్రల నామమాత్రపు పేర్లే కావు. అవి వాటి నైజం కూడా. వాటి నిజం కూడా. వాళ్ళ మధ్యనున్నవి ఇహానికి సంబంధించిన బాంధవ్యాలే కాదు. అందుకే, కథని మాథమెటికల్ ఈక్వేషన్‍లా అనుకుని, వేరియబుల్స్ లా అనిపించే పాత్రలని మనుషులతో కాక, మెటఫర్లతో నింపితే… 

దీప్తి (brightness) దూరమైయ్యాక ప్రకాశం (light) మసకబారిపోతాడు. శ్యామ్ (రాత్రి, twilight?)ని వెంటేసుకుని ఎంత వెతికినా దీప్తి కనిపించదు. ఎన్నాళ్ళైనా దీప్తి లేని ప్రకాశం రజనికి (రాత్రి)కి లొంగకుండా ఉంటుంది. దీప్తి కలిగించినంత మోహావేశాన్ని రజని కూడా కలిగించినా, ఆమెలో కలిసి కరిగిపోవడమంటే ప్రకాశం ఉనికి కోల్పోయినట్టే కాబట్టి కామోద్రేకం తీరేంత వరకే మునకలేసి తన అస్థిత్వాన్ని కాపాడుకుంటాడు, లేదా అలా అని అనుకుంటాడు. వెలగలేకపోతున్న దీప్తిని లోలోపల బలవంతాన జ్ఞాపకాల్లో వెలిగించ చూస్తాడు, రజనని ఆ వెలుగుతో పోలుస్తుంటుంటాడు. భంగపడతాడు. ఆ భంగపాటులని తన లోటుపాట్లుగా భావించి తన నైజాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోయిన శ్యామ్ అంధ-ప్రకాశానికి దూరంగా ఇంకెక్కడో తేలితే గానీ, మరో చిరునవ్వు వెలుతురు తోడైతే గానీ మళ్ళీ మామూలు అవ్వడు. ఆ భంగపాటుల చీకటిని తన నలుపులో కలిపేసుకుని, అతనికి మాత్రం కొంత వెలుగుని ప్రసవించి ఇచ్చి రజని మాయమైపోతుంది… 

ఇలా ప్రతి పాత్రకి అన్వయించుకుంటూ పోవచ్చు. (రవి-ఆభా, దీప్తి-శివ సుబ్రహ్మణ్యం, రజని-సూరజ్-ప్రకాశ్) నవలంతా మన మనోఫలకం మీద చదువుకోవచ్చు. “టేక్ యూ టర్న్” అని ఎప్పుడూ వినిపించే రొదని పక్కకు తోసి కొంత దారులని చెవులతో, కళ్ళతో, మనసుతో వెతుక్కోవచ్చు. 

అదో లోకం. అది కె.ఆర్.మీరా లోకం. 

సాహిత్యం సృష్టించే లోకాల్లో కొన్నాళ్ళు కోయిలలు రాజ్యమేలాయి. వలపుకి, విరహానికి కోకిల గానాలు రాగాలు తీశాయి. ఆ తర్వాత కాకులూ వచ్చాయి, చెవికి ఇంపు కాని “కావ్ కావ్” వినిపించే బాధ్యతని నెత్తేసుకున్నాయి. గద్దలూ, రాబందలూ వచ్చిపోయాయి – మన కంటికి కనిపించనివి ఉన్నాయని చెప్పడానికి. కె.ఆర్.మీరాకి వాటి నలుపు చాలదు. ఆ కావ్, కావ్‍లు సరిపోవు. ఆ గద్దచూపులోని పదను తక్కువవుతుంది. అందుకే  ఆమె లోకంలో జీవితపు, సమాజపు  అర్థాలు అంతరార్థాలూ గబ్బిలాలవుతాయి. పక్షులన్నీ గూటికి చేరే వేళ అవి బయటకెళ్తాయి. చీకట్లో మాత్రమే విహరిస్తాయి. వెలుతురు తాకితే ముడుచుకుపోతాయి. పాడుబడిన భవనాల్లో, గతచరిత్రకి ఆనవాలైన శిథిలాల్లో, గుబురు చెట్లు మీదా నివసిస్తాయి. తల్లకిందులుగా వేళ్ళాడతాయి.

ఆమె లోకమంతా అంతే. తల్లకిందులుగా ఉంటుంది.

