దీపవిరద దారియల్లి: సుశాంత్ కోట్యాన్

హ్యూమన్ కంప్యూటర్‍గా పేరు పొందిన శకుంతలా దేవి “ది వల్డ్ ఆఫ్ హోమోసెక్స్యువల్స్” (The World of Homosexuals) అనే పుస్తకాన్ని రాశారు. అందులో ఒక రిసర్చర్ అన్న మాటలు లీలగా గుర్తున్నాయి: మన వ్యవస్థ ఆడ-మగా ప్రేమని మాత్రమే ఆమోదించే క్రమంలో మిగితా అన్ని రకాల ప్రేమలని ఒప్పుకోడానికి నిరాకరిస్తుంది. మన చుట్టూ ఇన్ని రకాల ప్రేమలు, మోహాలు, కోరికలు సాధ్యమే అని తెలిపే సూచనలని విస్మరించేలా చేస్తుంది. ఉన్నట్టుండి ఒక అర్థరాత్రి గేలు, లెస్బియన్లు, ట్రాన్స్ మనుషులు అందరికీ ఒంటి చర్మపు రంగు విలక్షణంగా మారిపోతే, అప్పుడు అర్థమవుతుంది మనకి వాళ్ళు అనుకున్నంత మైనారిటీనో, లేదా anomolous కాదని. సంఖ్యాపరంగా చూసుకున్నా వాళ్ళేం తక్కువ కాదు, కేవలం మనల్ని మనం అలా నమ్మించుకునేలా ఈ వ్యవస్థ పనిజేస్తుంది.  

అలా అమాంతంగా ఒకరి సెక్స్యువల్ ఐడెంటిటిని బట్టి చర్మపు రంగు మారిపోతే హెటరొసెక్స్యువల్ ప్రపంచానికి నిజంగానే కనువిప్పు కలిగి వివక్షని ఆపుతుందో లేదూ టార్గెట్ చేయడం ఇంకా  సులవుతుంది కాబట్టి మరింత సంక్షోభానికి గురి చేస్తుందో తెలీదు. కానీ ప్రస్తుత భారతీయ సాహిత్యంలోనూ, సినిమాల్లోనూ వస్తున్న LGBTQA+ కథలు వివక్షనే విషవృక్షాన్ని వేర్లతో సహా పెకళించలేకపోయినా ఒక్కో కొమ్మనీ నరుక్కుంటూ వస్తున్నారు. మొత్తంగా ఆ కమ్యూనిటిని ఒక్కసారి వెలుగులోకి తీసుకురాలేకపోయినా, వాళ్ళకి సముచిత స్థానాన్ని ఒక దెబ్బలో ఇప్పించలేకపోయినా, వ్యవస్థ మన కళ్ళకి కట్టిన గంతెలకున్న ఒక్కో పొరనే తీసి వేస్తున్నారు. అలాంటి కోవకి చెందిన కన్నడ నవల ఒకటి ఈ మధ్యనే వచ్చింది. ఛంద పుస్తక తరఫున సుశాంత్ కోట్యాన్ రాసిన “దీపవిరద దారియల్లి”. అంటే “దీపంలేని దారిలో”. నాకు మాత్రం ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ బోలెడన్ని దీపాలు వెలిగాయి నా మనసులో. వాటి కబుర్లే ఈ వ్యాసంలో పంచుకుంటున్నాను. 

కథా-కథనం

పుస్తకం అట్ట మీద కనిపిస్తున్నట్టు ఇది ఒక యక్షగాన కళాకారుని కథ. గ్రామీణ నేపథ్యంలో నడుస్తుంది. సుకేశ్ అనే వ్యక్తి శారీరకంగా మగవాడు అయినా, మానసికంగా స్త్రీ లక్షణాలు కలిగి ఉంటాడు. అతని చుట్టూనే కథ మొత్తం సాగుతుంది. అతని కుటుంబం, స్నేహితులు-సహోద్యోగులు, పరిచయస్తులు, ప్రేమికులే ఉంటారు మొత్తం నవలలో. యక్షగాన మేళాల్లో స్త్రీ పాత్రలు వేయడంలో నిష్ణాతుడు. మంచి పేరు తెప్పించుకున్నవాడు. కానీ తన మనసుకి సరిపడని దేహంతో సతమతవుతుంటాడు. ఆడదానిగా ఆమోదం పొందడానికి తహతహలాడుతుంటాడు. ఆ ప్రయాసలో ఎన్నో పోగొట్టుకుంటాడు. మరెంతో తెలుసుకుంటాడు. తనను తాను పొందడానికి తనవాళ్ళనుకున్న అందరికీ ఎలా దూరమయ్యాడో అన్నదే కథ. 

