అస్తిత్వోద్యమాలను సమర్థించిన “ఆఖరి బ్రాహ్మణుడి కథ”
కొన్ని నెలల క్రితం ఓ పుస్తకాల షాపులో “సంస్కృతి పట్ల ఆసక్తినీ, మంచి బుద్ధీ, నడవడిని పెంపొందించే” బాలసాహిత్యం కోసం వాకబు చేస్తున్నాము మా అన్నా, నేనున్నూ. మా మాటలు వింటున్న ఓ పెద్దాయన ఓ చిన్నపాటి చర్చ వేసుకున్నాడు మాతో. “సంస్కృతి అంటే ఏవిటి, మీ ఉద్దేశంలో? అదేదో ఏకాండ శిలలా ఉంటుందా? లేక చేతికి చిక్కకుండా, పాత్రకి ఒదగకుండా గాలిలా ఉంటుందా? రామాయణ భారతాలు ప్రతీకలుగా ఉన్న సంస్కృతిలో మైసమ్మకీ, పోచమ్మకీ కూడా చోటు ఉంటుందా?” … ఆసక్తికరమైన ఈ ప్రశ్నలు మొన్నీమధ్య చదివిన The Last Brahmin అనే పుస్తకం చదువుతుండగా మళ్ళీ గుర్తుకు వచ్చాయి.
ఆత్మకథలా సాగే ఈ పుస్తకం సనాతనధర్మం, హిందుత్వం, (కుల) అస్తిత్వోద్యమాల గురించి చేసిన వివేచన. ఈ మూడు ఆలోచనా ధోరణులకు ముగ్గురు ప్రతినిధులు:
1) రాణి నరసింహశాస్త్రి – రచయితకు తండ్రి. విఖ్యాత వేదాంతవేత్త. ఈ పుస్తకంలోని ఆఖరు బ్రాహ్మణుడు ఈయనే. రాజీ పడని సనాతన ధార్మికుడు.
2) రాణి రామకృష్ణశర్మ – రచయితకు అన్నయ్య. రసాయన శాస్త్రంలోనూ, సంస్కృతంలోనూ డాక్టరేట్‌లు అందుకొ్న్న విద్యాధికుడు. “హిందువు”. ఆరెస్సెస్ కార్యకర్త. తరువాతి రోజుల్లో సన్న్యాసాశ్రమాన్ని స్వీకరించారు. ఇప్పుడు ఆయనను ‘తత్త్వవిదానంద సరస్వతి’ అని పిలుస్తారు.
3) రాణి శివశంకర శర్మ – గ్రంథ రచయిత. సంస్కృతాధ్యాపకుడు. నాస్తికుడు, విప్లవవాది. విరసంతో, దళితకవులతో సన్నిహిత సంబంధాలున్నవాడు.
సన్యాసి అయిన కొడుకూ, నాస్తికుడైన కొడుకూ ఇద్దరూ తలకొరివి పెట్టడానికి పనికిరారని తండ్రికి దిగులు. ఆ దిగులును అర్థం చేసుకొని ప్రాయశ్చిత్తం చేయించుకొని అంత్యక్రియలకు సిద్ధపడ్డమా మానడమా అన్న రచయిత విచికిత్సతో మొదలవుతుంది ఈ పుస్తకం. అందుకు ఒప్పుకున్నా, ఆర్షధర్మం పట్ల -అమానుషమైన వర్ణధర్మంపై నిలబడిన సనాతనధర్మం పట్ల – హృదయంలో విశ్వాసం జన్మించడం అసంభవమన్న రూఢీభావంతో ప్రారంభమైన ఈ తలపోత “ఈ ప్రాచీన సనాతన ధార్మిక బ్రాహ్మణుడిలో భారతదేశ కులవివక్షను సమూలంగా పెకిలించగల విప్లవకారుడు దాగిఉన్నాడు” అనే ఆధునికోత్తర (?) నిర్ధారణతో ముగుస్తుంది. అది యెట్లన్నన్…
***
రాణి నరసింహశాస్త్రి రాష్ట్రపతి సన్మానాన్ని అందుకున్న వేదాంత పండితుడు. శాస్త్ర సభల్లో “గజరాట్” అని పిలిచేవారట ఆయనను. శాస్త్ర సంశయం కలిగినప్పుడు శాస్త్రిగారి మాటే పూర్తి వేదప్రామాణికమని శ్రీ శృంగేరి జగద్గురువులు పండితసభలో నిశ్చయించారట.
“సంశయాతీతమైన ప్రామాణిక ధర్మం ఆచరణలో ఎలా ఉంటుంది?” అనే ప్రశ్నకు సమాధానం శాస్త్రిగారి జీవితాచరణలో, ఎన్నడూ దాచుకోని ఆయన అభిప్రాయాల్లో దొరుకుతుంది.
“వర్ణధర్మం వర్ణధర్మం అని మొదటినుంచి చాటుతూ వచ్చారు … రాణి నరసింహ శాస్త్రిగారు. వర్ణధర్మమే సనాతన ధర్మమన్నారు… ఎవరెలా నొచ్చుకున్నా పెదవి విరిచినా నుదురు చిట్లించినా ఆయన వర్ణధర్మమే పరమ ధర్మమని దేశమంతా తిరిగి గర్జించారు…”
శూద్రులు భగవద్గీతను చదవాలనుకోవడం ఆయన దృష్టిలో ధర్మవిరుద్ధం. శూద్రుడి వృత్తి మిగతా త్రైవర్ణికులను సేవించడమే. ఆ పనేదో సరిగ్గా చేసి పుణ్యం సంపాదించుకొని ఆ పై జన్మలో అగ్రవర్ణ జన్మం సంపాదిస్తే అప్పుడు అతడికి వేధాధ్యయన యోగ్యత. ఆ తరువాతే వేదాంతాధ్యయనాధికారం.
“ఉత్తమమైన కర్మ ద్వారా శూద్రుడు బ్రాహ్మణుడు కాలేడా? నీచ వర్తనుడైన బ్రాహ్మణుడు శూద్రత్వాన్ని పొందడా?” అంటే కాదనేస్తాడా పండితుడు. ధర్మ భ్రష్టుడైన బ్రాహ్మణుడు బ్రాహ్మణాధముడవుతాడేమో కానీ, అబ్రాహ్మణుడు కాడు, శూద్రుడెప్పటికీ బ్రాహ్మణుడు కాలేడు” అంటుందాయన నమ్మిన ధర్మం.
శూద్రుడైనా, క్రైస్తవుడైనా – తను ఆచరించాల్సిన ధర్మం, తను పూజించాల్సిన దేవుళ్ళూ అన్నీ పూర్వ నిర్ధారితాలని, వాటిని వదిలేసి “పరధర్మమైన” సనాతన ధర్మాన్ని అభిమానించబోవడం వారిని సృష్టించిన సృష్టికర్త విజ్ఞతను అవమానించడమేనన్న చంద్రశేఖరభారతి (శృంగేరి పీఠాన్ని అధిరోహించిన 34వ శంకరాచార్యులు) అభిప్రాయంతో ఆయన ఏకీభవిస్తారు.
యథాతథవాది అయిన తండ్రి భావాలకూ, “హిందూ” సంస్కరణవాదియైన పెద్దకొడుకు భావాలకూ పొత్తు కుదరదు.
“యస్మిన్ దేశే కాలే నిమిత్తే చ యో ధర్మోనుష్ఠీయతే స ఏవ దేశ కాల నిమిత్తాంతరేష్వధర్మో భవతి. తేన న శాస్త్రాద్రుతే ధర్మాధర్మ విషయం విజ్ఞానం కస్యచిదస్తి” (దేశ కాల నిమిత్తాలను బట్టి ధర్మస్వభావం మారుతుంది. అందుచేత ధర్మాధర్మ విచారానికి శాస్త్రమే ప్రమాణము) అన్న ఆది శంకరుడి బ్రహ్మసూత్ర భాష్యవాక్యాలు ఈ సనాతన పండితుడికి మార్గదర్శకాలు. కాలాబాధ్యమైన తన సనాతన ధర్మంలో మార్చాల్సినదేమీ లేదని ఆయన ధృడంగా నమ్ముతారు.
పై వాక్యాలను ఆయన సంస్కర్త కుమారుడు “ధర్మశాస్త్రమనేది దేశ కాల నిమిత్తాలను అనుసరించి ధర్మమేదో అధర్మమేదో చెప్పగలిగే విజ్ఞానాన్ని కలిగిస్తుంది.” అని అర్థం చేసుకుంటాడు. కాలానుగుణంగా మారడం ధర్మం స్వభావమనీ, అలా మారడాన్ని శాస్త్రం ఆమోదిస్తుందనీ, అలా మారకుండా కరడుగట్టి ఉండడం సంప్రదాయానికే నష్టం కలగజేస్తుందని అతడు వాదిస్తాడు. శూద్రులకు వేదాధ్యయనాధికారం, స్త్రీ విద్య, బాల్య వివాహాలు… అన్నింటినీ పునస్సమీక్షించాల్సిందేనని అంటాడు. సనాతన ధర్మాన్ని ఆధునిక హిందూ మతంలో భాగం చేయాలి, అందులోని మంచిని అందరికీ అందుబాటులోనికి తేవాలి, ధర్మ ప్రచారానికో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలి – ఇవీ తన ఆలోచనలు.
ఇలాంటి ఆలోచనలన్నీ ఆధునిక (క్రైస్తవ) విద్యల ప్రభావంనుంచి పుట్టినవే అని కొట్టిపారేస్తాడు తండ్రి. తండ్రి ఆలోచనలను ఛాందసంగా పరిగణిస్తాడు ఆయన పెద్ద కొడుకు.
***
“నాన్నగారిది అంతరించిపోతున్న సనాతన బ్రాహ్మణమతం. అందులో ఉన్నది ఏమాత్రం ప్రగతిశీలత లేని సంకుచితత్వం…[ఆయన] ప్రవాహానికి మోకాలడ్డుతున్న అంధుడు.” అని అనుకొనేవాడట రచయిత. రాను రాను, ఆయనే రైటు, తన అన్నయ్య వాదమే తప్పు అని తేల్చుకున్నాడు. “నాస్తికుడూ, విప్లవవాదీ అయినవాడు సంస్కరణవాదాన్ని కాదని సనాతనత్వాన్ని ఎలా ఆమోదించగలుగుతాడు?” అన్న ప్రశ్నకు సమాధానం రచయిత పెరిగిన తీరులో తనపై ప్రభావం చూపిన వివిధ భావజాలాలలో దొరుకుతుంది.
ఒకటో తరగతి తరువాత బడి మానేసి ఇంటిపట్టునే ఉంటూ సంస్కృతం చదువుకున్న రచయితపై తండ్రి ప్రభావం కన్నా, అన్నయ్య ప్రభావం కన్నా తన అమ్మగారి ప్రభావమే ఎక్కువ. సనాతనధర్మ భావజాలంలో స్త్రీలకు ప్రాధాన్యం ఉండదు. అందుచేత మతపరమైన కట్టుదిట్టాలనుంచి కొన్ని మినహాయింపులుంటాయి. ఆవిడ టీ తాగేది, రేడియో నాటకాలు వినేది, ఆవిడకు బ్రాహ్మణేతర స్త్రీలతో చక్కని స్నేహ సంబంధాలుండేవి. “తక్కువ” కులాల వాళ్ళు పూజించే ముత్యాలమ్మ లాంటి దేవతలకు మొక్కుకొనేది. ఫలితంగా, రచయితకు స్త్రీల పట్లా, దళితుల పట్లా సానుభూతి, సహానుభూతీ పెంపొందాయి. తను చెప్పిన పురాణ కథల ప్రభావంతో రచయిత ఊహలు రెక్కలు విప్పుకొనేవి.
అలాగని తన తండ్రి ప్రభావం తన పైన లేకపోలేదు. నిత్యానుష్ఠానం చేసేవాడు, పిలక పెట్టుకు తిరిగేవాడు. సన్న్యాసం స్వీకరించి, కంచి పరమాచార్యుల వలె పండితలోకాన్ని శాసించాలని కలలు కనేవాడు.
స్వగ్రామాన్ని వదిలి విద్యాప్రవీణ చదువు కోసం రాజమండ్రికి వెళ్ళడం ఆ తరువాత తిరుపతిలో శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో రిసెర్చి స్కాలర్‌గా చేరడం – రచయిత దృక్పథాన్ని పూర్తిగా మార్చేసాయి. “విషవృక్షం” చదవడం, గౌతమి గ్రంథాలయంలో కవి సమ్మేళనాల్లో పాల్గొనడం, మార్క్సిస్టులతో, స్త్రీవాదులతో స్నేహం చేయడం, దళిత కవులతో కలిసి కవిత్వం రాయడం, జిడ్డుకృష్ణమూర్తిని చదువుకునేందుకు ఇంగ్లీషు నేర్చుకోవడం… రచయిత మానసిక పరిణామంలో కొన్ని ముఖ్య ఘట్టాలు.
ఈ పుస్తకం రాసేనాటికి రచయిత ఆలోచనలు అస్తిత్వోద్యమాల వైపుకి ప్రవహిస్తున్నాయి. ఏకీకరణ (homogenization) పట్ల వ్యతిరేకతా, ప్రత్యేకతా వాదాల సమర్థనా తన ఆలోచనాధోరణిలో భాగాలు. స్త్రీలు, దళితులు, తెలంగాణా వాదులు, మాదిగలు, ముస్లిములు, మూలవాసులు – వేర్వేరు ప్రజా సమూహాలకు వేర్వేరు సమస్యలు, వేర్వేరు అజెండాలు, వేర్వేరు ఉద్యమాలు. ఎవరి దేవుళ్ళు వారికే, ఎవరి నమ్మకాలు వారివే.
