“అనుభవాలూ-జ్ఞాపకాలూనూ” : ము.ర.యా. అభిప్రాయం

(శ్రీపాద వారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం గురించి మునిమాణిక్యం రఘురామ యాజ్ఞవల్కి గారి అభిప్రాయం ఇది. దీన్ని ఇక్కడ ప్రచురించడం వల్ల ఎవరికైనా కాపీరైట్ సమస్యలు ఉన్న పక్షంలో మమ్మల్ని editor@pustakam.net కి ఈమెయిల్ పంపడం ద్వారా సంప్రదించగలరు – పుస్తకం.నెట్)
*******************

నమస్కారాలు. మీ ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ చదివాను. చాలా శ్రద్ధాభక్తులతో చదివాను. దాదాపు ఒక బిగిని చదివి ఆ రాత్రి 2-30 గంటలకు నిద్రకుపక్రమించాను. చాలాసేపు పుస్తకాన్నిగురించే ఆలోచిస్తూ పడుకున్నాను. వెంటనే నిద్రపట్టింది నాకు. ఇంతకుముందు, చిన్నప్పుడే, తెనుగు కథాసాహిత్యంలో ఉత్తమ స్థానం అలంకరించిన మీ చిన్నకథలతో కొంత పరిచయం కలిగింది. అప్పటి అనుభూతి వేరు.

నేను ఆంగ్లంలో కొన్ని స్వీయచరిత్రలు, జీవిత చరిత్రలు చదివాను. స్వీయచరిత్రల పేరున ఇతరులు వ్రాసినవి కూడా చదివాను. వాటి అనుభూతి వేరు.

ఆరోజు ఉదయం నాన్నగారు మీ పుస్తకం యిచ్చి చదవమన్నారు. పగలంతా ఏదో పనిలో ఉన్నాను. సాయంకాలం మళ్ళీ అడిగారు – ‘మొదలుపెట్టావురా?’ అని. ఆ రాత్రి ఎనిమిదింటికే మొదలుపెట్టాను. పూర్తి అయ్యేదాకా నాకు నిద్రను గురించి కానీ, మరో విషయం గురించిన ఆలోచన కానీ రాలేదు. నెమ్మదిగా చదివాను. సామాన్యంగా స్వీయచరిత్రలు ఏకబిగిని చదవవలసిన అవసరం ఉండదు, కొన్ని నవలలలాగా. మరీ కొన్ని నవలలో, ఆత్మకథలలో కొన్ని పుటలు దాటేసి కూడా చదవవచ్చు ననిపిస్తుంది. సామాన్యంగా ‘ఏం చెప్పారు?’ అని కంటే ‘ఎట్లా చెప్పారు?’ అని చూస్తాం. మీరు చెప్పే విధానంతో పూర్వమే కొంత పరిచయం ఉన్నది. అది చాలా సరళమైనది. నూతనమైనది. మిక్కిలి ఇంపైనది కూడాను.

కాగా, దానికి తోడు చెప్పే విషయం కూడా నన్ను మరింత ఆకర్షించింది. నేను దాదాపు ఎరుగని విషయాలన్నీ చెప్పారు. నావంటి వాళ్ళకి తెలియని ఎన్నో పాత సంప్రదాయాలను ప్రసంగవశాన చెప్పుకుపోయారు. ఏ సంప్రదాయాలు క్రమంగా ఎలా పోయాయో చెప్పారు. నాకు బాధ కలిగింది. ఆ పేద విద్యార్థులను గురించి వ్రాసినదంతా దివ్యంగా ఉంది. మరొకరు అలా చెప్పలేరు. పుస్తకంలో ఎన్నో చిన్న కథలున్నాయి పైకి కనిపించకుండా. నీటిలో మెరుస్తూ అడుగుతున ఉన్న ముత్యాలలాగా కాస్త పరీక్షగా చూస్తే తెలుస్తుంది. వాటినన్నిటినీ అతినేర్పుగా ప్రధాన కథకి బంధించారు. కావడానికి వారంతా మీకు బంధువులే అనుకోండి. కాని పాఠకుడు ‘ఏదో బంధువుల ప్రశంస చేస్తున్నారులే’ అని యెక్కడా అనుకోకుండా చేస్తూ, చివరకు వారంతా మాకూ బంధువులుగా కనిపించేలాగున రచన చేశారు. మరిచిపోతున్న ఎన్నో మంచి విషయాలను మాకందరికీ జ్ఞాపకం చేశారు. కొన్ని చోట్ల చక్కని విమర్శ కనిపించింది. నేటి విద్యార్థులు మీ రచన చదివి నాటి విద్యార్థుల వినయసంపదలో కొంత భాగమైనా సంపాదించగలిగితే – వాళ్ళ సంగతి అలా ఉంచండి – ప్రస్తూ పాఠశాలల్లో, కళాశాలల్లో పని చేసే – కొన్ని చోట్ల (పాఠాలు చెప్పే) పంతుళ్ళు ఎంతో అదృష్టవంతులౌతారు.

అసలు ‘మంత్రాలంటూ ఉన్నయ్యా?’ అనేదాకా వచ్చిందీ పాఠకలోకం. పత్రికలలో దానిపై ఉత్తరప్రత్యుత్తరాలు…’రాచపుండు నయమైందీ అని వీళ్ళకి తెలియదో, కాక తెలిసి కూడా ప్రక్కవాళ్ళకి తెలియనీయకూడదనో – కొన్ని అధ్యాయాలు వెనక్కువెళ్ళి మళ్ళీ చదువుకుంటూ వెళ్ళాను. విసుగు పుట్టలేదు. పూర్తి అయ్యాక మళ్ళా ఒకసారి చదువుదామనిపించింది. వచన రచనలో మరలా చదువుదామనిపించేవి చాలా కొద్ది. వాటిలో మీది మొట్టమొదటిది. అందుకు, మీకు, నా హృదయపూర్వక నమశ్శతాలు. మిక్కిలి వినయంగా నమస్కరిస్తున్నాను.

ము ర యా
(మునిమాణిక్యం రఘురామ యాజ్ఞవల్కి)

You Might Also Like

One Comment

  1. Madhu

    In fact I was advised to read this book today morning. I found this review, which is nice coincidence. I wanted to read this to improve my Telugu language skills. Thanks

Leave a Reply