కథనం చాలా సూటిగా, సుత్తి లేకుండా, తిరకాసు లేకుండా గబగబా ముందుకు నడుస్తుంది. పాత్రల మధ్య సంభాషణల్లోనే LGBTQA+ సంబంధించిన పదాలని వివరించడంతో ఎవరిది ఏ ఓరియంటేషనో తెలీక పాఠకులు తికమక పడాల్సిన అగత్యం తప్పించారు. ఫ్లాష్‍బాక్‍లూ పెద్దేం ఉండవు. ముఖ్య పాత్ర జీవితంలో మహా అయితే ఏడాదీ ఏదాదిన్నర జీవితకాలం – అంతే! పాత్రల స్థితిగతులపైన నరేటర్ వ్యాఖ్యానం కూడా ఏం ఉండదు. ఏం జరుగుతుంది – ఇది మాత్రమే చెప్పే ప్రయత్నం. 

జరుగుతున్నదానికి ఎవరిని దూషించడం కానీ, నిందించడం కానీ ఉండదు.  పాత్రలకి జరుగుతున్న అన్యాయాన్ని మనుషుల మీద, వ్యవస్థ (heteronormative) మీద కట్టెలు తెంచుకున్న ఆగ్రహావేశాలుగా కాకుండా ఒక contextలో ఉన్నప్పుడు ఏది దేన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే దిశగా కథనం సాగించడం చాలా అవసరం. ఆ కమ్యూనిటికి చెందని వ్యక్తేనే అయినా నా అపోహలకి, అజ్ఞానానికి, వాళ్ళని అర్థం చేసుకోవడంలో నా అసమర్థతలకి కూడా ఈ నవలలో చోటుందని అనిపించింది. అలా చేయడం వల్ల “ఇది వాళ్ళ సమస్య, దానికి నేనెంతో కొంత కారణం” అన్న అపరాధభావం కలిగించకుండా, “ఇది మన సమస్య, దీన్ని మనమంతా మన శక్తి మేరకు ఎదుర్కోవాలి” అన్న భావనని కలిగించింది కథ నడిచే తీరు. ఉదాహరణకి, సుకేశ్ అవస్థ తెలిసి అతన్ని exploit చేయడానికి చూసేవాళ్ళు కొందరుంటారు. వాళ్ళ మీద కోపమొస్తుంది. కానీ అతని పరిస్థితి తెల్సుకోలేక, అర్థంచేసుకోలేక అతని మధ్య, అతన్ని ఆమోదించని సమాజం మధ్యనా నలిగిపోయే సుకేశ్ తల్లిదండ్రుల కథ కూడా అంతగానే హృదయాన్ని తాకుతుంది. 

ఉపోద్ఘాతంలో చెప్పినట్టు నాకు ఈ నవల చదువుతున్నంత సేపూ దీపాలెన్నో వెలిగాయి. చిన్నదే అయినా నన్ను అమితంగా ఆకర్షించిన విషయమొకటి. మామూలుగా ఇలాంటి కథనాల్లో తల్లుల గురించి రాసేటప్పుడు “ఆవిడ వంటింట్లో పనిచేసుకుంటుండగా”, “ఆవిడ పెరట్లో పనిజేసుకుంటుండగా” అని రాస్తుంటారు. అలా కాకుండా ఈ కథలో తల్లి చేసే పనిని వివరంగా రాశారు. వంటింటి ప్రస్తావన నామమాత్రంగా కాదు, అక్కడ చాలా ముఖ్యమైన పని జరుగుతుందన్న స్పృహతో రాసినట్టు నాకనిపించింది. అలానే, మామూలుగా చదివే సాహిత్యంలో ఎక్కడో ఒక చోట హిజ్రాల ప్రస్తావన వచ్చిపోతే ఇందులో వాళ్ళే ఎక్కువగా ఉండి, heteronormative బంధాలు sidelinesలో ఉండడం నాకు బాగనిపించింది. మోసం-దగా, వివక్ష, అన్యాయం అన్నీ ఉన్నా కూడా ఈ నవలంతా చక్కని స్నేహ పరిమళం కూడా ఉంది.  