ఈ దృక్పథం ప్రకారం, సనాతన బ్రాహ్మణులు వర్ణ ధర్మాన్ని నిక్కచ్చిగా పాటించడం, తమ శాస్త్రాలను, జ్ఞానాన్ని తక్కిన ప్రజలతో పంచుకోకుండా, వారి మానాన వారిని వదిలేయడం సరైనదనే అనిపించింది రచయితకి. అందుకు విరుద్ధంగా వర్ణాల, కులాల సరిహద్దుల్ని చెరిపేసి అందరికీ బ్రాహ్మణ సంస్కృతిని మప్పే హిందూ మతం/హిందూ వాదం ఈ రచయితకి ప్రమాదకరంగా ప్రచ్ఛన్న క్రైస్తవంలా తోస్తుంది.
దళితులు కులనిర్మూలన పేరుతో తమ సామూహిక అస్తిత్వాన్ని దాచేసి, తమది కాని సంస్కృతిని తలదాల్చి ఆత్మన్యూనతకు లోనవడం కన్నా కులాల వాస్తవాన్ని అంగీకరించి ఉద్యమించి తమ తమ కులాలను ఉన్నతీకరించుకోవాలని సూచిస్తారు. ఈ పుస్తకంలోని చర్చకు ఫలశ్రుతి ఇదే!
ఈ పుస్తకం ముద్రణకు సిద్ధమవుతున్న సమయంలో సరసింహశాస్త్రిగారు మరణించారు. తన తండ్రి ధర్మనిబద్ధతను గౌరవిస్తూ రచయిత వాళ్ళ పెదనాన్నగారబ్బాయితో తండ్రికి అంత్యక్రియలు జరిపించడంతో, ఆ పండితుడి ఇచ్ఛానుసారం ఆయన భార్య తన జుట్టు తీసేయించుకోవడానికి సిద్ధపడడంతో ఈ పుస్తకం ముగుస్తుంది.
***
జ్ఞాపకాలూ, ఆలోచనలూ ఒకదాన్నొకటొరుసుకుంటూ ప్రవహిస్తాయి ఈ కథలో. చదివాక ఆలోచించకుండా ఉండలేము. రచయిత పట్లా, తన కుటుంబం పట్ల సానుభూతి కలుగుతుంది. మొండిగా ఆధునిక జీవితానికెదురీదే సనాతన బ్రాహ్మణుల పట్ల grudgingగానైనా గౌరవ భావమే కలుగుతుంది. వాక్య నిర్మాణంలో సరళతా, స్పష్టతా కనబడతాయి, ఒకోసారి కవితాత్మకత కనబడుతుంది. సనాతన ధర్మ దృష్టికోణాన్ని వివరించేందుకు రచయిత కల్పించిన సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి.
అయితే ఈ పుస్తకంలోనిదంతా నేను ఒప్పుకోలేక పోయాను. హిందూ మతాన్ని ప్రచ్చన్న క్రైస్తవంతో పోలుస్తూ రాసిన అధ్యాయం లోతులేని వాదనలతో నిండిపోయింది. ఆ మొత్తం చర్చలో హిందూ మతానికీ, క్రైస్తవ మతానికీ, రచయిత తార్కికతకూ – దేనికీ న్యాయం జరగలేదు.
గురజాడలో, శ్రీశ్రీలో, చలంలో బ్రాహ్మణత్వాన్నే చూడడం వింతగా అనిపిస్తుంది. బ్రాహ్మణ స్త్రీల స్థితి పట్ల శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారి అభిప్రాయాలలోని తీవ్రతే చలం రచనల్లోకి ప్రవహించిందనే వాక్యాన్ని చదివి ఇంకా ఆశ్చర్యపోయాను. చలమే ఆ మాట వింటే భళ్ళున నవ్వుకునేవారేమో.
హిందూ వాదాన్ని పూర్వపక్షం చేసే తొందరలో హిందూ ధర్మాన్ని (మతం అనాలా?) నిరాకరించడం సరి కాదేమో అనిపించింది. మార్పులు చేర్పులు లేని శిలాసదృశమైన సనాతన ధర్మం కన్నా ప్రవాహశీలమైన హిందూ ధర్మమే నాకు నచ్చుతుంది. (నిజానికి సనాతన ధర్మం సైతం మార్పులకు లోనయ్యిందని ఈ పుస్తకంలోనే రాసారు రచయిత. సన్న్యాసాశ్రమం, శంకరాచార్య పీఠాల వ్యవస్థా బౌద్ధం ప్రభావంలోంచి వచ్చినవే అంటారు.)
విభిన్న ప్రజా సమూహాలకు విభిన్నమైన సమస్యలు, అవసరాలు ఉంటాయని ఒప్పుకుంటాను కానీ వీలున్నన్ని రకాలుగా మనల్ని మనం విభజించుకొని సంఘర్షిస్తూ ఉండడం అనర్థదాయకమైన పోటీ మనస్తత్వానికీ, మనస్తాపాలకీ, హింసకీ దారి తీస్తుందని నాకనిపిస్తుంది.
శతాబ్దాలుగా కరడుగట్టి ఉన్న కుల వ్యవస్థ ఆధునిక విద్య కారణంగా erode and corrode అయిపోతుందని, అలా జరగడమే మంచిదని విశ్వసించిన వారికి కులాలు ఇలాగే ఉండిపోవాలని రచయిత చేసే వాదం అసలు రుచించదు. కులంగాడి అంత్యక్రియలు చేసేసామనుకున్న తరువాత ఇన్నాళ్ళకి వాడు మళ్ళీ లేచొచ్చి “నేను చిరంజీవినోయ్” అనీ చిరునవ్వు నవ్వితే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. 🙂
****
పుస్తకం వివరాలు:
1) న్యూ సిలబస్ ప్రచురించిన ఈ పుస్తకాన్ని రాసిన వారు రాణి శివ శంకర శర్మ. అరుణ, సౌదాలు సంపాదకులు. విశాలాంధ్ర, నవోదయలలో ఈ పుస్తకాన్ని కొనుక్కోవచ్చును. 241 పేజీలున్న ఈ పుస్తకం ధర 240 రూపాయలు. ఆన్‌లైన్‌లో కొనే సదుపాయం లేదు.
2) ఈ పుస్తకాన్ని D.వెంకటరావు ఇంగ్లీషులోకి అనువదించారు. పర్మనెంట్ బ్లాక్ ప్రచురించిన ఈ అనువాదం ఓరియంట్ బ్లాక్‌స్వాన్ వారి వెబ్‌సైటులో లభిస్తుంది. వెల 350 రూపాయలు.
ఇదే పుస్తకానికి – ఆంగ్లానువాదం ఆధారంగా చేసిన – ఒక మంచి పరిచయాన్ని హిమాల్ మాగజైన్ వెబ్‌సైటులో చదవొచ్చు.
కనిష్ట
పూర్ణిమ గారికి
”పాఠకుడికి కలిగే అభిప్రాయాన్ని వ్యక్తీకరించినప్పుడు రూపొందే వ్యాసానికి, అదే పాఠకుడు అదే రచనపై సమీక్ష చేయబూనినప్పుడు వచ్చే వ్యాసానికి గల తేడాలెలాంటివి?” అనే అంశాలపై సరైన వివరణలతో కూడిన వ్యాసం కావాలని, నాకు ఆసక్తి ఉంటే రాయమని మీరు పెట్టిన కామెంట్ చూసాను.
మీరు రాయమన్నారు కదా అని నేను రాసేయొచ్చు అయితే నాకు తెలీని ఎన్నో ప్రక్రియలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు. ఏ పనైనా తెలిసీ తెలియకుండా చేయడం సంస్కారం కాదని భావించే వాడిని, అందుకే మీరనుకున్న వ్యాసాన్ని రాసే పూర్తి సమర్థత ఉన్న వ్యక్తిని మీకు నేను సూచిస్తున్నాను. ఆయన శ్రీ ఆర్వీ రామారావు. మీరనుకున్న వ్యాసం తాలూకు భావాలు ఆయన ఈ మధ్యే తెలుగు వెలుగు పుస్తకంలో రాసిన వ్యాసంలో ప్రతిఫలిస్తున్నాయి. మీరు ప్రచురిద్దామనుకుంటున్న అంశాన్ని మొహమాటాలకు తావులేకుండా అద్భుతంగా రాయగల నేర్పు, ఓర్పు ఉన్న పండితుడాయన. మీకు ఆసక్తి ఉంటే ఆయన్ని సంప్రదించండి. ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఆయన్ని సంప్రదించవచ్చు.
ఆయన తెలుగు వెలుగులో రాసిన కథనానికి సంబంధించిన లంకె ఇది.
http://crm.eenadu.net/teluguvelugu/magazine.html#/76
పుస్తకం.నెట్
This is to inform the readers that the long comments discussing the topic of this post might be under moderation more longer than usual. Right now, we’re pressed for time, because of personal and professional reasons and can’t act on the time-consuming comments straightaway. Please allow us some time for the same.
Your patience is highly appreciated.
Thanks.
కనిష్ట
శ్రీనివాస్ గారికి
మీభావనలపై నా భాష్యాలు…
>> “మీరు ప్రస్తావించిన ఆదర్శం క్రైస్తవ ప్రక్షిప్తం.” (నేనన్నది)
నా ప్రశ్నలో రెండు వ్యతిరేకాభిప్రాయాలను ప్రస్తావించాను: కులాలు ఉండడం రైటా, పోవడమా? ఈ రెండింటిలో
ఏది ఆదర్శవంతమైన స్థితి? అని అడిగాను. (మీరన్నది)
అయ్యా! తమరికి నేను విన్నవించుకుంటున్నది అదే.. మీరు మొదట్నుంచీ. నాకు కుల వ్యవస్థ లేకపోతేనే
నచ్చుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు, మళ్లీ ఏది ఆదర్శం అని ఏమీ తెలియనట్టు అడగడం ఏవిటో
నాకర్థం అవ్వడం లేదు.
పోనీ ఇది మీరచనా అంటే కాదు, మీరు రాసింది మీరచన గురించైతే గొడవ లేదు, అలాంటప్పుడు రచయిత
భావనల్ని రచయిత భావనలుగానే చెప్పండి. ఎవరి రచనకో మీరు సమీక్ష రాయడానికి ప్రయత్నించారు.
మొదట దాన్ని పరిచయం అన్నారు, తర్వాత అది పరిచయానికి ఎక్కువ సమీక్షకు తక్కువ అయినట్లుంది
అన్నారు. అంటే మీరేం రాద్దామనుకున్నారో, ఏం రాస్తున్నారో మీకు కచ్ఛితంగా తెలీయట్లేదు.
రచయిత ఇలా అన్నారని జ్ఞాపకం అనడం ఏమిటి. మీరు పుస్తకం సమీక్ష చేస్తున్నారంటే ( మీ దష్టిలో పై
పేరాలెండి), దానిపై పూర్తి అవగాహన ఉండాలి. అప్పుడే పుస్తక సమీక్ష చేయాలి.
ఏదో ఓసారి పుస్తకం చదివి నేనిలా భావించాను అంటే మీరు ఎంతవరకూ సమీక్షకు న్యాయం చేస్తున్నట్లు. అభం
శుభం తెలియని పాఠకులు మీ భావల కారణంగా ఓ నిర్ధారణకు వచ్చారంటే అది ఎవరి తప్పు. మీరలాంటి
పరిస్థితిలో ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఆదర్శమన్న మాటకు negative connotation లేదు. “ఏది మంచిది?” అనే అర్థంలోనే అడిగాను
నేను. “కులాలూ, కులధర్మాలూ ఉండాలి. అదే మంచిది” అని మీరంటే మీరు అది ఆదర్శమని
భావిస్తున్నారని అర్థం. అందుకు వ్యతిరేకంగా “కులాలూ, కుల ధర్మాలూ పోయి, ప్రతివాడూ పర ధర్మాన్ని
ఆశ్రయించడం ఆదర్శం” అనే ప్రతిపాదనను మీరు “క్రైస్తవ ప్రక్షిప్తం” అంటున్నారనుకుంటా. రాణి శివశంకర శర్మ
గారు ఇలాంటి భావాలను “ప్రచ్ఛన్న క్రైస్తవం” అన్నారని జ్ఞాపకం (పుస్తకం లేదిప్పుడు, నా దగ్గర).
మీ ఈ ఆదర్శం గురించి తెలియాలంటే మరోసారి పుస్తకం చదవండి, చదివి ఆలోచించండి. దయుంచి పుస్తకం
మీ దగ్గరే పెట్టుకోండి (కొంతకాలం పాటైనా) అప్పుడు మీకు రచయిత ఆదర్శం అని ఎక్కడన్నాడో, అంటే ఏంటో
తెలియడమే కాదు అన్నారనుకుంటా నుంచి అన్నారు అని రాయగల్గుతారు. అప్పుడు మాత్రమే మీరు రాసింది పరిచయం, చేసింది సమీక్ష అవుతాయి.
