వెయ్యేళ్ళ ప్రార్థన
వ్యాసకర్త: శారద
(A Thousand Years of Good Prayers)
The sea, rains, necessity, desire, the struggle against death- these are the things that unite us all. We resemble one another in what we see together, in what we suffer together. Dreams change from individual to individual, but the reality of the world is common to us all. – Albert Camus.
మంచి కథ ఎలా వుంటుంది? దాన్నెలా గుర్తు పట్టగలం అన్న విషయం మీద చాలా చర్చలే జరిగాయి. ఈ విషయం మీద ఏకాభిప్రాయానికి రావడం కూడా కష్టమేమో. ఒకరికి నచ్చేది ఇంకొకరికి నచ్చాలనేం లేదుగా? అందుకే నేను ఆ చర్చల్లో పెద్దగా పాల్గొనను కానీ, నా వరకు నేను నిర్దుష్టమైన (నా ) అభిప్రాయాలతోనే కథల మంచి చెడ్డలు బేరీజు వేసుకుంటాను.
రాజకీయ, ఆర్థిక, సాంఘిక పరిస్థితులూ, భాషలూ, సంస్కృతుల్లో తేడాలు వున్నా,మనుషులిగా మనందరినీ ఒకే గాటన కట్టే ఏదొ ఒక కనీ కనబడని సూత్రం వుంది. ఆ సూత్రం మన స్పందనల్లో, ఆలోచనల్లో, బయటపడుతూనే వుంటుంది. ఆ సూత్రాన్ని ఒడిసిపట్టుకుని ఆవిష్కరించగలిగే కథలు చాలా గొప్పకథలనిపిస్తుంది నాకు.
నివసించే ప్రాంతాలూ, మాట్లాడే భాషలూ వేరైనా, కథల్లోని పాత్రలు మనకు రోజూ కనబడె వాళ్ళలాగుంటే? వాళ్ళ ఆలోచనలూ, నమ్మకాలు, ప్రవర్తనా, అన్నీ మనకి బాగా పరిచయం వున్నట్టనిపిస్తే? కథలో వున్న పాత్రలతొ పాఠకుడు ఐడెంటిఫై చేసుకోవడమే రసానుభూతికి పరాకాష్ఠ కాబోలు.
“నువ్వు చెప్తున్న విషయమూ, నీ సంతోషమూ, దుఃఖమూ, నాకు బాగా తెలుసు. వాటిని నేను కూడా బాగా దగ్గరగా చూసి వున్నా కాబట్టి,” అనే భావన కంటే రచయితక్కావల్సిన ప్రశంస ఇంకేముంటుంది?
ఇంతకీ ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, సరిగ్గా అలాటి భావమే నాకు “ఎ థౌజండ్ ఇయర్స్ ఒఫ్ గుడ్ ప్రేయర్స్” అనే కథా సంకలనం చదివినప్పుడు కలిగింది. ఈ సంకలనంలో వున్న పది కథలనీ రచయిత్రి యియున్ లీ రచించారు.
యియున్ లీ చైనా నుంచి అమెరికా వలస వెళ్ళిన రచయిత్రి. నిజానికి ఆవిడ అమెరికాలో ఇమ్మ్యూనోలొజీ చదవడానికి వెళ్ళారట. కానీ అక్కడి వెళ్లిన కొద్ది సంవత్సరాల్లో కథా రచన మీద ఆసక్తి కలిగి క్రియేటివ్ రైటింగ్ కోర్సులు చేసారు.
న్యూ యార్కర్, పారిస్ రివ్యూ లాటి పత్రికలో పడ్డ ఆమె కథలు అనేక పురస్కారాలు పొందాయి. ఇంతటి ప్రతిభాశాలి, తాను తీవ్రమైన మానసిక వైకల్యానికి గురయ్యాననీ, రెండు సార్లు ఆత్మ హత్యా ప్రయత్నం కూడా చేసాననీ చెప్పుకున్నారు ఒక ఇంటర్వ్యూలో. ఈ సంకలనం ఆవిడ మొదటి కథా సంకలనం. ఇందులోని రెండు కథలు సినిమాలుగా తీయబడ్డాయి.
