Daughters of Maharashtra

డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర” పుస్తకం గురించి “మహిళావరణం” పుస్తకం చదువుతున్నప్పుడు విన్నాను. ఈ పుస్తకం ఆధునిక మహారాష్ట్ర సమాజంలో వివిధ రంగాల్లో ముఖ్య భూమిక పోషించిన-పోషిస్తున్న ౭౧ (71) మహిళల జీవిత చిత్రణల సంగ్రహం. ఈ జాబితాలో – పదిహేనేళ్ళ యువ కవయిత్రి మొదలుకుని దాదాపు వందేళ్ళ వయసు గల సంగీత నాటక కళాకారిణి దాకా అన్ని వయసుల వారూ ఉన్నారు. రచయిత్రుల నుండి రాజకీయ నాయకుల దాకా, కళాకారుల నుండి పర్వతారోహకుల దాకా అన్ని రకాల పనుల్లో నిమగ్నమైన వారూ ఉన్నారు. ఇలాంటి ఒక పుస్తకం కూర్చాలన్న ఆలోచన అభిజిత్ వార్డె ది. అతను ఇతరులతో సంప్రదింపులు అయ్యాక కొంతమందిని ఎంపిక చేసుకుని, ఊరూరూ తిరిగి వీళ్ళందరినీ స్వయంగా కలిసి, ఫోటోలు తీసి ఇంటర్వ్యూలు రికార్డు చేసాడు. గంటా రెండు గంటల వ్యవధి గల ఈ ఇంటర్వ్యూలను విద్యా బాల్ తదితరులు ఓపిగ్గా విని, లిప్యానువాదం చేసి, కొంచెం ఎడిటింగ్ చేసి ప్రతి కథనూ ఒక పేజీకి కుదించి, పుస్తకం గా పేర్చారు. అదీ పుస్తకం వెనుక కథ.

ఇక – ఈ పుస్తకం గురించి ఎలా పరిచయం చేయాలా? అని అనుకుంటూ ఉండగా, ఇది చదువుతున్న సమయంలో దీని గురించి ఎవరికన్నా ఎలా వివరించానో గుర్తువచ్చి – అలాగే కొనసాగుదాం అని నిర్ణయించుకున్నాను:

* పుస్తకం నడిచే తీరు ఎలా ఉంటుందంటే – అందమైన ఫోటో నుండి వారు మనవైపుకు చూస్తూ కథ చెప్తున్నట్లు కనిపిస్తుంది పేజీకి ఒక పక్క. రెండో పక్క వీళ్ళు తమ మాటల్లో చెప్పిన తమ కథ, కింద వీళ్ళ గురించి సంపాదకులు రాసిన సంక్షిప్త పరిచయాలూనూ.

* రకరకాల రంగాల్లో ఉన్న స్త్రీల గురించిన కథలు చదువుతున్నా, అన్నింటిమధ్యా ఒక connecting thread ఉన్నట్లు తోచింది. ముఖ్యంగా వాళ్ళు తమ వ్యక్తిగత, కుటుంబ జీవితాల గురించి చెప్పుకుంటున్నప్పుడు. అలాగే, చాలా కొత్త విషయాలు కూడా తెలుసుకున్నాను – ఉదా: మరాఠీ విద్యాబోధన గురించి కృషిచేసి ఇక్కడే స్థిరపడిపోయిన పాశ్చాత్యులు కూడా ఉన్నారు అంటే నాకు ఆశ్చర్యంగానే తోచింది.

* మొదట్లోనే అన్నట్లు, ఎంపికలో వైవిధ్యం నాకు బాగా నచ్చిన అంశం. ఇదివరలో “మహిళావరణం” చదువుతున్నప్పుడు ఒక స్టేజికి వచ్చాక, అందరూ ఒకే మూసలో ఉన్నట్లు తోచారు. ముఖ్యంగా, ఇంకా జీవించి ఉన్న వారి గురించి రాసినప్పుడు (నిస్సందేహంగా వీళ్ళందరూ స్పూర్తివంతమైన చరిత్ర గలవారే. కానీ, వైవిధ్యం లోపించిందని మాత్రమే చెబుతున్నా). కానీ, ఈ పుస్తకం వచ్చే వేళకి ఇందులో రాయబడ్డ వారు అందరూ జీవించే ఉన్నారు (ఒక్క Anita Awachat మాత్రం ప్రచురణకు ముందు మరణించారు). అయినా కూడా, ఫెమినిస్ట్, సాంఘిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొంటున్న వారి చుట్టూనే తిరిగినట్లు అనిపించకుండా, వివిధ రంగాల స్త్రీలను పరిచయం చేసారు ఈ పుస్తకంలో.