కులాల/వర్ణాల మధ్య సంఘర్షణా, సమన్వయాల కథ క్రైస్తవం కన్నా చాలా పాతదనే అనుకుంటాను. అయినా
కాకపోయినా ఆధునిక (“క్రైస్తవ” కాదు) విద్య ద్వారా,కనీసం ఓ 50-60 ఏళ్ళ సంస్కరణ/విప్లవ భావాల వల్లా
కలిగిన సమత్వ స్పృహ కూడా కులాలను నిరసించడానికి కారణమని నేను అనుకుంటున్నాను. మన సమాజం
ఆధునికీకరణం చెందుతూ వచ్చే కొద్దీ కులాల మధ్య సరిహద్దులు చెరిగిపోతూ వచ్చాయనీ, అది చాలా
మంచిదనీ అనుకుంటున్నాను.
ఆధునిక విద్య అంటే క్రైస్తవ బోధనా పద్ధతి (ఆంగ్ల విద్య/ ఆంగ్ల ప్రమేయం ఉన్న విద్య). భారత దేశానికి
సంబంధిచినంత వరకూ అది కాని ఆధునిక విద్య మరోటి చెప్పగలరేమో ప్రయత్నించండి. స్వతహాగా మనది
గురుకుల విద్య, భారత దేశంలో క్రైస్తవ విద్య ప్రవేశంతోనే అది క్షీణదశకు చేరింది. అదే మీరంటున్న ఆధునిక
విద్య.
మీరు చెప్పిన 50, 60 సంవత్సరాల సంస్కరణ విప్లవ భావాల వల్ల కలిగిన సమత్వ స్పృహ వల్ల కులాల
మధ్య హద్దులు చెరిగిపోతూ వచ్చాయని, అది చాలా మంచిదని మీరు భావించారన్నారు.
మీరన్నదే నిజమైతే మీరు తర్వాతి ప్రశ్నలో రచయిత మందకృష్ణ మాదిగ అస్తిత్వ ఉద్యమం ప్రస్తావించారని ఎందుకు రాశారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది. కులవ్యవస్థ హద్దులు చెరిగిపోవడం కాదు ఉన్న హద్దుల్ని రాజ్యాంగబద్ధంగా మరింత బలోపేతం చేయాలని మందకృష్ణ మాదిగ అస్తిత్వ ఉద్యమం చేస్తున్నారనే కదా.
మీఉద్యోగ ధర్మంలో మీకెదురౌలేదేమో, ఇప్పటికీ మనదేశంలో ఐఏఎస్ పరీక్షకైనా సరే కులం తప్పకుండా ప్రస్తావించాలి … మరలాంటప్పుడు కుల హద్దులు చెరిగినట్లా ” నేను దీనికి చెందిన వాడను, నేను దానికి చెందిన వాడను అని ప్రస్తావించుకుని, దాని ద్వారా ఉద్యోగం సంపాదించుకొని, తిరిగి అదే కుల వ్యవస్థ ఉండకూడదు సర్వసమానత్వం అని లబ్దిపొందిన కృతఘ్నులు అన్నట్లే ఉంది మీరు ప్రస్తావించిందంతా.
>> కేవలం ఓ కులం మరోకుల ధర్మాల్ని అవలంబించాలనే కోరికతో చేసే ఉద్యమాలే మీరన్న అస్తిత్వ వాద/
ప్రత్యేక వాద ఉద్యమాలు.(నేనన్నాను)
కాదేమో… ఏ వర్గం వాళ్ళు ఆ వర్గం వాళ్ళుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ తమ హక్కుల కోసం
పోరాడడం అస్తిత్వ ఉద్యమాల సారాంశమని నేను అర్థం చేసుకున్నాను. దీనికి ఉదాహరణగా రచయిత మంద
కృష్ణ మాదిగ పోరాటాలను ప్రస్తావించారు. (మీరన్నారు)
మందకృష్ణ మాదిగ ఉద్యమం ఎందుకు చేస్తున్నాడు. అతని ప్రసంగం ఎప్పుడైనా విన్నారా. మాలలు మా
రిజర్వేషన్లు సాంతం వాడేసుకోవడం వల్ల మేం(మాదిగలం) నష్టపోతున్నాం. అందుకే మాకులాన్ని ప్రత్యేకంగా
గుర్తించండి, మాకు ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించండి అని. మీరిక్కడ ప్రస్తుత ప్రభుత్వ రిజర్వేషన్ ప్రక్రియ
ప్రకారం భావించారు.
అయితే సనాతన ధర్మం, మాలలు మాదిగలు ఒక్కరేనని ఎక్కడా చెప్పలేదు. మీరది గమనించాలి. అందుకునే
ఇప్పటికీ మాదిగలు మాలల్ని, మాలల్ని మాదిగలు పెళ్లిళ్లు చేసుకోరు. అంటే మాదిగలు చేసే పోరాటం సనాతన
ధర్మం ప్రకారం న్యాయ పోరాటమే కదా! (తమది కాని కులం తమ కులధర్మాలని పాటించడం వల్ల తమకు
అన్యాయం జరుగుతోందనడం)
>> …మీరు తేల్చుకోలేదన్నది తప్పుచింకునే ధోరణి, మీరు చెప్తున్నది శుద్ధ అబధ్దం… (నేవక్యాణించాను)
శిలా సదృశమైన సనాతన ధర్మం కన్నా ప్రవాహ శీలమైన హిందూ ధర్మం నాకు నచ్చుతుందని నేను అన్నాను,
నిజమే. కానీ అక్కడే ఆగిపోయానని మీరు ఎలా అనుకున్నారు? . కుల వివక్ష పోవాలి అన్న కోరికలో రెండో
అభిప్రాయం లేదు. అయితే అది కులాల ఉనికిని నిరాకరించడం/దాన్ని వదిలేసుకోవడం వల్ల జరుగుతుందా
లేక కులాలను నిలుపుకొని పోరాడుతూ ఉండడం వల్ల జరుగుతుందా అన్నది నా ప్రశ్న. కులాలను
వదులుకోవడం రైటు అనుకుంటాను నేను. నా అభిప్రాయమే రైటు అని dogmaticగా వాదించను. నా
సంశయం అర్థమయిందనుకుంటాను. ( మీరన్నారు)
కులాలను వదులుకోవడం రైటు అని మీరనుకుంటున్నారంటున్నారు. మళ్లీ దాని గురించి వాదించను
అంటున్నారు. అంటే మీరోటనేసుకున్నారు దాని గురించి ఎవరితోనూ వాదించరు, తత్ఫలితంగా మీరనుకున్నదే
చేస్తానని చెప్పకనే చెప్పారు. అంటే మీభావాల్ని సమీక్షలో ప్రతిఫలించానని మీరే ఒప్పుకున్నట్లు. అంటే
మీరనుకున్నట్లు అది పరిచయం, సమీక్ష, రెండూకానిది… కూడా కాదు. సరిగ్గా చెప్పాలంటే మీ భావాల్ని చెప్పేందుకు మీకు నచ్చినట్లు మీరు రాసుకున్న “పెద్దబాల శిక్ష” అనడం సబబు.
>> అతని రచన అంత దీనంగా ఉందని మీరు భావించారు కాబట్టే మీకు అతనిపై సానుభూతి కలిగింది అని
తెలుస్తోంది. (నేనన్నా)
అయ్యో! మీరు అపార్థం చేసేసుకున్నారు. “రచన దీనంగా ఉందని” భావించలేదు నేను. ఇంకాస్త బాగా ఎడిట్
చేసి ఉంటే – ఈ పుస్తకం ఇంకా శక్తివంతంగా ఉండేది, నిజమే. కానీ, even in its current shape
రచయిత చెప్పింది చాలా బలంగా చెప్పారనీ, ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమని నా అభిప్రాయం.(మీరన్నారు)
అయ్యో! మీ ఈ వాక్యాలు చదివే ఎవ్వరికైనా అర్థమైపోతోంది. మీకు ఈ రచన నచ్చలేదూ అని. ఇంకా బాగా
ఎడిట్ చేసి ఉంటే అని అన్నారంటే, ప్రస్తుతం ఉన్నదాంట్లో లోపాలేడిశాయనర్థం( మీ ప్రకారం). లోపాలున్నాయంటేనే బలం లేదని అర్థం. అలాంటప్పుడు రచయిత చెప్పింది చాలా బలంగా ఉందని, ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమని మళ్లీ మీరు చెప్పడం ఏంటండీ. పత్రికల్లో రాయాల్సిందంతా రాసేసి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేశారు అన్నట్లుంది, మీరు చెప్పేదంతా.
మీరు నిర్థారించేసుకున్నారు ఇంకాస్త బాగా ఎడిట్ చేయాలని, అదికేవలం మీభావనే అయితే దాంట్లో నిజంగా లోపాలే లేకపోతే మీ అప్రహిత వాక్యనిర్మాణానికి ముగ్థుడైన ఏ పాఠకుడైనా కచ్చితంగా పుస్తకం చదవుతాడని చెప్పగలరా మీరు! నేనైతే చెప్తా కచ్ఛితంగా చదవడు అని. మీరంతోకొంతో రాసారు. ఎడిటింగ్ ఉందన్నారు… ఇంకెదుకులే చెప్మా అనుకుంటాడు పాఠకుడు.
సానుభూతి – రచయితా, ఆయన కుటుంబం పట్ల. సానుభూతి అంటే జాలి అనే అర్థం కాదు కదా. (మీరన్నారు)
ఏం, ఏం అయింది రచయిత కుటుంబానికి, ఏమీ అపకారం జరగలేదు కదా!, రచయిత రచనని చదివి
పాఠకులందరూ రచయిత మీద దాడి కాని చేశారా ఏం. తొందరగా చెప్పండి ఓ సారి ఆయన్ని కలిసి
పరామర్శించి నా ప్రగాఢ సానుభూతి తెలిపి వస్తాను ఓ పాఠకుడిగా. ఇదీ సానుభూతంటే…
>> సనాతన బ్రహ్మణుల పట్ల మీకు grudge ఎందుకు? అయినా grudgingగా గౌరవభావం
ఎలాకలుగుతుంది? (నేనన్నా)
నాకు grudge లేదండీ. “Grudging respect” అనే మాటను reluctant appreciation
అనే అర్థంలో వాడాను. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా వాళ్ల చిత్తశుద్ధిని చూస్తే
గౌరవభావమే కలుగుతుంది కదా. అది విపరీతమేమీ కాదనుకుంటాను. (మీరన్నారు)
నేనావిధంగా రాసానండీ అంటే ఎలాగండీ. మీరేవిధంగా రాసారో అదేవిధంగా పాఠకులు అర్థం చేసుకుంటారండి.
సాంప్రదాయవాదులు అనడానికి “orthodox” అని వాడడం మీ ప్రకారం మీకు సరిగానే ఉంటుందండి.
క్యాబేజీ అనడానికి క్యాబే..జీ అని అనేసి, నేనన్నది క్యాబేజీ ఏ అయితే నాకు గేప్ తీసుకోవడం అలావాటంటే
కుదురుతుందా అండి. అలాగే ”Grudging” ని ”respect” తో కలిపితే ఇలాగే ఉంటుందండి.
warm welcome అన్నది సరైందేనండి, కాకపోతే “తెలుగోళ్లు మీరు సల్లగుండాలండీ అంటారండీ/ అలాగే
అనాలండి ఇక్కడ”, అలాఅనడమే రైటండి వాళ్ల దృష్టిలో.
>> కవి రాసిన రచనలో కవితాత్మకత కనిపించడం విశేషణం అవుతుందని మీరెలా భావించారు? (అని నేనన్నా)
ఇందులో అభ్యంతరకరమైనదేమిటో? (మీ సందేహం)
అయ్యా రచయిత చేసేది రచన. రచన చేసిన రచయిత స్వతహాగా కవి అయితే అతని రచనలో సాధారణంగానే
కవితా ధోరణి కనిపిస్తుంది. రచయిత కవికాకపోయినా కవితాభావన కనిపిస్తే విశేషణం, మీరు మాత్రం రచయిత కవి అని తెలిసీ అదేదే గొప్పన్నట్లు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అందుకే నేను ”కవి రాసిన
రచనలో కవితాత్మకత కనిపించడం విశేషణం అవుతుందని మీరెలా భావించారు?” అని ప్రశ్నించా.
>> …రచయిత కల్పన ఏంటి? సనాతన ధర్మ దృష్టికోణాన్ని వివరించేందుకు రచయిత కల్పించిన సంభాషణ
ఏమిటి? మీకేతెలియాలి అదేంటో….
నేను ఈ పుస్తకాన్ని చదివింది తెలుగులో. శృంగేరి స్వామి వారి సంభాషణల ఆధారంగా ఈ సంభాషణలు
కల్పించాను నేను అని రచయితే రాసుకున్నారు. అలాంటి మాటలు రెండు మూడైనా చూసి ఉంటాను నేను.
పుస్తకం పక్కన లేదు కాబట్టి కోట్ చేయలేకపోతున్నాను.
పుస్తకం తెలుగులో నేనూ చదివాను. మీరన్నది నేనూ చూసాను. అయితే రచయిత శృంగేరి స్వామి వారి
సంభాషణల్ని, ఓ క్రైస్తవుడితో, రచయిత సోదరుడితో తన తండ్రి చేసిన సంభాషణల్ని వివరిస్తున్నానని చెబ్తాడు.
ఆ సంభాషణా క్రమాన్ని యథాతథంగా మీముందుంచేందుకు ప్రయత్నిస్తున్నాడంటాడు. అలాటంప్పుడు
రచయిత కొత్తగా అందులో కల్పించిందేముంది.