ఆంగ్లంలో రాసిన ఈ కథలు చైనా మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్ళీ, కుటుంబ సంబంధాలూ, రాజకీయాలూ, ప్రేమా, వృధ్ధాప్యమూస్వలింగ సంపర్కాలతో సహా దాదాపు అన్ని కోణాలూ స్పృశిస్తాయి.. ఎక్కువగా చైనాలో, లేదా అమెరికాలో వుండే చైనీయుల కథలే ఇవన్నీ. చైనాలోని సంఘ జీవనమూ, వ్యక్తుల మనస్తత్వాలూ, సాంఘిక వాతావరణమూ, రాజకీయాలూ, అధికారుల ధాష్ఠీకమూ, మనుషుల బలాలూ, బలహీనతలూ మనకి అర్థం కావడమే కాక, చాలా సహజంగా అనిపిస్తాయి. ఈ పాత్రల పేర్లు మార్చి, కథలు భారత దేశంలో జరిగినట్టు రాస్తే, ఏ మాత్రం అసహజంగా వుండదు. బహుశా దక్షిణ ఆసియా ప్రాంతమంతా దాదాపుగా ఒకే సంస్కృతీ, ఆలోచనా విధానమూ వుండడం వల్ల కాబోలు. ఈ సంకలనంలో కొన్ని కథల పై విహంగ వీక్షణం-
వృధ్ధాప్యంలో బ్రతుకు తెరువు వెతుక్కోవడం ఒక విషాదమయితే, ప్రేమ వెతుక్కోవడం కూడా విషాదమే. అటువంటి ప్రేమ తటస్థపడితే? ఒక వృధ్ధురాలికీ, చిన్న బాలుడికీ మధ్య ఏర్పడ్డ మానసిక అనుబంధం గురించి చర్చించే కథ “ఎక్స్ట్రా” (Extra).
మల్లీశ్వరి చిత్ర కథలో మహారాజు పల్లకీ పంపింది రాణీ వాసంలో చెలికత్తె కోసం. ఒకవేళ ఇదే సంప్రదాయం రాజ ప్రాసాదానికి “మగ” స్నేహితులని ఎంపిక చేయాల్సి వస్తే, ఇంకెంత కౄరంగా వుండేదో! చైనాలోని ఒకానొక గ్రామంలో, ఒకప్పుడు ఒక విచిత్రమైన సంప్రదాయం వుండేది. ప్రతీ కుటుంబమూ తమ మొదటి మగ సంతానాన్ని పదకొండేళ్ళు రాగానే చక్రవర్తి సౌధానికి పంపించాల్సి వుండేది. అతని పురుషాంగాన్ని కత్తిరించి అతనికి తర్ఫీదునిచ్చి మహలులో ఉద్యోగం ఇచ్చేవారు. పదహారేళ్ళకి మొదలైన అతని సంపాదనతో అతని మిగతా కుటుంబం చడిచేది. కాలక్రమేణా చక్రవర్తుల రాజ్యం పోయి విప్లవం వచ్చింది. కమ్యూనిస్టు పాలన వచ్చింది. మరి పరిస్థితి మారిందా? ఇప్పుడు భార్యా భర్తలు పిల్లలనెందుకు కంటున్నాట్టు? ఇటువంటి ప్రశ్నలని మార్మికంగా, తాత్త్వికంగా సంధించే కథ “ఇమ్మొర్టాలిటీ” (Immortality).