యక్షగాన కళ – లింగం/లైంగికత

నేనీ పుస్తకం ఇంకా మార్కెటులో రాకముందే ప్రి-ఆర్డర్ పెట్టేలా చేసింది అట్టపైనున్న బొమ్మ. అది చూసీ చూడగానే నాకు ఇటీవలి కాలంలో బాగా పేరు సంపాదించిన కన్నడ నాటకం “అక్షయాంబర” గుర్తొకొచ్చింది. అది కూడా యక్షగాన నేపథ్యంలో నడిచేదే. ఒక ఆటలో ద్రౌపది పాత్రని ఒక మగవాడు వేస్తుంటే, దుర్యోధుని పాత్రని ఒక ఆడది వేస్తుంది. ఆ ఆటని ప్రదర్శించే సమయంలో వాళ్ళిద్దరి మధ్య జరిగే అహాల పెనుగులాటే మొత్తం నాటకం. యక్షగానాన్ని “మగవాని కళ” అని అంటారు. అందులో స్త్రీలకి ప్రవేశం ఉండేది కాదు. స్త్రీ పాత్రలని కూడా మగవాళ్ళే వేసేవాళ్ళు. ఈ నాటకంలో అతనికి స్త్రీ వేషం వేయాలని ఉండదు కానీ అతని హావభావాలు బాగుండడంతో, ఆడ పాత్రలు బాగా నిర్వహించగలిగే వాళ్ళు లేకపోవడంతో ఆ పనిని బలవంతాన ఒప్పుకోవాల్సి వస్తుంది. ఇంకా నేర్చుకునే దశలో ఉన్నప్పుడే ఆడపాత్రలు వేస్తున్నందుకు అతన్ని స్నేహితులంతా బాగా ఆటపట్టిస్తారు. అభ్యంతరకరమైన పదాలు వాడుతుంటారు. అతను ఎలాగో  నెట్టుకొచ్చి కళాకారునిగా పదేళ్ళ అనుభవం సంపాదించేటప్పటికి, మారుతున్న కాలానికి అనుగుణంగా స్త్రీలకి యక్షగానంలో ప్రవేశం కలుగుతుంది. అలా దుర్యోధుని పాత్రలో (అంటే వస్త్రాపహరణ చేసే పాత్రలో) ఒక స్త్రీ ఉంటే, మానం పోగొట్టుకున్న vulnerable పరిస్థితిలో ఒక మగాడు ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య గలాటానే తక్కిన ఆట. 

ఈ నవలలో ఆ గలాటా ఏదో ఒక మనిషిలోనే జరుగుతుంటుంది. ఆడపాత్రలు వేయడం ఈ అబ్బాయికి తెగ ఇష్టం – ఎందుకంటే, స్త్రీగా అలంకరించుకోవచ్చు. ఆట వేస్తున్నంత సేపైనా తనలోని స్త్రీని నిస్సంకోచంగా బయటపెట్టవచ్చు. “ఛీ, థూ” అని అనిపించుకోకపోవడమే కాకుండా చప్పట్లు, ఈలలూ కూడా అందుకునే అవకాశం. తన నిజాన్ని ఒక అబద్ధం (ఒక కథలోని పాత్ర) ద్వారా నిజంగా బతకడం. 

మొన్నో స్పానిష్ నవలలో తన ఐడెంటిటి నుంచి పారిపోయే ప్రయత్నంలో ఇంటినుంచి పారిపోయిన ఒకడు తన సవితి-కొడుక్కి ఉత్తరం రాస్తాడు. (ఆ ఉత్తరం ఇక్కడ చదవచ్చు) అందులో ఒక చోట ఇలా అంటాడు. 

I want to explain that in addition to political, religious, and ideological exiles, there are also sexual exiles.  

మగ శరీరం ఉంది కాబట్టి అతనిలో ఉన్న స్త్రీ ఎప్పుడూ sexual exileలోనే ఉండాలి, సమాజంలో బతకాలంటే. యక్షగాన కళాకారునిగా అతను స్త్రీ పాత్రలు వేయడాన్ని ఆమోదిస్తుంది. అణుచుకుంటున్న భావావేశాలని ఒక పౌరాణిక పాత్ర వేషభాషల్లో వ్యక్తీకరించే అవకాశాన్ని ఇస్తుంది. (A society represses duality in identity, but the art it celebrates gives expression to what is being repressed.) అంటే, sexual exile నుంచి తాత్కాలిక ఉపశమనైనా కలిగిస్తుంది. (ఇలానే స్త్రీ దేహం కలిగి, మానసికంగా పురుషులైన వారికి ఇలాంటి వేదికలు ఉన్నాయా? అందుకేనా యక్షగానాన్ని “మగవాళ్ళ కళ” అనేది? మగ శరీరం ఉండడమేనా దానికి అర్హత?)  