మీరు విదేశం వెళ్తున్నానని మీ తల్లికి చెప్పారు.
మీనాన్నగారు ఆ విషయం మీ సోదరికి రాసిన ఉత్తరంలో ఆవిడకి తెలియజేశారు.
అప్పుడు మీ నాన్నగారు మీ సోదరికి మీగురించి కల్పించి చెప్పారండీ అనడం సరైందవుతుందా!
>> చిన్న సవరణ మీరనాల్సింది పుస్తక సమీక్ష.
రాద్దామనుకున్నది పరిచయమే. పరిచయానికెక్కువా సమీక్షకు తక్కువా అయినట్లుంది. .
మీరు రాసేటప్పుడు తెలుగు భాష, సందార్భానుకనుగుణంగా ఆగ్లం వాడండి బాగుంది. అయితే మీరు
వాడుతున్నారు చూడండీ హాస్య బొమ్మలు (స్మైలీ సింబల్స్) మీకు బాగున్నట్టుంది. చదివే పాఠకుడికి మాత్రం
ఆనందం కల్గిచదు. అలా వాడాలని నియమం ఏమైనా ఉందేమో నాకు తెలియదు మరి. లేకపోతే కనక
వాడకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
>> నిత్యానుష్టానం చేసేవాడు ( అంటే రోజూ తనధర్మాన్ని సవ్యంగా ఆచరించేవాడు( బ్రాహ్మణుడు కనుక
అనుష్టానం)), అనుష్టానం చేసే ప్రతీ వ్యక్తీ శిఖాధారణ (పిలక పెట్టుకోవడం) చేస్తాడు.
నిజంగానే నాకు తెలియదు. అనుష్ఠానము అంటే సంధ్యా, ఇస్ఠదేవతారాధనా లాంటివనుకున్నాను నేను.
అందుకు శిఖ ఉండాలని నాకు తెలియదు.
తెలుసుకోండి మిత్రమా మీలాంటి రాతగాళ్లకు అది అత్యవసరం. మీ కవనం కదిలించేందుకు మీ జ్ఞానమే మీకింధనం.
>> మీరు మరోసారి పొరబడ్డారు ఈ సందర్భంలో… రాణీ నరశింహ శాస్త్రి సన్యాసాశ్రమానికి వ్యతిరేకి. (నేనన్నాను)
లేదు. ఈ విషయంలో తమ గురువు గారైన కొల్లూరి వారికన్నా రాణి శాస్త్రి గారు కొంచెం తక్కువ rigid. కంచి
పరమాచార్యులకూ, శృంగేరి జగద్గురువులకూ ఆయన ఎంతో విలువ ఇచ్చేవారు. రామకృష్ణ గారు “హిందూ”
సన్యాసిగా మారినందుకు నొచ్చుకున్నా, చిన్న కొడుకు తన సంప్రదాయంలో సన్యాసాన్ని స్వీకరించాలని
భావించినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించారు. (మీరన్నారు)
అయ్యా! రాణీ నరశింహ శాస్త్రి గారూ వానప్రస్తంతోనే జీవితాన్ని పరిపూర్ణం చేశారు. ఆయన సన్యాసాస్రమం
తీసుకోలేదు/ ఆభావనే ఆయనకు లేదు. అదే విషయాన్ని రచయిత వక్కాణించాడు. సన్యాసంలో హిందూ
సన్యాసం, సనాతన సన్యాసం అనేవి రెండు లేవు. ఉన్నదల్లా హిందూ సన్యాసమే ఆయన పెద్దకొడుకు అయ్యిందదే.
చిన్నకొడుకు సన్యాసాన్ని స్వీకరిస్తానని అనడం ఏమిటసలు/ తండ్రి మరణానంతరం యజ్క్షోపవీతం వేసుకుని
కర్మకాండలు చేసేందుకు ఆయన సిద్ధం కాలేదు, శాస్త్రి గారు తనకసలు కొడుకులే తల కొరివి పెట్టకూడదన్నారు. ఇద్దరు కొడుకులుండీ మానాన్నకి ఎంత ఖర్మొచ్చిందని రచయిత ఇదే రచనలో వాపోయాడు కదా…
మీరన్నవిధంగా పుస్తకంలో ఎక్కడ ఉంది… మీరెక్కడ చదివారాపుస్తకంలో.. “రచయిత సన్యాసాశ్రమం తీసుకోడానికి మొగ్గు చూపారని, దానికి ఆయన తండ్రి అంగీకరించారని”…
ఉష్ణం ఉష్ణేణ శీతలం అన్నట్టు, రెండు అసత్యాల్ని కలిపినంత మాత్రాన సత్యం ఎలా అవ్వదుకదా!
>> మీ సమీక్షలో ఇన్ని ప్రక్షిప్తాలు ఉండగా మీరు రచయిత భావనలపై వ్యాఖ్యానం చేయడం తప్పు అని
చెప్పేందుకు నేను వెనుకాడలేదు/ వెనుకాడను?
వెనుకాడక్కర్లేదు. కానీ నేను రాసిన దాంట్లో చాలా తప్పులున్నాయని నాకనిపించలేదు. ( మీవిశ్వాసం)
చూడండి.. మీకనిపించకపోతే పోయిందేంలేదు… మీరచన మీఇష్టం.. అయితే దానికి
పరిచయం అనో, సమీక్ష అనో పేరు మాత్రం పెట్టకుండా ఉండండి చాలు. లేదు అలాగే పెడతానంటారా… మీకు నేనే పెద్ద ఫాలోవర్ అవుతా…
>> సమీక్షచేసేటప్పుడు రచయిత భావాల్ని స్పష్టంగా చెప్పగలగాలి…
చివరి 5/6 పేరాల కన్నా ముందు నేను రాసిందంతా పుస్తకంలోని విషయాలనే కదా. (మీరన్నది)
పుస్తకంలోని విషయాల్ని మీ భావాల్తో రచించారు. విషయాల్ని విషయాల్లా తెలపండి. మీ భావనల్ని, రచనల్ని
ప్రత్యేకంగా చెప్పండి. దాంట్లో కలిపేయకండి. పూర్ణంబూర్లో పూర్ణం తీసేసి బూరి అన్నట్టుంటుంది.
>> “చివరగా – మీ అభిప్రాయాలను చదివి, తప్పు పట్టుకోలేదు గానీ మీరు ఇంతలా ఎందుకు స్పందించారో ఇంకా
అర్థం కాలేదు నాకు. ఇంకా బాగా రాయడం నేర్చుకోవాలి నేను.” (మీరన్నది)
అయ్యా తప్పులు పట్టుకోవాలి, తప్పులు ఒప్పుకోవాలి. అందుకే మనం ఇక్కడ రాస్తున్నది. ఆభావనే లేకపోతే
మనం ఇన్నిగంటలు కంపోజ్ చేయనవసరం లేదుకదా. సాధారణ పాఠకుడిలా చదువుకుంటూ నవ్వుకుంటూ
గడిపేయొచ్చు. ఇక నా స్పందన అంటారా పుస్తకం చదివిన పాఠకుడిగా రచయిత భావాల్ని గౌరవించాలని
భావించేవాడిని. ఆయా రచయితల భావనల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటే నా స్థాయిమేరకు అదికాదు అని
చెప్పేందుకు వెనుకాడని తత్వం ఉండడం వల్ల ”ఇంతలా స్పందిచాల్పి వస్తోంది”. చదవకుండా నేర్చుకోకుండా
ఉంటే తప్పులేదు, ఆ రచయిత గురించి తెలియదు కాబట్టీ గొడవలేదు. చదివీ అర్థం చేసుకోకపోగా అపార్థం
చేసుకుంటేనే గొడవ అందుకే కనిష్టుణ్నైనా చిన్నగా కాకుండా ఇలా దీర్ఘవాక్యాలు రాయాల్సొస్తోంది.
పదాల ఎంపికలో, వాక్యనిర్మాణాల్లో పొంతన కుదరకపోతే క్షమార్హుణ్ని. కొన్ని వాక్యాల్లో వ్యంగ్యం ప్రస్ఫుటంగా
కనిపిస్తుంది. కావాలనే రాసాను. నాకు తెలిసే చేశాను. మీ ప్రశ్నల్లో ధ్వనించడానికి బదులు కనిపిస్తున్న(స్మైలీ
సింబల్స్) వ్యంగాల వల్లే నేనా విధంగా రాయల్సొచ్చింది.
మీ కనిష్ట
Srinivas Vuruputuri
(Dear Moderators, you may reject this message if you find it too long and too argumentative)
కనిష్ట గారికి
మీ వ్యాఖ్యకి పూర్తిగా జవాబివ్వను, క్షమించండి. కొత్తగా చెప్పదగ్గది ఏమైనా ఉంటే తప్ప ఈ విషయం పై ఇది నా చివరి వ్యాఖ్య.
సంభాషణల కల్పన గురించీ, రచయిత సన్యాసాశ్రమం స్వీకరించాలనుకోవడం గురించీ నేను రాసిన ఒకట్రెండు వాక్యాల గురించి కొంత వివరణ ఇది. నిరాధారంగా, యథేచ్ఛగా రాయలేదు నేనని చెప్పుకునే ప్రయత్నం ఇదంతా. మీకు ఆసక్తి ఉంటేనే చదవండి.
సంభాషణలను కల్పించడం గురించి:
1. 18వ పేజీ: [ఆధునిక వస్తుసామగ్రి కొనడం పట్ల శాస్త్రి గారు పొరుగూరు నుంచి వచ్చిన ఒక బ్రాహ్మణుడితో జరిపిన సంభాషణను] “కొంచెం అటూఇటూగా మా నాన్నగారి తర్కం వచ్చే విధంగా ఆ సంభాషణలను కల్పిస్తున్నాను.” (ఇది ఎప్పుడో జరిగిన సంభాషణను గుర్తుకు తెచ్చుకొంటూ రాసారనుకుంటా)
2. 26వ పుట: [ధర్మవ్యాప్తికి సంబంధించి రచయిత అన్నయ్యకూ, తండ్రిగారికీ] “…ఉన్న అభిప్రాయభేదాలని వ్యక్తం చెయ్యడం కోసం ఈ క్రింది సంభాషణలను కల్పిస్తున్నాను. ఇందుకోసం శ్రీశృంగేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి అభిప్రాయాల పైనా. హిందూ మత తాత్వికాభిప్రాయాలపైనా ఆధారపడ్డాను.”
3. 52వ పుట: “సనాతన ధర్మానికి సంబంధించి మా నాన్న గారి అభిప్రాయాలను విశదం చేయడానికి సనాతన ధర్మం పట్ల ఆకర్షితుడైన క్రైస్తవుడితో మా నాన్నగారి సంభాషణలను కల్పిస్తున్నాను. యీ సంభాషణలకు కూడా ఆధారం శ్రీ శృంగేరీ జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతీ మహాస్వామి వారి అభిప్రాయాలే అని మనవి చేస్తున్నాను.”
4. 67వ పుట: [శంకర పీఠాలనే సనాతన ధర్మం కాదన్న శాస్త్రిగారి గురువైన] “శ్రీ కొల్లూరు సోమశెఖరశాస్త్రి గారితో అద్వైతి అయిన ఒక సనాతన పండితుడు చేసిన సంభాషణలను ఇక్కడ కల్పిస్తున్నాను.”
5. పాల్ బ్రంటన్-కంచి పరమాచార్యుల సంభాషణా [84వ పుట), శృంగేరి స్వామి వారి సంభాషణలు (85-87, 222-236 పుటల్లోనివి) ఉల్లేఖనాలు కనుక కల్పించడం అనే మాట వాడలేదు రచయిత.
రచయితా-సన్యాసాశ్రమం గురించి –
కంచి పరమాచార్యుల్లా సన్యాసం స్వీకరించి పీఠాధిపతి కావాలనుకున్న రచయిత కోరిక గురించి 142వ పుటలో వస్తుంది. మళ్ళీ 163వ పుటలో – దాదాపు అవే వాక్యాలతో. కానీ ఈ విషయాన్ని నా పరిచయం/సమీక్షలో ప్రస్తావించడం తప్పే. 163వ పుటలో ఈ విషయం మళ్ళీ రాసినప్పుడు, “అప్పుడు నా వయస్సు పదేళ్ళు దాటి ఉండొచ్చు” అన్నారు రచయిత. రచయిత బౌద్ధిక పరిణామంలో ఆ దశకి అంత ప్రాముఖ్యం ఉండదేమో… నేనా వాక్యాన్ని గమనించక పోవడం నా తప్పే.
ఐతే… ఇక్కడ ఇంకో రెండు విషయాలను చెప్పాలి:
1. రచయితకి సన్యాసి కావాలనే కోరిక యవ్వనకాలంలో కూడా కొంత కాలం పాటు ఉండింది. ఓ దశలో సన్యాసిగా ఉన్నారు కూడా. అంతకు మునుపు ఓ రెండు మార్లు సన్యాసం తిసుకోవడానికి విఫల ప్రయత్నం చేసారు కూడా. (162-164 పుటల్లోంచి)
2. రచయిత శంకర జయంతి నాడు పుట్టినందున తన జన్మకో ప్రత్యేకత వుందని, తానో బ్రాహ్మణ పీఠాధిపతిగానో, జగమెరిగిన బ్రాహ్మణుడిగానో, పండితుడిగానో కావడం కోసం అవతరించాడని నమ్మిన వారిలో ఆయన తండ్రిగారు కూడా ఉన్నారు (164వ పుట). పీఠాధిపతి కావాలన్న రచయిత (చిన్ననాటి) కోరికను విని వారి నాన్నగారు చాలా సంతోషించారట. (142వ పుట).