బోషెన్-సాషా-యాంగ్ లది విచిత్రమైన ప్రేమ కథ. బోషెన్, యాంగ్ చైనాలో నివసించే గే పురుషులు, ప్రేమికులు. అనుకోని పరిస్థితులలో బోషెన్ చైనా వదిలి అమెరికా పారిపోయి తలదాచుకోవాల్సి వొస్తుంద్. లెస్బియన్ స్నేహితురాలొకతి అతన్ని ఆపధ్ధర్మ వివాహం చేసుకొని అతని అమెరికా వలసకి మార్గం సుగమం చేస్తుంది. సాషా చైనీస్ తల్లికి మంగోలియన్ తండ్రికీ పుట్టిన సంతానం. అమెరికాలో చదువుకుంటూ వుంటుంది. సెలవులకని పెకింగ్ వెళ్ళి, అక్కడ యాంగ్ తో ప్రేమలో పడి, గర్భం కూడా దాలుస్తుంది. అమెరికాలో బోషెన్ ని కలుసుకొని నెబ్రాస్కా రాష్ట్రంలో గర్భం తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. విచిత్రమైన ఈ ప్రేమ కథ ఏ తీరం చెరుతుంది? అసలు ఏ ప్రేమ కథైనా తీరం చేరి తీరాలా? అన్ని రకాల ప్రేమలు చర్చించిన తరవాత ఈ కథలో (The Princess of Nebraska) ఈ కింది ఆఖరి వాక్యాలు అద్భుతం.
“Being a mother must be the saddest yet the most hopeful thing in the world, falling into a love that, once started, would never end.”
ఇవే కాక మిగతా అన్ని కథలూ చాలా బాగున్నా, నాకు చాలా గొప్ప కథలనిపించినవి “పార్సిమాన్”, “ఎ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ గుడ్ ప్రేయర్స్”.
పార్సిమాన్ ఆసియా దేశాల్లో పండే తియ్యటి పండు. లోపల మెత్తటి తియ్యటి గుజ్జుతో వుండి పైకి కొంచెం మామిడి పండు రంగులో వుంటుంది. చైనాలోని ఆ గ్రామంలోని ప్రజలందరూ తమని తాము పార్సిమాన్ పళ్ళలా అభివర్ణించుకుంటారు. ప్రభుత్వ అధికారుల చేతుల్లో దెబ్బలూ తన్నులూ తినడం మాత్రమే తమ అదృష్టాల్లో రాసుందనీ, అందులో అన్యాయమేమీ లేదనీ గాఢంగా విశ్వసిస్తారు. అటువంటి గ్రామంలో లావో డా అనే మధ్య వయస్కుడు కొందరు అధికారులని ఊచ కోత కోస్తాడు. అందుకు తనకి విధించిన మరణ శిక్షను సంతోషంగా అనుభవిస్తాడు. మెత్తటి పార్సిమాన్ పండును ఎక్కువగా నొక్కితే రసం చిలికి కళ్ళలో పడుతుంది కదా, అలాగే మెత్తటి మనిషిని ఎక్కువగా నొక్కితే అధికారుల ప్రాణలమీదికి వచ్చింది అనుకుంటారు గ్రామస్తులు. అసలు అతనంత ఘోరమైన హత్యలు ఎందుకు చేసాడు? కొద్ది యేళ్ళుగా వానలు పడక అల్లల్లాడుతున్న ఆ వూళ్ళో ఏంజరిగింది? మనసులు కరిగించే కథ ఇది.
ఈ సంకలనంలో అన్నిటికంటే నాకెంతో నచ్చిన కథ “ఎ థౌజండ్ ఇయర్స్ ఆఫ్ గుడ్ ప్రేయర్స్”. ఈ కథని సినిమాలా తీశారు కూడా.
వెయ్యేళ్ళ సత్-ప్రార్థనలు అని అనువదించుకునే ఈ కథలో ఎన్నో పొరలు వొస్తాయి. భాషా, మాట్లాడటం, ఇంట్లో కమ్యూనికేషన్లూ మొదలుకొని, విడాకులు తీసుకున్న బిడ్డకై తండ్రి పడే ఆవేదన వరకూ, ఎన్నో సున్నితమైన విషయాలు, సున్నితంగా స్పృశించబడతాయి. కొంచెం పాత కాలం ఆలోచనలతో బిడ్డ క్షేమం కోసం ఆరాటపడే తండ్రి మిస్టర్ షి. అమెరికాలో నివసిస్తున్న అతని కూతురు (ఆమెకీ కథలో పేరుండదు) విడాకులు తీసుకున్నదని తెలిసి, తల్లడిల్లిపోయి విషమేమిటో తెలుసుకుందామని చైనా వదిలి అమెరికా వొస్తాడు. అతనికి కూతురు వ్యవహారం ఏమీ అర్థం కాదు. ఇంగ్లీషు కానీ, చైనీస్ భాష కానీ ఏ మాత్రం రాని ఇరాన్ దేశానికి చెందిన స్త్రీతో చక్కటి స్నేహం కుదురుతుంది. ఒకరోజు కూతురితో ఆమె పెళ్ళి గురించి వాదనలో అతనికి తమ జీవితం గురించే కొన్ని చేదు నిజాలు తేటతెల్లమవుతాయి. అసలు షి అంత ముభావిగా ఎందుకయ్యాడు? కుటుంబ జీవనం లో సంభాషణ పాత్ర ఎంతవరకు అవసరం? ఇవన్నీ కథలో తెలుసుకోవాల్సిందే.