* ఫోటోలు చాలా – చాలా బాగున్నాయి. ఇందాకే అన్నట్లు, అదొక రకం లైవ్లీ ఫీల్ వచ్చింది పుస్తకానికి వాటి వల్ల.

* పుస్తకంలో ప్రతి జీవిత చిత్రణా మొదట వారి స్వగతంలా సాగాక సంపాదకుల సింగిల్ పేరా పరిచయంతో ముగుస్తుంది. దీనివల్ల ఒక గమ్మత్తైన విషయం గమనించాను. చాలా మంది తమ గురించి తాము చెప్పుకుంటున్నప్పుడు (ఈ పుస్తకంలో సంగతి మాత్రమే చెబుతుంట!) తమ ఇంట్లో పరిస్థితులు, తమ ఆలోచనలు – ఇలాగ చెప్పుకుంటూ పోతారు. సంపాదకులు రాస్తున్నప్పుడు మాత్రం ఫలానా పుస్తకం రాసారు, ఫలానా అవార్డు పొందారు, ఫలానా పని చేసిన తొలి మహిళా – ఈ టైపు గణాంకాలు ఎక్కువ వాడారు. నా ఉద్దేశ్యంలో ఆ రెండు కోణాలూ అవసరమే ఈ పుస్తకానికి. ఎందుకంటే, ఒక్కొక్కసారి ఆయా వ్యక్తుల ఆత్మ కథనం వాళ్ళ గురించి స్పూర్తి కలిగిస్తుందే కానీ, వాళ్ళు చాలా వినమ్రంగా తాము సాధించిన ఘనతల గురించి ప్రస్తావించుకోరు!

* పుస్తకం పూర్తయ్యే సరికి ఫలానా రచయితల రచనలు చదవాలి అని నా దగ్గర జీవిత పర్యంతం పెరుగుతూ పొయ్యే జాబితాలోకి మరి కొన్ని పేర్లు చేరాయి. అలాగే, ఫలానా వారు ఏమైనా చాలా ఇన్స్పైరింగ్ మనుషులు : అని తలచుకునే మనుషుల జాబితాలో కూడా కొన్ని పేర్లు చేరాయి. అయితే, ఇంతకీ ఈ పుస్తకంలో వ్యక్తుల కూర్చు ఏ వరుసలో చేసారో అర్థం కాలేదు. Alphabetical కాదు. జన్మతేదీల వారీగా కాదు. అలాగని వివిధ రంగాల వారీగా కూడా కాదు. బహుశా వాళ్ళు కలసిన వరుసలోనే ఉంచేసినట్లున్నారు. దాని వల్ల పుస్తకం కూర్పు లాభ-నష్టాలకి లోనైందని అనను కానీ, ఊరికే కుతూహలం – అంతే!

ఇది తెలుగు వారి గురించిన పుస్తకం అయ్యి ఉంటే, ఏదన్నా ప్రముఖులను మిస్సయ్యారేమో, వంటి విషయాలు ఆలోచించి ఉందును. కానీ, మహారాష్ట్ర మహిళల కథ కనుక, నేను ఆ విషయం జోలికి వెళ్ళలేదు. ఆ తరహా కాంట్రవర్సీ ఉంటే ఉండొచ్చు గాక, నాకు అనవసరం. అయితే, పుస్తకం సంపాదక వర్గంలో ముఖ్యులైన విద్యా బాల్ పేరు కూడా ఈ జాబితాలో చోటు చేసుకోవడం కొంచెం ఆశ్చర్యంగానే అనిపించింది. అంటే, ఉండకూడదు అని కాదు…ఆవిడకి అర్హత లేదు అని కాదు. కానీ, తాను సంపాదకత్వం వహిస్తున్నప్పుడు తన పేరు ఎలా జత చేసుకుంటారు??? అన్న సందేహం. అంతే. అలాగే, చాలా వైవిధ్యం ఉన్నా కూడా కేవలం నంబర్లలో చూసుకుంటే ఉద్యమ కారులు, ఫెమినిస్టు నాయకులకి పెద్ద పీట వేసినట్లు తోచింది. అదే స్థాయిలో కృషి చేసిన ఇతర రంగాల వారు (ఉదా: మహిళా సైంటిస్టులు అనుకుందాము) చాలా మందే ఉండి ఉండొచ్చు, కేవలం ఉద్యమాల్లో ఉన్నందువల్లే వీళ్ళ పేర్లు ఇక్కడ చోటుచేసుకున్నాయా?? అనిపించింది. కానీ, అది సంపాదకుల అభిరుచులు, నేపథ్యం, ఆ రంగంలో వారికున్న అనుభవం వల్ల అయి ఉండొచ్చు అని సరిపెట్టుకున్నాను.