సన్యాసాల్లో రకాల గురించి ఆఖరున ఒక మాట:
“విదేశీయానం పట్ల ఆసక్తి చూపే హిందూమఠంలో కాక సనాతన శంకరామ్నాయ మఠ సంప్రదాయం ప్రకారం సన్యాసం స్వీకరించి ఉంటే పండిత హృదయం హర్షించేది అని రచయిత అన్నయ్యతో ఒక వేదపండితుడు (ఆంజనేయ ఘనాపాఠీ గారబ్బాయి) అన్నారట (32వ పుట)
ఈ వాద వివాదాల్లో బోలెడంత శక్తి వృథా చేసుకోవడం ఎందుకు? నేను విరమించుకుంటున్నాను. మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించగలరు.
మీ శ్రీనివాస్
కామేశ్వరరావు
నేనీ పుస్తకం చదవలేదు. కాబట్టి నా వ్యాఖ్య, జరుగుతున్న చర్చ విషయమయ్యే కాని పుస్తకం విషయమై కాదు. ఒక పుస్తక పరిచయం జరిగినప్పుడు, నేరుగా ఆ పుస్తకాన్ని గురించి కాక, పుస్తకంలో విషయాన్ని గురించి చర్చించడంలో తప్పు లేదు. దానికి పుస్తకాన్ని చదవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం, అందుకే నేనీ వ్యాఖ్య రాస్తున్నాను. ఇది ప్రధానంగా కనిష్టగారి వ్యాఖ్యకు ప్రతిస్పందనే అయినా, సమాజంచేత బ్రాహ్మణుడిగా ముద్రవేయబడ్డ ఒక వ్యక్తిగా, బ్రాహ్మణ అస్తిత్వాన్ని గూర్చి, కులాల గురించి నా ఆలోచనలను కూడా పంచుకుంటాను.
ముందుగా కనిష్టగారి వ్యాఖ్యలో నాకు కనిపించిన ఒక contradiction చెపుతాను. వారన్నారు:
“ఓ ధర్మాన్ని మరో ధర్మంతో పోల్చకూడదన్నది.. వర్ణాశ్రమ ధర్మం… అసలు పోలికే లేకపోతే బేధం ఎక్కడ్నించి వస్తుంది… బేధం లేకపోతే విబేధం ఎక్కడ్నుంచి ప్రారంభం అవుతుంది.”
అంతకుముందే, అదే పాయింట్లో, ఇలా కూడా అన్నారు:
“ఆదర్శం అనేది ఎవరి ధర్మాలని వారు వదిలేసి తమకన్నా అధికంగా ఉన్న వారి ధర్మాలనో, లేక తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ధర్మాలనో ఆచరించి( విభిన్నంగా) చూపడం.”
ఒక ధర్మాన్ని మరొక ధర్మంతో పోల్చకూడదన్నప్పుడు, అధికస్థాయి, తక్కువ స్థాయి ఎక్కడనుండి వచ్చాయి?
వర్ణాశ్రమ ధర్మం తాలూకు ఆశయం ఏదైనా, దాని స్వరూపంలో, ఆచరణలో, వర్ణాల మధ్య అంతరాలు, తరతమ భేదాలు వచ్చాయన్నది కాదనలేని నిజం. ఉదాహరణకు, బ్రాహ్మణ పురుషునికి శూద్ర స్త్రీతో కలిగిన సంతానం బ్రాహ్మణుడై, బ్రాహ్మణ స్త్రీకి శూద్రపురుషునితో కలిగిన సంతానం చండాలుడై, అతడు బ్రాహ్మణుడు, శూద్రుడు కాక వర్ణ బాహ్యుడెందుకయ్యాడు? ఇది స్వరూపంలోనే ఉన్న తారతమ్యానికి ఒక ఉదాహరణ. సరే ఆచరణలో వచ్చిన తారతమ్యాల గురించి వివరించాల్సిన అవసరమే లేదు.
వర్ణాశ్రమ ధర్మం, కులవ్యవస్థ – ఈ రెండూ కాలానుగుణంగా అనేక మార్పులు చెందాయన్నది స్పష్టం. దానికి చరిత్రలోనూ, మన పురాణేతిహాసాలలోనే అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. ఒక వర్ణం వాడు ఏ వృత్తిని స్వీకరించాలనే విషయంలో కాని, వాడు నిర్వర్తించాల్సిన విధులేమిటన్న విషయంలో కాని అనేక భేదాలు కనిపిస్తున్నాయి. కర్ణుడు పెరిగినది సూతకులం. అటువంటిది అంగరాజ్యానికి రాజు ఎలా అయ్యాడు? అది ధర్మ విరుద్ధమైతే ఆనాటి పెద్దలందరూ కనీసం తప్పని చెప్పకుండా మౌనం ఎలా వహించారు? అలాగే కర్ణుడు ద్రోణుని వద్ద కౌరవపాండవులతో సమంగా ధనుర్వేదాన్ని అభ్యసించాడు. అది వారి వర్ణ/కుల ధర్మం ప్రకారమే జరిగిందా? కుంతి కర్ణుడి దగ్గరకి వచ్చినప్పుడు అతడు అధ్యయనం చేస్తూండడం వినిపించిందని భారతంలో ఉంది. అధ్యయనం అంటే వేదాధ్యయనమే. మరి సూత కులానికి చెందినవానికి అదెలా సాధ్యమయ్యింది? అంచేత, ఒక వర్ణానికి/కులానికి చెందిన వారు ఏ వృత్తి చేబట్టాలి, ఏ విద్యలను అభ్యసించాలి అనే విషయంలో మహాభారత కాలానికే వైవిధ్యం కనిపిస్తుంది. అలాంటప్పుడు, ఈ కాలంలో, శూద్రుడు వేదం చదవడం వర్ణధర్మానికి విరుద్ధమని ఎలా చెప్పగలం?
అసలు వర్ణమనేది ఎలా నిర్దేశింపబడుతుందనే విషయాన్ని గురించే మహాభారత కాలానికి చాలా భిన్నమైన ఆలోచనలు వచ్చాయి. ధర్మరాజు నహుషునితో చాలా స్పష్టంగా చెపుతాడు, ప్రతివాడూ జన్మచేత శూద్రుడే. తగిన సంస్కారాన్ని పొంది, బ్రాహ్మణోచితమైన గుణమూ, జీవన విధానమూ కలిగినప్పుడే అతడు బ్రాహ్మణుడవుతాడని. మరి పుట్టుకే వర్ణాన్ని/కులాన్ని నిర్ణయిస్తుందని యీ కాలంలో ఎలా అనగలం? మాదిగ కులంలో పుట్టినంత మాత్రననే అతను వేదాన్ని అపస్వరంతో వల్లెవేస్తాడనీ, బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు సుస్వరంగా చదువుతాడని అనడం సమంజసం ఎలా అవుతుంది?
సనాతన ధర్మం మీద ఆధారపడ్డ వర్ణవ్యవస్థ అవస్థ ఇలా ఉంటే, వృత్తల ఆధారంగా రూపొందిన కులవ్యవస్థ కూడా కులవృత్తుల నాశనంతో యిప్పుడు తన స్వరూపాన్ని కోల్పోయింది. ఈ మార్పు సహజమా, అసహజమా, మంచిదా, చెడ్డదా అనే విషయాలు కొంతసేపు పక్కకి పెడితే, మార్పు జరిగిందన్నది మన కళ్ళముందున్న సత్యం. ఈ పరిస్థితిలో, యిప్పుడు ఈ కులవ్యవస్థ పరిస్థితి ఏమిటి, దాని అవసరమేమిటి అని ఆలోచించాలి కాని, పూర్వ వ్యవస్థను మాటిమాటికీ గుర్తుతెచ్చుకుని కూచుంటే ఒరిగే ప్రయోజనం ఏమిటి?
ఇక నా అస్తిత్వపు గోల. నా గోలా, నాలాంటి (ఆఖరిబ్రాహ్మణుడు పుస్తకరచయిత లాంటి) నామమాత్రపు బ్రాహ్మణుల గోలా ఇంచుమించుగా ఒకటే. కులవృత్తి అనేది, మా తండ్రిగారి వంశంలో తీసుకుంటే, మా తాతగారితో ఆగిపోయింది. మా అమ్మగారి వంశంలో బహుశా మా తాతగారి తాతగారితోనే ఆగిపోయిందనుకుంటాను. అలాగే ఆచారాలు కూడా. మా పితామహులు రోజుకొక సారి మాత్రమే సంధ్య వార్చేవారు. మరి వారి పూర్వీకులు ఎన్నిమార్లు చేసేవారో నాకు తెలీదు. మా నాన్నగారు పూర్తిగా మానేసారు. ఇక మా సంగతి మరి చెప్పనక్కరలేదు! వృత్తి ఆచారాలలో యిలా చాలావరకూ బ్రాహ్మణత్వాన్ని కోల్పోయినా, కేవలం పుట్టుకవల్ల ఆ లేబిల్ తగిలించుకోవలసి వచ్చింది. అంచేత నేను బ్రాహ్మణుడినా కానా? సరే అవునో కానో, దాని గురించి పట్టించుకోడమెందుకని ఊరుకుందామంటే, సమాజం అలా ఊరుకోనివ్వడం లేదే! మా అమ్మాయికి యీ కులాలగురించి ఎప్పుడూ వివరించ లేదు. శాకాహారులు, మాంసాహారులు తేడా ఒక్కటే తెలుసు తనకి. మొన్న స్కూలువాళ్ళు ఏదో ఫారమిచ్చి అందులో మీరు ఓసీలా, బీసీలా, మరేవో రెండు కేటగిరీలు ఇచ్చారు. అదేమిటో వివరించడానికి కులాలగురించి చెప్పాల్సి వచ్చింది. పూర్తిగా తనకి అర్థమవ్వ లేదన్నది స్పష్టం. ఇప్పటిదాకా తన క్లాస్మేట్సు ఏయే కులాలకు చెందినవారో తనకి తెలియదు. కొన్నాళ్ళు పోయాక ఏ ఎంట్రెన్సు పరీక్షలోనో తన కన్న తక్కువ మార్కులొచ్చిన తన స్నేహితులకి కాలేజీలో సీటొచ్చి తనకి రాకపోతే, దాన్ని తనెలా అర్థం చేసుకుంటుందో తెలియదు! అదొక్కటే సమస్య కాదు. తప్పో, ఒప్పో, ఒక రకమైన ఆధిపత్య ధోరణికి “బ్రాహ్మనిజం” అని పేరుపెట్టి మాటిమాటికీ ఆ పేరుని ఒక తిట్టుగా వాడినప్పుడల్లా, ఆ ధోరణికి సంబంధం లేని నేను “బ్రాహ్మణుడి”ని ఎందుకయ్యానో అర్థం కాక మనసు గందరగోళ పడుతూనే ఉంటుంది. పైగా, నా అభిరుచులూ, నేను రాసే రాతలను కూడా నా కులానికి అంటగట్టి, దానివెనక ఏదో కూట్ర దాగుందని ప్రచారం చేసినప్పుడు దానికి బాధపడాలో, కోపగించాలో, నవ్వుకోవాలో తెలియని పరిస్థితి. కొన్ని అభిరుచులు, ఆసక్తులు వంశానుగతంగా వచ్చి ఉండొచ్చు, సందేహం లేదు. సంస్కృతభాషపై గౌరవం కాని, ప్రాచీన కావ్యాలపై ఆసక్తికాని, భారతీయ తత్త్వశాస్త్రంపై అభిమానం కాని, మనిషిని ప్రకృతికి దగ్గరగా తీసుకువెళ్ళే ఆచారాలను పాటించాలనే కోర్కెకాని, వేదమంత్రాలను వినేటప్పుడు కలిగే ఆనందం కాని వీటన్నిటికీ నేను పుట్టిన కులంతోనో, పెరిగిన వాతావరణంతోనో సంబంధం ఉండవచ్చు. చిత్రమేమిటంటే, ఇప్పటి సమాజపరిస్థితుల కారణంగా (నా సొంత బలహీనతల కారణంగా కూడా) వీటికి నేను కోరుకున్నంతగా దగ్గర కాలేకపోతున్నాను. కాని, ఎంతోకొంత దగ్గరగా వెళ్ళడమే పెద్ద అపరాధంగా, ఆధిపత్య ధోరణిగా, వెనకబాటుతనంగా, కులగజ్జిగా చిత్రించబడుతోంది!