లింగం/లైంగికత – భాష

ఈ అంశం గురించి ఎప్పుడు, ఎక్కడ ప్రస్తావనకి మించిన చర్చ వచ్చినా మొదటిగా అందరూ వాపోయేది “మనకి భాషే లేదే? వీళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? ఎలా రాస్తాం?” లాంటి వాటి గురించి. గే/లెస్బియన్ కథల్లో భాష మరీ అంత తిరకాసు పెట్టకపోవచ్చు. అతను-అతను, ఆమె-ఆమె అని చెప్తే సరిపోతుంది. కానీ ట్రాన్స్ కమ్యూనిటికి మన భాషల్లో ఉన్న సర్వనామాలు సరిపోవు. అందుకని ఇంగ్లీష్‍లో ఏకవచనంలో కూడా they/them/themselves అన్న సర్వనామాలు వాడుతున్నారు. ఉదా: “My roommate Mika just left for work, he/she will return only in the evening.” అనే బదులు, “they will return only in the evening” అని అంటున్నారు. కథల్లో కూడా అలానే రాస్తున్నారు. మనం ఎన్నో ఏళ్ళ బట్టీ చదువుకున్నది ఒక రకం కాబట్టి, ఇలాంటి మార్పులకి కొంచెం తికమకపడతాం, కానీ అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. 

ఈ నవల కూడా ట్రాన్స్-విమన్ కి సంబంధించి కాబట్టి భాషని ఎలా వాడుతున్నారు, అతన్ని/ఆమెని ఎవరు ఎలా సంభోధిస్తున్నారు అని గమనించడం నాకు మంచి exercise అనిపించింది. (మామూలు కథలు చదివేటప్పుడు దాని పైకి మన ధ్యాస పోనే పోదు కదా!) నవల మొత్తం సుకేశ్‍కి “అతను” అనే సర్వనామాన్నే వాడారు. కానీ ఒక కీలక ఘట్టం తర్వాత అది మారి “ఆమె” అని అంటారని ఆశపడ్డాను. కానీ పాఠకునికి ఇప్పటి వరకూ మగవానిగానే పరిచయం కాబట్టి అలానే కొనసాగిస్తామన్న ఫుట్ నోట్ ఇచ్చారు. అక్కడ మార్చి ఉండాల్సిందని నాకు బలంగా అనిపిస్తోంది. ఇలాంటి నవలలు చేయగల ముఖ్య పనుల్లో అదొక్కటి: గందరగోళం కలిగించడం. కిరికిరి చేయడం. Confusion is good, it’s just one step behind fusion. రేపు నాకు తెలిసిన మనుషులెవరైనా బయటకొచ్చాక (coming out) అప్పుడు నేను కూడా నేర్చుకున్నది/తెల్సినది వదిలేసి వాళ్ళని కొత్తవిధంగా గౌరవించాలి కదా? సాహిత్యమే అందుకు వర్క్ బుక్‍గా పనికొస్తే అంతకన్నానా? (ఈ పుస్తకం ఇంగ్లీష్ అనువాదం ఎలా చేస్తారో చూడాలి.) 

దీపంలేని దారి ఉండదు, నువ్వే దీపమైనప్పుడు 

“దీపవిరద దారియల్లి” అనేది చాలా పేరుపొందిన లలిత గీతం, కన్నడంలో అని తెలుసుకున్నాను. (పాట ఇక్కడ) టైటిల్ అలా పెట్టారు కాబట్టి కథంతా దాన్నో మెటాఫర్‍గా లాక్కొచ్చే పనులేం పెట్టుకోలేదు. ఎక్కడో చివర్న దీపంలేని దారి ప్రస్తావన వస్తుంది. 

ఇలాంటి రచనలని సాహిత్యానికి అలవాటైపోయిన తరాజుల్లో తూకడం ఎంత సబబో నాకు తెలీదు. ఇది ఉత్కృష్ట సాహిత్యమా, పదికాలాలు చరిత్రతో నిలుస్తుందా, అవార్డులు/రివార్డులు వస్తాయా అన్నది కూడా అనవసరం. ఇంత సరళమైన భాషలో, ఇంత సరళంగా కథ చెప్పినందుకు ఇది సాధించే పనులు వేరే ఉంటాయి.  కన్నడం వచ్చిన పదిహేనేళ్ళ పిల్లలెవరో ఈ పుస్తకం చేతపట్టుకుని ఆసాంతం చదివి “ఓహో ఇలాంటివారు కూడా ఉంటారా?” అని నిట్టూర్చినా, “అర్రే! ఇది నా కథలాంటిదే కదూ!” అని ఎదకి హత్తుకున్నా… ఒక చిన్న దివ్వె వెలిగినట్టే! దీపాల్లేని దారిలో దీపం వెలిగించడమంటే అదే! 

You Might Also Like

One Comment

  1. కాశ్యప్

    చాలా విపులంగా రాశారు తెలుగులో కూడా డా ఇంత సంగ్రహమైన విషయం ఉన్న కథలు రావాలి

Leave a Reply