ఇందులో ప్రస్తావించబడ్డ వారు:

Malathi Bedekar
Venubhai Meghwale
Razia Patel
Pratibha Patil
Ushaprabha Page
Gaurabhai Salwade
Indira Sant
Maxine Berntsen
Anita Awachat
Indira Halbe
Vijaya Lavate
Mangal Khinwasara
Gauri Deshpande
Naseema Hurzuk
Sumitra Bhave
Indira Jaising
Hira Bansode
Prabha Atre
Lila Poonawala
Kamal Ranadive
Leela Patil
Aditi Pant
Medha Patkar
Neelam Gorhe
Saryu Doshi
Sudha Karmarkar
Najubai Gavit
Chhaya Datar
Madhuri Datar
Bebi Kamble
Prema Purav
Meherunnisa Dalwai
Flavia Agnes
Nanda Jadhav
Mable Arole
Anutai Limaye
Rani Bang
Vidya Bal
Nalini Malani
Meeran Chadha-Borvankar
Anuradha Athavale
Pushpa Bhave
Ahilya Rangnekar
Vijaya Mehta
Taraben Mashruwala
Rohini Khadilkar
Gail Omvedt
Aban Mistry
Pramila Dandavate
Kamala Ogale
Sai Paranjapye
Jyoti Mhapsekar
Sucheta Chapekar
Mrinal Gore
Prabha Kulkarni
Rupali Repale
Saudamini Deshmukh
Sheela Barse
Shanta Dani
Suma Chitnis
Ujjwala Patil-Dhar
Yamunabai Waikar
Sharadini Dahanukar
Gangutai Patwardhan
Kanchan Sontakke
Navjot Altaf
Rohini Bhate
Nalini Ladhake
Durga Bhagwat
Shabana Azmi
Manaswini Lata Ravindra

మొత్తానికైతే, తప్పకుండా చదివి తీరవలసిన పుస్తకం. ఇప్పుడింకా బయట దొరుకుతుందో లేదో నాకు తెలియదు. నేను లైబ్రరీ కాపీ చదివాను.

పుస్తకం వివరాలు:
Daughters of Maharashtra : Potraits of women who are building Maharashtra
Abhijit Varde, Vidya Bal
Published by: KalNirnay, 1997
Rs 1000/-

You Might Also Like

3 Comments

  1. 2012 – నా పుస్తక పఠనం | పుస్తకం

    […] ఉన్నా, నాకు చాలా నచ్చింది. * Daughters of Maharashtra * My Autobiography – Charles Chaplin: ఛాప్లిన్ కి కథ […]

  2. Women Writing in India, 600 B.C. to the present – Volume 1 | పుస్తకం

    […] గురించి వరుసగా “మహిళావరణం”, “డాటర్స్ ఆఫ్ మహారాష్ట్ర” పుస్తకాల ద్వారా చదివాను. మధ్యలో […]

  3. pavan santhosh surampudi

    <>
    ఏదైనా ఒక రంగంలో ఆమె విశేషకృషి చేసివుండివుంటే తాను సంపాదకవర్గంలో భాగమన్న ఏకైక కారణంతో తన పేరు చేర్చుకోకపోవడం పుస్తకానికి లోటు అవుతుంది. చాలామంది అలాంటి అతివినయంతో తమ రచనలకు చేటు(ఏదొ ఒక స్థాయిలో) చేస్తుంటారు.

Leave a Reply