ఇప్పటి అస్తిత్వ ఉద్యమాలు మనుషులకు ఒక సామూహిక బలాన్ని యివ్వడానికి మాత్రమే అనేది నా అభిప్రాయం. అణచివేతపై తిరుగుబాటుగా ప్రారంభమైనవి సమాజంలో అధికారాన్ని సాధించే దిశగా సాగుతున్నాయని నేనకుంటున్నాను. మనిషికి సమాజంలో శక్తినిచ్చే వాటిల్లో సామూహికశక్తి ప్రధానమైనది. అంచేత ఎవరైతే ఒక బలమైన సమూహంగా ఏర్పడ గలుగుతారో వారు సమాజంలో అధికారాన్ని సంపాదించడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఇది అస్తిత్వోద్యమాలకే పరిమితమైన అంశం కాదు. ఎన్నికలలో కులప్రాబల్యాల వెనక ఉన్నది కూడా యిదే సూత్రం. ఇలాంటి సందర్భంలో, ఒకవైపు నామమాత్రంగా మిగిలిన బ్రాహ్మణ కుల అస్తిత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టాలా లేక నాలాంటి వారితో కలిసి నేనూ ఒక సామూహిక బలంగా ఎదిగే కృషి చెయ్యాలా అన్నది నా ముందున్న ప్రశ్న. నామమాత్రపు అస్తిత్వాన్ని నెత్తికెత్తించుకోడం సమంజసం కాదని ఒకవైపు బుద్ధి చెపుతుంది. అలా చేయకపోతే సమాజంలో నువ్వు బలహీనుడిగా మిగిలిపోతావని మనసు ప్రబోధిస్తోంది. ప్రస్తుతం మరో మార్గాన్ని ఆశ్రయించాను. ఆ అస్తిత్వాన్ని అట్టేపెట్టి, సమాజంలో బలాన్నిచ్చే మరొక సాధనాన్ని ఆశ్రయించాను. అదే డబ్బు!
p l k sastry
Sir
THe book last brahmin where can I ppurchase in Telugu.
కనిష్ట
శ్రీనివాస్ గారికి
మీ సందేహాలకు – నా సమాధానాలు
1. ”కులాలు ఉండడమా, లేక పోవడమా – ఏది ఆదర్శం? “కులాలు ఉండడమే రైటు ” అని అనుకుంటే, కులాలను కొనసాగిస్తూ కులవివక్షను నిర్మూలించగలుగుతామా? “కులాలు పోవడం రైటు” అనుకుంటే అస్తిత్వ/ప్రత్యేకతా వాద ఉద్యమాలు అందుకు దోహదపడతాయా?”
ఈ పుస్తకం చదివిన మీకు పుస్తక సారాంసం సరిగ్గా అవగతం అవ్వలేదని చెబుతున్నందుకు అన్యధా భావించకండి. మీరు ప్రస్తావించిన ఆదర్శం క్రైస్తవ ప్రక్షిప్తం. అసలు ఆదర్శ జీవనం అనేదే వర్ణాశ్రమంలో లేదు. ఆయా కులధర్మాలను వారు క్రమం తప్పకుండా పాటించడమే వర్ణాశ్రమ ధర్మం/ సనాతన ధర్మం. ఆదర్శం అనేది ఎవరి ధర్మాలని వారు వదిలేసి తమకన్నా అధికంగా ఉన్న వారి ధర్మాలనో, లేక తమకన్నా తక్కువ స్థాయిలో ఉన్న ధర్మాలనో ఆచరించి( విభిన్నంగా) చూపడం. సులభంగా చెప్పాలంటే ప్రస్తుతం టి.టి.డి లో హరిజనులకి వేదపారయణని భోదించడం. బ్రాహ్మణులు వ్యాపారాలు నిర్వహించడం, వైశ్యులు వ్యాపారాలు మాని ఉద్యోగాలు చేయడం, కాపులు, రెడ్లు అవధానాలు చేయడం…
ఇలా తమ తమ ధర్మాల్ని విసర్జించి పరధర్మాన్ని ఆశ్రయించడం. తాము చేస్తున్నది గొప్పదనే భావన కల్పించుకొని దానికో అందమైన పేరు పెట్టుకోవడం. ఇదే ” ఆదర్శం”.
ఇక కుల వివక్ష, మీరు చెప్పిన ఈ “ఆదర్శం” అనేదే దీనంతటకీ కారణం అంటాన్నేను. ఓ మాదిగ వేదం నేర్చుకుని అపస్వరంతో వేదం వల్లెవేస్తే సమాజానికది ఆదర్శం. ఎంతో కష్టపడి తనది కాని విద్య నేర్చుకున్నాడంటుంది సమాజం…
ఓ బ్రాహ్మణుడు తన ధర్మాన్ని విడనాడి యజ్ఞోపవీతం తీసి పక్కన పడేస్తే అదీ… ఆదర్శం, అతని కులపు మూర్ఖపు కట్టుబాట్లని విడనాడి ఆదర్శంగా జీవిస్తున్నాడని…
కాపు వ్యాపారి దగ్గర, వైశ్యుడు పని చేస్తుంటే అదీ ఆదర్శమే. ఎంతో కష్టమైన వ్యాపార రంగంలో కాపు ప్రతిభ చూపిస్తున్నాడని, వైశ్యుడు వ్యాపారం గోల లేకుండా నెలకి ఇన్ని వేలు సంపాదిస్తున్నాడని…
ఇదీ ప్రస్తుత సమాజంలో “ఆదర్శం” నకు “నిదర్శం”…
ఓ ధర్మాన్ని మరో ధర్మంతో పోల్చకూడదన్నది.. వర్ణాశ్రమ ధర్మం… “నిన్ను నువ్వు తెలుసుకో” అంటే అర్థం ఇదే… నువ్వు పుట్టినందుకు నీ కుల ధర్మాన్ని పాటించేందుకు శత విధాలా ప్రయత్నం చేయి అన్నది దానర్థం.
అసలు పోలికే లేకపోతే బేధం ఎక్కడ్నించి వస్తుంది… బేధం లేకపోతే విబేధం ఎక్కడ్నుంచి ప్రారంభం అవుతుంది. ఏ కులం ఆ కుల ధర్మాన్ని పాటిస్తే కుల వివక్ష ఉండదు. కేవలం ఓ కులం మరోకుల ధర్మాల్ని అవలంబించాలనే కోరికతో చేసే ఉద్యమాలే మీరన్న అస్తిత్వ వాద/ ప్రత్యేక వాద ఉద్యమాలు. తత్ఫలితంగా వచ్చినవే ఆదర్శ జీవనం, సమాజాన్ని ఉద్ధరించడం వగైరా వగైరా…
2.”ఏది ఆదర్శమో ఇంకా తేల్చుకోనిదే?”
దేని గురించైనా తెలుసుకోవాలని కుతూహలం కలిగిందంటే దానిని మనం పాటించాలనే కోరిక మనసులో ఏ మూలనో ఉందని అర్థం. మీరు తేల్చుకోలేదన్నది తప్పుచింకునే ధోరణి, మీరు చెప్తున్నది శుద్ధ అబధ్దం. అందుకు మీ ఈ వాక్యం నిదర్శనం ” హిందూ వాదాన్ని పూర్వపక్షం చేసే తొందరలో హిందూ ధర్మాన్ని (మతం అనాలా?) నిరాకరించడం సరి కాదేమో అనిపించింది. మార్పులు చేర్పులు లేని శిలాసదృశమైన సనాతన ధర్మం కన్నా ప్రవాహశీలమైన హిందూ ధర్మమే నాకు నచ్చుతుంది.” అంటే. మీకు ఏది నచ్చిందే మీరే చెప్పారు. మరి ”ఏది ఆదర్శమో ఇంకా తేల్చుకోనిదే?” అంటారేంటండీ… అలా అనడం మీధర్మం కాదుగదా… అలా అయితే నేను చెప్పడం సరికాదు.
3. “ఆయనిలా ఉంటే బాగుండేది” అని నేనన్నానా?
” జ్ఞాపకాలూ, ఆలోచనలూ ఒకదాన్నొకటొరుసుకుంటూ ప్రవహిస్తాయి ఈ కథలో. చదివాక ఆలోచించకుండా ఉండలేము. రచయిత పట్లా, తన కుటుంబం పట్ల సానుభూతి కలుగుతుంది. మొండిగా ఆధునిక జీవితానికెదురీదే సనాతన బ్రాహ్మణుల పట్ల grudgingగానైనా గౌరవ భావమే కలుగుతుంది. వాక్య నిర్మాణంలో సరళతా, స్పష్టతా కనబడతాయి, ఒకోసారి కవితాత్మకత కనబడుతుంది. సనాతన ధర్మ దృష్టికోణాన్ని వివరించేందుకు రచయిత కల్పించిన సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి.”
మీరెంతబాగా రాశారు ఇందులో. పదాల అమరికలో మీకు మీరేసాటనేలా ఉన్నాయి మీ వాక్యాలు. అయితే మీ ఆలోచనలన్నీ ఈ పదాలే అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి.
నాకు ఇలా ఉంటే నచ్చుతుంది అని అంటే… రెండర్థాలు వ్యక్తం చేసినట్లు.
1. అలా ఉండడం నాకు నచ్చలేదు అని
2. ఇలా ఉంటేనే నాకు నచ్చుతుంది అని
నేను చెప్పింది మీ మొదటి భావనని..
రచయితపట్ల మీకు సానుభూతి కలుగుతోందన్నారు, ఆయనపై సానుభూతెందుకు కలిగింది. అతని రచన అంత దీనంగా ఉందని మీరు భావించారు కాబట్టే మీకు అతనిపై సానుభూతి కలిగింది అని తెలుస్తోంది. అదే సమయంలో ”జీవితానికెదురీదే సనాతన బ్రాహ్మణుల పట్ల grudgingగానైనా గౌరవ భావమే కలుగుతోందన్నారు” . సనాతన బ్రహ్మణుల పట్ల మీకు grudge ఎందుకు? అయినా grudgingగా గౌరవభావం ఎలాకలుగుతుంది?
అంటే రచయిత తండ్రి జీవిత గమనం మీకు నచ్చలేదు, కాకపోతే ఏదో చేసాడ్లే ముసలాడు అనే మీ ఆదర్శానికనుకూలమైన స్టేట్మెంటోటి పడేశారంతే. ఈ విషయాన్ని తరువాతి వాక్యం స్పష్టం చేస్తోంది. ” వాక్య నిర్మాణంలో సరళతా, స్పష్టతా కనబడతాయి, ఒకోసారి కవితాత్మకత కనబడుతుంది. సనాతన ధర్మ దృష్టికోణాన్ని వివరించేందుకు రచయిత కల్పించిన సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి.”
రచయిత కవి అని మీరు స్పష్టం చేశారు. మరి కవి రాసిన రచనలో కవితాత్మకత కనిపించడం విశేషణం అవుతుందని మీరెలా భావించారు? ” సనాతన ధర్మ దృష్టికోణాన్ని వివరించేందుకు రచయిత కల్పించిన సంభాషణలు ఆసక్తికరంగా ఉంటాయి.” రచయిత సంభాషణ కల్పించలేదు ఇది కేవలం మీ కల్పన?
రచనలో తన తండ్రికి ఇతర వ్యక్తులకు జరిగిన సంభాషణల్నే రచయిత ప్రస్తావించాడు? దాన్ని ఆయనే చెప్పాడు, తన తండ్రి సనాతన ధర్మాన్ని ఎలా పాటించిందీ ఆయన చెప్పాడు, ఆయన ఏవిధంగా జీవించింది వివరించాడు. ఇవికాక రచయిత ఇంకే సంభాషణలు కల్పించాడని మీరు భావించారు?
ఈ పుస్తకం పేరే The Last Brahmin: Life and Reflections of a Modern-Day Sanskrit Pandit కదా మరలాంటప్పుడు రచయిత కల్పన ఏంటి? సనాతన ధర్మ దృష్టికోణాన్ని వివరించేందుకు రచయిత కల్పించిన సంభాషణ ఏమిటి? మీకేతెలియాలి అదేంటో….
4. రచయిత భావాలతో ఏకీభవించనప్పుడు ఆ మాట చెప్పడం పుస్తక పరిచయం పరిధిలోని విషయమే కదా?
రచయిత భావాలతో ఏకీభవించనప్పుడు ఆ విషయాన్ని వ్యక్తం చేయడం పుస్తక పరిచయం పరిధిలోని విషయమే కదా.. అన్నారు మీరు. ఇక్కడ చిన్న సవరణ మీరనాల్సింది పుస్తక సమీక్ష. పరిచయం అంటే ఇతను రచయిత… ఇది రాసాడు… వీలైతే చదవండి అని చెప్పివదిలేయడం. సమీక్ష దీనికి పూర్తి విరుద్ధం. మీరు చేద్దామని ప్రయత్నం చేసిందదే..
పుస్తక సమీక్ష అంటే రచనని ఆమూలాగ్రం చదివి… అందులో మనకి నచ్చిన/ నచ్చని అంశాల్ని మనదైన భావనతో చూసి దానిపై మన పాండిత్యం ప్రదర్శించడం (సమీక్షించడం). అయితే ఇది చేసేటప్పుడు ఆయా విషయాల్తో ఎందుకు విభేదిస్తున్నామో కచ్ఛితంగా చెప్పగలగాలి. మీరు చేసిన రచనలోని(సాపేక్ష సమీక్షలాంటిదనాలేమో) ఓ భాగం ఇది.
“అలాగని తన తండ్రి ప్రభావం తన పైన లేకపోలేదు. నిత్యానుష్ఠానం చేసేవాడు, పిలక పెట్టుకు తిరిగేవాడు. సన్న్యాసం స్వీకరించి, కంచి పరమాచార్యుల వలె పండితలోకాన్ని శాసించాలని కలలు కనేవాడు”.
నిత్యానుష్టానం చేసేవాడు ( అంటే రోజూ తనధర్మాన్ని సవ్యంగా ఆచరించేవాడు( బ్రాహ్మణుడు కనుక అనుష్టానం)), అనుష్టానం చేసే ప్రతీ వ్యక్తీ శిఖాధారణ (పిలక పెట్టుకోవడం) చేస్తాడు. మళ్లీ మీరు ప్రత్యేకంగా ఈ విషయాన్ని ప్రత్యేకంగా “పిలక పెట్టుకు తిరిగేవాడు” అని ప్రస్తావించారంటే మీకు బ్రహ్మణ వర్ణాశ్రమ ధర్మంపై గల అవగాహన తెలుస్తోంది.