మనిషి ఏది చూడగలడు, ఎంత చూడగలడు, ఎన్ని చూడగలడు? ఏది దృష్టిలోపం? ఏది అంగవైకల్యం? ఏమి కనిపించకపోతే అంధమత్వమనిపించుకుంటుంది? ఏది చీకటి? ఏది వెలుగు? మనోనేత్రమనేది ఉంటుందా? ఊరికే చెప్పుకునే ఊసా? గబ్బిలాలు మన కథ చెప్తే, “అయ్యో పాపం, చీకట్లో తిరగలేరట. ఎప్పుడూ బుడ్డి దీపమైనా లేకపోతే అడుగు వేయలేరట… ఎంతటి వైకల్యం!” అని అనకుండా ఉండగలవా? చీకటి, వెలుగుల లోకం ఎవరిది ఆధిపత్యం? వెలుతుర్ని చూడగలిగనవా? చూడలేనివా?  ఎవరి వెలుతురు ఇంకెవరికి చీకటనిపిస్తుందో చెప్పడం సాధ్యమేనా? 

వీటికి సమాధానాలు వెతుక్కోవడమంటే పాచి పెట్టిన నేల మీద కాలు జారకుండా నడవగలగడం. గబ్బిలాల్లా శిర్షాసనాలు వేసి లోకాన్ని చూడగలగడం. ప్రణయకేళిలో పంటిగాట్లు చిలక కొట్టిన జాంపళ్ళని నమ్మించిన కావ్యలోకానికి వెనక్కి నెట్టేసి మెడవంపుల్లోని (nape) గాయాల్లో గబ్బిలాలు పంటి గుర్తులు వెతుక్కోగలగడం.   

అట్లాంటప్పుడు ఎందుకీ డొంక తిరుగుడు అంతా? అలగొరీలు ప్రపంచానికేం కొత్త కాదు కదా! నేరుగానే రాయచ్చు కదా: అనగనగా ఒక దీపమనే ఇల్లు, ప్రకాశం-దీప్తి అనే భార్యాభర్యలు, దీప్తి వెళ్ళిపోయింది, ప్రకాశం వెలవెలబోయాడు, అప్పుడూ… 

పిట్టకథలు చెప్పే పేదరాశి పెద్దమ్మ కాదు మీరా. చీకటి-వెలుగు, నవ్వు-ఏడుపు, దృష్టి-దృష్టిలోపం లాంటి ద్వంద్వాలతో ఆగిపోకుండా వాటిని ఆడా-మగా, ఇచ్చేవాడు-తీసుకునేవాడు, పుట్టిగుడ్డి-చూపుపొగట్టుకున్నవాడు, చట్టబద్ధం-చట్టవ్యతిరేకం, శిక్షాస్మృతులు-సమాజపు వెలివేతలు, చూడలేని చట్టం- చూపులతో కుళ్ళబొడిచే సమాజం, మాయమవ్వడం-బలవన్మరణం, జ్ఞాపకం-మరుపు, అత్యాచారం శరీరంపైనా-ఆత్మపైనా – ఇలా ఎన్నెన్నో ద్వంద్వాల మీద superimpose చేసి తమాషా చూపిస్తుంది. గారడి చేస్తుంది. 

నల్ల బట్టలు వేసుకుని, అస్తిపంజరాలు మెళ్ళో వేసుకుని, ఇంతంత కన్నులేసుకుని, కోపం-కామం-కొంటెతనంతో నిండిన చూపుతో చూసే పాతాళ భైరవిలోని మాంత్రికునిలా ఉంటుందా వచనం. “సాహసం శాయగలవే” అని కవ్విస్తూ దూరదూరాలకి తీసుకెళ్ళాక ఆ వశీకరణలో పడిపోయాక ఏ క్షుద్రశక్తికి బలవ్వాల్సి వస్తుందోనన్న భయమైతే అక్కర్లేదులే. కోరుకలన్నీ తీర్చే అమ్మోరిలా కాకుండా, గాయాలకి మందేసే అమ్మలానే కథని ముగిస్తుంది. మరణమూ ఒక సాంత్వనే అని తెలియజెప్తుంది. కళ్ళకి గంతలు కట్టి కొంత వెలుగుల్ని చూపిస్తుంది. వెన్ను జలదిరించే చీకటిని కూడా అక్కున చేర్చుకోగలిగేలా నేత్రోన్మీలనం చేస్తుంది. 

దేవుని శిల్పాలు చిత్రాలు కళ్ళు పెట్టాకే  ఆరాధనకి అర్హత సాధిస్తాయని తెల్సు నాకు ఇంతకు ముందు కూడా. కదిలే కనుపాపలనీ నలుపుతో సరిదిద్దవచ్చునని, మనోనేత్రానికీ నేత్రోన్మీలనం సాధ్యమని ఈ రచన చదివాకే తెల్సింది. 

అదో ప్రత్యేక లోకం. ఆమె మాత్రమే సృష్టించి, ఆమె మాత్రమే చుట్టూ తిప్పుకురాగల లోకం. కె.ఆర్.మీరా లోకం!  

____________________

K.R.Meera’s Short Story Collection reviewed by Purnima here:

You Might Also Like

Leave a Reply