“ప్రతీ సంబంధానికీ ఒక కారణం వుంటుంది. ఒక వ్యక్తితో కలిసి ఒకే పడవలో ఒక నదిని దాటాలంటే, అంతకు ముందు మూడు వందల యేళ్ళ ప్రార్థనలు చేసి వుండాలి. ప్రేమించిన మనిషితో ఒకే తలఘడ మీద తల వాల్చాలంటే మూడూ వేల యేళ్ళు ప్రార్థన చేసి వుండాలి. అలా ప్రతి అనుబంధమూ మన జీవితంలోకి, మన అనుభవం లోకి రావడానికి మనం ఎన్నో యేళ్ళ సత్-ప్రార్థనలు చేసి వుండాలి,” అంటాడు షి. మానవ సంబంధాల మీద ఎంతటి అనురాగం!
కథా వస్తువు సంక్లిష్టంగా అనిపిస్తూనే, మళ్ళీ సున్నితంగా, సరళంగాను అనిపిస్తాయి, అన్ని కథల్లోనూ. కథనం ఇంకా బాగుంది. ఏ కాలానికి చెందిన వ్యక్తులు ఆ కాలానికి చెందిన భావజాలంతో వుంటారు. దానికై వాళ్ళని తప్పుపట్టడమో, విమర్శించడమో చెయ్యడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు, అన్న ధోరణి కనిపిస్తుంది రచయిత్రి శైలిలో. ఇంత పరిపక్వత చాలా అరుదు అనిపిస్స్తుంది.
మనకి నచ్చని, మనం అంగీకరించని ఎటువంటి భావజాలాన్నయినా, క్షణం కూడా సందేహించకుండా, రచ్చ కీడ్చి, చర్చ చేయడమే కదా నేటి రచనల ఉద్దేశ్యం? అందుకు విరుధ్ధంగా, రచయిత్రి శైలి చాలా సున్నితంగా, సూటిగా వుంది ఈ కథల్లో. చెప్పాల్సిందంతా గబ గబా చెప్పెయ్యాలి అన్న ఆత్రం లేకుండా కొందరు చాలా నిదానంగా, క్లుప్తంగా, గాఢంగా మాట్లాడతారు. ఈ కథల్లో శైలి అలా వుంటుంది. అమాయకంగా అనిపించే వ్యంగ్యంతో ఎంతో బలమైన వ్యాఖ్యానం వినబడుతుంది సంభాషణల్లో.
అద్భుతమైన చిన్న చిన్న వాక్యాలూ, ఎంతో ఆలోచింప జేసేవీ, జీవితానుభవాలకి అద్దం పట్టేవీ అక్కడక్కడా చాలా వున్నవి కథల్లో.
ఉదాహరణకి-
“Life provides more happiness than we ever know. We have to train ourselves to look for it.”
“You don’t have to be a bad guy to get killed.”
“You would rather see someone you love die young than suffer from living.”
“God loves you for who you are, not what others expect you to be!”
“It is what we sacrifice that makes life meaningful.”
The Vagrants, Gold Boy-Emerald Girl, ఈ రచయిత్రి రాసిన ఇతర నవలలు. ఓ హెన్రీ పురస్కారం తో సహా ఇంకెన్నో పురస్కారాలు గెలుచుకున్న ఈవిడ ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ కేలిఫోర్నియా లో కథా రచన బోధిస్తున్నారట.
Leave a Reply