తరువాతి వాక్యంలోనే మీరు రచయిత ” సన్న్యాసం స్వీకరించి, కంచి పరమాచార్యుల వలె పండితలోకాన్ని శాసించాలని కలలు కనేవాడు” అని రాశారు. ఇది రాసిన సందర్భం రచయిత తండ్రి ప్రభావం అతనిపై ఉందని చెప్పేందుకు..
మీరు మరోసారి పొరబడ్డారు ఈ సందర్భంలో… రాణీ నరశింహ శాస్త్రి సన్యాసాశ్రమానికి వ్యతిరేకి. అతని దృష్టిలో సన్యాశాస్రమం లేనేలేదు. వానప్రస్తంతో సరి. మరి మీరు రచయితపై అతని తండ్రి ప్రభావం ఉంది అని ఎలా చెప్పగలిగారు.. ఈ వాక్యం ద్వారా?
మీ సమీక్షలో ఇన్ని ప్రక్షిప్తాలు ఉండగా మీరు రచయిత భావనలపై వ్యాఖ్యానం చేయడం తప్పు అని చెప్పేందుకు నేను వెనుకాడలేదు/ వెనుకాడను?
చివరగా…
మీ రచనాక్రమం బాగుంది. అయితే సమీక్షచేసేటప్పుడు రచయిత భావాల్ని స్పష్టంగా చెప్పగలగాలి. అది ఓ సమీక్షకుడిగా మీరాచరించాల్సిన ధర్మం, మీభావాల్ని సమీక్షలో చెప్పడం సరైందే, అయితే మీ భావనే సమీక్ష కాకూడదు. పుస్తకాన్ని చదివించేలా మీ సమీక్ష ఉండాలి. మీ భావనల్ని అందులో ప్రతిబింబించడం ద్వారా పాఠకుడు ఆ పుస్తకం చదవాలనే ఆసక్తిని కోల్పోకూడదు.
ఈ నా అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా తెలియజేయడానికి కారణం సమీక్ష సమీక్షలా ఉండాలనే “కాంక్షే”
నా ఈ రాతలు అన్యధా భావిస్తే క్షంతవ్యుణ్ని.
మీ కనిష్ట
Purnima
“ఈ నా అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా తెలియజేయడానికి కారణం సమీక్ష సమీక్షలా ఉండాలనే “కాంక్షే”
పాఠకుడికి కలిగే అభిప్రాయాన్ని వ్యక్తీకరించినప్పుడు రూపొందే వ్యాసానికి, అదే పాఠకుడు అదే రచనపై సమీక్ష చేయబూనినప్పుడు వచ్చే వ్యాసానికి గల తేడాలెలాంటివి? – లాంటి విషయాల మీద ఓ సమగ్ర వ్యాసం ఎవరన్నా రాస్తారేమోనని చాన్నాళ్ళుగా ఎదురుచూస్తున్నాం. మీకుగానీ ఆసక్తి ఉంటే మాకు రాసి పంపగలరు.
వ్యాసంలోని విషయంతోనో, వ్యాసకర్తతోనో కేవలం విభేదిస్తూ వాదించటం కాకుండా, విభేదించటానికి గల కారణాలు వివరిస్తూ అభిప్రాయాలు పంచుకోవటం అరుదుగా అగుపడుతుంటుంది. Thanks for your comment here.
Srinivas Vuruputuri
కనిష్ట గారికి
చాలా ఓపిగ్గా మీ అభిప్రాయాలను చెప్పినందుకు మీకు నా కృతజ్ఞతలు.
>> “మీరు ప్రస్తావించిన ఆదర్శం క్రైస్తవ ప్రక్షిప్తం.”
నా ప్రశ్నలో రెండు వ్యతిరేకాభిప్రాయాలను ప్రస్తావించాను: కులాలు ఉండడం రైటా, పోవడమా? ఈ రెండింటిలో ఏది ఆదర్శవంతమైన స్థితి? అని అడిగాను.
ఆదర్శమన్న మాటకు negative connotation లేదు. “ఏది మంచిది?” అనే అర్థంలోనే అడిగాను నేను. “కులాలూ, కులధర్మాలూ ఉండాలి. అదే మంచిది” అని మీరంటే మీరు అది ఆదర్శమని భావిస్తున్నారని అర్థం. అందుకు వ్యతిరేకంగా “కులాలూ, కుల ధర్మాలూ పోయి, ప్రతివాడూ పర ధర్మాన్ని ఆశ్రయించడం ఆదర్శం” అనే ప్రతిపాదనను మీరు “క్రైస్తవ ప్రక్షిప్తం” అంటున్నారనుకుంటా. రాణి శివశంకర శర్మ గారు ఇలాంటి భావాలను “ప్రచ్ఛన్న క్రైస్తవం” అన్నారని జ్ఞాపకం (పుస్తకం లేదిప్పుడు, నా దగ్గర).
కులాల/వర్ణాల మధ్య సంఘర్షణా, సమన్వయాల కథ క్రైస్తవం కన్నా చాలా పాతదనే అనుకుంటాను. అయినా కాకపోయినా ఆధునిక (“క్రైస్తవ” కాదు) విద్య ద్వారా,కనీసం ఓ 50-60 ఏళ్ళ సంస్కరణ/విప్లవ భావాల వల్లా కలిగిన సమత్వ స్పృహ కూడా కులాలను నిరసించడానికి కారణమని నేను అనుకుంటున్నాను. మన సమాజం ఆధునికీకరణం చెందుతూ వచ్చే కొద్దీ కులాల మధ్య సరిహద్దులు చెరిగిపోతూ వచ్చాయనీ, అది చాలా మంచిదనీ అనుకుంటున్నాను.
>> కేవలం ఓ కులం మరోకుల ధర్మాల్ని అవలంబించాలనే కోరికతో చేసే ఉద్యమాలే మీరన్న అస్తిత్వ వాద/ ప్రత్యేక వాద ఉద్యమాలు.
కాదేమో… ఏ వర్గం వాళ్ళు ఆ వర్గం వాళ్ళుగా తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ తమ హక్కుల కోసం పోరాడడం అస్తిత్వ ఉద్యమాల సారాంశమని నేను అర్థం చేసుకున్నాను. దీనికి ఉదాహరణగా రచయిత మంద కృష్ణ మాదిగ పోరాటాలను ప్రస్తావించారు.
>> …మీరు తేల్చుకోలేదన్నది తప్పుచింకునే ధోరణి, మీరు చెప్తున్నది శుద్ధ అబధ్దం…
శిలా సదృశమైన సనాతన ధర్మం కన్నా ప్రవాహ శీలమైన హిందూ ధర్మం నాకు నచ్చుతుందని నేను అన్నాను, నిజమే. కానీ అక్కడే ఆగిపోయానని మీరు ఎలా అనుకున్నారు? :). కుల వివక్ష పోవాలి అన్న కోరికలో రెండో అభిప్రాయం లేదు. అయితే అది కులాల ఉనికిని నిరాకరించడం/దాన్ని వదిలేసుకోవడం వల్ల జరుగుతుందా లేక కులాలను నిలుపుకొని పోరాడుతూ ఉండడం వల్ల జరుగుతుందా అన్నది నా ప్రశ్న. కులాలను వదులుకోవడం రైటు అనుకుంటాను నేను. నా అభిప్రాయమే రైటు అని dogmaticగా వాదించను. నా సంశయం అర్థమయిందనుకుంటాను.
>> అతని రచన అంత దీనంగా ఉందని మీరు భావించారు కాబట్టే మీకు అతనిపై సానుభూతి కలిగింది అని తెలుస్తోంది.
అయ్యో! మీరు అపార్థం చేసేసుకున్నారు. “రచన దీనంగా ఉందని” భావించలేదు నేను. ఇంకాస్త బాగా ఎడిట్ చేసి ఉంటే – ఈ పుస్తకం ఇంకా శక్తివంతంగా ఉండేది, నిజమే. కానీ, even in its current shape రచయిత చెప్పింది చాలా బలంగా చెప్పారనీ, ఇది జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయమని నా అభిప్రాయం.
సానుభూతి – రచయితా, ఆయన కుటుంబం పట్ల. సానుభూతి అంటే జాలి అనే అర్థం కాదు కదా.
>> సనాతన బ్రహ్మణుల పట్ల మీకు grudge ఎందుకు? అయినా grudgingగా గౌరవభావం ఎలాకలుగుతుంది?
నాకు grudge లేదండీ. “Grudging respect” అనే మాటను reluctant appreciation అనే అర్థంలో వాడాను. ఎదుటి వాళ్ళ అభిప్రాయాలతో ఏకీభవించకపోయినా వాళ్ల చిత్తశుద్ధిని చూస్తే గౌరవభావమే కలుగుతుంది కదా. అది విపరీతమేమీ కాదనుకుంటాను.
>> కవి రాసిన రచనలో కవితాత్మకత కనిపించడం విశేషణం అవుతుందని మీరెలా భావించారు?
ఇందులో అభ్యంతరకరమైనదేమిటో?
>> …రచయిత కల్పన ఏంటి? సనాతన ధర్మ దృష్టికోణాన్ని వివరించేందుకు రచయిత కల్పించిన సంభాషణ ఏమిటి? మీకేతెలియాలి అదేంటో….
నేను ఈ పుస్తకాన్ని చదివింది తెలుగులో. శృంగేరి స్వామి వారి సంభాషణల ఆధారంగా ఈ సంభాషణలు కల్పించాను నేను అని రచయితే రాసుకున్నారు. అలాంటి మాటలు రెండు మూడైనా చూసి ఉంటాను నేను. పుస్తకం పక్కన లేదు కాబట్టి కోట్ చేయలేకపోతున్నాను.
>> చిన్న సవరణ మీరనాల్సింది పుస్తక సమీక్ష.
రాద్దామనుకున్నది పరిచయమే. పరిచయానికెక్కువా సమీక్షకు తక్కువా అయినట్లుంది. :).
>> నిత్యానుష్టానం చేసేవాడు ( అంటే రోజూ తనధర్మాన్ని సవ్యంగా ఆచరించేవాడు( బ్రాహ్మణుడు కనుక అనుష్టానం)), అనుష్టానం చేసే ప్రతీ వ్యక్తీ శిఖాధారణ (పిలక పెట్టుకోవడం) చేస్తాడు.
నిజంగానే నాకు తెలియదు. అనుష్ఠానము అంటే సంధ్యా, ఇస్ఠదేవతారాధనా లాంటివనుకున్నాను నేను. అందుకు శిఖ ఉండాలని నాకు తెలియదు.
>> మీరు మరోసారి పొరబడ్డారు ఈ సందర్భంలో… రాణీ నరశింహ శాస్త్రి సన్యాసాశ్రమానికి వ్యతిరేకి.
లేదు. ఈ విషయంలో తమ గురువు గారైన కొల్లూరి వారికన్నా రాణి శాస్త్రి గారు కొంచెం తక్కువ rigid. కంచి పరమాచార్యులకూ, శృంగేరి జగద్గురువులకూ ఆయన ఎంతో విలువ ఇచ్చేవారు. రామకృష్ణ గారు “హిందూ” సన్యాసిగా మారినందుకు నొచ్చుకున్నా, చిన్న కొడుకు తన సంప్రదాయంలో సన్యాసాన్ని స్వీకరించాలని భావించినప్పుడు ఆయన సానుకూలంగానే స్పందించారు.
>> మీ సమీక్షలో ఇన్ని ప్రక్షిప్తాలు ఉండగా మీరు రచయిత భావనలపై వ్యాఖ్యానం చేయడం తప్పు అని చెప్పేందుకు నేను వెనుకాడలేదు/ వెనుకాడను?
వెనుకాడక్కర్లేదు. కానీ నేను రాసిన దాంట్లో చాలా తప్పులున్నాయని నాకనిపించలేదు.
>> సమీక్షచేసేటప్పుడు రచయిత భావాల్ని స్పష్టంగా చెప్పగలగాలి…
చివరి 5/6 పేరాల కన్నా ముందు నేను రాసిందంతా పుస్తకంలోని విషయాలనే కదా.
చివరగా – మీ అభిప్రాయాలను చదివి, తప్పు పట్టుకోలేదు గానీ మీరు ఇంతలా ఎందుకు స్పందించారో ఇంకా అర్థం కాలేదు నాకు. 🙂 ఇంకా బాగా రాయడం నేర్చుకోవాలి నేను.
మీ శ్రీనివాస్
Srinivas Vuruputuri
@Pavan Santhosh Surampudi
వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకించే వాళ్ళు ‘బ్రాహ్మణులకు నిర్దేశించబడ్డ ధర్మాలు సులువు కాబట్టి’ వాటిని వ్యతిరేకిస్తారా ఏవిటి? 🙂
“కులం నశించాలి అనటం మాత్రం సులభం” కావచ్చునేమో కానీ అది నశించాలా వద్దా అని తేల్చుకోవడం కష్టంగా ఉంది నాకు. 🙂
pavan santhosh surampudi
వర్ణాశ్రమ ధర్మాలు పాటించడమే కాదు వాటి వల్ల వ్యక్తిలో కలిగే పరిణతి కూడా గమనించి చెప్పాలి అవి మంచివో కాదో.
అంటరానితనం మాత్రమే కాదు కులవ్యవస్థ అంటే మరెంతో వుంది మరి.
pavan santhosh surampudi
వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకించే వాళ్ళు ‘బ్రాహ్మణులకు నిర్దేశించబడ్డ ధర్మాలు సులువు కాబట్టి’ వాటిని వ్యతిరేకిస్తారా ఏవిటి?
చాలా మారులు అవేమిటో వాటి టార్గెట్ ఏమిటో తెలియక వ్యతిరేకిస్తూంటారు. భౌతికంగా తాము ఉన్నతంగా భావించే విషయాలు ఆయా ధర్మాల టార్గెట్ కాదు. ఎంత బుర్ర బద్దలుకొట్టుకున్నా “విద్యార్జన చేయగొరే బ్రాహ్మణులు మధూకర వృత్తి చేసి బతికి నేర్వాలి” వాటికి భౌతికమైన మోటివ్స్ అర్ధం కాదు. వంటి వాటి వెనుక మోటివ్స్ భౌతికమైనవి కాదు. సూక్ష్మమూ ఆధ్యాత్మికమూ ఐనవి. వ్యతిరేకించేవారు మాత్రం కళ్లుమూసుకుని వ్యతిరేకించేస్తారు. సులువని కాదు వ్యతిరేకించాలి కనుక వ్యతిరేకిస్తారు అంతే.
కనిష్ట
ఇలా జరగాలని కోరుకోవడం, జరిగితే జరిగిందని ఆనంద పడడం లేకపోతే పోన్లే మనకి రాసిపెట్టిలేదని బాధ పడడం సమాజ నైజం. గాంధీ గొప్పవాడు, నెహ్రూ గొప్పవాడు అని ప్రతీ తల్లిదండ్రులూ తమ బిడ్డలకు నూరిపోస్తారు. వారివారి రంగాల్లో ప్రతిభావంతులుగా వెలగడానికి కారణం వారి విలక్షణతే అని పదేపదే చెప్తారు. అదే తమ దగ్గరకో, తమ పిల్లలదగ్గరకో వచ్చేసరికి విలక్షణత కాస్తా విచక్షణగా మార్చుకోమంటారు. సమాజానికనుగుణంగా నడచుకోవాలి తప్ప, ఆదర్శాలకు పోతే మనిషి మసయిపోవడం తప్ప ఒరిగేదేమీలేదంటారు.
అంటే చదివేది ఒకటి, చేసేది మరోటి. నేర్చుకున్నది ఒకటి, పాటించేది మరోటి. కుల వివక్ష నిర్మూలించాలి, మనుషులందరూ సమానమే అని ఉపోద్ఘాతాలిచ్చే కుహానా మేథావులందరికీ తమ తమ స్థాయిల్నందుకోవడానికి ఆ కులమే సాధనమైందన్న విషయం స్పష్టంగా తెలుసు. కుల రాజకీయాలు, కుల పండగలు, కుల వివాహాలు, కులాంతర వివాహాలు మనజాతికాయువుపట్టు. బహిరంగంగా ప్రకటించకపోయినా ప్రతీ మనిషీ తనకు తానుగా కులకట్టుబాట్లను పాటిస్తూనే ఉంటాడు.
జాతీయ నాయకులనే వారినెవ్వరినైనా తీసుకోండి. గ్రామ వ్యవస్థతోనే భారతదేశ అభివద్ధి జరుగుతుందని విశ్వసించాడు గాంధీ, దీనజనోద్ధరణతోనే భారతావనికి స్వాతంత్ర్యం అని ప్రకటించాడు అంబేద్కర్, ఇలా ఎందరో…
పరిపూర్ణంగా ఆలోచించి చూడండి… గాంధీ ఆదర్శ ప్రాయుడే…అంబేద్కర్ అభినందనీయుడే. అయితే వారినిప్పటికీ ఆరాధించేదెవరో గమనించండి. ఆయా కులాల వాళ్లే… అగ్రవర్ణాలే గాంధీనభిమానిస్తాయి… అన్ని విధాలా అగ్రస్థాయిలో ఉండి ఇంకా అణగారిన కులాల జాబితాలో ఉన్న ప్రజలే అంబేద్కర్ని అభిమానిస్తారు.
మత ప్రసక్తి ఎక్కడా కనిపించదు. గాంధీ పాటించిన సర్వమత సమ్మేళనం, అంబేద్కర్ ఆరాధించిన బౌద్ధం రెండూ కాలక్రమంలో కొట్టుకుపోయాయి. కేవలం వారివారి కులాల కారణంగానే వారివారి పేరు ప్రఖ్యాతులు నిలబడుతున్నాయి.
ప్రతీ మనిషికి అందనిది రుచిగా అనిపిస్తుంది… దాన్నందుకునేందుకు పోరాటం చేయాలనిపిస్తుంది… తమకున్న కష్టాల్ని ఎదుటివారి సుఖాలతో పోల్చుకోవడం వల్లే ఇది జరుగుతుంది. అప్పుడే విభేదం ప్రారంభమౌతుంది. నీవెంతంటే నీవెంత అనేంతగా… ఆ పోట్లాటలో వారికండగా ఉండేది తామసహ్యించుకున్న తమకు నచ్చని తమ అస్తిత్వం(కులం) మాత్రమే… ఈవిషయం వారికీ తెలుసు. అయితే సమాజంలో ఏదో సాధించామని అనిపించుకోవాలి, అందుకే ఇదంతా…
తన కుల నియమాల్ని జీవితాంతం పాటించిన మహామనీషి రాణీ నరసింహ శాస్త్రి, వర్ణాశ్రమ ధర్మాన్ని అవలంబించడం వల్లే భారత దేశం ఇప్పటికీ ఈ స్థితిలో ఉందనేది నిష్టుర సత్యం. ఆయన అభిప్రాయం నాకు నచ్చలేదు, అలా ఉండడం సరికాదు, ఇలాఉంటే బాగుండునేమో… ఆదర్శ జీవితం గడపాలి, ఆదర్శ ప్రాయులుగా ఉండాలనేవన్నీ పోచుపోలు కబుర్లు. అలా అనేముందు ఒక్క నిమిషం ఆలోచించి చూడండి… ఆయన 82 ఏళ్ల జీవితంలో రోజూ ఆచరించిన దినచర్యని ఎవ్వరైనా కనీసం 82 రోజులు ఏకధాటిగా పాటించి చూడండి… అప్పుడు తెలుస్తుంది వర్ణాశ్రమ ధర్మాన్నాచరించడమంటే ఏమిటో..
అంతేకానీ ఆయనిలా ఉంటే బాగుండేది… రచయిత అలా అనకుండా ఉంటే బాగుండేది… మొదలైన సంభాషణలన్నీ వ్యర్థ ప్రయాసలే. ఓ కల్పనని వ్యాఖ్యానించడానికి జీవితాన్ని వ్యాఖ్యానించడానికి వైవిధ్యం ఉండాలి. ఆ వ్యక్తి నిష్టని గొప్పతనాన్ని స్వయంగా అర్థంచేసుకున్నప్పుడే అది సాధ్యం.
pavan santhosh surampudi
సత్యం సత్యం పునఃసత్యం. వర్ణాశ్రమ ధర్మాలను వ్యతిరేకించేవారు. ఒక్క పదిరోజులు బ్రాహ్మణులకు వర్ణాశ్రమ ధర్మాలుగా నిర్దేశించినవి ఆచరించి చూస్తే తెలుస్తుంది మజాకా. అదంత సులభం కాదు. నేను కులాన్ని ప్రస్తావించట్లేదు. ఎవరికైనా అంత సులభంకాదు. కులం నశించాలి అనటం మాత్రం సులభం.
Srinivas Vuruputuri
కనిష్ట గారికి
>>…అంటే చదివేది ఒకటి, చేసేది మరోటి. నేర్చుకున్నది ఒకటి, పాటించేది మరోటి. కుల వివక్ష నిర్మూలించాలి, >> మనుషులందరూ సమానమే అని ఉపోద్ఘాతాలిచ్చే కుహానా మేథావులందరికీ…
ఈ పుస్తకం చదివాక నన్ను తొలుస్తున్న ప్రశ్నలు – కులాలు ఉండడమా, లేక పోవడమా – ఏది ఆదర్శం? “కులాలు ఉండడమే రైటు ” అని అనుకుంటే, కులాలను కొనసాగిస్తూ కులవివక్షను నిర్మూలించగలుగుతామా? “కులాలు పోవడం రైటు” అనుకుంటే అస్తిత్వ/ప్రత్యేకతా వాద ఉద్యమాలు అందుకు దోహదపడతాయా?
>> ఆయన అభిప్రాయం నాకు నచ్చలేదు, అలా ఉండడం సరికాదు, ఇలాఉంటే బాగుండునేమో… ఆదర్శ జీవితం గడపాలి, ఆదర్శ ప్రాయులుగా ఉండాలనేవన్నీ పోచుపోలు కబుర్లు.
ఏది ఆదర్శమో ఇంకా తేల్చుకోనిదే… 🙂
>> అంతేకానీ ఆయనిలా ఉంటే బాగుండేది… రచయిత అలా అనకుండా ఉంటే బాగుండేది… మొదలైన సంభాషణలన్నీ వ్యర్థ ప్రయాసలే.
1. “ఆయనిలా ఉంటే బాగుండేది” అని నేనన్నానా?
2. రచయిత భావాలతో ఏకీభవించనప్పుడు ఆ మాట చెప్పడం పుస్తక పరిచయం పరిధిలోని విషయమే కదా.
>> ఆ వ్యక్తి నిష్టని గొప్పతనాన్ని స్వయంగా అర్థంచేసుకున్నప్పుడే అది సాధ్యం.
నిష్ఠనీ, పాండిత్యాన్నీ గౌరవించడం, భావజాలాన్ని ఆమోదించడం రెండూ వేర్వేరు విషయాలు కదా.
మీ
శ్రీనివాస్
రాణీ శివశంకరశర్మ – అమెరికనిజం | పుస్తకం
[…] […]
gksraja
శ్రీనివాస్ గారూ! మంచి పుస్తకం పరిచయం చేశారు. తొందర్లోనే కొని చదవాలినిపించేదిగా ఉంది మీ సమీక్ష, ఒకే కుటుంబం లోని మూడు విభిన్న మనస్తత్వాలు, సంస్కృతి లో ఏకత్వం, భిన్నత్వం — చాలా సంఘర్షణ తో కూడుకున్న విషయంగా అనిపిస్తోంది. ధన్యవాదాలు.
రాజా. gksraja.blogspot.com
Srinivas Vuruputuri
రవీంద్రనాథ్ గారికి
మీకీ పరిచయం నచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పినందుకు కృతజ్ఞతలు.
“వెర్రితనం”, స్వార్థం, ఆధిక్యాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం”… గురించి –
ఈ పుస్తకంలో సనాతన బ్రాహ్మణులకు ప్రతినిధులుగా నిలిచినవారు ఓ రకమైన “ప్రాచీన ప్రపంచానికి చెందిన” అంతర్ముఖత్వంలో ఉంటారు. లౌకికమైన లంపటాలకు దూరంగా ఉండడం వారికి ఆదర్శం. ధర్మశాస్త్రాలకు కాలానుగుణంగా భాష్యం చెప్పడం వారి ధర్మనిష్ఠకు విరుద్ధమైన విషయం. ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు కాదు, అలా పునర్వ్యాఖానించాల్సిన అవసరాన్ని వారు గుర్తించనందుకు…
అందుకే వారితో ఏకీభవించకపోయినా వారి పట్ల గౌరవ భావమే కలుగుతుంది.
శ్రీనివాస్
ముత్తేవి రవీంద్రనాథ్
శ్రీనివాస్ గారూ!
ఈ పుస్తకాన్ని మీరు పరిచయం చేసిన తీరు నాకెంతో నచ్చింది.
‘ధరతి లోకానితి ధర్మః’ (లోకాన్ని మోసేదే ధర్మం) అని భావించేవారు సైతం ధర్మం యొక్క పరమోద్దేశం మానవజాతి నశించిపోకుండా దానిని కాపాడడమేనని నమ్ముతారు.
మానవ శ్రేయస్సు, మానవజాతి మనుగడలే లక్ష్యంగా ధర్మం ఏర్పరచబడింది.ధర్మం దైవనిర్దేశితం కాదు.మానవ సమాజమే తన మనుగడకు, శ్రేయస్సుకు ఎప్పటికి ఏది అవసరమో దాన్ని ధర్మంగా నిర్దేశిస్తుంది. అందుకే ధర్మం దేశ కాలాలనుబట్టి ,ఆ యా సామాజిక అవసరాలనుబట్టి మారుతూ వచ్చింది.కాలం చెల్లిన ధర్మాన్ని పట్టుకు వేళ్ళాడేవాడు వెర్రివాడు.సనాతన బ్రాహ్మణులలోనే ఈ వెర్రితనం ఎక్కువగా కనుపిస్తుంది. ఇది కేవలం వెర్రితనమేననుకుంటే పొరపాటు. ఈ ‘ధర్మ పరిరక్షణ’ లో ఒక స్వార్థం కూడా ఇమిడి ఉంది. అది– సమాజంలో సౌకర్యవంతమైన తమ ఆధిక్యాన్నీ, పెత్తనాన్నీ యథాతథంగా శాశ్వతీకరించుకోవాలని ప్రయత్నించడం.
పుస్తకాన్ని చక్కగా పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.
— ముత్తేవి రవీంద్రనాథ్, తెనాలి (98491 31029)